Saturday, July 7, 2012

ఆదివాసులకు న్యాయం దక్కేనా?---వరవరరావుచత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, సుక్మా, కాంకేర్ జిల్లాల్లో జూన్ 28,29 తేదీల్లో పోలీసులు మూడుచోట్ల అమాయకులైన 23మంది ఆదివాసీలను చంపారు. జూన్ 28వ తేదీ అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో బాసగూడెంలో ఎన్‌కౌంటర్‌గా ప్రకటించిన దాంట్లో సీఆర్‌పీఎఫ్ కాల్పుల్లో 20 మంది ఆదివాసులు చనిపోయారు. ఇందులో మహిళలు, పసి పిల్లలు ఉన్నారు. 29వ తేదీ ఉదయం సుక్మా జిల్లా జేగురుగొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో పశువులను, విత్తనాలను తీసుకొని పొలం దగ్గరికి వెళ్తున్న మడ్కం మత్తాలు, మడ్కం లచ్చాలు అనే ఆదివాసీ రైతులను పట్టుకొని కాల్చి చంపి, ఆ శవాలను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. కాంకేర్ జిల్లా జొన్నగూడెంలో చుట్టపు చూపుగా వచ్చిన సోడుం దూలాను మావోయిస్టు అనే అనుమానంతో పట్టుకుని కాల్చి చంపారు. ఈ మూడింటిలో ‘బాసగూడెం ఎన్‌కౌంటర్’ గురించే ఎక్కువగా చర్చ జరుగుతున్నది. బాసగూడెంలో చనిపోయిన 20 మంది పేర్ల ను అక్కడ జూన్ 28వ తేదీ రాత్రి పదకొండు గంటలకు సమావేశమైన కర్కగూడెం, కొత్తగూడెం, రాజుపెంట గ్రామాలకు చెందిన 150 మంది గ్రామస్తులు ఇప్పటికే చాలామందికి చెప్పారు. అక్కడికి స్వయం గా వెళ్లిన రిపోర్టర్ అమన్ సేథీ అక్కడి శవాలపై బుల్లెట్ గాయాలు, కత్తులతో కోసిన, గొడ్డళ్లతో నరికిన గుర్తులు కూడా చూశానని తెలిపాడు. పత్రికలు కూడా ఫొటోలతో సహా వార్తలను ప్రచురించాయి. ఆ గ్రామా ల ప్రజలతో, ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడానని, చనిపోయిన వారెవరూ మావోయిస్టులు కారని వాళ్లు చెప్పారని గాంధేయవాది హిమాంశు కుమార్ ఫేస్‌బుక్‌లో పెట్టాడు.


విత్తనాల పండుగ జరుపుకొని భూమి పూజ చేస్తుండగా పోలీసులు వచ్చి, ఎలాంటి హెచ్చరికలు లేకుండా కాల్పులు జరిపారని గ్రామస్తులు చెప్పినట్టు ఆయన ఫేస్‌బుక్‌లో రాశాడు. స్వామి అగ్నివేశ్, రాజేంద్ర సచార్, వందనా శివ, సక్సేనాలు కూడా ఇది బూటకపు ఎన్‌కౌంటర్ అని చెప్పారు. పోలీసులు ఏకపక్షంగా కాల్పులు జరిపారని, 20 మంది అమాయక ఆదివాసీలను చంపారని ప్రకటించారు. రామచంద్ర గుహ, ఎస్.ఆర్. శర్మ, నందినీ సుందర్ కూడా ఖండించారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అక్కడి పీసీసీ కార్యదర్శి అధ్యక్షతన ఘటనా స్థలానికి వెళ్లి గ్రామాలన్నీ తిరిగి, ఇది బూటకపు ఎన్‌కౌంటర్ అని, హతులందరూ ఆదివాసీ అమాయకులేనని అన్నారు. ఈ ఘటనపై న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఆ రాష్ట్రానికి చెందిన కేంద్ర వ్యవసాయశాఖ సహాయ మంత్రి డాక్ట ర్ చరణ్‌దాస్ మహంతి కూడా ఈ వాదనను బలపరిచాడు. కేంద్ర హోం మంత్రి చిదంబరం ఇది నిజమైన ఎన్‌కౌంటరే అని అన్నాడు కదా, చనిపోయి న వారందరూ మావోయిస్టులే అని అంటున్నారు కదా! అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్‌సింగ్, ఇంటలిజెన్స్ వారు ఆయనకు సరైన సమాచారం ఇవ్వకపోవచ్చునని అన్నారు. ఈ సంఘటన జరిగీ జరగగానే కేంద్ర హోం మంత్రి చిదంబరం ఇది నిజమైన ఎన్‌కౌంటరే అని చెప్పడమే కాకుండా, సీఆర్‌పీఎఫ్ బలగాలు చాలా చొరవతో మావోయిస్టులను ఎదురుకాల్పుల్లో కాల్చి చంపాయని ప్రశంసించారు. అందులో ఏడుగురు సీఆర్‌పీఎఫ్ జవాన్లు గాయపడడమే ఇది నిజమైన ఎన్‌కౌంటర్ అనడానికి తిరుగులేని నిదర్శనమన్నాడు. ముఖ్యమంత్రి రమణ్‌సింగ్, సీఆర్‌పీఎఫ్ డైరెక్టర్ జనరల్ విజయ్‌కుమార్ కూడా ఇదే వైఖరి తీసుకున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, కేంద్ర మంత్రి వర్గంలో గిరిజన శాఖా మంత్రిగా ఉన్న కిశోర్ చంద్రదేవ్ ఈ మొత్తం సంఘటనపై ధ్వజమెత్తిన తీరు ఒక ఎత్తు. ఆయన ‘ఇది బూటకపు ఎన్‌కౌంటర్, హతులందరూ ఆదివాసీలు అంటూనే, ఒకవేళ వాళ్లలో ఎవరైనా మావోయిస్టులు ఉన్నా, అందరికి అందరూ మావోయిస్టులైనా ఆదివాసీలు మావోయిస్టులు కావడానికి గల కారణా లు ఏమిటో ఆలోచించాలి’ అన్నారు.

ఒకవేళ పిల్లలు కూడా మావోయి జం వైపు ఆకర్షింపబడుతుంటే అందు కు ప్రభుత్వ విధానాలే కారణ మా? స్వీయ విమర్శ చేసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎవరి ప్రయోజనం కోసం సీఆర్‌పీఎఫ్ బలగాలను కేంద్రం నుంచి కోరిందో చెప్పాలన్నారు. ఇవన్నీ అంటూ.. ‘మౌలికంగా మన ప్రభుత్వాల మైనింగ్ పాలసీనే పునఃపరిశీలించాల’ని అన్నారు. ఇది ప్రభుత్వ వర్గాలలో తీవ్ర కలకలం రేపింది. దీంతో చివరకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణకు ఆదేశించింది. కేంద్ర హోం మంత్రి చిదంబరం ఇంకా తన వాదనలన్నింటికి కట్టుబడి ఉంటూనే ‘హతుల్లో మావోయిస్టులుకాని ఆదివాసులు ఉంటే అందుకు క్షమాపణ చెప్తున్నా’నని అన్నారు. దీంతో అనేక విషయాలు చర్చనీయాంశాలయ్యాయి. 
1) ఆదివాసీలు మావోయిస్టులైనా, ఆదివాసుల్లో మావోయిస్టులు న్నా వాళ్లను కాల్చి చంపవచ్చునని అంటున్నారన్నమాట. (జనంలో మావోయిస్టులు ఉన్నప్పుడు జనం కొందరు చావక తప్పదని ఇప్పటికే చిదంబరం, విజయ్‌కుమార్ వంటి వారితో పాటు ఒకరిద్దరు మీడియా లో తేల్చేశారు!)
2)ఆదివాసులు మావోయిస్టులైతే చంపవచ్చునా?
3) మావోయిస్టులైతే ఎన్‌కౌంటర్ పేరుతో చంపవచ్చుననేది చిదంబరం, రమణ్‌సింగ్ లాంటి వాళ్లు ఎప్పుడో తేల్చుకున్న న్యాయం. కనుక ఇప్పుడు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ చేసేది.. చనిపోయిన ఆదివాసుల్లో మావోయిస్టులు ఉన్నారా? లేక ఆదివాసీలే మావోయిస్టులా? అనేది తేల్చడానికి మాత్రమే. ఇది నిజమైన ఎన్‌కౌంటరా? బూటకపు ఎన్‌కౌంటరా? అనేది తేల్చడానికి కాదు. గులాం రసూల్ ఎన్‌కౌంటర్ విషయం లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జస్టిస్ టీఎల్‌ఎన్ రెడ్డి కమిషన్ విచారణ వేసినప్పుడు ఆయన అది ఎన్‌కౌంటరా కాదా అన్న అంశం కాకుండా, ఆ జర్నలిస్టు నక్సలైటే అని తేల్చేశారు. డాక్టర్ బినాయక్‌సేన్ యావజ్జీవ శిక్ష ,‘వరల్డ్ టూ విన్’ సంపాదకుడు ఆసిత్ సేన్ గుప్తాకు ఎనిమిదేళ్ల శిక్ష, అసెంబ్లీలో కరపవూతాలు పంచారన్న నెపంతో మావోయిస్టు సానుభూతిపరులు మాలతీ మొదలైన వారికి పదేండ్ల శిక్ష వేసిన ఛత్తీస్‌గఢ్ న్యాయవ్యవస్థ నుంచి మనం ఏమి ఆశించగలం!ఎన్‌కౌంటర్లు అన్నీ నిజమా? బూటకమా! అన్న విచికిత్స లేకుండా హత్యా నేరంగా నమోదు చేసి విచారించాలని ఆంధ్రవూపదేశ్ హైకోర్టు ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఏకక్షిగీవం గా ఇచ్చిన తీర్పు అమలైనప్పుడు మాత్రమే ఎన్‌కౌంటర్లు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నది. కనీసం బూటకపు ఎన్‌కౌంటర్లు చేయడానికి పోలీసు లు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. చిదంబరం వంటి వారికి ఎన్‌కౌంటర్ల న్నీ నిజమైనవేనని అనడానికీ, మావోయిస్టులైతే కాల్చిచంపేయవచ్చునని అనడానికీ ఆంధ్రవూపదేశ్ హైకోర్టు తీర్పు మార్గదర్శకాలు గుర్తుండే విధంగా చేస్తే కొంత రక్తపాతం తగ్గుతుంది. అలాగే... ప్రభుత్వ విధాన నిర్ణేతలకు అదొక బాధ్యత అని గుర్తుచేస్తుంది. నాగలితో దున్నితో భూమాతకు బాధ కలుగుతుందేమోనని సున్నితంగా కొయ్యముక్కలతో పోడు వ్యవసాయం చేసుకునే ఆదివాసుల గుండెల్లో గుండ్లు దించి, బయోనెట్లతో గుచ్చి హత్యచేసిన పాలకులకు ఆదివాసులు మావోయిస్టులుగా, హింసావాదులుగా కనిపించడం నేటి పాలకుల నీతి. ఇప్పటి చారివూతక విషాదం. ఈ హింసాత్మ దుష్టనీతిలో అమాయక ఆదివాసుల కు న్యాయం జరుగుతుందా? 

-వరవరరావు

    Namasete Telangana News Paper Dated : 07/07/2012

No comments:

Post a Comment