తెలంగాణ మాండలికంలో.. కొత్త ముత్యాలు
'సూర' నవలలో గ్రామాలలో నేటికీ మారని, తరాలుగా వెళ్లూనుకున్న కులాలు, కులాంతరాల దొంతరలు, దొరలు, పట్టేండ్ల ఆధిపత్యం, సామాజిక శ్రమదోపిడీ, లైంగిక దోపిడీ దళితులపై కొనసాగుతున్న తీరు కళ్ళకు కట్టినట్లు చూపించారు రచయిత భూతం ముత్యాలు. ఈ నవల దళిత సాహిత్యంలోనే కాక తెలుగు నవలా వికాసంలో కలువగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.
'బదనాం', 'పుకారు' పర్యాయపదంగా బుగాడను పేర్కొనవచ్చు. భూతం ముత్యాలు కథా సంకలనానికి శీర్షికగా ఉన్న ఈ కథలో ఒక యువకునికి 'అన్న'లతో ఏమైనా సంబంధం ఉన్నదేమో అన్న అపోహతో పోలీసులు గ్రామాలలో తమకు సహకరించే వేగులతో మాటువేసి ఎప్పటికప్పుడు అతడిని గమనిస్తుంటారు. ఇలా ఎంత మంది అమాయకులు వివక్షకు, దమననీతికి గురవు తున్నారు అనే మీమాంస కలుగక మానదు.
ఒక రచయిత లేక కవి తన భావాన్ని వ్యక్తపరిచే సందర్భంలో, మాతృభాష ప్రాంతీయత, నేటివిటీ స్ఫురించే విధంగా తనదైన మాండలిక భాషలో వ్యక్తపరిస్తేనే ఆ రచనకు గాఢత, స్వచ్ఛత సమకూరుతుంది. ఈ వొరవడి పాశ్చాత్య సాహిత్యంలో పాలకుంతలు తొక్కింది. అదే వొరవడిని తన నేటివిటీకి అనువదించుకుని ఇంతవరకు ఏ రచయిత చేయని నూతన ప్రయోగానికి నాంది పలుకుతూ తెలంగాణ మాండలికాన్ని మన ముందుంచారు భూతం ముత్యాలు. గత పదిహేను సంవత్సరాలుగా సీరియస్ రచనలు చేస్తున్న రచయిత ముత్యాలు. ఈయన కలం నుంచి జాలువారినవే 'సూర' (నవల), 'బుగాడ' (కథలు).
'సూర' దళిత నవల. రచయిత ఇందులో 'గో బ్యాక్ టు విలేజ్' సిద్ధాంతాన్ని బలపరుస్తూ రచన సాగించడం వలన నవలకు బలం చేకూరింది. సంభాషణల్లో యధాతథంగా శుద్ధ గ్రామీణ మాండలిక భాష వాడుకోవడం విశేషం. తెలంగాణ మాండలిక భాషలోని పదజాలం, సామెతలు, సొబగులు ముత్యాలు రచనలో విరివిగా కనువిందుచేసి చదువరులను ఆకట్టుకుంటాయి. తెలంగాణ మాండలికంలో అందునా నల్లగొండ మాండలీకంలో ఈ రచన సాగుతుంది. 'సూర' లో రెండు తరాల వలస దళిత మాల జీవితాలను ఆవిష్కరించారు రచయిత. మొదటి తరానికి చెందిన వారు చెన్నడు, అతని భార్య చెంద్రి. వీరు నిరక్ష్యరాస్యులు. అయితే రెండవ తరానికి చెందినవాడు అతని కొడుకు సూరడు. చెన్నడు, చెంద్రి నిరక్షరాస్యులైనప్పటికీ తమ కొడుకు 'సూర'(కథానాయకుడు)నికి నిరక్ష్యరాస్యత వల్ల కలిగే బాధలు రాకూడదని భావిస్తారు. మొదట్లో సూరడు చదువు పట్ల మారాం చేసినా తన మేనమామ కొడుకు కేశవులు ఆసరాతో చదువులో గాడిన పడతాడు. అదే సమయంలో ఊరి నుంచి అకస్మాత్తుగా పట్నం ఊడిపడతారు నాగిరెడ్డి, కాశిరెడ్డిలు. చెన్నడు, చెంద్రిల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని లబ్ధి పొందడానికి భార్యాభర్తలకు లేనిపోని ఆశలు కల్పిస్తారు. సూరన్ని, కాశిరెడ్డి తీసుకెళ్ళి హాస్టల్‌లో చేర్పిస్తాడు. తర్వాత అదను చూసి చెంద్రిని కాటేస్తడు. ఇది భరించలేని చెంద్రి, తన భర్తతో సొంత ఊరు చేరుకుంటుంది. అక్కడి పాలివాళ్ళతో మూఢనమ్మకాలతో చెన్నడు, చెంద్రి కూరుకుపోతారు. ఇది గ్రామీణ పరిస్థితులకు అద్దం పడుతుంది.
ఇక గ్రామంలో నాగిరెడ్డి మోసాలకు అడ్డు, అదుపు ఉండదు. పెద్దవాడైన సూరనికి ఆ ఊరి దొర బిడ్డ జయలక్ష్మితో పరిచయం ఏర్పడుతుంది. అది వారి మధ్య ప్రేమకు దారితీస్తుంది. జయలక్ష్మి తెగువతో సూరన్ని ప్రేమ వివాహం చేసుకుంటుంది. ఇరువురు పట్నం వెళ్లి కాపురం పెడతారు. మూఢనమ్మకాలతో చిక్కిబొక్కైన చెన్నడు మరణిస్తాడు. సూర, జయలక్ష్మిలు ఊరికి వస్తారు. ఇన్నేండ్లు గడచిన ఊరు మారలే, ఊరి తీరు మారలే. దీనితో కలత చెందిన సూరడు తన జాతిని మేల్కొల్పే లక్ష్యంతో జయలక్ష్మి ఎంత వద్దని వాదిస్తున్నా ఊరిలో 'పూలే, అంబేద్కర్' పాఠశాలను ప్రారంభించి దళితుల కళ్లు తెరిచేలా చేస్తాడు. ఇది అంబేద్కర్ సిద్ధాంతాన్ని బలపరుస్తుంది. కానీ ఏ ఊరైనా దొరలు, పటేండ్లు ఒక్కటే. వారి ధన, బల, అహంకారాల ముందు ఎవరైనా బలాదూర్. నాగిరెడ్డి కుట్రలకు బలైన 'గారీబు' మరికొందరు నాగిరెడ్డిపై కక్ష కడుతారు. అదే సమయంలో ఊరిలో నాగిరెడ్డి దేశగురువు సహాయంతో బొడ్రాయి పండుగ జరుపుతుంటాడు. ఇక్కడ నాగిరెడ్డి సూరన్ని చంపాలని చూస్తే చివరకు గారీబు చేతిలో నాగిరెడ్డి బలి అవుతాడు. తను తవ్వుకున్న గుంటలో తనే పడ్తాడు అన్నట్లు నాగిరెడ్డి మరణిస్తాడు. దెబ్బలు తిని ఆస్పత్రిపాలైన సూరడు నాగిరెడ్డి సావు కబురు విని ఊరు పీడ విరగడైనదని సంతోషిస్తాడు. ఇలా నవల ముగుస్తుంది. ఈ నవల నల్లగొండ మాండలీకంలో అందునా శుద్ధ గ్రామీణ మాండలిక పదజాలం. మిగతా వారికి ఒకేసారి చదివితే అర్థం కాకున్నా, మరో ప్రయత్నంలో నవలలోని సారాన్ని ఆస్వాదిస్తారు. గ్రామాలలో నేటికీ మారని, తరాలుగా వెళ్లూనుకున్న కులాలు, కులాంతరాల దొంతరలు, దొరలు, పట్టేండ్ల ఆధిపత్యం సామాజిక శ్రమదోపిడీ, లైంగిక దోపిడీ దళితులపై కొనసాగుతున్న తీరు కళ్ళకు కట్టినట్లు చూపించారు రచయిత. ఈ నవల దళిత సాహిత్యంలోనే కాక తెలుగు నవలా వికాసంలో కలువగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. ప్రతి ఒక్కరూ చదువదగ్గ నవల. మాండలికాన్ని ఆస్వాదించాలంటే ఈ నవల చదవాల్సిందే. నేటి రచయితలకు ఈ నవల స్ఫూర్తినిస్తుందనడంలో సందేహం లేదు. మరిన్ని మాండలికాలతో సాహిత్యం సుసంపన్నం కావాలి. లేదంటే మాండలిక భాష అంతరించే ప్రమాదం ఉందని గ్రహించాలి.
భూతం ముత్యాలు మరో రచన 'బుగాడ' కథల సంకలనం. ఇందులో మొత్తం 16 కథలున్నాయి. ఒకటి, రెండు కథలు మినహాయించి మిగతా కథలన్నీ తెలంగాణ మరీ ముఖ్యంగా నల్లగొండ మాండలికంలోనే సాగాయి. ఈ కథలలో ఒక్కో కథ దేనికదే దాని విశిష్టతను చాటుకున్నది. నేటి సమాజంలో అంతరిస్తున్న సంస్కృతి, సాంప్రదాయాలు, కట్టుబాట్లు, మానవీయ విలువలు, సమాజ పోకడను పట్టిచూపుతాయి ఈ కథలు. కొన్ని కథలలో స్త్రీల సమస్యలు పరిశీలించాడు. కానీ ఇతడు స్త్రీవాద కవి రచయిత కాదు. అంతమాత్రాన అతడు స్త్రీ పక్షపాతి కాదనలేము. అందుకు ఈ సంకలనంలోని స్త్రీల కథలే నిదర్శనం. ఇతన్ని చలంతో పోల్చలేకపోయినా ఒకటి, రెండు కథలలో చలాన్ని తలపిస్తాడు. 'ఎవరిని వారే దిద్దుకోవాలి' అన్న చాసో మాటలు ఈ రచయితకి వర్తిస్తాయి. అట్ల రాసినవే ఈ కథలు అనిపిస్తాయి.
ఇక కథలను పరిశీలించినట్లయితే మొదటి కథ 'ఊరబోనం'. ఊరబోనం కథలో శ్రావణమాసం, ఆషాఢ మాసంలో జరుపుకొనే బోనాల పండుగను మనముందుంచాడు రచయిత. ఒకప్పుడు ఎంతో భక్తి ప్రపత్తులతో జరుపుకునే పల్లె జనులు నేడు గ్లోబలైజేషన్ పుణ్యమా అని మొఖం చాటేస్తున్నారు. కథనం పూర్తిగా మాండలికంలో సాగి చదువరులలో ఆసక్తిని కలిగిస్తుంది. మరో కథ 'బుగాడ'. ఈ పేరు కథాసంకలనానికి టైటిల్. బుగాడ అంటే ఎన్ని అర్థాలు ఉన్నా 'బదనాం', 'పుకారు' పర్యాయపదంగా ఆ పదాన్ని పేర్కొనవచ్చు. ఇందులో ఒక యువకునికి అన్నలతో ఏమైనా సంబంధం ఉన్నదేమో అన్న అపోహతో పోలీసులు గ్రామాలలో తమకు సహకరించే వేగులతో మాటువేసి ఎప్పటికప్పుడు ఆ యువకున్ని గమనిస్తూ అనుమానించే కథ. కానీ ఈ కథలో కథనం సాగిన తీరు ఆలోచనలో పడవేస్తుంది. ఇలా ఎంత మంది అమాయకులు వివక్షకు, దమననీతికి గురవుతున్నారు అనే మీమాంస కలుగక మానదు. మరో కథ 'జేజి'. ఇది విద్యార్థి బాల్యం గురించి గాధ. పసినాడే ఫ్లోరిన్ విషపు కోరల్లో చిక్కి బాల్యం ఎలా చిధ్రమౌతుందో వర్ణిస్తుంది. నల్లగొండను ఆనుకొని కృష్ణా నది పారుతున్నా నేటికీ తాగునీటికి కొరతే. పేదరికం, అంగవైకల్యం, అక్కరకురాని ప్రభుత్వ వైద్యం, తల్లి పేగుపాశం హృదయాన్ని తాకక మానదు. ఈ కోవకే చేరుతుంది మరో కథ 'రుక్మతి'. అంటే భీమారి (రోగం). ఇదీ బలమైన కథే. మాండలిక కథలకు పత్రికలో చోటుదొరకదు. కానీ ప్రతి ఒక్కరూ చదవాల్సిన కథలు. గుండెలు పిండేసే కథలు. లేతప్రాయంలోనే పసిమొగ్గ గుండెకు చిల్లుపడితే ఆరోగ్యశ్రీ కార్డు ఆదుకోలేక, అప్పుపుట్టక, ఆపరేషన్ చేసే స్తోమత లేక కొడుకును చూసి విలవిలలాడిన తల్లి తన కిడ్నీని అమ్ముకొని కుమారుడిని బ్రతికించుకునే తీరు హృదయాన్ని కలచివేస్తుంది. అదేవిధంగా తెలంగాణ పొద్దుపొడ అనే కథలో వచ్చిన తెలంగాణ ఎలా ఉండాలో, దొరల తెలంగాణ కాకుండా సామాజిక తెలంగాణ రాకుంటే దళితుల బ్రతుకు మారదని తేల్చి చెబుతుంది. అందుకు దళితులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాకముందే దళితులకు హెచ్చరిక చేసాడు రచయిత.
'దూదిపింజె' మరో కథ. ఈ కథలో హాస్టల్‌లో చదువుకునే పోరలు దసరా పండుగ సెలవుల్లో ఊరికి వచ్చి హాయిగా గడుపుదామనుకుంటే తల్లిదండ్రులు వారిని ఊరికే ఉండనివ్వక పత్తిచేళ్ల పనికి తమవెంట తీసుకపోయి పనిచేయించడం. రెక్కాడితే గానీ డొక్కాడని పల్లెజనుల బ్రతుకు, చిత్రణ ఈ కథలో కనిపిస్తుంది. పండుగకి పిల్లలకు బట్టలు కొనే స్తోమత లేక తమతో పాటు పిల్లలను పనికి తీసుకెళ్లడం వారి బీదరికం, వారి దయనీయ స్థితి ఈ కథలో ఆవిష్కరించబడింది. 'మాలోకం' కథలో తాపంతో, తన్మయంతో తీరని కోరికలు, వయస్సు తాపంతో పరుగు తీసే యువతి ఇష్టంలేని పెళ్లి చేసుకుని మొరటు మొగుడితో కాపురం ఇష్టంలేక, అపరిచితుడి చేతిలో పడి వంచనకు గురై వేశ్యావాటికలో తేలుతుంది. ఓ విటుని సహాయంతో బయటపడి నూతన జీవితం ఆరంభిస్తుంది. మన చుట్టూ దారితప్పి మోసపోతున్న యువతులకు అద్దం పడుతుంది ఈ కథ. మరో కథ 'స్నేహం విలువ'. ఈ కథలో విలువలు, స్నేహాలు డబ్బు ముందు దిగదొడుపే అని తెలుపుతుంది. డబ్బుకు, కులానికి అన్నీ బంధాలు తెగిపోవడం నేటి నైజం. 'ఆఖరి ఉత్తరం' అనే కథలో ఇద్దరు యువతీ, యువకులు ప్రణయ గాధను తెలుపుతూనే 'ఆ' అవసరం కోసం తపించే యువకుని మనస్తత్వం కోరిక తీరగానే చేతులు దులుపుకొని దూరం చేసే తీరు కనబడుతుంది. కానీ మహిళలు మాత్రం అలాకాక ప్రేమించే వ్యక్తినే సర్వస్వంగా భావించడం, ఆరాధించడం, తను మోసపోయిన క్షమాగుణం కలిగి ఉండడం స్త్రీల మానసిక స్థితికి దర్పణం పడుతుంది. 'లోగిలి' అనే మరో కథ. ఇందులో జస్ట్ లిఫ్ట్ కోసం అపరిచిత వ్యక్తితో ఎలా మసలుకోవాలో తెలుపుతూనే అతని మాటల గారడీలో పడిపోవడం, తోడు కోసం వెతుకులాటలు, అతనితో తీరని కోరికలు తీర్చుకోవడం, వయస్సు రేపే చిలిపి తుంటరి చేష్టలు కనిపిస్తాయి. ఈ కథలో రచయిత శృంగార రసాన్ని పండించాడు. 'జోగి' అనే మరో కథలో భర్త పెట్టే వేధింపులు భరించలేక అతని దెబ్బలకు విసిగి, వేసారి చావే శరణ్యమని తలుస్తుంది జోగమ్మ. విధి లేని పరిస్థితుల్లో తనకు ఆసరా ఎవరూ లేరని చావే శరణ్యమని రైలు పట్టాలపై పడుకొని మృత్యువుని ఆలింగనం చేసుకోవాలనుకుంటుంది. అప్పుడే తన ఇద్దరు పిల్లలను యాదికి తెచ్చుకొని తను లేకుంటే వారు అనాథలు అవుతారని వేదన చెంది కలత పడి చావును తప్పించుకోవాలనుకుంటుంది. కానీ అంతలో మృత్యుకోరల నుంచి బయటపడే పెనుగులాటలో కాళ్లు రెండూ పోగొట్టుకుంటుంది. ఫలితం అవిటితనం, బ్రతుకు బారం, ఆదరించని సమాజం. ఏటికి ఎదురీదడం సాహసంతో కూడిన పని. విధి వంచితురాలైన జోగమ్మ తాను పుండైన తనువును పడక చేసి వేశ్యగా మారి సమాజంలో పరపతి పొందిన తీరు కన్పిస్తుంది. కానీ ఇది నిజమేనా అనిపించక మానదు. మరో కథ 'మాయమ్మ - మల్లమ్మ'. అమ్మ ఆప్యాయత, అనురాగం, అమ్మ ప్రేమ, ఊరు పరిసరాలు, అమ్మ చుట్టూ అల్లుకున్న మమకారాలు, పెనవేసుకున్న బంధాలు కథలో కనిపిస్తాయి. అమ్మంటే ఊరు. ఊరంటే అమ్మ. అమ్మకు ఊరు పర్యాయపదం. పల్లెలు భారతవని పట్టుకొమ్మలైతే, అమ్మకు అమ్మలాంటి పల్లెకు విడదీయరాని ఆత్మీయానుబంధం వేసాడు రచయిత.
'కుటిలం' మరో కథ. నేటి సమాజంలో మోసానికి ఎవరూ అతీతులు కారు. ఏదీ అతీతం కాదని తెలిపే కథ. నిరుపేదలైన మల్లమ్మ, మల్లయ్యలు వలస వెళ్లి రామోజీ ఫిల్మ్‌సిటీలో బతుకీడుస్తున్న వారి భూమిని ఎలాగైనా కాజేయాలన్న దుర్బుద్ధితో ధనిక వర్గం చేసే దుర్మార్గపు కుట్రకు నిలువెత్తు నిదర్శనం ఈ కథ. పేదలను నిరుపేదలుగా మార్చి ఎలాగైనా వారి భూమిని కాజేసి ఊరిలో వారికి ఏమీ లేకుండా చేసి ఊరి నుంచే వేరుచేసిన తీరు ఈ కథలో కన్పిస్తుంది.
'బొందల గడ్డ' మరో కథ. ఈ కథలో 'కులనిర్మూలన' అంబేద్కర్ సిద్ధాంతం మరో కొత్తకోణంలో ఆవిష్కరించాడు రచయిత. ఇప్పటికీ దళితులపై జరుగుతున్న దాడులు, వారి మాన ప్రాణాలు హరిస్తూనే ఉన్నాయి. అయితే వారి ఉనికినే లేకుండా చేసే సమాజ పోకడ నేటికీ చూస్తూనే ఉన్నాం. నిన్నటి చుండూరు, కారంచేడు మొదలు నేటి లక్ష్మింపేట దాకా కంచికచర్ల కోటేశు నుంచి బీటెక్ తలారి అరుణ, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనూహ్య మరణం వరకు అగ్రవర్ణ దమననీతి కనిపిస్తూనే ఉంది. అధికారం అడ్డంపెట్టుకొని బెల్టు షాపుల నుంచి గుడుంబా సెంటర్లను గ్రామాలలో ఏరులై పారించి దళితుల్ని వ్యసనపరుల్ని చేసి మద్యంలో అంతం చేసే నయావంచన పోకడయే ఈ కథ. దళితులే ఎక్కువగా మద్యం తాగడం, మద్యానికి బానిసలవడం, చావును కొనితెచ్చుకోవడం ఈ కథలో చూపుతాడు రచయిత. ఒక వాస్తవిక విషయాన్ని కథగా మలచిన తీరు ఆశ్చర్యం కలిగించక మానదు. 'జాలుబాయి' మరో కథ. ఈ కథలో ఒకప్పుడు తెలంగాణ పల్లెలు జాలుబాయి నీటితో పంటచేళ్లు ఎలా పసిడి మాగాణాలైనాయో జాలుతో నిండిన బావులు నీటితో కలకలలాడే దృశ్యం ఒకనాడు, నేడు అదృశ్యమై జాలుబాయి జాలు ఎండిపోయిన తీరును ఆవిష్కరించారు రచయిత. అందుకు గ్లోబల్ వార్మింగ్ ఒక కారణమైతే కరువు కాటకాలు మరో కారణంగా చెప్పవచ్చు. అట్లాంటి పల్లెలకు త్రాగునీరు లేక అవస్థలు పడడం, రాజకీయ నాయకులు వాగ్దానాలు గుప్పించడం నల్లగొండకు నక్కలగండి వస్తే తప్పా నల్లగొండ దూప తీరదు. అది నిజమని రచయిత అభిప్రాయం. ఇంత నీతి ఉన్న నవల, కథలను తెలుగు సాహిత్యానికి అందించన ఘనత భూతం ముత్యాలుది.
ఈ సాహిత్యాన్ని విశ్వవిద్యాలయాలు దూరం చేస్తున్నాయి. మనుస్మృతి సూక్తి 'ఏవమేవతు శూద్రసన ప్రభుకర్మ సమాదియత్, ఏతేషామేవా వర్ణనాం శుశ్రూషా మనసుయయా'ని విశ్వవిద్యాలయాల తెలుగు శాఖలు అమలుపరచడమే ఇందుకు నిదర్శనం. అవి, దళిత సాహిత్యాన్ని అవమానపరుస్తూ అవహేళన చేస్తున్నాయి. ఇట్టి సాహిత్యాన్ని ఎవరైనా నాశనం చేయవచ్చు అనే పద్ధతిని తిరిగి దళిత బహుజన అధ్యాపకులచే అణగదొక్కిస్తున్నారు. దళిత సాహిత్యంపై పరిశోధనకు ఆసక్తి చూపుతున్న విద్యార్థులను నిరుత్సాహ పరుస్తూ ఆంధ్రా విశ్వవిద్యాలయాల్లో జరిగిన పరిశోధన చాలు ఇక అవసరం లేదు తెలంగాణలో దళిత సాహిత్యానికి అవకాశాలు లేవు అని విద్యార్థులను తెలంగాణ విశ్వవిద్యాలయ ఆచార్యులు అవహేళన చేస్తూ అవమానిస్తూ వివక్షకు గురిచేస్తున్నారు. దళిత రచయితలూ మేల్కొనండి. ఇటువంటి రచనలను ఆదరించండి. సాహితీ విమర్శకులారా! సాహితీ పాఠకలోకమా! విశ్వకవులమని విర్రవీగుతూ ఊరేగుతున్న వారలారా! ఆలోచించండి. ఏదీ సాహిత్యమో నిగ్గుతేల్చండి. శూద్రుల విజ్ఞానం, విద్యార్జన నేరము ఇక్కడ. అదేవిధంగా వారి సాహిత్యం నేరమై, సమాజానికి దూరమై పోతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా దళిత సాహిత్యం మీద నిషేధాజ్ఞలు కొనసాగుతూనే ఉన్నాయి. దళిత కవులు, రచయితలు బహుపరాక్. మన సాహిత్యాన్ని చదవండి. తెలంగాణ తెలుగులో అగ్రకుల విషభావజాలాన్ని అరికట్టండి. దళిత సాహిత్యాన్ని పండించండి.
- వేముల ఎల్లయ్య
Namasete Telangana Telugu News Paper Dated: 07/04/2014
No comments:
Post a Comment