Tuesday, July 10, 2012

కులాలే వర్గాలు కావు - రంగనాయకమ్మ

'విప్లవకారులెవరు మరి?' అని వెంకటేశ్వర్లు అడగడంలో అర్ధం, 'చిన్న కులాల శ్రామికులే విప్లవకారులు కదా?' అని! ఇది చాలా పొరపాటు. శ్రామికులు అన్ని కులాల్లోనూ వున్నారు. శ్రామికుడిగా వున్నందుకే ఎవరూ విప్లవకారులు కాలేరు. బట్టలు ఉతికే చాకలి మనిషిని తీసుకుంటే, ఆ వృత్తి వల్లే అతను విప్లవకారుడు కాలేడు. పాకీ దొడ్లు కడిగే మనిషి అయినా, ఆ వృత్తితోనే విప్లవకారుడు కాలేడు. మేధా శ్రమలు చేసే టీచర్లు గానీ, డాక్టర్లు గానీ, సైంటిస్టులు గానీ, వేతన శ్రామికులుగా ఉన్నా, ఆ వృత్తుల వల్లే విప్లవకారులు కాలేరు. వృత్తుల వల్లే విప్లవకారులయిపోతే శ్రామికులందరూ విప్లవకారులయిపోయినట్టే. వర్గ పోరాట చైతన్యం గల విప్లవకారులవడానికి, వర్గాల జ్ఞానం కావాలి.

ఆ వర్గ జ్ఞానం, ఒక శాస్త్రం ద్వారా కలగాలి. పార్టీ నాయకత్వాల సంగతి చూస్తే, దానికి రిజర్వేషన్లు వర్తించవు. రిజర్వేషన్ల పాత్ర, స్కూలు సీట్లలోనూ, ఉద్యోగాల్లోనూ వున్నట్టు, వర్గ పోరాట సంఘాల్లో వుండకూడదు. పార్టీలో వున్న ఏ సభ్యుడికైనా నాయకత్వ పాత్ర దొరకడం గానీ, దొరకక పోవడం గానీ, ఆ సభ్యుడి శక్తి సామర్ధ్యాల్ని బట్టి జరగాలి గానీ, వారి కులాల్ని బట్టి కాదు. శాస్త్రీ, రెడ్డీ, చౌదరీలు, శక్తి సామర్ధ్యాలు కలవారని చెప్పినట్టు దీనికి అర్ధాలు తీస్తే, అది కలహం అవుతుంది గానీ, చర్చ అవదు.

నాయకత్వ స్థానాల్లో ఎక్కువ కాలం ఒకే వ్యక్తో, ఒకే బృందమో ఉంటే, అది రాజుల పద్ధతే అవుతుంది. శక్తి సామర్థ్యాలు తక్కువగా ఉన్న వారికి కూడా అవకాశాలు లేకపోతే, ఆ శక్తులు పెరిగే మార్గమే ఉండదు. ఎంత శక్తివంతుడైన నాయకుడైనా, మెజారిటీ సభ్యుల ప్రకారం నడవవలసిందే గానీ, రాజులాగా ప్రవర్తించలేడు. 'పదవి' అనేది, ఒక కార్య నిర్వహణ బాధ్యత. 'నాయకత్వం' అనేది, సిద్ధాంత, ఆచరణల జ్ఞానం. ఆ నాయకత్వానికి కాల పరిమితి వుండదు. నాయకుడి కృషి, పదవి వున్నప్పుడూ లేనప్పుడూ కూడా ఒక్కలాగే వుంటుంది.

ఊ 'దోపిడీ కులాల చేతుల్లో బందీగా వున్న రాజ్యాన్ని ఆక్రమించుకోమని అంబేద్కర్ చెప్పాడు కదా? రంగనాయకమ్మ ఈ విషయం చదవలేదా?' ఏ అగ్ర కులాన్నయినా, 'దోపిడీ కులం' అనడం, మొదటి తప్పు! ఒక కులాన్ని, 'దోపిడీ కులం' అనే మాట ఎవరు చెప్పినా అది కుల జ్ఞానమూ కాదు, వర్గ జ్ఞానమూ కాదు. ఏ అగ్ర కులాన్ని తీసుకున్నా, అందులో అధిక సంఖ్య - పేదలే. కొంత సంఖ్య మేధా శ్రమలు చేసే వేతన శ్రామికులు. అగ్ర కులంలో, భూస్వాములుగా, రక రకాల పెట్టుబడిదారులుగా వుండే వాళ్ళ సంఖ్య, అదే కులంలో వుండే పేదల సంఖ్య కన్నా తక్కువ. ఒక వ్యక్తి పూర్తిగా దోపిడీదారుడు అయినట్టు, ఒక కులం అంతా, 'దోపిడీ కులం' అవదు. ఒక వ్యక్తి, పూర్తిగా శ్రామికుడైనట్టు, ఒక కులం పూర్తిగా 'శ్రామిక కులం' అవదు. ఏ కులాన్ని తీసుకున్నా, ఆ కులంలో, వేరు వేరు వర్గాలూ, ఆ వర్గాల్లో వేరు వేరు సెక్షన్లూ, ఉంటాయి.

ఒక వర్గాన్ని తీసుకుంటే, ఆ వర్గంలో, ఒకే కులం మనుషులంతా వుండరు. వేరు వేరు కులాల మనుషులు వుంటారు. దీన్ని క్లుప్తంగా చెప్పుకుంటే, మొత్తం అన్ని కులాల్లోనూ ఉన్న శ్రామికులందరి సంఖ్యా కలిసినది - శ్రామికవర్గం. అలాగే, అన్ని కులాల్లోనూ వున్న దోపిడీదారులందరి సంఖ్యా కలిసినది - దోపిడీవర్గం. ఒక కులం అంతా, ఒక వర్గం కాదు, ఒక వర్గం అంతా, ఒకే కులంతో నిండదు. ఒక అగ్రకులంలో ధనికులు, అదే కులంలో ఉన్న పేదల్ని ఎంత నిర్లక్ష్యంగా చూస్తారో, చిన్న కులంలో కూడా ధనికులు, అదే కులంలో వున్న పేదల్ని అంత నిర్లక్ష్యంగానే చూస్తారు. ఏ కులాన్ని తీసుకున్నా, అందులో జనాభాలో వుండే స్పృహ ప్రధానంగా ధనిక-పేద తేడాల స్పృహే.

ఊ 'శ్రమ విభజనే కాదు, శ్రామికుల విభజన వుంది' అంటూ, దాన్ని పెద్ద తర్కంగా చెపుతున్నారు ఏనాటి నించో! 'శ్రామికుల విభజన' అనడంలో అర్ధం, 'శ్రామికుల్లో ఎక్కువ తక్కువ కుల భేదాలు వున్నాయి కదా; వాళ్ళు, వర్గ పోరాటంలో ఎలా కలుస్తారు?' అని! కానీ, శ్రామికులు పోరాడవలసింది, తోటి శ్రామికులతో కాదు; ఆ పని స్థలంలో, శ్రామికులందరి మీదా పెత్తందారుగా వుండే యజమానితో! అది, శ్రామికులకూ, యజమానికీ జరిగే వర్గ పోరాటం! జీతాలు పెరగాలనో, పని కాలం తగ్గాలనో, ఒక కొత్త చట్టం కావాలనో, యజమాని మీదా, ప్రభుత్వం మీదా, పోరాడితే జరిగే మెరుగుదలలు, అన్ని కులాల శ్రామికులకూ కావాలి.

ఒక బ్రాహ్మణ కార్మికుడికీ, ఒక మాల కార్మికుడికీ, భోజనాల సంబంధం ఉండకపోవచ్చు; పెళ్ళిళ్ళ సంబంధం ఉండకపోవచ్చు. కానీ ఒక ఆర్ధిక మెరుగుదల ఇద్దరికీ సంబంధించిందే కాబట్టి, యజమాని మీద పోరాటంలో ఇద్దరూ ఒకే మాట మీద ఉంటారు; ఉండక తప్పదు. కులాల భేదాలు అలాగే వుండాలని చెప్పడం కాదు ఇది. కానీ, "కులాల విభజనే, యజమానితో పోరాటాన్ని ఆపదు'' - అని చెప్పడం ఇది.

అసలు వర్గ పోరాటాలే జరగకపోతే, దానికి కారణం, కులాల విభజన వుండడం కాదు; వర్గాల గురించి నేర్పడం జరగకపోవడం! 'కుల నిర్మూలనా పోరాటం చేపట్టకుండా, ప్రపంచ కార్మికులారా, ఏకం కండి - అని పిలుపు ఇస్తే, భారత కార్మికులు ఎలా ఏకం అవుతారు?' అని అదే రకం విమర్శ! సమాజంలో వున్న రకరకాల సమస్యల గురించి, పోరాటాలు చేపట్టనక్కరలేదనీ, ఉద్యమాలు లేకుండానే సమస్యలు పరిష్కారం అవుతాయనీ, ఏ విప్లవ మార్క్సిస్టూ అనడు. కుల భేదాల సమస్యలో, ఉద్యమాల వల్ల, రెండు గ్లాసుల పద్ధతి పోవడం, దేవాలయ ప్రవేశాలూ, అస్పృశ్యతా నివారణా - వంటివి తప్పకుండా జరుగుతాయి.

కానీ, అసమాన శ్రమ విభజన మారకపోతే, 'కులాల నిర్మూలన' జరగదు. కులాలు లేని దేశాల్లో కూడా, దోపిడీ శ్రమ విభజన మారకపోతే, అట్టడుగు శ్రమలు చేసే బృందాల పరిస్థితి ఎప్పటికీ మారదు. ఆ మార్పులు కమ్యూనిస్టులు కూడా సాధించలేరు. కాబట్టే, వర్గ పోరాటాన్నే ప్రధమ నినాదంగా చెప్పుకోవలసి వుంటుంది. 'ఫ్యూడల్ కుల వృత్తులు మారితే, కులాంతర వివాహాలు జరుగుతాయి - అంటారు, కొందరు. అది తప్పు' - అని ఒక వాదం. అది తప్పో ఒప్పో తెలియాలంటే, కులాంతరాల్ని పరిశీలిస్తే తెలుస్తుంది. ఒక మాల కులం యువకుడు, డాక్టర్ అవడం వల్ల, అతణ్ణి రెడ్డి కులం యువతి పెళ్ళికి ఇష్టపడింది.

ఒక క్షవరాల కులం యువకుడు ఆ వృత్తిలో గాక, మేధా శ్రమల వృత్తి వల్ల, అతణ్ణి బ్రాహ్మణ యువతి ఇష్టపడింది. ఒక మాదిగ కులం యువకుడు, ధనికుడూ - రాజకీయ నాయకుడు, మంత్రీ అయిన తండ్రికి పుత్రుడైన కారణంగా, అతనిని ఒక అగ్రకులం స్త్రీ పెళ్లాడింది. అంబేద్కర్ విషయంలో జరిగింది కూడా ఇదే. ప్రేమ పెళ్ళిళ్ళ విషయాల్లోనే గాక, అగ్రకులాల్లో సంస్కర్తలైన తల్లిదండ్రులు కుదిర్చే కులాంతరాల్లో కూడా, విద్యాస్థాయీ, ఆర్థికస్థాయీ కుదిరిన చోట్లే ఆ పెళ్ళిళ్ళు చేస్తారు. ఇంకా ఏ కులాంతర వివాహాన్నయినా చూడండి! ఆ సంబంధాలు ఎలా ఏర్పడుతున్నాయో తెలుస్తుంది. ఆ నిమ్న కులాల యువకులకు కుల వృత్తులు మారకపోతే, అగ్ర కులాల యువతులతో పెళ్ళిళ్ళు జరిగేవి కావు. అయితే, ఆ 'క్షవరాలు చేసే' శ్రమల వంటివి ఆగిపోతాయని కాదు. ఆ శ్రమలు సమాజానికి ఎప్పటికీ అవసరమే. ఆ శ్రమలు ఎలా జరగాలి - అనే ప్రశ్నకి జవాబు కోసం, సమానత్వ శ్రమ విభజన దగ్గరికి వెళ్ళాలి.

ఊ చైనా కమ్యూనిస్టు పార్టీ, సమాజాన్ని 27 ఏళ్ళలోనే మార్చిందనీ, భారత పార్టీలు 60 ఏళ్ళు దాటినా అలా చెయ్యలేకపోవడానికి కారణం మొదట కుల నిర్మూలన చెయ్యకపోవడం అనీ - ఒక వాదం. చైనా పార్టీ, తన సమాజంలో ఆ నాడు వున్న వర్గాన్ని, బడా బూర్జువా - పెటీ బూర్జువా - జాతీయ బూర్జువా - అంటూ, ఆ వర్గాల్నీ, వాటి సెక్షన్లనీ పరిశీలించి, తన కార్యక్రమాలూ, ఎత్తుగడలూ నిర్ణయించుకుందంటే, అదంతా వర్గ దృష్టి! ఏ దేశ కమ్యూనిస్టు పార్టీలైనా చెయ్యవలసింది వర్గ దృష్టితోనే.

శ్రామిక ప్రజలకు వర్గ దృష్టిని నేర్పడం చేస్తూ, ఆ క్రమంలోనే కుల నిర్మూలన దృష్టీ, స్త్రీ-పురుష సమానత్వ దృష్టీ - వంటి నూతన భావాలన్నీ నేర్పే కార్యక్రమాలు పెట్టుకోవాలి. కానీ కుల నిర్మూలననే మొదట పూర్తి చెయ్యాలంటే, అది మొదట పూర్తి అయ్యే విషయం కాదు. 'మాకు కుల నిర్మూలనే అంతిమ లక్ష్యం. ఈ లక్ష్య సాధనలో, మొదటి దశ పోరాటం, 'బూర్జువా ప్రజాస్వామిక విప్లవం'. ఈ దశలో బ్రాహ్మణీయ హైరార్కీని బద్దలు చేయటం.' - వెంకటేశ్వర్లు. 'బూర్జువా ప్రజాస్వామ్యాన్ని' దళితులు కొత్తగా తీసుకురానక్కరలేదు. ఇప్పుడు వున్నది అదే. అందులో వున్నది 'బ్రాహ్మణీయ హైరార్కీ' కాదు. దోపిడీ ప్రైవేటు ఆస్తుల హైరార్కీ.

ఈ పాలనలో, దళితులే, ముఖ్యమంత్రులూ, ప్రధాన మంత్రులూ, ప్రెసిడెంట్లూ, ఎంపీలూ, స్పీకర్లూ, అలా ఎన్ని స్థానాల్లోకి వెళ్ళినా, మాయావతి పాలన కన్నా కొత్త పాలనేదీ రాదు. అది, ఆ కుర్చీల మీద కూర్చునే దళితులకు తప్ప, అది కూడా ఆ 5 సంవత్సరాలే తప్ప, నేల మీద తిరిగే దళితులకెవ్వరికీ విప్లవం అవదు. అగ్ర కులాల పెద్దల రాజ్యాధికారంలో, ఆ అగ్ర కులాల నిండా పేదలు ఎప్పటిలా వున్నట్టే, దళిత కులాల పెద్దల రాజ్యాధికారంలో కూడా ఆ దళిత కులాల పేదలు ఎప్పటిలాగే వుంటారు! బూర్జువా ప్రజాస్వామ్యం ద్వారా దళిత నాయకులు సాధించేది - తమ లాభం! అంతే! నాయకుల లాభం సరే, అదే కులాల్లో పేదల విముక్తి సంగతేమిటనేది ప్రశ్న!

- రంగనాయకమ్మ
(ముగింపు రేపు) 
Andhra Jytohi News Paper Dated ; 11/07/2012 

Monday, July 9, 2012

అబూజ్‌మాడ్‌లో ఏం జరుగుతోంది?----డి మార్కండేయ


పెరివూబల్ మలేరియాతో తెహెల్కా ఫొటోక్షిగాఫర్ తరుణ్ శెహ్రావత్ మరణించడంతో అబూజ్‌మాడ్ ప్రాంతం మరోసారి వార్తల్లోకెక్కింది. మహిళా జర్నలిస్టు తుషా మిట్టల్‌తో కలిసి గత ఏప్రిల్‌లో శెహ్రావత్ మాడ్ కొండల పైకి వెళ్లారు. వారం రోజుల పాటు తిరిగి అక్కడ జరుగుతున్నదేమిటో తెలుసుకుని బయటకు వచ్చారు. మాడ్ వాసుల జీవన పరిస్థితులు, మావోయిస్టుల నేతృత్వంలో ఏర్పడిన జనతన సర్కార్లు, వారికి పోలీ సు బలగాలకు మధ్య జరుగుతున్న యుద్ధం, తదితర అంశాలకు సంబంధించిన విలువైన సమాచారం మోసుకువచ్చారు. అయితే, శతాబ్దాలుగా మాడ్ గోండులను పట్టిపీడిస్తున్న మలేరియా మహమ్మారి వారిని వెన్నంటి వచ్చింది. ఇద్దరూ మంచం పట్టారు. ఆధునిక వైద్యం శెహ్రావత్‌ను కాపాడలేకపోయింది. మే 15న ఆ కెమెరా యోధుడు అంతిమశ్వాస విడిచాడు. కాగా, తుషా మిట్టల్ ఆస్పత్రి బెడ్‌పై మృత్యువుతో పోరాటం సాగిస్తున్నది. అబూజ్‌మాడ్‌లో జరుగుతున్నదేమిటో, అక్కడి ప్రజల కష్టాలేమిటో లోకానికి తెలియజెప్పిన ఈ ఇద్దరు జర్నలిస్టుల సాహసాన్ని పత్రికా ప్రపంచం కొనియాడింది. మావోయిస్టు పార్టీ సైతం వీరిని ఆదివాసుల మిత్రులుగా పేర్కొంటూ శెహ్రావత్ కుటుంబానికి సంతాపం తెలిపింది. తుషా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది.

ఒకప్పుడు దుర్భేద్యమైన, సర్వే జరగని ప్రాంతంగా వినుతికెక్కిన అబూజ్‌మాడ్‌కు ఇటీవలికాలంలో సందర్శకులు పెరిగారు. 2009 ఆగస్టు నుంచి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ఆపరేషన్ గ్రీన్‌హంట్ పేరిట వేలాది పోలీసు, పారా మిలిటరీ బలగాలను మోహరించి మావోయిస్ట్లులపై అప్రకటిత యుద్ధాన్ని ఆరంభించిన నేపథ్యంలో అందరి దృష్టి బస్తర్‌పై పడింది. మనుగడ కోసం ఒకరు, ఆధిపత్యం కోసం మరొకరన్నట్లు పరస్పరం భారీ దాడులకు పూనుకుంటుండడం, ప్రాణనష్టాలు పెరగడంతో మీడియా కూడా ఈ ప్రాంత పరిణామాలపై కేంద్రీకరించింది. మావోయిస్టు ఉద్యమ ప్రాబల్యం అధికంగా ఉన్న దంతేవాడ, బీజాపూర్, నారాయణ్‌పూర్ జిల్లాలకు జర్నలిస్టుల రాకపోకలు పెరిగా యి. ఈ సందర్భంగా మావోయిస్టులకు తిరుగులేని కోటగా, ప్రధాన స్థావరంగా ఉన్న అబూజ్‌మాడ్ సహజంగానే అందరినీ ఆకర్షించింది. గౌతం నవలఖా, రాహుల్ పండిత, సత్నామ్‌సింగ్ మొదలు తెహెల్కా బృందం వరకు ఎందరో జర్నలిస్టులు అబూజ్‌మాడ్ ను సందర్శించారు. ఎన్నో ఆసక్తికరమైన కథనాలను అందించారు.

అబూజ్‌మాడ్ చరిత్ర ఏమిటి? అబూజ్‌మాడియాల జీవన విధానం ఎలా ఉంటుంది? సంస్కృతీ సంప్రదాయాల మాటేమిటి? మావోయిస్టులు అక్కడ పాగా ఎలా వేయగలిగారు? ప్రభుత్వ బలగాలు అక్కడికి ఎందుకు చేరుకోలేకపోతున్నాయి? పన్నెండేళ్ల కిందట కొత్తగా ఏర్పడిన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో బస్తర్ అతిముఖ్యమైనది. పూర్తిగా ఆదివాసులు నివసించే ప్రాంతం. అడవులు, నదులు, ఖనిజవనరులు దండిగా ఉన్న ప్రాంతం. ఒకప్పుడు ఒకే జిల్లాగా ఉన్న బస్తర్‌ను ఇప్పుడు ఏడు జిల్లాలుగా విభజించారు. ఈ ఏడు జిల్లాల్లో ఒకటైన నారాయణపూర్‌తో పాటు మహారాష్ట్రలోని గడిచిరోలి జిల్లా భామ్రాగడ్ తాలూకాలో అబూజ్‌మాడ్ కొండలు విస్తరించివున్నాయి. ఉత్తరం నుంచి దక్షిణానికి 80 కి.మీ. లు, పడమటి నుంచి తూర్పునకు 50 కి.మీ.ల మేర వ్యాపించిన మాడ్ ప్రాంతం విస్తీర్ణం 4వేల చదరపు కిలోమీటర్లు. ఇక్కడున్న చిన్నా పెద్ద పల్లెలు 237 కాగా, జనాభా సుమారు 35వేలు. ఒకే ఒక ఇల్లున్న జనావా సం కూడా ఇక్కడ గ్రామం కిందికే వస్తుంది. వంద ఇండ్లుంటే అది పెద్ద గ్రామం.

ఇక్కడ నివసించే ఆదిమ తెగ పేరు మాడియా గోండు లు. వీరి జీవన విధానం, సంస్కృతీ సంప్రదాయాలు విభిన్నమైనవి. వైవిధ్యంతో కూడుకున్నవి. ప్రకృతితో విడదీయరాని సంబంధం కలిగినట్టివి. పోడు వ్యవసాయం, జంతువుల, చేపల వేట, ఆకులు అలములు, పండ్లు ఫలాల సేకరణ వీరి ప్రధాన ఆర్థిక కార్యకలాపాలు. మొన్నమొన్నటి వరకూ వీళ్లు కేవలం ఉప్పు, బాణాలకు వాడే ఇనుపభాగాలు, పంచెల కోసం మాత్రమే గుట్టలు దిగి నారాయణపూర్ అంగడికి వెళ్లేవారు. ఇక వీరి (పోడు)వ్యవసాయం విచివూతంగా సాగుతుంది. కొండవాలు ను ఎంచుకుని అక్కడున్న చెట్లను నరికి తగులబెట్టి వానలు పడగానే కొహ్‌లా అనే ధాన్య పు గింజలను చల్లుతారు. అటుపైన ఎలాంటి మానవక్షిశమ లేకుండానే చేతికి వచ్చిన పంట ను దంచి అన్నంలా వండుకుంటారు. నాగలి దున్నడం వీరికి తెలియదు. బియ్యపన్నంతో పోల్చితే సగం కూడా పోషకవిలువలు లేని కొహ్‌లాను గట్కలా వండుకుంటారు.

కూరగా పచ్చి లేదా ఎండిన మాంసం, చేపలు, అడవిలో విస్తృతంగా దొరికే బొప్పాయి, గోంగూర, ఇతర ఆకుకూరలను ఉపయోగిస్తారు. నూనె వాడకం చాలా తక్కువ. నివాసాలు ఎత్తైన ప్రదేశంలో ఉంటాయి. ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ సమీపంలోనే అన్ని కాలాల్లో ప్రవహించే చిన్నచిన్న సెలయేళ్లు ఉంటాయి. అడవిలో దొరికే వెదురుబొంగులు,కలప, నదీతీరంలో పెరిగే ఒకరకం గడ్డితో ఇళ్లు నిర్మించుకుంటారు. ఇళ్లు సాధారణంగా చిన్నవిగా ఉండి ఒక జంట నివసించడానికి అనువుగా ఉంటాయి. పెళ్లయిన ప్రతి జంటకూ ఓ ఇంటిని నిర్మించి ఇవ్వడం అక్కడ ఆనవాయితీ.

పెళ్లికాని యువతీయువకులు నిద్రించడానికి ఉద్దేశించిన గోటుల్ ఈ తెగలోని మరో ప్రత్యేకత. ప్రతి పల్లెలోనూ గోటుల్ ఉంటుంది. పాలు మరిచిన పిల్లల నుంచి యుక్తవయస్సు అమ్మాయిలు, అబ్బాయిల వరకు గోటుల్‌లో సభ్యులుగా ఉంటారు. సీనియర్ సభ్యుడొకరు గోటుల్ పెద్దగా ఉంటూ ఇక్కడ జరిగే కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంటాడు. పగలంతా తల్లిదంవూడులతో పాటు రకరకాల పనులు చేసే పిల్లలు సాయంత్రం కాగానే గోటుల్ వద్దకు చేరతారు. ఆటపాటల్లో నిమగ్నమవుతారు. గానాబజానా, డ్యాన్సులు మొదలవుతాయి. చివరకు అలసిపోయి ఏ రాత్రికో నిద్రిస్తారు. ఈ ఆటపాటల క్రమంలో యువతీ యువకుల మధ్య ప్రేమ ఏర్పడడం, సన్నిహితం కావడం సహజంగానే జరుగుతుంది. అలా పరస్పరం ఇష్టపడినవారి మధ్య లైంగిక సంబంధాలు వీరి సమాజంలో తప్పు కాదు. ఇలాంటి జంటలు పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుని వేరు కాపురం పెడతాయి.

పెళ్లయిన మరుక్షణం వీరు గోటుల్ సభ్యత్వం కోల్పోతారు. మాడ్ గుట్టల కింద మైదాన అటవీవూపాంతాల్లో నివసించే మాడియాల్లో కూడా గోటుల్ ఆచారం ఉన్నా రాత్రిపూట ఆటపాటల తర్వాత ఎవరి ఇళ్లకు వారు వెళ్లి నిద్రించడంగా పరిణామం చెందింది. వస్త్రధారణ విషయానికి వస్తే, మావోయిస్టులు ప్రవేశించేవరకూ ఇక్కడి స్త్రీలు పంచె లాంటి వస్త్రాన్ని నడుముకు చుట్టుకునేవారు. ఛాతీపైన ఎలాంటి ఆచ్ఛాదనా ఉండేది కాదు. ప్రస్తు తం పెళ్లికాని అమ్మాయిలు బ్లౌజులు ధరిస్తున్నారు. పురుషులు బుడ్డగోచీ పెట్టుకుంటారు. వెనుకబడిన ఆర్థిక విధానం, పురాతన సంస్కృతితో పాటు కనీస సౌకర్యాలు లేని లోటు కొట్టొచ్చినట్లు కనబడుతుంది. ఆస్పవూతులు, రోడ్లు,కరెంటు,పాఠశాలలు లేవు. అన్నింటికంటే ముఖ్యంగా మార్కెట్ లేదు. దోపిడీ లేదు. ప్రపంచీకరణ వాసనలు లేవు. దోపిడీ దారులు లేరు. కారల్ మార్క్స్ చెప్పిన ఆదిమ కమ్యూనిస్టు సమాజం తరహాలో జీవించేవారు.

1947 తర్వాత అబూజ్‌మాడ్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. భారత ప్రభుత్వ ప్రతినిధులుగా అటవీ, పోలీసు సిబ్బంది ఇక్కడి పల్లెల్లోకి రావడం ప్రారంభమైంది. తుపాకులతో వచ్చి, ఆదివాసులు సేకరించుకున్న ఇప్పపువ్వు తదితర అటవీ ఉత్పత్తుల ను,కోళ్లను ఎత్తుకెళ్లడం జరిగేది. 1970లలో అబూజ్‌మాడ్ గుట్టల అంచున ఉత్తరాన దల్లీ-రాజ్హరా ప్రాంతంలో ఇనుప గనుల తవ్వకం మొదలైంది. 80లలో కుతుల్ లాంటి చోట్ల రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో ఆశ్రమపా స్థాపించారు. సోన్‌పూర్, ఛోటాఢోంగర్ వంటి పెద్దక్షిగామాలకు మట్టిరోడ్లను నిర్మించారు. ఈ క్రమంలో 1985లో మాడ్ కొండల పైకి మొదటిసారిగా మావోయిస్టులు అడుగుపెట్టారు. అప్పటినుంచి పీపుల్స్‌వార్ పేరు తో ఉన్న ఆ పార్టీ నాయకత్వంలో గడ్‌చిరోలిలోనూ,బస్తర్‌లోనూ బలమైన విప్లవోద్యమం కొనసాగుతోంది. ప్రజాసంఘాలు చురుగ్గా పనిచేస్తున్నాయి. ఈ నిర్మాణాలే గెరిల్లా దళాలుగా అభివృద్ధిచెందాయి. మనుగడ కోసం ప్రకృతితో పోరాడుతున్న అబూజ్‌మాడియాలకు అండగా నిలి చి వారిని వేధిస్తున్న అటవీ సిబ్బందిని తరిమికొట్టాయి. ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేయ డం ఎలాగో చూపాయి. కూరగాయలు పండించడం నేర్పాయి. గోటుల్ వ్యవస్థలో మహిళకు జరుగుతున్న ఆన్యాయాన్ని అర్థం చేయించాయి. బ్లౌజులు ధరించడాన్ని కేంపెయిన్‌గా కొనసాగించి మహిళల గౌరవాన్ని నిలబెట్టాయి. వారి ఆటల్లో ఆటగా, పాటల్లో పాటగా నిలు స్తూ అభిమానాన్ని చూరగొన్నాయి.

ఈ ఆత్మీయతలే ప్రాతిపదికగా ఇక్కడ మావోయిస్టులు బలపడ్డారు. దట్టమైన అడవులు, ఎత్తైన కొండలతో స్థానికుల అండ లేకుండా అపరిచితుపూవ్వరూ ప్రవేశించ వీలుగాని ఈ ప్రాంతాన్ని సైనిక శిక్షణకు, విశ్రాంతికి, బలగాల సమీకరణకు, నాయకత్వం తలదాచుకోవడానికి మావో యిస్టులు విస్తృతంగా ఉపయోగించుకున్నారు. ఈ విషయాన్ని 1995 నాటికి గాని పోలీసులు పసిగట్టలేదు. ఆ వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అబూజ్‌మాడ్‌పై దృష్టి కేంద్రీకరించాయి. అభివృద్ధి పథకాలు, వ్యవసాయ శిక్షణ పేరుతో, హోంగార్డు ఉద్యోగాల ఎరతో కొంతమంది స్థానిక యువకులను ఇన్ఫార్లర్లుగా మార్చుకోవడానికి ప్రయత్నించాయి. అప్పుడప్పుడు గుట్టల అంచుల్లో ఉన్న గ్రామాలకు పోలీసులు వెళ్లి దాడులు చేయడం, గిరిజనులను నిర్బంధించడం, దళాల గురించి తెలుసుకుని కాల్పులకు దిగడం చేశాయి.

1996లో వేయి మంది బలగాలకు నాయకత్వం వహించిన అప్పటి బస్తర్ ఎస్‌పీ 15రోజుల పాటు ఆపరేషన్ నిర్వహించి మొట్టమొదటిసారిగా మాడ్ లోతట్టుకు ప్రవేశించిన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. కాగా, శత్రు ఎత్తుగడల్లో మార్పును గమనించిన మావోయిస్టులు తర్వాతికాలంలో తమ ఎత్తుగడలనూ మార్చుకున్నారు. అప్పటిదాకా షెల్టర్ జోన్‌గా ఉన్న మాడ్‌ను సంఘటితం చేశారు. గ్రామక్షిగామాన పార్టీ, ప్రజాసంఘాల నిర్మాణంపై కేంద్రీకరించారు. రాజ్యాధికార అంగాలైన జనతన సర్కార్లను ఏర్పరచారు. స్థానిక యువతీయువకులను పెద్దయెత్తున దళాల్లో చేర్చుకున్నారు. పీఎల్‌జీఏ దళాలను ప్లాటూన్లుగా, కంపెనీలుగా ఏర్పాటు చేసి అడవిలోకి చొచ్చుకురావడానికి యత్నించిన పోలీసుబలగాలపై ఎప్పటికప్పుడు దాడులు చేస్తూ వచ్చారు. ఇలా 2008 నాటికి అబూజ్‌మాడ్‌ను శవూతువు ప్రవేశించ వీలుగాని గెరిల్లా స్థావరంగా అభివృద్ధి చేశారు.
-డి మార్కండేయ
dmknamaste@gmail.com
(అబూజ్‌మాడియాలకు ముప్పు గురువారం సంచికలో).
Namasete Telangana News Paper Dated : 10/07/2012 

వాస్తవాల వెలుగులో భూ సమస్యలు - పి.యస్.అజయ్ కుమార్

భూమి సమస్య అంటే ఏమిటి? భూ సమస్య పరిష్కారం కోసం ఎంతో రక్తం పారిన ఈ గడ్డ మీద ఈ ప్రశ్న కొత్తగా అడగాలా? అడగాలి. ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంపై కమ్యూనిస్టులు తమ ప్రభావాన్ని చాలా కాలం క్రిందటే కోల్పోయినప్పటికీ బౌద్ధిక రంగంలో మాత్రం వారి ప్రభావం చాలా బలంగా ఉంది. మర్రి చెట్టు క్రింద ఇతర మొక్కలు మొలవనట్లుగా కొత్త, ఇతర భావాలను అది ఎదగనియ్యదు.

ఒక తీవ్ర వామపక్ష పార్టీ వారి అనుబంధ విద్యార్థి సంఘం సమావేశంలో మాట్లాడుతూ అంబేద్కర్‌ను వివరించే సందర్భంలో కె. బాలగోపాల్ ఇలా అన్నారు: 'వర్గ పోరాటాల నేపథ్యం నుంచి వచ్చిన సిద్ధాంతాలు మాత్రమే అలవాటు కావడం వల్ల భిన్నమైన సిద్ధాంతాలను గౌరవించడం మనమింకా నేర్చుకోలేదు'. వామపక్ష భావజాల ప్రభావం కారణంగా సామాజిక శాస్త్ర రంగాలలో కొన్ని పదాలకు కొన్ని అర్థాలు స్థిరపడిపోయాయి.

'భూమి సమస్య' అంటే దున్నేవానికే భూమి, భూముల స్వాధీనం, జెండాలు పాతడం. విశాఖపట్నం జిల్లా చీడికాడ మండలం వీరభద్ర పేట గ్రామంలో (ఈ గ్రామం షెడ్యూల్డ్ ప్రాంతం కాదు) సింగారపు పోలయ్య అనే ఆదివాసీ, తన ఇద్దరి కుమారులతో కలిసి 22 ఎకరాల మెట్ట భూమిని దశాబ్దాలుగా సాగు చేస్తున్నారు. కాని ఆ గ్రామం సెటిల్‌మెంట్ భూమి రికార్డులో పట్టాదార్లుగా అతని పేరుతో బాటు మరో ఇద్దరు ఆదివాసేతరుల పేర్లు కూడా వున్నాయి. అవి ఎలా వచ్చాయో, ఎందుకు వచ్చాయో పోలయ్యకు తెలీదు. ఈ ఆదివాసేతరుల వారసుల నుంచి ప్రమాదం పొంచి వుండడంతో పాటు 22 ఎకరాలపై పోలయ్య కుటుంబానికి స్థిరమైన యాజమాన్య హక్కులు లభించలేదు.

సెగ్గె రాజులమ్మది మరో చిత్రమైన సమస్య. ఆమెకు పట్టా వుంది. పట్టాదారు పాసు పుస్తకం కూడా వుంది. కాని ఆ రెండిటిలో 'పెగె'్గ రాజులమ్మ అని పడింది. 'సె' కాస్త 'పె'గా మారడంతో ఈ రికార్డు ఆమెకు ఎలాంటి రుణ సదుపాయాన్ని కల్పించడం లేదు. ఇద్దరు దళితులు ప్రభుత్వం తమకు ఇచ్చిన బంజరు భూమిని దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్నారు. ప్రభుత్వం ఈ భూమిని స్వాధీనం చేసుకొని కొంత పరిహారం ఇచ్చేందుకు ముందుకు రాగా సమస్య వచ్చింది. ఒకరికి కేటాయించిన సర్వే నెంబరులో మరొకరున్నారు. ఆ కారణంగా వారికి పరిహారం చెల్లింపు ఆగిపోయింది. భూమి పోయింది పరిహారం రాలేదు. భూస్వాముల నుంచి భూములు స్వాధీనం చేసుకొని భూమిలేని వారికి పంపిణీ చేయడం వర్గ పోరాటాన్ని సూటిగా తాకుతుంది.

కనుక వామపక్ష శక్తులకు అదెంతో ప్రీతిపాత్రమైన కార్యక్రమం. ముందు ప్రస్తావించుకున్న సమస్యలకు అటువంటి ప్రతిపత్తి, ఆకర్షణ వుండదు. కాని ఆ సమస్యల వలయంలో చిక్కుకుపోయిన వారు నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతుంటారు. వారిని సంఘటితపర్చి సహాయం అందించే వారెవరూ కన్పించరు. 'భూమి సమస్య'ను సాంప్రదాయ అర్థ చట్రం నుంచి కాస్త పక్కకు జరిగి చూడగలిగితే -భూస్వాములు, భూమిలేని కూలీలు అనే వర్గ విభజన కన్పించని గ్రామాలతో సహా - అనేక గ్రామాలలో ఇలాంటి సమస్యలు కొల్లలుగా కన్పిస్తాయి. భూమి హక్కులకు సంబంధించిన అతి చిన్న (పైకి అలా కన్పిస్తుంది) సమస్య సహితం పేదలను అతిపేదలుగా మార్చగలదు. అదే విధంగా ఆ సమస్య పరిష్కారం వారిని అనేక ఒత్తిళ్ళ నుంచి విముక్తి చేసి ఒక మెట్టు ఎదిగేందుకు సహాయపడనూ గలదు.

భూమి సమస్యను మూడు రకాలుగా విభజించవచ్చును. మొదటిది రాజకీయ భూమి సమస్య. ముందు చెప్పినట్లుగా ఇది వర్గ పోరాటాన్ని సూటిగా తాకుతుంది. రెండవది పాలన భూమి సమస్య. భూ పాలన పద్ధతులు, వాటి లోపాలు, భూ పాలన యంత్రాంగం, దాని అవినీతి, వివక్ష కారణంగా పరిష్కరించదగినవైనప్పటికీ పరిష్కారం కాని భూమి సమస్యలను ఈ వర్గీకరణ క్రిందకు తీసుకురావచ్చును. నిజానికి తరచి చూస్తే ఇది కూడా వర్గ పోరాటంలో భాగమేనని మరో రూపంలో అది సాగుతున్నదని సులువుగానే గ్రహించవచ్చును. మూడవది భూమి అభివృద్ధి సమస్య.

దళిత, ఆదివాసీ పేదలు ఎదుర్కొంటున్న పాలన భూ సమస్యలు ఏమిటి, ఎన్ని, వాటిపై పనిచేయడానికి, పరిష్కరించడానికి కావలసిన అవగాహన, జ్ఞాన నైపుణ్యాలేమిటి? వీటితో పనిచేసే క్రమంలో వ్యక్తిగత లబ్ధి, వ్యక్తిగత పని విధానంలోకి జారిపోకుండా సమష్టి చైతన్యాన్ని ఎలా నిర్మించాలి? తమ సమస్య పరిష్కారం కాగానే బాధితులు 'సంఘం' పట్ల ఆసక్తిని కోల్పోతుంటారు. పాలన భూ సమస్యలను అంతిమంగా రాజకీయ భూ సమస్యకు ఎలా అనుసంధానం చేయాలన్నది ప్రజాతంత్ర, వామపక్ష శక్తుల ముందున్న సవాల్.

ప్రపంచ బ్యాంక్ నిధులతో పేదరిక నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థ ట్ఛటఞ. దీనిని చంద్రబాబు హయాంలో 'వెలుగు' అని, వైఎస్ పరిపాలన నాటి నుంచీ 'ఇందిరా క్రాంతి పథం' అని వ్యవహరిస్తున్నారు. ఈ సంస్థకు చెందిన భూమి విభాగం 2010 జూలై నుంచి 2011 మార్చి మధ్య రాష్ట్రంలోని 23 జిల్లాలు, 956 మండలాలు, 22,548 రెవిన్యూ గ్రామాలలో 14 లక్షల దళిత, ఆదివాసీ కుటుంబాల భూములను ప్రత్యక్షంగా పరిశీలన చేపట్టింది. 50 వేల మంది దళిత ఆదివాసీ యువకులకు శిక్షణ ఇచ్చి, వారికి ప్రాథమిక రెవిన్యూ రికార్డులను అందజేసి ఈ బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వాతంత్య్రం ముందుగానీ, ఆ తర్వాత గానీ దళిత, ఆదివాసీ భూములను భౌతికంగా పరిశీలించే ఇటువంటి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్‌లో జరగలేదు. ఈ పరిశీలన ఫలితాలు విస్తు గొలిపేవిగా ఉన్నాయి.

దళిత, ఆదివాసీల స్వాధీన అనుభవంలో ఉన్న 40 లక్షల ఎకరాలను పరిశీలించగా అందులో 25 లక్షల 92వేల ఎకరాలకు సంబంధించిన 22 లక్షల 12 వేల సమస్యలు వున్నట్లు (ప్రతి బాధితుని సమస్యను ఒక యూనిట్‌గా) గుర్తించారు. అంటే పరిశీలించిన 40 లక్షలలో సగం భూములు ఏదో ఒక సమస్యలో చిక్కుకొని వున్నాయి. దీంతో బాటు 12 లక్షల భూమిలేని దళిత, ఆదివాసీ కుటుంబాల వివరాలను సహితం ఈ సర్వేలో అదనంగా సేకరించడం విశేషం. ఈ 22 లక్షల సమస్యలను 71 రకాలుగా విభజించారు. ఈ బృహత్తర ప్రక్రియ ఒక ఎత్తయితే, మొత్తం సమాచారాన్ని ట్ఛటఞ.్చఞ.జౌఠి. వెబ్‌సైట్ ద్వారా పౌర సమాజానికి అందుబాటులో వుంచడం మరొక ఎత్తు. వామపక్ష ప్రజాతంత్ర శక్తులు ఒక్క మౌస్ క్లిక్‌తో ఈ సమాచారాన్ని ఇప్పుడు పొందవచ్చును.

71 రకాల భూమి సమస్యలలో నాలుగు రకాల సమస్యలు సింహభాగాన్ని ఆక్రమిస్తున్నాయి. అవి: (అ) రెవిన్యూ రికార్డులలో తేడాలు (8 లక్షలు); (ఆ) రికార్డ్ ఆఫ్ రైట్స్ 1 బి రిజిస్టరులో నమోదుగాక పోవడం (4 లక్షలు); (ఇ) పట్టాదారు, అనుభవదార్లలో తేడాలు (3 లక్షల 36 వేలు); (ఈ) పహాణి/ అడంగల్‌లో పేర్ల నమోదులో తేడాలు (3 లక్షల 22 వేలు). నిజానికి ఈ సమస్యలను కొద్దిపాటి అవగాహన, కొంత ఒత్తిడితో సులువుగా పరిష్కరించవచ్చు.

'భూమి అభివృద్ధి సమస్య' విస్తృత చర్చను లేవదీసే పద ప్రయోగం. 'అభివృద్ధి' అంటే ఏమిటన్నది నేడు తీవ్రంగా జరుగుతున్న చర్చ. సన్న, చిన్నకారు వ్యవసాయం గిట్టుబాటు కాకుండా చేయడమే నేటి వ్యవసాయ విధానంగా వుంది. ఈ సందర్భంలో చాలా పరిమిత అర్థాన్నే తీసుకోవడం జరుగుతుంది. చీమల పాడు అనే గ్రామంలో 40కుటుంబాల రైతులకు మెట్ట భూములున్నాయి. కానీ వారు సాగుచేయడం లేదు. ఎందుకంటే వారికి దుక్కిటెడ్లు లేవు. కూలికి దుక్కిటెడ్లు లేదా బాడుగకు ట్రాక్టరు పెట్టి దున్నించుకునే పరిస్థితి లేదు. 25 నుంచి 35వేల పెట్టుబడితో ఒక మాదిరి ఎడ్లను సంపాదించుకోవచ్చు.

కానీ వారికి దుక్కిటెడ్లకు రుణం ఇచ్చే ప్రభుత్వ పథ కం, సంస్థ ఏదీ లేదు. ఉన్న పథకాలలో లబ్ధిదారునిగా ఉండాలంటే స్పష్టమైన యాజమాన్య హక్కు పత్రాలు ఉండాలి. హక్కు పత్రాలు ఉన్న తరువాత అవసరమైన సహాయం అందించే ఏర్పాటు ఉండాలి. ముందు ప్రస్తావించిన 'సెర్పు' సర్వే ద్వారా బయటకు వచ్చిన సమస్యలు లేని భూములతో కలుపుకొని 9000 కోట్లు వ్యయంతో 30.14 లక్షల ఎకరాలలో 18.39 లక్షల భూమి అభివృద్ధి పనులను జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంతో రూపొందించారు. ఎస్సీ, ఎస్టీ, బిసి పేద వర్గాల భూమి అభివృద్ధికి రూపొందించిన ఈ అతిపెద్ద కార్యక్రమంలో వారు పూర్తి స్థాయిలో పాల్గొని లబ్ధి పొందడం 'భూమి అభివృద్ధి సమస్య'లో భాగంగా గుర్తించవచ్చు.

చివరగా కార్యాచరణ కోణం ఏమిటో చూద్దాం. భావ సారూప్యత గల ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు ఒక వేదికగా ఏర్పడి 'సెర్పు' వదిలేసిన గ్రామాలలో సర్వే నిర్వహించవచ్చు. ఇప్పటికే అందుబాటులో ఉన్న సమాచారాన్ని వాడుకొని సమస్యల పరిష్కారానికి ఒక ప్రణాళికాబద్ధమైన కార్యక్రమం రూపొందించుకోవచ్చు. ఈ సమస్యలలో ఫలితాలు సాధించడం సాపేక్షికంగా సులువు. చిన్నచిన్న విజయాలు పేదలను సామాజిక కార్యకర్తలను, ఉద్యమకారులను ఉత్సాహపరుస్తాయి. పెద్ద లక్ష్యాల సాధనకు వారిని పురికొల్పుతాయని మనం మర్చిపోకూడదు. భూమి సమస్యకు గల సాంప్రదాయ అర్థ నిర్వచనాన్ని విస్తృతపరచడం ద్వారా మాత్రమే దళిత, ఆదివాసీ, పేదవర్గాలకు చేరువ కాగలము.

- పి.యస్.అజయ్ కుమార్
రాష్ట్ర కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ వృత్తిదారుల యూనియన్ 
Andhra Jyothi News Paper Dated : 10/07/2012 

సమానత్వ శ్రమ విభజనే మార్గం - రంగనాయకమ్మ

నేను రాసిన 'అస్తవ్యస్త సంస్కర్తలు' (ఆంధ్రజ్యోతి, మే 15) వ్యాసానికి స్పందనగా వచ్చిన వ్యాసాలన్నీ చూశాను. ఆ వ్యాసాల్లో వున్న చాలా అంశాలు, నా 'దళిత సమస్య...' పుస్తకంలో ప్రస్తావించినవే. అవే చర్చలు అనంతంగా సాగనక్కరలేదు కాబట్టి, అలాంటి వాటిని కొన్నిటిని వదిలేసి, మిగిలిన వాటికే పరిమితమవుతాను. 'రంగనాయకమ్మకి పిచ్చి' అని తేల్చి ఆనందించేవాళ్ళకి, వాళ్ళ ఆనందం వాళ్ళకి ఉండనిస్తాను. 'రంగనాయకమ్మ, మార్క్సిజం తనకే తెలుసనుకుంటుంది' అని ఒకరూ; 'ఆమె, తన నిజమైన వర్గంలోకీ, నిజమైన కులంలోకీ, వెళ్ళిపోయింది' అని ఇంకొకరూ; అటువంటి కడుపుమంట వ్యాఖ్యానాలు ఎన్ని కురిసినా, అవి కుల సమస్య మీద చర్చలు కాలేవు. ప్రతీ వంకర వాదానికీ, తిన్నని జవాబులు ఉంటాయి.

కానీ దినపత్రిక పరిధిలో అదంతా అనవసరం. నా '... సంస్కర్తల' వ్యాసంలో వున్న ప్రధానమైన అంశం, 'కుల నిర్మూలన' సమస్యలో, అంబేద్కర్ మార్గానికీ, మార్క్సు మార్గానికీ, తేడా!

'ఈ దేశంలో, వర్గాలే కాదు, కులాలూ ఉన్నాయి' అని ఒక వాదం. కులాలు లేవని ఎవరన్నారు? కులాల సంగతి అందరికీ తెలిసిందే. ఉన్న 'వర్గాలకు' పరిష్కారం ఏమిటీ, ఉన్న 'కులాలకు' పరిష్కారం ఏమిటీ - ఇదే ఇక్కడి సమస్య! 'ఈ దేశంలో, కులమే వర్గం; వర్గమే కులం' అని ఇంకో వాదం! అంటే, 'వర్గమూ, కులమూ, ఒకటే' అనడం ఇది! 'వర్గం' అంటే ఏమిటో, 'కులం' అంటే ఏమిటో, వాటి సంబంధాలు ఏమిటో, స్పష్టత లేని వ్యాఖ్యలు ఇవి!

ఈ చర్చలో, అసలు ప్రశ్నలు రెండే. 1) రిజర్వేషన్లతో అవసరం లేకుండా, అందరూ సమానులుగా జీవించడానికి, ఎలాంటి పరిస్థితులు ఉండాలి? 2) కులాంతర వివాహాలు విరివిగా జరుగుతూ, కుల భేదాలు అంతరించడానికి, ఎలాంటి పరిస్థితులు ఏర్పడాలి? ఈ 2 ప్రశ్నల సారాంశమూ ఒకటే. చర్చ, ఈ అంశాల మీదే జరగాలి. ఎదుటి వాళ్ళకి పెట్టే శాపనార్ధాల్ని ఎంచుకోవడం మీద కాదు.

*"కుల నిర్మూలన' కోసం, హిందూ మత గ్రంధాల్ని నిషేధించడం అంబేద్కర్ మార్గం'' అంటారు ఒకరు. హిందూ మత గ్రంధాల నిషేధమే జరగాల్సిన మార్గం అయితే, దళిత ప్రజలే రాజ్యాధికారంలోకి వచ్చి, దళిత నియంతృత్వం తెచ్చి, ఆ నిషేధం పెట్టవచ్చు. అయితే దానితో, కుల భేదాలు అంతరించవు.

* మతం కావలసిన వాళ్ళకి, మూర్ఖ నమ్మకాల్ని నేర్పే ఏ మతం కన్నా, హేతువాదాన్ని చెప్పే బుద్ధుడి మతం మంచిదే. కానీ బుద్ధుడు చెప్పినవి ఎన్ని ఉత్తమ సూక్తులైనా, వాటిని సాధించే మార్గం - అష్టాంగ మార్గమే. ఆ మార్గం, ఆ సూక్తుల్ని సాధించలేదు. ఆనాటికి అంత కన్నా మార్గం లేదు. అది బుద్ధుడి పరిమితి.

* 'కమ్యూనిస్టులు ఆర్ధికమే మూలం - అంటారు, అది కుత్రిమం' అని, ఒక విమర్శ. ఆర్ధికం - అనే అంశంలో ఉత్పత్తి సంబంధాలూ, ఆస్తి హక్కులూ, యజమానీ శ్రామిక సంబంధాలూ, శ్రమ దోపిడీ, దాని శ్ర మ విభజనా - ఇన్ని లక్షణాలు ఉన్నాయి. అన్నిటికీ కలిపి క్లుప్తమైన పే రు-ఆర్ధికం. మానవ సంబంధాలకు, గుణమూ రూపమూ ఇచ్చేది అదే. అది అసమానత్వాలలో వుంది కాబట్టి, దాన్ని సమానత్వం చేసుకోవాలి.

* 'బ్రాహ్మణులే, కుల విధానాన్ని పుట్టించారు' అనేది అంబేద్కర్ సిద్ధాంతంగా, దాన్ని సమర్ధిస్తూ చెపుతోంది ఒక వ్యాసం. బ్రాహ్మణులే కులాల్ని పుట్టించడం అంటే, ముందు బ్రాహ్మణులు వుండి (ఫలానా ఒక వృత్తి గల వారు ఉండి), వారు మత గ్రంధాలు రాసి, ఆ గ్రంధాల్లో చెప్పిన నియమాలతో, కులాల్ని, లేదా 4 వర్ణాల్ని, పుట్టించారు - అనుకుంటే, దాన్ని చర్చించవలసిందే. కులాలు ఇంకా పుట్టక ముందే, బ్రాహ్మణులూ (ఒక వృత్తి వారూ), ఇతర వృత్తుల వారూ ఉన్నారంటే, కులాల కన్నా ముందే వేరు వేరు శ్రమలూ, వృత్తులూ, జరుగుతూ వున్నాయనీ, ఆస్తి సంబంధాలు ఏర్పడి ఉన్నాయనీ, అర్ధమే.

ఒక ఫలానా వృత్తి వారే కులాల్ని పుట్టించారంటే, అలా చెయ్యడానికి వారికి ఆధారంగా వున్నదీ, ఇతర వృత్తుల వారికి ఆధారంగా లేనిదీ, ఏదో ఒక విషయం వుందని అర్ధమే. ఒక వృత్తి మనుషులు, 'మేం బ్రాహ్మలంగా ఉంటాం' అన్నంత మాత్రానే, మిగతా వాళ్ళు చాకళ్ళుగా, మంగళ్ళుగా, కుమ్మర్లుగా ఉండడానికి ఒప్పుకోరు. కానీ, ఒకరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, కులాల విధానం పుట్టుకొచ్చిందంటే, అది ఒకరి ఇష్టాయిష్ఠాలతో జరిగింది కాదనీ, ఆనాటి శ్రమ సంబంధాల వైరుధ్యాల పరిస్థితి అలా వుందనీ, అర్ధమే.

* ఆ రకమైన అనేక చర్చనీయాంశాల్లో, 'విప్లవకారులెవరు మరి?' అని వెంకటేశ్వర్లు గారు అడిగిన ప్రశ్నకి (మే 23) నేను తప్పకుండా జవాబు చెప్పాలి. విప్లవకారులు ఎవరా? - విప్లవం చేసే వాళ్ళే. విప్లవం చెయ్యని వాళ్ళు, విప్లవకారులు అవరు కదా? 'విప్లవం' అంటే, దానికి అంబేద్కర్ చెప్పే విప్లవంగా వెంకటేశ్వర్లు చూపించే అర్ధమూ వుంది; మార్క్సు చెప్పే అర్ధమూ వుంది. మార్క్సు ప్రకారం అయితే, ఈనాడు అమలులో వున్న పెట్టుబడిదారీ దోపిడీ ఆస్తి హక్కుల్ని రద్దు చేసి, ఆ ఆస్తుల్ని సమాజపరం చేసి, ప్రతి మనిషీ శ్రమ చెయ్యాలనే మార్గంలో, మానవుల మధ్య సమాన శ్రమ సంబంధాలు ఏర్పరచడమే, విప్లవం!

దోపిడీని వ్యతిరేకించని చర్చ ఏదీ, మార్క్సు చెప్పే విప్లవం అవదు. ఆ విప్లవ చర్యల్లో, ప్రతీ మనిషీ శ్రమ చెయ్యాలనేది, మొదటి మార్పు అయితే, ఆ శ్రమ చెయ్యడంలో కూడా కొన్ని మేధా శ్రమలూ, కొన్ని శారీరక శ్రమలూ కూడా డ్యూటీల ప్రకారమే చెయ్యాలనేది, మరో మార్పు! ఒక మనిషి ఎప్పుడూ మేధా శ్రమే, ఇంకో మనిషి ఎప్పుడూ శారీరక శ్రమే చేసే దోపిడీ సమాజాల శ్రమ విభజన, 'సమానత్వ శ్రమ విభజన'గా మారకపోతే, మనుషులందరూ ఏదో ఒక శ్రమ చేసే వారే అయినా, వారి శ్రమల విలువల్లో ఎక్కువ తక్కువలూ, వారి జీవన పరిస్థితుల్లో తారతమ్యాలూ, పాత రకంగానే వుండిపోతాయి. శారీరక శ్రమల సెక్షన్లకు విముక్తి అనేది, అప్పుడూ కూడా అబద్దమే అవుతుంది. అంటే, మార్క్సిజం చెప్పే 'ఆర్ధికం' అనేది, కేవలం పేదలకు భూములు పంచడమో, లేదా భూముల్ని జాతీయం చేయడమో మాత్రమే చేసే సిద్ధాంతం కాదు. అన్ని రకాల అసమానతల్నీ, శతృ వైరుధ్యాల్నీ, పరిష్కరించగల మార్గం అది.

* 'ఇప్పుడు వున్న కమ్యూనిస్టు పార్టీలు దళితులకు నచ్చకపోతే, వారే ఒక పార్టీ పెట్టుకుని, దాన్ని విప్లవకరంగా నడుపుకోవాలి' అని నేను అన్నదానికి, వెంకటేశ్వర్లు, 'ఇంత వరకూ మన సమాజాన్ని విప్లవ పరిస్థితులవైపు తీసుకువెళ్ళే ప్రయత్నాలు జరగలేదని ఆమె భావిస్తున్నారా?' అన్నారు. అది నా భావనగా చెప్పింది కాదు. దళిత నాయకులు అలా భావిస్తున్నారు కాబట్టి, వారు అప్పుడేం చెయ్యవలసి వుంటుందో చెప్పాను. నచ్చితేనే కలిసి పనిచెయ్యాలి. ఎంత ప్రయత్నించినా ఐక్యత సాధ్యం కాకపోతే విడిపోవాలి. అదే చెప్పాను.

* 'పార్టీ వారు సత్యమూర్తిని బైటికి పంపారు' లాంటి వాదనలు ఇక్కడ బొత్తిగా అనవసరం. వాళ్ళు పంపారో, ఆయనే వెళ్ళారో, అది ఇక్కడ వాదించి నిర్ణయించే విషయం కాదు. నేను కమ్యూనిస్టు పార్టీల చరిత్రల గురించీ, చర్యల గురించీ, నా వ్యాసంలో ఎక్కడా మాట్లాడలే దు. నా కోణం-మార్క్సిజం. చర్చ జరిగితే, ఆ సిద్ధాంతం మీదే జరగాలి.

* 'ఇండియాలో దోపిడీ వర్గం అంటే ఎవరు?' అని, ఒక ప్రశ్న. ఇండియాలో అయినా, ఇంకెక్కడైనా, భూమి కౌళ్ళూ, వడ్డీ లాభాలూ తినేదే - దోపిడీ వర్గం. ఆ దోపిడీ చట్టాల ద్వారా పాలించేది, దోపిడీ ప్రభుత్వం. అదనపు శ్రమని గానీ, అదనపు విలువని గానీ, పోగొట్టుకునేది, శ్రామిక వర్గం. ఏ దేశంలో అయినా, శతృ వర్గ లక్షణాలు అవే. సమాజానికి అదే మౌలిక శతృ వైరుధ్యం. దానితో పాటు, ప్రత్యేక సమస్యలు కూడా వుంటాయి. ఇండియాలో కుల విధానం, శ్రమ సంబంధాలతో లంకెలు పడి వున్న విధానం. ఈనాడు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, విభజనలతో వున్న కులాలలో అత్యధిక సంఖ్య, ఉత్పత్తి సాధనాలు లేని వారు. అట్టడుగు శారీరక శ్రమలకు బందీలైన వారు. వారి ఆర్ధిక, సాంఘిక దుస్థితికి కారణం, శ్రమ సంబంధాలలో వారు ఆ రకపు పాత్రలో వుండడం! అవే కులాలలో దోపిడీదారులు కూడా వుంటారు.

అది తక్కువ సంఖ్యే అయినా, ఆ కులాల్లో కూడా దోపిడీ వర్గం వుంటుంది. అగ్ర కులాల్ని తీసుకుంటే, అక్కడ కూడా అందరూ దోపిడీదారులు కారు. అక్కడ కూడా వేతన శ్రామికులూ, నిరుద్యోగులూ, నిరుపేదలూ, వుంటారు. కానీ అక్కడ కొంత అధిక సంఖ్య, మేధా శ్రమల్లో వుంటారు. కొంత సంఖ్య, కొన్ని రకాల శారీరక శ్రమల్లో వున్నా, అట్టడుగు శారీరక శ్రమల్లో మాత్రం వుండరు. ఈ శ్రమ సంబంధాలూ, దానిలో వున్న శ్రమ విభజన పరిస్థితులూ, రకరకాల కులాల రూపంలో, కులాల పేర్లతో కనపడుతోన్నా, అందులో అసలు విషయం, మనుషుల్ని ఉత్పత్తి సాధనాలు వున్నవారి గానూ - అవి లేని వారి గానూ; మేధా శ్రమల వారి గానూ - శారీరక శ్రమల వారి గానూ, విభజించి వుంచేవి, వర్గ పరిస్థితులే. ఇవే వర్గ పరిస్థితులు అన్ని దేశాల్లోనూ వుంటాయి. వాటి ప్రభావాలు వేరు వేరు రూపాల్లో వుంటాయి. కులాలు లేని దేశాల్లో కూడా, అట్టడుగు శారీరక శ్రమలకే అంకితమైన సెక్షన్లు వుంటాయి. అది, కుల విధానం వల్ల వచ్చిన సమస్య కాదు. అక్కడ ఆ సమస్య పరిష్కారానికి ఏది మార్గమో, కులాల పేరుతో వున్న అట్టడుగు శారీరక శ్రమల మానవుల విముక్తికి కూడా అదే మార్గం. విప్లవ శ్రమ విభజనే ఆ మార్గం. మౌలిక సమస్యల పరిష్కారాల మార్గంలోనే ప్రత్యేక సమస్యల పరిష్కారాలు కూడా సాధ్యమవుతాయి. కొన్ని సమస్యలకు, దోపిడీ పరిస్థితుల్లో కూడా సంస్కరణల ద్వారా కొంత పరిష్కారం సాధ్యమవుతుంది.

'పురుషాధిక్యతా - స్త్రీల బానిసత్వం' అనేవి, వర్గ సంబంధాలతోనూ, అందులో 'ఇంటి పనీ - బైటి పనీ' శ్రమ విభజనతోనూ, ముడిపడి సాగే విషయమే. అయినా, స్త్రీల సమస్యల్లో, వారి విద్యలూ, బాల్య వివాహాలూ, వితంతు వివాహాలూ వంటి కొన్నిటిని, సంస్కరణల ద్వారా, కొంత వరకైనా పరిష్కరించడం సాధ్యమే. కానీ, 'వ్యభిచారం' వంటి సమస్యని పరిష్కరించడం గానీ, స్త్రీ-పురుష అసమానతల్ని పూర్తిగా పరిష్కరించడం గానీ, శ్రామిక వర్గ విముక్తి కన్నా ముందు సాధ్యం కాదు. అలాగే, కులాల సమస్యని తీసుకుంటే, సంస్కరణల ద్వారా, 'అస్పృశ్యత' వంటి సమస్యని పరిష్కరించవచ్చు; కులాంతర వివాహాల్ని కూడా నూటికో కోటికో ఒక్కొక్క దాన్ని సాధించవచ్చు. కానీ, మొత్తం కుల విధానాన్నే మార్చివేసేటంతగా కులాంతర వివాహాలు జరిగే పరిస్థితుల్ని, శ్రామిక వర్గ విముక్తి కన్నా ముందు సాధించడం సాధ్యం కాదు.

ఒక అగ్ర కులంలో అయినా, ధనికులకూ - పేదలకూ మధ్య పెళ్ళి జరగదు. వేరు వేరు అగ్ర కులాల మధ్య కూడా, రెండూ అగ్ర కులాలే అయినా, ధనికులకూ - పేదలకూ మధ్య పెళ్ళి జరగదు. పెళ్ళిళ్ళ విషయంలో అదే జనరల్ సూత్రం. కులాలు లేని మతాల్లోనూ, జాతుల్లోనూ, దేశాల్లోనూ కూడా, ఎక్కడైనా చూడండి! అట్టడుగు శారీరక శ్రమల వ్యక్తులకూ, మేధా శ్రమల వ్యక్తులకూ, వివాహ, కుటుంబ సంబంధాలు ఏర్పడవు. అంటే, అడుగు కులాల బీద పరిస్థితులూ, వారు అడుగు శారీరక శ్రమలకు మాత్రమే బందీలై వుండే పరిస్థితులూ, మారకపోతే, కులాంతర వివాహాలూ జరగవు; కులాల విధానం రద్దూ జరగదు.

* 'శ్రామిక వర్గ పార్టీకి, శ్రామిక వర్గ కులాల వారు నాయకులుగా వుండాల్సిన అవసరం లేదా? ఇదేనా మార్క్సిస్టు వర్గ పోరాటం? ఇటు వైపుకేనా రంగనాయకమ్మ దృష్టి పెట్టమంటున్నారు?'-వెంకటేశ్వర్లు ప్రశ్న. దృష్టి పెట్టమని నేను చెప్పేది, 'మార్క్సిజం' మీద! 'శ్రామిక వర్గ పార్టీకి నాయకత్వం' అనేది, శ్రామిక వర్గ చైతన్యమూ, ఆ సిద్ధాంతావగాహనా, ఆ కృషీ, వంటి అంశాల్ని బట్టి వుండాలి. ఆ లక్షణాలు ఎవరికి ఎక్కువగా వుంటే, వాళ్ళే నాయకత్వ స్థానంలోకి సహజంగా వెళ్ళాలి.

ఆ లక్షణాలు, అడుగు కులాల వారికో, పై కులాల వారికో, తప్పనిసరిగా వుంటాయనడానికి లేదు. ఏ కులంలో అయినా, శ్రమ చేసే మనుషుల్లో వున్న సుగుణం - శ్రమ చెయ్యడం ఒక్కటే. అది తప్ప, మిగతా అన్ని అంశాల్లోనూ, శ్రామికులంతా, భూస్వామ్య, బూర్జువా సమాజాల్లో పుట్టి పెరుగుతూ, అవే భావాలతో కిక్కిరిసి వున్నవారే. శ్రమ చేసే మనిషికి, శ్రమ దోపిడీకి గురి అవుతున్నానని తెలిసే వరకూ, ఆ హృదయంలో ఏ విప్లవ భావ బీజమూ మొలకెత్తదు. అంటే, అడుగు కులాల వారు, ఆ కులాల్లో పుట్టినందుకే, తమ పుటకతోనే, విప్లవకారులుగా వుంటారనేది పెద్ద భ్రమ!

- రంగనాయకమ్మ
(ఇంకా వుంది) 
Andhra Jyothi News Paper Dated : 10/07/2012

Saturday, July 7, 2012

ఆదివాసులకు న్యాయం దక్కేనా?---వరవరరావు



చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, సుక్మా, కాంకేర్ జిల్లాల్లో జూన్ 28,29 తేదీల్లో పోలీసులు మూడుచోట్ల అమాయకులైన 23మంది ఆదివాసీలను చంపారు. జూన్ 28వ తేదీ అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో బాసగూడెంలో ఎన్‌కౌంటర్‌గా ప్రకటించిన దాంట్లో సీఆర్‌పీఎఫ్ కాల్పుల్లో 20 మంది ఆదివాసులు చనిపోయారు. ఇందులో మహిళలు, పసి పిల్లలు ఉన్నారు. 29వ తేదీ ఉదయం సుక్మా జిల్లా జేగురుగొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో పశువులను, విత్తనాలను తీసుకొని పొలం దగ్గరికి వెళ్తున్న మడ్కం మత్తాలు, మడ్కం లచ్చాలు అనే ఆదివాసీ రైతులను పట్టుకొని కాల్చి చంపి, ఆ శవాలను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. కాంకేర్ జిల్లా జొన్నగూడెంలో చుట్టపు చూపుగా వచ్చిన సోడుం దూలాను మావోయిస్టు అనే అనుమానంతో పట్టుకుని కాల్చి చంపారు. ఈ మూడింటిలో ‘బాసగూడెం ఎన్‌కౌంటర్’ గురించే ఎక్కువగా చర్చ జరుగుతున్నది. బాసగూడెంలో చనిపోయిన 20 మంది పేర్ల ను అక్కడ జూన్ 28వ తేదీ రాత్రి పదకొండు గంటలకు సమావేశమైన కర్కగూడెం, కొత్తగూడెం, రాజుపెంట గ్రామాలకు చెందిన 150 మంది గ్రామస్తులు ఇప్పటికే చాలామందికి చెప్పారు. అక్కడికి స్వయం గా వెళ్లిన రిపోర్టర్ అమన్ సేథీ అక్కడి శవాలపై బుల్లెట్ గాయాలు, కత్తులతో కోసిన, గొడ్డళ్లతో నరికిన గుర్తులు కూడా చూశానని తెలిపాడు. పత్రికలు కూడా ఫొటోలతో సహా వార్తలను ప్రచురించాయి. ఆ గ్రామా ల ప్రజలతో, ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడానని, చనిపోయిన వారెవరూ మావోయిస్టులు కారని వాళ్లు చెప్పారని గాంధేయవాది హిమాంశు కుమార్ ఫేస్‌బుక్‌లో పెట్టాడు.


విత్తనాల పండుగ జరుపుకొని భూమి పూజ చేస్తుండగా పోలీసులు వచ్చి, ఎలాంటి హెచ్చరికలు లేకుండా కాల్పులు జరిపారని గ్రామస్తులు చెప్పినట్టు ఆయన ఫేస్‌బుక్‌లో రాశాడు. స్వామి అగ్నివేశ్, రాజేంద్ర సచార్, వందనా శివ, సక్సేనాలు కూడా ఇది బూటకపు ఎన్‌కౌంటర్ అని చెప్పారు. పోలీసులు ఏకపక్షంగా కాల్పులు జరిపారని, 20 మంది అమాయక ఆదివాసీలను చంపారని ప్రకటించారు. రామచంద్ర గుహ, ఎస్.ఆర్. శర్మ, నందినీ సుందర్ కూడా ఖండించారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అక్కడి పీసీసీ కార్యదర్శి అధ్యక్షతన ఘటనా స్థలానికి వెళ్లి గ్రామాలన్నీ తిరిగి, ఇది బూటకపు ఎన్‌కౌంటర్ అని, హతులందరూ ఆదివాసీ అమాయకులేనని అన్నారు. ఈ ఘటనపై న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఆ రాష్ట్రానికి చెందిన కేంద్ర వ్యవసాయశాఖ సహాయ మంత్రి డాక్ట ర్ చరణ్‌దాస్ మహంతి కూడా ఈ వాదనను బలపరిచాడు. కేంద్ర హోం మంత్రి చిదంబరం ఇది నిజమైన ఎన్‌కౌంటరే అని అన్నాడు కదా, చనిపోయి న వారందరూ మావోయిస్టులే అని అంటున్నారు కదా! అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్‌సింగ్, ఇంటలిజెన్స్ వారు ఆయనకు సరైన సమాచారం ఇవ్వకపోవచ్చునని అన్నారు. ఈ సంఘటన జరిగీ జరగగానే కేంద్ర హోం మంత్రి చిదంబరం ఇది నిజమైన ఎన్‌కౌంటరే అని చెప్పడమే కాకుండా, సీఆర్‌పీఎఫ్ బలగాలు చాలా చొరవతో మావోయిస్టులను ఎదురుకాల్పుల్లో కాల్చి చంపాయని ప్రశంసించారు. అందులో ఏడుగురు సీఆర్‌పీఎఫ్ జవాన్లు గాయపడడమే ఇది నిజమైన ఎన్‌కౌంటర్ అనడానికి తిరుగులేని నిదర్శనమన్నాడు. ముఖ్యమంత్రి రమణ్‌సింగ్, సీఆర్‌పీఎఫ్ డైరెక్టర్ జనరల్ విజయ్‌కుమార్ కూడా ఇదే వైఖరి తీసుకున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, కేంద్ర మంత్రి వర్గంలో గిరిజన శాఖా మంత్రిగా ఉన్న కిశోర్ చంద్రదేవ్ ఈ మొత్తం సంఘటనపై ధ్వజమెత్తిన తీరు ఒక ఎత్తు. ఆయన ‘ఇది బూటకపు ఎన్‌కౌంటర్, హతులందరూ ఆదివాసీలు అంటూనే, ఒకవేళ వాళ్లలో ఎవరైనా మావోయిస్టులు ఉన్నా, అందరికి అందరూ మావోయిస్టులైనా ఆదివాసీలు మావోయిస్టులు కావడానికి గల కారణా లు ఏమిటో ఆలోచించాలి’ అన్నారు.

ఒకవేళ పిల్లలు కూడా మావోయి జం వైపు ఆకర్షింపబడుతుంటే అందు కు ప్రభుత్వ విధానాలే కారణ మా? స్వీయ విమర్శ చేసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎవరి ప్రయోజనం కోసం సీఆర్‌పీఎఫ్ బలగాలను కేంద్రం నుంచి కోరిందో చెప్పాలన్నారు. ఇవన్నీ అంటూ.. ‘మౌలికంగా మన ప్రభుత్వాల మైనింగ్ పాలసీనే పునఃపరిశీలించాల’ని అన్నారు. ఇది ప్రభుత్వ వర్గాలలో తీవ్ర కలకలం రేపింది. దీంతో చివరకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణకు ఆదేశించింది. కేంద్ర హోం మంత్రి చిదంబరం ఇంకా తన వాదనలన్నింటికి కట్టుబడి ఉంటూనే ‘హతుల్లో మావోయిస్టులుకాని ఆదివాసులు ఉంటే అందుకు క్షమాపణ చెప్తున్నా’నని అన్నారు. దీంతో అనేక విషయాలు చర్చనీయాంశాలయ్యాయి. 
1) ఆదివాసీలు మావోయిస్టులైనా, ఆదివాసుల్లో మావోయిస్టులు న్నా వాళ్లను కాల్చి చంపవచ్చునని అంటున్నారన్నమాట. (జనంలో మావోయిస్టులు ఉన్నప్పుడు జనం కొందరు చావక తప్పదని ఇప్పటికే చిదంబరం, విజయ్‌కుమార్ వంటి వారితో పాటు ఒకరిద్దరు మీడియా లో తేల్చేశారు!)
2)ఆదివాసులు మావోయిస్టులైతే చంపవచ్చునా?
3) మావోయిస్టులైతే ఎన్‌కౌంటర్ పేరుతో చంపవచ్చుననేది చిదంబరం, రమణ్‌సింగ్ లాంటి వాళ్లు ఎప్పుడో తేల్చుకున్న న్యాయం. కనుక ఇప్పుడు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ చేసేది.. చనిపోయిన ఆదివాసుల్లో మావోయిస్టులు ఉన్నారా? లేక ఆదివాసీలే మావోయిస్టులా? అనేది తేల్చడానికి మాత్రమే. ఇది నిజమైన ఎన్‌కౌంటరా? బూటకపు ఎన్‌కౌంటరా? అనేది తేల్చడానికి కాదు. గులాం రసూల్ ఎన్‌కౌంటర్ విషయం లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జస్టిస్ టీఎల్‌ఎన్ రెడ్డి కమిషన్ విచారణ వేసినప్పుడు ఆయన అది ఎన్‌కౌంటరా కాదా అన్న అంశం కాకుండా, ఆ జర్నలిస్టు నక్సలైటే అని తేల్చేశారు. డాక్టర్ బినాయక్‌సేన్ యావజ్జీవ శిక్ష ,‘వరల్డ్ టూ విన్’ సంపాదకుడు ఆసిత్ సేన్ గుప్తాకు ఎనిమిదేళ్ల శిక్ష, అసెంబ్లీలో కరపవూతాలు పంచారన్న నెపంతో మావోయిస్టు సానుభూతిపరులు మాలతీ మొదలైన వారికి పదేండ్ల శిక్ష వేసిన ఛత్తీస్‌గఢ్ న్యాయవ్యవస్థ నుంచి మనం ఏమి ఆశించగలం!ఎన్‌కౌంటర్లు అన్నీ నిజమా? బూటకమా! అన్న విచికిత్స లేకుండా హత్యా నేరంగా నమోదు చేసి విచారించాలని ఆంధ్రవూపదేశ్ హైకోర్టు ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఏకక్షిగీవం గా ఇచ్చిన తీర్పు అమలైనప్పుడు మాత్రమే ఎన్‌కౌంటర్లు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నది. కనీసం బూటకపు ఎన్‌కౌంటర్లు చేయడానికి పోలీసు లు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. చిదంబరం వంటి వారికి ఎన్‌కౌంటర్ల న్నీ నిజమైనవేనని అనడానికీ, మావోయిస్టులైతే కాల్చిచంపేయవచ్చునని అనడానికీ ఆంధ్రవూపదేశ్ హైకోర్టు తీర్పు మార్గదర్శకాలు గుర్తుండే విధంగా చేస్తే కొంత రక్తపాతం తగ్గుతుంది. అలాగే... ప్రభుత్వ విధాన నిర్ణేతలకు అదొక బాధ్యత అని గుర్తుచేస్తుంది. నాగలితో దున్నితో భూమాతకు బాధ కలుగుతుందేమోనని సున్నితంగా కొయ్యముక్కలతో పోడు వ్యవసాయం చేసుకునే ఆదివాసుల గుండెల్లో గుండ్లు దించి, బయోనెట్లతో గుచ్చి హత్యచేసిన పాలకులకు ఆదివాసులు మావోయిస్టులుగా, హింసావాదులుగా కనిపించడం నేటి పాలకుల నీతి. ఇప్పటి చారివూతక విషాదం. ఈ హింసాత్మ దుష్టనీతిలో అమాయక ఆదివాసుల కు న్యాయం జరుగుతుందా? 

-వరవరరావు

    Namasete Telangana News Paper Dated : 07/07/2012