Friday, April 25, 2014

చుండూరు తీర్పు కనువిప్పు కాగలదా? By చలసాని నరేంద్ర


మారణకాండ నిందితుల శిక్ష రద్దు! 
సామాజికాంశాలపై ప్రశ్నలు 
శిక్షల రద్దు ఉద్యమ వైఫల్యమే 
ప్రభుత్వ యంత్రాంగానిదీ అలసత్వమే 
నిందితులను గుర్తించడం జరగలేదు
గ్రామస్థులందర్నీ కేసులో చేర్చారు 
కేసులు నిర్వహించే పటిష్ఠ వ్యవస్థ అవసరం 

ప్రపంచ దృష్టి ఆకర్షించిన గుంటూరు జిల్లా చుండూరు దళితుల మారణకాండలో నిందితులకు సంఘటన జరిగిన సుమారు 23 సంవత్సరాల తరువాత ఇప్పుడు రాష్ట్ర హై కోర్టు కింది కోర్టు విధించిన శిక్షను రద్దు చేయడంతో మరో పర్యాయం ఈ సంఘటన చర్చనీయాంశమవుతున్నది. ఈ సంఘటనను కేవలం ఒక గ్రామానికి చెందిన అంశంగా కాకుండా మొత్తం భారత దేశంలో స్వాతంత్య్రం సిద్ధించిన ఆరు దశాబ్దాల తరువాత ఇంకా కు వివక్ష ప్రదర్శించే పరిస్థితులు కొనసాగనడం సిగ్గు చేటైన అంశం. చుండూరుకన్నా ముందు ప్రకాశంజిల్లా కారంచేడు, ఆ తరువాత గుంటూరు జిల్లా నీరుకొండలో ఇదే విధంగా దళితులపై జరిగిన దాడులు అనేక మౌలిక సామాజిక అంశాలను, ప్రశ్నలను లేవనెత్తాయి. ఇటువంటి సంఘటనలో నిందితులకు హై కోర్టు శిక్షలను రద్దుచేసే పరిస్థితులు నెలకొనడం తీవ్ర విస్మయం కలిగించే అంశం. అందుకు దారితీసిన పరిస్థితులను గుర్తించితే గాని ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా నిరోధించలేము. 
ప్రజా ఉద్యమాల కారణంగా, ఈ సంఘటనలు ముఖ్యంగా దళితులల్లో ఆత్మ గౌరవం అనే ప్రశ్నను లేవనెత్తి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీయడంతో అసలు నిందితులను గుర్తించి వారికి శిక్షలు పడేవిధంగా చేయడంపట్ల ఒక వైపు ప్రభుత్వయంత్రాంగం, మరో వైపు ఉద్యమ కారులు విఫలం చెందారని భావించవచ్చు. సంఘటన జరిగిన సమయంలో వారు అనుసరించిన ధోరణులు ఇటువంటి అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేస్తున్నాయి. 

జిల్లా కేంద్రం గుంటూరుకు 20 కి. మి. దూరంలోగల చుండూరు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో, 40 మందికి పైగా పోలీసులు పహారా కాస్తున్న సమయంలో ఘర్షణ జరగడం, 8 మందిని హత్య చేయడమే విస్మయం కలిగించే అంశం కాగా, ఆ గ్రామంలో పోలీసులు ఉండగానే జరిగిన సంఘటనగురించి- అది జరిగిన మూడు రోజుల వరకు జిల్లా కేంద్రంలో గల పోలీస్‌ అధికారులకు గాని, 12 కి మీ దూరంలో గల రెవిన్యూ డివిజన్‌ కేంద్రం తెనాలిలో గల డియస్‌పి, ఆర్‌డిఓ వంటి అధికారులకు గాని సమాచారం అందలేదంటే అసలు ప్రభుత్వ యంత్రాంగం ఉన్నదా అనే అనుమానం కలుగుతున్నది. 
ప్రతి స్థాయిలో అధికారుల బాధ్యతారాహిత్యం ఈ సందర్భంగా వెల్లడి అయినా, బాధ్యులుగా ఎవరినీ గుర్తించడానికి ప్రయత్నం చేయకపోవడం, అక్కడ బాధ్యతారాహిత్యానికి కారకులైన అధికారులకు తరువాత పలు కీలకమైన పోస్టింగ్‌లు ఇవ్వడం, రాష్ట్ర స్థాయిలో ఆధిపత్యం వహించే పదవి ఇవ్వడం గమనార్హం. అయినా ఈ అంశంసంఘటన జరిగిన నాలుగైదు రోజుల వరకు దళిత వాడలోకి, మృతదేహాల వద్దకు ప్రభుత్వ అధికారులు ఎవరినీ, చివరకు పోలీసులను సహితం రానీయలేదు. మొత్తం ప్రభుత్వ అధికార యంత్రాంగం ప్రేక్షకపాత్ర వహించడం మినహా ఏమీ చేయలేదు. అప్పటికే జిల్లా ఎస్‌పి బదిలీ అయినా, ఇంకా విధుల్లో చేరకుండా నిజామాబాదులో విధి నిర్వహణలో ఉన్న ఆర్‌పి మీనా ను రాష్ట్ర డిజిపి వెంటనే వచ్చి పరిస్థితులను అదుపులోకి తేవాలని ఆదేశిస్తే, ఆయన ఆఘమేఘాల మీద గుంటూరుకు పరిగెత్తుకు వచ్చారు. చుండూరులోనే విధి బాధ్యతలు స్వీకరించి నేరుగా దళిత వాడకు వెళ్ళారు. అప్పటి వరకు అధికారులు ఎవ్వరూ అక్కడికి వెళ్ళలేక పోయారు. 

ఆయన దళితులకు న్యాయం చేస్తామని మనోధైర్యం కలిగించే ప్రయత్నం చేసి, మృత దేహాలను శవపరీక్ష కోసం తెనాలి పంపించారు. తెనాలి నుండి తిరిగి వచ్చే సరికి కనీసం అక్కడ ఉన్న మీనాతో మాటమాత్రం అయినా చెప్పకుండా- గ్రామంమధ్య వాటిని ఖననం చేసే ఏర్పాట్లను దళిత వాడ, ఇతర ఉన్నతాధికారులు చేశారు. అక్కడ ఉన్న కోనేరు రంగారావు వంటి నాయకులు శాశ్వతంగా గ్రామస్థులమధ్య వైరం కొనసాగే విధంగా- ఇలా చేస్తున్నరా అని ఉన్నతాధికారులను నిలదీస్తే వారి నోట మాట రాలేదు. 
ఆత్మా గౌరవ పోరాటంగా న్యాయంకోసం చుండూరు దళితులు జరిపిన పోరాటం అనేక విధాలుగా చారిత్రాత్మక మైనది. దేశం మొత్తంమీద ఉన్న దళితులల్లో ఒక ధైర్యాన్ని, విశ్వాసాన్ని కలిగించే విధంగా జరిగింది. ఆ కృషి ఆ ఉద్యమానికి నాయకత్వం వహించి, మార్గదర్శనం చేసిన కత్తి పద్మారావు, ఆయన సహచరులకే చెందుతుంది. దళితుల్లోని ఆవేశాలను ఉపయోగించుకొని రాష్ట్రంలో తొలిసారిగా మైదాన ప్రాంతంలో తమ స్థావరాలను ఏర్పాటు చేసుకోవాలని నక్సలైట్‌వర్గాలు ఎంతో ప్రయత్నం చేశాయి. 

తెలంగాణ ప్రాంతంనుండి సీనియర్‌ నాయకులు అంతావచ్చి మకాంవేసే ప్రయత్నం చేశారు. ఇక పలు రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల సంగతి సరే! అయితే భయంతో, ఆవేదనతో ఉన్న దళితుల ఆవేశాలను రాజకీయ ఉద్యమాలుగా మలచుకొనే అవకాశం ఎవరికీ ఇవ్వకుండా కేవలం వారి భవిష్యత్తు కోసం పటిష్ఠమైన పునాదులు వేసే ప్రయత్నం పద్మారావు చేశారని చెప్పవచ్చు. ఈ సందర్భంగా కొన్ని పొరపాట్లు జరిగినా ఈ విషయంలో ఆయన ప్రదర్శించిన నాయకత్వ పటిమ, చిత్తశుద్ధి లను మాత్రం ఎవ్వరూ శంకించలేరు. అయితే నిందితులపై కేసు నమోదు విషయంలో మొత్తం గ్రామస్థులను ఇరికించే ప్రయత్నం చేశారు. వాస్తవాలను దృష్టిలోఉంచుకొని- అసలు నిందితులను గుర్తించే ప్రయత్నం చేయ లేదు. ఒక వేళ గుర్తించినా ఆ మేరకు కేసుల నమోదుకు ప్రయత్నం చేయలేదు. నాటి యస్‌పి మీనా ఒకొక్క మృతిలో 10 నుండి 12 మంది నిందితులను గుర్తించి పటిష్ఠంగా కేసు నమోదు చేస్తే, తొందరగా విచారణ పూర్తి అయి శిక్షలు పడటానికి అవకాశం ఉంటుందని సూచించారు. అయితే అందుకు నిరాకరించి, ఒకొక్కరి మృతికి 50 మందికి పైగా గుర్తుకు వచ్చిన పేర్లు అన్నీ చేర్చి కేసులు నమోదు చేయడం విచారణ సుదీర్ఘంగా జరగడానికి, హై కోర్టులో శిక్షలను రద్దు చేయడానికి ఒక ప్రధాన కారణం అని భావించవచ్చు. 

ఈ కేసుపట్ల హై కోర్టు న్యాయమూర్తుల దృష్టి కోణం సహితం మరో కారణం కావచ్చు. కేవలం పోలీసులు, న్యాయవాదులు భావించినంత మాత్రంచేత హై కోర్టు శిక్షలను ఖరారు చేయాలని చెప్పలేముగదా! భారత దేశ చరిత్రలోనే నేరం జరిగిన చోట, ఆ గ్రామంలోనే ప్రత్యేక కోర్టును ఏర్పాటుచేసి విచారణ జరపడం ఎంత ప్రత్యేకత సాధించుకున్నా- శిక్షల విషయంలో మాత్రం నిశితమైన దృష్టి కేంద్రికరించ లేదని చెప్పవలసి వస్తుంది. క్రింది కోర్టులో ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా వ్యవహరించిన బి. చంద్రశేఖర్‌ వంటి న్యాయవాదులు అంకితభావంతో పనిచేయడంతో శిక్షలు పడడం సాధ్యమయింది. ఆయన మృతి చెందడంతో హై కోర్టులో ఏమయినా లోపం జరిగిందా అనే అనుమానం కలుగుతున్నా వాస్తవంగా ఏం జరిగిందో తెలియదు. తొలుత నిందితులుగా పేర్కొన్నవారిలో కొందరు అప్పటికే మృతి చెందారు. కొందరు అసలు గ్రామంలోనే నివాసం ఉండడం లేదు. 280 మందికి పైగా నిందితులుగా పేర్కొంటే వారిలో 39 మంది విచారణ సమయంలోనే మృతి చెందారు. 136 మందిని సాక్షులుగా విచారించారు. 219 మందిని మాత్రమే నిందితులుగా కోర్టు పరిగణలోకి తీసుకొని, వారిలో 21 మందికి జీవిత ఖైదు, మరో 35 మందికి ఒక సంవత్సరం శిక్ష విధించి మిగిలిన వారిని నిరపరాధులుగా వదిలి వేసింది. 

సంఘటన జరిగిన 23 సంవత్సరాల అనంతరం ఇప్పుడు శిక్షలను రద్దు చేసినా వారిప్పటికే సుదీర్ఘకాలం మానసిక వేదనకు గురయ్యారని చెప్పవచ్చు. అసలు ఇంత సుదీర్ఘకాలం విచారణ జరుగవలసిన పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయో ఒకవైపు పోలీస్‌ ఉన్నతాధికారులు, ప్రభుత్వం- మరో వైపు ఉద్యమకారులు, సామాజిక కార్యకర్తలు, రాజకీయ పక్షాలు సహితం సమీక్ష చేసుకోవలసి ఉన్నది. కారంచేడు కేసు విషయంలో సహితం కింది కోర్టు వేసిన శిక్షను హై కోర్టు కొట్టి వేసినా, తిరిగి సుప్రీం కోర్టు మళ్ళీ విధించడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ పద్మారావు ఆశాభావ వైఖరిని వ్యక్తంచేశారు. రెండు, రెండున్నర దశాబ్దాల పాటు విచారణ జరగడం, కోర్టుల చుట్టూ తిరగడం- కేవలం నిందితులకుమాత్రమే కాకుండా బాధితులకు, వారి పక్షాన పోరాటం చేస్తున్న వారికి సహితం ఒక విధంగా శిక్ష విధించిన్నట్లే కాగలదు. 
ప్రపంచంలోనే అత్యంత కఠినమైనదిగా భావిస్తున్న యస్‌ సి, యస్‌ టి అత్యాచారాల నిరోధ చట్టాన్ని దళితులకు రక్షణ కల్పించడంకోసం మన దేశంలో తీసుకు వచ్చి సుమారు నాలుగు దశాబ్దాలు అవుతున్నా, దళితులు అత్యంత ధైర్యంతో పోరాటాలు జరిపినా న్యాయస్థానాల్లో న్యాయం లభించడంలో మాత్రం తీవ్ర జాప్యం జరగడం గమనిస్తే, మనకున్న న్యాయ విధానమే ప్రశ్నార్ధకం అవుతున్నది. చట్టంపట్ల సామాన్య ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లే ప్రమాదం వ్యక్తమవుతున్నది. 

ఈ చట్టం క్రింద నమోదు అవుతున్న కేసులలో శిక్షలు పడుతున్న కేసుల సంఖ్య నామమాత్రంగా ఉండƒడాన్ని గమనించాలి. పైగా ఈచట్టం ఉపయోగించుకొని అమాయకులను వేధించే ప్రయత్నం జరుగుతున్నదనే ఆరోపణలు సైతం వింటున్నాము. ఈ చట్టం అమలుపై ఒక సమీక్ష జరుపవలసిన సమయం నేడు ఆసన్నమయింది. చుండూరు కేసు ను సుప్రీ కోర్టులో అప్పీల్‌ చేసే సమయంలో, ఈ చట్టాన్ని మరింత సమర్ధవంతంగా అమలు చేసి, దళితులలో మనో ధైర్యం, విశ్వాసం, అభయం కలిగించేందుకు అవసరమైన మార్పులు, చేర్పుల గురించి అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయాన్ని కోరే ప్రయత్నం కుడా చేయాలి. రాష్ట్ర హై కోర్టు ఈ కేసును కొట్టి వేసే సందర్భంగా- సాక్షుల కథనాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని, లేదా ఒకే విధంగా లేవని, సంఘటన జరిగిన స్థలం, నిందితుల గుర్తింపు వంటి వివరాలను సమకూర్చడంలో ప్రభుత్వం విఫలం అయిందని న్యాయమూర్తులు పేర్కొనడం గమనార్హం. అంటే కేసును పటిష్టంగా రూపొందించడంలో ఒక వైపు బాధితుల తరపున పోరాటం చేసున్న ఉద్యమకారులు, మరోవైపు ప్రభుత్వ యంత్రాంగం విఫలం అయినట్టు భావించవలసి ఉంటుంది. దళితులు, గిరిజనులు, ఇతర అణగారిన వర్గాలు దాడులకు, అన్యాయానికి గురయిన సమయంలో వారిపక్షాన కోర్టులలో కేసులను పటిష్ఠంగా నిర్వహించే వ్యవస్థను ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం, ఉద్యమాకారులు కలసి ప్రయత్నం చేయవలసిన అవసరాన్ని ఈ సంఘటన వెల్లడి చేస్తున్నది.

Surya Telugu News Paper Dated: 26/4/2014 


No comments:

Post a Comment