ఉద్యోగాలు, వృత్తులు చేసుకుంటున్న వాళ్లను ముద్దాయిలుగా చూపడం, పరారీలో ఉన్నట్లు చూపడం పోలీసులకే చెల్లింది. ఇటువంటి కేసుల్లో ఇరికించి జైల్లో పెట్టినందుకే ఏపీసీఎల్‌సీ కార్యకర్తలు తమ ఉద్యోగాలు కూడా కోల్పోయారు. వీటిలో కొన్ని యూఏపీఏ కింద పెట్టిన కేసులైతే, మరికొన్ని ప్రజాభద్రతా చట్టం కింద పెట్టినవి.
నూతన ఆర్థిక విధానం అభివృద్ధి నమూనా అనే మాటలు సామ్రాజ్యవాద ప్రపంచీకరణ దాడికి ఆమోదం కలిగించే రూపాలు. ఈ దాడి ఆరంభమైన తొంభైలలోనే దీన్ని ఎదుర్కొనే క్రమంలో వైవిధ్యం గల రూపాన్ని ఎంచుకునే ప్రయత్నంలో తెలుగు కథ రూపవాదానికి గురై వస్తువును త్యాగం చేసేదాకా పోయింది. మొదటి నుంచి ఒకే వస్తుగత స్వభావాన్ని వివిధ రూపాలతో కథలతో చెప్పగలిగే నైపుణ్యం సంపాదించిన పోలీసులు మాత్రం తొంభై నుంచి మరింత వైచిత్రితో కూడిన కథలు రాస్తున్నారు. ఎన్‌కౌంటర్ కథల విషయంలోగానీ, అక్రమ కేసుల కథనాలను వ్రాసే విషయంలోగానీ ఒక తర్కబద్ధమైన క్రమాన్ని పాటిస్తున్నారు.
అటువంటి ఒక అక్రమ కేసు గురించినదే ఈ కథనం. ఇందులో పంచతంత్ర కథ కూడా ఉన్నది. గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందిన తంగిరాల అనిల్‌కుమార్ అనే 38 ఏళ్ళ వ్యక్తిని ఆగస్టు మొదటి వారంలో పోలీసులు పొన్నూరులో అరెస్ట్ చేశారు. ఆ గ్రామానికి తన కూతురు పెళ్లి కార్డులు పంచడానికి పోయాడు. మరి అయితే పెళ్లి అయిపోగానే వస్తావా? అని పోలీసులు అడగలేదు కానీ కూతురు పెళ్లి కనుక మానవీయంగా వదిలివేసినట్టు వదిలేశారు.
వదిలేస్తామని హామీ పడి ఈ లోపల ఏ ఆందోళనకు పూనుకోవద్దని కూడా వేడుకున్నారు. హైకోర్టులో రిట్ వేస్తే కేసు పెట్టాల్సి వస్తుందని కూడా హెచ్చరించారు. లేగదూడకు పాలు ఇవ్వడానికి వెళ్లిన ఆవును వదిలినట్లే వదిలారు. ఆవు అంతటి సత్యసంథతతో ఆయన తిరిగి రానక్కర లేకుండానే (బహిరంగంగా తిరుగుతున్న వాడు కాబట్టి పిల్లలు కలవాడు కాబట్టి) ఆగస్టు 19న ఆయనను అరెస్టు చేసినట్టు చూపారు. ఇక ఇక్కడ కథ మొదలవుతోంది.
దానికి వేలూరు రోడ్డులో డైరీమెన్ కాలనీలో డొంక సమీపంలో నిర్మాణంలో ఉన్న వాటర్‌ట్యాంకు దగ్గర జరిగిన సంఘటనలు అని పేరు పెట్టారు. గస్తీ తిరుగుతున్న పోలీసులకు వేలూరు వైపు నుంచి చిలకలూరిపేటకు వెళుతూ కనిపించిన మధ్య వయస్కుడు పారిపోయేందుకు ప్రయత్నించగా అతడు పట్టదగిన నేరం చేసినవాడని వాళ్లకు అనిపించింది. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. మొదట తబ్బిబ్బు పడ్డాడు కానీ తరచి అడగగా అతడు కూడా ఒక కథ చెప్పాడు.
మొదటిసారి అరెస్టు అయినపుడు కేవలం తంగిరాల అనిల్‌కుమార్ అన్న వ్యక్తికి అకస్మాత్తుగా మూడు అలియాస్‌లు వచ్చాయి శ్యాం, శ్రీరాం, శ్రీను అని. కారంచేడు సంఘటన, జేఎన్ఎం, దళిత మహాసభ ప్రజాసంఘాలు ఇటువంటి ప్రభావాల నుంచి - సెంట్రింగ్ పోస్టు పని, కూలి పని, వ్యవసాయ పని చేసుకునే తల్లిదండ్రులు లేని పిల్లవాడు రవి అనే పీపుల్స్‌వార్ మనిషి పరిచయంతో విప్లవ రాజకీయాల పట్ల ఆకర్షింపబడ్డాడు. ఇక క్రమంగా పున్నారావు మొదలైన వారి పరిచయాలతో పార్టీ పరిచయాలకు వచ్చాడు. నవీన్, ఆర్‌సీ (రాంచందర్) మస్తాన్‌రావు, శాఖమూరి అప్పారావు మొదలుకొని సాంబశివుడు మొదలుకొని ఎందరో పార్టీ ప్రముఖుల పరిచయాలలోకి వెళ్లిపోయాడు. ఇందులో ఇతడు చెప్పినట్లుగా కథనాన్ని పట్టి చూస్తే ఇవన్నీ ఎప్పుడో మాంధాతల కాలంలో జరిగిన సంఘటనలుగా ఉంటాయి.
ఇందులో రామకృష్ణ (ఆర్.కె) తప్ప ఒక్కరూ జీవించిలేరు. అంతే కాదు అందరూ ఏ రెండు మూడేళ్ల క్రితమో ఎన్‌కౌంటర్లలో హతులైనవాళ్లు. అప్పుడు ప్రజాసంఘాల్లో పనిచేస్తున్న వాళ్లు కూడా పున్నారావు, మన్నెం ప్రసాద్ వంటి వాళ్లు అనారోగ్యంతో మరణించిన వాళ్లో, హతులో. మరెందుకు ఇప్పుడు ఇతనిపై వీళ్లందరినీ కలుపుతూ కేసు పెట్టినట్లు? నేరారోపణలు ఏమిటి? సాంబశివుడు అజ్ఞాతంలో ఉన్నప్పుడు గిద్దలూరు నుంచి వేరే గ్రామానికి తీసుకుపోవడమనే ఒక నేరారోపణ, ఒకరు ఇచ్చిన డబ్బు మరొకరికి ఇవ్వడమనేది మరో నేరారోపణ.
ఈ సంబంధాలు, ఈ నేరారోపణలు నేరపూరిత కుట్ర యుద్ధానికి పూనుకోవడం (ఠ్చీజజీnజ ఠ్చీట) రాజద్రోహం అనే తీవ్రమైన సెక్షన్లతో పాటు 1997 ప్రజాభద్రతా చట్టాన్ని 1967 నాటి చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టాన్ని (యూఏపీఏ) ఆకర్షించేంత తీవ్రమైనవి. ఇందులో అనిల్‌కుమార్‌తో పాటు 15 మందిని ముద్దాయిలుగా చూపారు. వారిలో రవి, నవీన్, సంజీవ్, రాంచందర్, ఆర్.కె, మస్తాన్‌రావు, శాఖమూరి అప్పారావు, సాంబశివుడు వీళ్లంతా పార్టీ వాళ్ళు.
ఆర్.కె. తప్ప అందరూ అమరులు. మరి అయితే ఎందుకు కేసు పెట్టినట్టు? ఆర్.కె, అనిల్‌ల కోసమేనా? అక్కడే ఈ కేసు మలుపు ఉన్నది. ఒక అరడజను ప్రజాసంఘాలలో బహిరంగంగా పనిచేస్తున్న వాళ్లను పెట్టడానికే ఈ కట్టుకథల నేరారోపణ. ప్రథమ సమాచార నివేదిక వాళ్లు అనిల్‌తో పాటు పీడీఎం శ్రీను, దుడ్డు ప్రభాకర్, క్యాటరింగ్ రాజు, శ్యామల, నిర్మల. వీరిలో పీడీఎం శ్రీను విస్థాపన కమిటీ సభ్యుడు కూడా. కోస్టల్ కారిడార్ నిర్వాసితత్వానికి వ్యతిరేకంగా ప్రకాశం జిల్లా మొదలుకొని విశాఖపట్నం వరకు సెజ్‌లకు వ్యతిరేకంగా ముఖ్యంగా మత్స్యకారుల, ఆదివాసుల నిర్వాసితత్వాన్ని వ్యతిరేకిస్తూ పనిచేస్తున్నవాడు. దుడ్డు ప్రభాకర్ కుల నిర్మూలన పోరాట సమితి అధ్యక్షుడు, దళితుల ఆత్మగౌరవ పోరాటానికి నాయకత్వం వహిస్తున్నవాడు.
లక్షింపేట మాలల మారణకాండకు బాధ్యుడైన మంత్రినైనా సరే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఒక విశాల ఐక్య సంఘటనకు కన్వీనర్‌గా ఉన్న హైకోర్టు సీనియర్ న్యాయవాది బొజ్జా తారకం నాయకత్వంలో పనిచేస్తున్నవాడు. క్యాటరింగ్ రాజు రైల్వే క్యాటరింగ్ ఉద్యోగం కూడా కోల్పోయి ప్రగతిశీల కార్మిక సంఘంలో పనిచేస్తున్నవాడు. సాంబశివుడి భార్య శ్యామల ఆయన అజ్ఞాతంలో ఉండగానే బయటకి వచ్చి అమరుల బంధుమిత్రుల సంఘంలో పనిచేస్తున్నది.
అనిల్‌కుమార్ భార్య చైతన్య మహిళా సంఘంలో పనిచేస్తున్నది. అనిల్‌కుమార్ గతంలో ఏపీసీఎల్‌సీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడుగా పనిచేశాడు. మన్నెం ప్రసాద్ హత్య తరువాత భయపడి రాజీనామా కూడా చేశాడు. ఇక్కడి నుంచి ఆయన పార్టీలో చేరినట్లు జిల్లా కమిటీ సభ్యుడుగా కూడా ప్రమోట్ అయినట్లు కథ అల్లారు. పైన పేర్కొన్న ఐదుగురు ప్రజాసంఘాల కార్యకర్తలు, నాయకులు బహిరంగంగా, చట్టబద్ధంగా పనిచేస్తూ ప్రజల మధ్య మసలుకుంటున్న వాళ్లు. కొందరు నిత్యం మీడియాలో కూడా కనిపిస్తున్న వారు. వీళ్లందరినీ ఈ కేసులో నిందితులుగా చూపడానికే పోలీసులు ఈ కథ అల్లారు. వీరందరికీ మావోయిస్టు పార్టీలో అజ్ఞాతంలో ఉండిన, ఉన్న నాయకులతో సంబంధాలు ఉన్నట్లు ఆరోపించారు.
అంతమాత్రమే కాదు వీళ్లందరూ కనిపించటం లేదని, పరారీలో ఉన్నారని వారిని పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కూడా రాశారు. వివిధ ప్రజాసంఘాల్లో క్రియాశీలంగా, బహిరంగంగా చట్టబద్ధంగా పనిచేస్తున్న వాళ్లను అక్రమ కేసుల్లో ఇరికించి పారిపోయినట్లుగా చూపడమనేది పోలీసు సంప్రదాయమే. తిరిగి ఏప్రిల్ 22 ఆర్‌డీఎఫ్ మహాసభకు ఛత్తీస్‌గఢ్ నుంచి వస్తున్న 35 మంది ఆదివాసులను, చేతన నాట్యమంచ్‌ను, సత్యం అనే వ్యక్తిని అరెస్టు చేసి అతనిపై (్ఖఅ్కఅ) చట్టం కింద కేసు నమోదు చేశారు.
ప్రథమ సమాచార నివేదికలో అన్ని ప్రజాసంఘాల బాధ్యులను ఇరికించి ఇప్పటికే అరెస్టు అయి జైల్లో ఉన్న తెలంగాణ ప్రజాఫ్రంట్ ప్రధాన కార్యదర్శి నలమాస కృష్ణపై ఈ కేసులో పీటీ వారంటును జారీ చేశారు. ఆ తర్వాత మే 9న కామ్రేడ్ ఆజాద్ సహచరి పద్మ, ఆమె వెంట ఉన్న వాళ్లను ఖానాపురంలో అరెస్ట్ చేసి, హన్మకొండలో ఉన్న అమరుల బంధుమిత్రుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, వరంగల్ జిల్లాలో తెలంగాణ ప్రజాఫ్రంట్‌లో క్రియాశీలంగా పనిచేస్తున్న భారతిని కూడా ముద్దాయిగా చూపి అరెస్టు చేసి జైల్లో పెట్టారు.
వీళ్లను అడవికి పంపుతున్నారన్న ఆరోపణతో అమరుల బంధుమిత్రుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంటి ప్రసాదం, తెలంగాణ ప్రజాఫ్రంట్ అధ్యక్షుడు ఆకుల భూమయ్య, నడుస్తున్న తెలంగాణ సంపాదకుడు సి.కాశీంలను ముద్దాయిలుగానే కాదు పరారీలో ఉన్నట్లు చూపారు. అమరుల బంధుమిత్రుల సంఘం మహాసభకు వచ్చిన ఆదివాసీ ప్రజలు చేతన నాట్యమంచ్‌కు చెందిన వాళ్లు స్త్రీలు, పిల్లలతో సహా 18 మందిని ఇమ్లిబన్ బస్‌స్టేషన్‌లో అరెస్టు చేసి వాళ్లను తీసుకుపోవడానికి వచ్చిన ఏపీసీఎల్‌సీ కార్యకర్తలు నారాయణరావు, హన్మంతరావులను అరెస్టు చేసి జైల్లో పెట్టారు.
ఇందులోనూ గంటి ప్రసాదం, పద్మకుమారి, విరసం వరవరరావు, ఏపీసీఎల్‌సీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, హైకోర్టు అడ్వకేట్ వి. రఘునాథ్‌లను కూడా ముద్దాయిలుగా చూపి పరారీలో ఉన్నట్లు చూపారు. ఈ మూడు కేసులు 1972 ప్రజా భద్రత చట్టం కింద చూపినవే. భద్రాచలంలో అరెస్టు అయిన బండి కిరణ్‌తో పాటు మళ్లీ గంటి ప్రసాదం, పద్మకుమారి, వరవరరావు, రఘునాథ్, నారాయణరావు, హన్మంతరావు, కాశీంలను కూడా ముద్దాయిలుగా చూపి పరారీలో ఉన్నట్లుగా చూపారు. చట్టబద్ధమైన బహిరంగ సభలు, ప్రజాహిత కార్యక్రమాలే కాకుండా తమ ఉద్యోగాలు, వృత్తులు చేసుకుంటున్న వాళ్లు, న్యాయవాదులు కావచ్చు, లెక్చరర్లు కావచ్చు, ఆసుపత్రుల్లో, ఆర్టీసీల్లో పనిచేస్తున్న వాళ్లు కావచ్చు, వాళ్లను ముద్దాయిలుగా చూపడం, పరారీలో ఉన్నట్లు చూపడం పోలీసులకే చెల్లింది.
ఇటువంటి కేసుల్లో ఇరికించి జైల్లో పెట్టినందుకే ఏపీసీఎల్‌సీ కార్యకర్తలు తమ ఉద్యోగాలు కూడా కోల్పోయారు. ఇప్పుడు అనిల్‌కుమార్ అరెస్ట్ సందర్భంగా పెట్టిన కేసు ఒక తాజా చేర్పు. అయితే వీటిలో కొన్ని యూఏపీఏ కింద పెట్టిన కేసులైతే, మరికొన్ని ప్రజాభద్రతా చట్టం కింద పెట్టినవి. కానీ అనిల్‌కుమార్ కేసు మాత్రం నేర శిక్షాస్మృతిలోని చటబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాన్ని సాయుధంగా కూల్చే కుట్ర, యుద్ధ ప్రకటన, రాజద్రోహంతో పాటు ప్రజాభద్రతా చట్టం, యూఏపీఏను జోడించి పకడ్బందీగా పెట్టారు. దానికి కొసమెరుపు నిత్యం ప్రజాజీవితంలో కనిపించే ఐదుగురు ప్రజాసంఘాల కార్యకర్తలను పరారీలో చూపడం. ఇంత క్రమబద్ధంగా రచించగల అక్రమ కట్టుకథలను పోలీసులు తప్ప ఇంకెవరైనా అల్లగలరా?
- వరవరరావు
andhra jyothi news dated 31/08/2012
No comments:
Post a Comment