భారత సమాజంలో అసహాయులైన ఆడవారి మీద మగవారి దురహంకార లైంగిక, హంతక దాడుల యుద్ధం కొనసాగుతోంది. ఆధిపత్య, జెండర్, మతం, కుల దురహంకార దాడుల సంస్కృతిలో ప్రజాస్వామిక విలువలు, మానవీయ విలువలు నలిగిపోతున్నాయి. ఆడవాళ్ళు, చిన్న పిల్లల మాన ప్రాణాలకు రక్షణ లేని లైంగిక, హంతక దాడులు పెరిగిపోయాయి. లైంగిక నేర ప్రవృత్తికి అగ్రకుల క్రూరత్వం తోడైన చోట దళిత, ఆదివాసీ, బలహీన వర్గాల మహిళల పరిస్థితులు మరీ దయనీయంగా మారుతున్నాయి. ఈ పరిస్థితిని నిరసిస్తూ మహిళలు, మహిళా సంఘాలు, తల్లి దండ్రులు, కుటుంబ సభ్యులు ప్రజాస్వామిక వాదులు సంఘటితమై గొంతెత్తుతున్నారు. సామాజిక, జెండర్ వక్రగతులను దిద్దుబాటు చేసుకోలేనంతగా మన సమాజం రోగగ్రస్తమయిందా? మహిళలపై జరుగుతున్న అరాచకాలను అరికట్టడంలో సమాజమూ, చట్టాలూ, ప్రభుత్వాలూ విఫలమవుతున్నాయా? ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బాధిత మహిళలే తమని తాము రక్షించుకునే ఆత్మరక్షణా చర్యలకు సిద్ధపడక తప్పదా? ‘నేను ఫూలన్ దేవిని’ అనే పుస్తకంలో వివరించిన ఫూలన్ దేవి కాలం నాటి అణచివేత పరిస్థితులు నేడు తప్పక కనిపిస్తాయి.
ఉత్తరప్రదేశ్‌లో యమునా నది తీరాన, ఒక మారుమూల గ్రామమైన ‘గోర్ఖాకా పూర్వా’లో 1963 ఆగస్టు 10న ఫూలన్ దేవి జన్మించింది. ఆమె తల్లిదండ్రులు, నదిపై పడవలు నడిపే సాంప్రదాయక వృత్తిగల అత్యంత వెనకబడిన సామాజిక వర్గమైన మల్లా కులస్తులు. చిన్నప్పటి నుంచి ఫూలన్ దేవి పశువులు కాచింది. యమునా నదిలో ఈదింది. పడవలు నడిపింది. పాముల్నికొట్టింది. బరువులు మోసింది. పొలం పనులు చేసింది. భూమి, సంపద, అధికారం కలిగి అగ్రకుల ఠాకూర్ల దర్పాలనూ, దాష్టీకాలనూ చూసింది. చమార్, జాతవ్, మల్లా మొదలగు అణగారిన కులాల దైన్యాన్నీ, అశక్తతలనూ అర్థం చేసుకుంది. పదకొండేళ్ళ వయసులోనే బాల్య వివాహానికి గురై ముఫ్పై అయిదేళ్ళ వయసున్న భర్త లైంగిక హింసలనూ ఎదుర్కొంది. తండ్రి కున్న కొద్దిపాటి ఆస్తినీ కాజేసిన దగ్గరి బంధువుల మోసాన్ని చిన్న నాడే ప్రశ్నించి దెబ్బలు తిన్నది. అవహేళనలకు పోలీసుల తప్పుడు కేసులు, దెబ్బలు, సామూహిక అత్యాచారాలను, బందిపోట్ల కిడ్నాపులకు, లైంగిక దాడులకు గురయింది. అడవుల్లో చంబల్ లోయల్లో ఒంటరిగా నడిచింది. జంతువులతో సహజీవనం చేసింది. పేరుకు బందిపోటుగా మారినా బాధిత స్ర్తీలు, పేదలకు ఆర్థిక సాయం చేసి, ధైర్యాన్నిచ్చి, కర్కోటకులైన అగ్రకుల ఠాకూర్లపై ప్రతీకారం నెరవేర్చుకునే తిరుగుబాటుదారుగా ఫూలన్‌దేవి మారింది.
మగ, కుల దురహంకార ఠాకూర్లకేగాక, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర ప్రభుత్వానికీ ఫూలన్ దేవి పెద్ద సవాలుగా మారింది. అప్పటి ఇందిరాగాంధీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వమూ, అర్జున్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమూ ఫూలన్‌దేవితో చర్చలకు పూనుకున్నాయి. ఫూలన్‌దేవి 1983లో షరతులు విధించి తన సహాచరులతో సహా ప్రభుత్వానికి లొంగిపోయారు. ఎనిమిదేళ్ళకే విడుదల చేస్తామని ఇచ్చన మాట తప్పిన ప్రభుత్వాలు, ఫూలన్ దేవిని గ్వాలియర్, తీహార్ జైళ్ళలో పదకొండేళ్ళు ఖైదు చేశాయి. తర్వాత ఫూలన్ దేవి 34వ ఏట 1998లో ఉత్తప్రదేశ్ సమాజ్‌వాది పార్టీ నుంచి పార్లమెంటు సభ్యరాలిగా ఎన్నికయ్యారు. తన 37వ ఏట 2001 జూలై 25న పార్లమెంటు మధ్యాహ్న భోజన విరామంలో ఫూలన్‌దేవి ఢిల్లీలోని తన నివాసానికి వెళ్లింది. అక్కడ ఇంటి బయట గుర్తు తెలియని ముసుగు మనుషుల తుపాకీ కాల్పుల్లో ఫూలన్‌దేవి హత్యకు గురయ్యారు. 1981లో బెహ్మాయ్ గ్రామంలో 22 మంది ఠాకూర్లను ప్రతీకార దాడి చేసి చంపినందుకుగాను ఫూలన్ దేవి హత్య జరిగి ఉండవచ్చని చాలామంది భావించారు. అదే నిజం కావచ్చు. పాత శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండి ఉంటే, శత్రు కులం ఠా కూర్‌ని పెళ్ళి చేసుకోకపోతే ఆమె సీనియర్ పార్లమెంటేరియన్‌గా, బాధితుల ప్రపంచ నాయకురాలిగా కొనసాగుతూ ఉండేవారేమో?
కొన్ని సందర్భాల్లో తన అనుభవాల నుంచి ఫూలన్ దేవి మాట్లాడిన విషయాలను గుర్తు చేసుకుందాం.. ‘శారీరకంగా చితికిపోయి ఉన్నాను. నాకిపుడు పద్దెనిమిది సంవత్సరాలు. నా ఒంటి నిండా మగవాళ్ళు పెట్టిన గుర్తులున్నాయి. వాళ్ళు మగవాళ్ళు కాదు. పశువులు. కుక్కలు. పోలీసు లాకప్పులో నా ముంజేతులు విరిగిపోయాయి. ఇప్పటివరకూ కోలుకోలేదు. షాట్‌గన్ పట్టుకుని గురి చూడటమే కష్టంగా ఉంది. రెండు చేతులతో పట్టుకోవలసి వస్తోంది... పోలీసుల దృష్టిలోనేను బందిపోటు రాణిని. అంటరాని ఫూలన్ దేవిని. .. ఆ రాత్రి... శపథం చేసాను, ఇక నాకు పోయేదమీ లేదు. నేను శక్తిమంతురాలిని. మనుగడ, ప్రతీకారం నన్ను ముందుకు నడిపించాయి...
‘చిన్నప్పటినుంచి నేను మొండిదాన్నే.. జాతి, కుల, వర్ణ, లింగ బేధాలు లేకుండా మనందరికీ ఆత్మగౌరవం ఉంటుందని రుజువు చెయ్యాలనుకున్నాను. ‘ఫూలన్ దేవి ఒక మనిషి’ అని అందరూ నన్ను అనాలని నా కోరిక. అప్పుడే మిగతావాళ్ళ గురించి కూడా ఆ మాట అనగలుగుతారు... ఎన్నోసార్లు చేతులు చాచి సహాయం అర్థించాను. కానీ, ఎవ్వరూ ఆదుకోలేదు. హీనురాలిననీ, నేరస్థురాలిననీ అన్నారు. నేనేదో ఉత్తమురాలినని ఎన్నడూ అనుకోలేదు. కానీ, అలా అని నేరస్థురాలిని కూడా కాదు. నన్ను హింసించిన మగవాళ్ళని మాత్రం నేను హింసించాను అంతే.. లాఠీనే న్యాయంగా చెలామణీ అవుతున్న మా ప్రాంతంలో మల్లాలు, ఠాకూర్లకు బానిసలు అవుతున్న మా ప్రాంతంలో, నేను ప్రజలకు న్యాయం పంచాను. నేరం చేసిన వాళ్ళని నా న్యాయస్థానం ఎదుటికి తీసుకువచ్చే వారు. వాడు ఇతరులను ఎలా హింసించేవాడో వాణ్ని అదే పద్ధతిలో హింసించేదాన్ని... ఉన్నవాళ్ల దగ్గర డబ్బులు తీసుకొని లేనివాళ్ళకి ఇచ్చాను. కట్నం డబ్బులిచ్చి అమ్మాయిలకు సహాయం చేశాను. అత్యాచారం చేసిన వాళ్ళనీ, భూమి లాక్కున్న వాళ్ళనీ, ఇన్ఫార్మర్లనీ శిక్షించాను తల పైకెత్తగలిగేది నేనే... నిలబడి యుద్ధం చేసింది... నేను.. పోలీసులను నేనే వేధించాను.... నా పేరు ఫూలన్ దేవి అనీ, మరచిపోవద్దు అనీ చెప్పేదాన్ని’.
అగ్రవర ్ణ రాజకీయ వ్యవస్థ, దాని మీడియా ప్రచారం చేసిన విధంగా ఫూలన్ దేవి కేవలం బందిపోటు కాదు. ఫూలన్ దేవి అంటే అమాయకురాళ్ళు, అశక్తులైన ఆడవారిపై, బాలికలపై లైంగిక, హంతక దాడులకు పాల్పడిన పురుషాంగాలను నిర్వీర్యం చేసే మహాశక్తి... పేదరికమూ, కులం తక్కువతనమూ తెచ్చే ఆకలి, అవమానాలు, అత్యాచారాలు, మగ, కుల హింసలపై తిరుగుబాటుదారు ఫూలన్ దేవి. ఆమె ఒక సైన్యంగా జెండర్, కుల అణచివేతలపై ఫూలన్‌దేవి యుద్ధం చేసింది. .. ఫూలన్ దేవి అంటే బాల్య వివాహాలను, లైంగిక అత్యాచారాలను, సాంఘిక దురాచారాలను ప్రశ్నించే తుపాకీ. ఫూలన్ దేవి అంటే మగ, కుల సర్పాలపై పడిన కత్తెర. మట్టి మహిళ ఆత్మగౌరవ జెండా. ఆదర్శవంతమైన నాయకురాలు, స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు మరో పేరు. ఫూలన్ అంటే జెండర్, కులం వివక్షా రూపాలన్నింటిపై తనను తాను రక్షించుకునే ఆత్మరక్షణా యుద్ధం.
వ్యవస్థీకృత సామాజిక రోగాలు, నేరాలు, దురాచారాలపై తిరుగుబాటు చేసిన పూలన్ దేవి జయంతి, వర్ధంతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలి. ఫూలన్‌దేవి జీవితం, తిరుగుబాటు, సేవలు, సాధించిన విజయాలను దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు హైస్కూలు విద్యార్థినీ, విద్యార్థులకు పాఠ్యాంశాలుగా పొందుపరచాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంస్థలకు, అవి చేపట్టే మహిళా సాధికార విధానాలకు ఫూలన్ దేవి పేరు పెట్టాలి. పార్లమెంట్‌లో ఫూలన్‌దేవి విగ్రహాన్ని ప్రతిష్టించాలి. ఉత్తరప్రదేశ్‌లో ఫూలన్‌దేవి పుట్టిన జిల్లాకు ఫూలన్ దేవి జిల్లాగా నామకరణం చేయాలి. పెప్పర్ స్ర్పేలు, కరాటే శిక్షణ, ఆత్మరక్షణా శిక్షణ, పరికరాలు, ఆయుధాలు అవసరమని భావించే నేటి ప్రతి యువతీ, మహిళా ఫూలన్ దేవి జీవిత కథనాన్ని ఒకసారి చదువుకొని, ఆమె ధైర్యం నుంచి కొంచెమైనా స్ఫూర్తిని తమలో నిలుపుకుంటే చాలు. లైంగిక, హంతక దాడులకు పాల్పడే మగ తోడేళ్ళను సునాయాసంగా ఎదుర్కోవచ్చు. ఫూలన్‌దేవికి మా ప్రేమపూర్వక నివాళులు.
- జూపాక సుభద్ర, కృపాకర్ మాదిగ
(నేడు ఫూలన్‌దేవి 51వ జయంతి)
Andhra Jyothi Telugu News Paper Dated: 10/08/2014
No comments:
Post a Comment