Sunday, April 20, 2014

గిరిజనులకు విభజన అన్యాయాల - జయధీర్ తిరుమలరావు



విభజన నేపథ్యంలో తెలంగాణ గిరిజనులకు అడుగడుగునా అన్యాయం జరిగే అవకాశాలున్నాయి... గిరిజన ఉప ప్రణాళిక, ట్రైకార్, ట్రిప్‌కో, ట్రిమ్‌కో, గిరిజన సాంస్కృతిక పరిశోధన శిక్షణ సంస్థలలోని ఉద్యోగులు, నిధులను తెలంగాణలోని భూభాగం ప్రకారం కాకుండా షెడ్యూల్ ఏరియా, గిరిజనులకి చెందే 55 శాతం ప్రకారం పంచాలి.
నవ తెలంగాణ నిర్మాణమేమో గానీ ఉన్న తెలంగాణ ప్రయోజనాలకు రాష్ట్ర విభ జన సమయంలో గండిపడే అవకాశం ఏర్పడుతున్నది. సీమాంధ్ర అధికారులు, ఉద్యోగులు ఎక్కడికక్కడ తెలంగాణ ప్రయోజనాలను దాచిపెట్టి యాంత్రిక విభజన పర్వానికి తెరతీస్తున్నారు. న్యాయంగా చెందవలసిన వాటా గురించి ఆలోచించే రాజకీయ సంకల్పం ఓట్ల క్రీడలో మునిగిపోయింది. రాజకీయ చైతన్యం కలిగిన శక్తులు ఇంకా అలసటలోనే జోగుతున్నాయి. మరికొన్ని శక్తులు కప్పుకున్న ముసుగు తొలగించడానికి ఇష్టపడడం లేదు. ఐక్యకార్యాచరణ కమిటీ జాగరూకతతో ఉండాల్సిందిపోయి సభలు, సమావేశాలకే ఎక్కువ పరిమితమవుతోంది.
ఇప్పుడు, ఎప్పటిలాగే వెనకబడిన వర్గాలకి, గిరిజనులకి అన్యాయం జరుగుతున్నది. వెంటనే దీనిని ప్రతిఘటించవలసిన అవసరం ఉంది. రాష్ట్రంలో సుమారు 60లక్షల మంది గిరిజనులు ఉన్నారు. అందులో 55 శాతం మంది తెలంగాణలో నివసిస్తున్నారు. వీరు నివసించే షెడ్యూల్ ఏరియా (ప్రాంతాలు) కూడా అంతే శాతం తెలంగాణలో ఉంది. కాబట్టి గిరిజన సంక్షేమ శాఖలోని ఉద్యోగులు, నిధులు కూడా తెలంగాణ గిరిజనులకు అదే శాతాల్లో (55 శాతం) చెందాల్సి ఉంది. కానీ రాష్ట్రంలోని భూభాగంలో 42 శాతం తెలంగాణకు చెందిందని, 23 జిల్లాల్లో 10 జిల్లాలు తెలంగాణవని, కాబట్టి అదే దామాషాలో తెలంగాణకు గిరిజన సంక్షేమ శాఖలోని ఉద్యోగాలు, నిధులు చెందుతాయని ఆ మేరకు ఆ శాఖ ఉద్యోగులు విభజిస్తున్నారు.
ఈ విధానంలో గిరిజన సంక్షేమ శాఖను విభజిస్తే తెలంగాణ గిరిజనులకు అన్యాయం జరుగుతుంది. జూన్ 2 నుంచి కొత్తగా ఏర్పడనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 45శాతం గిరిజనులకు 55 శాతం ఉద్యోగాలు, 55 శాతం నిధులు వెళ్తాయి. తెలంగాణ రాష్ట్రంలోని 55శాతం గిరిజనులకేమో 45శాతం ఉద్యోగాలు, అదే దామాషాలో నిధులు వస్తాయి. అంటే 20శాతం ఉద్యోగాలు, నిధులు కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజనులకు చెందనున్నాయన్నమాట. విభజన నేపథ్యంలో తెలంగాణ గిరిజనులకు అడుగడుగునా అన్యాయం జరిగే అవకాశాలున్నాయి. 2013 జనవరిలో గిరిజన ఉపప్రణాళిక కింద ప్రత్యేక నిధులు ఇచ్చారు. ఒక్క గిరిజన సంక్షేమ శాఖ మాత్రమే కాక ఆయా ప్రభుత్వ శాఖలు తమ బడ్జెట్లలో 6 శాతం నిధులను గిరిజనుల కోసం పెట్టడం, సాంప్రదాయానికి భిన్నంగా ఒక సంవత్సరంలో కేటాయించిన నిధులు అదేసంవత్సరంలో ఖర్చు కాకపోయినా అవి రాష్ట్ర ఖజానాకు తిరిగి వెళ్ళకుండా వచ్చే సంవత్సరంలో ఖర్చు చేయడానికి వీలుండటం ఇవి గిరిజన ఉప ప్రణాళిక ప్రత్యేక వెసులుబాట్లు. కాబట్టి సమీప భవిష్యత్‌లో ఈ ప్రణాళిక కింద వచ్చే అధిక నిధులతో గిరిజన సంక్షేమం పెరుగుతుందని అందరూ ఆశిస్తున్నారు. కానీ ఈ నిధులు కూడా తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల భూభాగం దామాషా(42:58)లో పంచితే అధిక శాతంలో ఉన్న తెలంగాణ గిరిజనుల సంక్షేమం కుంటు పడుతుందని చెప్పక తప్పదు.
అలాగే ఇప్పుడు రాష్ట్రంలో గిరిజనులకు స్వయం ఉపాధి, అభివృద్ధి పథకాలకు ఎన్నో రుణాలను టైకార్ సంస్థ (గిరిజన ఆర్థిక సహకార సంస్థ) అందజేస్తున్నది. కొత్త రాష్ట్రాల భూభాగాల దామాషా ప్రకారం ఈ సంస్థ నిధులను కూడా విభజిస్తే తెలంగాణ గిరిజనులకు అన్యాయం జరుగుతుందని తెలుస్తూనే ఉంది. గిరిజన ప్రాంతాల్లోనే నదులు, గనులు, వనరులు ఉన్నాయి. వాటిని అభివృద్ధి పరచడానికి, వాటి ఫలాలు కొన్ని ఆ ప్రాంత గిరిజనుల అభివృద్ధికీ ఉపయోగపడాలని ట్రిప్‌కో (గిరిజన పవర్ కంపెనీ), ట్రిమ్‌కో (గిరిజన గనుల కంపెనీ) సంస్థలు ఏర్పడ్డాయి. ఈ సంస్థలనూ కొత్త రాష్ట్రాల భూభాగాల దామాషా (42:58) ప్రకారమే విభజించనున్నారు. మరి షెడ్యూల్ ప్రాంతాలు తెలంగాణలో ఎక్కువ శాతంలో ఉన్నప్పుడు ఎక్కువ శాతం ప్రయోజనాలు తెలంగాణ ప్రజలకు చెందకూడదా?

షెడ్యూల్ ఏరియా ఫైల్ గల్లంతు విషయాన్ని చూద్దాం. ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఉన్న పాల్వంచ, ఏటూరు నాగారం ప్రాంతాల మధ్యనున్న ప్రాంతం షెడ్యూల్ ఏరియా (గిరిజన ప్రాంతం) అని 1950 నాటి హైదరాబాదు (తెలంగాణ) ప్రభుత్వం రాష్ట్రపతికి ప్రతిపాదన పంపితే అందుకు రాష్ట్రపతి ముద్రపడి ఆ ప్రాంతం షెడ్యూల్ ఏరియాగానే కొనసాగుతూ వస్తున్నది. షెడ్యూల్ ఏరియాలో బయటి వ్యక్తులు, సంస్థలు లాభాపేక్షతో ఎలాంటి గనుల తవ్వకం, కార్యకలాపాలు చేపట్టకూడదు. కానీ పైన పేర్కొన్న ప్రాంతంలో విపరీతమైన ఖనిజ సంపద ఉందని తెలిసి, దాన్ని కొల్లగొట్టడానికి పన్నాగం పన్నిన కొందరు సీమాంధ్ర వ్యక్తులు, కంపెనీలు ఆ ప్రాంతం షెడ్యూల్ ఏరియా కాదని హైకోర్టులో సవాలు చేస్తున్నారు. తాము నెగ్గితే ఇష్టారాజ్యంగా తెలంగాణ గిరిజన ప్రాంతాన్ని, గనులను దోచుకోవచ్చని పన్నాగం. హైకోర్టులో వారి సవాలును ఎదుర్కొనే ప్రయత్నంలో భాగంగా ఇప్పటి గిరిజన సంక్షేమ శాఖ హైకోర్టు కోరిన విధంగా 1950 నాటి హైదరాబాద్ ప్రభుత్వ షెడ్యూల్ ఏరియా ప్రపోజల్ కాపీని సంపాదించే ప్రయత్నం చేసింది. ఆ కాపీ ఢిల్లీలో దొరుకుతుందేమోనని అక్కడికి, భోపాల్‌కి, హైదరాబాద్‌లోని స్టేట్ ఆఫ్ ఆర్కైవ్స్‌కి అధికారులను పంపించి వెదికించింది. కానీ ఆ కాపీ దొరకలేదు. చిత్రమేమింటే, అంతకు(1950కి)ముందు సంవత్సరాలవి, ఆ తరువాత సంవత్సరాలవి డాక్యుమెంట్లు అన్నిచోట్ల అందుబాటులో ఉన్నాయి. ఈ ఒక్క 1950 సంవత్సరానివే లేవు. అంటే ఎవరో... లాభాపేక్ష కోసం గూడుపుఠాణీ చేసి వాటిని మాయం చేసినట్లు తెలుస్తున్నది.
పైన పేర్కొన్న వలసవాద శక్తుల, పెట్టుబడిదారుల కుటిల ఎత్తుగడలను తెలంగాణ ప్రజలు, ప్రత్యేకించి గిరిజనులు ఇప్పుడే అడ్డుకోకపోతే తీరా తెలంగాణ ఏర్పాటయ్యాక కూడా చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లవుతుంది. కాబట్టి వెంటనే గిరిజన సంక్షేమశాఖలోని వివిధ విభాగాలైన గిరిజన ఉప ప్రణాళిక, ట్రైకార్, ట్రిప్‌కో, ట్రిమ్‌కో, గిరిజన సాంస్కృతిక పరిశోధన శిక్షణ సంస్థలలోని ఉద్యోగులు, నిధులను తెలంగాణలోని భూభాగం ప్రకారం కాకుండా షెడ్యూల్ ఏరియా, గిరిజనులకి చెందే 55శాతం ప్రకారం పంచాలి.
n జయధీర్ తిరుమలరావు

Andhra Jyothi Telugu News Paper Dated: 16/04/2014 

మూడో జెండర్ - (సంపాదకీయం)

మంగళవారం నాడు సుప్రీంకోర్టు చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది. కొజ్జాలు, హిజ్రాలుగా హీనమైన సామాజిక పరిగణన కలిగిన వారిని మూడో లింగం మనుషులుగా పరిగణించాలని, వారిని సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలవారిగా గుర్తించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జస్టిస్ కె.ఎస్.రాధాకృష్ణన్, జస్టిస్ ఎ.కె. సిక్రిలతో కూడిన సుప్రీంకోర్టు బెంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. స్త్రీలు, పురుషులు అన్న రెండు లింగాలను మాత్రమే భారత రాజ్యాంగం గుర్తించింది. ఈ ఆదేశాలతో ఇకపై మూడో లింగం కూడా అధికారికంగా ఉనికిలో ఉంటుంది. దీర్ఘకాలంగా ప్రపంచవ్యాప్తంగా ట్రాన్స్‌జెండర్స్ తమను అధికారికంగా గుర్తించాలని, తమ కోసం ప్రత్యేకంగా సంక్షేమ, అభివృద్ధి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మానవహక్కుల బృందాలూ వారికి మద్దతుగా అభిప్రాయ సమీకరణ చేస్తున్నాయి. అనేక పాశ్చాత్య దేశాలు మూడోజెండర్‌ను అధికారికంగా గుర్తించాయి. ఈ మధ్యనే ఆస్ట్రేలియా కోర్టు కూడా మూడో జెండర్‌ను గుర్తించాలని ఆదేశించింది. దక్షిణాసియాలో నేపాల్, బంగ్లాదేశ్ తృతీయ ప్రవృత్తి వర్గాన్ని గుర్తించాయి. ఆలస్యంగా అయినా భారత్ మూడోలింగం గుర్తింపును ఇవ్వడం ఆహ్వానించదగినది. భారతీయ సమాజంలో వస్తున్న ఆరోగ్యకరమైన మార్పులకు, అన్ని రకాల వివక్షలకు వ్యతిరేకంగా పెరుగుతున్న చైతన్యానికి ఈ తీర్పు ఒక సంకేతం.
మూడో జెండర్ విషయంలో ఆధునిక సమాజంలో చాలా అపోహలు ఉన్నాయి.

వారి శరీర నిర్మాణం గురించి, లైంగిక ప్రవృత్తి గురించి, మూడో జెండర్‌లోకి పరివర్తన చెందడం గురించి అనేక తప్పుడు అభిప్రాయాలు ఉనికిలో ఉన్నాయి. కొజ్జాలు, హిజ్రాలు అందరూ పురుష స్వలి ంగ సంపర్కులేనని భావిస్తుంటారు. స్వలింగ సంపర్కులు వేరు, కొజ్జాలు వేరు. శరీరనిర్మాణ ంలో లోపం వల్ల మాత్రమే మూడో జెండర్ ఏర్పడుతుందని అనుకునేవారూ ఉంటారు. శారీరకంగా మగ పుటుక పుట్టినా, జెండర్ రీత్యా స్త్రీ ప్రవృత్తి కలిగినవారు, స్త్రీగా పుట్టి పురుష ప్రవృత్తి కలిగినవారు, లైంగికంగా స్త్రీపురుషులిద్దరి పట్లా వాంఛ కలిగినవారు, మరో లింగానికి దగ్గరగా శరీరనిర్మాణాన్ని మార్చుకునేవారు- ఇట్లా ట్రాన్స్‌జెండర్లలో రకరకాలవారున్నారు. మరి కొందరయితే భౌతికంగా తమ లింగానికి అనుగుణంగా లైంగిక ప్రవృత్తి కలిగి ఉంటూనే, ఇతర లిం గాల వేష, వస్త్రధారణలతో ఆనందించే వారుంటారు. మన సమాజం ప్రధానంగా పురుషాధిక్య స్వభావం కలిగినది కాబట్టి, మగతనానికి ప్రాధాన్యం, ఇతర లింగాలకు హీనపరిగణన సహజంగానే నెలకొని ఉన్నాయి. లైంగికత విషయంలో కూడా స్త్రీపురుష శృంగారమే సహజమైనదీ, న్యాయమైనదీ అనే నమ్మకం స్థిరపడిపోయింది. స్త్రీపురుష శృంగారం పునరుత్పత్తితో ముడిపడి ఉండడం కూడా అదే ఏకైక లైంగికత అన్న భావన బలపడడానికి కారణం. జీవరాసులలో పునరుత్పత్తికి రకరకాల పద్ధతులు ఉనికిలో ఉన్నాయని, ఏకలింగ జీవులూ ఉన్నాయని, పరపరాగ సంపర్కంతో పాటు స్వపరాగ సంపర్కపద్ధతిని అనుసరించే వృక్షజాతులు ఉన్నాయని మనకు తెలుసు. స్త్రీపురుష లైంగికత అన్నది కాలక్రమంలో పరిణామక్రమంలో రూపొందిన విధానమే తప్ప, సృష్టిలో అది మాత్రమే సహజమని భావించడం శాస్త్రీయం కాదు. ఈ కారణాల రీత్యానే స్వలింగ సంపర్కులు తమ లైంగికత అసహజమైనదని కానీ, ప్రకృతివిరుద్ధమైనదని కానీ అంగీకరించరు.
మూడోలింగం వారిని హీనంగా హేళన చేయడం ఆధునిక కాలంలోనే పెరిగిపోయిందనుకోవాలి. శృంగారం గురించి, లైంగికత గురించి సమాజంలో గోప్యతను పెంచినది బ్రిటిష్ వలస పాలనే. లైంగికత గురించి బాహాటంగా మాట్లాడుకోవడమే అపచారంగా తొలినాటి ఆధునికత భావించింది. గతకాలంలో, తృతీయలింగం వారికి పెద్ద గౌరవం లేకున్నా, గుర్తింపు, సాంస్కృతిక స్వేచ్ఛ ఉండేవి. రామాయణంలో కూడా మూడోజెండర్ వారి ప్రస్తావన ఉన్నది. భారతంలో అయితే బృహన్నల, శిఖండి ప్రముఖ పాత్రలే. వాత్సాయన కామసూత్రాలు కూడా తృతీయ ప్రవృత్తిని పేర్కొన్నాయి. ఒక గురువు ఆధీనంలో గణజీవనం గడపడం కొజ్జాల పద్ధతి. పుట్టడం ఏ లింగంలో పుట్టినా కొజ్జాలుగా మారడానికి ఒక తంతు, పూజాపునస్కారాలు ఉంటాయి. కొజ్జాలు మాత్రమే ప్రత్యేకంగా పూజించే దేవతలు దేశమంతా ఉన్నారు. పిల్లలు పుట్టినప్పుడు, పెళ్ళిళ్ల వంటి శుభకార్యాలలోను కొజ్జాలకు కానుకలివ్వడం సంప్రదాయబద్ధమైన ఆనవాయితీ. కొజ్జాల లైంగిక జీవనంలో సమాజం కల్పించుకునేది కాదు, నేరమనీ ఘోరమనీ భావించేది కాదు. అయితే, వారిని కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలకు, యాచకవృత్తికి లేదంటే అంతఃపురాల రక్షణకు మాత్రమే పరిమితం చేశారు. వారిని అందరు మనుషులతో పాటు సమస్త శ్రామిక కార్యక్రమాలలో అనుమతించడం జరగాలి. సంప్రదాయమైన గుర్తింపుతో పాటు, ఆధునిక హోదా కూడా రావడం అందుకు తోడ్పడుతుంది. కేవలం చట్టపరమైన గుర్తింపు మాత్రమే చాలదు, ప్రభుత్వం మూడోలింగం వారిని సమానులుగా పరిగణించేందుకు తగిన సానుకూల చర్యలు, ప్రచార కార్యక్రమం చేపట్టాలి.
స్వలింగ సంపర్కాన్ని చట్టవిరుద్ధంగా ఇటీవల సుప్రీంకోర్టు ప్రకటించింది. తగిన విధంగా పీనల్‌కోడ్‌ను సవరిస్తే తప్ప, స్వలింగ సంపర్కానికి చట్టబద్ధత లభించదు. ట్రాన్స్‌జెండర్లందరూ స్వలింగ సంపర్కులూ, స్వలింగ సంపర్కులందరూ ట్రాన్స్‌జెండర్లూ కాకపోయినప్పటికీ- స్వలింగ సంపర్కానికి చట్టబద్ధమైన అనుమతి లభించడం తృతీయ జెండర్‌కు కూడా అవసరం. అన్నిటికి మించి దేశంలో స్థిరపడిపోయిన లైంగిక భావనల సడలింపు జరగకపోతే, ఆయా గ్రూపుల హక్కులకు రక్షణ లేకపోవడమే కాక, సమాజంలో జెండర్ ప్రజాస్వామికీకరణ జరగదు. మంగళవారం నాటి సుప్రీంకోర్టు తీర్పుతో వేసిన ముందడుగు, మరింత ఉదార సమాజావతరణకి దారితీస్తుందని ఆశిద్దాం

Andhra Jyothi Telugu News Paper Dated: 16.4.2014 

తెలంగాణ మాండలికంలో.. కొత్త ముత్యాలు By వేముల ఎల్లయ్య

తెలంగాణ మాండలికంలో.. కొత్త ముత్యాలు

Published at: 07-04-2014 07:59 AM
'సూర' నవలలో గ్రామాలలో నేటికీ మారని, తరాలుగా వెళ్లూనుకున్న కులాలు, కులాంతరాల దొంతరలు, దొరలు, పట్టేండ్ల ఆధిపత్యం, సామాజిక శ్రమదోపిడీ, లైంగిక దోపిడీ దళితులపై కొనసాగుతున్న తీరు కళ్ళకు కట్టినట్లు చూపించారు రచయిత భూతం ముత్యాలు. ఈ నవల దళిత సాహిత్యంలోనే కాక తెలుగు నవలా వికాసంలో కలువగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.
'బదనాం', 'పుకారు' పర్యాయపదంగా బుగాడను పేర్కొనవచ్చు. భూతం ముత్యాలు కథా సంకలనానికి శీర్షికగా ఉన్న ఈ కథలో ఒక యువకునికి 'అన్న'లతో ఏమైనా సంబంధం ఉన్నదేమో అన్న అపోహతో పోలీసులు గ్రామాలలో తమకు సహకరించే వేగులతో మాటువేసి ఎప్పటికప్పుడు అతడిని గమనిస్తుంటారు. ఇలా ఎంత మంది అమాయకులు వివక్షకు, దమననీతికి గురవు తున్నారు అనే మీమాంస కలుగక మానదు.
ఒక రచయిత లేక కవి తన భావాన్ని వ్యక్తపరిచే సందర్భంలో, మాతృభాష ప్రాంతీయత, నేటివిటీ స్ఫురించే విధంగా తనదైన మాండలిక భాషలో వ్యక్తపరిస్తేనే ఆ రచనకు గాఢత, స్వచ్ఛత సమకూరుతుంది. ఈ వొరవడి పాశ్చాత్య సాహిత్యంలో పాలకుంతలు తొక్కింది. అదే వొరవడిని తన నేటివిటీకి అనువదించుకుని ఇంతవరకు ఏ రచయిత చేయని నూతన ప్రయోగానికి నాంది పలుకుతూ తెలంగాణ మాండలికాన్ని మన ముందుంచారు భూతం ముత్యాలు. గత పదిహేను సంవత్సరాలుగా సీరియస్ రచనలు చేస్తున్న రచయిత ముత్యాలు. ఈయన కలం నుంచి జాలువారినవే 'సూర' (నవల), 'బుగాడ' (కథలు).
'సూర' దళిత నవల. రచయిత ఇందులో 'గో బ్యాక్ టు విలేజ్' సిద్ధాంతాన్ని బలపరుస్తూ రచన సాగించడం వలన నవలకు బలం చేకూరింది. సంభాషణల్లో యధాతథంగా శుద్ధ గ్రామీణ మాండలిక భాష వాడుకోవడం విశేషం. తెలంగాణ మాండలిక భాషలోని పదజాలం, సామెతలు, సొబగులు ముత్యాలు రచనలో విరివిగా కనువిందుచేసి చదువరులను ఆకట్టుకుంటాయి. తెలంగాణ మాండలికంలో అందునా నల్లగొండ మాండలీకంలో ఈ రచన సాగుతుంది. 'సూర' లో రెండు తరాల వలస దళిత మాల జీవితాలను ఆవిష్కరించారు రచయిత. మొదటి తరానికి చెందిన వారు చెన్నడు, అతని భార్య చెంద్రి. వీరు నిరక్ష్యరాస్యులు. అయితే రెండవ తరానికి చెందినవాడు అతని కొడుకు సూరడు. చెన్నడు, చెంద్రి నిరక్షరాస్యులైనప్పటికీ తమ కొడుకు 'సూర'(కథానాయకుడు)నికి నిరక్ష్యరాస్యత వల్ల కలిగే బాధలు రాకూడదని భావిస్తారు. మొదట్లో సూరడు చదువు పట్ల మారాం చేసినా తన మేనమామ కొడుకు కేశవులు ఆసరాతో చదువులో గాడిన పడతాడు. అదే సమయంలో ఊరి నుంచి అకస్మాత్తుగా పట్నం ఊడిపడతారు నాగిరెడ్డి, కాశిరెడ్డిలు. చెన్నడు, చెంద్రిల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని లబ్ధి పొందడానికి భార్యాభర్తలకు లేనిపోని ఆశలు కల్పిస్తారు. సూరన్ని, కాశిరెడ్డి తీసుకెళ్ళి హాస్టల్‌లో చేర్పిస్తాడు. తర్వాత అదను చూసి చెంద్రిని కాటేస్తడు. ఇది భరించలేని చెంద్రి, తన భర్తతో సొంత ఊరు చేరుకుంటుంది. అక్కడి పాలివాళ్ళతో మూఢనమ్మకాలతో చెన్నడు, చెంద్రి కూరుకుపోతారు. ఇది గ్రామీణ పరిస్థితులకు అద్దం పడుతుంది.
ఇక గ్రామంలో నాగిరెడ్డి మోసాలకు అడ్డు, అదుపు ఉండదు. పెద్దవాడైన సూరనికి ఆ ఊరి దొర బిడ్డ జయలక్ష్మితో పరిచయం ఏర్పడుతుంది. అది వారి మధ్య ప్రేమకు దారితీస్తుంది. జయలక్ష్మి తెగువతో సూరన్ని ప్రేమ వివాహం చేసుకుంటుంది. ఇరువురు పట్నం వెళ్లి కాపురం పెడతారు. మూఢనమ్మకాలతో చిక్కిబొక్కైన చెన్నడు మరణిస్తాడు. సూర, జయలక్ష్మిలు ఊరికి వస్తారు. ఇన్నేండ్లు గడచిన ఊరు మారలే, ఊరి తీరు మారలే. దీనితో కలత చెందిన సూరడు తన జాతిని మేల్కొల్పే లక్ష్యంతో జయలక్ష్మి ఎంత వద్దని వాదిస్తున్నా ఊరిలో 'పూలే, అంబేద్కర్' పాఠశాలను ప్రారంభించి దళితుల కళ్లు తెరిచేలా చేస్తాడు. ఇది అంబేద్కర్ సిద్ధాంతాన్ని బలపరుస్తుంది. కానీ ఏ ఊరైనా దొరలు, పటేండ్లు ఒక్కటే. వారి ధన, బల, అహంకారాల ముందు ఎవరైనా బలాదూర్. నాగిరెడ్డి కుట్రలకు బలైన 'గారీబు' మరికొందరు నాగిరెడ్డిపై కక్ష కడుతారు. అదే సమయంలో ఊరిలో నాగిరెడ్డి దేశగురువు సహాయంతో బొడ్రాయి పండుగ జరుపుతుంటాడు. ఇక్కడ నాగిరెడ్డి సూరన్ని చంపాలని చూస్తే చివరకు గారీబు చేతిలో నాగిరెడ్డి బలి అవుతాడు. తను తవ్వుకున్న గుంటలో తనే పడ్తాడు అన్నట్లు నాగిరెడ్డి మరణిస్తాడు. దెబ్బలు తిని ఆస్పత్రిపాలైన సూరడు నాగిరెడ్డి సావు కబురు విని ఊరు పీడ విరగడైనదని సంతోషిస్తాడు. ఇలా నవల ముగుస్తుంది. ఈ నవల నల్లగొండ మాండలీకంలో అందునా శుద్ధ గ్రామీణ మాండలిక పదజాలం. మిగతా వారికి ఒకేసారి చదివితే అర్థం కాకున్నా, మరో ప్రయత్నంలో నవలలోని సారాన్ని ఆస్వాదిస్తారు. గ్రామాలలో నేటికీ మారని, తరాలుగా వెళ్లూనుకున్న కులాలు, కులాంతరాల దొంతరలు, దొరలు, పట్టేండ్ల ఆధిపత్యం సామాజిక శ్రమదోపిడీ, లైంగిక దోపిడీ దళితులపై కొనసాగుతున్న తీరు కళ్ళకు కట్టినట్లు చూపించారు రచయిత. ఈ నవల దళిత సాహిత్యంలోనే కాక తెలుగు నవలా వికాసంలో కలువగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. ప్రతి ఒక్కరూ చదువదగ్గ నవల. మాండలికాన్ని ఆస్వాదించాలంటే ఈ నవల చదవాల్సిందే. నేటి రచయితలకు ఈ నవల స్ఫూర్తినిస్తుందనడంలో సందేహం లేదు. మరిన్ని మాండలికాలతో సాహిత్యం సుసంపన్నం కావాలి. లేదంటే మాండలిక భాష అంతరించే ప్రమాదం ఉందని గ్రహించాలి.
భూతం ముత్యాలు మరో రచన 'బుగాడ' కథల సంకలనం. ఇందులో మొత్తం 16 కథలున్నాయి. ఒకటి, రెండు కథలు మినహాయించి మిగతా కథలన్నీ తెలంగాణ మరీ ముఖ్యంగా నల్లగొండ మాండలికంలోనే సాగాయి. ఈ కథలలో ఒక్కో కథ దేనికదే దాని విశిష్టతను చాటుకున్నది. నేటి సమాజంలో అంతరిస్తున్న సంస్కృతి, సాంప్రదాయాలు, కట్టుబాట్లు, మానవీయ విలువలు, సమాజ పోకడను పట్టిచూపుతాయి ఈ కథలు. కొన్ని కథలలో స్త్రీల సమస్యలు పరిశీలించాడు. కానీ ఇతడు స్త్రీవాద కవి రచయిత కాదు. అంతమాత్రాన అతడు స్త్రీ పక్షపాతి కాదనలేము. అందుకు ఈ సంకలనంలోని స్త్రీల కథలే నిదర్శనం. ఇతన్ని చలంతో పోల్చలేకపోయినా ఒకటి, రెండు కథలలో చలాన్ని తలపిస్తాడు. 'ఎవరిని వారే దిద్దుకోవాలి' అన్న చాసో మాటలు ఈ రచయితకి వర్తిస్తాయి. అట్ల రాసినవే ఈ కథలు అనిపిస్తాయి.
ఇక కథలను పరిశీలించినట్లయితే మొదటి కథ 'ఊరబోనం'. ఊరబోనం కథలో శ్రావణమాసం, ఆషాఢ మాసంలో జరుపుకొనే బోనాల పండుగను మనముందుంచాడు రచయిత. ఒకప్పుడు ఎంతో భక్తి ప్రపత్తులతో జరుపుకునే పల్లె జనులు నేడు గ్లోబలైజేషన్ పుణ్యమా అని మొఖం చాటేస్తున్నారు. కథనం పూర్తిగా మాండలికంలో సాగి చదువరులలో ఆసక్తిని కలిగిస్తుంది. మరో కథ 'బుగాడ'. ఈ పేరు కథాసంకలనానికి టైటిల్. బుగాడ అంటే ఎన్ని అర్థాలు ఉన్నా 'బదనాం', 'పుకారు' పర్యాయపదంగా ఆ పదాన్ని పేర్కొనవచ్చు. ఇందులో ఒక యువకునికి అన్నలతో ఏమైనా సంబంధం ఉన్నదేమో అన్న అపోహతో పోలీసులు గ్రామాలలో తమకు సహకరించే వేగులతో మాటువేసి ఎప్పటికప్పుడు ఆ యువకున్ని గమనిస్తూ అనుమానించే కథ. కానీ ఈ కథలో కథనం సాగిన తీరు ఆలోచనలో పడవేస్తుంది. ఇలా ఎంత మంది అమాయకులు వివక్షకు, దమననీతికి గురవుతున్నారు అనే మీమాంస కలుగక మానదు. మరో కథ 'జేజి'. ఇది విద్యార్థి బాల్యం గురించి గాధ. పసినాడే ఫ్లోరిన్ విషపు కోరల్లో చిక్కి బాల్యం ఎలా చిధ్రమౌతుందో వర్ణిస్తుంది. నల్లగొండను ఆనుకొని కృష్ణా నది పారుతున్నా నేటికీ తాగునీటికి కొరతే. పేదరికం, అంగవైకల్యం, అక్కరకురాని ప్రభుత్వ వైద్యం, తల్లి పేగుపాశం హృదయాన్ని తాకక మానదు. ఈ కోవకే చేరుతుంది మరో కథ 'రుక్మతి'. అంటే భీమారి (రోగం). ఇదీ బలమైన కథే. మాండలిక కథలకు పత్రికలో చోటుదొరకదు. కానీ ప్రతి ఒక్కరూ చదవాల్సిన కథలు. గుండెలు పిండేసే కథలు. లేతప్రాయంలోనే పసిమొగ్గ గుండెకు చిల్లుపడితే ఆరోగ్యశ్రీ కార్డు ఆదుకోలేక, అప్పుపుట్టక, ఆపరేషన్ చేసే స్తోమత లేక కొడుకును చూసి విలవిలలాడిన తల్లి తన కిడ్నీని అమ్ముకొని కుమారుడిని బ్రతికించుకునే తీరు హృదయాన్ని కలచివేస్తుంది. అదేవిధంగా తెలంగాణ పొద్దుపొడ అనే కథలో వచ్చిన తెలంగాణ ఎలా ఉండాలో, దొరల తెలంగాణ కాకుండా సామాజిక తెలంగాణ రాకుంటే దళితుల బ్రతుకు మారదని తేల్చి చెబుతుంది. అందుకు దళితులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాకముందే దళితులకు హెచ్చరిక చేసాడు రచయిత.
'దూదిపింజె' మరో కథ. ఈ కథలో హాస్టల్‌లో చదువుకునే పోరలు దసరా పండుగ సెలవుల్లో ఊరికి వచ్చి హాయిగా గడుపుదామనుకుంటే తల్లిదండ్రులు వారిని ఊరికే ఉండనివ్వక పత్తిచేళ్ల పనికి తమవెంట తీసుకపోయి పనిచేయించడం. రెక్కాడితే గానీ డొక్కాడని పల్లెజనుల బ్రతుకు, చిత్రణ ఈ కథలో కనిపిస్తుంది. పండుగకి పిల్లలకు బట్టలు కొనే స్తోమత లేక తమతో పాటు పిల్లలను పనికి తీసుకెళ్లడం వారి బీదరికం, వారి దయనీయ స్థితి ఈ కథలో ఆవిష్కరించబడింది. 'మాలోకం' కథలో తాపంతో, తన్మయంతో తీరని కోరికలు, వయస్సు తాపంతో పరుగు తీసే యువతి ఇష్టంలేని పెళ్లి చేసుకుని మొరటు మొగుడితో కాపురం ఇష్టంలేక, అపరిచితుడి చేతిలో పడి వంచనకు గురై వేశ్యావాటికలో తేలుతుంది. ఓ విటుని సహాయంతో బయటపడి నూతన జీవితం ఆరంభిస్తుంది. మన చుట్టూ దారితప్పి మోసపోతున్న యువతులకు అద్దం పడుతుంది ఈ కథ. మరో కథ 'స్నేహం విలువ'. ఈ కథలో విలువలు, స్నేహాలు డబ్బు ముందు దిగదొడుపే అని తెలుపుతుంది. డబ్బుకు, కులానికి అన్నీ బంధాలు తెగిపోవడం నేటి నైజం. 'ఆఖరి ఉత్తరం' అనే కథలో ఇద్దరు యువతీ, యువకులు ప్రణయ గాధను తెలుపుతూనే 'ఆ' అవసరం కోసం తపించే యువకుని మనస్తత్వం కోరిక తీరగానే చేతులు దులుపుకొని దూరం చేసే తీరు కనబడుతుంది. కానీ మహిళలు మాత్రం అలాకాక ప్రేమించే వ్యక్తినే సర్వస్వంగా భావించడం, ఆరాధించడం, తను మోసపోయిన క్షమాగుణం కలిగి ఉండడం స్త్రీల మానసిక స్థితికి దర్పణం పడుతుంది. 'లోగిలి' అనే మరో కథ. ఇందులో జస్ట్ లిఫ్ట్ కోసం అపరిచిత వ్యక్తితో ఎలా మసలుకోవాలో తెలుపుతూనే అతని మాటల గారడీలో పడిపోవడం, తోడు కోసం వెతుకులాటలు, అతనితో తీరని కోరికలు తీర్చుకోవడం, వయస్సు రేపే చిలిపి తుంటరి చేష్టలు కనిపిస్తాయి. ఈ కథలో రచయిత శృంగార రసాన్ని పండించాడు. 'జోగి' అనే మరో కథలో భర్త పెట్టే వేధింపులు భరించలేక అతని దెబ్బలకు విసిగి, వేసారి చావే శరణ్యమని తలుస్తుంది జోగమ్మ. విధి లేని పరిస్థితుల్లో తనకు ఆసరా ఎవరూ లేరని చావే శరణ్యమని రైలు పట్టాలపై పడుకొని మృత్యువుని ఆలింగనం చేసుకోవాలనుకుంటుంది. అప్పుడే తన ఇద్దరు పిల్లలను యాదికి తెచ్చుకొని తను లేకుంటే వారు అనాథలు అవుతారని వేదన చెంది కలత పడి చావును తప్పించుకోవాలనుకుంటుంది. కానీ అంతలో మృత్యుకోరల నుంచి బయటపడే పెనుగులాటలో కాళ్లు రెండూ పోగొట్టుకుంటుంది. ఫలితం అవిటితనం, బ్రతుకు బారం, ఆదరించని సమాజం. ఏటికి ఎదురీదడం సాహసంతో కూడిన పని. విధి వంచితురాలైన జోగమ్మ తాను పుండైన తనువును పడక చేసి వేశ్యగా మారి సమాజంలో పరపతి పొందిన తీరు కన్పిస్తుంది. కానీ ఇది నిజమేనా అనిపించక మానదు. మరో కథ 'మాయమ్మ - మల్లమ్మ'. అమ్మ ఆప్యాయత, అనురాగం, అమ్మ ప్రేమ, ఊరు పరిసరాలు, అమ్మ చుట్టూ అల్లుకున్న మమకారాలు, పెనవేసుకున్న బంధాలు కథలో కనిపిస్తాయి. అమ్మంటే ఊరు. ఊరంటే అమ్మ. అమ్మకు ఊరు పర్యాయపదం. పల్లెలు భారతవని పట్టుకొమ్మలైతే, అమ్మకు అమ్మలాంటి పల్లెకు విడదీయరాని ఆత్మీయానుబంధం వేసాడు రచయిత.
'కుటిలం' మరో కథ. నేటి సమాజంలో మోసానికి ఎవరూ అతీతులు కారు. ఏదీ అతీతం కాదని తెలిపే కథ. నిరుపేదలైన మల్లమ్మ, మల్లయ్యలు వలస వెళ్లి రామోజీ ఫిల్మ్‌సిటీలో బతుకీడుస్తున్న వారి భూమిని ఎలాగైనా కాజేయాలన్న దుర్బుద్ధితో ధనిక వర్గం చేసే దుర్మార్గపు కుట్రకు నిలువెత్తు నిదర్శనం ఈ కథ. పేదలను నిరుపేదలుగా మార్చి ఎలాగైనా వారి భూమిని కాజేసి ఊరిలో వారికి ఏమీ లేకుండా చేసి ఊరి నుంచే వేరుచేసిన తీరు ఈ కథలో కన్పిస్తుంది.
'బొందల గడ్డ' మరో కథ. ఈ కథలో 'కులనిర్మూలన' అంబేద్కర్ సిద్ధాంతం మరో కొత్తకోణంలో ఆవిష్కరించాడు రచయిత. ఇప్పటికీ దళితులపై జరుగుతున్న దాడులు, వారి మాన ప్రాణాలు హరిస్తూనే ఉన్నాయి. అయితే వారి ఉనికినే లేకుండా చేసే సమాజ పోకడ నేటికీ చూస్తూనే ఉన్నాం. నిన్నటి చుండూరు, కారంచేడు మొదలు నేటి లక్ష్మింపేట దాకా కంచికచర్ల కోటేశు నుంచి బీటెక్ తలారి అరుణ, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనూహ్య మరణం వరకు అగ్రవర్ణ దమననీతి కనిపిస్తూనే ఉంది. అధికారం అడ్డంపెట్టుకొని బెల్టు షాపుల నుంచి గుడుంబా సెంటర్లను గ్రామాలలో ఏరులై పారించి దళితుల్ని వ్యసనపరుల్ని చేసి మద్యంలో అంతం చేసే నయావంచన పోకడయే ఈ కథ. దళితులే ఎక్కువగా మద్యం తాగడం, మద్యానికి బానిసలవడం, చావును కొనితెచ్చుకోవడం ఈ కథలో చూపుతాడు రచయిత. ఒక వాస్తవిక విషయాన్ని కథగా మలచిన తీరు ఆశ్చర్యం కలిగించక మానదు. 'జాలుబాయి' మరో కథ. ఈ కథలో ఒకప్పుడు తెలంగాణ పల్లెలు జాలుబాయి నీటితో పంటచేళ్లు ఎలా పసిడి మాగాణాలైనాయో జాలుతో నిండిన బావులు నీటితో కలకలలాడే దృశ్యం ఒకనాడు, నేడు అదృశ్యమై జాలుబాయి జాలు ఎండిపోయిన తీరును ఆవిష్కరించారు రచయిత. అందుకు గ్లోబల్ వార్మింగ్ ఒక కారణమైతే కరువు కాటకాలు మరో కారణంగా చెప్పవచ్చు. అట్లాంటి పల్లెలకు త్రాగునీరు లేక అవస్థలు పడడం, రాజకీయ నాయకులు వాగ్దానాలు గుప్పించడం నల్లగొండకు నక్కలగండి వస్తే తప్పా నల్లగొండ దూప తీరదు. అది నిజమని రచయిత అభిప్రాయం. ఇంత నీతి ఉన్న నవల, కథలను తెలుగు సాహిత్యానికి అందించన ఘనత భూతం ముత్యాలుది.
ఈ సాహిత్యాన్ని విశ్వవిద్యాలయాలు దూరం చేస్తున్నాయి. మనుస్మృతి సూక్తి 'ఏవమేవతు శూద్రసన ప్రభుకర్మ సమాదియత్, ఏతేషామేవా వర్ణనాం శుశ్రూషా మనసుయయా'ని విశ్వవిద్యాలయాల తెలుగు శాఖలు అమలుపరచడమే ఇందుకు నిదర్శనం. అవి, దళిత సాహిత్యాన్ని అవమానపరుస్తూ అవహేళన చేస్తున్నాయి. ఇట్టి సాహిత్యాన్ని ఎవరైనా నాశనం చేయవచ్చు అనే పద్ధతిని తిరిగి దళిత బహుజన అధ్యాపకులచే అణగదొక్కిస్తున్నారు. దళిత సాహిత్యంపై పరిశోధనకు ఆసక్తి చూపుతున్న విద్యార్థులను నిరుత్సాహ పరుస్తూ ఆంధ్రా విశ్వవిద్యాలయాల్లో జరిగిన పరిశోధన చాలు ఇక అవసరం లేదు తెలంగాణలో దళిత సాహిత్యానికి అవకాశాలు లేవు అని విద్యార్థులను తెలంగాణ విశ్వవిద్యాలయ ఆచార్యులు అవహేళన చేస్తూ అవమానిస్తూ వివక్షకు గురిచేస్తున్నారు. దళిత రచయితలూ మేల్కొనండి. ఇటువంటి రచనలను ఆదరించండి. సాహితీ విమర్శకులారా! సాహితీ పాఠకలోకమా! విశ్వకవులమని విర్రవీగుతూ ఊరేగుతున్న వారలారా! ఆలోచించండి. ఏదీ సాహిత్యమో నిగ్గుతేల్చండి. శూద్రుల విజ్ఞానం, విద్యార్జన నేరము ఇక్కడ. అదేవిధంగా వారి సాహిత్యం నేరమై, సమాజానికి దూరమై పోతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా దళిత సాహిత్యం మీద నిషేధాజ్ఞలు కొనసాగుతూనే ఉన్నాయి. దళిత కవులు, రచయితలు బహుపరాక్. మన సాహిత్యాన్ని చదవండి. తెలంగాణ తెలుగులో అగ్రకుల విషభావజాలాన్ని అరికట్టండి. దళిత సాహిత్యాన్ని పండించండి.
- వేముల ఎల్లయ్య

Namasete Telangana Telugu News Paper Dated: 07/04/2014 

Saturday, April 19, 2014

నవ తెలంగాణ-మట్టి మహిళలు By -జూపాక సుభద్ర


తెలంగాణ ఉద్యమం కోటి కలలను ఆరబోసుకున్నది. భౌగోళిక తెలంగాణ బహుజన తెలంగాణ కావాలని ఆశిస్తున్నది. తెలంగాణ ఉద్యమంలో సామాజిక న్యాయాలకు సంబంధించిన ఒప్పందాలు జరగలేదు. బహుజన తెలంగాణ సాకారమైనప్పుడే.. అది నవతెలంగాణగా రూపొందుతుంది. పాలక కులాలు అంటున్నట్లు ఇది పునర్నిర్మాణంగా జరిగితే ఇది ఆధిపత్య కులాలకు ప్రయోజనకారిగా ఉంటుంది. పునర్నిర్మాణమంటే ఆ నిర్మాణాలే తిరిగి తీసుకొచ్చే ప్రయత్నమా!

సీమాంధ్ర రాజకీయాల వల్ల తెలంగాణ పల్లెల్లో చెరువులు ఎండిపోయి మైనర్ ఇరిగేషన్ దెబ్బతిని, భూములన్నీ పెస్టిసైడ్ విషాలతో చౌడు నేలలయ్యాయి. దీంతో రైతుకూలి, కైకిలి చేసుకునే మట్టి మహిళలు పట్టణాలకు వలసపోయారు. ఇండ్లల్లో పాసి పని చేస్తున్నారు. విద్య, ఉపాధులు లేవు. శ్రమ, మానవ గౌరవాలు, మానవహక్కులు లేకుండా తెలంగాణ మట్టి మహిళలు బతుకులీడుస్తున్నారు. దళిత ఆడవాళ్లు సపాయి చీపర్లవుతున్నారు. లంబాడీ తల్లులు తిండిలేక పిల్లల్ని అమ్ముకుంటున్నారు. బీడీ కార్మికులు శ్రమలు కాలిపోతున్న బీడీలవుతున్నారు. చేనేత కార్మిక మహిళలు కూలిగిట్టక శవాలవుతున్నారు. తాగడానికి నీళ్లు లేక ఫ్లోరోసిస్ బారి న పడుతున్నారు. తెలంగాణ దళిత మహిళలు జోగిని, పాకి పనుల లాంటి కుల దురాచార హింసకు, అత్యాచారాలకు గురవుతున్నారు. ఆదివాసీ భూముల్ని పెట్టుబడిదారులు కంపెనీలకు వనరులుగా ఎంచుకొని ఆదివాసులను వెళ్లగొడుతున్నారు. జాతీయ మహిళా కమిషన్ పాలక కులాల మహిళల్ని పాలిత కులాలైన, అణగారిన మహిళల్ని వారి అస్తిత్వాన్ని గుర్తించక తప్పనట్లుంది. అందుకే బిల్లులో ఎస్సీ, ఎస్టీ మహిళలకు ప్రభుత్వం ఎన్నికలప్పుడు ఆర్థిక సహకారం అందించాలంటున్నది. ఇది మంచి పరిణామం. జాతీయ మహిళా కమిషన్ ఇంకో గొప్ప సాహసం చేసింది. మామూలుగా ప్రభు త్వం తమ సంస్థల్ని తమకు వెన్నుదన్నుగా ఏర్పాటు చేసుకుంటాయి. కానీ జాతీయ మహిళా కమిషన్ ప్రభుత్వ సంస్థగా ఉండి, సైనిక దళానికి ప్రత్యేక అధికార చట్టాన్ని ఉపసంహరించాలని చాలా బలంగా సిఫార్సు చేసింది. ఇది మహిళా కమిషన్ చరిత్రలో గొప్ప సంగతి.

సైనిక దళాల ప్రత్యేక అధికార చట్టం వల్ల కశ్మీర్, ఈశాన్య రాష్ర్టాల ప్రజలు,నక్సలైట్ ఉద్యమప్రాంతాలు, ఛత్తీస్‌గఢ్ (సల్వాజుడుం) ముఖ్యం గా, ఆదివాసీ మహిళలు నిత్యం సైనిక, పోలీసుదళాల లైంగిక దాడులు, హింసలు ఎదుర్కొంటూ పోరాడుతున్నారు. ఆ మహిళల గోసలు, గొంతు లు, ఈ (అ)నాగరిక లోకానికి వినబడ్తలేవు. ఆదివాసీ మహిళల మాన ప్రాణాలకు భద్రత లేకుండాపోయింది. పోలీసులు, సైనిక దళాలు చేసే లైంగిక దాడుల్ని, అఘాయిత్యాల్ని ప్రభుత్వాలు, చట్టాలు, న్యాయస్థానాలు వారినెట్లా రక్షిస్తాయో వాకపల్లి ఘటన నిదర్శనం. ఇక కల్లోల కశ్మీర్, ఈశాన్య రాష్ర్టాల్లో సైనిక దుశ్చర్యలు ఎంత ఘోరంగా, క్రూరంగా ఉంటాయో అక్కడి మహిళా పోరాటాలు చెబుతున్నాయి. ఇరోం షర్మిల పధ్నాలుగేండ్ల దీక్ష ఉండనేఉన్నది. ఈ యూనిఫాం నేరస్తుల నుంచి రక్షణ కోసం చేసిన సిఫార్సులను అమలు చేసే దిశగా మహిళలు ఉద్యమాలు చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి.


Namasete Telangana Telugu News Paper Dated: 20/4/2014 

ఆది నుంచి ఆదివాసీలపై అణచివేతలే...By -మైపతి అరుణ్‌కుమార్ఆదివాసీ రచయితల సంఘం


వందమంది దోషులు తప్పించుకున్నా ఫర్వాలేదు కాని ఒక నిర్దోషికి శిక్షపడకూడదు. చట్టం దష్టిలో అందరు సమానులే అనేది రాజ్యాంగనీతి. అందరు ఆమోదించాల్సిన విషయం కూడా! ఈ రాజ్యాంగ నీతిని 33 సంవత్సరాలు వెనుకకు వెళ్ళి ఆదిలాబాద్ జిల్లా, ఇంద్రవెల్లి గోండు గూడెం సంఘటనతో పోల్చి చూసినపుడు అనేక అనుమానాలు మనకు కలుగుతాయి. అసలు ఇంద్రవెల్లితో పాటు చుట్టు పక్కల గోండుగూడాలలో అమరత్వం పొందిన గోండులు ఈ రాజ్యాంగ పరిధిలోకి రారా? ఒకవేళ వస్తే దీనిపై నేటికి ఎందుకు విచారణ జరగలేదు? న్యాయమనేది ఎందుకు గోండుల దరిచేరలేదు? ఆదివాసులకు అటవీ భూములపై హక్కులను ప్రభుత్వం నేటి కి ఎందుకు కల్పించలేదు?నేటికి ఇంద్రవెల్లిలో 144సెక్షన్ అమలులో ఎందుకున్నది? వర్తమానంలో ఏం జరుగుతున్నది? రాజ్యహింస ప్రజాస్వామ్యంలో కొనసాగింపు ఎందుకుందనేది స్పష్టమవుతుంది. 

ఇంద్రవెల్లిలో ఆనాడు ఏం జరిగింది? అడవిపై హక్కు కోసం పోడు భూములు, పట్టాల కోసం ఆదివాసీ రైతుకూలిసంఘం ఇంద్రవెల్లిలో సంత జరుపుకునే రోజున బహిరంగసభకు పిలుపునిచ్చింది. ఈసభకు ప్రభుత్వం అనుమతినిచ్చింది.సభకు వచ్చే గోండులకు మాత్రం రెండు రకాల ధక్పథాలున్నాయి. ఒకటి సంతలో వారానికి సరిపడు సరుకులు కోనుక్కోవటం (పిల్లాపాపలతో సంతలకు వెళ్ళటం ఆదివాసీ సంప్రదాయం)ఒకటైతే, రెండవది- సభకు హాజరవటం. సాయంత్రం మూడు గంటలు అయేటప్పటికి గూడాల నుంచి గోండులు చీమల దండుల్లా ఇంద్రవెల్లికి చేరుకుంటున్నారు. అప్పటికి ఆర్.డి.ఓ. సభకు అనుమతులు రద్దుచేశామని ప్రకటించటం 144 సెక్షన్ విధించటం జరిగిపోయాయి. సభకు అనుమతి లేదని పోలీసులు తెలుగులో ప్రచారం చేస్తున్నారు. గోండు భాష తప్ప, తెలుగు అర్థం చేసుకోలేని చాలామంది గోండులకు ఆ హడావిడి, పోలీసుల కవాతులు ఏమిటో అర్థం కాలేదు.ఒక్కసారిగా బెదిరింపులు, లాఠీచార్జి, తోపులాట అదికాస్త 420 రౌండ్లు కాల్పుల వరకు వచ్చింది. చెట్లు ఎక్కి మరీ కసితో గోండులపై పోలీసులు కాల్పులు జరిపారు. గాయాలతో పిల్లాపాపలతో చెట్టుకొకరు, పుట్టకొకరుగా గోండులు పరుగులు తీశారు. 

ఎండతీవ్రత, నీరులేక చనిపోయిన సంఘటనలున్నాయని స్థానికులు అంటారు. గోండుల సంప్రదాయా నికి వ్యతిరేకంగా పోలీసులు శవాలను కుప్పలు కుప్పలుగా వేసి కాల్చి ఆదివాసులను మరింత గాయపరిచారు.ఎంతమంది చనిపోయారో కూడా నేటికి ప్రభుత్వం దగ్గర రికార్డు కాని పరిస్థితి. ప్రభుత్వం 13 మంది మాత్రమే మతులు అని కాకి లెక్కలేసిం ది కూర్చుంది.పక్కకున్న పిట్టబొంగరం గోండు గూడెంలో నీటికి బదులు రక్తం పారిం దంటే ఈ మారణహోమాన్ని అంచనా వేయవచ్చు. ఈ సంఘటన అనంతరం ప్రభు త్వం కొన్ని ఆదివాసుల కోసం ప్రత్యేక అభివద్ధి కార్యక్రమాలు చేపట్టినా అవి ప్రచా రానికే పరిమితమయ్యాయి.నేడు.. ఇంద్రవెల్లి గిరిజనేతరుల వలసల కేంద్రమైంది. గోండుల ఆశయం మాత్రం నెరవేరకపోగా.. స్థూపం మాత్రం అమరుల జ్ఞాపకంగా మిగిలింది. 

స్వాతంత్య్రానికి ముందు బ్రిటీష్ రాజ్యం 1836లో 1000 మంది గోండులతో సహా, ఆదివాసీ రాజు అయిన రాంజీ గోండును నిర్మల్‌లోని మర్రిచెట్టుకు ఉరితీసి రాజ్య క్రూరత్వాన్ని చాటుకుంది. ఇది రాజ్య ఆక్రమణలో భాగమైంది. 1940లో జోడెఘాట్ కేంద్రంగా జల్, జంగల్, జమీన్ కోసం నడిపిన పోరాటంలో కొమరంభీంతో సహా 11 మంది కాల్చివేయబడ్డారు. అది రాజ్య నిర్బంధంలో భాగమయింది. ప్రజాస్వామ్య పాలనలో జరిగిన ఇంద్రవెల్లి దుర్ఘటనకు కారణమేంటనే ప్రశ్నలు సమాధానాలు దొరకనేలేదు. కాని నేటికి వాకపల్లి, బల్లుగూడ, బాసగూడ, ఆలుబాక,ఎడ్సమెట్ట లాంటివి రాజ్యహింసలో కొనసాగింపుగానే ఉన్న వి. బహుశా ఇటువంటి నిర్బంధం అణిచివేత, దోపిడీకి వ్యతిరేకం గా ఉద్యమించినట్టు, ఉత్తరాంధ్రలోని సవర జాతాపులు నడిపిన శ్రీకాకుళ గిరిజన రైతాంగ సాయుధ పోరాటం కూడా చరిత్రలో నిలిచిపోయింది. రాజ్యహింసకు రక్తసిక్తమైంది. భూస్వామ్య వలస దోపిడీ నుంచి విముక్తి కోసం, భూమిపై హక్కు కోసం నడిపిన ఈ పోరాటం దేశ చరిత్రలోనే ఒక మైలురాయి. దీని తర్వాత ప్రభు త్వం ఆదివాసుల ఆరాట పోరాటాల వెలుగులో 1/70 చట్టాన్ని తెచ్చింది.

ఈ చట్టం ప్రకారం షెడ్యూల్డ్ ఏరియాలో (ఆదివాసీ ప్రాం తం) లో గిరిజనేతరులు, భూములు కలిగి వుండటం, స్థిర చర ఆస్తులు కలిగి వుండటం నిషేధం. ప్రభుత్వ గణాంకాల ప్రకారమే ఆదివాసుల భూములు 48శాతం గిరిజనేతరుల చేతుల్లో ఉన్నవి. అయినా ఈ చట్టాన్ని అమలు చేసి ఆదివాసులకు భూములిప్పించే సాహసం నేటికి ఏ ప్రభుత్వం చేయలేదు. కాని ఈ పోరాటం ఆదివాసులకు చైతన్యాన్ని మిగిల్చింది. ఈ చైతన్యం ఇంద్రవెల్లి మీదుగా అడవిపై హక్కు కోరుతూ అమరత్వాన్ని మూటగుట్టుకొని దండ కారణ్యంలో గూడు కట్టుకున్నది. జగిత్యాల జైత్రయాత్ర మైదానం మీదుగా వచ్చి మళ్ళీ సిరొంచ, గడ్చిరోలి మీదుగా అబుజ్‌మాడ్‌లోని గోండుల వారసత్వాన్నందుకొని దండకారణ్యంలో నేడు సామ్రాజ్యవాద విషసంస్కతిని, పెట్టుబడిదారీ, బహుళజాతి సంస్థ ల నుంచి దేశాన్ని విముక్తి చేసే దిశగా జనతన సర్కార్‌ను ఏర్పాటు చేస్తున్నది. మనం ఇవ్వాళ.. చూస్తున్న దేశ పరిణామాలలో ఇది ఒకటి. 

భారత పరిపాలన వ్యవస్థ జనతన సర్కారు పరిపాలన వ్యవస్థ ను ఆదివాసీ ప్రాంతాలలో సరిపోల్చి చూసినప్పుడు అనేక విషయా లు అవగతమవుతాయి. 1950 జనవరి 26 న అమలులోకి వచ్చిన భారత రాజ్యాంగంలోని 244(1) అధికరణం ఆదివాసీ ప్రాంతాలపై స్వయం పాలన, నిర్ణయాధికారం వారికే ఉండాలనంటున్నది. 67 సంవత్సరాలుగా దీనిని ప్రభుత్వాలు ఎందుకు అమలు చేసి ఆదివాసీల అభివద్ధికి దోహదపడలేదు? 1996లో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పడిన పెసా చట్టం ప్రతి ఆదివాసీ గూడాన్ని గ్రామసభగా పరిగణించి మా వూళ్ళో మా రాజ్యం పాలనా హక్కును ఆదివాసులకిచ్చింది. 2006 ఆడవి హక్కుల చట్టం ఆదివాసులకు అడవిపై సర్వాధికారాలు కల్పించింది. కాని వీటి అమలు మాత్రం కాగితాలకే పరిమిత మైంది. 
ఇదే రాజ్యాంగానికి వ్యతిరేకంగా.. ఆపరేషన్ గ్రీన్‌హంట్ పేరుతో ఆదివాసీలపై మానవ హక్కుల ఉల్లంఘనా చర్యలు జరుగుతున్నాయి. పోలవరం, కంతనపల్లి ప్రాజెక్టుల పేరిట ఆదివాసీ గూడెలను జలసమాధి చేస్తున్నారు. బాక్సైట్, లాటరైట్, గ్రానైట్ పేరిట, ఓపెన్‌కాస్టుల పేరిట జీవన విద్వంసం చేస్తున్నారు. టైగర్ జోన్, ఎలిఫెంట్ జోన్‌ల పేరిట అడవి నుంచి ఆదివాసీల గెంటివేస్తున్నారు. వాకపల్లి, బల్లుగూ డ, సత్యమంగళం లాంటి లైంగిక దాడు లు నిత్యకత్యమయ్యాయి. 

అన్యమత ప్రచారాలతో ఆదివాసీ ఉమ్మడి సాంస్కతిక జీవన వ్యవస్థపై సాంస్కతిక దాడి జరుగుతున్నది. ఈ పరిస్థితులలో ఆదివా సీల మనుగడ ఏమిటనేది ప్రశ్న. ఇప్పుడు ఆదివాసుల మనుగడకే ప్రమాదం వచ్చి పడిందని స్పష్టంగా కనబడుతూనే ఉన్న ది. ఆదివాసీల ఉమ్మడి జీనవ వ్యవస్థను బలోపేతం చేస్తూ సాంస్కతిక, జీవన వ్యవస్థను సంరక్షిస్తూ, నిర్మాణం చేస్తూ ఆదివాసీ గూడాలకు స్వయంపాలనా హక్కుల్ని కల్పిస్తున్న జనతన సర్కార్ వైపు ఆదివాసీలు చూస్తున్నారు. దేశానికి స్వా తంత్య్రం వచ్చినప్పుడు ఆదివాసీలదే ఈ దేశమనీ, దేశంలోని వారంతా బ్రిటిష్ వారిలాగే వలస వచ్చిన వారే అని చరిత్ర చెబుతున్నది. భారత సమాజంలో ఆదివా సీలు తమ అస్తిత్వం కోసం ప్రత్యేక భార తం కావాలని ఆదివాసీలు నినదించేరోజు పునరావతమయ్యే పరిస్థితి వస్తు న్నది. ఇలాంటి పోరాటాలను ప్రభుత్వం అణచివేయ జూసి మరొక చారిత్రక పోరాటాన్ని ఆదివాసీల నుంచి కొనితెచ్చుకుంటున్నది. ఇవ్వాళ.. మధ్య భారతం కేంద్రంగా జనతన సర్కార్‌లు చెబుతున్నది ఇదే..







Namasete Telangana Telugu News Paper Dated: 20/4/2014 

బాబా సాహెబ్ బాటలో కాంగ్రెస్ By కొప్పుల రాజు IAS


హిందూ సమాజంలోని అణచివేత దుర్లక్షణాలన్నింటిమీద తిరుగుబాటు చిహ్నం అంబేద్కర్ అని జవహర్‌లాల్ నెహ్రూ అన్నారు. అంటరానితనానికి, సామాజిక అణచివేతకు శ్రమను, ఉత్పాదక వత్తిని నీచంగా చూసే కుల వ్యవస్థకు దాని దుష్ట విలువలకు వ్యతిరేకంగా మొక్కవోని పోరాటం చేసి నోరులేని కోట్లాదిమంది మూగ భారతీయులకు అంబేద్కర్ దఢమైన కంఠాన్ని ఇచ్చారు. ఆయన కేవలం రాజ్యాంగ నిర్మాతే కాదు, అణగారిన వర్గాల విముక్తి ప్రదాత. మహాత్మా జ్యోతిబాఫూలేను స్ఫూర్తిగా తీసుకుని అంబేద్కర్ సాగించిన సామాజిక విప్లవోద్యమం మహోన్నతమైనది.

దేశం ఎదుర్కొంటున్న ఇతర పలు సవాళ్ళను గాంధీ, నెహ్రూలు తమదైన పద్ధతిలో పరిష్కరించే ప్రయత్నం చేశారు.. డాక్టర్ అంబేద్కర్ మాత్రం కులవ్యవస్థ చిమ్మిన కాలకూట విష ప్రభావం నుంచి సమాజాన్ని సమూలంగా విముక్తి చేసేందుకు కంకణం కట్టుకున్నారు. దేశానికి స్వాతంత్య్రాన్ని సాధించారన్న కీర్తి కిరీటం మీద విహరిస్తున్న గాంధీ, నెహ్రూలకు భారతీయ సమాజాన్ని అమానుషం చేస్తున్న కుల వ్యవస్థను వివక్షను రూపుమాపవలసిన తక్షణ అవసరాన్ని గుర్తు చేశారు. బ్రిటీష్ పాలనలో లండన్‌లో జరిగిన రౌండ్ సమావేశాలలో దీనిని కీలక చర్చనీయాంశం చేయగలిగారు. గాంధీజీకి అప్రియమైనప్పటికీ సాటి ఎస్సీల కోసం బ్రిటీష్ ప్రభుత్వం నుంచి కొన్ని రాయితీలు పొందడంలోనూ కతకత్యుడయ్యారు.

అంబేద్కర్ అంటరాని మహర్ కులంలో పుట్టారు. అయినా ప్రపంచంలోని అత్యంత ప్రతిభావంతులలో ఒకడుగా సమున్నత స్థాయిని సాధించారు. అంతర్జాతీయంగా పేరెన్నికగన్న విద్యాసంస్థలలో న్యాయ, తత్వ, ఆర్థిక శాస్ర్తా లు చదువుకున్నారు. లోతుగా అధ్యయనం చేశారు. ఒక అమెరికన్ యూనివర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో డాక్టరేట్ పొందారు. అనేక గొప్ప గ్రంథాలు రచించారు. ఆయన రచించిన కుల నిర్మూలనగ్రంథం చైతన్యశీలమైన, శక్తివంతమై న రచన. సాటి దళితుల దుస్థితిపై అంబేద్కర్ అనేక వ్యాసాలు, రచనలు వెలువరించారు. కుల వ్యవస్థ, అంటరానితనం మూలాలను ఛేదించి వాటిలోని దుర్మార్గాన్ని, డొల్లతనాన్ని ఎండగట్టారు. 
జవహర్‌లాల్ నెహ్రూ ఆహ్వానంమీద తొలి ప్రభుత్వంలో న్యాయశాఖమంత్రి పదవిని అంబేద్కర్ చేపట్టారు. రాజ్యాంగ ముసాయిదా రూపకల్పన కమిటీకి అధ్యక్షుడుగా నియమితుడయ్యారు. 

రెండున్నర ఏండ్లు వివేచనతో, పీడిత జనపక్షపాతంతో కషిచేసి ఆ చరిత్రాత్మక కర్తవ్యాన్ని నిర్వర్తించారు. అనేక క్లిష్టమైన ప్రశ్నలకు విశాల మానవత, సమ్మిళిత ప్రజాస్వామిక దష్టితో రాజ్యాంగ సభలో అంబేద్కర్ ఇచ్చిన సమాధానాలు, వివరణలు గణనీయమైనవి. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం పరమాశయాలుగా రూపొంది న ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలతో కూడిన రాజ్యాంగాన్ని ఆయన ఆవిష్కరించారు. దానికి గొప్ప ఉప క్రమణికను అందించారు. ఆదేశిక సూత్రాలను విధిగా తక్షణమే అమలు చేయాలని లేనప్పటికీ వాటిని అమలులోకి తేవడం ప్రభుత్వాల నైతిక భాద్యత అని స్పష్టంచేయడం ద్వారా సమున్నత సమాజ నిర్మాణం దిశగా అవి పనిచేయవలసిన ఆవశ్యకతను కల్పించారు. మత స్వేచ్ఛను ప్రాథమిక హక్కులలో చేర్చి సర్వమత సమభావంతో సెక్యులర్ దేశంగా వర్ధిల్లడానికి పునాదులను రాజ్యాంగంలోనే నిర్మించారు. బలమైన కేంద్రం, స్వతంత్ర రాష్ర్టాలు ఉండే ఫెడరల్ వ్యవస్థను నెలకొల్పారు.

అంబేద్కర్ తాను బాల్యంలో అనుభవించిన అంటరానితనం గురించి చెప్పుకొన్నారు. పాఠశాలలో మంచి నీళ్ళు అడిగితే బంట్రోతు పైనుంచి పోసేవాడని ఆత్మకథలో రాసుకున్నారు. మరుగుదొడ్లు ఊడ్చే పనిని, ఆ రంగంలో సామర్ధ్యాన్ని బట్టి గాక కులాన్ని బట్టి అప్పగిస్తారని, ఈ పనిని ఎస్సీల చేతనే చేయిస్తున్నారని అంబేద్కర్ ఎత్తిచూపారు. అందుకే జాతీయ సలహా మండలి ఛైర్మన్ సోనియా సూచన మేరకు మరుగుదొడ్లను ఊడ్చే పనిని పారిశుధ్య సమస్యగానే కాక సామాజిక సమస్యగా కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం గుర్తించింది.


ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల జీవన పరిస్థితులను మెరుగుపరచి సమానమైన గౌరవాన్ని వికాసాన్ని పొందేలా చేయడానికి వారిపట్ల సానుకూల వివక్షను, ధర్మపక్షపాతాన్ని చూపే అధికరణలను రాజ్యాంగంలో చేర్చేలా చేసిన అసమాన ఘనత, మానవత అంబేద్కర్‌ది. అంటరానితనాన్ని నిషేధిస్తున్న ఆర్టికల్ 17, మత, భాషాపరమైన అల్పసంఖ్యాకవర్గాలకు రక్షణ కల్పిస్తున్న ఆర్టికల్ 30, విద్యా ఉద్యోగ రంగాలలో ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి తోడ్పడుతున్న ఆర్టికల్ 46 ఆయన పీడితజన పక్షపాతానికి నిదర్శనాలు. 

అంబేద్కర్ స్త్రీల విముక్తికోసం రాజ్యాంగంలో ప్రత్యేక అధికరణలు చేర్చారు. రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాలలో సమాన హక్కులు కల్పిస్తున్న ఆర్టికల్ 15, మహిళల పట్ల సానుకూల వివక్షతో ధర్మపక్షపాతంతో వ్యవహరించేలా చేస్తున్న ఆర్టికల్ 15(3), స్త్రీ, పురుషులకు సమాన ఉపాధి అవకాశాలు, సమాన పనికి సమాన వేతనం కల్పిస్తున్న ఆర్టికల్ 39 వంటి అనేక సాధనాలను రాజ్యాంగంలో పొందుపరిచారు. వీటిని అనుసరించి పార్లమెం టు పలు విప్లవాత్మక చట్టాలు చేసింది. తొలి ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రిగా ఉన్న అంబేద్కర్ స్త్రీని బానిసగా చేస్తున్న హిందూ మత దుష్ట విలువలను పరిహరించే హిందూ స్మతి బిల్లును రూపొందించారు.

హిందువులలో బహు భార్యత్వాన్ని నిషేధించి మహిళలకు ఆస్తి హక్కును, విడాకుల హక్కును ఇతర అనేక వెసులుబాట్లను స్వేచ్ఛలను కల్పించదలచిన ఈ బిల్లును పితస్వామ్య వ్యవస్థకు పెను సవాలుగా భావించిన ఆనాటి ఛాందసులు పార్లమెంటులో దానిని వ్యతిరేకించి చట్టం కానివ్వకుండా చేశారు. దానితో ఆయన న్యాయశాఖ మంత్రి పదవినుంచి వైదొలిగారు.

దళితుల, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఏ చట్టాలు రావాలని, ఏ చర్యలు చేపట్టాలని అంబేద్కర్ కోరుకున్నారో వాటిని సాకారం చేసిన, చేస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీకే చెందుతుంది. ఎస్సీ, ఎస్టీలపై అత్యాచార నిరోధక చట్టం పరిధిని విస్తరింపచేసింది. మహిళలకు గహహింస నుంచి రక్షణ కల్పిం చే చట్టం కాంగ్రెస్ తీసుకువచ్చిందే. స్థానిక సంస్థలలో మహిళలకు, ఓబీసీలకు రిజర్వేషన్ల కల్పన, నిర్భయ చట్టం, పని స్థలాలలో మహిళల వేధింపును అంతమొందించే చట్టం, కేంద్ర ఉన్నత విద్యాసంస్థలలో ఓబీసీలకు రిజర్వేషన్ల కల్పన కాంగ్రెస్ సాకారం చేసినవే. మహిళలకు చట్ట సభలలో 33శాతం రిజర్వేషన్ల కోసం కషిని చేపట్టిన ఖ్యాతి దానిదే. ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించడానికి 117వ రాజ్యాంగ సవరణ బిల్లు 2012 కు రాజ్యసభ ఆమోదం సాధించడం, ఎస్సీ, ఎస్టీలపై అత్యాచార నిరోధక సవరణ బిల్లును ఆర్డినెన్స్ ద్వారా అమలులోకి తెచ్చి, దళితులను న్యూనత పరిచే మరి అనేక కుల దురహంకార దుశ్చర్యలకు శిక్షపడేలా చేసిన గొప్పతనం కాంగ్రెస్ పార్టీదే. కేంద్ర స్థాయిలో ఎస్టీ, ఎస్టీ ఉప ప్రణాళికలకు చట్టబద్ధత కల్పించి వారి ఆభివద్ధికి ఉద్దేశించిన నిధులు వారి కోసమే ఖర్చయ్యేలా చేయాలని కాంగ్రెస్ పార్టీ దీక్ష పూనింది.

దేశంలోని ప్రతి బ్లాక్‌లోనూ అణగారినవర్గాలు, ముఖ్యంగా దళితుల కోసం నవోదయ విద్యాలయాల మాదిరి ఉన్నత ప్రమాణాల పాఠశాలను నెలకొల్పాలని, ప్రైవేట్ రంగంలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పన దిశగా జాతీయస్థాయి ఏకాభిప్రాయాన్ని సాధించడానికి గట్టి కషి చేయాలని, ప్రభుత్వంలో, ప్రభుత్వరంగ సంస్థల్లో ఎస్టీ, ఎస్టీ లకు, ఇతర బలహీన వర్గాలకు రిజర్వ్ చేసిన ఉద్యోగాలన్నీ తప్పనిసరిగా వారితో నే భర్తీ అయ్యేలా చూడాలని, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల అభివద్ధి కోసం జాతీయ కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ అంశాలన్నీ కూడా అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీ త్రికరణశుద్ధిగా అమలుచేస్తోంది.

పునాదులలో సామాజిక ప్రజాస్వామ్యం నెలకొంటే గాని రాజకీయ ప్రజాస్వామ్యం మనుగడ సాగించజాలదు అని అంబేద్కర్ స్పష్టపరిచారు. ఈ దష్టితోనే కాంగ్రెస్ ప్రభుత్వాలు దేశంలో సామాజిక న్యాయసాధనకు అగ్ర ప్రాధాన్యమిచ్చి అహరహం పట్టుదలతో కషి చేస్తున్నా యి. అంబేద్కర్ రాజ్యాంగ పిత, నిర్మాతే కాదు గొప్ప స్వాతంత్య్ర యోధుడు, రాజకీయ నాయకుడు, తత్వవేత్త, రచయిత, ఆర్ధికవేత్త, సంపాదకుడు. భారతదేశంలో బౌద్ధమత పునరుద్ధరణకు అవిరళ కషిచేసినవాడు. అటువంటి అసమాన మహనీయుని జన్మదినాన కేవలం పుష్పార్చనతో సరిపుచ్చడానికి బదులు ఆయన మహోన్నత, మానవీయ ఆశయాలను ఆచరణలో పెట్టడానికి నడుంబిగించడమే ఆయనకు సరైన నివాళి.

బానిసత్వాన్ని అంతమొందించగల పరమాయుధం విద్య. అణగారిన ప్రజానీకాన్ని తట్టి లేపి సామాజిక హోదాను ఆర్ధిక పురోభివద్ధిని, రాజకీయ స్వాతంత్య్రాన్ని సాధించుకునేలా చేసేది విద్య. - అంబేద్కర్ 

Namasete Telangana Telugu News Paper Dated: 13/4/2014 

Thursday, April 3, 2014

శాసిస్తామన్నోళ్లే... యాచిస్తున్నారు!-కొంగర మహేష్


Published at: 03-04-2014 07:02 AM
'రాజకీయ నాయకులు పదవుల కోసం వెంపర్లాడుతున్నారు. తమ స్వార్థం ఉద్యమాన్ని తాకట్టు పెట్టేందుకు కూడా వెనకాడటం లేదు. తామే ఉద్యమానికి నాయకత్వం వహించి యావత్ తెలంగాణ ప్రజల చిరకాల కాంక్ష ప్రత్యేక రాష్ట్రాన్ని సాధిస్తాం. అవసరమైతే అసోం తరహాలో (అస్సాం గణ పరిషత్ మాదిరి) రాజకీయ పార్టీ స్థాపించి ఉద్యమాన్ని నడిపిస్తాం. ఇక ఈ రాజకీయ నాయకులను చేరదీసేది లేదు. వారి దరికి చేరేది లేదు'. ఇవి నాలుగేళ్ల క్రితం 2009 చివర్లో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష విరమించినప్పుడు, డిసెంబర్ 9 ప్రకటనను నిలిపివేస్తూ కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన (2010 జనవరి 23) నేపథ్యంలో తెలంగాణ ఉద్యమ కేంద్రమైన ఓయూలో విద్యార్థి నేతలు చేసిన వ్యాఖ్యలు. పడిలేస్తున్న ఉద్యమాన్ని తమ భుజాల మీద మోస్తూ నిలబెట్టి... కదనరంగంలో కాలుదువ్విన యువ గర్జనలకు ప్రజానీకం గొంతు కలిపింది. అడుగులో అడుగేస్తూ ఓ యుద్ధానికే మొగ్గుచూపింది. విద్యార్థుల తెగువ, లాఠీలు, తూటాలకు వెరవని ధైర్యానికి పాలక, ప్రతిపక్షాల గొంతులు ఎండిపోయాయి. ఏం మాట్లాడినా తిరుగుబాటు తప్పదని గ్రహించిన పొలిటికల్ లీడర్లంతా ఇళ్లకే పరిమితమై ఓయూ, కేయూ వంటి వర్సిటీల తదుపరి కార్యాచరణపైనే దృష్టి కేంద్రీకరించిన సందర్భాలు లేకపోలేదు. దీంతో తెలంగాణకు దశ, దిశ ఇక విద్యార్థి యువకిశోరాలే అని ప్రజలంతా అనుకున్నారు. విద్యార్థులు జేఏసీగా ఏర్పడి చేసిన 'ఓయూ డిక్లరేషన్' అన్ని రాజకీయపక్షాల నేతలకు ముచ్చెమటలు పట్టించింది కూడా. పలు ప్రజాసంఘాల నాయకులు, పార్టీలకతీతంగా ఇక్కడి విద్యార్థులకు సంఘీభావం ప్రకటించారు. విద్యార్థులు ఏదో చేస్తారని అంతా అనుకున్నారు. విద్యార్థులు ఏం చేయబోతున్నారని యావత్ దేశ ప్రజానీకమంతా ఆసక్తిగా ఓయూ వైపు చూసింది. విద్యార్థుల నాయకత్వంలో మలిదశ తెలంగాణ ఉద్యమం కొత్త రాజకీయాలకు పురుడుపోస్తుందని విశ్లేషణలు జరిగాయి.
ఓయూలో మొదలైన విద్యార్థి, యువత ఏకీకరణ కేయూ నుంచి మిగతా తెలంగాణ అంతటా సరికొత్త ఉద్యమం వ్యాపిస్తుందని అనుకుంటున్న సందర్భంలోనే వారి అడుగులకు బంధనాలు పడ్డాయి... ఉద్దండ రాజకీయనేతలు రంగప్రవేశం చేసి 'డైవర్షన్' వ్యూహాలతో యువరాజకీయ రణన్నినాదాన్ని ఆదిలోనే అంతం చేశారు. మొలకెత్తే విత్తనాన్ని వేరుతో సహా తుంచేస్తే మళ్లీ పుట్టేందుకు అవకాశమే ఉండదన్న దుగ్ధతో కొన్ని స్వార్థపూరిత శక్తులు చాలా జాగ్రత్తగా ఓయూపై కన్నేశాయి. 'విద్యార్థులు రాజకీయాలు చేస్తే తామేం కావాలంటూ' విస్మయం వ్యక్తం చేస్తూ 'మేం తెలంగాణ కోసం పోరాడుతాం. స్టూడెంట్స్‌కు స్టడీస్ ముఖ్యం.. మీరు చదువుకోండి' అని సలహా ఇచ్చారు. కొంతమంది లంచ్, డిన్నర్ల పేరుతో ఇంటికి పిలిపించుకొని బుజ్జగించి తమవైపు తిప్పుకున్న వారున్నారు. మాటవినని వారిని ఉద్యమ ద్రోహులుగా ముద్రవేసి... జేఏసీ చీలికకు ఆజ్యం పోశారు. ఇట్లా మొదలైన చీలిక... ఆరునెలలకే ఒక్క ఓయూలోనే ఒకటి, రెండు, మూడు ఇలా దాదాపు పది జేఏసీలు ఏర్పడ్డాయంటే ఎన్ని రాజకీయాలు జరిగాయో అర్థం చేసుకోవచ్చు. ఒక్కో రాజకీయ పార్టీకి చివరికి ఒక్కోకులానికి ఒక్కో జేఏసీ ఏర్పడింది. చిట్టచివరికి ఒక్కరూ, ఇద్దరున్నా జేఏసీలు ఏర్పాటు చేసుకొని తమ పంథా కొనసాగించారు. రాజకీయ పార్టీలకు సరిగ్గా కావాల్సింది కూడా ఇదే.
కనీసం ఓయూ ఉద్యమంలో 'నో ఎంట్రీ' ఎదుర్కొన్న టీడీపీ సైతం స్వతంత్ర జేఏసీ పేరుతో కొనసాగింది. ఇతర పార్టీలు కూడా భావసారూప్యతల పేరుతో విద్యార్థుల్లో సెపరేటు జట్టు కట్టించాయి. అతి కొద్దిమంది మాత్రమే ఏపార్టీతో సంబంధం లేకుండా జేఏసీగా ఏర్పడ్డారు. అప్పటిదాకా పార్టీల ఊసులేకుండా సాగుతున్న ఉద్యమంలో స్పష్టమైన చీలిక తప్పకపోవడంతో ఆరోజుకు ఉన్న జేఏసీని కాపాడుకుంటే చాలన్న విధంగా పరిస్థితి మారిపోయింది.
అయితే తెలంగాణ వస్తే అగ్రవర్ణ పాలన, ఆధిపత్యం తగ్గి దాదాపు 90 శాతంగా ఉన్న అణగారిన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రాజకీయ ప్రాబల్యం పెరుగుతుందని అందరూ నమ్మారు. రాజ్యాధికారం వీరి చేతుల్లోకే వస్తుందనే అంచనాలు మొదలయ్యాయి. అలాగే ప్రచారం జరిగింది కూడా. ఈ అశతోనే ఆ వర్గాలకు చెందిన ప్రజానీకం ఉద్యమంలో నాయకత్వం తప్ప మిగతా అన్నింట్లో చివరికి ఆత్మహత్యలు చేసుకోవడంలో కూడా ముందున్నారు. ప్రపంచీకరణ నేపథ్యం, భౌగోళిక పరిస్థితులు, ఉద్యమాలు, జనాభా దృష్ట్యా ఎలైట్ వర్గాల పిల్లలు 90వ దశకం వచ్చేసరికి ఆర్ట్స్, సామాజిక శాస్త్రాల పట్ల అనాసక్తి కనబరచడం... విదేశీ విద్య, సాంకేతిక విద్యపై ఆసక్తి కనబర్చడంతో, ఓయూ, కేయూ వంటి తెలంగాణ వర్సిటీల్లో బహుజన వర్గాల పిల్లలే సింహభాగంలో ఉన్నారు. నాటి నుంచి నేటి దాకా ప్రపంచంలో ఎక్కడ ఏపోరాటం జరిగినా తర్కబద్ధంగా స్పందిస్తూ సామాజిక స్పృహతో ముందుకెళ్తున్నారు. తెలంగాణ వస్తే తమకు, భవిష్యత్ తరాలకు ఏదో మంచి జరుగుతుందనే తెగించిపోరాడారు. ఇలాంటి నేపథ్యమున్న అణగారిన వర్గాల విద్యార్థులు రాజకీయంగా బలపడితే... వారి నాయకత్వాన్ని ప్రోత్సహిస్తే ఏదో ఒకనాడు తమ కుర్చీ కిందికి నీరు తప్పదనే భయంతో జంకిన నేతలే విద్యార్థి నాయకత్వాన్ని నిలువునా చీల్చడంలో సఫలమయ్యారు. ఒక్కమాటలో చెప్పాలంటే విద్యార్థి ఉద్యమం నిట్టనిలువునా చీలేంత వరకు నిద్రపోలేదనడంలో ఆశ్చర్యం లేదు.

ఒకవైపు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ చరిష్మా తగ్గిపోతుండటం 2014 ఎన్నికలు సమీపిస్తుండటంతో... హైకమాండ్‌కు 2009 డిసెంబర్ 9 హామీ గుర్తుకొచ్చి తెలంగాణ బిల్లును సాధారణ మెజార్టీ ఉన్నా 'ఎంతో శ్రమ'కోర్చి పార్లమెంటులో పాస్ చేయించింది. రాష్ట్రపతి ఆమోదంతో 60 ఏళ్ల కల సాకారమైంది. 1969 నుంచి ఇప్పటి వరకు జరిగిన ఇన్నేళ్ల మహోద్యమ ఫలితానికి విద్యార్థులు, యువత, ప్రజానీకం సమష్టిపోరాటం, అమరుల త్యాగాలే సాక్ష్యాలు. రాజకీయ నేతల పాత్ర ప్రేక్షకపాత్ర. నామమాత్రమే అని చెప్పకతప్పదు. అయితే వచ్చిన రాష్ట్రంలో పునర్నిర్మాణం, సామాజిక తెలంగాణ, బంగారు తెలంగాణ వంటి లక్ష్యాలు మిగిలే ఉన్నాయి. వీటిపై చర్చ ప్రారంభదశలో ఉండగానే రాష్ట్రపతి పాలన, 2014 సార్వత్రక ఎన్నికల ప్రకటన జమిలిగా వచ్చాయి.
రెండు రాష్ట్రాల్లో పాగాకోసం ఎవరి ప్రయత్నాలు వారు ప్రారంభించారు. పొత్తులు, ఎత్తులతో క్షణం తీరికలేకుండా ఉన్నారు. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో ఏ పొలిటికల్ పార్టీ కూడా ఓయూ విద్యార్థుల పోరాట పటిమను పరిగణనలోకి ఏమాత్రం తీసుకోలేదు. తమ పోరాటాన్ని గుర్తించి ఈ ఎన్నికల్లో పోటీచేసే అవకాశం ఇవ్వాలని ప్రధాన రాజకీయ పక్షాల నేతలను కలుస్తున్నా... కులం, వర్గం, నియోజకవర్గం వంటివాటితో ప్రసన్నం చేసుకుంటున్నా ఫలితం లేకుండా పోతోంది. వారి అనైక్యతను పసిగట్టిన పార్టీలు తమదగ్గరికి వచ్చినవారిని కూడా పట్టించుకున్న పాపాన పోలేదు (కేసీఆర్ మాత్రం ఒకే ఒక్క విద్యార్థి నాయకుడిని పిలిచి పార్టీలో చేర్చుకొని టిక్కెట్ ఇస్తానని హామీ ఇచ్చారు). దీంతో చేసేదిలేక కొంతమంది ఎవరికి తోచినట్లు వారు కాంగ్రెస్, ఇతర పార్టీల్లో చేరుతున్నారు. కొంతమంది ఎంఐఎంను కూడా అప్రోచ్ అయ్యారు. కారణాలేమైనప్పటికీ ఆ పార్టీ నాయకత్వం ఒకరిద్దరికి టిక్కెట్లు కన్ఫర్మ్ చేసింది.
మరోవైపు ప్రధాన పార్టీల నుంచి ఒకరిద్దరికి తప్ప మిగతా ఎవరికి స్పష్టమైన హామీ రాకపోవడంతో... విద్యార్థి నేతల పరిస్థితి ఎక్కే గడప.. దిగే గడప అన్న చందంగా మారింది. ప్రతిరోజూ ఏదో పార్టీ దగ్గరకు వెళ్లడం తమ అభ్యర్థనలు వినిపించడం, కాదంటే మళ్లీ మరో పార్టీని ఆశ్రయించడం... ఆర్థించడం... వారం పదిరోజుల నుంచి ఇదే ఓయూ నేతల దినచర్యగా మారింది. కొంతమంది నేతలైతే 'మీ బలమెంత, ఆర్థిక బలాబలాలేంటి?' అంటూ సూటిగానే అడిగి లెక్కలు వేస్తున్నారు. కాస్త అవసరం అనిపించిన వారికి పార్టీ పదవులు ఇస్తూ, అవకాశం ఉంటే ఎన్నికల తర్వాత నామినేటెడ్ పదవులు కట్టబెడతామని చెబుతున్నారు. ఇలాంటి మాటలతో విసిగినవారు, సంతృప్తి చెందనివారు మాత్రం స్వతంత్రంగానైనా ఒక్కొక్కరు ఒక్కోరకంగా... ఐక్యంగా ఉన్నవాళ్లు ఎవరికి వారే విడిపోయి ఇలా టిక్కెట్ల కోసం నేతల దగ్గర యాచిస్తుండటం వారిని ప్రసన్నం చేసుకునేందుకు పడరానిపాట్లు పడుతుండటంతో ఢిల్లీ పెద్దల నుంచి గల్లీ నేతల దాకా విద్యార్థులంటే చులకనైపోయారు. వీరి ఆపసోపాలు గమనిస్తున్న ప్రజల్లోనూ పలుచనైపోయారు. పార్టీ పెట్టకపోయినా ఫ్రంట్‌గా కదిలినా విద్యార్థులను ప్రజలు, ప్రజాసంఘాలు ఆదరించేవారు. ఐక్యంగా ఉండి రాజ కీయ పార్టీ వలే 'లాబీయింగ్' చేసినా ఈ దుస్థితి దాపురించేంది కాదు. ఇప్పుడు కాకపోతే మరో పదేళ్లు, ఇరవయ్యేళ్లకైనా నవ తెలంగాణలో సరికొత్త రాజకీయాలకు నాంది అయ్యేది.
n కొంగర మహేష్
రీసెర్చ్ స్కాలర్, జర్నలిజం డిపార్ట్‌మెంట్, ఓయూ

Andhra Jyothi Telugu News Paper Dated: 3/4/2014