Tuesday, August 27, 2013

ఐసిడిఎస్ పరిరక్షణ అవశ్యం By ఎఆర్‌ సింధు

సమగ్ర శిశు అభివృద్ధి పథకం (ఐసిడిఎస్‌) ప్రపంచంలోనే ఈ తరహా పథకాల్లో అతి పెద్ద పథకమని భారత ప్రభుత్వం చెప్పుకుంటోంది. కానీ ఇతర దేశాల్లో విద్య, ఆరోగ్యం వంటి ప్రభుత్వ సేవల్లో ఇదొక భాగమని ప్రముఖ ఆర్థికవేత్త ప్రొఫెసర్‌ జయతీ ఘోష్‌ చెప్పారు. అఖిల భారత అంగన్‌వాడీ కార్మికులు, హెల్పర్ల సమాఖ్య (ఎఐఎఫ్‌ఎడబ్ల్యుహెచ్‌) 'ఐసిడి ఎస్‌ను కాపాడేందుకు ఉమ్మడి ఉద్యమం ఆవశ్యకత' అనే అంశంపై జాతీయ వర్క్‌్‌షాప్‌ను నిర్వ హించింది. ఈ సందర్భంగా 'సంక్షేమ పథకాలు, ఐసిడిఎస్‌ మిషన్‌పై ప్రభుత్వ విధానాలు' గురించి ఆమె ప్రసంగించారు. తగిన నిధులు కేటాయించి దీన్ని శాశ్వత వ్యవస్థలో భాగంగా చేయడానికి బదులుగా ప్రభుత్వం దీన్ని ఒక బృహత్తర ప్రాజెక్టు (మిషన్‌)గా మార్చిందన్నారు. తద్వారా దీన్ని ఇంకా తాత్కాలికమైన పథకంగానే కొనసాగిస్తోందని విమర్శించారు. బాలల వికాసానికి, అభివృద్ధికి సంబంధించి ప్రపంచంలోనే అత్యంత దుర్భరమైన స్థితిలో భారత్‌ ఉందని సంబంధిత గణాంకాలు సూచిస్తున్నాయని తెలిపారు. అంగన్‌వాడీ ఉద్యోగులకు సంబంధించి పటిష్టమైన కార్మికోద్యమం ఉన్నందున, స్పష్టమైన దృక్పథం ఉన్నందున పోషకాహార లోపాన్ని, ఉద్యోగుల దయనీయమైన పని పరిస్థితులను మనం అందరి దృష్టికీ తేగలిగామని, ఐసిడిఎస్‌ను కాపాడుకోవడం భారత్‌కు చాలా ముఖ్యమని అన్నారు. పైగా కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, మహిళా సంఘాల నుంచి మరింత ఎక్కువగా చొరవ తీసుకోవడం ఇంకా అవసరమని ఆమె పేర్కొన్నారు. ఎఐఎఫ్‌ఎడబ్ల్యుహెచ్‌ ప్రధాన కార్యదర్శి ఎఆర్‌ సింధు 'ఐసిడిఎస్‌ మిషన్‌ : ఎఐఎఫ్‌ఎడబ్ల్యుహెచ్‌ దృక్పథం, సంయుక్త కార్యాచరణకు ఆవశ్యకత' అనే అంశంపై ఒక పత్రాన్ని సమర్పించారు. ఐసిడిఎస్‌ను పటిష్టపరిచేందుకు జరుగుతున్న పోరాటాలు, ప్రచారాల్లో సమాఖ్య అగ్రభాగాన ఉంది. భారతదేశంలోని పిల్లలకు ఆహారం, పోషకాహారం, ఆరోగ్యం, విద్య హక్కులకు ఐసిడిఎస్‌ హామీ కల్పిస్తోంది. పిల్లలను చూసేందుకు క్రెచ్‌లు ఉండాలంటూ పోరాడడం మహిళల హక్కు అని ఆ పత్రంలో పేర్కొన్నారు. సేవల రంగంలోని కార్మిక ఉద్యమం తమ పోరాటాలను, కార్మికులకు మరింత మెరుగైన పని పరిస్థితులు ఉండేలా చూడడానికి, మరింత మెరుగైన మౌలిక సదుపాయాల కోసం ప్రజలు చేసే పోరాటాలకు అనుసంథానించడం చాలా కీలకమని ఎఐఎఫ్‌ఎడబ్ల్యుహెచ్‌ పరిగణిస్తోంది. లబ్ధిదారులతో పాటు సిఐటియు, ఎఐకెఎస్‌, ఎఐఎడబ్ల్యుయు, ఐద్వా, ఎఐఎఫ్‌ఎడబ్ల్యుహెచ్‌ వంటి సంఘాలు 2008లో ఐసిడిఎస్‌ను కాపాడండి అని పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టాయి. ఆ సంవత్సరంలోనే భారత ప్రభుత్వం ఐసిడిఎస్‌లో కొన్ని తిరోగమన మార్పులు చేయడానికి ప్రయత్నించింది. ఈ మార్పులు ఆ పథకానికే పెను విఘాతంగా మారాయి. 2008 అక్టోబరు 22న న్యూఢిల్లీలో సేవ్‌ ఐసిడిఎస్‌ అంటూ ఒక జాతీయ సదస్సు నిర్వహించారు. ఐసిడిఎస్‌ను సార్వజనీనం చేసి పటిష్టపరచాల్సిందిగా కోరుతూ ప్రధానికి ఉమ్మడి లేఖ పంపారు. కొన్ని రాష్ట్రాల్లో రాష్ట్ర స్థాయి సదస్సులు కూడా నిర్వహించారు. ఐసిడిఎస్‌ను ఒక మిషన్‌గా మార్చాలని భారత ప్రభుత్వం ఇటీవలే నిర్ణయించింది. దీని వెనుక గల ప్రధాన ఉద్దేశం ప్రైవేటీకరణకు మొగ్గు చూపడం, ప్రపంచ బ్యాంక్‌ ప్రతిపాదనల మేరకే ఇదంతా జరుగుతోంది. ఇటువంటి ప్రతిపాదనలన్నింటినీ తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి అంటే గత ఐదు నెలలుగా దేశవ్యాప్తంగా ఎఐఎఫ్‌ఎడబ్ల్యుహెచ్‌ ఉధృతంగా ప్రచారం చేపట్టింది. 10 లక్షలకు పైగా కరపత్రాలను పంచింది. జులై 10ని బ్లాక్‌ డేగా పాటించింది. రెండు స్థాయిల్లో రెండు అంశాలపై ప్రజా సంఘాలతో కలిసి పనిచేసిన అనుభవం ఎఐఎఫ్‌ఎడబ్ల్యుహెచ్‌కు ఉందని ఆమె చెప్పారు. మొదటిది, ఐసిడిఎస్‌ను పటిష్టపరచాలన్నది, రెండవది, పేద రైతులు, వ్యవసాయ కార్మికులు, మహిళలు వంటి సమాజంలోని వివిధ వర్గాల వారిని ఒక తాటిపైకి తేవడంలో ఎఐఎఫ్‌ఎడబ్ల్యుహెచ్‌ కార్యకర్తల సహాయం తీసుకోవడం. ఐసిడిఎస్‌ మిషన్‌ ప్రతిపాదనలను వివరిస్తూ, ఎఐఎఫ్‌ఎడబ్ల్యుహెచ్‌ వైఖరిని తెలియజేస్తూ వర్క్‌షాప్‌లో పత్రాలను పంపిణీ చేశారు. ఐసిడిఎస్‌ను కాపాడాలని కోరుతూ జరుగుతున్న ఉద్యమాన్ని మరింత పటిష్టపరిచేందుకు గానూ లబ్ధిదారుల, ప్రజా సంఘాల సహాయాన్ని ఎఐఎఫ్‌ఎడబ్ల్యుహెచ్‌ కోరుతోంది. ఐసిడిఎస్‌ను పటిష్టపరిచేందుకు భవిష్యత్‌ కార్యకలాపాలకు గల అవకాశాలను కూడా సూచించింది. అంగన్‌వాడీల్లో సేవలపై ప్రచారాన్ని నిర్వహించడం, దీని ప్రాధాన్యత, దాన్ని ఇంకా ఎలా మెరుగుపరచాలి అనే అంశంపై, అంగన్‌వాడీలు కమ్‌ క్రెచ్‌ల డిమాండ్లు, నాణ్యమైన ఆహారం, ప్రీ స్కూల్‌ చదువు, మౌలిక సదుపాయాలు, కమ్యూనిటీ ప్రాతినిధ్యం పేరుతో యూజర్‌ ఛార్జీలను విధించడానికి నిరసనగా నేరుగా జోక్యం చేసుకోవడం, అవినీతికి, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రచారం సాగించాల్సి ఉంది. ఎఐఎఫ్‌ఎడబ్ల్యుహెచ్‌ ఆఫీసు బేరర్లు రాష్ట్ర స్థాయిలో వివిధ అంశాలపై తమ అనుభవాలను కూడా పంచుకున్నారు. జోక్యం చేసుకోవాల్సిన అవసరం, అందుకు గల సాధ్యాసాధ్యాలను స్పష్టం చేశారు. కోశాధికారి సరోజ్‌ శర్మ హిమాచల్‌ ప్రదేశ్‌ అనుభవాలను వివరించి చెప్పారు. ఏడాదిలో తొమ్మిది నెలలు మాత్రమే పోషకాహారాన్ని ప్రభుత్వం సరఫరా చేస్తుంది. మిగిలిన కాలంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, స్థానిక స్వయం సహాయ గ్రూపుల వారు ఈ మిగిలిన మొత్తమంతా స్థానికుల నుంచి సేకరించాల్సి ఉంటుందని చెప్పారు. సమాఖ్య కార్యదర్శి వీణా గుప్తా యుపి అనుభవాలను వివరించారు. అక్కడ కాంట్రాక్టర్లు పోషకాహారాన్ని అందజేస్తారు. పోషకాహార సరఫరాను ప్రారంభించేందుకు ఇప్పుడు ఇస్కాన్‌ను ఆహ్వానించారు. వారికి ఉచితంగా భూమి, అదనపు చెల్లింపులు, రాయితీలు అందజేస్తారు. అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రభుత్వం చేసే ప్రస్తుత కేటాయింపులకు అనుగుణంగా ఆ రేట్లకు ఆహారాన్ని సరఫరా చేయడానికి వారు తిరస్కరిస్తున్నారు. అందువల్ల వారికి అదనపు చెల్లింపులు జరుపుతున్నారని చెప్పారు. సమాఖ్య కార్యదర్శి సంతోష్‌ రావల్‌ హర్యానా స్వయం సహాయ గ్రూపుల అనుభవాలను వివరించారు. గ్రామీణ నిరుపేద కుటుంబాల్లోని మహిళలకు వంట చేసే బాధ్యతలను అప్పగిస్తారు. వీరికి నెలకు రూ.200 నుంచి రూ.300 చెల్లిస్తారు. స్థానిక మహిళలు, అంగన్‌వాడీ కార్యకర్తల మధ్య శతృత్వం సృష్టించడానికి ప్రభుత్వం ఏ విధంగా ప్రయత్నిస్తోందో ఆమె వివరించారు. సమాఖ్య కార్యదర్శి కిషోరి వర్మ మధ్యప్రదేశ్‌ అనుభవాలను వివరించారు. రాష్ట్రంలో అన్ని స్థాయిల్లోనూ పేలవమైన, నాణ్యత లేని పోషకాహారాన్ని అందజేస్తున్నారని తెలిపారు. పోషకాహారాన్ని అందించడంలో జరుగుతున్న అవినీతిలో ముఖ్యమంత్రి భార్య నడిపే ఎన్‌జిఓ కూడా ఉంది. కాగా ప్రజా సంఘాల నేతలు వీటిపై ప్రతిస్పందిస్తూ పలు సూచనలు చేశారు. ఈ విషయాన్ని చేపట్టాలని సిఐటియు 14వ మహాసభ ఇప్పటికే నిర్ణయించిందని సిఐటియు అధ్యక్షులు ఎకె పద్మనాభన్‌ చెప్పారు. ఉమ్మడి ప్రచారానికి, ఉద్యమానికి అవసరమైన చొరవలు తీసుకోనున్నట్లు చెప్పారు. ఎఐకెఎస్‌ ప్రధాన కార్యదర్శి హన్నన్‌ మొల్లా ఇటువంటి కీలకమైన అంశంపై ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సమాఖ్య చొరవ తీసుకోవడాన్ని అభినందించారు. కింది స్థాయి నుంచి మనం ఏదైనా చేయాల్సిన తరుణం ఆసన్నమైందని అన్నారు. అన్ని ప్రజా సంఘాల నేతలతో కలిసి ఒక జాయింట్‌ సర్క్యులర్‌ను జారీ చేయాలని ఆయన సూచించారు. ఇలాగే రాష్ట్రాల స్థాయిలో కూడా వర్క్‌షాప్‌లు నిర్వహించాలన్నారు. కింది స్థాయిలో భవిష్యత్‌ కార్యాచరణలకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. అంగన్‌వాడీ కార్మికుల, హెల్పర్ల, మధ్యాహ్న భోజన కార్మికుల పోరాటాలకు మద్దతునివ్వాలని అఖిల భారత కిసాన్‌ సభ 33వ జాతీయ మహాసభ తీర్మానించింది. అంగన్‌వాడీ కేంద్రాల సేవలను తల్లీపిల్లలు పొందడం హక్కని, ఆ హక్కుకు హామీ కల్పిస్తూ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్‌ చేయాలని ఎఐఎడబ్ల్యుయు జాయింట్‌ కార్యదర్శి సునీత్‌ చోప్రా అన్నారు. ఐసిడిఎస్‌ను పటిష్టపరిచేందుకు జరిపే పోరాటాలకు తమ సంస్థ పూర్తి మద్దతునిస్తుందన్నారు. ఐసిడిఎస్‌ను పటిష్టపరిచేందుకు జరుగుతున్న పోరాటాలకు మద్దతుగా మహిళా సంఘాలు బాసటగా నిలవడం చాలా ముఖ్యమని ఐద్వా ఉపాధ్యక్షురాలు జాగ్మతి సంగ్వాన్‌ అన్నారు. పైగా ఇది మహిళా హక్కులో కీలకమైన భాగమని అన్నారు. ఎఐఎఫ్‌ఎడబ్ల్యుహెచ్‌తో పాటు ఇటువంటి సమస్యలను చేపట్టేందుకు ఐద్వాకు చాలా అవకాశముందని అన్నారు. చివరగా, సిఐటియు కార్యదర్శి, ఎఐఎఫ్‌ఎడబ్ల్యుహెచ్‌ ఉపాధ్యక్షురాలు హేమలత ముగింపు ఉపన్యాసం చేశారు. కేవలం కార్మికుల హక్కుల కోసమే కాకుండా ఇతర ప్రజల హక్కుల సాధన కోసం కూడా పోరాడాల్సిన అవసరముందని, అవసరమైతే సంయుక్త కార్యచరణను, ఉమ్మడి జోక్యాలు కూడా చేపట్టాలని ఆమె నొక్కి చెప్పారు.


(వ్యాసకర్త ఎఐఎఫ్‌ఎడబ్ల్యుహెచ్‌ ప్రధాన కార్యదర్శి) 

Prajashakti Telugu News Paper Dated :    Thu, 22 Aug 2013,

No comments:

Post a Comment