Posted on: Fri 08 Aug 23:46:17.976368 2014
నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం
1/70 చట్టం, జీవో నెంబరు 3 ఉన్నా, గిరిజనులు తమ సాంప్రదాయిక భూములు కోల్పోతున్నారు. స్థానికులకు ఉద్యోగాలు రావడం లేదు. అందుచేత ఐదో షెడ్యూలును ఆరో షెడ్యూలుగా చేర్చాలి. స్వయం పాలిత గిరిజన జిల్లా కౌన్సిల్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలి. అంతర్జాతీయ గిరిజన దినోత్సవం సందర్భంగానైనా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు తమ గిరిజన విధానం ప్రకటించాలని డిమాండ్ చేద్దాం.
ఆగస్టు 9ని అంతర్జాతీయ గిరిజన దినోత్సవంగా ప్రకటించి రెండు దశాబ్దాలు పూర్తయింది. గత 20 ఏళ్లలో ఐక్య రాజ్యసమితి తీర్మానం మేరకు ఆయా దేశాల్లోని గిరిజన తెగల ఉనికి, హుందాతనం, సంక్షేమం గురించి సభ్య దేశాలు పట్టించుకోవాలని, వారి కోసం ప్రత్యేక చట్టాలు చేయాలని, వారి హక్కుల అమలు విషయంలో ఏ విధమైన వివక్షా పాటించరాదని అంగీకారానికి వచ్చారు. మన దేశంతో సహా పలు దేశాల్లో మొదట స్వచ్ఛంద సంస్థలు గిరిజన దినోత్సవాన్ని పాటిస్తూ, ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేవి. చివరికి ఐక్యరాజ్యసమితి జోక్యంతో గిరిజన సమస్యలు వెలుగులోకి వచ్చాయి. ఈ సంవత్సరం ఐరాస జనరల్ అసెంబ్లీ సెప్టెంబరు 22, 23 తేదీల్లో ఆదివాసీ సమస్యలపై చర్చించనుంది. ఈ సంవత్సర కాలంలో గిరిజన హక్కుల అమలు, అవకతవకలు అనే అంశం చర్చించాలని కోరింది. ఫైనాన్స్ పెట్టుబడి విశ్వవ్యాప్తంగా తన లాభాల కోసం మైనింగ్ రంగం ద్వారా గిరిజన తెగల్ని అణచివేస్తున్న, అంతం చేస్తున్న స్థితిలో అవే శక్తులు ఉత్సవాలు జరపడం ఒక పరిహాసం. ప్రభుత్వాలకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ (సిఎస్‌ఆర్) కూడా చెల్లించడానికి తిరస్కరించే కంపెనీలు అంతర్జాతీయ ఉత్సవాల ఖర్చులు భరించడం ఎవరి ఉద్ధరణకు? కాళ్లు నరికి పసిడి ఊతకర్రలు ఇచ్చే న్యాయం ఎంత కాలం?
భారతదేశంలో గిరిజన దినోత్సవాలు భోపాల్ ప్రకటనతో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి. గత కొన్నేళ్లుగా కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ కూడా ప్రపంచ గిరిజన దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా మన దేశంలో గిరిజన హక్కుల అమలు గురించి పరిశీలిద్దాం. గిరిజన తెగల చరిత్ర అంతా పోరాటాలు, తిరుగుబాట్ల చరిత్రే. ఆదివాసీ తెగల నివాసం, అడవులు, కొండలు, లోయలు, కీకారణ్యాలే. బ్రిటీషు ప్రభుత్వం వారిని నేరస్తులుగా పరిగణించింది. నేరస్త గిరిజన తెగల చట్టం (క్రిమినల్ ట్రైబ్స్ ఆఫ్ ఇండియా యాక్ట్-1801) ప్రకారం వారు అడవిలో నివసించడం, అడవిని వాడుకోవడం నేరం. ఏజెన్సీ రంప తిరుగుబాటు 1803, కోవల తిరుగుబాటు 1818, సంతాల్ తిరుగుబాటు 1855, ముండాలి తిరుగుబాటు 1889, సీతారామరాజు-కోయల తిరుగుబాటు 1922 వీటి ఫలితంగా గిరిజన ప్రాంతాల ప్రత్యేక పరిపాలనా విభాగాలు, చట్టాలు ఏర్పడ్డాయి. 1974 ఏజెన్సీ జిల్లాల చట్టం అటువంటిదే. దీని ఆధారంగానే ప్రస్తుత షెడ్యూలు ప్రాంతాలు ఏర్పడ్డాయి. సామాజిక వివక్ష, అంటరానితనం, అణచివేతకు విరుగుడుగా వచ్చింది దళితుల రిజర్వేషన్. కానీ ఆదివాసీ రిజర్వేషన్ మరింత లోతైనది, విస్తృతమైనది. వారు నివసించే భూభాగంపై వారికి హక్కులిచ్చింది మన రాజ్యాంగం (ఐదో షెడ్యూల్). షెడ్యూల్డ్ ప్రాంతాల్లో సహజ వనరుల వినియోగం, నిర్వహణ, పరిరక్షణపై ఆదివాసీల గ్రామసభలకే హక్కు ఉంది (పీసా చట్టం) కానీ అమలు ఎలా ఉంది? పాలక పార్టీల ప్రభుత్వాలు (కాంగ్రెస్, బిజెపి, టిడిపి వగైరా) ఆదివాసీల హక్కులను కాలరాసి షెడ్యూలు ప్రాంత భూములను లాక్కొని కార్పొరేట్లకు కట్టబెడుతున్నాయి. భువనేశ్వర్ రాజధాని నిర్మాణానికి వాడిన భూమి ఎవరిది? నయా రారుపూర్, రాంచీ అన్ని చోట్లా ఆదివాసుల భూములను ఎలాంటి పరిహారం ఇవ్వకుండా లాక్కున్నారు. మన రాష్ట్రంలో రెండు ఉదాహరణలు చూద్దాం.
మొదటిది సమతా తీర్పు. ఈ సుప్రీంకోర్టు తీర్పు నాటి తెలుగుదేశం ప్రభుత్వానికి ఒక చెంపదెబ్బ. బాక్సైట్ తవ్వకాలు జరపడానికి టాటా కంపెనీతో నాటి ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. ఆ కంపెనీ డముకు నుంచి వాలాసి, నిమ్మలపాలెం వరకూ సిసి రోడ్డు వేసుకుంది. విశాఖపట్నం కేంద్రంగా పనిచేసే సమతా అనే ఒక స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో కేసు వేసింది. ఐదో షెడ్యూలు ప్రాంతంలో ప్రయివేటు కంపెనీలు మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులివ్వవచ్చునా? షెడ్యూల్డ్ ప్రాంతంలో గ్రామసభకు తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి అట్టి హక్కు లేదని, ప్రభుత్వం కూడా నాన్‌ట్రైబల్ భాగస్వామి అవుతుందని చెప్పిన కేసే సమతా తీర్పు. ఆ తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం జిందాల్ కంపెనీతో రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా అవే ఒప్పందాలు కొనసాగించింది. ఆదివాసీల హక్కులను కాలరాసింది. ప్రస్తుత ప్రభుత్వం బాక్సైట్ మైనింగ్ ఐటిడిఎల ద్వారా చేస్తామని సూచనలు చేస్తోంది. ఎపిఎండిసి అయినా, ఐటిడిఎ అయినా ఒకటే. మధ్యవర్తి పాత్ర వహించి ప్రయివేటు కంపెనీలకు లాభాలు కట్టబెట్టడమే. ఆదివాసీల షెడ్యూలు హక్కులు ఉల్లంఘించరాదు. రాజ్యాంగం గిరిజనులకు ఇచ్చిన హక్కులను అమలు చేయాలని పాలక పార్టీలను కోరదాం.
రెండవది పోలవరం. ప్రాజెక్టు ముంపు ప్రాంతం మొత్తంగా రాజ్యాంగంలోని ఐదో షెడ్యూలు ప్రాంతం. ఇక్కడ ఆదివాసీ గ్రామసభలదే అధికారం. గ్రామసభలు, మండల పరిషత్‌లు (పాతవీ, కొత్తవీ) ప్రాజెక్టు కట్టవద్దని తీర్మానాలు చేశాయి. జాతీయ అభివృద్ధి మండలి నిబంధన చెప్పేదేమిటంటే ఏదైనా ప్రాజెక్టులో నిర్వాసితులయ్యే వారిలో దళితులు, గిరిజనులు 50 శాతం ఉంటే అట్టి ప్రాజెక్టు చేపట్టరాదని స్పష్టంగా ఉంది. ఈ ప్రాజెక్టు కింద నిర్వాసితులు 67 శాతం గిరిజనులు. అంటే ఆదివాసీలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులు కాగితాలకే పరిమితం, అమలుకు నోచుకోవు. పాలక పార్టీలు, కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాల ముందు ఆదివాసీల హక్కులు నెరవేర్చాలని అడగరాదా? రాజ్యాంగం అందరికీ సమానం కాదా? విభజన విషగుళిక మింగించడంలో పోలవరానికి జాతీయ హోదా ఇచ్చారు. జాతీయ ప్రాజెక్టులో ముంపు మండలాలన్నీ ఒకే రాష్ట్రంలో ఉండాలా? జలయజ్ఞంలో ఆదివాసీలను బలి ఇచ్చారు. వారి కష్టాలు పెంచారు.
నేతి బీరలో నెయ్యి ప్రభుత్వ గిరిజన విధానం
ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం గిరిజన విధానం పేరుతో హడావిడి చేసింది. రాష్ట్ర విభజన చట్టంలో ఎక్కడా ఆదివాసీల షెడ్యూల్డ్ ప్రాంతం గురించిన ప్రస్తావన లేదు. షెడ్యూలు కలపవలసిన గిరిజన గ్రామాల ప్రస్తావన లేదు. తెలంగాణ ప్రాంతంలో తండాలను పంచాయతీలు చేయాలని టిఆర్‌ఎస్ ప్రభుత్వ నిర్ణయంగా కనిపిస్తోంది. స్థూలంగా గిరిజన విధానంలో అమలుకు సాధ్యం కాని కొన్ని వాగ్దానాలు మాత్రం ఉన్నాయి. కొత్త ప్రభుత్వాలు వీటిని అమలు చేస్తాయా? లేదా? అనేది తెలియడం లేదు. 2015 నాటికి ప్రతి గిరిజన కుటుంబం ఆదాయం రెట్టింపు చేస్తాం, ప్రతి గిరిజన ఆవాసంలో పొదుపు గ్రూపులు ఏర్పాటుచేసి వడ్డీలేని రుణం ఇస్తాం, అటవీ హక్కుల చట్టాన్నీ, పీసా చట్టాన్నీ అమలు చేస్తామన్నారు. ఐటిడిఎలకు ఐఎఎస్ పిఒలనే నియమిస్తామన్నారు. ఇవేవీ అమలుకు నోచుకోలేదు. గిరిజనులు సేకరించే చింతపండుకు ధర పెంచడానికి సిద్ధపడని ప్రభుత్వాలు వడ్డీలేని రుణాలిచ్చి ఆదాయాలు రెట్టింపు చేస్తామంటే నమ్మేదెలా?
అరకు డిక్లరేషన్‌లో గిరిజన గ్రామాలన్నింటికీ తాగునీరిస్తామన్నారు. దాన్ని మర్చిపోయారు. సున్నంవారిగూడెం డిక్లరేషన్‌లో ముంపు ప్రాంతాల గిరిజనులందరికీ పక్కా ఇళ్లు కట్టిస్తామన్నారు. నీరు ఇవ్వలేదు గానీ పోలవరం నీట ముంచడానికి మాత్రం పోటీలు పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఇటీవల అల్లూరి సీతారామరాజు గిరిజన జిల్లా ఏర్పాటుచేస్తామని, గోదావరి జిల్లాల ఏజెన్సీలో అభిప్రాయ సేకరణ చేపట్టింది. గిరిజన జిల్లా పేరు చెప్పి గిరిజనులు లేని మండలాలను అట్టి జిల్లాల్లో చేర్చరాదు. గోపాలపురం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం మండలాలను మినహాయించాలి. అలాగే తూర్పుగోదావరిలో సబ్ ప్లాన్ గ్రామాలను అట్టి జిల్లాలో చేర్చాలి. పేరుకు ఐదో షెడ్యూలు ఉన్నా, పీసా చట్టం ఉన్నా అవి సక్రమంగా అమలు కావడం లేదు. 1/70 చట్టం, జీవో నెంబరు 3 ఉన్నా, గిరిజనులు తమ సాంప్రదాయిక భూములు కోల్పోతున్నారు. స్థానికులకు ఉద్యోగాలు రావడం లేదు. అందుచేత ఐదో షెడ్యూలును ఆరో షెడ్యూలుగా చేర్చాలి. స్వయం పాలిత గిరిజన జిల్లా కౌన్సిల్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలి. అంతర్జాతీయ గిరిజన దినోత్సవం సందర్భంగానైనా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు తమ గిరిజన విధానం ప్రకటించాలని డిమాండ్ చేద్దాం.
ఆదివాసుల భాషా సంస్కృతులను కాపాడాలి
మన రాష్ట్రంలో గిరిజన తెగలకు ప్రత్యేక భాషలు, సమిష్టి సంస్కృతి, ప్రజాస్వామిక సంప్రదాయాలు ఉన్నాయి. వారికి మతం లేదు. హిందూ, ముస్లిం, క్రైస్తవంతో సంబంధం లేదు. ప్రపంచంలో పది వేలమంది మాట్లాడే ప్రతి భాషకూ లిపిని రూపొందించాలని యునెస్కో ఆదేశించింది. కానీ, నాలుగు లక్షల మంది మాట్లాడే కోయ భాషకూ, రెండున్నర లక్షల మంది మాట్లాడే గోండి భాషకూ, మూడు లక్షల మంది మాట్లాడే సవర భాషకూ, రెండు లక్షల మంది మాట్లాడే కువి భాషకూ లిపి రూపొందలేదు. ప్రభుత్వం ఎనిమిది గిరిజన భాషల్లో ఒకటి, రెండు తరగతుల్లో బోధనకు పుస్తకాలు తయారుచేసింది. గిరిజన భాషా బోధకులను నియమించింది. వారికి తగిన శిక్షణ లేదు. ప్రైమర్లు తెలుగులోనే ఉన్నాయి. బోధకులకు జీతాలు లేవు. ఈ సంవత్సరం వారిని తొలగించారు. కొత్త ప్రభుత్వాలు తిరిగి వారిని నియమిస్తాయో, లేదో తెలియదు. ఆదివాసుల్లో క్రైస్తవ మిషనరీలు పనిచేస్తున్నాయి. గత కొన్నేళ్లుగా ఆర్‌ఎస్‌ఎస్ కూడా వివిధ రూపాల్లో ప్రవేశించింది. తెగల మధ్య మత భావాలను ప్రేరేపించి, అనైక్యతకు దోహదపడుతోంది. కొన్ని గిరిజన తెగలు ఆవు మాంసం ఆహారంగా తీసుకోవు. ఇది గత కాలపు సంప్రదాయం. ఆర్‌ఎస్‌ఎస్ శక్తులు దీనిని తెగల మధ్య కుమ్ములాటలకు ఉపయోగిస్తున్నాయి. సనాతన హిందూ ధర్మం పాటించేవారిగా వీరిని చిత్రించడం, గోమాంస భక్షణ మహాపాపంగా, నేరంగా ప్రచారం విశాఖ మన్యంలో ఉంది. తెగల సాంప్రదాయిక ఐక్యతను కాపాడుకోవాలి.
అభివృద్ధి అంటే?
ఒక ప్రాంతం లేదా ఒక తెగ అభివృద్ధి ఆ ప్రాంతంలోని సహజ వనరులు, మానవ వనరులపై ఆధారపడి ఉంటుంది. గిరిజన ప్రాంతాల్లో ప్రకృతి వనరులు, భూమి, అడవి, నీరు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. అయితే పాలకవర్గాలు వీరిని చట్టవిరుద్ధంగా దోచుకోవడం వల్ల మన్యం అభివృద్ధి కుంటుబడుతోంది. ఒక సంవత్సర కాలంలో ఎన్ని టన్నుల బియ్యం, గోధుమలు, అపరాలు పండిస్తాం. ఎంత విద్యుత్ తయారు చేశాం, ఎన్ని రూట్లు వేశాం, ఎన్ని ఇళ్లు కట్టాం, సైకిళ్లు, కార్లు, రవాణా వాహనాలు ఎన్ని తయారు చేశాం అంటే వెరసి జాతీయ సగటు ఉత్పత్తి జిడిపిగా లెక్కిస్తాం. వస్తు సంపద పెంచడాన్ని అభివృద్ధి అంటున్నాం. ఇది పాత సాంప్రదాయిక పద్ధతి. ప్రస్తుతం అభివృద్ధికి అర్థం, నిర్వచనాలు మారాయి. ఎందరు చదువుకున్నారు? అక్షరాస్యత, సాక్షరత పెరగడం, ఆరోగ్య ప్రమాణాలు, పోషకాహారం, ఇనుము, నీరు, అందుబాటు లేక శిశుమరణాలు, మాతృ మరణాలు ఎన్ని? శాంతిభద్రతలు, సాంస్కృతిక వాతావరణం, కాలుష్య లేమిని బట్టి కూడా ఆ ప్రాంత అభివృద్ధిని లెక్కిస్తారు. అన్ని అభివృద్ధి ప్రమాణాల్లో ఆదివాసీల విషయంలో వెనుకబాటు ఉంది. ఆదివాసుల్లో అన్ని అభివృద్ధి సూచికలను మెరుగుపరచాలంటే దేశ ఆర్థిక వ్యవస్థపై ఆధారపడి ఉంది. ఈ రోజు ఆదివాసీలు తినే బియ్యం వారు పండించినవి కావు. జొన్నలు, రాగులు, చోళ్లు పంట తగ్గిపోయింది. వీరు వాడే వస్తువులు బయటి నుంచి వస్తున్నాయి. జీవనం క్రమంగా గిరిజనేతర ప్రాంతాలపై ఆధారపడింది. ఆదివాసులలో రోజుకూలిపై ఆధారపడిన కార్మికులు తయారయ్యారు. వారి శ్రమను చౌకగా కొనే ప్రభుత్వ శాఖలు, యజమానులు తయారయ్యారు. అంటే పెట్టుబడిదారీ సంబంధాలు, ఉత్పత్తి పద్ధతులు ప్రవేశించాయి. ఫైనాన్స్ పెట్టుబడి గిరిజనుల వనరులను దోచుకోవడానికి వచ్చింది. ఈ స్థితిలో గిరిజనోద్యమం కార్మికవర్గ ఉద్యమంతో చెయ్యి కలపాలి. ఉమ్మడి శత్రువుకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో సమసమాజం కోసం, సామ్యవాదం కోసం ముందుకు సాగాలి. ఇదే అంతర్జాతీయ గిరిజన దినోత్సవ శుభసందేశం.
(వ్యాసకర్త మాజీ ఎంపి, ఎపి గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి)
- డాక్టర్ మిడియం బాబూరావు
Prajashakti Telugu News Paper Dated: 09/08/2014
No comments:
Post a Comment