Sunday, April 20, 2014

గిరిజనులకు విభజన అన్యాయాల - జయధీర్ తిరుమలరావు



విభజన నేపథ్యంలో తెలంగాణ గిరిజనులకు అడుగడుగునా అన్యాయం జరిగే అవకాశాలున్నాయి... గిరిజన ఉప ప్రణాళిక, ట్రైకార్, ట్రిప్‌కో, ట్రిమ్‌కో, గిరిజన సాంస్కృతిక పరిశోధన శిక్షణ సంస్థలలోని ఉద్యోగులు, నిధులను తెలంగాణలోని భూభాగం ప్రకారం కాకుండా షెడ్యూల్ ఏరియా, గిరిజనులకి చెందే 55 శాతం ప్రకారం పంచాలి.
నవ తెలంగాణ నిర్మాణమేమో గానీ ఉన్న తెలంగాణ ప్రయోజనాలకు రాష్ట్ర విభ జన సమయంలో గండిపడే అవకాశం ఏర్పడుతున్నది. సీమాంధ్ర అధికారులు, ఉద్యోగులు ఎక్కడికక్కడ తెలంగాణ ప్రయోజనాలను దాచిపెట్టి యాంత్రిక విభజన పర్వానికి తెరతీస్తున్నారు. న్యాయంగా చెందవలసిన వాటా గురించి ఆలోచించే రాజకీయ సంకల్పం ఓట్ల క్రీడలో మునిగిపోయింది. రాజకీయ చైతన్యం కలిగిన శక్తులు ఇంకా అలసటలోనే జోగుతున్నాయి. మరికొన్ని శక్తులు కప్పుకున్న ముసుగు తొలగించడానికి ఇష్టపడడం లేదు. ఐక్యకార్యాచరణ కమిటీ జాగరూకతతో ఉండాల్సిందిపోయి సభలు, సమావేశాలకే ఎక్కువ పరిమితమవుతోంది.
ఇప్పుడు, ఎప్పటిలాగే వెనకబడిన వర్గాలకి, గిరిజనులకి అన్యాయం జరుగుతున్నది. వెంటనే దీనిని ప్రతిఘటించవలసిన అవసరం ఉంది. రాష్ట్రంలో సుమారు 60లక్షల మంది గిరిజనులు ఉన్నారు. అందులో 55 శాతం మంది తెలంగాణలో నివసిస్తున్నారు. వీరు నివసించే షెడ్యూల్ ఏరియా (ప్రాంతాలు) కూడా అంతే శాతం తెలంగాణలో ఉంది. కాబట్టి గిరిజన సంక్షేమ శాఖలోని ఉద్యోగులు, నిధులు కూడా తెలంగాణ గిరిజనులకు అదే శాతాల్లో (55 శాతం) చెందాల్సి ఉంది. కానీ రాష్ట్రంలోని భూభాగంలో 42 శాతం తెలంగాణకు చెందిందని, 23 జిల్లాల్లో 10 జిల్లాలు తెలంగాణవని, కాబట్టి అదే దామాషాలో తెలంగాణకు గిరిజన సంక్షేమ శాఖలోని ఉద్యోగాలు, నిధులు చెందుతాయని ఆ మేరకు ఆ శాఖ ఉద్యోగులు విభజిస్తున్నారు.
ఈ విధానంలో గిరిజన సంక్షేమ శాఖను విభజిస్తే తెలంగాణ గిరిజనులకు అన్యాయం జరుగుతుంది. జూన్ 2 నుంచి కొత్తగా ఏర్పడనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 45శాతం గిరిజనులకు 55 శాతం ఉద్యోగాలు, 55 శాతం నిధులు వెళ్తాయి. తెలంగాణ రాష్ట్రంలోని 55శాతం గిరిజనులకేమో 45శాతం ఉద్యోగాలు, అదే దామాషాలో నిధులు వస్తాయి. అంటే 20శాతం ఉద్యోగాలు, నిధులు కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజనులకు చెందనున్నాయన్నమాట. విభజన నేపథ్యంలో తెలంగాణ గిరిజనులకు అడుగడుగునా అన్యాయం జరిగే అవకాశాలున్నాయి. 2013 జనవరిలో గిరిజన ఉపప్రణాళిక కింద ప్రత్యేక నిధులు ఇచ్చారు. ఒక్క గిరిజన సంక్షేమ శాఖ మాత్రమే కాక ఆయా ప్రభుత్వ శాఖలు తమ బడ్జెట్లలో 6 శాతం నిధులను గిరిజనుల కోసం పెట్టడం, సాంప్రదాయానికి భిన్నంగా ఒక సంవత్సరంలో కేటాయించిన నిధులు అదేసంవత్సరంలో ఖర్చు కాకపోయినా అవి రాష్ట్ర ఖజానాకు తిరిగి వెళ్ళకుండా వచ్చే సంవత్సరంలో ఖర్చు చేయడానికి వీలుండటం ఇవి గిరిజన ఉప ప్రణాళిక ప్రత్యేక వెసులుబాట్లు. కాబట్టి సమీప భవిష్యత్‌లో ఈ ప్రణాళిక కింద వచ్చే అధిక నిధులతో గిరిజన సంక్షేమం పెరుగుతుందని అందరూ ఆశిస్తున్నారు. కానీ ఈ నిధులు కూడా తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల భూభాగం దామాషా(42:58)లో పంచితే అధిక శాతంలో ఉన్న తెలంగాణ గిరిజనుల సంక్షేమం కుంటు పడుతుందని చెప్పక తప్పదు.
అలాగే ఇప్పుడు రాష్ట్రంలో గిరిజనులకు స్వయం ఉపాధి, అభివృద్ధి పథకాలకు ఎన్నో రుణాలను టైకార్ సంస్థ (గిరిజన ఆర్థిక సహకార సంస్థ) అందజేస్తున్నది. కొత్త రాష్ట్రాల భూభాగాల దామాషా ప్రకారం ఈ సంస్థ నిధులను కూడా విభజిస్తే తెలంగాణ గిరిజనులకు అన్యాయం జరుగుతుందని తెలుస్తూనే ఉంది. గిరిజన ప్రాంతాల్లోనే నదులు, గనులు, వనరులు ఉన్నాయి. వాటిని అభివృద్ధి పరచడానికి, వాటి ఫలాలు కొన్ని ఆ ప్రాంత గిరిజనుల అభివృద్ధికీ ఉపయోగపడాలని ట్రిప్‌కో (గిరిజన పవర్ కంపెనీ), ట్రిమ్‌కో (గిరిజన గనుల కంపెనీ) సంస్థలు ఏర్పడ్డాయి. ఈ సంస్థలనూ కొత్త రాష్ట్రాల భూభాగాల దామాషా (42:58) ప్రకారమే విభజించనున్నారు. మరి షెడ్యూల్ ప్రాంతాలు తెలంగాణలో ఎక్కువ శాతంలో ఉన్నప్పుడు ఎక్కువ శాతం ప్రయోజనాలు తెలంగాణ ప్రజలకు చెందకూడదా?

షెడ్యూల్ ఏరియా ఫైల్ గల్లంతు విషయాన్ని చూద్దాం. ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఉన్న పాల్వంచ, ఏటూరు నాగారం ప్రాంతాల మధ్యనున్న ప్రాంతం షెడ్యూల్ ఏరియా (గిరిజన ప్రాంతం) అని 1950 నాటి హైదరాబాదు (తెలంగాణ) ప్రభుత్వం రాష్ట్రపతికి ప్రతిపాదన పంపితే అందుకు రాష్ట్రపతి ముద్రపడి ఆ ప్రాంతం షెడ్యూల్ ఏరియాగానే కొనసాగుతూ వస్తున్నది. షెడ్యూల్ ఏరియాలో బయటి వ్యక్తులు, సంస్థలు లాభాపేక్షతో ఎలాంటి గనుల తవ్వకం, కార్యకలాపాలు చేపట్టకూడదు. కానీ పైన పేర్కొన్న ప్రాంతంలో విపరీతమైన ఖనిజ సంపద ఉందని తెలిసి, దాన్ని కొల్లగొట్టడానికి పన్నాగం పన్నిన కొందరు సీమాంధ్ర వ్యక్తులు, కంపెనీలు ఆ ప్రాంతం షెడ్యూల్ ఏరియా కాదని హైకోర్టులో సవాలు చేస్తున్నారు. తాము నెగ్గితే ఇష్టారాజ్యంగా తెలంగాణ గిరిజన ప్రాంతాన్ని, గనులను దోచుకోవచ్చని పన్నాగం. హైకోర్టులో వారి సవాలును ఎదుర్కొనే ప్రయత్నంలో భాగంగా ఇప్పటి గిరిజన సంక్షేమ శాఖ హైకోర్టు కోరిన విధంగా 1950 నాటి హైదరాబాద్ ప్రభుత్వ షెడ్యూల్ ఏరియా ప్రపోజల్ కాపీని సంపాదించే ప్రయత్నం చేసింది. ఆ కాపీ ఢిల్లీలో దొరుకుతుందేమోనని అక్కడికి, భోపాల్‌కి, హైదరాబాద్‌లోని స్టేట్ ఆఫ్ ఆర్కైవ్స్‌కి అధికారులను పంపించి వెదికించింది. కానీ ఆ కాపీ దొరకలేదు. చిత్రమేమింటే, అంతకు(1950కి)ముందు సంవత్సరాలవి, ఆ తరువాత సంవత్సరాలవి డాక్యుమెంట్లు అన్నిచోట్ల అందుబాటులో ఉన్నాయి. ఈ ఒక్క 1950 సంవత్సరానివే లేవు. అంటే ఎవరో... లాభాపేక్ష కోసం గూడుపుఠాణీ చేసి వాటిని మాయం చేసినట్లు తెలుస్తున్నది.
పైన పేర్కొన్న వలసవాద శక్తుల, పెట్టుబడిదారుల కుటిల ఎత్తుగడలను తెలంగాణ ప్రజలు, ప్రత్యేకించి గిరిజనులు ఇప్పుడే అడ్డుకోకపోతే తీరా తెలంగాణ ఏర్పాటయ్యాక కూడా చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లవుతుంది. కాబట్టి వెంటనే గిరిజన సంక్షేమశాఖలోని వివిధ విభాగాలైన గిరిజన ఉప ప్రణాళిక, ట్రైకార్, ట్రిప్‌కో, ట్రిమ్‌కో, గిరిజన సాంస్కృతిక పరిశోధన శిక్షణ సంస్థలలోని ఉద్యోగులు, నిధులను తెలంగాణలోని భూభాగం ప్రకారం కాకుండా షెడ్యూల్ ఏరియా, గిరిజనులకి చెందే 55శాతం ప్రకారం పంచాలి.
n జయధీర్ తిరుమలరావు

Andhra Jyothi Telugu News Paper Dated: 16/04/2014 

No comments:

Post a Comment