Tuesday, December 4, 2012

యాచకులకూ వర్గీకరణ లబ్ధి - గడ్డం దేవదాస్



ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని మొదటిసారి ప్రారంభించిన ఉద్యమ సంస్థ అరుంధతీయ మహాసభ. ఈ సంస్థ వ్యవస్థాపకుడు కీర్తిశేషుడు మాదిగ గురుస్వామి 1920లోనే మాదిగ హక్కుల గురించి ప్రప్రథమంగా ఎలుగెత్తారు. ఈయన ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడం విశేషం. ఎందుకనగా ఎస్సీలైన ఆది ఆంధ్రుల, ఆది ద్రావిడుల, (తెలంగాణ మాలల వలె) బలమైన ఆర్థిక పునాది ఆధిపత్యం ఉన్న ప్రాంతం ఆంధ్రగా చెప్పుకోవాలి. అట్టి ఆర్థిక పరిపుష్టి ఉన్న ఆది ఆంధ్ర, ఆది ద్రావిడులను, వీరు అనుభవించే ఉమ్మడి రిజర్వేషన్ ఫలాల వల్ల వెనుకబడిన, ఆర్థిక పరిపుష్టి లేని మాదిగల జీవన స్థితి నుంచి పుట్టిన ఉద్యమమే ఎస్సీ వర్గీకరణ ఉద్యమం. ఎస్సీలలోని అసమానతలను తొలగించి, సమాన స్థితికి మార్చి, ఎవరి వాటాను వారనుభవించే ప్రక్రియే వర్గీకరణ. ఇది సామాజిక న్యాయం, సామాజిక దృక్పథం సంకల్పమని అరుంధతీయ మహాసభ భావించింది.

1980లో కిషన్‌లాల్ ఏర్పాటు చేసిన ఆరుందతీయ బంధు సేవా మండలి. 1982లో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ మాదిగ సంఘం. 1989లో డా. మంద జగన్నాథం, రిటైర్డ్ ఐ.పి.ఎస్ అధికారి వెంకటస్వామి నాయకత్వంలోని ఆది జాంబవ అరుంధతీయ సమాఖ్య తర్వాతే కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో 1994 జూలై 6న 20 మందితో ఏర్పడిన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వరకు ఎస్సీ వర్గీకరణను డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. ఈ పోరాటాల ఫలితంగా వర్గీకరణకు అనుకూలంగా నివేదిక ఇచ్చిన రామచంద్రరాజు కమిషన్ ఆధారంగా నాటి తెలుగుదేశం ప్రభుత్వం 1997 జూన్‌లో ఎస్సీ రిజర్వేషన్లను ఎ, బి, సి, డిలుగా విభజిస్తూ జీవో 68, 69ని జారీచేసింది. అదే సంవత్సరంలో ఏర్పడిన మాల మహానాడు వర్గీకరణను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేసింది. 1999 జూన్‌లో రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రపతి అనుమతితో వర్గీకరణ అమలుకు ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈ ఆర్డినెన్స్‌ను హైకోర్టు ధర్మాసనం సమర్థించింది. మాల మహానాడు సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. 2004 నవంబర్‌లో అధికరణ 341 ప్రకారం ఎస్సీ కులాలను వర్గీకరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, కావాల్సి వస్తే రాజ్యా ంగ సవరణ ద్వారా వర్గీకరించుకోవచ్చని సుప్రీంకోర్టు చెప్పిందే కానీ వర్గీకరణ వద్దని, తప్పని చెప్పలేదు.

మాదిగల కింద వీరిని యాచించే చిందులు, మాస్టిన్, డెక్కలి, బుడిగ జంగాలు తదితర కులాలున్నాయి. ఇవి నేటికీ మాదిగలను అడుక్కొని జీవిస్తాయి. ఈ కులాల ఎదుగుదలను మాలలు, మాదిగలు కలిసి అన్ని విధాలుగా, అన్ని రంగాల్లో ఎదగకుండా అడ్డుకున్నారు, అణిచివేశారు. ఏనాడు ఈ మాలలు, మాదిగలు తమ కింది కులపోళ్ల ఎదుగుదల గురించి పల్లెత్తు మాట్లాడరు. చట్టసభల్లో వీరి ప్రస్తావన కానరాదు. 'సమాజంలో ఒక కులం వారు ఏ కారణం వలన పీడితులయ్యారో ఆ ప్రాతిపదిక మీదనే వాళ్ళను ప్రోత్సహించాలని' డా. బి.ఆర్. అంబేద్కర్ అంటారు. విద్య, ఉద్యోగ, రాజకీయ తదితర రంగాల్లో ఎస్సీ ఉమ్మడి రిజర్వేషన్లను పూర్తిగానే అనుభవించని ఈ యాచక జాతుల వారికి ప్రత్యేక కేటగిరీ కింద గుర్తించి, వర్గీకరణలో 'ఎ' గ్రూపులో చేర్చి తగినంత రిజర్వేషన్ శాతాన్ని కల్పించాలి.

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రెండు దఫాలుగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఒకసారి చంద్రబాబు (తెలుగుదేశం) మరొకసారి వై.ఎస్. రాజశేఖరరెడ్డి (కాంగ్రెస్)కి మాదిగ జాతిని, దాని ఉప కులాలను వారికి అనుకూలంగా మలిచి ఎస్సీ వర్గీకరణను అసెంబ్లీ ఆమోదం పొందేలా ఏకగ్రీవ తీర్మానం వరకు మందకృష్ణ మాదిగ పోరాట కృషి కొనసాగింది. తర్వాత కాలంలో మాలల కౌంటర్ ఉద్యమం ద్వారా వర్గీకరణ వివాదాస్పదమై సుప్రీంకోర్టు సూచనతో వర్గీకరణ బిల్లు పార్లమెంట్ ఆమోదానికి నిరీక్షిస్తూ, తుది పోరాటం చేస్తూనే ఉంది. రిజర్వేషన్ల ద్వారా కొంత పురోభివృద్ధిని సాధించిన మాల, మాదిగలు ఎదుగని కులాల పట్ల జాలి తో వ్యవహరించని తీరుకు విచారించాలి. ప్రజాస్వామ్యం సామాజిక దృక్పథాన్ని విడనాడి జాతి వైరాన్ని తీ వ్రం చేయడం అంబేద్కరిజం కాదు. ఎస్సీ వర్గీకరణలో సామాజిక దృక్పథాన్ని అలవర్చుకోండి. మాల, మాదిగలు ఒకే కమ్యూనిటీగా ఐక్యమవ్వండి. కుల వివక్షకు వ్యతిరేకంగా కుల నిర్మూలన రాజ్యాధికారంపై కలిసి పోరాడండి.

- గడ్డం దేవదాస్
అంబేద్కరిస్ట్, తెలంగాణ చిందు హక్కుల
పోరాట సమితి వ్యవస్థాపకులు

Andhra Jyothi Telugu News Paper Dated: 5/12/2012

No comments:

Post a Comment