Sunday, April 20, 2014

మూడో జెండర్ - (సంపాదకీయం)

మంగళవారం నాడు సుప్రీంకోర్టు చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది. కొజ్జాలు, హిజ్రాలుగా హీనమైన సామాజిక పరిగణన కలిగిన వారిని మూడో లింగం మనుషులుగా పరిగణించాలని, వారిని సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలవారిగా గుర్తించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జస్టిస్ కె.ఎస్.రాధాకృష్ణన్, జస్టిస్ ఎ.కె. సిక్రిలతో కూడిన సుప్రీంకోర్టు బెంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. స్త్రీలు, పురుషులు అన్న రెండు లింగాలను మాత్రమే భారత రాజ్యాంగం గుర్తించింది. ఈ ఆదేశాలతో ఇకపై మూడో లింగం కూడా అధికారికంగా ఉనికిలో ఉంటుంది. దీర్ఘకాలంగా ప్రపంచవ్యాప్తంగా ట్రాన్స్‌జెండర్స్ తమను అధికారికంగా గుర్తించాలని, తమ కోసం ప్రత్యేకంగా సంక్షేమ, అభివృద్ధి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మానవహక్కుల బృందాలూ వారికి మద్దతుగా అభిప్రాయ సమీకరణ చేస్తున్నాయి. అనేక పాశ్చాత్య దేశాలు మూడోజెండర్‌ను అధికారికంగా గుర్తించాయి. ఈ మధ్యనే ఆస్ట్రేలియా కోర్టు కూడా మూడో జెండర్‌ను గుర్తించాలని ఆదేశించింది. దక్షిణాసియాలో నేపాల్, బంగ్లాదేశ్ తృతీయ ప్రవృత్తి వర్గాన్ని గుర్తించాయి. ఆలస్యంగా అయినా భారత్ మూడోలింగం గుర్తింపును ఇవ్వడం ఆహ్వానించదగినది. భారతీయ సమాజంలో వస్తున్న ఆరోగ్యకరమైన మార్పులకు, అన్ని రకాల వివక్షలకు వ్యతిరేకంగా పెరుగుతున్న చైతన్యానికి ఈ తీర్పు ఒక సంకేతం.
మూడో జెండర్ విషయంలో ఆధునిక సమాజంలో చాలా అపోహలు ఉన్నాయి.

వారి శరీర నిర్మాణం గురించి, లైంగిక ప్రవృత్తి గురించి, మూడో జెండర్‌లోకి పరివర్తన చెందడం గురించి అనేక తప్పుడు అభిప్రాయాలు ఉనికిలో ఉన్నాయి. కొజ్జాలు, హిజ్రాలు అందరూ పురుష స్వలి ంగ సంపర్కులేనని భావిస్తుంటారు. స్వలింగ సంపర్కులు వేరు, కొజ్జాలు వేరు. శరీరనిర్మాణ ంలో లోపం వల్ల మాత్రమే మూడో జెండర్ ఏర్పడుతుందని అనుకునేవారూ ఉంటారు. శారీరకంగా మగ పుటుక పుట్టినా, జెండర్ రీత్యా స్త్రీ ప్రవృత్తి కలిగినవారు, స్త్రీగా పుట్టి పురుష ప్రవృత్తి కలిగినవారు, లైంగికంగా స్త్రీపురుషులిద్దరి పట్లా వాంఛ కలిగినవారు, మరో లింగానికి దగ్గరగా శరీరనిర్మాణాన్ని మార్చుకునేవారు- ఇట్లా ట్రాన్స్‌జెండర్లలో రకరకాలవారున్నారు. మరి కొందరయితే భౌతికంగా తమ లింగానికి అనుగుణంగా లైంగిక ప్రవృత్తి కలిగి ఉంటూనే, ఇతర లిం గాల వేష, వస్త్రధారణలతో ఆనందించే వారుంటారు. మన సమాజం ప్రధానంగా పురుషాధిక్య స్వభావం కలిగినది కాబట్టి, మగతనానికి ప్రాధాన్యం, ఇతర లింగాలకు హీనపరిగణన సహజంగానే నెలకొని ఉన్నాయి. లైంగికత విషయంలో కూడా స్త్రీపురుష శృంగారమే సహజమైనదీ, న్యాయమైనదీ అనే నమ్మకం స్థిరపడిపోయింది. స్త్రీపురుష శృంగారం పునరుత్పత్తితో ముడిపడి ఉండడం కూడా అదే ఏకైక లైంగికత అన్న భావన బలపడడానికి కారణం. జీవరాసులలో పునరుత్పత్తికి రకరకాల పద్ధతులు ఉనికిలో ఉన్నాయని, ఏకలింగ జీవులూ ఉన్నాయని, పరపరాగ సంపర్కంతో పాటు స్వపరాగ సంపర్కపద్ధతిని అనుసరించే వృక్షజాతులు ఉన్నాయని మనకు తెలుసు. స్త్రీపురుష లైంగికత అన్నది కాలక్రమంలో పరిణామక్రమంలో రూపొందిన విధానమే తప్ప, సృష్టిలో అది మాత్రమే సహజమని భావించడం శాస్త్రీయం కాదు. ఈ కారణాల రీత్యానే స్వలింగ సంపర్కులు తమ లైంగికత అసహజమైనదని కానీ, ప్రకృతివిరుద్ధమైనదని కానీ అంగీకరించరు.
మూడోలింగం వారిని హీనంగా హేళన చేయడం ఆధునిక కాలంలోనే పెరిగిపోయిందనుకోవాలి. శృంగారం గురించి, లైంగికత గురించి సమాజంలో గోప్యతను పెంచినది బ్రిటిష్ వలస పాలనే. లైంగికత గురించి బాహాటంగా మాట్లాడుకోవడమే అపచారంగా తొలినాటి ఆధునికత భావించింది. గతకాలంలో, తృతీయలింగం వారికి పెద్ద గౌరవం లేకున్నా, గుర్తింపు, సాంస్కృతిక స్వేచ్ఛ ఉండేవి. రామాయణంలో కూడా మూడోజెండర్ వారి ప్రస్తావన ఉన్నది. భారతంలో అయితే బృహన్నల, శిఖండి ప్రముఖ పాత్రలే. వాత్సాయన కామసూత్రాలు కూడా తృతీయ ప్రవృత్తిని పేర్కొన్నాయి. ఒక గురువు ఆధీనంలో గణజీవనం గడపడం కొజ్జాల పద్ధతి. పుట్టడం ఏ లింగంలో పుట్టినా కొజ్జాలుగా మారడానికి ఒక తంతు, పూజాపునస్కారాలు ఉంటాయి. కొజ్జాలు మాత్రమే ప్రత్యేకంగా పూజించే దేవతలు దేశమంతా ఉన్నారు. పిల్లలు పుట్టినప్పుడు, పెళ్ళిళ్ల వంటి శుభకార్యాలలోను కొజ్జాలకు కానుకలివ్వడం సంప్రదాయబద్ధమైన ఆనవాయితీ. కొజ్జాల లైంగిక జీవనంలో సమాజం కల్పించుకునేది కాదు, నేరమనీ ఘోరమనీ భావించేది కాదు. అయితే, వారిని కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలకు, యాచకవృత్తికి లేదంటే అంతఃపురాల రక్షణకు మాత్రమే పరిమితం చేశారు. వారిని అందరు మనుషులతో పాటు సమస్త శ్రామిక కార్యక్రమాలలో అనుమతించడం జరగాలి. సంప్రదాయమైన గుర్తింపుతో పాటు, ఆధునిక హోదా కూడా రావడం అందుకు తోడ్పడుతుంది. కేవలం చట్టపరమైన గుర్తింపు మాత్రమే చాలదు, ప్రభుత్వం మూడోలింగం వారిని సమానులుగా పరిగణించేందుకు తగిన సానుకూల చర్యలు, ప్రచార కార్యక్రమం చేపట్టాలి.
స్వలింగ సంపర్కాన్ని చట్టవిరుద్ధంగా ఇటీవల సుప్రీంకోర్టు ప్రకటించింది. తగిన విధంగా పీనల్‌కోడ్‌ను సవరిస్తే తప్ప, స్వలింగ సంపర్కానికి చట్టబద్ధత లభించదు. ట్రాన్స్‌జెండర్లందరూ స్వలింగ సంపర్కులూ, స్వలింగ సంపర్కులందరూ ట్రాన్స్‌జెండర్లూ కాకపోయినప్పటికీ- స్వలింగ సంపర్కానికి చట్టబద్ధమైన అనుమతి లభించడం తృతీయ జెండర్‌కు కూడా అవసరం. అన్నిటికి మించి దేశంలో స్థిరపడిపోయిన లైంగిక భావనల సడలింపు జరగకపోతే, ఆయా గ్రూపుల హక్కులకు రక్షణ లేకపోవడమే కాక, సమాజంలో జెండర్ ప్రజాస్వామికీకరణ జరగదు. మంగళవారం నాటి సుప్రీంకోర్టు తీర్పుతో వేసిన ముందడుగు, మరింత ఉదార సమాజావతరణకి దారితీస్తుందని ఆశిద్దాం

Andhra Jyothi Telugu News Paper Dated: 16.4.2014 

No comments:

Post a Comment