Saturday, April 19, 2014

బాబా సాహెబ్ బాటలో కాంగ్రెస్ By కొప్పుల రాజు IAS


హిందూ సమాజంలోని అణచివేత దుర్లక్షణాలన్నింటిమీద తిరుగుబాటు చిహ్నం అంబేద్కర్ అని జవహర్‌లాల్ నెహ్రూ అన్నారు. అంటరానితనానికి, సామాజిక అణచివేతకు శ్రమను, ఉత్పాదక వత్తిని నీచంగా చూసే కుల వ్యవస్థకు దాని దుష్ట విలువలకు వ్యతిరేకంగా మొక్కవోని పోరాటం చేసి నోరులేని కోట్లాదిమంది మూగ భారతీయులకు అంబేద్కర్ దఢమైన కంఠాన్ని ఇచ్చారు. ఆయన కేవలం రాజ్యాంగ నిర్మాతే కాదు, అణగారిన వర్గాల విముక్తి ప్రదాత. మహాత్మా జ్యోతిబాఫూలేను స్ఫూర్తిగా తీసుకుని అంబేద్కర్ సాగించిన సామాజిక విప్లవోద్యమం మహోన్నతమైనది.

దేశం ఎదుర్కొంటున్న ఇతర పలు సవాళ్ళను గాంధీ, నెహ్రూలు తమదైన పద్ధతిలో పరిష్కరించే ప్రయత్నం చేశారు.. డాక్టర్ అంబేద్కర్ మాత్రం కులవ్యవస్థ చిమ్మిన కాలకూట విష ప్రభావం నుంచి సమాజాన్ని సమూలంగా విముక్తి చేసేందుకు కంకణం కట్టుకున్నారు. దేశానికి స్వాతంత్య్రాన్ని సాధించారన్న కీర్తి కిరీటం మీద విహరిస్తున్న గాంధీ, నెహ్రూలకు భారతీయ సమాజాన్ని అమానుషం చేస్తున్న కుల వ్యవస్థను వివక్షను రూపుమాపవలసిన తక్షణ అవసరాన్ని గుర్తు చేశారు. బ్రిటీష్ పాలనలో లండన్‌లో జరిగిన రౌండ్ సమావేశాలలో దీనిని కీలక చర్చనీయాంశం చేయగలిగారు. గాంధీజీకి అప్రియమైనప్పటికీ సాటి ఎస్సీల కోసం బ్రిటీష్ ప్రభుత్వం నుంచి కొన్ని రాయితీలు పొందడంలోనూ కతకత్యుడయ్యారు.

అంబేద్కర్ అంటరాని మహర్ కులంలో పుట్టారు. అయినా ప్రపంచంలోని అత్యంత ప్రతిభావంతులలో ఒకడుగా సమున్నత స్థాయిని సాధించారు. అంతర్జాతీయంగా పేరెన్నికగన్న విద్యాసంస్థలలో న్యాయ, తత్వ, ఆర్థిక శాస్ర్తా లు చదువుకున్నారు. లోతుగా అధ్యయనం చేశారు. ఒక అమెరికన్ యూనివర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో డాక్టరేట్ పొందారు. అనేక గొప్ప గ్రంథాలు రచించారు. ఆయన రచించిన కుల నిర్మూలనగ్రంథం చైతన్యశీలమైన, శక్తివంతమై న రచన. సాటి దళితుల దుస్థితిపై అంబేద్కర్ అనేక వ్యాసాలు, రచనలు వెలువరించారు. కుల వ్యవస్థ, అంటరానితనం మూలాలను ఛేదించి వాటిలోని దుర్మార్గాన్ని, డొల్లతనాన్ని ఎండగట్టారు. 
జవహర్‌లాల్ నెహ్రూ ఆహ్వానంమీద తొలి ప్రభుత్వంలో న్యాయశాఖమంత్రి పదవిని అంబేద్కర్ చేపట్టారు. రాజ్యాంగ ముసాయిదా రూపకల్పన కమిటీకి అధ్యక్షుడుగా నియమితుడయ్యారు. 

రెండున్నర ఏండ్లు వివేచనతో, పీడిత జనపక్షపాతంతో కషిచేసి ఆ చరిత్రాత్మక కర్తవ్యాన్ని నిర్వర్తించారు. అనేక క్లిష్టమైన ప్రశ్నలకు విశాల మానవత, సమ్మిళిత ప్రజాస్వామిక దష్టితో రాజ్యాంగ సభలో అంబేద్కర్ ఇచ్చిన సమాధానాలు, వివరణలు గణనీయమైనవి. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం పరమాశయాలుగా రూపొంది న ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలతో కూడిన రాజ్యాంగాన్ని ఆయన ఆవిష్కరించారు. దానికి గొప్ప ఉప క్రమణికను అందించారు. ఆదేశిక సూత్రాలను విధిగా తక్షణమే అమలు చేయాలని లేనప్పటికీ వాటిని అమలులోకి తేవడం ప్రభుత్వాల నైతిక భాద్యత అని స్పష్టంచేయడం ద్వారా సమున్నత సమాజ నిర్మాణం దిశగా అవి పనిచేయవలసిన ఆవశ్యకతను కల్పించారు. మత స్వేచ్ఛను ప్రాథమిక హక్కులలో చేర్చి సర్వమత సమభావంతో సెక్యులర్ దేశంగా వర్ధిల్లడానికి పునాదులను రాజ్యాంగంలోనే నిర్మించారు. బలమైన కేంద్రం, స్వతంత్ర రాష్ర్టాలు ఉండే ఫెడరల్ వ్యవస్థను నెలకొల్పారు.

అంబేద్కర్ తాను బాల్యంలో అనుభవించిన అంటరానితనం గురించి చెప్పుకొన్నారు. పాఠశాలలో మంచి నీళ్ళు అడిగితే బంట్రోతు పైనుంచి పోసేవాడని ఆత్మకథలో రాసుకున్నారు. మరుగుదొడ్లు ఊడ్చే పనిని, ఆ రంగంలో సామర్ధ్యాన్ని బట్టి గాక కులాన్ని బట్టి అప్పగిస్తారని, ఈ పనిని ఎస్సీల చేతనే చేయిస్తున్నారని అంబేద్కర్ ఎత్తిచూపారు. అందుకే జాతీయ సలహా మండలి ఛైర్మన్ సోనియా సూచన మేరకు మరుగుదొడ్లను ఊడ్చే పనిని పారిశుధ్య సమస్యగానే కాక సామాజిక సమస్యగా కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం గుర్తించింది.


ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల జీవన పరిస్థితులను మెరుగుపరచి సమానమైన గౌరవాన్ని వికాసాన్ని పొందేలా చేయడానికి వారిపట్ల సానుకూల వివక్షను, ధర్మపక్షపాతాన్ని చూపే అధికరణలను రాజ్యాంగంలో చేర్చేలా చేసిన అసమాన ఘనత, మానవత అంబేద్కర్‌ది. అంటరానితనాన్ని నిషేధిస్తున్న ఆర్టికల్ 17, మత, భాషాపరమైన అల్పసంఖ్యాకవర్గాలకు రక్షణ కల్పిస్తున్న ఆర్టికల్ 30, విద్యా ఉద్యోగ రంగాలలో ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి తోడ్పడుతున్న ఆర్టికల్ 46 ఆయన పీడితజన పక్షపాతానికి నిదర్శనాలు. 

అంబేద్కర్ స్త్రీల విముక్తికోసం రాజ్యాంగంలో ప్రత్యేక అధికరణలు చేర్చారు. రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాలలో సమాన హక్కులు కల్పిస్తున్న ఆర్టికల్ 15, మహిళల పట్ల సానుకూల వివక్షతో ధర్మపక్షపాతంతో వ్యవహరించేలా చేస్తున్న ఆర్టికల్ 15(3), స్త్రీ, పురుషులకు సమాన ఉపాధి అవకాశాలు, సమాన పనికి సమాన వేతనం కల్పిస్తున్న ఆర్టికల్ 39 వంటి అనేక సాధనాలను రాజ్యాంగంలో పొందుపరిచారు. వీటిని అనుసరించి పార్లమెం టు పలు విప్లవాత్మక చట్టాలు చేసింది. తొలి ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రిగా ఉన్న అంబేద్కర్ స్త్రీని బానిసగా చేస్తున్న హిందూ మత దుష్ట విలువలను పరిహరించే హిందూ స్మతి బిల్లును రూపొందించారు.

హిందువులలో బహు భార్యత్వాన్ని నిషేధించి మహిళలకు ఆస్తి హక్కును, విడాకుల హక్కును ఇతర అనేక వెసులుబాట్లను స్వేచ్ఛలను కల్పించదలచిన ఈ బిల్లును పితస్వామ్య వ్యవస్థకు పెను సవాలుగా భావించిన ఆనాటి ఛాందసులు పార్లమెంటులో దానిని వ్యతిరేకించి చట్టం కానివ్వకుండా చేశారు. దానితో ఆయన న్యాయశాఖ మంత్రి పదవినుంచి వైదొలిగారు.

దళితుల, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఏ చట్టాలు రావాలని, ఏ చర్యలు చేపట్టాలని అంబేద్కర్ కోరుకున్నారో వాటిని సాకారం చేసిన, చేస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీకే చెందుతుంది. ఎస్సీ, ఎస్టీలపై అత్యాచార నిరోధక చట్టం పరిధిని విస్తరింపచేసింది. మహిళలకు గహహింస నుంచి రక్షణ కల్పిం చే చట్టం కాంగ్రెస్ తీసుకువచ్చిందే. స్థానిక సంస్థలలో మహిళలకు, ఓబీసీలకు రిజర్వేషన్ల కల్పన, నిర్భయ చట్టం, పని స్థలాలలో మహిళల వేధింపును అంతమొందించే చట్టం, కేంద్ర ఉన్నత విద్యాసంస్థలలో ఓబీసీలకు రిజర్వేషన్ల కల్పన కాంగ్రెస్ సాకారం చేసినవే. మహిళలకు చట్ట సభలలో 33శాతం రిజర్వేషన్ల కోసం కషిని చేపట్టిన ఖ్యాతి దానిదే. ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించడానికి 117వ రాజ్యాంగ సవరణ బిల్లు 2012 కు రాజ్యసభ ఆమోదం సాధించడం, ఎస్సీ, ఎస్టీలపై అత్యాచార నిరోధక సవరణ బిల్లును ఆర్డినెన్స్ ద్వారా అమలులోకి తెచ్చి, దళితులను న్యూనత పరిచే మరి అనేక కుల దురహంకార దుశ్చర్యలకు శిక్షపడేలా చేసిన గొప్పతనం కాంగ్రెస్ పార్టీదే. కేంద్ర స్థాయిలో ఎస్టీ, ఎస్టీ ఉప ప్రణాళికలకు చట్టబద్ధత కల్పించి వారి ఆభివద్ధికి ఉద్దేశించిన నిధులు వారి కోసమే ఖర్చయ్యేలా చేయాలని కాంగ్రెస్ పార్టీ దీక్ష పూనింది.

దేశంలోని ప్రతి బ్లాక్‌లోనూ అణగారినవర్గాలు, ముఖ్యంగా దళితుల కోసం నవోదయ విద్యాలయాల మాదిరి ఉన్నత ప్రమాణాల పాఠశాలను నెలకొల్పాలని, ప్రైవేట్ రంగంలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పన దిశగా జాతీయస్థాయి ఏకాభిప్రాయాన్ని సాధించడానికి గట్టి కషి చేయాలని, ప్రభుత్వంలో, ప్రభుత్వరంగ సంస్థల్లో ఎస్టీ, ఎస్టీ లకు, ఇతర బలహీన వర్గాలకు రిజర్వ్ చేసిన ఉద్యోగాలన్నీ తప్పనిసరిగా వారితో నే భర్తీ అయ్యేలా చూడాలని, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల అభివద్ధి కోసం జాతీయ కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ అంశాలన్నీ కూడా అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీ త్రికరణశుద్ధిగా అమలుచేస్తోంది.

పునాదులలో సామాజిక ప్రజాస్వామ్యం నెలకొంటే గాని రాజకీయ ప్రజాస్వామ్యం మనుగడ సాగించజాలదు అని అంబేద్కర్ స్పష్టపరిచారు. ఈ దష్టితోనే కాంగ్రెస్ ప్రభుత్వాలు దేశంలో సామాజిక న్యాయసాధనకు అగ్ర ప్రాధాన్యమిచ్చి అహరహం పట్టుదలతో కషి చేస్తున్నా యి. అంబేద్కర్ రాజ్యాంగ పిత, నిర్మాతే కాదు గొప్ప స్వాతంత్య్ర యోధుడు, రాజకీయ నాయకుడు, తత్వవేత్త, రచయిత, ఆర్ధికవేత్త, సంపాదకుడు. భారతదేశంలో బౌద్ధమత పునరుద్ధరణకు అవిరళ కషిచేసినవాడు. అటువంటి అసమాన మహనీయుని జన్మదినాన కేవలం పుష్పార్చనతో సరిపుచ్చడానికి బదులు ఆయన మహోన్నత, మానవీయ ఆశయాలను ఆచరణలో పెట్టడానికి నడుంబిగించడమే ఆయనకు సరైన నివాళి.

బానిసత్వాన్ని అంతమొందించగల పరమాయుధం విద్య. అణగారిన ప్రజానీకాన్ని తట్టి లేపి సామాజిక హోదాను ఆర్ధిక పురోభివద్ధిని, రాజకీయ స్వాతంత్య్రాన్ని సాధించుకునేలా చేసేది విద్య. - అంబేద్కర్ 

Namasete Telangana Telugu News Paper Dated: 13/4/2014 

No comments:

Post a Comment