Monday, July 9, 2012

వాస్తవాల వెలుగులో భూ సమస్యలు - పి.యస్.అజయ్ కుమార్

భూమి సమస్య అంటే ఏమిటి? భూ సమస్య పరిష్కారం కోసం ఎంతో రక్తం పారిన ఈ గడ్డ మీద ఈ ప్రశ్న కొత్తగా అడగాలా? అడగాలి. ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంపై కమ్యూనిస్టులు తమ ప్రభావాన్ని చాలా కాలం క్రిందటే కోల్పోయినప్పటికీ బౌద్ధిక రంగంలో మాత్రం వారి ప్రభావం చాలా బలంగా ఉంది. మర్రి చెట్టు క్రింద ఇతర మొక్కలు మొలవనట్లుగా కొత్త, ఇతర భావాలను అది ఎదగనియ్యదు.

ఒక తీవ్ర వామపక్ష పార్టీ వారి అనుబంధ విద్యార్థి సంఘం సమావేశంలో మాట్లాడుతూ అంబేద్కర్‌ను వివరించే సందర్భంలో కె. బాలగోపాల్ ఇలా అన్నారు: 'వర్గ పోరాటాల నేపథ్యం నుంచి వచ్చిన సిద్ధాంతాలు మాత్రమే అలవాటు కావడం వల్ల భిన్నమైన సిద్ధాంతాలను గౌరవించడం మనమింకా నేర్చుకోలేదు'. వామపక్ష భావజాల ప్రభావం కారణంగా సామాజిక శాస్త్ర రంగాలలో కొన్ని పదాలకు కొన్ని అర్థాలు స్థిరపడిపోయాయి.

'భూమి సమస్య' అంటే దున్నేవానికే భూమి, భూముల స్వాధీనం, జెండాలు పాతడం. విశాఖపట్నం జిల్లా చీడికాడ మండలం వీరభద్ర పేట గ్రామంలో (ఈ గ్రామం షెడ్యూల్డ్ ప్రాంతం కాదు) సింగారపు పోలయ్య అనే ఆదివాసీ, తన ఇద్దరి కుమారులతో కలిసి 22 ఎకరాల మెట్ట భూమిని దశాబ్దాలుగా సాగు చేస్తున్నారు. కాని ఆ గ్రామం సెటిల్‌మెంట్ భూమి రికార్డులో పట్టాదార్లుగా అతని పేరుతో బాటు మరో ఇద్దరు ఆదివాసేతరుల పేర్లు కూడా వున్నాయి. అవి ఎలా వచ్చాయో, ఎందుకు వచ్చాయో పోలయ్యకు తెలీదు. ఈ ఆదివాసేతరుల వారసుల నుంచి ప్రమాదం పొంచి వుండడంతో పాటు 22 ఎకరాలపై పోలయ్య కుటుంబానికి స్థిరమైన యాజమాన్య హక్కులు లభించలేదు.

సెగ్గె రాజులమ్మది మరో చిత్రమైన సమస్య. ఆమెకు పట్టా వుంది. పట్టాదారు పాసు పుస్తకం కూడా వుంది. కాని ఆ రెండిటిలో 'పెగె'్గ రాజులమ్మ అని పడింది. 'సె' కాస్త 'పె'గా మారడంతో ఈ రికార్డు ఆమెకు ఎలాంటి రుణ సదుపాయాన్ని కల్పించడం లేదు. ఇద్దరు దళితులు ప్రభుత్వం తమకు ఇచ్చిన బంజరు భూమిని దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్నారు. ప్రభుత్వం ఈ భూమిని స్వాధీనం చేసుకొని కొంత పరిహారం ఇచ్చేందుకు ముందుకు రాగా సమస్య వచ్చింది. ఒకరికి కేటాయించిన సర్వే నెంబరులో మరొకరున్నారు. ఆ కారణంగా వారికి పరిహారం చెల్లింపు ఆగిపోయింది. భూమి పోయింది పరిహారం రాలేదు. భూస్వాముల నుంచి భూములు స్వాధీనం చేసుకొని భూమిలేని వారికి పంపిణీ చేయడం వర్గ పోరాటాన్ని సూటిగా తాకుతుంది.

కనుక వామపక్ష శక్తులకు అదెంతో ప్రీతిపాత్రమైన కార్యక్రమం. ముందు ప్రస్తావించుకున్న సమస్యలకు అటువంటి ప్రతిపత్తి, ఆకర్షణ వుండదు. కాని ఆ సమస్యల వలయంలో చిక్కుకుపోయిన వారు నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతుంటారు. వారిని సంఘటితపర్చి సహాయం అందించే వారెవరూ కన్పించరు. 'భూమి సమస్య'ను సాంప్రదాయ అర్థ చట్రం నుంచి కాస్త పక్కకు జరిగి చూడగలిగితే -భూస్వాములు, భూమిలేని కూలీలు అనే వర్గ విభజన కన్పించని గ్రామాలతో సహా - అనేక గ్రామాలలో ఇలాంటి సమస్యలు కొల్లలుగా కన్పిస్తాయి. భూమి హక్కులకు సంబంధించిన అతి చిన్న (పైకి అలా కన్పిస్తుంది) సమస్య సహితం పేదలను అతిపేదలుగా మార్చగలదు. అదే విధంగా ఆ సమస్య పరిష్కారం వారిని అనేక ఒత్తిళ్ళ నుంచి విముక్తి చేసి ఒక మెట్టు ఎదిగేందుకు సహాయపడనూ గలదు.

భూమి సమస్యను మూడు రకాలుగా విభజించవచ్చును. మొదటిది రాజకీయ భూమి సమస్య. ముందు చెప్పినట్లుగా ఇది వర్గ పోరాటాన్ని సూటిగా తాకుతుంది. రెండవది పాలన భూమి సమస్య. భూ పాలన పద్ధతులు, వాటి లోపాలు, భూ పాలన యంత్రాంగం, దాని అవినీతి, వివక్ష కారణంగా పరిష్కరించదగినవైనప్పటికీ పరిష్కారం కాని భూమి సమస్యలను ఈ వర్గీకరణ క్రిందకు తీసుకురావచ్చును. నిజానికి తరచి చూస్తే ఇది కూడా వర్గ పోరాటంలో భాగమేనని మరో రూపంలో అది సాగుతున్నదని సులువుగానే గ్రహించవచ్చును. మూడవది భూమి అభివృద్ధి సమస్య.

దళిత, ఆదివాసీ పేదలు ఎదుర్కొంటున్న పాలన భూ సమస్యలు ఏమిటి, ఎన్ని, వాటిపై పనిచేయడానికి, పరిష్కరించడానికి కావలసిన అవగాహన, జ్ఞాన నైపుణ్యాలేమిటి? వీటితో పనిచేసే క్రమంలో వ్యక్తిగత లబ్ధి, వ్యక్తిగత పని విధానంలోకి జారిపోకుండా సమష్టి చైతన్యాన్ని ఎలా నిర్మించాలి? తమ సమస్య పరిష్కారం కాగానే బాధితులు 'సంఘం' పట్ల ఆసక్తిని కోల్పోతుంటారు. పాలన భూ సమస్యలను అంతిమంగా రాజకీయ భూ సమస్యకు ఎలా అనుసంధానం చేయాలన్నది ప్రజాతంత్ర, వామపక్ష శక్తుల ముందున్న సవాల్.

ప్రపంచ బ్యాంక్ నిధులతో పేదరిక నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థ ట్ఛటఞ. దీనిని చంద్రబాబు హయాంలో 'వెలుగు' అని, వైఎస్ పరిపాలన నాటి నుంచీ 'ఇందిరా క్రాంతి పథం' అని వ్యవహరిస్తున్నారు. ఈ సంస్థకు చెందిన భూమి విభాగం 2010 జూలై నుంచి 2011 మార్చి మధ్య రాష్ట్రంలోని 23 జిల్లాలు, 956 మండలాలు, 22,548 రెవిన్యూ గ్రామాలలో 14 లక్షల దళిత, ఆదివాసీ కుటుంబాల భూములను ప్రత్యక్షంగా పరిశీలన చేపట్టింది. 50 వేల మంది దళిత ఆదివాసీ యువకులకు శిక్షణ ఇచ్చి, వారికి ప్రాథమిక రెవిన్యూ రికార్డులను అందజేసి ఈ బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వాతంత్య్రం ముందుగానీ, ఆ తర్వాత గానీ దళిత, ఆదివాసీ భూములను భౌతికంగా పరిశీలించే ఇటువంటి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్‌లో జరగలేదు. ఈ పరిశీలన ఫలితాలు విస్తు గొలిపేవిగా ఉన్నాయి.

దళిత, ఆదివాసీల స్వాధీన అనుభవంలో ఉన్న 40 లక్షల ఎకరాలను పరిశీలించగా అందులో 25 లక్షల 92వేల ఎకరాలకు సంబంధించిన 22 లక్షల 12 వేల సమస్యలు వున్నట్లు (ప్రతి బాధితుని సమస్యను ఒక యూనిట్‌గా) గుర్తించారు. అంటే పరిశీలించిన 40 లక్షలలో సగం భూములు ఏదో ఒక సమస్యలో చిక్కుకొని వున్నాయి. దీంతో బాటు 12 లక్షల భూమిలేని దళిత, ఆదివాసీ కుటుంబాల వివరాలను సహితం ఈ సర్వేలో అదనంగా సేకరించడం విశేషం. ఈ 22 లక్షల సమస్యలను 71 రకాలుగా విభజించారు. ఈ బృహత్తర ప్రక్రియ ఒక ఎత్తయితే, మొత్తం సమాచారాన్ని ట్ఛటఞ.్చఞ.జౌఠి. వెబ్‌సైట్ ద్వారా పౌర సమాజానికి అందుబాటులో వుంచడం మరొక ఎత్తు. వామపక్ష ప్రజాతంత్ర శక్తులు ఒక్క మౌస్ క్లిక్‌తో ఈ సమాచారాన్ని ఇప్పుడు పొందవచ్చును.

71 రకాల భూమి సమస్యలలో నాలుగు రకాల సమస్యలు సింహభాగాన్ని ఆక్రమిస్తున్నాయి. అవి: (అ) రెవిన్యూ రికార్డులలో తేడాలు (8 లక్షలు); (ఆ) రికార్డ్ ఆఫ్ రైట్స్ 1 బి రిజిస్టరులో నమోదుగాక పోవడం (4 లక్షలు); (ఇ) పట్టాదారు, అనుభవదార్లలో తేడాలు (3 లక్షల 36 వేలు); (ఈ) పహాణి/ అడంగల్‌లో పేర్ల నమోదులో తేడాలు (3 లక్షల 22 వేలు). నిజానికి ఈ సమస్యలను కొద్దిపాటి అవగాహన, కొంత ఒత్తిడితో సులువుగా పరిష్కరించవచ్చు.

'భూమి అభివృద్ధి సమస్య' విస్తృత చర్చను లేవదీసే పద ప్రయోగం. 'అభివృద్ధి' అంటే ఏమిటన్నది నేడు తీవ్రంగా జరుగుతున్న చర్చ. సన్న, చిన్నకారు వ్యవసాయం గిట్టుబాటు కాకుండా చేయడమే నేటి వ్యవసాయ విధానంగా వుంది. ఈ సందర్భంలో చాలా పరిమిత అర్థాన్నే తీసుకోవడం జరుగుతుంది. చీమల పాడు అనే గ్రామంలో 40కుటుంబాల రైతులకు మెట్ట భూములున్నాయి. కానీ వారు సాగుచేయడం లేదు. ఎందుకంటే వారికి దుక్కిటెడ్లు లేవు. కూలికి దుక్కిటెడ్లు లేదా బాడుగకు ట్రాక్టరు పెట్టి దున్నించుకునే పరిస్థితి లేదు. 25 నుంచి 35వేల పెట్టుబడితో ఒక మాదిరి ఎడ్లను సంపాదించుకోవచ్చు.

కానీ వారికి దుక్కిటెడ్లకు రుణం ఇచ్చే ప్రభుత్వ పథ కం, సంస్థ ఏదీ లేదు. ఉన్న పథకాలలో లబ్ధిదారునిగా ఉండాలంటే స్పష్టమైన యాజమాన్య హక్కు పత్రాలు ఉండాలి. హక్కు పత్రాలు ఉన్న తరువాత అవసరమైన సహాయం అందించే ఏర్పాటు ఉండాలి. ముందు ప్రస్తావించిన 'సెర్పు' సర్వే ద్వారా బయటకు వచ్చిన సమస్యలు లేని భూములతో కలుపుకొని 9000 కోట్లు వ్యయంతో 30.14 లక్షల ఎకరాలలో 18.39 లక్షల భూమి అభివృద్ధి పనులను జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంతో రూపొందించారు. ఎస్సీ, ఎస్టీ, బిసి పేద వర్గాల భూమి అభివృద్ధికి రూపొందించిన ఈ అతిపెద్ద కార్యక్రమంలో వారు పూర్తి స్థాయిలో పాల్గొని లబ్ధి పొందడం 'భూమి అభివృద్ధి సమస్య'లో భాగంగా గుర్తించవచ్చు.

చివరగా కార్యాచరణ కోణం ఏమిటో చూద్దాం. భావ సారూప్యత గల ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు ఒక వేదికగా ఏర్పడి 'సెర్పు' వదిలేసిన గ్రామాలలో సర్వే నిర్వహించవచ్చు. ఇప్పటికే అందుబాటులో ఉన్న సమాచారాన్ని వాడుకొని సమస్యల పరిష్కారానికి ఒక ప్రణాళికాబద్ధమైన కార్యక్రమం రూపొందించుకోవచ్చు. ఈ సమస్యలలో ఫలితాలు సాధించడం సాపేక్షికంగా సులువు. చిన్నచిన్న విజయాలు పేదలను సామాజిక కార్యకర్తలను, ఉద్యమకారులను ఉత్సాహపరుస్తాయి. పెద్ద లక్ష్యాల సాధనకు వారిని పురికొల్పుతాయని మనం మర్చిపోకూడదు. భూమి సమస్యకు గల సాంప్రదాయ అర్థ నిర్వచనాన్ని విస్తృతపరచడం ద్వారా మాత్రమే దళిత, ఆదివాసీ, పేదవర్గాలకు చేరువ కాగలము.

- పి.యస్.అజయ్ కుమార్
రాష్ట్ర కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ వృత్తిదారుల యూనియన్ 
Andhra Jyothi News Paper Dated : 10/07/2012 

No comments:

Post a Comment