అసలు ఈ దేశ చరిత్రలో ఆదివాసీలను మనం కాపాడింది ఎప్పుడు? ఎక్కడ? పొద్దున లేస్తే సింగపూర్, మలేసియా గురించి మాట్లాడే ప్రభుత్వాలు ఏటా వచ్చే మలేరియా, డయేరియాల నుంచి ఆదివాసీలను కాపాడలేకపోతున్నాయి. ఇది సిగ్గుచేటు... ఆదివాసీలను కాపాడడం అంటే ప్రపంచ పర్యావరణాన్ని కాపాడడమే. మనం వారికి చేసే మేలు కంటే వారు ప్రపంచానికి చేసే మేలు వేల రెట్లు అధికం.
ఒక దేశం భిన్న సంస్కృతులు, భాషలు ఆ దేశ ఆదివాసీల జనాభాని బట్టి, వారి స్థితిగతులని బట్టి ఆయా ప్రభుత్వాల పనితీరును, ప్రజాస్వామ్య పాలనను అంచనా వేయవచ్చు. గత రెండు దశాబ్దాలుగా ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఆదివాసీల ఐక్యత, హక్కులు, ప్రతిఘటన, గౌరవం వంటి అంశాల మీద ఐక్యరాజ్యసమితి జరుపుతూ వస్తోంది. 2005-2014 దశాబ్దాన్ని ‘ఆక్షన్ అండ్ డిగ్నిటీ’ కాలంగా ప్రకటించారు. ఆదివాసీ హక్కుల అమలులో ఉన్న అడ్డంకులు అధిగమించడం అనే అంశంపై ఆదివాసీల పోరాట దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.
ఎన్నో ఉద్యమాల అనంతరం ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక విశిస్టతలను కాపాడుకోవడానికి ఆదివాసీలు అడవిపై హక్కులు సంపాదించుకున్నారు. అయినా కూడా ప్రమాదకర స్థాయిలో రోజురోజుకూ వారి జీవన ప్రమాణాలు పడిపోతున్నాయి. ప్రపంచ గణాంకాలు చూస్తే దాదాపుగా 70 దేశాలలో 300 నుంచి 350 మిలియన్ల జనాభా ఆదివాసీలు, 5000 జాతులు, 4000కు పైగా భాషా, సంస్కృతులని కలిగి ఉన్నారని యునెస్కో ప్రకటించింది. ఇందులో 70 శాతం మంది ఆసియా ఖండంలోనే ఉన్నారు. ప్రపంచ జనాభాలో ఆదివాసీలు 5 శాతం ఉండి పేదరికంలో మాత్రం 15శాతంగా కూడా ఉన్నట్టు అంచనా. చాలా మంది అనుకుంటున్నట్టుగా ఆదివాసీలు అన్ని దేశాలలో మైనారిటీలు కాదు. బొలీవియా, గ్వాటెమాల వంటి దేశాలలో సగానికంటే ఎక్కవ జనాభాని కలిగి ఉన్నారు. ఇక నిర్వాసితత్వానికొస్తే దాదాపుగా పాల్పెనెసియన్ యుద్ధ కాలం (క్రీ.పూ. 431 - 404) నుంచి భూమిపై అధికారం, హక్కులు సంపాదించే క్రమంలో ఆదివాసీల భూములు ఆక్రమణకి గురి అవుతున్నాయని, అప్పటినుంచే వారి నిర్వాసితత్వం మొదలైందని పరిశోధకుల అభిప్రాయం. దీని ద్వారా పేదరికం పెరిగిపోయి, అడవి బయట ప్రపంచానికి అలవాటు పడలేక తమ ఉనికిని కోల్పోయే స్థితికి చేరుకున్నారు. హక్కుల కోసం ఉద్యమాలు మొదలు పెట్టింది కూడా ఆదివాసీలే అని చరిత్ర చెబుతుంది. ఒక్క ఆస్ర్టేలియాలోనే 1788లో 5 లక్షలు ఉన్న ఆదివాసీ జనాభా 1920 వచ్చే సరికే 60,000కి పడిపోయింది. జీవనోపాధులు కోల్పోయి థాయిలాండ్ వంటి దేశాలలో 40 శాతం మంది మహిళలు సెక్స్ ట్రేడ్‌లో ఉన్నారు. మొత్తంగా ఈశాన్య ఆసియా సరిహద్దుల నుంచి అత్యధికంగా ట్రాఫికింగ్‌కి గురి అవుతున్నది కూడా థాయ్ మహిళలే. ఇదే పరిస్థితి ప్రపంచ వ్యాప్తంగా కొనసాగడం మనం చూస్తున్నాము. భారతదేశం, అందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాల ఆదివాసీల పరిస్థితిని వేరుచేసి చూడలేము.
మన దేశంలో 67.7 మిలియన్ల ఆదివాసీలు 5,653 తెగలతో ఉండి అధికారికంగా 653 ట్రైబ్స్‌గా గుర్తించబడ్డారు. ట్రైబ్ అనేది పరిపాలనకు సంబంధించిన పదం. అందులో 40 శాతం మంది నివాసాలని కోల్పోయి వివిధ ప్రాంతాలకి విస్తరించబడి ఉన్నారని ప్రభుత్వ లెక్కలు తెలియజేస్తున్నాయి. 1990 నుంచి విస్తృతంగా పరుగుపెడుతున్న ప్రపంచీకరణలో భాగంగా ఆధిపత్య దేశాలన్నీ అభివృద్ధి చెందుతున్న దేశాలపై కన్ను వేశాయి. ఎక్కడ ఖనిజాలు కనిపిస్తే అక్కడ స్థానిక ప్రభుత్వాలను గుప్పిట్లో పెట్టుకుని కార్పొరేట్ శక్తుల ద్వారా తమ పంజా విసురుతున్నాయి. అయితే ఈ వేటలో ముఖ్యంగా బలి అవుతున్నది ఆదివాసీలే. ఆదివాసీలు నివసించే ప్రాంతాలు ఎక్కువగా విలువైన ఖనిజాలు గల అడవి ప్రాంతాలే. కాబట్టి అతి విలువైన ఖనిజ సంపద ఉన్న ప్రాంతాలని గుర్తించి అక్కడ తవ్వకాలు జరపడానికి బడా కంపెనీలు అనుమతులు పొందుతున్నాయి.
ఇవికాక అనేక పెద్ద పరిశ్రమలకి నీరు అధికంగా అవసరం ఉండడం వల్ల పెద్ద పెద్ద డ్యామ్‌లను నిర్మించాల్సి వస్తోంది. ఈ డ్యామ్‌లు బహుళార్థక ప్రాజెక్టులని, నిర్మించక తప్పదని ప్రభుత్వాలు వాదిస్తూ మరింత భూమిని ఆక్రమిస్తున్నాయి. ఇక్కడ కూడా అధిక సంఖ్యలో బలి అవుతున్నది ఆదివాసీలే. అడవి లేనిదే తమ సంస్కృతి లేదని, సంస్కృతి లేని రోజు తాము తమ అస్తిత్వాన్ని కోల్పోతామని అంతర్జాతీయంగా ఆదివాసీలు ప్రకటిస్తున్నారు. అడవిపై సంపూర్ణ అధికారాలు కావాలని ఉద్యమాలు తీవ్రతరం చేస్తున్నారు.
ఇవాళ ‘పోలవరం’ ప్రాజెక్టు ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఆంధ్ర, తెలంగాణ జిల్లాలో, కొండ రెడ్ల జాతుల జీవితాలని అల్లకల్లోలం చేయబోతున్నది. ముఖ్యంగా తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఉన్న భద్రాచలం డివిజన్‌లోని ఏడు మండలాలు, ఒక్క ఖమ్మంలోనే 193 రెవెన్యూ మండలాలు ఆంధ్రలో కలపడం దగ్గర నుంచి, రేపు పోలవరం కడితే మా బ్రతుకులు ఎట్లా అని ఆందోళన చెందుతున్నాయి ఆదివాసీ సంఘాలు. ముంచుకొస్తున్న ఈ ముప్పును నివారించడానికి ప్రజాస్వామిక వాదులు ఉద్యమబాట పట్టి గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలను సమయాత్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే పీపుల్ ఎగైనెస్ట్ పోలవరం ప్రాజెక్టు (పీఏపీపీ) తెలంగాణ ప్రజాఫ్రంట్, విద్యార్థి సంఘాలు వివిధ కార్యక్రమాలు చేస్తున్నాయి. పీఏపీపీ ఒడిశా నుంచి భద్రాచలం వరకు మే 1 నుంచి జూన్ 15 వరకు పాదయాత్ర జరిపి, భద్రాచలంలో పెద్ద సభ నిర్వహించింది. అనేక ప్రజాస్వామిక సంఘాలు, వ్యక్తులు ఈ సభలో పాల్గొన్నారు. గమనించదగ్గ విషయం అటు పక్కన ఉన్న రెండు రాష్ర్టాలూ, ఇటు తెలంగాణ ఆదివాసీలకి మద్దతుగా పోలవరాన్ని వ్యతిరేకిస్తున్నాయి కానీ ఆంధ్ర ప్రాంతం నుంచి మాత్రం ఎటువంటి స్పందనా లేదు.
పోలవరం ప్రాజెక్టులో ఉన్న ముఖ్య లోపం దీనిని కేవలం ఒక ప్రాంత అభివృద్ధికై, నీటికి సంబంధించిన అంశంగా చూడడం చాలా బాధగా ఉంది. దాదాపుగా మూడు లక్షల మంది ఆదివాసీల జనాభా ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడా నిర్వాసితులు కాలేదు. కనీసం సరైన లెక్కలు ఇప్పటి వరకు తీయలేదు. 1990లో కొన్ని ఎన్జీవోలు, ఒకటి రెండు సంస్థలు చేపట్టిన లెక్కలు తప్పితే గత దశాబ్దకాలంలో ఒక్క లెక్క కూడా తీయలేదు. అసలు దళితులకు 3 ఎకరాలు పంచడానికే భూమి లేక తలలు పట్టుకుంటున్న ప్రభుత్వాలు ఇన్ని లక్షల మందికి ఎక్కడ ఉపాధి, నివాసం చూపిస్తాయి? ఇప్పటి వరకు 2000 కోట్లకు పైగా డబ్బులు చెల్లించాము అని చెబుతున్నారు. కానీ విషాదకర విషయం ఏమిటంటే అది కూడా ఆదివాసేతరులకి పోవడం, అతి కొద్ది శాతం ఆదివాసీలకు చేరింది.
పోలవరం పాపంలో అందరూ దోషులే. ఇది ఆదివాసీల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని సూచిస్తుంది. అసలు ఈ దేశ చరిత్రలో ఆదివాసీలను మనం కాపాడింది ఎప్పుడు? ఎక్కడ? పొద్దున లేస్తే సింగపూర్, మలేసియా గురించి మాట్లాడే ప్రభుత్వాలు ఏటా వచ్చే మలేరియా, డయేరియాల నుంచి ఆదివాసీలను కాపాడలేకపోతున్నాయి. ఇది అత్యంత సిగ్గుచేటు. చరిత్ర, సంస్కృతి అంటే చారిత్రక ప్రదేశాలలో జెండాలు ఎగరవేయడం కాదు. భిన్న సంస్కృతి గల ప్రజలను కాపాడడం. వారి ప్రాంతాలను రక్షించడం, వారి హక్కులని అమలు పరచడం. అయినా ఆదివాసీలను కాపాడడం అంటే ప్రపంచ పర్యావరణాన్ని కాపాడడమే. మనం వారికి చేసే మేలు కంటే వారు ప్రపంచానికి చేసే మేలు వేల రెట్లు అధికం.
అందుకే ఆదివాసీలు ఈరోజున అస్తిత్వ ప్రకటన చేస్తున్నారు. మా పాలన, మా అడవులు మాకేనని గొంతెత్తి నినదిస్తున్నారు. అందులో భాగంగానే ఇవ్వాళ ప్రపంచవ్యాప్తంగా హక్కుల అమలుకై ఏకమవుతున్నారు. దీనిలో భాగంగానే పీఏపీపీ సంస్థ తరపున ఇవ్వాళ హైదరాబాద్‌లో పోలవరం ప్రాజెక్టుకి వ్యతిరేకంగా ఉదయం 10 గంటల నుంచి సుందరయ్య పార్కు నుంచి ఇందిరా పార్కు వరకు ర్యాలీ, తరువాత మహాధర్నా నిర్వహిస్తున్నారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల నుంచి ప్రతినిధులు పాల్గొంటారు. తుడుం దెబ్బ లాంటి సంస్థలు, సంఘాలు అన్ని జిల్లాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.
- సుజాత సూరేపల్లి
శాతవాహన విశ్వవిద్యాలయం
(నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం)
Andhra Jyothi Telugu News Paper Dated: 09/08/2014
No comments:
Post a Comment