May 13, 2014
దేశవ్యాప్త సంచలనం చుండూరు నరమేథం
2007లో శిక్షలు విధించిన ప్రత్యేక కోర్టు
2014లో హైకోర్టు ద్విసభ్య బెంచ్‌చే రద్దు
జడ్జీల విచక్షణాధికారానికి ఉదాహరణ
స్పందించని రాజకీయ పార్టీలు
15 ఏళ్ళక్రితం కేసులో సాక్ష్యాలు కీలకం
బలమైన ప్రాసిక్యూషనూ అవసరమే
రాజ్యాంగపరంగా శాసన, కార్య నిర్వా హక, న్యాయశాఖలు ఏర్పాటయ్యా యి. వీటిలో శాసన, కార్యనిర్వాహకశాఖలు పరస్పరపూరకమైన అవినాభావ సంబంధం కలిగి తమ బాధ్యతలు తాము నిర్వహిస్తున్నాయి. కార్యనిర్వాహకశాఖపై శాసనశాఖ పూర్తి ఆధిప త్యాన్ని చలాయిస్తుం దనేది అందరికీ తెలిసినదే. శాసనవ్యవస్థ చేసిన చట్టాలను అమలు చేయడానికి తాను క్షేత్ర స్థాయిలో పనిచేస్తుంది. అందుకే పరోక్షంగా కార్యనిర్వాహక వ్యవస్థ శాసనవ్యవస్థకు అనుబంధంగా పనిచేస్తుంది. ప్రభుత్వమే కార్యనిర్వాహక బాధ్యతలను పర్యవేక్షిస్తుంది కనుక శాసనవ్యవస్థ ఇష్టాయి ష్టాలకు లోబడి పనిచేయాల్సి ఉంటుంది. కానీ న్యాయవ్యవస్థ వీటికి భిన్నంగా పూర్తి స్వతంత్ర ప్రతిపత్తి కలిగి పనిచేస్తుంది. దీనిపై శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల ప్రభావం కానీ, పర్యవేక్షణకానీ ఉండదు.
న్యాయవవస్థకుగల భిన్నమైన లక్షణాల్లో రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించడమే కాకుండా రాజ్యాంగ వ్యతిరేకమైన చట్టాలను శాసనవ్యవస్థ తయారు చేసినప్పుడు, లేదా రాజ్యాంగ హక్కులను పౌరులకు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమైనప్పుడు న్యాయస్థానాలు ప్రభుత్వాలను మందలించే అధికారాలను కలిగిఉంటాయి. రాజ్యాంగానికి రక్షణకర్తగా న్యాయవ్యవస్థ అప్రమత్తంగా ఉంటుంది. సాధారణంగా రాజకీయపార్టీలు తమ ప్రణాళికలను అమలుచేయడానికి ప్రభుత్వాలుగా ఏర్పడి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించడానికి ప్రయత్నిస్తాయి. ఇటువంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో న్యాయవ్యవస్థ రాజ్యాంగానికి ధర్మకర్తగా వ్యవహరిస్తుంది. న్యాయవ్యవస్థకు ఉన్న ప్రమాదకరమైన లక్షణాల్లో ఒకటి- న్యాయమూర్తులు తమ తీర్పులను ఇవ్వడంలో విచక్షణాధికారం కలిగి ఉంటారు. ఈ అధికారాన్ని తన పై న్యాయమూర్తి కూడా ఆక్షేపించడానికి లేదా తప్పుపట్టడానికి వీలులేదు. రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించడంలోకానీ, కేసులను విచారించి తీర్పులను ప్రకటించడంలో కానీ ఒక్కో న్యాయమూర్తి ఒకో విధమైన అభిప్రాయంతో ఉంటారు. ఈ అభిప్రాయాన్ని తప్పుపట్టడానికి ఇంకెవరికి ఏ అధికారం లేదు. క్షేత్ర స్థాయిలో ఉండే మెజిస్ట్రేట్ నుండి సుప్రీం కోర్టు ఛీప్ జస్టిస్ వరకు కూడా ఇదే విధమైన విచక్షణాధికారాన్ని కలిగి ఉంటారు. కాకపోతే మెజిస్ట్రేట్ ఇచ్చిన తీర్పును సవాలుచేస్తూ జిల్లా కోర్టుకు అప్పీలుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ అప్పీల్లో కూడా క్రిందికోర్టు ఇచ్చిన తీర్పు చెల్లదని పైకోర్టు తీర్పు ఇస్తే పైకోర్టు తీర్పు చెల్లుబాటు అవుతుంది.
ఆ విధంగా జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టులో అప్పీలు చేయవచ్చు. అక్కడ జిల్లాకోర్టు తీర్పును సమర్థించవచ్చు, లేదా రద్దుచేయవచ్చు. ఈ విధంగా క్రిందికోర్టులో ఇచ్చిన తీర్పుపై నిందితులు లేదా బాధితులు పైకోర్టులకు అప్పీలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది గానీ, ఆ జడ్జీలను వ్యక్తిగతంగా వ్యాఖ్యానించడానికిగానీ, వివరణ కోరడానికి గానీ, లేదా ఆ పదవినుండి తొలగించమని కోరడానికి గానీ అవకాశం లేదు. ఈ విచక్షణాధికారం ఒక్క న్యాయవ్యవస్థలోనే ఉంది. ఇంతటి మహత్తరమైన ఈ అధికారాన్ని- న్యాయమూర్తులు తమ మానసిక, కుల, మత, లింగ, ప్రాంత వివక్షలకు తావులేకుండా, రాజ్యాంగ సూత్రాలకు, న్యాయ ప్రక్రియకు లోబడి ఉపయో గించాల్సి ఉంటుంది. శాసనవ్యవస్థ ప్రజాస్వామ్యంలో ముఖ్యమైనది అయినప్పటికి ఈ విధమైన వెసులుబాటు కేవలం న్యాయమూర్తులకే ఇవ్వడం జరిగింది. విచక్షణాధికారం ఖచ్చితంగా సహేతుకంగా ఉండితీరాలి. వారి మానసికవైఖరులకు, వారి సైద్ధాంతిక భావజాలానికి అతీతంగా ఉండితీరాలి. న్యాయమూర్తుల తీర్పులపై అప్పుడప్పుడు రాష్ట్రంలోనే కాక దేశవ్యాప్తంగా కూడా తీవ్రమైన ప్రకంపనలు ఏర్పడుతున్నాయి. గత నెల 22న హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇందుకు మరోసారి దారితీసింది.
1991 ఆగస్టు 6న గుంటూరు జిల్లా చుండూరులో కమ్మ కులస్థులు ఎస్.సి. మాల కాలనీపై మూకుమ్మడిగా దాడులు చేసి, వారిని వేట కొడవళ్లతో, గొడ్డళ్ళతో నరికివేసి, శవాలను ముక్కలుగాకోసి తుంగభద్ర కాలువల్లో పడేసి, 8 మందిని హతమార్చి మారణకాండ సృష్టించారు. ఈ మారణహోమం అప్పట్లో జాతీయ స్థాయిలో సంచలనం రేపింది. దళిత ఉద్యమాలు తీవ్రం కావడంవల్ల కేంద్రప్రభుత్వం ఈ ఊచకోత ఘటనపై విచారించడానికి చుండూరులోనే ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసింది. ఈ కోర్టు సుదీర్ఘకాలం పాటు విచారణ జరిపి, 2007లో 21 మంది నిందితులకు జీవితఖైదు, 35 మంది నిందితులకు సంవత్సరం కారాగారశిక్ష విధిస్తూ 123 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసులో 8 మంది విగతజీవులు కాగా, ఉద్యమం నడిచే క్రమంలో ప్రత్యక్ష సాక్షుల్లో ఒకరు పోలీసు కాల్పుల్లో మృతి చెందారు. సుమారు 15 సంవత్సరాలపాటు ప్రత్యేక కోర్టు స్థానికంగా విచారణ జరపడాన్నిబట్టి, న్యాయస్థానాలు కేసుల విచారణలో ఏ విధంగా సమయాన్ని తీసుకుంటున్నాయో అర్థంచేసుకోవాలి. సాధారణంగా హత్యకేసులను సంవత్సరకాలం లోపే విచారణ జరుపుతారు.
ఘటన జరిగిన చుండూరులోనే ప్రత్యేకకోర్టు ఏర్పాటు చేసినప్పటికి 15 సంవత్సరాల కాలం పట్టిందంటే సాక్షులను, బాధితులను ఏస్థాయిలో బెదిరింపులకు గురిచేశారో ఊహించు కోవచ్చు. 2007లో ప్రత్యేక కోర్టు తీర్పు ప్రకటించడంతో బాధితులు కొంత న్యాయం జరిగిందని భావించారు కానీ, నిందితులే ప్రత్యేక కోర్టు తీర్పుపై హైకోర్టులో అప్పీలు చేశారు. హైకోర్టు గతనెల 22వ తేదీన ప్రత్యేక కోర్టు ఇచ్చిన 21 మందిపై జీవితఖైదు శిక్షను రద్దుచేస్తూ తీర్పును ప్రకటించింది. ఎల్. నర్సింహారెడ్డి, జి.ఎస్. జైస్వాల్‌ల ద్విసభ్య బెంచి వెలువరించిన ఈ తీర్పు యావత్ భారత
దళిత, ప్రగతిశీల ఉద్యమకారులను తీవ్ర కలవరానికి గురిచేసింది. సభ్యసమాజం చూస్తుండగా మూకుమ్మడిగా దాడులుచేసి 8 మందిని ఊచకోతకోసిన ఘటన మాత్రం చరిత్రలో కలిసిపోయింది.
ఈ ఘటన జరిగిన 23 సంవత్సరాలకు నిందితులందరూ నిర్దోషులేనని తీర్పు ఇవ్వడం వెనుక కారణాలేమిటో పరిశీలించాలి. న్యాయమూర్తులకు ఉన్న విచక్షణాధికారం ఏ స్థాయిలో తమ తీర్పుల్లో ప్రదర్శితమవుతుందో చెప్పడానికి ఈ తీర్పును ఉదాహరణగా తీసుకోవచ్చు.
ఈ తీర్పుపై ఏ రాజకీయ పార్టీ స్పందించక పోవడంపట్ల విచారించాల్సిన పనిలేదు. ఈ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు దళిత వ్యతిరేక పార్టీలే. ఈ తీర్పును నిరసిస్తూ రెండు మూడు నిరసన సభలు జరిగాయి. వాటిలో ఈ నెల 4న హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞానభవన్‌లో ఏర్పాటుచేసిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్‌స ఒకటి. దీనికి మీడియా ప్రతినిధులతో కలిపి కేవలం100 మంది వరకు హాజరయ్యారు. రాజకీయ పార్టీలే కాదు, దళిత ఉద్యమాలని లేదా కుల సంఘాలని చెప్పుకునే వేలాదిమంది నాయకులూ హాజరు కాలేకపోయారు. ఈ సమావేశంలో రెండు తీర్మానాలు చేశారు. 1. న్యాయమూర్తుల్లో ఒకరైన ఎల్. నర్సింహారెడ్డిని ఆ పదవినుండి తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం. 2. కుల నిర్మూలన కోసం దళిత విశాల ఐక్య వేదికలను ఏర్పాటుచేసి ఉద్యమించడం. ఇందులో మొదటి తీర్మానం ఆచరణయోగ్యమేనా?
హైకోర్టు జడ్జీలు రాష్టప్రతి ఆమోదముద్రతో నియమితులవుతారు. వారిని తొలగించడం రాష్టప్రతి ద్వారానే సాధ్యమవుతుంది. ప్రభుత్వాలకు ఆ అధికారంలేదు. కాకపోతే, వీరిని తొలగించడానికి పార్లమెంటులో అభిశంసన తీర్మానం చేయాల్సిఉంటుంది. ఉభయసభలు ఈ తీర్మానంచేసి రాష్టప్రతికి పంపిస్తే, ఆయన ఆ తీర్మానాన్ని ఆమోదిస్తూ జడ్జిని పదవీచ్యుతుణ్ణి చేస్తారు. ఈ తతంగం జరగాలంటే ఎంత సమయం పడుతుందో అర్థం చేసుకోవచ్చు. జడ్జీలు అవినీతికి పాల్పడినట్లు లేదా అసాంఘిక, అనైతిక చర్చలకు పాల్పడినట్లు ఖచ్చితమైన ఆధారాలుంటేనే అభిశంసన తీర్మానం ప్రవేశపెడుతారు. జడ్జీల తీర్పుల ఆధారంగా వారిపై అభిశంసన తీర్మానం చేసే అవకాశం లేదు.
జడ్జీల వ్యక్తిగత అభిరుచులు, వైఖరులు వారి తీర్పులను అంతర్గతంగా ప్రభావితం చేస్తాయనే విషయాన్ని ఎవరూ కాదనలేరు. కానీ ఆ మేరకు కోర్టు బయట ఎవరు వ్యాఖ్యానం చేసినా దాని ప్రభావం ఆ జడ్జీలపై గానీ ఆ కోర్టులపైగానీ పడదు. కేసు విచారణలో ఉన్నప్పుడు కోర్టులోగానీ బయటగానీ ఆ కేసు గురించి లేదా జడ్జీల వ్యక్తిగత విషయాల గురించిగానీ ఆరోపణలు చేస్తే అది కోర్టు ధిక్కారనేరం అవుతుంది. తీర్పు వెలువడింది కాబట్టి జడ్జిపై వ్యక్తిగత ఆరోపణలు, నిరసనలు చేస్తున్నారు కానీ- అవి తీర్పులను ఏ రకంగానూ మార్చలేవు. కేసుల విచారణలలో, తీర్పులలో వచ్చే బేధాలపట్ల సామాన్య ప్రజలు ఆశ్చర్యానికి లోనవుతుంటారు. ప్రజల మధ్యనే ఒక సంఘటన లేదా నేరం జరిగినప్పటికీ, ఆ కేసులో నిందితులు నిర్దోషులుగా ఎలా శిక్షనుండి తప్పించుకుంటారో వారికి అర్థంకాదు. అదే రకంగా కేసుతో సంబంధంలేని అమాయకులు కేసుల్లో శిక్షలకు ఎందుకు గురవుతారో కూడా వారికి అర్థంకాదు.
ఇందుకు ప్రధానమయినవి రెండు కారణాలు: 1. సాధారణంగా హత్య కేసులో- ముందుగా పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని, ఆయుధాలను సేకరించి, సాక్షులను విచారించి, కేసు దర్యాప్తుచేసి హతుల వివరాలు, నిందితుల వివరాలు, ఘటన జరిగిన నేపథ్యం, ప్రత్యక్ష సాక్షులు- వగైరాలను గుర్తిస్తారు. తర్వాత అభియోగ పత్రాలను కోర్టులో నివేదిస్తారు. పోలీసులు చేసే కీలకమైన బాధ్యత ఇది. ఈ చార్జిషీటులోనే కేసుకు సంబంధించిన కీలకమైన అంశాలన్నీ ఉంటాయి. సి.ఆర్.పి.సి. 161 - స్టేట్‌మెంట్‌లకు, కోర్టులోచెప్పే సాక్షాలకు పూర్తి సారూప్యతఉండేలా పోలీసులు జాగ్రత్త వహించాలి. సాక్ష్యం చెప్పేటపుడు ఘటన జరిగిన నేపథ్యాన్ని- ముందుది వెనుకాల, వెనుకది ముందు చెప్పడంవల్ల కేసు బలహీనమయ్యే అవకాశం ఉంటుంది. అందుకు సాక్షులకు పోలీసులు, ప్రభుత్వ న్యాయవాది అవగాహన కల్పించాలి. ఘటన జరిగిన ప్రదేశం, సమయం, ప్రత్యక్ష సాక్షుల సాక్ష్యాలు- కేసులో కీలకంగా తీర్పుకు కారణమవుతాయి. ఈ కోణంలో చూచినప్పుడు, 15 సంవత్సరాలలో పోలీసులు ఈ కేసులో దర్యాప్తు క్షుణ్ణంగా చేసితీరాలి. ఒకవేళ ఏదైనా లోపం జరిగిఉంటే దానిని ప్రత్యేక కోర్టులోనే సవరించాల్సి ఉంటుంది. 2. కోర్టులో ప్రాసిక్యూషన్ నైపుణ్యంగా నిర్వహించడం చాలా అవసరం. అభియోగాలను, ప్రత్యక్ష సాక్షుల సాక్ష్యాలకు సారూప్యత ఉండే విధంగా సాక్ష్యాన్ని ఇప్పించాలి. చాలా కేసుల్లో నిందితులు నిర్దోషులుగా బయటికి రావడానికి ప్రాసిక్యూషన్ విఫలం కావడం ప్రధాన కారకం.
ఇది క్రింది కోర్టుల్లో జరిగే లోపం. అప్పీలు కోర్టులో దీనిని సవరించే అవకాశం లేదు. ఈ కేసు పరంగా చూసినప్పుడు ప్రత్యేక కోర్టులో ప్రాసిక్యూషన్ వైపున ఏదైనా లోపం జరిగిందా, ఏ విషయంలోనైనా నిర్లిప్తంగా వ్యవహరించడం జరిగిందా- పరిశీలించాలి. ఈ రెండు కారణాల్లో ఏదీ లోపం లేదనుకున్నపుడు హైకోర్టు జడ్జీలు దళిత వ్యతిరేకమైన, ప్రజా వ్యతిరేకమైన, సహజ న్యాయవ్యతిరేకమైన తీర్పును ఇచ్చినట్లుగా భావించవచ్చు. ఒకవేళ ఈ జడ్జీలు తమ తీర్పులో న్యాయప్రక్రియకు వ్యతిరేకమైన లేదా విచక్షణాధికారంలో తమ మానసిక, కుల, మత, లింగ, ప్రాంతీయ వివక్షలకు ప్రాముఖ్యత ఇచ్చారని రూఢిగా భావిస్తే, అప్పుడు సుప్రీం కోర్టులో ప్రభుత్వమే హైకోర్టు తీర్పుపై అప్పీలుకు పోవాల్సి ఉంటుంది. ఈ కేసులో తీర్పు అంశాలను ఉద్యమకారులకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. దళిత వ్యతిరేకమైన ఈ తీర్పు రావడానికి ప్రధాన కారణమేమిటో గుర్తించినప్పుడు, ఉద్యమలక్ష్యం బోధపడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేయవలసిన ఆవశ్యకతఉంది.తీర్పు ప్రతులను అధ్యయనం చేసి, సుప్రీం కోర్టులో అప్పీలు చేసేలా ప్రభుత్వాన్ని వేగిరపరిచేందుకు ఉద్యమం తోడ్పడాలి.
Surya Telugu News Paper Dated: 16/05/2014
No comments:
Post a Comment