Friday, August 2, 2013

ఇక బహుజన తెలంగాణ!? By కదిరి కృష్ణ


కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ మీటింగ్, సిడబ్ల్యుసి సమావే శం, యుపిఎ భాగస్వామ్య పక్షాల ఏకగ్రీ వ తీర్మానం, డిగ్గీ రాజా ప్రకటన తదితర పరిణామాలు చకచకా జరిగిపోవడంతో తెలంగాణ ప్రాంతంలో సంబర వాతావరణం నెలకొన్నది. గత 60 సంవ త్సరాల తెలంగాణ ప్రజల కల నెరవేర డానికి అనుకూల పరిస్థితులు సంభవిం చడంతో ప్రజలు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. తెలంగాణలోని వివిధ యూనివర్శిటీల్లో, వివిధ పార్టీల్లో పండుగ సందడి కనిపించింది. 2013 జూలై 30 నాటి ఢిల్లీ పరిణామాలతో, ఇప్పటిదాకా లాఠీదెబ్బలు, వాటర్ కెనాన్, టియర్ గ్యాస్ ప్రయోగాలు, రబ్బరు బుల్లెట్లకు తల్లడిల్లిన తెలంగాణ కనుల కొలనులలో ఆనంద భాష్పాలు మెరిశాయి. వేలాదిమంది తన బిడ్డల ఆత్మ బలిదానాలు తలచుకొన్న తెలంగాణ తల్లి ఎద ఉద్వేగంతో ఉప్పొంగింది. సుమారు 1600 మంది విద్యార్థుల బలిదానాలకు కారణమైన కాంగ్రెస్ పార్టీ- ఈ ప్రకటనతో తన ముద్ర తుడిచివేసుకొని కొంత పాపప్రక్షాళన చేసుకొన్నదని చెప్పవచ్చు. దాటవేత, సాచివేత, నాన్చుడు ధోరణులతో ఇన్నాళ్లూ కాలం గడిపిన కాంగ్రెస్ ఎట్టకేలకు తెలంగాణ పట్ల తన సానుకూల స్వంత అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. పది జిల్లాలతో కూడిన పూర్వ తెలంగాణకు ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తి కల్పించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపింది. యుపిఎ భాగస్వామ్య పక్షాలతోనూ 'మమ' అనిపించడం విశేషం. వేగంగా జరిగిన ఈ పరిణామాలన్నీ రాజకీయ ప్రహసనంలో భాగమే. ఇక చట్టపరమైన ప్రహసనం మిగిలి ఉంది. ఆ తంతూ పూర్తయితే కానీ తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ జరిగినట్టుకాదు. ఈలోపు జరుగవలసిన రాజ్యాంగబద్ధ వ్యవహారం చాలా కీలకమైనది. అంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్ ప్రకటించినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభలో తీర్మానం, రాష్ట్రపతి ఆమోదంతో న్యాయశాఖ బిల్లుకు రూపకల్పన చేయడం, తిరిగి శాసనసభ అభిప్రాయాన్ని కోరడం, రాష్ట్రపతితో పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు సిఫారస్సు చేయించడం వగైరా సోపానాలు ప్రధానమైనవి.
2001లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఆశయంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఒక ఉద్యమ సంస్థగా ఆవిర్భవించింది. అప్పటికే 1969 ఉద్యమాన్ని, దాని దుష్ఫలితాలను అనుభవించిన వారు, తెలంగాణ డిమాండును అడపాదడపా నినదిస్తున్న కొన్ని సంస్థలు, వ్యక్తులు టిఆర్ఎస్‌కు బేషరతుగా మద్దతు ప్రకటించడంతో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. మారోజు వీరన్న, ప్రొ॥ జయశంకర్, కేశవరావ్ జాదవ్, కొండా లక్ష్మణ్ బాపూజీ వంటి మేధావుల పాత్ర 2001 పూర్వపు తెలంగాణ ఉద్యమంలో కీర్తించదగినది. 1969లో ఉద్యమాన్ని నీరు గార్చిన తరువాత కూడా, నివురుగప్పిన నిప్పులా జై తెలంగాణ నినాదం ప్రజల హృదయాల్లో నిలుపడంలో వీరు విశేషంగా కృషి చేశారు. ఈ క్రమంలో 'ఒక ఓటు- రెండు ర్రాష్టాలు' నినాదాన్ని వినిపించిన బిజెపి 2004 వరకు ఆ దిశగా ఎలాంటి చర్య తీసుకోలేదు. ఈ దిరిమిలా 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ- తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు హామీతో నాటిఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీతో అలయెన్స్ కుదుర్చుకుంది. 2004 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ కేంద్ర ర్రాష్టాల్లో అధికారాన్ని చేజిక్కించుకుంది. టిఆర్ఎస్ పార్టీ అటు కేంద్రంలో, ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్యపక్షంగా చేరి మంత్రి పదవులను స్వీకరించింది. ఇది కొంతకాలం సుఖప్రదంగానే జరిగింది. కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల ఎలాంటి చిత్తశుద్ధిని కనబర్చకపోవడంతో టిఆర్ఎస్ మీద తెలంగాణ ప్రజలు వ్యతిరేకత కనబరచడమే కాక, తీవ్ర నిరసనలు ప్రదర్శించారు. ప్రజల అసంతృప్తిని గమనించిన టిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు 2009 నవంబరు 29న ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. ఈ దీక్ష విరమించేందుకు ప్రయత్నించగా, ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థి సంఘాలనుండి పెద్దయెత్తున నిరసనలు వచ్చిన క్రమంలో- కేసీఆర్ దీక్ష కొనసాగించక తప్పలేదు. ఈ పరిణామాలతో తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమం యుద్ధరంగాన్ని తలపించింది. బంద్‌లు, రాస్తారోకోలు, వంటావార్పులు ఒకవైపు- పోలీసు నిర్బంధాలు, అక్రమ కేసులు, దౌర్జన్యాలు, జైళ్లు మరొకవైపు!
ఈ సందర్భంలోనే హైదరాబాద్ శివారులోని ఎల్బీనగర్ చౌరస్తాలో శ్రీకాంతాచారి ఆత్మహత్య కు పాల్పడడంతో ఉద్యమం శిఖరస్థాయికి చేరుకుంది. డిసెంబర్ 9న నాటి హోంమంత్రి చిదంబరం 'తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం అయింది' అంటూ ప్రకటించేవరకు పట్టు వదలలేదు. వాస్తవానికి ఇక్కడే మరో కథ మొదలయింది. సమైక్యాంధ్ర నినాదంతో డిసెంబర్ 9 కేంద్ర ప్రకటనను నిరసిస్తూ ఆ ప్రాంతంలోని అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు మూకుమ్మడి రాజీనామాలకు పాల్పడ్డారు. విద్యార్థుల ఉద్యమాలకు పునాదులు పడ్డాయి. ఆంధ్ర పెట్టుబడి దారులు కేంద్రప్రభుత్వాన్ని- చిదంబరం ప్రకటనను ఉపసంహరించుకుంటూ డిసెంబర్ 23న మరో ప్రకటన చేసేటట్టు ప్రభావితం చేశారు. దీంతో తెలంగాణ మళ్లీ అగ్నిగుండమయింది. డిసెంబర్ 23 నాటి ప్రకటనతో యువత, విద్యార్థులు నిరాశ నిస్పృహలకు లోనయ్యారు. ఈ దఫా మరింత ఎక్కువ సంఖ్యలో ఆత్మహత్యలు జరిగాయి. ఆత్మబలిదానాలు వందల సంఖ్యను దాటడం తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఈ దశలో శ్రీకృష్ణ కమిటి నియామకం, నివేదిక సమర్పణ ఈ మొత్తం తతంగంతో కొంత కాలయాపన చేయగలిగినా తెలంగాణ ప్రాంతానికి నిరాశనే మిగిల్చింది. తెలంగాణ ప్రాంతమంతా నిప్పుల కుంపటిగా మారిపోయింది. ఆత్మహత్యలు మితిమీరి పోతున్నా కాంగ్రెస్ స్పందన శూన్యం. ఈ క్రమంలో వివిధ సంఘాల జెఎసిలు ఏర్పడి, మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మె, సాగరహారం, ఛలో అసెంబ్లీ వంటి కార్యక్రమాలు ఉధృతంగా సాగాయి. తెలంగాణ ధూంధాంల పేరుతో ప్రజలు ఉద్యమానికి బ్రహ్మరథం పట్టారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఊపిరి సలుపని రీతిలో తెలంగాణ రాష్ట్ర సమితి, పొలిటికల్ జెఏసి, వివిధ ప్రజా సంఘాలు, కుల సంఘాలు మరీ ముఖ్యంగా విద్యార్థులు వీరంగాన్ని సృష్టించారు. ఉద్యమం ప్రారంభం నుండి, ప్రధానంగా 2009 నుండి టిఎన్‌జిఒలు, యూనివర్శిటీ విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు- టిఆర్ఎస్‌తో సమానంగా ఉద్యమాన్ని నడిపించడంలో కృతకృత్యులయ్యారు. ఇప్పటి వరకు తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 1600 పైచిలుకే. ఇందులో 90 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల వాళ్లే. టిఎన్‌జీవో సంఘాన్ని, విద్యార్థి, ఇతర జెఏసీలను (లాయర్లు, డాక్టర్ల జెఎసి వగైరా) తమ భుజస్కంధాలపై వేసుకొని లాఠీదెబ్బలు, తుపాకీ తూటాల గాయాలుఎదుర్కొని పోరాటాన్ని నడిపించిన వీరులూ ఈ బహుజన కులాల వారే కావడం గమనార్హం. కానీ ఉద్యమ ఫలితాలు అనుభవించిన వారిలో ఈ కులాలేవీ లేకపోవడం శోచనీయం. తెలంగాణ ఉద్యమ ఫలితాలు ఇప్పటి వరకు అనుభవించింది టిఆర్ఎస్- వెలమలు, దాని అనుబంధ సంఘాల అగ్రకులాలు. వెలమ కులాల నుండి ఎక్కువ మొత్తంలో అసెంబ్లీకి ఎన్నిక కాగా, ఇతర అగ్రకులాలూ ఈ ప్రయోజనాన్ని కొద్దో గొప్పో పొందాయి. అమరవీరుల కుటుంబాలు, కేసుల పాలైన విద్యార్థులు ఎంతమాత్రం లబ్ధి పొందలేదు సరికదా, అక్రమకేసుల బనాయింపు వారిని ఆర్థికంగా మరింత చితికిపోయేలా చేసింది. కింది కులాల ఆర్థిక, రాజకీయ పరిస్థితులు ఎదుగుబొదుగు లేని విధంగా ఉండిపోయాయి.

ఎట్టకేలకు ప్రత్యేక తెలంగాణ ర్రాష్టాన్ని అంగీకరిస్తూ తీర్మానించిన ఈ సందర్భంలో ఎన్నో త్యాగాలు చేసిన ఉద్యమకార్యకర్తలు మరీ ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలు అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది. 1947లో స్వాతంత్య్రం సిద్ధించిన సమయంలో ఏమరుపాటుగా ఉన్న కారణంగానే వెనుకబడిన కులాలు (బిసిలు) 65 సంవత్సరాలుగా రాజకీయ బానిసత్వాన్ని అనుభవిస్తున్నాయి. తెల్లదొరల నుండి భారత అగ్రకులాల చేతుల్లోకి అధికార బదలాయింపు జరిగిన పిదప బిసిలు ఎక్కువ అణచివేతకు, వివక్షకు గురికావాల్సి వచ్చింది. హైదరాబాద్ సంస్థానాన్ని ఇండియన్ యూనియన్‌లో విలీనం చేసే సందర్భంలో కూడా ఈ వర్గాల సంక్షేమం ప్రస్తావనకు రాకపోవడం చరిత్రలో జరిగిన తప్పిదం. బిసిలు ఒకవైపు అణచివేతకు, సామాజిక వివక్షకు గురవుతూనే ఎలాంటి రిజర్వేషన్లు పొందలేక, అధికార భాగస్వామ్యం అందుకోలేక అణగారినవర్గాలుగా మిగిలిపోయారు. అయితే ఇందులో కొంత స్వయంకృతాపరాధం లేకపోలేదు. అగ్రకులాలను గుడ్డిగా నమ్మడమే ఇన్ని వైపరిత్యాలకు కారణంగా భావించవచ్చు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంలోనూ ఇదే జరుగుతుందా? అనే సందేహం చాలా మందికి వస్తోంది. రెండు ర్రాష్టాలు కలిసినప్పుడు లేదా విడిపోయినప్పుడు ఆ ర్రాష్టాలు, ఆ ప్రాంతాల మధ్య జరిగే ఒప్పందాలు, ప్రత్యేక రాయితీలు, ప్రత్యేక చట్టాలకు రాజ్యాంగబద్ధత లేకపోయి నా రాజ్యాంగ గౌరవం దక్కుతుంది. తదనంతర కాలంలో ఈ చట్టాలు, ఈ రాయితీలే ఆ ప్రాంత ప్రజానీకపు జీవన ప్రమాణా ల అభివృద్ధికి దోహదప డతాయి. అందువల్ల రాజకీయ సామాజిక దోపిడీకి గురవుతున్న బీసీలు, ఎంబిసీలు తమ సమస్యలను పరి ష్కరించుకోవడానికి ఇది అనువైన సమయం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక ఎత్తైతే దాని పునర్నిర్మాణం మరో ఎత్తు. ఈ కోణంలో చూసినప్పుడు తెలంగాణ ప్రాంతంలో దొరల పెత్తనంలో సమస్తాన్ని కోల్పోయిన అణగారిన కులాల ప్రజలు ప్రథమ ప్రయోజనాలను పొందవలసి ఉంటుంది. రక్తం ధారపోసి ఊడిగం చేయడం చేతకాని తనం కిందనే లెక్క. అందువల్ల బహుజనులు ఇప్పుడు అత్యంత వివేకంగా వ్యవహరించాలి. తమ జాతి ప్రయోజనాలే పరమావధిగా, సామాజిక బానిసత్వ విముక్తికి మరొక సాధనంగా ఈ సందర్భాన్ని ఉపయోగించుకోక తప్పదు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ముసాయిదా బిల్లు రూపకల్పనకు ముందు ఆస్తులు, అప్పులు, సరిహద్దు నిర్ణయం, రెవెన్యూ, నదీలాల పంపిణీ, రాజధానినిర్మాణం వంటివెన్నో ప్రధాన అంశాల పరిశీలనార్థం కేంద్రం మంత్రుల కమిటీని నియమిస్తుంది. ఈ కమిటీ పై అంశాలతో పాటు అనేక వివాదాస్పద అంశాలకు పరిష్కారాన్ని సూచిస్తుంది. ఈ మంత్రుల బృందం నివేదిక లోని అంశాలన్నింటినీ కేంద్ర న్యాయశాఖ పునఃపరిశీలించి ముసాయిదాలో చేరుస్తుంది. ఆ తరువాతే ఆ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెడతారు. ఈ సమయంలో బహుజన సంఘాలు, ప్రజాప్రతినిధులు, మేధావులు, ఉద్యోగులు కీలకపాత్ర పోషించి ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల సమస్యలను చర్చకు తీసుకురాగలగాలి. వాటి పరిష్కారాలకు చట్టబద్ధతను పొందగలిగే సదవకాశమూ ఉంటుంది. తెలంగాణ వచ్చినా ఎస్సీ, ఎస్టీ కులాల రాజకీయ రిజర్వేషన్లు 22 శాతం చొప్పున (ఎస్సీలకు 15శాతం, ఎస్టీలకు 7శాతం) రాజ్యాంగం ప్రకారం అమలుచేయడం అనివార్యం. కానీ జనాభా దామాషా పద్ధతిన ఆలోచిస్తే వీళ్లకూ అన్యాయమే జరుగుతుంది. తెలంగాణలో ఎస్సీల జనాభా, వారి రిజర్వేషన్ల శాతానికి మించి ఉంటుంది. బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు అసలు అమలులోనే లేవు. బిసి రిజర్వేషన్లను ఈ సందర్భంలో ప్రస్థావనకు తీసుకురావడం ద్వారా చట్టబద్ధమైన హామీ సంపాదించవచ్చు. బీసీల జనాభా తెలంగాణలో 55 నుండి 60 శాతం వరకు ఉంది. అందువల్ల తగిన రాజకీయ ప్రాతిని«ధ్య కోటాను సాధించగలిగితే తెలంగాణ ఉద్యమంలో బీసీలు చేసిన త్యాగాలకు సార్థకత చేకూరుతుంది. బహుజన కులాల దామాషా ప్రకారం రాజకీయ ప్రాతినిధ్యాన్ని పంపిణీ చేయగలిగితే ఈ వర్గాలు సమంజస ప్రజాప్రాతినిధ్యాన్ని పొంది రాజ్యాధికారానికి చేరువవుతాయి.

ఎస్సీల్లో మాదిగల జనాభా 18 శాతానికి మించి ఉంది (మొత్తం ఎస్సీ జనాభా 22 శాతంగా ఉంటుంది). మొత్తం జనాభాలో 11 నుంచి 15 శాతం మాదిగలు ఉంటారు. కానీ ప్రస్తుతం రిజర్వేషన్లను అందులో సగానికి మించి అనుభవించలేకపోతున్నారు. తెలంగాణ ఉద్యమంలో మాదిగలు అద్భుతమైన పోరాట పటిమ కనబరిచారు. తెలంగాణ సమస్యపట్ల ప్రపంచ దృష్టిని ఆకర్షించడంలో, కేంద్ర ప్రభుత్వాన్ని అంగీకరింపచేయడంలో మాదిగ ప్రజాప్రతినిధులు ఎంతో కృషి చేశారు. కేంద్ర సహాయ మంత్రి సర్వే సత్యనారాయణ, డిసెంబర్ 9 ప్రకటనలో తన కృషిని ఇటీవల జరిగిన తెలంగాణ సాధన సభలో బాహాటంగానే ప్రకటించడం విదితమే. కోర్ కమిటీ, కాంగ్రెస్ అధిష్ఠానం వద్ద తెలంగాణ రోడ్ మ్యాప్‌ను విశ్లేషించి తెలంగాణ ప్రజల ఆకాంక్షను బహిర్గతం చేసి, వారిని ఒప్పించడంలో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా చేసిన కృషి ఆమోఘం. ఉస్మానియా, కాకతీయ యూనివర్శిటీల్లో మాదిగ విద్యార్థులు వీరోచిత పోరాటాలు చేశారు. అలాగే గౌడ, యాదవ, ముదిరాజ్ కులాలతో పాటు ఎంబీసీ కులాలు ఎన్నదగిన రీతిలో తమ వంతు పోరాటం కొనసాగించాయి. తెలంగాణ ప్రాంతంలో ఎస్సీ, ఎస్టీలకు అంటరాని తనం సమస్య, కుల బహిష్కరణ, పేదరికం, అవిద్య వంటి సమస్యలు నేటికీ పీడిస్తునే ఉన్నాయి. అగ్ర కుల ప్రాబల్యం ఇక్కడ నిరాటంకంగా సాగుతూనే ఉంది. 13 సంవత్సరాలకు పైగా నడిచిన తెలంగాణ ఉద్యమం ఈ సమస్యలను పరిష్కరించడం కాదుకదా, కనీసం స్పృశించే ప్రయత్నం చేయలేదు.
మరో ప్రధాన సమస్య వనరుల పంపిణీ. తెలంగాణ ఏర్పాటు సందర్భంలో ఇది తేలాల్సిన సమస్య. తెలంగాణ వస్తే నీళ్లు, ప్రాజెక్టు సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. కానీ, భూములే లేని దళిత కులాలకు ఇవి ఎలాంటి ప్రయోజనాన్నిస్తాయి? అందుచేత భూమి పునర్ పంపిణీ జరగాలి. దీనికి చట్టబద్ధమైనహామీ కావాలి. 'తెలంగాణ ఏర్పాటు అనంతరం ఈ సమస్య లన్నింటనీ పరిష్కరించుకుందాం!' అంటూ అగ్రకులాలు చక్కిలిగింతలు పెట్టి తదనంతరం మసిపూసి మారేడుకాయ చేస్తాయి. స్వాతంత్య్రం సిద్ధించిన తరుణంలో అగ్రకులాలు ఇదే నాటకాన్ని ప్రదర్శించి విజయవంతంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలను శాశ్వత బానిసత్వంలోకి నెట్టివేయడం మర్చిపోలేము కదా! డా॥ బి.ఆర్. అంబేడ్కర్ ఆశించినట్టు చిన్న ర్రాష్టాలు బహుజన కులాల అభివృద్ధికి దోహదం చేస్తాయి. కానీ, పునర్నిర్మాణంలో ఈ సమస్యలేవీ ప్రస్థావనకు రాకుండానే కేవలం రాజకీయ పునర్నిర్మాణం ఏ రకంగానూ ఈ కులాలకు ప్రయోజనకారి కాదు. తెలంగాణ రాష్ట్ర సాధనలో బహుజన కులాలు ప్రదర్శించిన పటుత్వాన్ని, వారు హక్కులు సాధించుకునే దగ్గర చూపకపోతే వారి త్యాగాలకు అర్థంలేదు. అటి వెట్టిచాకిరీయే! తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులైనవారిలో బహుజన కులాల వారే అత్యధికం. తెలంగాణ సాయుధ పోరాట ఫలితాలను అనుభవించిన వారిలో అగ్రకులాలే అగ్రభాగాన ఉన్నాయి. తెలంగాణ సాయుధ పోరాటానంతరం జరిగిన భూసంస్కరణల్లో ఎస్సీ, ఎస్టీ,బిసి కులాలకు రావాల్సినవాటా రాలేదు. అటు నాయకత్వస్థానంలో, ఇటు లబ్ధి పొందడంలో అగ్రకులాలు ఆనాడు విజయం సాధించాయి. ఈనాడూ సాధించాలని చూస్తున్నాయి.ఈ గుణపాఠాలను దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు బడుగు బలహీన కులాలు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.


- కదిరి కృష్ణ
(రచయిత మూలవాసీ బహుజన లిబరేషన్ మూవ్‌మెంట్ కన్వీనరు)

Surya Telugu News Paper Dated : 2/8/2013

No comments:

Post a Comment