కారంచేడు, చుండూరు సంఘటనలప్పుడు నడిచిన దళిత ఉద్యమాలు ఇపుడు నడిచే పరిస్థితి లేదు. విస్తృతకోణంలో పరిశీలించకుండా, ప్రపంచ పోకడల్ని పట్టించుకోకుండా, కేవలం దళితుల సమస్యలపై మాత్రమే ఆలోచించినా, పథకాలు వేసినా పెద్దగా మార్పు ఉండబోదు. మారుతున్న పరిస్థితులకి అనుగుణంగా ఉద్యమ దశ, దిశలను మార్చకుండా పోతున్నాం కూడా.
అక్షరాస్యత పెరిగి, పేదరికం తరిగి అన్ని వర్గాల, కులాల వారందరూ ముందుకు పోతున్నారు అని అకాడెమిక్ పరిశోధనలు వస్తున్న నేపథ్యంలో మన ముందు కనిపిస్తున్న మరికొన్ని నిజాల గురించి మాట్లాడుకోవాల్సి ఉంది. రోజూ దళితులపై ఎక్కడో ఒకచోట ఏదో ఒక రూపంలో హింస జరుగుతూనే ఉంది. హత్యలు, అత్యాచారాలు, ఆక్రమణలు, దురాక్రమణలు ఇందు లేదు అన్న విధంగా నేరాలు పెరుగుతున్నాయి. కాని ప్రజలలో, దళిత నేతలు, సంఘాలలో కూడా ఒక నిర్లిప్తత చోటుచేసుకొందో ఏమో ఇప్పుడు అవి ఒక సాధారణ వార్తలుగా మారిపోయాయి. అపుడపుడు అక్కడో ఇక్కడో కాస్త హడావిడి కనిపించినా మొత్తానికి పరిస్థితిలో పెద్దగా మార్పు ఏమీ లేదనే చెప్పుకోవాలి.
ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పు దళిత ఉద్యమాలకు ఒక పెద్ద సవాల్ విసిరింది. 1991 చుండూరు దళితుల ఊచకోతపై వెలువడిన తీర్పు అసలు ఈ దేశంలో దళితులకు ప్రభుత్వాలు, మీడియా, న్యాయప్రక్రియల వల్ల ఏమన్నా న్యాయం జరుగుతుందా అన్న ప్రశ్నని కూడా ప్రజల ముందుకు తీసుకువచ్చింది. ఏడేళ్ల క్రితం చుండూరు కేసులో ప్రత్యేక న్యాయస్థానం 21 మందికి జీవిత ఖైదు, 35 మందికి ఒక సంవత్సరం కఠిన కారాగార శిక్ష విధించి సంచలనాత్మక, చారిత్రాత్మక తీర్పు ఇచ్చిందని సంతోషించిన వారందరూ ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. సాక్ష్యాలు లేవు- లాంటి కారణాలే దేశంలోని ఇతర ప్రాంతాలలో జరిగిన హత్యాకాండలకి కూడా ఆపాదిస్తున్నారు. నేరం జరిగిన ఎన్నో ఏళ్లకి గాని తీర్పు వచ్చే పరిస్థితి వుంటే ఇక ప్రజలు న్యాయస్థానాలకి పోవడం పట్ల ఆసక్తి చూపుతారా?
ఇక లక్ష్మిపేట భూమి పోరాటంలో దళితులపై జరిగిన అమానవీయ దాడిలో ఇంకా న్యాయం పూర్తిగా జరగలేదు. అదే విధంగా హర్యానాలో భగన గ్రామంలో ఒక 100 గజాల ప్రభుత్వ భూమిని దళితుల ఇండ్ల జాగాకి అడిగినందుకు అక్కడి జాట్, ఆధిపత్య కులస్తులు దళితులని గ్రామ బహిష్కరణ చేశారు. అప్పటి నుంచి అక్కడ దళితులూ ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఆ తరువాత పోయిన సంవత్సరం నుంచి హర్యానాలో వరుసగా దళిత మహిళలపై అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఎందుకో కాని నిర్భయకి వచ్చినంత గుర్తింపుకు ఈ దళిత మహిళలు నోచుకోలేదు. సమాజం భగ్గున మండలేదు. ఈ చర్చ ముగియకముందే హర్యానాలో అదే ఊర్లో (భగన గ్రామం, హిసార్ జిల్లాలో) నలుగురు దళిత మైనర్ అమ్మాయిలపై జాట్‌ల అత్యాచారం జరిగింది. ఈ సంఘటనకి మద్దతుగా హర్యానా గ్రామ దళితులూ, ప్రజాసంఘాలు, ఎన్జీవోలు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఇపుడు కూడా ఆందోళన చేస్తూనే ఉన్నారు. వివరాల్లోకి వెళితే, ఈ ఏడాది మార్చి 23 రాత్రి 8 గంటలకు నలుగురు మైనర్ అమ్మాయిలు నీళ్లకోసం తమ పొలాల వద్దకి పోయినప్పుడు ఐదుగురు మగవాళ్లు కారులో వచ్చి వాళ్లని కిడ్నాప్ చేసి, డ్రగ్స్ ఇచ్చి, రేప్ చేశారు. 170 కిలోమీటర్ల దూరంలో ఉన్న భటిండా రైల్వేస్టేషన్‌లో పడేసి పోయారు. ఈ విషయం తెలియని ఆ నలుగురు అమ్మాయిల తండ్రులు మార్చ్ 24న ఆ వూరి పెద్ద రాకేశ్‌కి ఫిర్యాదు చేసి, మిస్సింగ్ కేసు నమోదు చేయమంటే ఆయన నిరాకరించారు.
ఆ తరువాత వారు ఒత్తిడి చేయడంతో ఆ అమ్మాయిలు ఎక్కడ ఉన్నారో తనకి తెలుసని చెప్పి భటిండా రైల్వే స్టేషన్‌కి తీసుకుపోయాడు. అతనితో పాటు వీరేంద్ర అనే ఆయన బంధువు కూడా ఉన్నాడు. స్టేషన్‌లో అచేతనంగా పడి ఉన్న అమ్మాయిలను తీసుకుని వస్తుండగా రాకేశ్, ఆ అమ్మాయిలని ఈ విషయం బయట ఎక్కడా చెప్పొద్దని, పోలీసులకు కూడా చెప్పొద్దని బెదిరించాడు. ఎంత బెదిరించినా అమ్మాయిల తల్లిదండ్రులు వినకుండా మార్చి 25న హిసార్ ప్రభుత్వ హాస్పిటల్‌లో అమ్మాయిలకు వైద్య పరీక్షలు నిమిత్తం తీసుకుపోతూ ముందు హిసార్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. హాస్పిటల్‌లో రాత్రి 11 గంటల వరకు వారిని పట్టించుకోకుండా అక్కడి వైద్య సిబ్బంది ఆలస్యం చేసి రాత్రి కేవలం ఒక్క అమ్మాయికి పరీక్ష చేసి, మిగిలిన వారికి మరుసటి రోజు అంటే 26న మధ్యాహ్నం 1.30 వరకు చేసినారు. బాధితుల కథనం ప్రకారం పోలీసు వారు సహాయం చేయకపోవడం సరి కదా ఇంకా ఆలస్యం చేసారని ఆరోపించారు. వైద్య పరీక్షల అనంతరం, పోలీస్ ఆఫీసర్ అమ్మాయిలను తీసుకుని మెజిస్ట్రేట్ ఇంటి వద్ద వారి స్టేట్‌మెంట్ రికార్డ్ చేసి అక్కడనే కుండపోత వర్షంలో వదిలేసిపోయారు. ఆ తరువాత పోలీసులు లలిత్ పంగల్, సుమీ పంగల్, ధర్మవీర్ పంగల్, సందీప్ పంగల్‌లను అరెస్ట్ చేశారు. దీని వెనుక వూరి పెద్ద రాకేశ్, వీరేంద్ర ఉన్నారని అమ్మాయిలూ, తల్లిదండ్రులు చెప్పినా కూడా వారిని నేరస్థులుగా నమోదు చేయలేదు. జాట్ కులానికి చెందిన వారు కాబట్టి వారిని అరెస్ట్ చేయలేదని వారు ఆరోపిస్తున్నారు. ఇక ఇక్కడి నుంచి కథ మామూలే. న్యాయం కోసం సుదీర్ఘ పోరాటం మొదలైంది.
కారంచేడు, చుండూరు సంఘటనలప్పుడు నడిచిన దళిత ఉద్యమాలు ఇపుడు నడిచే పరిస్థితి లేదు. పూర్తిగా మధ్యతరగతి భావనలు విస్తరించి ఉన్న సమాజం బయట, లోపట ఒకవైపు అయితే, ప్రపంచీకరణ పలు విధాలుగా దళిత సమాజాన్ని ప్రభావితం చేస్తుంది అన్నది కూడా వాస్తవమే. దళిత ఉద్యమాలు అని అనడం కంటే ప్రోగ్రాములు, పథకాలు అనడం సరిపోతుంది. ఇపుడు దళితుల పరిస్థితి చాలావరకు ఎన్జీవోల చేతిలో ఉంది. వారు అత్యద్భుతంగా బాధితులని వివిధ వేదికల మీద ఏడిపించి, లీటర్లకొద్దీ కన్నీరు కార్పించి, మార్కెట్ వస్తువులని చేసి, అందమైన ప్రాజెక్టులని తయారు చేసి దేశ విదేశాలలో బాగానే సరుకును అమ్మగలుగుతున్నారు. కాని దానివల్ల దళిత, బడుగు బలహీన వర్గాలలో మార్పు ఏమో కాని సంస్థల అధిపతులు, పరిశోధనకారులకి, రచయితలకి విపరీతమైన పేరు, అంతో ఇంతో ఆర్థికంగా వెసులుబాటు మాత్రం జరుగుతుంది అని ఒక పెద్ద మనిషి అనడం సత్యదూరం కాదేమో. ఇక దళితోద్ధారణకి బయటి దేశాల నుంచి అత్యధికంగా నిధులు వస్తున్నట్టు లెక్కలు చెపుతున్నాయి. మరి వాటి వల్ల ఏమి మార్పు జరిగింది అని ఒక యువ ఎన్జీవోని అడిగితె, 'ఏమి లేదు మేడం! ఇవి జీవనోపాధికి మాత్రమే, ఇంకా వంద సంవత్సరాలు ఈ విధంగా జరిగినా మార్పు మాత్రం సాధ్యపడదు' అన్నాడు. అంటే ఎన్జీవోల వల్ల డాక్యుమెంటేషన్ మాత్రం జరుగుతుంది.
కొన్నిచోట్ల కొద్ది మార్పులు లేకపోలేదు కాని అవి దళితుల మౌలిక సమస్యలని మార్చడం కాని, బయటి సమాజాన్ని ప్రభావితం చేయడంలోగాని పూర్తిగా విఫలమైనాయని అధికశాతం ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అంబేద్కర్, యువజన సంఘాలు విగ్రహ ప్రతిష్టాపనలు, పార్టీకొక సంఘంగా విడిపోయినాయని ఒక జర్నలిస్ట్ అభిప్రాయం. ఇంకా జిల్లా ఎస్టీ ఎస్సీ కమిటీలు అన్నీ కూడా అగ్రకుల పైరవీల ద్వారా వచ్చినవే, సెటిల్మెంట్ సంఘం అని కూడా అంటారంట. ఇంకా మేధావులు నరకాసుర జయంతి, గొడ్డుమాంసం, పుస్తక చర్చలలో తలమునకలై ఉన్నారు. అది ఒక సాంస్కృతిక రూపమే అనుకున్నా 90 శాతం దళిత జీవితాలకు సంబంధించిన రోజువారీ బతుకు సమస్య మాత్రం కాదని చెప్పగలం. రాజకీయ వ్యవస్థ పూర్తిగా దళితులని లబ్ధిదారులుగా మాత్రమే చూసి వారికి రెండు గొర్రెలు, బర్రెలు, ఇందిరమ్మ ఇల్లు, బోర్లు, అంబేద్కర్ జయంతి, బాబు జగ్జీవన్‌రామ్ జయంతి జరిపితే చాలా ఎక్కువని భావిస్తున్నాయి. అంతో ఇంతో కొంతమంది పెద్దమనుషులు కలిసి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్‌ని తీసుకువచ్చారు. దాని సంగతి ఏందో, ఎన్ని డబ్బులు వచ్చాయో ఎవరికీ తెలిసే అవకాశం లేదు.
విస్తృతకోణంలో పరిశీలించకుండా, ప్రపంచ పోకడల్ని పట్టించుకోకుండా, కేవలం దళితుల సమస్యలపై మాత్రమే ఆలోచించినా, పథకాలు వేసినా పెద్దగా మార్పు ఉండబోదు. ఇంకొకవైపు కంటికి కనపడకుండా, విద్య, వైద్యం ఉపాధి పూర్తిగా ప్రైవేట్ పరం అవుతున్న సంగతి ఉద్యమాలు పెద్దగా పట్టించుకోవట్లేదు కాని దీని వల్ల నష్టపోయేది 90 శాతం దళితులూ, ఆదివాసీలే. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు పూర్తిగా మూతపడే పరిస్థితి కనపడుతున్నా ప్రైవేట్ విద్యకు పాకులాడుతున్నాం కాని నాణ్యత గల ఉచిత, ప్రభుత్వ విద్య మన హక్కు అని మరిచిపోతున్నాం. ఇదే బలహీనతని ఆధారంగా తీసుకుని రీఎంబర్స్‌మెంట్ వచ్చి విద్యా విధానాన్ని మరింత అధ్వాన్నం చేసింది. స్టేట్ యూనివర్సిటీలలో 90 శాతం ఎస్సీ బీసీలు ఉన్న దగ్గర ఎటువంటి సదుపాయాలూ లేవు, మేధోపరంగా ఎదిగే అవకాశాలు అసలు కనపడట్లేదు.
దళితుల అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడుతున్న వ్యక్తులు, శక్తులు అక్కడో, ఇక్కడో ఉన్నా కూడా ఇపుడున్న పరిస్థితుల్లో ఐక్య సంఘటనల పట్ల అనుమానాలు వ్యక్తపరుస్తూ, ఒక బలమైన ఉద్యమాన్ని నిర్మించడంలో విఫలమౌతున్నారు. ఒకవేళ ఉద్యమాలు చేద్దామన్నా కూడా దళిత దళారులను అగ్రకులాలు తమ గుప్పిట్లో పెట్టుకుని, పదవులు, డబ్బు ఆశ చూపించి అణచివేస్తున్న వైనం నిజంగా కలవరపెడుతున్న వాస్తవం. మారుతున్న పరిస్థితులకి అనుగుణంగా ఉద్యమ దశ, దిశలను మార్చకుండా పోతున్నాం కూడా.
పోలీసు రికార్డ్‌లలో దళితులపై నేరాలకు అనేక కారణాలు చూపించినా ఫీల్డ్ అనుభవాలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. అత్యాచారాలు, హింసలు, బహిష్కరణ, చేతబడి హత్యల పేరుతో జరుగుతున్న నేరాల వెనుక భూమి అనే అంశం బలంగా ఉంది అన్న విషయం కూడా మనం విస్మరిస్తున్నాం లేదా చూడడానికి నిరాకరిస్తున్నాం. అక్కడో ఇక్కడో వనరులు, భూమి మీద హక్కు గురించి మాట్లాడితే అది లెఫ్ట్, మావోయిస్ట్‌కి సబంధించిన అంశంగా సమస్యను పక్క దారి పట్టిస్తూ, మూలన పెడుతున్నారు. నిజానికి భూమి ఈ రోజుకి కూడా గ్రామాలలో గౌరవ చిహ్నమే. అధికారం, హక్కులు కూడా భూములు ఉన్న దగ్గరే భరోసాగా ఉన్నాయి. ఆత్మస్థైర్యం కూడా ఎక్కువే. అసలే 80 శాతం ప్రజలకి భూమి లేదు అంటే ఆ ఉన్న భూమిని కూడా ప్రాజెక్టుల పేరుతోని, అభివృద్ధి పథకాలతోని, సెజ్జులు, ఇండస్ట్రియల్ పార్కుల పేరుమీద ఉన్న ఆ కాస్త భూములని అధికారికంగానే ప్రభుత్వాలు గుంజుకుని వీధిన పడేస్తున్నాయి. హిందూ రాజ్యాలు, ప్రభుత్వాలు భూమి విషయం పక్కన పెట్టడంలో కూడా ఉన్న కుట్రలను మనం అంచనా వేయగలగాలి. ఎక్కడో అత్యాచారం, హత్యలు జరిగితే తప్ప దళిత ఉద్యమ నాయకులు మాట్లాడే పరిస్థితి లేదు.
డా.అంబేద్కర్ స్పష్టంగా దళితులూ బానిసత్వం నుండి బయటకి రావాలంటే ముఖ్యంగా హిందూ మతంలోంచి బయటపడాలి అని, ఒక్క హిందూ మతమే మనుషులని వర్గాలుగా విభజిస్తుంది అని, హిందూ మతంలో ఉన్నంత కాలం అంటరానితనం సమసిపోదని పిలుపునిచ్చిన విషయం ఎప్పుడో మరిచినట్టున్నాం. అంతే కాకుండా ఆ విషయం పక్కకు పెట్టి మోడీ కాళ్ల దగ్గర అధికారం కోసం అర్రులు చాస్తున్నారు. మోడీ దగ్గరకి పోవడం అంటే మన సమాధులు మనం తవ్వుకోవడం అన్న విషయాన్ని కప్పిపెడుతున్నారు. అంతేకాకుండా అంబేద్కర్ చెప్పిన మూడు బలాలు 1. మాన్ పవర్ 2. మనీ 3. మేధో సంపత్తి. వీటన్నింటికి ఇపుడు ఉన్న రాజకీయ వ్యవస్థకి సంబంధం ఉన్నదని గ్రహించాలి. ఇవన్నీ మనం కూడగట్టుకోవాలంటే మన శక్తి సరిపోదు కాబట్టి మనం తప్పకుండా బయట నుండి సపోర్ట్ తీసుకోవాలి అని కూడా చెప్పడం జరిగింది. కాని ఇపుడు కొంతమంది మేధావులు బహుజన భజరంగ్‌దళ్ లాగా కులాన్ని వ్యతిరేకిస్తున్నాం అన్న పేరుతోని మరింత కులవాదులుగా మారుతున్నారు.
మతం మార్పిడి, వర్గ నిర్మూలన, భూమి, వనరులపై అధికారం, విద్యపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలన్న ముఖ్య అంశాలని పక్కన పెట్టి, ప్రభుత్వ పథకాల కోసం అర్రులు చాస్తే ఇంకా కనుచూపు మేరలో ఈ పరిస్థితి మారదు. రిఫార్మ్ కాదు రివల్యూషన్ అన్న అంబేద్కర్ మాటలను మళ్లీ ఒక్కసారి చూసుకొని బోధించు, సమీకరించు, పోరాడు అన్న సిద్ధాంతాన్ని మళ్లొకసారి ఉద్యమ శక్తులతో కలిసి నిర్వచించి, నైపుణ్యంతో, కుల, వర్గ దృక్పథాలతో కలిసి వచ్చే వారందరితో విశాల ప్రాతిపదికన ఉద్యమాలు నిర్మించగలిగితే కొంత మార్పు సాధ్యమేమో చూడాలి.
సూరేపల్లి సుజాత
అధ్యాపకులు, శాతవాహన యూనివర్సిటీ
Andhra Jyothi Telugu News Paper Dated: 09/05/2014
No comments:
Post a Comment