Friday, August 2, 2013

ఉన్నత విద్యాసంస్థల్లో కులవివక్ష By నయనాల సతీష్ కుమార్

విద్య జ్ణానాన్ని పెంపొందించేదిగా, సామాజిక రాజకీయ ఆర్థిక అసమానతలను రూపుమాపి ఒక నూతన సమాజం వైపు నడిపించేదిగా ఉండాలి. అసమానతలను, అన్యాయాన్ని, అప్రజాస్వామికతను ప్రశ్నించడం నేర్పాలి. నిచ్చెనమెట్ల కుల వ్యవస్థను పునరుత్పత్తి చేస్తున్న సమాజంలో పుట్టుక ద్వారా సంక్రమించే కులాన్ని అంతమొందించడంలో ప్రధాన పాత్ర పోషించాలి. ప్రపంచీకరణతో నానాటికి పెరుగుతున్న అసమానతలను రూపుమాపడంలో, ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయడంలో విద్య అవసరం, ప్రాధాన్యం మరీ ఎక్కువవుతుంది.
కానీ ఇప్పుడు ఈ విద్యా వ్యవస్థలో ప్రశ్నించే చైతన్యమే నేరమైంది.కేంద్రీయ అత్యున్నత విద్యా సంస్థల్లో, విద్యార్థులు కేవలం పుస్తకాలకే పరిమితం చేసేవిధంగా చేస్తున్నా రు. విద్యార్థులు చైతన్యంతో హక్కులు అడగడం, వాటిని సాధించుకోవడానికి కొట్లాడటం, సమాజంలో జరుగుతున్న అవినీతి అక్రమాలను ప్రశ్నించడమే పెద్ద నేరంగా పరిగణించబడుతున్నది. అగ్రకుల బ్రాహ్మణీయ సామ్రాజ్యవాద దళారీ పాలక వర్గాల ఆధిపత్యాన్ని కాపాడడమే లక్ష్యంగా ఉన్నత విద్యా సంస్థల్లో విధానాలు రూపొందించ బడుతున్నాయి. ప్రశ్నించే విద్యార్థులను నిర్మూలించాలని ప్రధాని మన్మోహన్‌సింగ్ చేసిన వ్యాఖ్యలు ఈ సందర్భంలో ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

అసమానతలను, అన్యాయాన్ని ప్రతిఘటిస్తూ ప్ర జాస్వామ్య విలువల కోసం పోరాడుతున్న విద్యార్థు ల నిర్మూలనే లక్ష్యంగా ఇప్లూలో విద్యార్థులపై తీవ్ర నిర్బం ధం ప్రయోగిస్తున్నారు. బ్రాహ్మణీయ శిష్ట వర్గ సంస్కృతికి నిలయమైన సీఫెల్, ఆతర్వాత ఇప్లూగా మారిన క్రమంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రజాస్వామిక విలువలను ప్రశ్నించే తత్వాన్ని పెంచింది.

తెలంగాణ ఉద్యమం విద్యార్థుల్లో సామాజిక బాధ్యతను, చైతన్యాన్ని తట్టిలేపి ప్రశ్నించే గుణాన్ని పోరాటాన్ని నింపింది. ప్రజల, విద్యార్థుల ప్రజాస్వామ్య హక్కులకై పొరాడడంలో ఇఫ్లూ విద్యార్థులు తమవంతు పాత్ర నిర్వర్తిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో భాగమై అగ్రకుల హిందుత్వ శక్తులు ప్రజా ఉద్యమంలోకి అధిపత్య సంస్కృతిని జొప్పిస్తే దాన్ని వ్యతిరేకిస్తూ బీఫ్ ఫేస్టివల్ మొదలుకొని అనేక జాతీయ,అంతర్జాతీయ పోరాటాలకు సంఘీభావం ప్రకటిస్తూ పోరాటాల్లో అంతర్భాగమైనారు. అంతేగాక సంస్థలోని అక్రమాలను, అవినీతిని, విద్యార్థులు ఎదుర్కొంటున్న కుల వివక్షను, అధికార దుర్వినియోగాన్ని ఎదిరిస్తూ పోరాటాలూ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ప్రోక్టార్ అధికార వివక్షకు గురై బలవన్మరణం పాలైన కశ్మీర్ విద్యార్థికి న్యాయం జరగాలని రొడ్లెక్కినారు. సంస్థ పాలకవర్గం అగ్రకుల అధికారికి కొమ్ముకాస్తూ హంతకున్ని కాపాడింది. ఆ నెల రోజులు విద్యార్థులు సంస్థని దిగ్బంధించారు. హంతక ప్రోక్టారుకు కొమ్ముకాస్తున్న వీసీ, రిజివూస్టార్, తాబేదార్లందరినీ విద్యార్థుల సమక్షంలో వారి నిజ స్వరూపాన్ని బట్టబయలు చేశారు. విద్యార్థుల పోరాటాన్ని అణచివేయడానికి అక్రమ కేసులు, బెదిరింపులు, పదవుల ఆశచూపెట్టడం లాటివెన్నో చేశారు.కానీ విద్యార్థులు లొంగలేదు. ఈ నిర్బంధకాండ మొత్తంగా బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ విద్యార్థులపైనే ప్రయోగించారు.కేసులు పెట్టబడిన తొమ్మిది మందిలో ఎనిమిది మంది తెలంగాణ ప్రాంతం వాల్లే!
ఇప్పుడు ఇఫ్లూ పాలక వర్గం కొత్త నిర్భంధకాండకు తెర లేపింది. ఈ బ్రాహ్మణీయ పాలక వర్గ ప్రయోజనాలకు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ విద్యార్థుల ప్రవేశమే కారణమని, వారిని రాకుండా నిర్మూలించే ప్రక్రియకు తెర తీసింది. మొదటగా విద్యార్థులను చీల్చడానికి కుట్ర పన్నారు. విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఉండాల్సిన జ్ఞాన సంబంధాన్ని అధికార సంబంధంగా మార్చారు.

ముఖ్యంగా టీఏ(టీచర్స్ అసోసియేషన్) సమావేశాలు పెట్టి, మనమంతా ఒకటే అని విద్యార్థులకు లొంగొద్దనీ, విద్యార్థుల ఉపాధ్యాయుల సంబంధా న్ని చెడగొట్టారు. కొంతమంది దళిత ప్రజాస్వామికవాదులు ఆ బ్రాహ్మణీయ అగ్రకుల కుట్రకు అడ్డుపడ్డప్పటికీ బ్రాహ్మణిజానిదే పైచేయి అయింది. కులాలవారిగా ఉపాధ్యాయులు విద్యార్థులకు కౌన్సెలింగులు, రకరకాల నిర్బంధం ప్రయోగించి విద్యార్థుల్ని చీల్చి చిచ్చురేపారు. ఇదంతా ఒకెత్తయితే, ఈసారి జరిగిన పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షకు సంబంధించిన ఫలితాల్లో ఒకటి అర తప్ప మొత్తంగా తెలంగాణ ప్రాంత ప్రాతినిధ్యం సున్నా. పరిశోధన విభాగాల్లో తెలంగాణ విద్యార్థులు ఎక్కువగా వస్తున్నారు కాబట్టి పరిశోధన విభాగాల్లో సీట్లు తగ్గించారు. తద్వారా తెలంగాణ విద్యార్థులు రాకుండా మొదటి కుట్ర పన్నారు. తర్వాత రాత పరీక్ష రాసిన వారిలో చాలా మందిని కావాలని తప్పించి వచ్చే కొద్ది మందిని సైతం ఆపడంతో కుట్రను విజయవంతంగా అమలు చేయగలిగారు. ఈ కుట్రలో తెలంగాణ కార్డు వాడుకొని వచ్చిన వీసీ, అదే కార్డును వాడుకుంటున్న అగ్రకుల ఉపాధ్యాయులున్నారు.

అంతేగాక ఎస్సీ,ఎస్టీ, బీసీ,మైనారిటీ వర్గాల ప్రతినిధులుగా చెలామణి అవుతూ పాఠాలు బోధించకుండా కేవలం పాలనా పదవులు అనుభవిస్తున్న సీమాంధ్ర అగ్రకుల ఉపాధ్యాయులు ఈ కుట్ర పథక రచనలో పాలుపంచుకొని తెలంగాణకు ద్రోహం చేశారు. స్వప్రయోజనాలే ధ్యేయంగా వాటిని నెరవేర్చుకోవడానికి బ్రాహ్మణీయ అగ్రకుల పాలకవర్గానికి తొత్తులుగా కొంతమంది విద్యార్థులు మారడం విషాదం. పరిశోధనలకు కాలపరిమితి అంశంగా కుదించి వేస్తూ విద్యార్థులపై నిఘా వేస్తూ వేధిస్తున్నారు. విద్యార్థుల కనీస భాగస్వామ్యం లేకుండా నిబంధనలను అతిక్షికమించి హాస్టళ్లల్లో ప్రత్యేకంగా అమ్మాయిల కోసం కొత్త కొత్త నియమాలు చేస్తూ విద్యార్థులు భయకంపితులను చేస్తూ హిట్లర్ పాలనను మరిపిస్తున్నారు.
ఇంతేగాక ఇక్కడ అన్ని ప్రాథమిక హక్కులు ముఖ్యంగా వాక్ స్వాతంత్య్ర హక్కు కాలరాయబడుతున్నది. కనీసం పోస్టర్లు అంటించే స్వాతంత్య్రం లేకుండాపోయింది. విద్యార్థుల హక్కులే కాకుండా బోధన, బోధనేతర సిబ్బంది కూడా ఈ నిర్బంధం ఎదుర్కోవాల్సి వస్తున్నది. వీళ్ళెవరూ మీడియాతో మాట్లాడకుండా ఆంక్షలు విధిస్తూ సర్క్యులర్లు జారీ చేయబడ్డాయి.

బ్రాహ్మణీయ భూస్వామ్య విలువలు నిండుగా కల్గిన సంస్థ పాలకవర్గాలతో ప్రజాస్వామిక లౌకిక విలువల కోసం పోరాడుతున్న విద్యార్థులను అనేక రకాలుగా కష్టాల పాలు చేస్తున్నది. వారికి రావల్సిన పారితోషికాలను ఆపేస్తూ ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటూ కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారు. ఇదే సమయంలో కొంతమంది విద్యార్థులకు పదవుల ఆశ చూపి స్తూ, ఫెల్లొషిప్‌లు ఇస్తూ విభజించు-పాలించు అనే బ్రాహ్మణీయ నీతిని అమలు చేస్తూ విద్యార్థులను విభజిస్తున్నారు. బాధ్యాతాయుతమైన పదవిలో ఉన్న వీసీ రాజ్యాంగ వ్యతిరేకశక్తిగా తయారై అగ్రకులాలకు, హంతకులకు, లాండ్ మాఫియాకు,దళిత బహుజన వ్యతిరేకులకు కొమ్ముకాస్తూ ప్రజాస్వామ్య విలువలను పాతరేస్తున్నారు. ఈ బహుముఖ దాడి ప్రధానంగా తెలంగాణ ఎస్సీ,ఎస్టీ,బీసీ, ఓబీ సీ, మైనారిటీలపై జరుగుతున్నప్పటికీ, ఇది వీరికే పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా ఉన్న ఈ సెక్షన్‌ల విద్యార్థులను అణచివేస్తూ విద్యకు దూరం చేసే ఒక నూతన ప్రక్రియకు తెరలేసింది.

ఈ కుట్ర ఒక్క ఇఫ్లూలోనే కాదు, ఢిల్లీ యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లాంటి అనేక కేంద్రీయ ఉన్నత విద్యా సంస్థల్లో కూడా ఇదే విధంగానే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను బయటికి పంపించి విద్యకు దూరం చేయాలనే బ్రాహ్మణీయ మనువాద కుట్ర అమలవుతున్నది. ఢిల్లీ యూనివర్సిటీలోనైతే దేశంలోని నిమ్న, బడుగు వర్గాల విద్యార్థులను పూర్తిగా విద్యకు దూరం చేసే ప్రక్రియ- ఎఫ్‌వైయూపీల రూపంలో చదువు ఖరీదు పెంచుతూ అమెరికా సామ్రాజ్యవాదుల కనుసన్నల్లో నాలుగు సంవత్సరాల డిగ్రీ కోర్స్‌ను అమలులోకి తీసుకురావడం ద్వారా జరిగింది. దేశవ్యాప్తంగా ఎంతో మంది మేధావులు, ఉపాధ్యాయులు విద్యార్థులు వ్యతిరేకిస్తున్నా సామ్రాజ్యవాదుల నిర్ణయాలను అమలు పరుస్తున్నారు. హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్సిటీ ఏమీ తక్కువ తినలేదు. మొన్న జరిగిన ప్రవేశాలలోఓబీసీ రిజర్వేషన్ అమలు చేయకుండా ఆ సీట్లను జనరల్ అంటే ఓసీకి మార్చి రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా వ్యవహరించారు.

విద్యార్థుల్లో జ్ఞానాన్ని నింపాల్సిన విద్యా సంస్థలు వివిధ రకాలుగా నిర్బంధాన్ని ప్రయోగిస్తూ, విద్యకు దూరం చేసే విధానాలకు పాల్పడుతూ కుల వివక్షకు జీవం పోస్తున్నాయి. ఈ నిర్బంధ విధానాలకు వ్యతిరేకంగా పోరాడకుంటే మళ్ళీ మధ్యయుగాల చీకటి పాలన చూడవలిసి రావచ్చేమో!
-
ఇఫ్లూ పరిశోధన విద్యార్థి 

Namasete Telangana Telugu News Paper Dated : 3/08/2013

No comments:

Post a Comment