Sunday, August 3, 2014

ప్రవీణ్‌కుమార్ ఉదంతపు ప్రశ్నలు - టంకశాల అశోక్


దళితుడైన తెలంగాణ ఐపిఎస్ అధికారి ప్రవీణ్‌కుమార్‌కు గురుకుల పాఠశాలల డైరెక్టర్ హోదాలో అక్కడి ఉపాధ్యాయ సంఘాలతో ఏర్పడిన సమస్య, ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు జోక్యంతో సమసిపోయినట్లు వార్తలు సూచించాయి. అది నిజంగా సమసిపోయినట్లయితే సంతోషించవలసిందే. కాని అట్లా జరిగిందా అన్నది ఒక ప్రశ్నయితే, ఇటువంటి విషయాలలో ముడిబడి ఇతర ప్రశ్నలు కొన్ని ఉంటాయి. వాటిని చర్చించుకోవటం అవసరం.
ఈసారి స్కూళ్లు తెరిచిన తర్వాత సుమారు రెండు వారాలు గడిచినా గురుకుల పాఠశాలల్లో పిల్లల హాజరీ నాల్గవ వంతుకు మించలేదు. దళిత విద్యార్థుల విషయంలో అట్లా జరగటం చూసి ఆందోళన చెందిన ప్రవీణ్‌కుమార్ ఆ విషయమై టీచర్లను మందలించి, అందుకు బాధ్యులనుచేస్తూ వారి వేతనాలను ఎందుకు కత్తిరించకూడదో వివరించాలంటూ నోటీసు జారీచేసారు. దానితో వివాదం తలెత్తింది. ఎక్కువ వివరాలలోకి వెళ్లకుండా క్లుప్తంగా చెప్పుకోవాలంటే, విద్యార్థులు దళితులు, వారి బాగుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఆరంభించిన గురుకుల పాఠశాలలు అవి. డైరెక్టర్ అయిన అధికారి దళితుడు. పిల్లలు రెండువారాలైనా స్కూళ్లకు రాకపోవటం ఆయనకు సహజంగానే ఆందోళన కలిగించింది. కనుక చర్యలు తీసుకోవాలనుకున్నారు. రెండవ వైపునుంచి చూస్తే, విద్యార్థులు దీర్ఘకాలిక సెలవుల తర్వాత ఆలస్యంగా రావటం ఎప్పుడూ జరిగేదేనన్నది ఉపాధ్యాయ సంఘాల వాదన. అది అవాంఛనీయమేనని వారూ అంగీకరిస్తున్నారు. అయితే అందుకు తమ జీతాలను కత్తిరించబూనటమేమిటన్నది వారి ప్రశ్న.
ఇట్లా మొదలైన వివాదంలోకి అసలు విషయంతో నిమిత్తం లేని వేర్వేరు అంశాలు వచ్చి చేరాయి. సమస్య చిలికి చిలికి గాలివానగా మారింది. ప్రవీణ్‌కుమార్ దళితుడు గనుక ఉపాధ్యాయులు, వారి మద్దతుదారులు కులదృష్టితో ఇదంతా చేస్తున్నారని, దళిత విద్యార్థుల పట్ల కూడా వారికి శ్రద్ధలేదన్న మాటలు ఇటునుంచి రాగా, సదరు అధికారి ఐపిఎస్ అయినందున పోలీస్ లక్షణాలతో వ్యవహరిస్తున్నారని, లోగడ తెలంగాణ ఉద్యమం, ఇతర ఉద్యమాల విషయంలోనూ అట్లాగే ప్రవర్తించాడని, ఈ తరహా లక్షణాలకు కులంతో సంబంధం ఏమిటని అవతలివారు వాదించారు. ఇది ఎంతటి చిక్కుముడో ఎవరైనా గ్రహించవచ్చు. దానిని అట్లాగే వదిలివేసినట్లయితే పరిస్థితి బహుశా చేయిజారి ఉండేది. ఆ మాటను గ్రహించి కావచ్చు ముఖ్యమంత్రి జోక్యంచేసుకుని రెండువైపులా మాట్లాడి సర్దుబాటుచేసారు. కాని బయట చర్చ ఆగలేదు. ఉభయ శిబిరాల మధ్య అవగాహనలు పెరగలేదు. సమస్య వౌలిక రూపంలో పరిష్కారంకాలేదు. ఈ వ్యాసం రాయటానికి కారణం అదే. వాస్తవానికి ఈ తరహా సమస్యలు, చర్చలు గతంలో ఉమ్మడి రాష్ట్రంలోనూ తలెత్తుతుండేవి. అధికార వ్యవస్థలోనే గాక, ఆ వ్యవస్థకు బయటి సమాజంలోనూ కన్పించేవి. ఇప్పుడు రాష్ట్ర విభజన అనంతరం మొదటి ఉదంతం తెలంగాణలో చోటుచేసుకున్నా మునుముందు అక్కడనే మరిన్ని గాని, రెండవవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోగాని ఇటువంటివి జరగబోవని ఎవరూ చెప్పలేరు.
అందువల్ల ఇది జాగ్రత్తగా ఆలోచించి చర్చించుకోవలసిన విషయమవుతున్నది. ఇందుకు పరిష్కారం పలానా అని ఇక్కడ చెప్పబోవటం లేదు. కాని ఇటువంటివి ‘అందరూ’జాగ్రత్తగా ఆలోచించి చర్చించుకోవలసిన విషయాలంటూ ఒక అస్పష్టమైన జనరల్ వ్యవహరణా సూత్రాన్ని మాత్రం చెప్పి ఊరుకోవలసి వస్తున్నది. అంతకన్న ఎక్కువ ముందుకు వెళ్లటం సమస్య. ఎంత నిష్పక్షపాతమైన వైఖరి తీసుకున్నా అటునుంచో, ఇటునుంచో ఒక రంగునద్దే పరిస్థితి మొదటినుంచీ ఉంది. ఆ కారణంగా ప్రజాస్వామిక చర్చ అన్నది స్వేచ్ఛగా జరగకుండా కుంచించుకుపోతున్నది. ఇది అంతిమంగా ఇరువర్గాలకు, ప్రజాస్వామిక విలువలకు, దీర్ఘకాలిక సామాజిక పురోగతికి హానికరమవుతుంది. ఒక నిర్దిష్ట వివాద సందర్భంలో ఒకరిదో, మరొకరిదో పైచేయి కావచ్చుగాక. కాని అది నిజమైన అర్థంలో ఎవరూ సంతోషించలేనిదే. ఎందుకంటే ఇరువురికీ హానికరమే గనుక. ఇక, పరిమిత స్థాయిలోనైనా కొంత ఆలోచన ఇక్కడ చేయక తప్పదు. ఈ తరహా సమస్య తెలంగాణలో తలెత్తటం, అదికూడా కొత్త రాష్ట్రం ఏర్పడిన కొన్ని వారాలలోనే జరగటం విచారాన్ని కలిగిస్తున్నది. తెలంగాణ చిరకాలంగా వివిధ ఉద్యమాలు, చైతన్యాల సమాజం. వాటి ప్రభావం ఏదో ఒక స్థాయిలో లేని వర్గమంటూ అక్కడ లేదు. అందుకది దేశవ్యాప్తంగా గుర్తింపుపొందింది. ఇది ఒకటికాగా, దశాబ్దకాలానికి పైగా సాగిన ఈ విడత ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఈ అన్నివర్గాల ప్రజలు క్రియాశీలంగా పాల్గొన్నారు. కలిసి పాల్గొన్నారు. ఉద్యమాలు కొత్త అవగాహనలను కలిగించి, కొత్త విలువలను కూడా సృష్టిస్తుంటాయి.
అటువంటి స్థితిలో ప్రవీణ్‌కుమార్ వర్సస్ ఉపాధ్యాయుల వివాదం ఎందుకు తలెత్తింది? ఒకవేళ తలెత్తినా ఉభయులు కలిసి ఎందుకు పరిష్కరించుకోలేకపోయారు? ఆ పని చేయకపోగా తమ మాటలు, చేతలతో వివాద పరిధిని విస్తరించి మరింత జటిలం ఎట్లాచేసారు? అవగాహనలు, కొత్త చైతన్యాలు, విలువలు ఎవరికి లోపించినట్లు? లేక ఇరువురికీనా? తెలంగాణలో సామాజిక సంబంధాలలో, అధికార యంత్రాంగానికి- సిబ్బందికి మధ్య సంబంధాలలో కొత్త విలువలు రావాలి. సమస్యల పరిష్కారం (కాన్‌ఫ్లిక్ట్ రిజల్యూషన్)లో సంబంధిత వర్గాలన్నీ ఒక కొత్త సంస్కృతిని పెంపొందించాలి. ‘బంగారు తెలంగాణ’, ‘తెలంగాణ నిర్మాణం’అనే దృక్పథాలలో (కానె్సప్ట్) ఆర్థికమైన వస్తుపర (మెటీరియల్) అభివృద్ధికే కాదు. విలువలపరమైన అభివృద్ధికి కూడా చోటు ఉండేట్లు సకలజనులూ జాగ్రత్తపడకపోతే అది నిజమైన బంగారు తెలంగాణ ఎంతమాత్రం కాబోదు. అది మెటీరియలిస్టు ‘బంగారు లోహపు తెలంగాణ’ అయితే కావచ్చు గాని, ‘బంగారు విలువల తెలంగాణ’ కాగల అవకాశం ఉండదు. ఇది అందరూ గుర్తిస్తారని ఆశించాలి.
ప్రవీణ్‌కుమార్ వర్సస్ ఉపాధ్యాయుల తరహా సమస్యలు ఇది మొదటిసారికాదని పైన చెప్పుకున్నాము. వీటి విషయంలో ముందుగా అందరూ స్వయంగా తమలోని కొరతలను ఎటువంటి భేషజాలు, దాపరికాలు లేకుండా ఒప్పుకోవాలి. ఈ విధమైన వివాదాలు, వాటికి మూలం లో అండర్ కరెంట్స్‌వలె ఉండే ధోరణుల పరిష్కారానికి అది ముందస్తు షరతు వంటిది. ఏమిటా కొరతలు? మాటలెన్ని మాట్లాడినా సమాజంలో అధిక సంఖ్యాకులకు దళితుల పట్ల చిన్నచూపు ఉందన్నది వాస్తవం. ఇందుకు చదువుకున్నవారు, పట్టణవాసులు, నాగరికులమనుకునేవారు, రకరకాల ఉద్యమాలలో పాల్గొనే వారినుంచి ఆఖరుకు కమ్యూనిస్టుల వరకు కూడా మినహాయింపులు లేవు. ఆ బేసిక్ ఇన్‌స్టింక్ట్ వంటివి సూటిగానో, ముసుగులోనో వ్యక్తమవుతాయ. నిజమైన రీతిలో మినహాయింపు అయినవారు కొద్ది శాతంలోనే ఉన్నారు. ఇది నేను ఇన్ని దశాబ్దాలలో స్వయంగా గమనించిన మీదట చెప్తున్న మాట. మరొకవైపు దళితులలో ఈ స్థితి పట్ల సహజంగానే, న్యాయమైన రీతిలోనే తీవ్రమైన నిరసన ఉంది. అది ప్యాసివ్‌గానో, యాక్టివ్‌గానో తిరుగుబాటుగా వ్యక్తమవుతున్నది. అదే సమయంలో, ఈ కోణంతో నిమిత్తం లేని అంశాలకు కూడా దానిని జోడించి మాట్లా డే ధోరణి కూడా కన్పిస్తుంది. అది అణచివేత, పీడననుంచి అందుకు స్పందనగా వచ్చే అఫెన్సివ్ లక్షణం కావచ్చు. కనుకనే అందులో సాధారణమైన సమదృష్టికి ఇర్రేషనల్‌గా తోచే ఎలిమెంట్ ఉండవచ్చు. ఆ విధమైన తర్కంతో అటువంటి స్పందనలను జస్టిఫై చేయటం ఒక స్థాయిలో మనం చూస్తున్నదే. కాని ఇది ఎదుటివారిని ఆలోచింపజేసి, తమ పొరపాటును గుర్తించి సరిదిద్దుకునే విధంగా ప్రేరేపిస్తుందా? చర్చించవలసిన విషయం.
ఆ విధమైన దీర్ఘకాలిక క్రమాలను (ఒకవేళ అట్లా జరుగుతుందనుకున్నా) అట్లుంచితే, యధాతథంగా, తమవద్ద ఒకవేళ కొరతలు ఉన్నప్పటికీ వాటిని వదులుకోవటం గాక, జనరల్ పీడన కోణాన్ని దానితో నిమిత్తం లేని సందర్భాలకు జోడించటం మరొక కొరత అవుతూ వస్తున్నది. ఎస్సీ చట్ట దుర్వినియోగం విమర్శ వస్తున్నది అందుకే. నిరసనలలోని అవాంఛనీయ ఉప ఉత్పత్తి ఇది.ఇరువర్గాల వైపున కనిపించే ఈ పరిస్థితి మూలంగా సమస్యలు పరిష్కారం కాకపోవటం, సంబంధాలు సవ్యంగామారకపోవటం, సమాజం ప్రజాస్వామికం, నాగరికంగా మారకపోవటం (ఇవి వౌలిక ఆర్థిక, సామాజిక సంబంధాలతో నిమిత్తం గలవి) సరేసరి కాగా, ప్రస్తుత వివాదాల వంటి వాటిని స్వేచ్ఛగా చర్చించుకునే ప్రజాస్వామిక అవకాశం కుంచించుకు పోతున్నది. స్వల్పకాలంలో కాన్‌ఫ్లిక్ట్ రిజల్యూషన్ లేదు, దీర్ఘకాలంలో పరివర్తనా లేదు.కనుక ఈ రకరకాల ప్రశ్నల గురించి అందరూ ఆలోచించటం అవసరం.

Andhra Bhoomi Telugu News Paper Dated : 3/07/2014 

No comments:

Post a Comment