Monday, August 12, 2013

అభివృద్ధిలో ఆగమవుతున్న ఆదివాసీలు By వూకె రామకృష్ణ


దేశానికి స్వాతంత్య్రం వచ్చి 66 ఏళ్లు అవుతున్నప్పటికీ ఆదివాసీలకు ఇప్పటికీ స్వేచ్ఛా స్వాతంవూత్యాలు రాలేదు. పౌరులుగా అందరితో సమానులుగా సమాజంలో అంతర్భాగం కాలేకపోతున్నారు. ఈ పరిస్థితుల్లోనే అనేక ప్రాం తాల్లో ఆదివాసులు తమ మనుగడ కోసం పోరాడుతున్నారు. దేశ జనాభాలో 10 శాతం ఉన్న వీరికి అందుతున్న అభివృద్ధి ఫలాలు మాత్రం సున్నాగానే చెప్పుకోవ చ్చు. కాబట్టి ప్రపంచం ఎంతగా అభివృద్ధి చెందిందని చెప్పుకుంటున్నా వీరు మాత్రం దారివూద్యానికి, ఆకలి చావులకు చిరునామాగానే ఉన్నారు. ఆదివాసుల ఈ దుస్థితి మూలంగానే .. స్వాతంత్య్రం వచ్చిన తొలి నాళ్లలోనే ఆదివాసుల అభివృ ద్ధి కోసం రాజ్యాంగంలో ప్రత్యేక హక్కులు కల్పించారు. ఆదివాసులు నివసిస్తున్న ప్రాంతాలను షెడ్యూల్డ్ ప్రాంతాలుగా ప్రకటించి ప్రత్యేక రక్షణలు కల్పించారు. కానీ ఈ హక్కులు, రక్షణలు ఏనాడు అమలుకు నోచుకోలేదు. దీంతో ఆదివాసుల పరిస్థితి నానాటికి దిగజారిపోయింది. 1970 ప్రాంతంలోనే రాష్ట్రంలో పది ఐటీడీఏ ప్రాజెక్టులను నెలకొల్పి ఆదివాసుల అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పినప్పటికీ ఆశించి న ఫలితాలు కనిపించడం లేదు 
ఆదివాసీ ప్రాంతాల్లో విస్తారంగా సహజ వనరులు, ఖనిజాలు పుష్కలంగా ఉండ టం వారికి శాపంగా మారింది. ఆ ఖనిజాల తవ్వకాలు, వెలికితీత పేర ఆదివాసులను నిర్వాసితులను చేస్తున్నారు. అంతేగాకుండా.. ఈ సహజ వనరుల తవ్వకాలను, దేశీ, విదేశీ బహుళజాతి కంపెనీలకు కట్టబెట్టడంతో ఆ కంపెనీలు ఆదివాసుల నిర్వాసితుల ను చేస్తూ ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరుపుతున్నాయి. ఎక్కడైనా సహజవనరులున్న ప్రాంతంలోని స్థానికులకు ఎక్కువ ప్రయోజనాలు చేకూరాలి. కానీ ఆదివాసుల కాళ్లకింద లక్షల కోట్ల రూపాయల విలువ చేసే ఖనిజ వనరులున్నప్పటికీ వారికి ఈ సహజ సంపద ఏమాత్రం ఉపయోగపడటం లేదు. పోగా.. అదే వారికి శాపంగా మారింది. ఈ సహజ వనరులున్న కారణంగానే వారిని వారి నివాస ప్రాంతాల్లోంచి తరిమేసి వనరులను యథేచ్ఛగా తవ్వుకుపోతున్నారు. ఆదివాసులకు రక్షణగా ఉన్న భూ బదలాయింపు చట్టం 1/70 చట్టానికి తూట్లు పొడిచి గిరిజనులను వారి భూములనుంచి తరిమేస్తున్నారు. 

ఆదివాసుల భూములు గిరిజనేతరులకు బదిలీ కావడాన్ని చట్టం వ్యతిరేకిస్తున్నది. కానీ ఇదెన్నడూ అమలుకు నోచుకోలేదు. బినామీ పేర్లతో గిరిజనేతరులు ఆదివాసుల భూములను రకరకాల మోసాలతో కాజేస్తున్నారు. షెడ్యూల్డ్ ప్రాంతంలో స్థానిక ఆదివాసుల అనుమతి లేకుండా వారి భూములను తీసుకోరాదని, ఎలాంటి నిర్మా ణ ్రప్రజెక్టులు నిర్మించరాదని చట్టం చెబుతున్నది. అలాగే వారిని నిర్వాసితులను చేసే ఎలాంటి పనులూ చేపట్టరాదని కూడా రాజ్యాంగం చెబుతున్నది. అయినా మన పాలకులు వీటిని పట్టించుకున్న పాపానపోవడం లేదు. అభివృద్ధి ప్రాజెక్టుల పేరుతో, ఖనిజాల వెలికితీత పేరుతో ఆదివాసులను పెద్ద ఎత్తున నిర్వాసితులను చేస్తున్నారు.ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలకు ఆదివాసీ లు నివసిస్తున్న భూ భాగాలను ఖనిజ తవ్వకాలకు అప్పజెప్పు తున్నారు. ఇటు ప్రభు త్వ సంస్థలు కూడా ఆదివాసుల జీవితాలను పట్టించుకున్న పాపాన పోవడంలేదు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, సింగరేణి లాంటి ప్రభుత్వ సంస్థలు కూడా చట్టాలను తుంగలో తొక్కి గిరిజనులకు గోరీ కడుతున్నాయి. 

సరిగ్గా ఈ పరిస్థితుల్లోనే బయ్యారం ఉక్కు, విశాఖ బాక్సైట్ తవ్వకాలను గిరిజనులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ అభివృద్ధి ప్రాజెక్టులు ఏరూపంలో ఉన్నా అవన్నీ ఆదివాసులను నిర్వాసితులను చేస్తూ వారిని బలి తీసుకునేవిగానే ఉంటున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో కవ్వాల్ అభయారణ్య ప్రాజెక్టు, ఖమ్మం, ఉభయ గోదావరి జిల్లాల్లోని పోలవరం ప్రాజెక్టు, సింగరేణి ఓపెన్‌కాస్ట్‌లు అన్నీ ఆదివాసులను బలితీసుకుంటున్నవే. ఈ నేపథ్యంలో ఆదివాసులు సంఘటితమై తమ మనుగడ కోసం పోరాటం చేస్తుంటే.. వారిపై ప్రభుత్వం తీవ్రమైన నిర్బంధకాండకు పూనుకుంటున్నది.మావోయిస్టుల పేరుతో అణచివేతకు పూనుకుంటున్నది. గ్రీన్ హం ట్ ఆపరేషన్ పేరుతో ఆదివాసులపై యుద్ధమే ప్రకటించింది. సీఆర్‌పీఎఫ్, ఐటీబీఎఫ్, ఎస్‌టీఎఫ్, కోబ్రా లాంటి దళాలను ఆదివాసులపై ఎగదోసి పచ్చటి అడవిలో రక్తం పారిస్తున్నారు. ఊళ్లకు ఊళ్లను తగులబెడుతూ.., కనిపించిన ఆదివాసీని హింసిస్తూ, చంపుతూ అడవిలో నరమేధం సృష్టిస్తున్నారు. దీనికి తోడు సల్వాజుడుం, నల్లదండు లాంటి ప్రైవేటు హంతక ముఠాలను సృష్టించి ఆదివాసుల తరఫు న పోరాడుతున్న వారిని హత్యలు చేస్తూ రాజ్యహింసతో భయోత్పాతం కల్పిస్తున్నది ఈ ప్రభుత్వం. 

పారిక్షిశామీకరణ, ప్రపంచీకరణ మొదలైనప్పటి నుంచీ దేశదేశాల్లోని ఆదివాసుల పరిస్థితి మరింత దిగజారుతున్నది. దేశ దేశాల్లో ఆదివాసులను నిర్మూలించే విధానాలను అవలంబిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 70పైగా దేశాల్లో ఐదువేల తెగలకు పైబడి 38 కోట్ల జనాభా కలిగిన ఆదివాసులు కనుమరుగయ్యే పరిస్థితులు దాపురించాయి. ఇప్పటికే అనేక ప్రాంతాల్లోని మూలవాసుల భాషా సంస్కృతులు అంతరించిపోయాయి. మరికొన్ని అంతర్ధానమయ్యే పరిస్థితిలో ఉన్నాయి. ఈ పరిస్థితిలో ఐక్యరాజ్యసమితి 1982లోనే ఆదివాసుల జీవన సంస్కృతులను పరిరక్షించవలసిన అవసరం ఉన్నదని గుర్తించిం ది. పదేళ్లపాటు ఆదివాసుల పై ప్రత్యేక అధ్యయనాలు చేసి వారి జీవన సంస్కృతులు,అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను అన్ని దేశాలు విధిగా తీసుకోవాలని సూచించింది. 

కానీ..దేశ దేశాల్లో బహుళజాతి కనుసన్నల్లో నడుస్తున్న ప్రభుత్వాలు ఆదివాసుల హక్కులను హరిస్తున్నాయి. సహజ వనరుల వెలికితీసే నెపంతో ఆదివాసులను బలి చేస్తున్నాయి. ఆదివాసులను వారి జీవన విధా నాలనుంచి వేరుచేసి సాంస్కృతికంగా విధ్వంసం చేస్తున్నాయి. దేశంలో ఆదివాసులపై దాడులు మరీ ఎక్కువగా జరుగుతున్నాయి. విప్లవోద్యమాలకు అండగా ఉంటున్నారనే నెపంతో ఆదివాసులను వేటాడుతున్నదీ ప్రభుత్వం. వాకపల్లి, బాసగూడ, సర్కెగూడలు సృష్టిస్తూ.. రక్తపు పారిస్తున్నది. కొమురంబీం, బిర్సాముండా, సమ్మక్క, సారక్కల పోరాట వారసత్వంతో ఆదివాసులంతా ఐక్యమై ఉద్యమించాలి. ఆదివాసులపై కత్తిగట్టిన పాలక విధానాలను ఎదిరించాలి. 

-
ఆదివాసీ రచయితల సంఘం రాష్ట్ర కార్యదర్శి

No comments:

Post a Comment