Tuesday, December 20, 2011

జీవించే హక్కును పునర్నిర్వచించాలి


అదివాసులకు జల్, జంగిల్, జమీన్‌లపై భారత రాజ్యంగమూ, కేంద్ర చట్టాలు ఇచ్చిన అధికారాన్ని డిమాండు చేస్తున్న సాంస్కృతిక కార్యకర్తల ప్రాణాలను చట్టపరంగా హరించే కళంకం నుంచి (జీతన్ మరాండీ తదితరుల మరణ శిక్ష రద్దు ద్వారా) భారత రిపబ్లిక్ ప్రస్తుతానికి బయటపడింది. ఇది జ్ఞానోదయానికి తలుపులు కాకున్నా కిటికీలు తెరిచే వైపుగానైనా ఇంక మరణ శిక్ష రద్దుకొరకు ప్రజా ఉద్యమాల నిర్మాణం విస్తృత, విశాల ఐక్య ప్రాతిపదికపై జరగాల్సి ఉంది. ఇంతవరకు భారత రిపబ్లిక్‌లో ఎందరు దళితులు, బడుగు వర్గాల వాళ్లు, నిరుపేదలు, మహిళలు, ముస్లింలు, మైనారిటీలు, రాజకీయ ప్రత్యర్థులు ఉరికంబాలెక్కారో లెక్కలు తేలాల్సి ఉన్నది. 

జార్ఖండ్ అభేన్ కళాకారుల బృందం జీతన్ మరాండీ, అనిల్‌రామ్, ఛత్రపతి మండల్, మనోజ్ రాజ్వర్‌లకు గిర్దీ జిల్లా సెషన్స్ కోర్టు విధించిన మరణ శిక్షను రాంచీ హైకోర్టు ఈనెల 15న కొట్టివేసింది. జీతన్ తదితరుల పైన వేరే ఏ కేసులూ విచారణలో లేనట్లయితే వాళ్లను వెంటనే విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది. గత నాలుగేళ్ళుగా హజారీబాగ్, రాంచీ జైళ్ళలో విస్థాపన ఉద్యమంలో రాజద్రోహ నేరారోపణ వం టివి ఎదుర్కొంటూ బెయిల్ రాకుండా ఉన్న జీతన్ మరాండీ తప్ప మిగ తా ముగ్గురూ వెంటనే విడుదలవుతారు. వీరిలో అనిల్ రామ్ తప్ప మిగ తా ముగ్గురూ సంతాలీ ఆదివాసులు. అనిల్‌రామ్ దళితుడు. 'సంశయ లబ్ధి' (బెనిఫిట్ ఆఫ్ డౌట్) కింద ఈ నలుగురి మరణ శిక్షను రాంచీ హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టివేస్తూ వారిని నిర్దోషులుగా ప్రకటించింది. 

తొంభైతొమ్మిది మంది నేరస్తులయినా తప్పించుకోవచ్చు గానీ, ఒక్క నిర్దోషికి శిక్షపడకూడదన్న న్యాయతత్వ సూత్రానికి అనుగుణంగా రాంచీ హైకోర్టు డివిజన్ బెంచ్ (జస్టిస్ మరాఠియా, జస్టిస్ ఉపాధ్యాయ) 'సంశయ లబ్ధి' అవకాశం క్రింద నిర్దోషుల విడుదలకు ఆదేశించింది. న్యాయవ్యవస్థ నూటికి నూరుపాళ్లు కంపెనీల, ప్రభుత్వాల ఒత్తిళ్లకు ఇంకా లోనుకాలేదని, అక్కడక్కడా ఒయాసిసులు మిగిలాయని ఈ తీర్పు కొంత ఓదార్పును కలిగించింది. 

విచారణ జరిగినన్ని రోజులు తన రెండున్నర సంవత్సరాల కుమారుడు అలోక్‌చంద్రతో పాటు అపర్ణ (జీతన్ సహచరి) హైకోర్టులో వాద ప్రతివాదాలు వినడానికి వెళ్ళారు. విచారణ పూర్తయిన ఆఖరిరోజు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ మరాఠియా చిన్నారి అలోక్‌కు పుస్తకాల కిట్ పంపించారు. 'కుమారుడు విద్యావంతుడు కావాలనుకుంటున్న న్యాయమూర్తి తండ్రిని ఉరికంబానికి పంపడని అప్పుడే అనిపించింది' అని న్యాయవాది ఎస్.కె.రజన్ వ్యాఖ్యానించారు. 

తెలుగు నేల మీద మరణ శిక్షలకు వ్యతిరేకంగా పోరాటం చేసే ఒక ప్రజాస్వామిక సంస్కృతి నక్సల్బరీ, శ్రీకాకుళ పోరాటాల కాలం నుంచే కాదు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటకాలం నుంచి కూడ ఉన్నది. ఆ కాలంలో ఉరిశిక్ష పడిన 11 మంది కమ్యూనిస్టు విప్లవకారుల ఉరిశిక్షల రద్దు కొరకు డాక్టర్ జయసూర్య నాయకత్వంలో న్యాయస్థానం లోపల, బయట ఉద్యమం నడిచింది. ఇంగ్లాండు నుంచి బారిస్టర్ ప్రిట్‌ను, సుప్రీం కోర్టు నుంచి డానియల్ లతీఫ్‌ను తీసుకువచ్చి వాదింపచేశారు. 

నల్లా నర్సింహులు ఉరిశిక్ష రద్దు కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ వాదించారు (జైలు నుంచి తప్పించుకున్న నర్సింహులును షోలాపూర్ పంపించడానికి కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన సాహస సహకారం గురించి కూడా చెప్పుకోవాలి). కోర్టులో ఈ వాదన బలమే కాకుం డా మరణ శిక్షల అమలుపై ఖురాన్ పై భక్తి విశ్వాసాల వల్ల ఉస్మాన్ అలీఖాన్ సంతకాలు చేయకపోవడం వల్ల కూడ ఆ మరణ శిక్షలు ఆగిపోయాయి. 

ఆ తర్వాత సైనికచర్యల వల్ల హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్‌లో విలీనమయింది. అయితే భారత్ ఒక రిపబ్లిక్‌గా ఏర్పడక పూర్వం నెహ్రూ ప్రభుత్వం (కేరళకు చెందిన కయ్యూరు కామ్రేడ్స్ ఉదంతం ఆధారంగా నిరంజన రాసిన 'చిరస్మరణ' నవల చదవండి), ఏర్పడినాక నెహ్రూ, ఇందిరలు మొదలు ఇప్పటిదాకా మన గణతంత్ర రాజ్యం మరణ శిక్షలు అమలు చేస్తూనే ఉంది. భారత రాజ్యాం గం, పార్లమెంటు చట్టాలు, దేశంలోని మిగతా రాష్ట్రాల వలే వాటికవిగా వర్తించని, 370 క్లాజు కింద ప్రత్యేక ప్రతిపత్తి గల జమ్మూ-కాశ్మీర్‌లో కూడా మఖ్బూల్ భట్ వంటివారిపై మరణ శిక్షలు అమలయ్యాయి. 

శ్రీకాకుళ ఉద్యమ ప్రభావంతో తాళ్లపాలెం హత్యకేసులో నెల్లూరు జిల్లాకు చెందిన ఇంతా రమణారెడ్డి, శంకరరెడ్డి, రామకృష్ణలకు 1972లో సెషన్స్ కోర్టు మరణ శిక్ష విధించింది. అప్పటికి శ్రీకాకుళ పంథా ననుసరిస్తున్న విప్లవకారులు కోర్టులను బహిష్కరించే వైఖరి తీసుకున్నారు. అయినా జస్టిస్ చిన్నప్ప రెడ్డి 'మనకు రాజ్యాంగం మీద, కోర్టుల మీద విశ్వాసం ఉన్నది కదా, ఇది మన విశ్వాసాలకు పరీక్ష' అని ఎమికస్ క్యూరీ (కోర్టు తరఫున న్యాయవాద నిపుణుడు) నియమించారు. 

'రాజకీయ విశ్వాసంలో భాగంగా ఈ హత్య జరిగింది గాని కక్ష, ద్వేషాలతో కాదు, ఆ విశ్వాసాలతో మాకు ఏకీభావం ఉన్నా, లేకున్నా ఇక్కడ వ్యక్తిగత ఉద్దేశం (ఇంటెన్షన్) లేదు గనుక కొట్టివేస్తున్నానని' ఆయన అన్నారు. (సుప్రీంకోర్టు నిర్వచించి అరుదయిన నేరాల్లో అరుదయిన వాటికే మరణ శిక్షను విధించాలన్న అవగాహనను జస్టిస్ చిన్నప్ప రెడ్డి అట్లా గౌరవించారు) ఆ తర్వాత కాలంలో 1975 మే 11న భూమయ్య, కిష్టా గౌడ్‌ల ఉరిశిక్షలను కూడ రెండవసారి జస్టిస్ చిన్నప్పరెడ్డి, జస్టిస్ గంగాధరరావుల వేసవి కాలపు బెంచీయే నిలిపివేసింది. 

నాగభూషణ్ పట్నాయక్‌కు విధించిన మరణశిక్ష రద్దునకు దేశావ్యాప్త ఉద్యమం జరిగింది. ముఖ్యంగా ఒరిస్సా మాజీ ముఖ్యమంత్రి నవకృష్ణ చౌదరి, మాలతీ చౌదరి, వెన్నెలకంటి రాఘవయ్యల కృషితో 1972లో భారత స్వాతంత్య్ర రజతోత్సవాల సందర్భంగా ఆయన ఉరిశిక్ష రద్దయింది. 

భూమయ్య, కిష్టా గౌడ్‌ల ఉరిశిక్ష రద్దు కొరకు 1974 నుంచి దేశవ్యాప్త ఉద్యమం నిర్వహించబడింది. ఆ ఏడాది నవంబర్‌లో ఒకసారి, 1975 మే 11న ఒకసారి ఆగిన ఉరిశిక్ష ఎమర్జెన్సీలో డిసెంబర్ 1న (దేశంలోనే ప్రజాస్వామిక హక్కులన్నీ రద్దయిన కాలంలో) అమలయింది. ఈ ఉద్యమానికి పత్తిపాటి వెంకటేశ్వర్లు, కె.జి.కన్నబిరాన్ మొదలు జార్జి ఫెర్నాండెజ్, జయప్రకాశ్ నారాయణ్, వాజపేయి, ఎస్.జైపాల్ రెడ్డి వరకు దేశంలో నాయకత్వం వహించారు. అండగా నిలిచారు. 

చండ్ర రాజేశ్వరరావు, భూపేశ్ గుప్తాల నాయకత్వంలో సిపిఐ ఉద్యమించింది. కె.ఎ.అబ్బాస్ మొదలు ('మృగయా' సినిమా భూమయ్య, కిష్టాగౌడ్‌ల స్మృతిలోనే నిర్మాణమైంది), ఆనంద్ పట్వర్థన్ (ప్రిజనర్స్ ఆఫ్ కాన్షస్) వంటి సినిమా, డాక్యుమెంటరీ దర్శకులు ఉద్యమించారు. ఫ్రాన్స్‌లో జీన్‌పాల్ సార్త్ర్, సైమన్ డిబావ్రా, తరీఖ్ అలీ, అమెరికాలో ఛామ్‌స్కీ ప్రదర్శనలు, విజ్ఞప్తులు చేశారు. శ్రీశ్రీ సంగతి సరేసరి. కాలికి బలపం కట్టుకుని తెలుగునేలంతా తిరిగాడు. 'భూమయ్య, కిష్టాగౌడ్‌లను ఉరితీసి ఇందిరాగాంధీ, డాస్టోవస్కీని ఆఖరి క్షణాన వదిలేసిన జార్ చక్రవర్తి కన్నా, పదకొండు మంది విప్లవకారులకు మరణశిక్ష అమలు ఆదేశంపై సంతకం చేయని ఉస్మాన్ అలీఖాన్ కన్నా నియంత అనిపించుకోకూడదని ఆశిస్తున్నానని' విజ్ఞప్తి చేశారు. 

ఇవి రాజకీయ విశ్వాసాలు, కలహానికి సంబంధించినవైతే చలపతి, విజయవర్ధనరావుల మరణశిక్ష రద్దు కావాలని తెలుగునేల మీద ప్రత్యేకించి, దేశ వ్యాప్తంగా మొత్తంగా సాగిన ఉద్యమం సామాజిక శక్తుల చైతన్యానికి, విజయానికి ఉదాహరణ. ఆ ఇద్దరూ దళిత యువకులు. నేరం వాళ్లు చేయలేదు. ఆకలి చేసింది. దేశవ్యాప్తంగా నేరారోపణలపై జైళ్ళలో మగ్గుతున్న వారు, ఉరికంబాలు ఎక్కుతున్న వారు దళితులు, బడుగు వర్గాలవారేనన్నది ఈ ఉద్యమ సందర్భంగాను, బీహార్‌లో ఉరిశిక్ష పడిన ఏడుగురు రైతాంగ కార్యకర్తల సందర్భంగానూ స్పష్టంగా ముందుకు వచ్చింది. ఎపిసిఎల్‌సి, దళిత సంఘాలు ఈ ఇద్దరి ఉరిశిక్షల రద్దుకై దేశవ్యాప్త ఉద్యమాన్ని నిర్వహించాయి. కె.ఆర్ నారాయణన్ రాష్ట్రపతిగా ఈ మరణశిక్ష నైతే రద్దుచేశారు గానీ, పద్దెనెమిదేళ్లుగా ఈ పశ్చాత్తాప యువకులు జైలుచీకటి కొట్లో మగ్గుతున్నారు. 

అంటే తెలుగు నేల మీద ప్రజా ఉద్యమాల ప్రభావంతో, బయట కోర్టులోనూ ప్రచారంలోను, వాదనలోను ప్రజాస్వామ్య భావజాల చైతన్యంతో మరణ శిక్షలు ఆగిపోయిన అరవై ఏళ్ల చరిత్ర ఉన్నది. ప్రభుత్వాలైనా, కోర్టులైనా ఉద్యమాలకు తలవొగ్గినవి (ప్రాథమిక హక్కులు రద్దయిన ఎమర్జెన్సీ కాలం ఒక్కటే మినహాయింపు). 

బెంగాల్‌లో మొలీనాధక్‌కు పడిన మరణ శిక్ష కూడ రద్దయి ఆ తర్వాతకాలంలో ఆమె విడుదలయింది. బీహార్‌లో కొందరు రైతాంగ కార్యకర్తల మరణశిక్షలు రద్దయ్యాయి. ఇంకా కొందరి విషయంలో రాష్ట్రపతి దగ్గర క్షమాభిక్ష విజ్ఞప్తులు ఉన్నాయి. ఇటీవలి కాలంలో అఫ్జల్ గురు, మురుగన్, సంతన్, పెరువారన్ మరణ శిక్షల రద్దు గురించి అటు కాశ్మీర్ మొదలు, ఇటు తమిళనాడు వరకు ఉద్యమాలను నిర్వహిస్తున్నారు. 

మురుగన్, సంతన్, పెరువారన్‌ల మరణ శిక్ష రద్దు కొరకు తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. రాష్ట్రపతి క్షమాభిక్షను తిరస్కరించి, మరణశిక్ష అమలయ్యే తేదీ కూడ నిర్ణయింపబడినాక మద్రాసు హైకోర్టు స్టే ఇచ్చి విచారణ చేపట్టింది. అఫ్జల్ గురు క్షమాభిక్షను తిరస్కరించవలసిందిగా రాష్ట్రపతికి కేంద్ర హోంమంతిత్వ్ర శాఖ సిఫార్సు చేసింది. కాంగ్రెస్, బిజెపిలు ప్రత్యేకించి అఫ్జల్ గురు ప్రాణాలతో చెలగాట మాడుతున్నాయి. పంజాబ్‌లో ఐదుగురు కేంద్ర బలగాలను మందుపాతరతో చంపిన ఆరోపణపై మరణశిక్ష పడిన ధీరజ్ బుల్లార్ కేసు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చినప్పుడు కొన్ని కొత్త కోణాలు చర్చకు వచ్చాయి. 

జీవించే హక్కుకు రాజ్యాంగం హామీపడుతుంది గనుక రాజ్యాంగ ధర్మాసనం తప్ప డివిజన్ బెంచీకి కూడ మరణ శిక్ష విధించే అధికారం లేదు. ముగ్గురితో కూడిన బెంచీలో మెజారిటీ అభిప్రాయంతో మరణ శిక్షలు పడిన ఉదంతాలు కూడ ఉన్నాయి. కనుక రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవ తీర్పు తప్ప జీవించే హక్కును ఎవరూ తొలగించలేరు అనేది ఒకటి. చట్టం తెలియని పౌరులకు, చట్టంలో విశ్వాసం లేని వాళ్లకు కాదు, చట్టాలను గౌరవించి భారతశిక్షా స్మృతి, నేర శిక్షా స్మృతి ప్రకారం నడచుకోవాల్సిన పోలీసులకు మాత్రమే హత్యా నేరం కింద మరణ శిక్ష విధించాలని ఇటీవల సుప్రీంకోర్టు ద్విసభ్య బెంచీ 'అరుదైన నేరాల్లో అరుదైన' నేరంగా 'ఎన్ కౌంటర్' హత్యలను నిర్వచించింది. 

ఈ వెలుగులో ఇప్పుడు మరణ శిక్షలపై చర్చ జరగాలి. 96 దేశాలు మరణ శిక్షను రద్దు చేశాయి. 34 దేశాలు అమలుచేయడం లేదు. ఒక వ్యక్తిని లేదా వ్యక్తులను నేరారోపణలపై, నేరం రుజువయినప్పటికి ఒక సభ్య సమాజం, అది ఎన్నుకున్న ప్రభుత్వం, దాని న్యాయస్థానాలు చర్చించి ప్రాణాలు తీయాలని నిర్ణయించడం ఎంత అనాగరికమైన విషయం! ఆవేశంలో హత్యలు జరగవచ్చు, రాజకీయ విశ్వాసాల వల్ల జరగవచ్చు, నేర ప్రవృత్తి వల్ల జరగవచ్చు. 

ఈ అన్నింటికన్నా రాజకీయార్థిక, సామాజిక, సాంస్కృతిక పీడన, అణచివేత, అసమానతల వల్ల జరగవచ్చు. కాని ఒక నాగరిక సమాజం, ప్రజాస్వామ్యం అని చెప్పుకునే ప్రభుత్వం, న్యాయాన్ని ఒక తత్వ శాస్త్రంగా అధ్యయనం చేసి అమలు చేయ వలసిన న్యాయవ్యవస్థ ఒక వ్యక్తిని, వ్యక్తులను నేరారోపణపై జైల్లో పెట్టి సుదీర్ఘ వాదోపవాదాలు చేయించి చంపదగినవారు అని నిర్ణయించడం అమానుషం. 

భారత రిపబ్లిక్ ప్రస్తుతానికి, స్వయంగా రాజ్యాంగంలోని 5వ, 6వ షెడ్యూళ్ళలో మొదలు పెసా వంటి కేంద్ర చట్టాల ద్వారా ఆదివాసులకు జల్, జంగిల్, జమీన్‌లపై ఇచ్చిన అధికారాన్ని డిమాండు చేస్తున్న సాంస్కృతిక కార్యకర్తల ప్రాణాలను చట్ట పరంగా హరించే కళంకం నుంచి బయటపడింది. ఇది జ్ఞానోదయానికి తలుపులు కాకున్నా కిటికీలు తెరిచే వైపుగానైనా ఇంక మరణ శిక్ష రద్దుకొరకు ప్రజా ఉద్యమాల నిర్మాణం విస్తృత, విశాల ఐక్య ప్రాతిపదికపై జరగాల్సి ఉంది. ఇంతవరకు భారత రిపబ్లిక్‌లో ఎందరు దళితులు, బడుగు వర్గాల వాళ్లు, నిరుపేదలు, మహిళలు, ముస్లింలు, మైనారిటీలు, రాజకీయ ప్రత్యర్థులు ఉరికంబాలెక్కారో లెక్కలు తేలాల్సి ఉన్నది. 

జీతన్ మరాండీ కళాకారుల బృందం ఉరిక్ష రద్దు కోసం దేశవ్యాప్త కమిటీని ఏర్పాటు చేయడానికి 'కమిటీ ఫర్ రిలీజ్ ఆఫ్ పొలిటికల్ ప్రిజనర్స్' (సిఆర్‌పిపి) ఢిల్లీలో ఈ నెల 20న తలపెట్టిన అఖిల భారత స్థాయి సదస్సు ఈ తీర్పు దృష్ట్యా ఇపుడింక విజయోత్సవ సభ అవుతుంది. కావచ్చు గానీ భారత శిక్షా స్మృతి నుంచి మరణ శిక్ష తొలగించడానికి ఇది ఒక దృఢమైన సంకల్పానికి తొలి అడుగు కావాలి. ఒక ప్రజాస్వామిక విశ్వాసంగా శిక్షా స్మృతిలో మరణ శిక్ష ఉండకూడదు అని భావించే ప్రతి ఒక్కరినీ ఈ ఉద్యమంలో భాగం చేయాలి. మిగతా ఎన్ని తేడాలు, విభేదాలయినా ఉండవచ్చు గానీ మరణ శిక్షలు ఉండకూడదన్న ఒకే ఒక్క ఆకాంక్ష, భావన, విశ్వాసం మనలందరినీ ఒకే వేదిక మీదికి తెచ్చే సంద ర్భం కావాలి. ప్రజాస్వామ్య శక్తులు అందుకు పూనుకుంటాయనే ఆశతో, విశ్వాసంతో ...
- వరవరరావు
( నేడు న్యూఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్‌లో మరణశిక్షల రద్దు విషయమై సిఆర్‌పిపి సదస్సు సందర్భంగా)  ఆంధ్ర జ్యోతి తెలుగు న్యూస్ పేపర్ తేది 20 /12 /2011 

No comments:

Post a Comment