Monday, May 5, 2014

వైకల్యాన్ని జయించిన మనిషి కథలు (అవిటి కథలు) By గిన్నారపు ఆదినారాయణ,


మనిషిని మనిషిగా ప్రేమించిన నాడే దేశం బాగుపడుతుంది. అలా కాకుండా మనిషిని ద్వేషించిన నాడు సమాజం పతనానికి దారి తీస్తుంది. నేడు సమాజంలో మనుషుల మధ్య సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయో పరిశీలిస్తే- ఎవరి అస్తిత్వాన్ని వారు నిలుపుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా సాహిత్య పరంగా గమనించినట్లయితే- స్త్రీ వాదం, దళిత వాదం, మైనారిటీ వాదం, బి సి వాదం అంటూ ఏర్పడ్డ అస్తిత్వ వాదాలు నేడు ఎవరి అస్తిత్వాని వారు గట్టిగా నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నాయి. స్త్రీ వాదం గురించి స్త్రీవాదులు- స్త్రీవాదేతరులు, దళిత వాదం గురించి దళిత వాదులు- దళితవాదేతరులు, మైనారిటి వాదం గురించి మైనారిటీ వాదులు- మైనారిటీవాదేతరులు, బిసి వాదం గురించి బిసి వాదులు- బిసి వాదేతరులు మాట్లాడుతూ, రాస్తూ తమ వాదాలను గట్టిగా చాటిచెబుతున్నారు. మరి ఈ అస్తిత్వ వాదులు- వికలాంగుల అస్తిత్వం గురించి ఎందుకు మాట్లాడడం లేదు? వికలాంగులకు ప్రత్యేక అస్తిత్వం లేదా? ఉంటే వారి అస్తిత్వాని నిలిపే ప్రయత్నం ఎందుకు చేయడం లేదు? ఇలాంటి సందర్భంలో- తెలుగు సాహిత్యంలో అవిటి కథలు-తో వేముల ఎల్లయ్య, సంపంగి శంకర్‌ వికలాంగులపై వచ్చిన సాహిత్యాన్ని వెలికి తీయడం గొప్ప సాహసం. సమాజంలో తమ అస్తిత్వాన్ని, గుర్తింపును నేటికీ వెతుక్కునే వికలాంగులు, సాహిత్యంలో కనిపించే తమ అస్తిత్వాన్ని తాము నిలబడి గుర్తించకపోవడం సామాజికంగా, చారిత్రకంగా సాహిత్యంలో తీరని లోటే.

ఈ సమాజంలో అన్ని వర్గాల, అన్ని కులాల, అన్ని మతాల ప్రజలు నివసిస్తునారు. ఎవరికి వారే తమ తమ వర్గాలు, కులాలు, మతాలకు చెందిన వారికి సహాయ సహకారాలు చేసుకుంటున్నారు. వికలాంగులలో కూడా అన్ని వర్గాల, అన్ని కులాల, అన్ని మతాలకు చెందిన వారు ఉన్నారు. అయినా వారిని మాత్రం ఎవరూ పట్టించుకోరు. అంటే వీరు మనుషులు కారా? ఆయా వర్గాలకి, ఆయా కులాలకి, ఆయా మతాలకి చెందినవారు కాదా? మొదటగా మనిషి ఏదో ఒక వర్గ, కుల, మత సమూహానికి చెందినవాడై ఉంటాడు. ఆ తర్వాత ఏదో అవయవ లోపం వల్ల వికలాంగుడుగా ఉండడం జరుగుతుంది. ఆయా వర్గ, కుల, మాతాలకు చెందిన రాజకీయ నాయకులు ఓట్లకోసం వచ్చేటప్పుడు ఎన్నో మాయ మాటలు చెబుతారు. ఓట్లువేసే సమయంలో వికలాంగులకు వాహనాలు ఏర్పాటు చేసి, మాయమాటలతో మభ్యపె ట్టి ఓట్లు వేయించుకుంటారు. ఆ తర్వాత వారి సమస్యలసై అసెంబ్లీలో కాని పార్లమెంట్‌లో కానీ ఏ ఒక్క పార్టీసభ్యుడూ మాట్లాడరు. వికలాంగులకు న్యాయం జరగాలని, వారిని అన్ని రంగాలలో ప్రోత్సహించాలని, తద్వారా వారు కూడా సకలాంగులతో సమానంగా పోటీ పడగలరని ఎవరూ మాట్లాడరు. ఎందుకు? కనీసం వికలాంగుల అవసరాలకు నెలకు సరిపోయేంత పెన్షన్‌ ఏర్పాటు చేయించరు. అధికారంలోఉన్న నాయకులంటే పదవుల సంబరంలో అన్నీ మరచిపోతున్నారనుకుంటే, మరి ప్రతిపక్షాలలో ఉన్న నాయకులు ఏం చేస్తునట్లు?

ఇటీవలి కాలంలో గత కొన్ని సంవత్సరాల నుండి మంద కృష్ణ మాదిగ వికలాంగుల కోసం ప్రత్యేకంగా పోరాడుతున్నారు. వికలాంగుల హక్కుల కోసం ఒక వ్యక్తి పోరాడుతున్నారంటే కనీసం మద్దతు ఇవ్వాలన్న ఆలోచన కూడా ప్రతిపక్ష నాయకులకు లేకుండా పోయింది. మద్దతు ఇవ్వడంవల్ల, ఆ గొప్పతనం సమస్యను మొదలు పెట్టిన వ్యక్తికి పోతుందని ఆలోచించారో, లేక వికలాంగుల కోసం పోరాడడం వల్ల ఏం వస్తుంది అని అనుకుంటున్నారో అర్ధం కావడం లేదు. నేటి పోటీ ప్రపంచంలో వికలాంగులు సైతం తమ కున్న పరిమిత రిజర్వేషన్లను ఉపయోగించుకొని అన్ని రంగాల్లో ఇప్పుడిప్పుడే కన్పిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌ కు చెందిన క్రిష్ణగోపాల్‌ సింగ్‌ అంధులలో మొట్ట మొదటగా ఐఏయస్‌ సాధించిన వ్యక్తి. తర్వాత హర్యానా రాషా్టన్రికి చెందిన అజిత్‌ కుమార్‌ ఐఏయస్‌ సాధించి, తాము కూడా అందరితో సమానంగా పోటీ పడగలమని నిరూపించారు. అలాగే నర్తకి సుధారామ చంద్రన్‌, నాట్య మయూరి అన్నపూర్ణ, విలియం క్రోయిజన్‌, ఇరవై ఒక్క మైళ్ళ పొడవున ఉన్న ఇంగ్లీష్‌ చానల్‌ ఈదిన వ్యక్తిగా హరిరామ కోహ్లి, అలాగే యమునా నదిని ఈదిన వ్యక్తిగా దీపా మాలిక మొదలైన ఎందరో వికలాంగులు పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. ముఖ్యంగా అంధుల కోసం ప్రత్యేక లిపి తయారు చేసి, అంధులు చదువుకోవాలని ఆశించిన మహానుభావుడు లూయి బ్రెయిల్‌. ఇలా ఇంకా ఎంతోమంది వికలాంగులు చదువుకొని విద్య, ఉద్యోగ, ఆర్ధిక, రాజకీయ, సాహిత్య రంగాలలో పైకెదుగుతున్నారు.

ఇటీవలి కాలంలో సాహిత్య రంగంలో వీరిగురించి- అవిటి కథలు- అనే కథా సంకలనం వెలువడింది. ఇది గర్వించదగిన విషయం. సాహిత్యంలో వికలాంగుల బతుకు చిత్రణ చేసినవారు చాలా అరుదు. అవిటి కథలు కథాసంపుటిలో 25 కథలతో 204 పేజీల నిడివితో మన ముందుంచారు వేముల ఎల్లయ్య ,శంకర్‌ సంపంగి.
ఈ సంపుటిలో కుష్టాది కిష్టయ్య- కథను వేముల ఎల్లయ్య చాల గొప్పగా రాశాడు. ఇందులో కిష్టయ్య కుష్టాది కిష్టయ్యగా మారుతాడు. కిష్టయ్య- నర్సవ్వ భార్యా భర్తలు. కిష్టయ్య మాదిగ కులస్థుడు. వారి తాత ముత్తాతలు నిజాం పాలనలో నిజాంకు చెప్పులు కుట్టి, కచ్చురాలకు మూగలు, పట్టిలు కుట్టి, తుపాకులకు పౌచులు వార్లు కుట్టినందుకు భూమి ఇనాంగా ఇస్తారు. కిష్టయ్య ముత్తాతలు అప్పుడు భూమిని సాగు చేసేవారు. తర్వాత తర్వాత కాపులు, కరణాలు భూమికి శిస్తు కట్టాలని మాదిగలను హింసిస్తారు. తర్వాత కొన్ని రోజులకు కరువు రావడం వల్ల భూమి చేసుకోడానికి ఇబ్బంది పడి అందరూ కూలీలుగా మారుతారు. ఆ భూమిని కాపులు స్వాధీనం చేసుకుంటారు. తర్వాత కొన్ని రోజులకు రోజువారీ పని చేసి చాలీ చాలని తిండి తింటూ కుష్ఠు రోగం వచ్చి అనేక ఇబ్బందులు పడతాడు కిష్టయ్య. కిష్టయ్యకు ఇంటి పేరు మరొకటి ఉన్నా కుష్టి పేరుతో, కుష్టాది కిష్టయ్యగా పిలుస్తారు. తర్వాత కిష్టయ్య పట్నం వచ్చి వికలాంగుల కోసం, కుష్టాదివాళ్ళ కోసం పోరాడి భిక్షగాడిగా మారతాడు. సమాజంలో బీదవారికే అన్ని రోగాలు వస్తాయి. నిమ్న జాతుల వారిని ఇంకా నిమ్నంగా చూడడాన్ని ఈ కథ తెలుపుతుంది.

చూపున్న పాట కథను పతంజలి రాశారు. ఇందులో విశ్వనాథం పోలీస్‌ ఆఫీసరు. రోజూ డ్యూటీకి వెళ్లి వచ్చే దారిలో రోడ్డు పక్క ఒక గుడ్డివాడు మురళి వాయిస్తూ అడుక్కునేవాడు. ఒక రోజు విశ్వనాథం ఆ గుడ్డి వాని దగ్గర ఆగి నిల్చుంటాడు. ఆ గుడ్డివాడు తన మురళి ద్వారా గద్దర్‌ పాటలు పాడుతుంటాడు. విశ్వనాథం అతని దగ్గరికి వచ్చి- నువ్వు ఈ పాటలు ఎందుకు పాడుతున్నావు, అసలు నువ్వు ఎవ్వరు, ఎక్కడుంటావు, నువ్వు ఈ పాటలే ఎందుకు పాడుతున్నావు, నువ్వు నక్సలైటువా, కమ్యునిస్టువా- అని ప్రశ్నిస్తాడు. నువ్వు ఈ పాటలు పాడద్దు, దేవుడి పాటలు పాడితే ఎక్కువ డబ్బులు వస్తాయి- అని ఉచిత సలహాలు ఇస్తాడు. అసలు మురళి శ్రీ కృష్ణునిది (దేవుడి) కదా! నువ్వు దానితో గద్దర్‌ పాటలు ఎందుకు పాడుతున్నావు అంటాడు. చివరకు- నువ్వు నక్సలైటు- అని ఆ మురళిని కాలు కింద వేసి తొక్కేస్తాడు. నక్సలైట్ల పై ఉన్న కసిని ఆ గుడ్డి వానిపై చూపిస్తాడు. ఒక వ్యక్తికి ప్రజల సమస్యల పై రాసిన పాటలు పాడే హక్కు లేదా? ఇలా బతుకు దెరువు కోసం వచ్చిన గుడ్డివాడి బాధను అద్భుతంగా ఈ కథలో చిత్రించడం జరిగింది.

పెద్దరోగం- కథ కెమరా విజయ్‌ కుమార్‌ రాస్తూ వికలాంగుల్లో సైతం కుల వ్యవస్థ ఉందని తెలియ జేశారు. రవి ప్రభుత్వ పాఠశాలలో లెక్కల మాష్టారు. రవి ప్రతిభను గుర్తించిన రాష్ట ప్రభుత్వం- ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డు ప్రకటిస్తుంది. జనాభా లెక్కల సేకరణలో అందరి కంటే ముందుగా తన బాధ్యత పూర్తి చేసినందుకు ఈ అవార్డు ఇస్తుంది. కాని ఆ అవార్డు రవికి ఇష్టం లేదు. జనాభా లెక్కలలో భాగంగా గ్రామంలోని అన్ని ఇండ్లు తిరుగుతాడు. చివరకు ఒక ఆస్పత్రికి వెళ్లి అక్కడి వారందరినీ చూసేసరికి రవికి జాలి వేస్తుంది. చాలా మంది కూడు, గూడు, గుడ్డ లేనివాళ్ళు ఇక్కడే జీవనం గడుపుతున్నారు. దేవుడికి ప్రార్ధన చేస్తూ అక్కడే ఉంటారు. రవి వారి దగ్గరకు వెళ్లి ఒక్కొక్క రోగి పేరు, ఊరు, కులం అన్ని వివరాలు రాస్తూ ఉండగా- మీ కులం ఏమిటి- అని అడిగితే వారు రెండవ కులం, మూడవ కులం అని సంఖ్యా రూపంలో చెపితే రవికి ఆశ్చర్యం కలుగుతుంది. వివరంగా అడిగితే వారు- రెండవ కులమంటే మాల అని, మూడవ కులం అంటే మాదిగ అని చెప్తారు. రవికి అలా ఎందుకు చెబుతున్నారో అర్థం కాలేదు. తర్వాత తర్వాత అందర్నీఅడిగే సరికి అర్ధం అయింది. వికలంగుల్లో కూడా కుల ప్రస్తావన ఉందని, తక్కువ కులం వాళ్ళను అగ్ర కులస్థులు కించపరుస్తూ, హేళన చేస్తారని. అందుకే రాష్ట ప్రభుత్వం ప్రకటించిన అవార్డును తిరిగి వెనక్కి పంపిస్తాడు. ఆసుపత్రిలో జరిగిన సంఘటనను చూసి- కీర్తి కోసమో, అపకీర్తి కోసమో ఈ అవార్డును తిరస్కరించడం లేదు. కేవలం ఆత్మసంతృప్తి కోసమే- అని, కుష్టు కంటే ముందు కులాన్ని నయం చేసే ఆస్పత్రులు ఈ దేశంలో రావాలని, కుల నిర్ములన జరగనిదే ఈ దేశం బాగుపడదని గొప్ప సందేశం తెలియజేశాడు రచయిత.

లచ్చిమి కథను పిట్టల శ్రీనివాస్‌ రాశారు. ఇందులో- ఒక వ్యక్తి అవిటి అయినంత మాత్రాన అన్యాయం న్యాయం అయిపోతుందా- అని ఈకథ ద్వారా చక్కగా ప్రశ్నించారు. లక్ష్మి నల్గొండ జిల్లాకు 20 మైళ్ళ దూరంలో మాడగుల పల్లిలో ఉంటుంది. ఆమె నల్లగున్నా అందమైనది. తల్లి దండ్రులకు ఒక్కతే బిడ్డ. చదువు చిన్నప్పుడే మానేస్తుంది. తర్వాత తాను పెద్దదయ్యేకొద్దీ తమ ఇంట్లో తానే అన్నీ చూసుకుంటోంది, వ్యవసాయానికి సంబంధించిన పనులతో సహా. ఆ ఊరి దొర కొడుకు కన్ను- లచ్చిమి మీద పడింది. ఒక రోజు లచ్చిమి ఒంటరిగా ఉండడం చూసి ఆమెపై అత్యాచారం చేసి, ఎవరికైనా చెబుతుందేమో అని ఆమె నాలుక కోసి వెళ్ళిపోతాడు. లచ్చిమి కొన్నిగంటల తర్వాత స్పృహలోకి వచ్చి, ఆ బాధతో ఇంటికి వెళ్ళలేక అక్కడనుండి రైలు పట్టాల వెంబడి నల్గొండకు వెళ్లి అక్కడ కొంత మంది వికలాంగులతో కలిసి బతుకుతుంటుంది. తర్వాత రాజు అనే అతనితో తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పి- కోర్టులో దొర కొడుకు పై కేసు వేస్తుంది. దొర కొడుకు- లచ్చిమి మూగది కదా, అది తననేం చేస్తుందిలే అనుకొని దర్జాగా తిరుగుతుంటాడు. తర్వాత కోర్టులో లచ్చిమి మిషన్‌కు నాలుక పెట్టి జరిగిన విషయం అంతా చెబుతుంది. దొర కొడుకు అది చూసి బిత్తర పోతాడు. చివరకు అతనికి శిక్ష వేస్తుంది కోర్టు. తర్వాత, తన మిత్రులైన వికలాంగులతో తన ఇంటికి వెళ్లి, తన మిత్రులందరికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి, తన భూమిలో వారికి పనులు చూపి ఉపాధి కల్పిస్తుంది. తల్లి దండ్రులు ముందు బాధపడ్డా, తర్వాత ఆమె చేసే పనులు చూసి సంతోషిస్తారు. ఆమెను అవిటిని చేసినంత మాత్రాన అన్యాయం- న్యాయం అయిపోదు అని వికలాంగుల బాధల గాథƒను చక్కగా చిత్రించడం జరిగింది.

జేజి అనే కథలో భూతం ముత్యాలు తన అనుభవంలో చూసిన సంఘటనను చక్కగా రాశారు. జేజి ఓఅందమైన చురుకైన అమ్మాయి. ఆమెది నల్గొండ జిల్లాకు సమీపంలో ఉన్న బాషగూడ. నల్గొండ ప్రాంతం ఉప్పు నీళ్ళకు ప్రతీక. అక్కడ మొత్తం ఉప్పు నీళ్ళు కావడం వల్ల పిల్లలకు పసితనంలోనే పోలియో వచ్చి, కాళ్ళు- రెక్కలు పనిచెయ్యక పోయేవి. అలాంటి భాదితురాలే జేజి. జేజి బాల్యంలో కొంత బాగానే ఉన్నా, తర్వాత కొన్ని రోజులకు కాళ్ళు పూర్తిగా సన్నబడతాయి. బడికి వెళ్ళడం ఇబ్బంది అయ్యింది. అయినా బడికి ఇబ్బంది పడుతూనే వెళ్ళేది. అక్కడున్న బడి ఒక కుటుంబం లాంటిది. జేజి అంటే ఉపాధ్యాయులకు ఎంతో ఇష్టం. ఎందుకంటే జేజి తెలివికల్ల అమ్మాయి. జేజికి బడిలో ఏదన్నా తిందామన్నా, తాగుదామన్నా భయమేసేది. తింటే మలం వస్తుందని, తాగుతే మూత్రం వస్తుందని, అందుకోసం నడుస్తే ఇబ్బంది అని, తినలేక తాగలేక ఒంటరిగా కుమిలిపోతూ ఉండేది. సమాజంలో ప్లోరిన్‌ వల్ల పోలియోతో బాధ పడుతున్న ఇలాంటి సంఘటన ద్వారా రచయిత హృదయాన్ని కదిలింప జేశారు.
తనే కథ- అనే కథను పుస్తక సంపాదకుడు సంపంగి శంకర్‌ తన ఆత్మకథగా అద్భుతంగా తెలియజేశారు. తాను పుట్టినప్పటి నుండి, అనగా తనకు జ్వరం వచ్చి కాళ్ళు పడిపోయినప్పటి నుండి యస్‌యస్‌సి, ఇంటర్‌, డిగ్రీ, పీజిలో మిత్రులతో, చుట్టుపక్కల వారితో తాను పడ్డ అవమానాలు, పి హెచ్‌డి చదువుతూ నేడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనే వరకు తాను ఎదుర్కొన్న సమస్యలను, ఆటుపోట్లను చక్కగా వివరించారు. ఈ కథ తన ఆత్మకథగా చెప్పవచ్చు.

ఈ కథా సంపుటిలో ఉంగరం కథను యుసేఫ్‌ ఇంద్రిస్‌, అమ్మత్యాగం కథను కొమ్ము సతీష్‌, గుడ్డివాడు కథను రావులపాటి సీతారామారావు, ఎద్దు చస్తే ఎట్టమ్మా కథను డాశ్రీలత, ఒక తల్లి కథను పటేల్‌ సుధాకర్‌ రెడ్డి, అన్నీ మేమే చెయ్యాలా కథను అక్కినేని కుటుంబరావు, ఎంపు కథను చాగంటి సోమయాజులు, ఖరిదుల్లా పూల దుకాణం కథను సిద్ది, చెంచి అను కథను గూడూరు రాజేంద్ర రావు, ఇంతేనా ఈ బతుకులు కథను ఎ మోహన… మురళి, ప్రత్యామ్నాయం కథను కె. వరలక్ష్మి, ఊహలకే రెక్కలు వస్తే కథను ప్రవహ్లిక, అందని పిలుపు కథను పి జయశ్రీ, కను పాపాలు జిల్లెడుపాలు- కథను రాజేందర్‌ శంకవరవు, ఎదురీత కథను నాగరాజు అసిలేటి, ఉప్పనీరు కథను బోయ జంగయ్య, ఒంటికాలి శివుడు కథను బెజ్జారపు రవీందర్‌, చంద్రునిలో మచ్చలాంటిదే కథను కమలపాటి వెంకట శాంత లక్ష్మి, జ్ఞాన నేత్రం కథను చక్కిలం విజయలక్ష్మి రాశారు. ఈ అన్ని కథల్లో వికలాంగులు ఎదుర్కుంటున్న బాధల గాథలలు, సమాజం వారిని చూస్తున్న విధానం, వారు ఎదుర్కొంటున్న పరిస్థితులను రచయితలు కళ్ళకు కట్టినట్లు చూపారు.

Surya Telugu News Paper Dated: 5/4/2014 

Saturday, May 3, 2014

అంబేద్కర్ వెలుగులో మోదీ (గతానుగతం) - రామచంద్ర గుహ


Published at: 04-05-2014 02:50 AM
కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి కోట్లాది ప్రజలు అత్యుత్సాహంతో ఉన్న ఈ తరుణంలో నా ఆలోచనలు డాక్టర్ అంబేద్కర్ చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. దళితుల విమోచకుడుగా కంటే, ప్రజాస్వామిక సైద్ధాంతిక వేత్తగా అంబేద్కర్ దార్శనికత నా ప్రస్తుత ఆలోచనలకు ప్రేరణ. 1949 నవంబర్ 25న రాజ్యాంగ సభలో అంబేద్కర్ చేసిన ఒక మహోపన్యాసాన్ని పదే పదే జ్ఞాపకం చేసుకొంటున్నాను. మన రాజ్యాంగనిర్మాత ఆ ఉపన్యాసంలో మూడు హెచ్చరికలు చేశారు. రాజకీయ వ్యవహారాల్లో రాజ్యాంగబద్ధ పద్ధతులను విడనాడడం వల్ల ఎదురయ్యే ప్రమాదాలు, రాజకీయ ప్రజాస్వామ్య పరిమితులు, సామాజిక ప్రజాస్వామ్య ఆవశ్యకత గురించి ఆయన హెచ్చరికలు నేటికీ ఉపయుక్తమైనవి. అయితే ప్రస్తుతఎన్నికల నేపథ్యంలో, అంబేద్కర్ మూడో హెచ్చరికను తప్పక గుర్తుచేసుకోవల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఏ నిర్దిష్ట నాయకుడినీ, ఎంత మహోన్నతుడైనప్పటికీ, గుడ్డిగా అనుసరించవద్దని అంబేద్కర్ హెచ్చరించారు. ఆ సందర్భంగా ఉదారవాద తాత్త్వికుడు జాన్ స్టువార్ట్ మిల్‌ను మాటలను ఉటంకించారు. 19వ శతాబ్దికి చెందిన ఆ పాశ్చాత్య చింతకుడు ఇలా అన్నారు: 'ఒక ప్రజాస్వామ్య సమాజ పౌరులు తమ స్వేచ్ఛా స్వాతంత్య్రాలను, ఒక వ్యక్తి-ఎంత మహోన్నతుడయినప్పటికీ- నాయకత్వానికి పణంగా పెట్టకూడదు; తనకున్న అధికారాలతో రాజ్యాంగ సంస్థలను బలహీనపరిచే అవకాశమున్నందున అధికారంలో ఉన్న వ్యక్తిని ఎంత గొప్పవాడయినప్పటికీ విశ్వసించకూడదు'. అంబేద్కర్ ఇలా వ్యాఖ్యానించారు:
'దేశ సేవకు జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తికి కృతజ్ఞతాబద్ధులై ఉండడం తప్పుకాదు. అయితే కృతజ్ఞతకు హద్దులు ఉండాలి ఐరిష్ దేశభక్తుడు డేనియల్ ఓ'కాన్నెల్ అన్నట్టు ఏ పురుషుడూ తన ఆత్మగౌరవాన్ని కించబరచుకునే విధంగా కృతజ్ఞత చూపలేడు; ఏ మహిళా తనకు మానహాని జరిగే విధంగా కృతజ్ఞత చూపలేదు; ఏ జాతీ తన స్వేచ్ఛా స్వాతంత్య్రాలను కోల్పోయే విధంగా కృతజ్ఞతాబద్ధమై ఉండదు'. అంబేద్కర్ ఇంకా ఇలా అన్నారు: 'మరే ఇతర దేశంకటే భారతదేశం విషయంలో ఇటువంటి జాగ్రత్త మరింతగా అవసరం. ఈ దేశంలో భక్తి, వీరారాధన ఎక్కువ. ప్రపంచంలోని మరే ఇతర దేశ రాజకీయాలలో కంటే మన దేశ రాజకీయాలలోనే ఇవి ఎనలేని పాత్ర నిర్వహిస్తున్నాయి. మతంలో భక్తి మోక్ష సాధనకు తోడ్పడవచ్చు. అయితే రాజకీయలలో భక్తి లేదా వీరారాధన తప్పకుండా జాతి భ్రష్టతకు, అంతిమంగా నియంతృత్వ పాలనకు దారితీస్తాయి'.
అంబేద్కర్ ఈ మాటల ద్వారా, సాధారణీకరించిన ఒక హెచ్చరికను చేశారు. అయితే ఈ హెచ్చరిక చేయడంలో ఆయన మనసులో ఎవరైనా నిర్దిష్ట వ్యక్తులు ఉన్నారా? గాంధీ పట్ల భారతీయుల మితిమీరిన ఆరాధనను అంబేద్కర్ తొలినుంచి వ్యతిరేకించారు. స్వాతంత్య్రం పొందిన తొలినాళ్లలో జవహర్‌లాల్ నెహ్రూ, వల్లభ్ భాయి పటేల్ తదితరులకు దేశ ప్రజల్లో బ్రహ్మాండమైన ప్రతిష్ఠ ఉండడాన్ని ఆయన గమనించారు. దేశ స్వాతంత్య్ర సాధనకు మహాత్మాగాంధీ నాయకత్వంలో ఆ నాయకులూ, వారి కాంగ్రెస్ పార్టీ దశాబ్దాల సుదీర్ఘ పోరాటం చేశారు. అనుపమేయ త్యాగాలు చేశారు. కఠోర కష్టాలు పడ్డారు. కనుకనే అశేష ప్రజలు వారిని విపరీతంగా అభిమానించసాగారు. అంబేద్కర్ ఈ పరిణామాలన్నిటినీ గమనించారు. పర్యవసానాలు ఎలా ఉంటాయో అన్న విషయం ఆయన్ని కలవరపరిచాయి. గాంధీ, నెహ్రూలు జీవితపర్యంతం దేశసేవలోనే గడిపినందున వారి భావాలు, చర్యలు విమర్శకు అతీతమైనవా? సామాన్య పౌరులు ఎదురు ప్రశ్నించకుండా వారి మాటలను అనుసరించవలసిందేనా?
ప్రజలు నాయకులను గుడ్డిగా అభిమానించి, అనుసరించడంలో ఉన్న ప్రమాదాల గురించి జవహర్‌లాల్ నెహ్రూకు బాగా తెలుసు. 1937 నవంబర్‌లో కలకత్తా నుంచి వెలువడే 'మోడరన్ రివ్యూ'లో నెహ్రూ మీద ఒక వ్యాసం ప్రచురితమయింది. 'ఇతరుల పట్ల అసహనం, బలహీనులు, కార్యదక్షత లేని వారి పట్ల తిరస్కార వైఖరి' గురించి ఆ వ్యాసం పేర్కొంది. ఇటువంటి ధోరణులు నెహ్రూలో ఇప్పటికే బలవత్తరంగా ఉన్నాయని కూడా వ్యాఖ్యానించింది. అంతేకాదు 'జవహర్‌లాల్ త్వరలోనే తనను తాను ఒక సీజర్‌గా భావించుకోవచ్చునని' కూడా ఆ వ్యాసం హెచ్చరించింది. 'చాణక్య' అనే కలంపేరుతో నెహ్రూనే ఆ వ్యాసం రాశారని ఆ తరువాత వెల్లడయింది.
స్వీయ పరిమితులు, లోపాల గురించి నెహ్రూకు బాగా తెలుసు గనుకనే తన సీజరిస్ట్ ధోరణులను ఆయన అదుపులో పెట్టుకున్నారు. దీంతో పాటు తన సహచరులైన నాయకులు మహోన్నత రాజకీయ నేతలు అనే వాస్తవాన్ని నెహ్రూ బాగా గుర్తెరగడం కూడా అందుకు ఎంతైనా తోడ్పడింది. నెహ్రూ వలేకాక ఆయన తనయ ఇందిర ప్రజల చేత మరింతగా ఆరాధింపబడాలని ఆకాంక్షించే వారనడంలో సందేహం లేదు. 1969-74 మధ్య మూర్తీభవించిన జాతి స్ఫూర్తిగా ఆమె దేశ ప్రజల గౌరవ మన్ననలను పొందారు. రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతీయీకరణ, బంగ్లాదేశ్ విముక్తి సమరంలో పాకిస్థాన్‌పై సైనిక విజయం మొదలైన వాటి కారణంగా దేశప్రజలు తనను మరింతగా అభిమానించాలని ఇందిర కోరుకునే వారు.
సంఖ్యానేక భారతీయులు ఇందిరను ఆరాధించారు. సామాన్య ప్రజలే కాదు, రచయితలూ, కళాకారులూ కూడా. ఎమ్.ఎఫ్. హుస్సేన్ ఆమెను దుర్గగా చిత్రించారు. తన మాతృభాష అస్సామీలో చెప్పుకోదగ్గ కవి అయిన దేవకాంత్ బారువా అయితే 'ఇండియా అంటే ఇందిర, ఇందిరే ఇండియా' అని కూడా నినదించారు. ఇందిరాగాంధీ, ఆమె అభిమానుల ప్రవర్తన, రాజకీయాలలో భక్తి, వీరారాధన ధోరణుల ప్రమాదాలకు ఒక ప్రామాణిక ఉదాహరణ. ఇందిర పట్ల చూపిన ఆ ఆరాధనా భావం -అంబేద్కర్ హెచ్చరించిన విధంగా- జాతి భ్రష్టతకు, అంతిమంగా నియంతృత్వ పాలనకు దారితీసింది. తన అధికారానికి ముప్పు ఏర్పడినప్పుడు ఎమర్జెన్సీని విధించి తన ప్రత్యర్థులందరినీ జైలుకు పంపడానికీ ఆమె వెనుకాడలేదు కదా.
స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదట వ్యక్తి పూజ ప్రభవించింది ఇందిరాగాంధీ విషయంలోనే. విచారకరమైన విషయమేమిటంటే ఆ అప్రజాస్వామిక పరిణామాలు చోటుచేసుకోవడం అదే చివరిసారి కాదు. సరే, ఇప్పుడు నరేంద్ర మోదీ వ్యక్తిపూజ ప్రభవిస్తోందని మరి చెప్పనక్కర లేదు. కాంగ్రెస్ పార్టీ, కొన్ని ప్రాంతీయపార్టీల వలే భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ ఒక నాయకుని నేతృత్వంలో లేదు. నిజానికి తమది ఉమ్మడి నాయకత్వంలోఉన్న పార్టీ అని బీజేపీ వారు సగర్వంగా చెప్పుకోవడం కద్దు. ఇప్పుడిదంతా మారిపోయింది. 2014 సార్వత్రక ఎన్నికల సందర్భంగా బీజేపీ అంతకంతకు తనను తాను ఒక వ్యక్తి సంకల్పానికి లొంగిపోతోంది. మోదీ ప్రచార యంత్రాంగం తొలుత ఆయన్ని పార్టీ రక్షకుడుగా, ఆ తరువాత జాతి రక్షకుడుగా కీర్తిస్తోంది. ఇతర బీజేపీ నాయకులూ మోదీకి పూర్తిగా విధేయులైపోయారు. ఆయన విధానాలను విమర్శనాత్మకంగా చూడడానికి నిరాకరిస్తున్నారు. బీజేపీ నాయకులకూ, కార్యకర్తలకూ మోదీ మాటే వేదం అయిపోయింది. ఇప్పుడు మనలనూ అదే రీతిలో మోదీని అనుసరించాలని కోరుతున్నారు!
విదేశాలలో 'అర్థరహిత మోదీ ఆరాధన' ఉన్నదని ఒక ఎడిటర్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఒక గొప్ప నాయకుడుగా మోదీ వ్యక్తి పూజను పెంపొందించడంలో విధేయులైన రచయితలు, పాత్రికేయులు పోటీపడుతున్నారు. ఒకప్పుడు ఇందిరకు దేవకాంత్ బారువాలాగా తామూ మోదీకి అలా మారాలని వారు ఆశిస్తున్నారు! నరేంద్ర మోదీ ప్రభుత్వ వ్యవస్థను ప్రక్షాళన చేస్తారని, ఏటా పది శాతం వృద్ధిరేటుతో ఆర్థిక వ్యవస్థను పెంపొందిస్తారని, పాకిస్థాన్, చైనాలను దీటుగా ఎదుర్కొంటాడని, భారత్‌ను గొప్ప అగ్రరాజ్యంగా రూపొందిస్తాడని తమ పాఠకులకు వారు హమీ ఇస్తున్నారు. సైబర్ రౌడీలు మరింత దురహంకార పూరితంగా వ్యవహరిస్తున్నారు. తమ 'మహాపురుషుడిని' పొగడడంలో కంటే, ఆయన్ని వ్యతిరేకిస్తున్నవారిని తీవ్ర అసభ్య పదజాలంతో దూషించడం ద్వారా వారు తమ భక్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి ధోరణులు అంబేద్కర్‌ను ఎంతగానో భయపెట్టేవి. మనమూ, బహుశా వాటి విషయమై కలవరపడుతున్నాము.
n రామచంద్ర గుహ
 
Andhra Jyothi Telugu News Paper Dated: 4/4/2014 

'నోటా' కూడా అణచివేత సాధనమే! - By కొంగర మహేష్ , రీసెర్చ్ స్కాలర్, ఓయూ

Published at: 04-05-2014 02:52 AM
భారత ఎన్నికల చరిత్రలో 'నోటా' (నన్ ఆఫ్ ది ఎబౌ) అవకాశం ప్రజాస్వామ్య పరిపుష్టికి అవసరమయ్యే మరో ఆయుధం. ఎన్నికల బరిలో నిలబడిన అభ్యర్థుల్లో ఏ ఒక్కరూ నచ్చకపోయినా మీటనొక్కి దిమ్మతిరిగే తీర్పు నిచ్చే అరుదైన అవకాశం ఓటరుకు దక్కడమే ఈ 'నోటా' (నిలబడ్డవాళ్లెవరూ నాయకుడిగా పనికిరారన్నది) అసలు ఉద్దేశం. ఓటు అనే ఖడ్గానికి మరింత పదునుపెట్టి ఈ 'నోటా' మీట అసలు లక్ష్యం కూడా ప్రజాస్వామ్య పరిరక్షణే. తమకు సుపరిపాలన అందించే సమర్థ నాయకుడిని ఎన్నుకునేందుకు ఓటుకో బలమైన విలువ చేకూర్చడం దీని కర్తవ్యం. 'నోటా'ను గత ఏడాది సెప్టెంబర్ 17 తదుపరి ఎన్నికల నుంచి అమలు చేయాలని సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. ఈ నోటా సదుపాయాన్ని భారత్‌తో సహా మరో 11 దేశాలు తమ ఎన్నికల్లో వినియోగించుకుంటున్నాయి. అక్రమ సంపాదన, అవినీతి సొమ్ము, నల్లధనం.. ఇలా పేరేదైనా ప్రజాస్వామ్యాన్ని 'ధన'స్వామ్యంగా మార్చి చట్టాలను చుట్టాలుగా వినియోగించుకునే ఖద్దరు నేతలకు నోటా ఓ ఖబడ్దార్ వంటిది.
అంతటి బృహత్తర ఆశయంతో రూపుదిద్దుకున్న నోటా మీట నుంచి ఎస్సీ, ఎస్టీల అభ్యర్థులకు ఆదిలోనే గుదిబండగా మారుతోంది. అదీ కూడా కుల 'తంత్రం'తో ముడిపడి ఎస్సీ, ఎస్టీ ప్రజాప్రతినిధుల ఎన్నికకు ప్రతిబంధకంగా మారడం ఆందోళనకరం. గత ఏడాది డిసెంబర్‌లో ఢిల్లీ, మిజోరాం, చత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొట్టమొదటి సారిగా నోటా మీటను వినియోగించుకునేలా ఎన్నికల సంఘం ఓటర్లకు అవకాశం కల్పించింది. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటర్లు'నోటా' హక్కును ఎలా వినియోగించుకున్నారు? ఏయే సెగ్మెంట్లలో నిలబడిన అభ్యర్థుల పట్ల తమ అసంతృప్తిని వెలబుచ్చారన్న అంశాలపై జాతీయ మీడియా సంస్థ ఒకటి జరిపిన పరిశోధనలో దిగ్భ్రాంతి కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. పై రాష్ట్రాల్లో మొత్తం 630 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 400 జనరల్ స్థానాలుండగా మిగిలిన రిజర్వ్‌డ్ స్థానాల్లో దాదాపు 25 ఎస్సీ, ఎస్టీ రిజర్వ్‌డ్ స్థానాల్లోనే నోటా ఎక్కువ నమోదయింది. మళ్ళీ ఇందులోనూ 23 స్థానాలు ఎస్టీ (గిరిజన) రిజర్వ్‌డ్ స్థానాలు కావడం కులాధిపత్య సమాజ నూతన పోకడలకు నిలువుటద్దం. వీటిల్లో టాప్ ఐదు స్థానాల్లో నోటా నమోదును పరిశీలిస్తే.. తమకు రిజర్వ్‌డ్ అభ్యర్థులెవరూ నచ్చలేదని చత్తీస్‌ఘడ్ బీజాపూర్ - 7179 ఓట్లు (పది శాతం), చిత్రకోట్ 10848 (తొమ్మిది శాతం), దంతేవాడ -9677 (తొమ్మిది శాతం), మధ్యప్రదేశ్‌లోన జున్నార్ దేవ్ -94,12 (ఆరు శాతం), నారాయణ్‌పూర్ (చత్తీస్‌ఘడ్)-6731 (ఆరు శాతం) మంది ఓటర్లు నోటా వినియోగించారు. ఢిల్లీలోని 4 ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానాల్లోనూ 'నోటా' మీట ప్రబలంగానే వినియోగించుకున్నట్లు తమ అధ్యయనంలో తేలిందని ఆ సంస్థ తెలిపింది.
కేవలం 5 రాష్ట్రాల్లోని 630 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల్లో నోటా మీట నొక్కడం భయాందోళనకు గురి చేస్తే.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న 543 లోక్ సభ స్థానాలు (84-ఎస్సీ, 47-ఎస్టీ రిజర్వుడ్ స్థానాలు), 294 (తెలంగాణ, సీమాంధ్ర) అసెంబ్లీ నియోజకవర్గాల (ఎస్సీ-48, ఎస్టీ-19 రిజర్వుడ్ స్థానాలు) ఎన్నికలు కలవరం కలిగిస్తున్నాయి. ఎన్నికల వేళ కోటానుకోట్ల రూపాయల పంపిణీకి పేరుగాంచిన ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు ఎప్పుడో కలుషితమై పోయాయి. కులం, ధనం, ప్రధాన ఇంధనాలుగా సాగుతున్న ఈ ఎన్నికల్లో నోటా మీట భారీగానే నమోదవుతుందని ఓఅంచనా. దేశంలో ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో మనువాద నిచ్చెనమెట్ల రాజకీయపార్టీలన్నీ చట్టబద్ధ రిజర్వేషన్ల కారణంగా తప్పనిసరై తమకు నచ్చినవారిని, అనుచరులు, అతికొద్దిమంది విద్యావంతులు, కాస్తో కూస్తో ఆర్థికంగా స్థిరపడ్డ ఎస్సీ, ఎస్టీలనే బరిలోకి దింపాయి. వారే ఎంపీ, ఎమ్మెల్యేలుగా రిజర్వ్‌డ్ స్థానాలకు ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు.
మన ఉమ్మడి రాష్ట్రంలో చివరిసారిగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఒక పార్టీ రిజర్వ్‌డ్ స్థానాల్లో నిలబెట్టిన అభ్యర్థుల ఆర్థిక బలాబలాలు పరిశీలించిన మీదటనే టిక్కెట్లు కేటాయించినట్లు ఆరోపణలు బహిరంగంగానే గుప్పుమన్నాయి. రిజర్వ్‌డ్ స్థానాల్లో అగ్రకులాల జనాభా పరిమితంగా ఉన్నా ప్రాబల్యం బలంగానే ఉంటుంది. మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే, ఎస్సీ, ఎస్టీ నియోజవర్గాల్లో ఓటింగ్ శాతం 60 శాతంలోపే. కారణం ఆయా వర్గాలు ఓటు హక్కు వినియోగించుకునే అధికార యంత్రాంగం చేపట్టే కార్యక్రమాలు నామమాత్రంగా ఒకటికాగా అక్కడి 'మరింత చైతన్యవంతులైన అగ్రకులాలకు ఓటు వేసేంత సమయం ఉండకపోవడం మరో కారణం. ఇక చివరికి తప్పక ఓటు హక్కు వినియోగించుకునే వాళ్ళేమో నోటా నొక్కే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. పై తెలిపిన 5 రాష్ట్రాల్లో జరిగిన ఓటు వినియోగాన్ని చూస్తే ఆశ్చర్యం, ఆందోళన కలుగకమానదు. మిగతా జనరల్ స్థానాల్లో కంటే ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో నోటా వినియోగం అధికంగా ఉందంటే అక్కడ సమర్థ నాయకుడు లేడని కాదు.
అసలు 'రిజర్వ్‌డ్' స్థానాలు ఉండకూడదని, అంతటా అగ్రకులాలే నిలబడాలని, రాజ్యమేలాలనేదే అసలు రహస్యం. ఒకవేళ అగ్రకులాలు, ఓబీసీల దృష్టిలో ఆ రిజర్వ్‌డ్ స్థానాల్లో నిలబడ్డ అందరూ అసమర్థ అభ్యర్థులే అనుకుంటే మిగతా 400 స్థానాల్లో నిలబడ్డ ఓబీసీ, జనరల్ కేటగిరిలకు చెందినవారంతా సమర్థులా? సమర్థత అనేది కులం ఆధారంగా కంటే వ్యక్తి తన వ్యక్తిత్వం, వనరుల, పార్టీ అధినాయకత్వం ఇచ్చే మద్దతుపై ఆధారపడి ఉంటుంది. కానీ కుల పునాదులపై రూపుదిద్దుకున్న భారత దేశంలో పుట్టుకతోనే ఆ వ్యక్తి బలం, బలహీనతలు నిర్ణయించబడుతున్నాయి. లోకజ్ఞానం, ఉన్నత చదువులు, ఆస్తులు, అంతస్థులు సంపాదించుకున్నా ఇక్కడ కులమే ప్రామాణికం. దాని పర్యవసానమే ఎ స్సీ, ఎస్టీల అభ్యర్థుల 'తిరస్కరణ' కారణం. నేటి ఆధునిక సమాజంలో రాజులు పో యినా, రాజ్యాలు కూలినా రోజురోజుకు కుల నిర్మాణం మరింత దృఢమవుతోంది. ఏ కులానికాకులం మరింత దగ్గరవుతూ హక్కులు, ఆత్మగౌరం అంటుంది. ఇప్పటిదాకా అగ్రకులాల జాబితాలో ఉన్నవి కూడా పేదరికం పేరుతో రిజర్వేషన్లు కావాలంటున్నాయి. కుర్చీని కాపాడుకునేందుకు అమాత్యులు ఆ రకంగానే అడుగులు వేస్తూ కుంపట్లకు ఆజ్యం పోస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లోనూ కులం ప్రాతిపదికగానే నాయకత్వ ఎంపిక జరుగుతుండటం సామాజిక తిరోగమనానికి నిదర్శనం.
ఒకనాడు నోరులేని జనానికి తానై గొంతుగా నిలిచి చట్టసభల్లో గొంతుకనిచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్‌నే ముపుప్పతిప్పలు పెట్టిన ఈ సమాజం.. ఆధునికతను అందిపుచ్చుకొని అందివచ్చిన అవకాశాలు, చట్టాలన్నిటినీ తనకనుగుణంగా మలుచుకుంటోంది. అప్పట్లో ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానంలో అంబేద్కర్ పోటీ చేసినప్పటికీ ప్రశ్నించే నాయకుడు చట్టసభల్లో అడుగుపెడితే తమగొంతు మూగబోతుందని గ్రహించిన అగ్రకుల ఓటర్లే ఆయనకు ఓట్లు పడకుండా చేశారు. రిజర్వ్‌డ్ స్థానం నుంచి పోటీచేసే అభ్యర్థులు తమ చెప్పుచేతుల్లో ఉంటేనే తప్ప ఓటు వేస్తానంటుందే తప్ప సమర్థతకు విలువ నివ్వరు. ఈ నేపథ్యంలో కులం ఇప్పటికీ కొనసాగుతున్న 60 ఏళ్ళ గణతంత్ర భారతంలో నోటా మీట అగ్ర వర్ణాలకు ఉపకరిస్తుందా అన్న భయం అణగారిన ప్రజల్లో మొదలైంది. విచక్షణ కోల్పోయి వివక్షకు దారితీసే నోటాపై చర్చ జరగాలి. చట్టసభల్లో వినిపించే గొంతును 'చట్టబద్ధ'మైన పద్ధతిలోనే నొక్కేస్తే, లక్ష్యం పక్కదారిబట్టి, నోట్లో మట్టికొట్టే పథకమైతే దాన్ని ఎత్తివేయడమే మేలు. కేవలం ఎస్సీ, ఎస్టీలు పోటీ చేస్తున్న చోట నోటా దుర్వినియోగమైతే ఆ స్థానాల్లో దాని రద్దే శరణ్యం. ఏదేమైనా నోటాపై జరిగే చర్చలు, సమాలోచనలు చివరికి క్యాండిడేట్ 'రీకాల్'కు దారితీసినా ఆమ్ ఆద్మీకి ఆమోదయోగ్యమే. ఓటుకు నోటుఅంటూ వచ్చే నాయకులకు నోటా ఓటా అని ఎదురు ప్రశ్నించే రోజులు ప్రతి ఓటరుకు రావాలి.

కొంగర మహేష్

Andhra Jyothi Telugu News Paper Dated: 4/4/2014 

Friday, May 2, 2014

సామాజిక తెలంగాణలో వంచన! By దామిశెట్టి రామాకోటేశ్వర్ రావు


లోపించిన సామాజిక కోణం 
వంచనకు గురైన ఉద్యమ బిడ్డలు 
నీరు గారిన ఉద్యమ హామీలు 
నిరాశలో విద్యార్ధి, యువజనులు 
కల్లలుగా మారిన బడుగు వర్గాల కలలు 
ఎవరికి బంగారు తెలంగాణ రాబోతోంది? 
మరో పోరాటం తప్పని పరిస్థితులు ్చ 

ఉద్యమాలే ఊపిరిగా, ప్రత్యేక రాష్ర్ట ఏర్పాటే ధ్యేయంగా అర్ధశతాబ్దానికిపైగా నిరసనకారుల గుండెల్లో, కళాకారుల ప్రదర్శనల్లో, కవుల కలాల్లో, వాగ్గేయకారుల గొంతుకల్లో రణన్నినాదమై ఉవ్వెత్తున ఎగసిపడిన తెలంగాణ పోరాటం దేశంలోనే ఓ మహోజ్వల ఉద్యమఘట్టం. సుదీర్ఘ ఉద్యమ చరిత్ర కలిగిన తెలంగాణ భారత భౌగోళిక చిత్ర పటంపై 29వ రాష్ర్టంగా, తొలి భాష వియుక్త రాష్ర్టంగా ఆవిర్భవించాక పోలింగ్‌ ముగిసిన మొట్టమొదటి ఎన్నికలు పార్టీల పరంగా అధికారం కోసం సాగుతున్న అంతర్యుద్ధం, అస్తిత్వం కోసం జరుగుతున్న ఆఖరి యుద్ధంలా సాగాయి. సంపూర్ణ తెలంగాణ ప్రజలు కోరుకున్నదొకటి, జరుగుతున్నది మరొకటి. ప్రజలు ఆకాంక్షలు, ఆశయాలకు భిన్నంగా సామాజిక తెలంగాణకు వ్యతిరేకంగా అడుగడుగునా రాజకీయ వంచన పర్వం వేళ్ళూనుకు పోతోంది. 

తెలంగాణ పునర్నిర్మాణం పేరిట అన్నీ పార్టీలు ఉద్యమ బిడ్డల్ని వంచించే ప్రయత్నాలకు ఏమాత్రం చరమగీతం పాడకపోగా వాటిని మరింత ముందుకు తీసుకెళ్తున్నాయి. 16వ లోక్‌సభ ఎన్నికలలో దేశంలోనే అతి ఖరీదైన రాజకీయాలు నడుస్తున్న నయా రాష్ర్టంగా తెలంగాణ మారింది. ఒక్కమాటలో చెప్పాలంటే టి.పి.సి.సి. అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించినట్లుగా విస్వసనీయతకు- విస్వాసఘాతుకానికి జరిగిన ఎన్నికలివి. ప్రత్యేక రాష్ర్టం కోసం అసువులు బాసిన అమరవీరుల ఆశయాలను జెండాగా మార్చి దాని నీడలో రాష్ర్ట పునర్నిర్మాణమంటూ పొంతనలేని అజెండాలతో తెలంగాణ ప్రజలను మరింతగా వంచించేందుకు నిస్సిగ్గు రాజకీయాలకు పాల్పడుతున్నాయి కొన్ని బూర్జువా పార్టీలు. త్వరలో ఈ సార్వత్రిక ఎన్నికలను రాజకీయ పార్టీలు తమ తమ అధికార బలప్రదర్శనకు వేదికగా మార్చుకోగా, సామాజిక తెలంగాణ ఆశయసాధకులకు అదొక బలిపీఠంగా మారింది. చీమలు పెట్టిన పుట్టలు పాములకు స్థావరమైనట్లుగా- నవతెలంగాణ రాష్ర్టం నిరుద్యోగ రాజకీయ పార్టీలు, సంస్థలకు కోరకపోయినా లభించిన వరంగా మారింది. 

ఉద్యమ సమయంలో కలుగులో ఉన్న చిన్న చితక పార్టీలు, రాజకీయ సామాజిక ఉద్యమ సంస్థలన్నీ తెలంగాణపై పెత్తనం చెలాయించేందుకు ఎన్నికల వేళ ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. విద్యార్ధులు, యువతీయుకుల భుజంస్కంథాలమీద సాగిన తెలంగాణ చివరి దశ ఉద్యమాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ర్టంలో నేడు రాజకీయ ఆధిపత్యం, అధికార సాధనల కోసం కొన్ని పార్టీలు అర్రులు చాస్తున్నాయి. సామాజికన్యాయం కోసం జరిగిన సాయుధ పోరాట చరిత్ర కలిగిన పురిటి గడ్డను రాజకీయ రణరంగంగా మార్చివేస్తున్నారు కొందరు స్వార్ధపరులు. భూస్వామ్య పెత్తందారి దొరల తెలంగాణలో సామాజిక రుగ్మతలు, వర్గ వైషమ్యాలు లేని పునర్నిర్మాణమే ప్రజల ఆకాంక్ష. అందుకు భిన్నంగా అగ్రవర్ణ పాలక వర్గాల ఆధిపత్యానికి ఈ ఎన్నికలనుండే బీజం పడింది.

ఒకనాటి ఉద్యమ సంస్థగా ఉన్న టిఆర్‌ఎస్‌, తెలంగాణ ఏర్పాటు అనంతరం కనుమరుగై పోతుందని అన్నీ పార్టీలు ఊహించినదానికి భిన్నంగా నేడు అది బలమైన రాజకీయ పార్టీగా ఎదిగి అన్ని అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల్లో అభ్యర్ధులను నిలపడమే కాకుండా, ఈ ఎన్నికల్లో బరిలో దిగుతూ శతాబ్దాలు, దశాబ్దాల చరిత్ర ఉన్న పార్టీలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుండటం ఆశ్చర్యకరƒ పరిణామం. తెలంగాణ ఇస్తే తమ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు పరిశీలిస్తామని సూత్ర ప్రాయంగా అప్పట్లో అంగీకరించారు కేసిఆర్‌. అదే విధంగా టిఆర్‌ఎస్‌ గెలిస్తే తెలంగాణలో దళిత వ్యక్తిని సిఎం చేస్తామని ప్రకటించారు. కానీ ఈ రెండు విషయాలు ప్రస్తుతం ఆయన విస్మరించి ఓట్ల కోసం ప్రచారానికి బయలు దేరడం సర్వత్రా విమర్శలకు తావిచ్చింది. బడుగు, బలహీన వర్గ ప్రజలు అత్యధికంగా ఉన్న తెలంగాణలో ఆయా వర్గాల ప్రజల తరపున ఈ ఎన్నికలలో సీట్ల కేటాయింపులలో సముచిత ప్రాధాన్యం ఇవ్వని ఆయన- రానున్న ఏడేళ్ళలో బంగారు తెలంగాణను నిర్మిస్తామని చేస్తున్న ప్రకటనల అంతరార్ధం ఏమిటో అర్ధం చేసుకోవచ్చు. 
తెలంగాణ ఇచ్చింది, తెచ్చింది తామే గనుక ఓటర్ల ఆదరణ తమకే ఉంటుందనే భ్రమలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ- టిఆర్‌ఎస్‌ ఇచ్చిన అనూ„హ్య షాక్‌తో- తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో రాజకీయ శల్య సారథ్యం చేయాల్సిన అగత్యం ఏర్పడింది. దీంతో ఈ ఎన్నికలు కాంగ్రెస్‌, టిఆర్‌ఎస్‌, టిడిపి కూటములకు రెఫరెండమ్‌గా మారగా, వైఎస్సార్‌సిపి, వామపక్ష, ఇతర పార్టీలు అస్తిత్వ పరిరక్షణ కోసం అలుపెరగని పోరాటం చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇన్నాళ్ళు ప్రత్యేక తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు కోసం ఊపిరి సలపని ఉద్యమాలు నడిపిన ప్రజలు అతి తర్వరలోనే తిరిగి- సంపూర్ణ సామాజిక తెలంగాణ కోసం ఉద్యమించాల్సిన పరిస్థితులను కొన్ని పార్టీలు వ్యూహాత్మకంగా తీసుకొస్తున్నాయి. 

119 అసెంబ్లీ, 17 లోక్‌సభ స్థానాలున్న తెలంగాణ ప్రాంతంలో అధికారిక లెక్కల ప్రకారం 50.07 శాతం మంది బిసిలు, 15.8 శాతం మంది ఎస్సీలు, 8.9 శాతం మంది ఎస్టీలు, 12.4 శాతం మంది ముస్లిం మైనారిటీలు, 12.87 శాతం మంది మాత్రమే అగ్రవర్ణ కులాలవారున్నారు. ఈ ఎన్నికల్లో బిసిలు నిర్ణాయక శక్తిగా ఉన్నప్పటికీ టిఆర్‌ఎస్‌ పార్టీ 12.87 శాతం ఉన్న ఓసిలకి ఏపార్టీ కేటాయించని విధంగా అత్యధికంగా 47 శాతం సీట్లు (56) కేటాయించింది. బిసిలని 23 శాతం సీట్ల (26)కే పరిమితం చేసింది. 12.4 శాతమున్న ముస్లిం మైనారిటీలకు కేవలం 3.36 శాతం సీట్లు (4) కేటాయించి సమన్యాయాన్ని గాలికి వదిలేసింది. అదే విధంగా 15.8 శాతం జనాభా ఉన్న ఎస్సీలకు 10.9 శాతం సీట్లు మాత్రమే కల్పించి- బడుగు, బలహీన వర్గ ప్రజల పట్ల తమ వివక్షను చాటుకుంది. 

మొదటినుండీ బిసిని ముఖ్యమంత్రిని చేస్తామని హామీ ఇచ్చిన టిడిపి సీట్ల కేటాయింపులో సామాజిక నమన్యాయాన్ని పాటించిందనే చెప్పాలి. జనాభా దామాషా ప్రకారం ఓసిలకు రెట్టింపు టిక్కెట్లు కేటాయించినా, 37.5 శాతం సీట్లు బిసిలకే వెచ్చించి చిత్తశుద్ధిని చాటుకుంది. అదే విధంగా కాంగ్రెస్‌ పార్టీ కూడా 37 శాతం టిక్కెట్లను బిసిలకు కేటాయించడం చెప్పుకోదగ్గ అంశం. లెక్క ప్రకారం ప్రతి పార్టీ ఓసిలకు 12 నుండి 15 అసెంబ్లీ స్థానాలను మాత్రమే కేటాయించాలి. కానీ టిఆర్‌ఎస్‌ పార్టీ 56, కాంగ్రెస్‌ 41 స్థానాలు కేటాయించగా- టిడిపి మాత్రం 25 స్థానాలకు మించి ఇవ్వకపోవటం గమనార్హం. కాంగ్రెస్‌ పార్టీ మైనారిటీల పట్ల వివక్షను విడనాడలేదు. 12.4 శాతం ఉన్న ముస్లిం మైనారిటీలకు 4.5 శాతం టిక్కెట్లు (5) కేటాయించింది. టిడిపితో పొత్తుపెట్టుకున్న బిజెపి సైతం తమకు దక్కిన 47 అసెంబ్లీ స్థానాల్లో 26 శాతం (12) టిక్కెట్లను బిసిలకు కేటాయించడం విశేషం. తెలంగాణలో ఓసి యేతర శక్తుల వాటా 89.3 శాతం కాగా, వారికి ఈ ఎన్నికలలో సామాజిక న్యాయ వాటా 45.2 శాతం మాత్రమే. 
13 లోక్‌సభ స్థానాలకు అభ్యర్ధులను బరిలో నిలిపిన వైఎస్సార్‌సిపి సైతం 7 స్థానాలకు ఏకంగా రెడ్డి సామాజిక వర్గీయులకే కట్టబెట్టి, మొత్తం 70 శాతం టిక్కెట్‌లను ఓసిలకే కేటాయించింది. సామాజిక తెలంగాణ ధ్యేయమని చెప్పుకునే పార్టీల చిత్తశుద్ధి ఇదేనా? 

తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిల్చిన యువతకి అన్నీ పార్టీలు తీరని ద్రోహం చేశాయి. మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు గాను టిడిపి, బిజెపి కూటమి- ఓసి యేతరలకు 52 శాతం సీట్లు, కాంగ్రెస్‌ 53 శాతం సీట్లు, టిఆర్‌ఎస్‌ 44 శాతం సీట్లు కేటాయించాయి. వీటిలో కేవలం 10 శాతం సీట్లు కూడా అమరవీరుల తరఫున కృతజ్ఞతగా యువలోకానికి ఏ పార్టీ కల్పించకపోవడం దారుణమైన అంశం. అధికార కాంగ్రెస్‌ పార్టీని మినహాయిస్తే టిఆర్‌ఎస్‌, బిజెపి- టిడిపి కూటమి ఎస్సీ, ఎస్టీ, బిసిలకు సీట్ల కేటాయింపులో సముచితన్యాయం చేశాయనే చెప్పాలి. ఇక వైఎస్సార్‌సిపి విషయానికొస్తే 70శ ాతం సీట్లు ఓసిలకే కట్టబెట్టింది. సామాజిక తెలంగాణ కోరుకునే ప్రతిఒక్కరూ ఏ పార్టీ ఓసియేతరలకు పెద్దపీఠ వేసిందో ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకోవాలి. 

ఎన్నికలలో నిర్ణయాత్మక శక్తిగా మారిన 89.3శాతం ఓసియేతర శక్తులకు టిడిపి కూటమి అత్యధికంగా 52 శాతం సీట్లు కేటాయించింది. ముఖ్యమంత్రిని కూడా బిసినే చేస్తామని టిడిపి ప్రకటించింది. దళిత వ్యక్తిని సిఎం చేస్తానని తొలుత ప్రకటించి ఆ తర్వాత మాట మరచిన టిఆర్‌ఎస్‌ అధినేత ఏ మేరకు సామాజిక తెలంగాణను తెస్తారో ప్రజలు అర్ధంచేసుకోవాలి. టిడిపి కూటమితో సమానంగా బిసిలకు అసెంబ్లీ సీట్లను కేటాయించిన కాంగ్రెస్‌ పార్టీ ఓట్లు, సీట్లు కోసం తప్ప, తెలంగాణ ప్రజలపై ప్రేమతో రాష్ట్రాన్ని విభజించలేదనేది కూడా బడుగు, బలహీన వర్గ ఓటర్లు తెలుసుకోవాలి. తెలంగాణ ఆవిర్భావానంతరం జరుగుతున్న తొలి ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపులో బిసిలకు అన్యాయం చేసిన పార్టీలేవో ప్రజలు గమనించాలి. సంపూర్ణ సామాజిక తెలంగాణ ఏ పార్టీతో సాధ్యమో గుర్తెరగాలి. 29వ రాష్ర్టం భవిష్యత్తు- తెలంగాణలో ఉన్న 89 శాతం బడుగు, బలహీన వర్గ ప్రజలు తీసుకున్న నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. దొరల పాలనకు చరమగీతం పాడాలంటే ఓసియేతర శక్తులు సంఘటితం కావలసిఉంది. అప్పుడే సామాజిక తెలంగాణ, తెలంగాణ పునర్నిర్మాణం సాధ్యమనే వాస్తవాన్ని గ్రహించాలి.

Surya Telugu News Paper Dated: 3/5/2014 

Thursday, May 1, 2014

ఓటు బ్యాంకుగా దళిత కార్మికులు By దొంత భద్రయ్య


అనుబంధ సంస్థలుగా కార్మిక సంఘాలు
అన్ని పార్టీలకూ ఉద్యోగ సంఘాలు 
బడుగులకు అగ్రకుల నాయకత్వం 
కుల కోణాన్ని గుర్తించని కామ్రేడ్లు 
ఫలితంగా పాలక కులాలకే సేవ 

భారతదేశం సర్వతోముఖాభివృద్ధికి పెట్టుబడిదారీ విధానం, కుల అణిచివేత (క్యాపిటలిజం, క్యాస్టిజం) ప్రధాన ఆటంకాలని రాజ్యాంగ నిర్మాత డా బి.ఆర్‌. అంబేడƒ్కర్‌ స్పష్టం చేశాడు. బ్రిటిష్‌ ఇండియా ప్రభుత్వంలోప్రొవె న్షియల్‌ అసెంబ్లీ ఎన్నికలు జరుగబోయేముందు 1936లో ఆయన ఇండిపెండెంట్‌ లేబర్‌పార్టీని స్థాపించే సందర్భంలో ఈ విషయం చర్చించాడు. ప్రపంచవ్యాప్తంగా ఆనాటికి అన్ని దేశాలలో పెరిగిపోతున్న పేదరికానికి పెట్టుబడిదారీ విధానం కారణంగా అనేకమంది తత్త్వవేత్తలు చెప్పారు. వారిలో ప్రముఖులు కార్‌‌ల మార్‌‌క్స. కానీ భారత దేశానికి క్యాపిటలిజం కంటే ప్రమాదకారి క్యాస్టిజం. అంబేడƒ్కర్‌ అప్పటికే అమెరికా, లండన్‌, జర్మనీలలో ఎకనామిక్‌‌స, న్యాయశాస్త్రం, రాజనీతిశాసా్తల్రలో మాస్టర్‌‌స డిగ్రీలు పొంది పి.హెచ్‌.డి. చేసి ప్రపంచ రాజకీయాలపై క్షుణ్ణంగా చర్చించే నైపుణ్యాన్ని సాధించాడు. 1937లో బొంబాయి ప్రావిన్‌‌సలో జరిగిన ఎన్నికల్లో అంబేడ్కర్‌ స్థాపించిన ఇండిపెండెంట్‌ లేబర్‌ పార్టీ ఎస్‌.సి.లకు రిజర్‌‌వ చేసిన 15 స్థానాలతోపాటు మరో రెండు జనరల్‌ సీట్లలో కూడా పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో 15 స్థానాలలో విజయం సాధించి, ప్రధాన ప్రతిపక్షంగా ఆ పార్టీ అవతరించింది. ఇండిపెండెంట్‌ లేబర్‌ పార్టీని స్థాపించేటపుడు బొంబాయిలో ఉన్న కమ్యూని„స్టు నాయకులైన ఎమ్‌.ఎన్‌. రాయ్‌, డాంగే విమర్శించారు. ఈ దేశంలో కార్మికులు, కర్షకులు పెట్టుబడిదారి విధానాల వల్లనే కాకుండా కులతత్వం వల్లకూడా అణిచివేతకు గురవుతున్నారని కమ్యూని„స్టు పార్టీలు పెట్టుబడిదారీ విధానాలను వ్యతిరేకిస్తున్నాయిగానీ, కుల వివక్షపై పోరాడడం లేదని, కాబట్టి ఇండిపెండెంట్‌ లేబర్‌ పార్టీని స్థాపించా ల్సివచ్చిందని ప్రకటించాడు. 1936లో చెప్పిన ఈ అభిప్రాయం గురించి ఇప్పటి కమ్యూనిస్టు పార్టీలుకూడా ఆలోచించాలి.

ఈ దేశంలో కార్మికులు, రైతు కూలీలు, బాల కార్మికుల్లో దళిత ఆదివాసీలే మెజారిటీ. బలహీనవర్గాలవారు కొద్దిసంఖ్యలో ఉన్నారు. భారతదేశం మొత్తం కార్మికుల్లో 70 శాతం మంది గ్రామీణ వ్యవసాయ కూలీలుగా ఉన్నారు. వీరంతా దళిత ఆదివాసీలే అనేది వాస్తవం. వీరికి భూమి ఉండదు. భూమి ఈనాటి వరకు కొన్ని కులాల చేతుల్లోనే కేంద్రీకృతం కావడానికి కారణం కుల ప్రభావమే. వేద ధర్మం పరిధిలోనే జీవితాలను కొనసాగించాలని, ఆ పరిధి దాటితే ఎవరైనా శిక్షార్హులౌతారని చెప్పడం జరిగింది. ఈ ధర్మనీతిని సవాలు చేస్తూ భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. రాజ్యాంగం ప్రకారం అందరూ సమానులే, ప్రతి మనిషికి ఒకే విలువ. ఒకే ఓటు దానిని ఆచరణలో నిజం చేస్తుంది. కానీ ఈ రాజ్యాంగాన్ని అమలు చేసేవారు పాత సామాజికవ్యవస్థ పునాదుల్లోనుండి వచ్చినవారు కావడంవల్ల గత సామాజిక కట్టుబాట్లు, విలువలనే ఎక్కువగా ఆచరణలో చూపడం వల్ల రాజ్యాంగం పూర్తిస్థాయిలో అమలు కావడంలేదు. 
42వ సవరణద్వారా రాజ్యాంగ ప్రవేశికలో సామ్యవాదాన్ని చేర్చడం జరిగింది. ఈ దేశంలోని కార్మిక, కర్షకులకు వెలుగులు ప్రసాదించడానికి సామ్యవాద సూత్రీకరణలు ఉపయోగ పడతాయి. సామ్యవాదం విజయవంతం కావాలంటే దేశంలోని ప్రధానవనరుగా ఉన్న వ్యవసాయ భూమిని రైతు కూలీలైన దళిత ఆదివాసీలకు పంపిణీచేయాలి. 

ఇది ఇప్పటికీ రాజకీయ నినాదంగానే ఉంది. ఎన్ని భూమి పరిమితి చట్టాలు వచ్చినా, ఎన్ని కౌలుదారు చట్టాలు వచ్చినా భూమి ఈ వర్గాలకు చెందడంలేదు. భూమిని దళిత ఆదివాసీలకు పంపిణి చేసినట్టు చూపించి, అదే భూమిలో గతంలో యజమానులైన వారే కబ్జా కొనసాగిస్తున్నారు. ప్రభుత్వాలు తమ రికార్డుల్లో భూమిని దళిత ఆదివాసీలకు పంపిణీ చేశామని ప్రచారం చేసుకొంటున్నాయి. కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఇందుకు వ్యతిరేకంగా ఉంది. సామ్యవాద సూత్రీకరణ ప్రకారం పరిశ్రమలను జాతీయం చేయాలి. ఈ ప్రక్రియ జరుగుతున్న క్రమంలోనే ప్రపంచ వ్యాప్తంగా ప్రైవేటీకరణ, సరళీకరణ సంస్కరణలు వచ్చాయి. వీటివల్ల సామ్యవాద ఆశయానికి తీవ్ర గండి పడింది. ప్రభుత్వాలు ప్రైవేటీకరణ మోజులో సర్వరంగాలను ప్రైవేటుపరం చేస్తున్నారు. ప్రైవేటుపరం చేయడం అంటే దళిత ఆదివాసీలను నిరుద్యోగులుగా మార్చడమే. రాజ్యాంగ మౌలిక లక్ష్యాలను సాధించాల్సిన బాధ్యత ప్రజాస్వామికంగా ఏర్పడిన ప్రభుత్వాలపై ఉంటుంది. ఆ ప్రభుత్వాలు పెట్టుబడిదారి, వలసవాద, సామ్రాజ్యవాద కంపెనీలకు అన్ని రంగాలను ధారాదత్తం చేస్తున్నాయి. ప్రైవేటుపరం చేయడం వల్ల ప్రభుత్వాలు తమ బాధ్యతలనుండి తప్పుకున్నట్లు భావించాలి. ఈ ప్రభుత్వ పెట్టుబడిదారీ అనుకూల విధానాలను ప్రశ్నించాలంటే, అంబేడ్కర్‌ స్థాపించిన ఇండిపెండెంట్‌ లేబర్‌పార్టీ లాంటి రాజకీయ పార్టీలు రావాల్సిన అవసరం ఉంద

ఇ„ప్పుడు దాదాపు ప్రతిరాజకీయపార్టీ ఒక కార్మిక సంఘాన్ని అనుబంధంగా ఏర్పాటు చేసుకొని ఓటుబ్యాంకుగా ఉపయోగించుకొంటున్నాయి. ఇందులో ఒకటి రెండు కార్మిక సంఘాలు ప్రభుత్వ ప్రజావ్యతిరేక, కార్మిక వ్యతిరేƒ విధానాలపై పోరాటం చేస్తున్నప్పటికి ఈ పార్టీలు కులప్రభావానికి లోబడిఉన్నట్లుగానే అనిపిస్తుంది. కాంగ్రెస్‌ పార్టీకి ఐ.ఎన్‌.టి.యు.సి., బిజెపికి ఎన్‌.ఎమ్‌.యు, సిపిఐకి ఎ.ఐ.టి.యు.సి, సిపియంకి సి.ఐ.టి.యు, తెలుగుదేశం పార్టీకి టి.ఎన్‌.టి.యు, టిఆర్‌ఎస్‌ పార్టీకి బొగ్గుగని కార్మిక సంఘం- ఆయా పార్టీల ప్రణాళికలను అమలు చేసుకోవడానికి లేదా ఆ పార్టీల విధానాలను ప్రచారం చేసుకోవడానికి ఉపయోగపడుతున్నాయి. కార్మిక కర్షకుల్లో దళిత ఆదివాసి బలహీన వర్గాలు మెజారిటీగా ఉంటే, కొద్దిమంది కార్మికులుగా ఉన్న అగ్రకులాలవారు ఆ సంఘాలకు నాయకులుగా చెలామణి అవతున్నారు. ఏ పార్టీలైతే దళిత ఆదివాసి ప్రజల రాజ్యాంగపరమైన రక్షణలను, ప్రయోజనాలను రాపాడడంలో విఫలం అవుతున్నాయో, అవే రాజకీయ పార్టీలకు అండగా ఉన్న కార్మికసంఘాల్లో- ఈ కులాల కార్మికులు ఇతర కులాధిపత్య నాయకుల క్రింద పనిచేయడం విచారిం చదగిన పరిణామం. భూమి పంపిణీలో పాలకులు అనుసరిస్తున్న ఉదాసీన, నిర్లక్ష వైఖరులను ఎండగట్టడానికి, బాల కార్మికుల వెట్టిచారిపై, అందులో బాలికల అక్రమ రవాణాపై ఏ కార్మిక సంఘం స్పందించిన దాఖలాలులేవు. 

ఈ బాలకార్మికులు మెజారిటీగా దళిత ఆదివాసీలు కావడమే. అందువల్ల ఇతరుల నాయకత్వంకింద ఉన్న కార్మికసంఘాలు స్పందించడంలేదు. బాలకార్మిక అక్రమ రవాణా ప్రస్తుతం రాజకీయ పార్టీలకు మాఫియా రూపంలో అండగా కొనసాగుతోందని చె„ప్పవచ్చు. కార్మిక సంఘాలు తమ కంపెనీల్లో లేదా ఫ్యాక్టరీల్లో యాజమాన్య విధానాలపై ప్రశ్నించడంవరకే పరిమితమౌతున్నాయి. దళిత ఆదివాసీ ప్రజలకు రక్షణగా అంబేడ్కర్‌ సైద్ధాంతిక భావజాలాన్ని కొనసాగించేదిగా ఏర్పడిన బహుజనసమాజ్‌ పార్టీ- ఉద్యోగులను సమీకరించేందుకు- బాంసెఫ్‌-ను ఏర్పాటు చేసింది. కానీ ప్రత్యేకమైన ఒక కార్మిక సంఘాన్ని స్థాపించలేకపోతున్నది. సమాజ్‌వాది పార్టీ కూడా ఏ కార్మిక సంఘాన్ని స్థాపించలేదు. మెజారిటీ సంఖ్యలోఉన్న దళిత ఆదివాసీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ పార్టీలు కార్మిక సంఘాలను తక్షణమే స్థాపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే, వేరే పార్టీలకు అండగాఉన్న కార్మిక సంఘాల్లో ఉన్న దళిత ఆదివాసీ బలహీన వర్గాలు ఆ పార్టీలకు ఓటు బ్యాంకుగా మారుతున్నాయి.

Surya Telugu News Paper Dated: 2/5/2014 

అగ్రకుల దురహంకారానికే హైకోర్టు ఓటు By డాక్టర్‌ శ్రీనివాసరావు చొప్పర


Posted on: Thu 01 May 02:39:55.269521 2014

            మరోవైపు ప్రభుత్వం సైతం ఈ కేసు విచారణ పట్ల దుర్మార్గమైన నిరాసక్తతనూ, నిర్లక్ష్యాన్ని ప్రదర్శించి దోషుల ప్రయత్నాలకు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ సహకరించింది. ప్రత్యేక కోర్టుకు జడ్జిగా నియమించబడ్డ జస్టిస్‌ డాక్టర్‌ ప్రభాకరరావును ముద్దాయిల ఫిర్యాదు మేరకు ప్రభుత్వం ఒంగోలుకు బదిలీ చేసింది. ఇంతకూ ముద్దాయిల ఫిర్యాదు ఏమిటంటే 'హతుల సామాజిక వర్గానికి చెందిన జడ్జి ఆ సామాజిక వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తాడు', కాబట్టి ఆయనను బదిలీ చేయాలనేది వారి ఫిర్యాదు. హంతకులు ఊహించి మాత్రమే చేసిన ఆరోపణ ఆధారంగా అటు ప్రభుత్వం, ఇటు హైకోర్టు వారికి వంతపాడాయి. ఏ సామాజిక వర్గానికి చెందిన జడ్జి ఆ సామాజిక వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తాడు అన్న ఫిర్యాదు న్యాయబద్ధమైందిగా తోచిన ప్రభుత్వానికి హైకోర్టులో ఆ న్యాయసూత్రం ఎందుకు వర్తింపజేయలేదు?
          అందరూ శాఖాహారులైతే బుట్టలో రొయ్యలెలా మాయమయ్యాయి అన్నది ఒకనాటి ప్రశ్న. అందరూ నిర్దోషులైతే చుండూరు మారణకాండకు దోషులెవరు అనేది నేటి మిలీనియం ప్రశ్న. పట్టపగలు పోలీసు సమక్షంలో నరమేధం సృష్టించి ఎనిమిది మంది దళితులను నరికిచంపి, అనేకమందిని తీవ్రగాయల పాల్జేసి, కాళ్లూచేతులూ తెగ్గొట్టి చుండూరు దళితవాడను వల్లకాడు చేసిన నరహంతకులు అంతా నిర్దోషులైతే మరి దోషులెవరు? ఈ నెల 22వ తేదీ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ చుండూరు నరమేధంపై ఇచ్చిన తీర్పు అగ్రకుల దురహంకారాన్ని పచ్చిగా సమర్థించడమే కాకుండా, ఈ వ్యవస్థ పైన, వ్యవస్థలో భాగస్వాములైన పోలీసు, న్యాయ, కార్యనిర్వాహక వర్గాలపై గతంలో వేసిన అనేక ప్రశ్నలే మళ్లీ తలెత్తుతున్నాయి. అనుమానాలు బలపడుతున్నాయి. నాడు కారంచేడు విషయంలో హైకోర్టు ఏ సాంకేతిక లోపాలనైతే ఎత్తిచూపి కేసు కొట్టివేసిందో, నేడు అవే అంశాలను చూపి ప్రత్యేక కోర్టు 21 మందిపై విధించిన యావజ్జీవ శిక్షను, 35 మందిపై విధించిన ఒక సంవత్సరం శిక్షను హైకోర్టు రద్దు చేస్తూ వారెవ్వరూ దోషులు కారని ప్రకటించింది. క్రింది స్థాయిలో ప్రాసిక్యూషన్‌ (విచారణ తీరు, సాక్షులను ప్రవేశపెట్టడంలో సంబంధిత సిబ్బంది) సరిగా జరగలేదని ప్రత్యేక కోర్టు నైతికతపై ఆధారపడింది తప్ప సాక్ష్యాలపై కాదని చెప్పింది. అందుకు రెండు సాక్ష్యాలను (మొత్తం 70 సాక్ష్యాలు) చూపింది. అలా అది మరోసారి అగ్రకుల దురహంకారానికే ఓటు వేసింది. 
           రాష్ట్రంలో ఒకవైపు రాష్ట్రపతి పాలన, మరోవైపు ఎన్నికలు జరుగుతున్న వేళ కోర్టు తీర్పుకు ముహూర్తం పెట్టడంలో గల ఆంతర్యం ఏమిటి? రాష్ట్ర ప్రజలంతా ఎన్నికల గోదాలో ముమ్మరంగా మునిగితేలుతుండగా, ప్రశ్నించడానికి రాష్ట్ర ప్రభుత్వం అంటూ ఏదీ లేకపోవడం వల్ల దళితులను ప్రక్కదారి పట్టించవచ్చు, నిరసన అంటూ ఏదీ లేకుండా చేయవచ్చు అనే పథకమే ఇందులో కన్పిస్తుంది. ఎందుకంటే ఏ సామాజిక వర్గమైతే అక్కడ నరమేధం జరిపిందో అదే సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నందువల్ల వెంటనే వ్యతిరేకత వస్తుందనే దానితో ఈ కాలాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తుంది. ప్రాసిక్యూషన్‌లో ఎన్నో లోపాలు ఉన్నాయని హైకోర్టు తప్పుబట్టింది. అంటే బాధితుల తరపున బలమైన సాక్షులను ప్రవేశపెట్టడంలో, దోషులను నిర్థారించడంలో విఫలమైందని తెలిపింది. నిజానికి ప్రాసిక్యూషన్‌ విఫలం చెందడం కాదు ఒక పథకం ప్రకారమే కేసు నీరుగార్చిందని చెప్పవచ్చు. ఘటన జరిగిన క్షణం నుంచి విచారణ పూర్తి అయ్యేంత వరకు పోలీసు వ్యవహరించిన తీరు అనుమానాస్పదంగానే ఉంది. నాడు ఆగస్టు 6న చుండూరులో పెద్దఎత్తున మోహరించి ఉన్న పోలీసులు దాడిని నిరోధించడానికి గాని, దళితులను కాపాడడానికి గాని ఏ ప్రయత్నం చేయలేదు. దాడి తమ కళ్ల ముందు జరుగుతూ ఉంటే కనీసం ఆ సమాచారం జిల్లా కేంద్రానికి చేరవేయలేదు. మరుసటిరోజు ఉదయం 11 గంటల వరకు పైఅధికారులకు తెలియజేయకపోవడం, అడిగిన వారికి అంతా ప్రశాంతంగానే ఉందని బుకాయించడం దగ్గర నుంచి, ఈ కేసులో ప్రధాన సాక్షి, దళితుల తల్లో నాలుకలా ఉన్న అనిల్‌కుమార్‌ను పోలీసు కాల్పుల్లో చంపివేసేదాకా అంతా ఒక కుట్రపూరితంగా వ్యవహరించిందని చెప్పవచ్చు. ఇందులో కేవలం ప్రాసిక్యూషన్‌ వైఫల్యం కాదు, లాలూచీ కూడా ఉందని దళితులు ఆనాడే ఆరోపించారు.
               దళిత సంఘాల, ప్రజా సంఘాల, విప్లవ సంఘాల ఆందోళన మేరకు దేశంలోనే మొదటిసారిగా ఘటన జరిగిన చోటే ప్రత్యేక కోర్టు సాధించుకోవడం జరిగింది. ఇది గొప్ప విజయం కాగా విచారణ ఎంతో ఉద్రిక్త వాతావరణంలో జరిగింది. సాక్షులు తమ సాక్ష్యాలు చెప్పడం కత్తి మీద సాము లాంటిదే. వారిపైన అనేక ఒత్తిళ్లు, బెదిరింపులు, మరోవైపు జీవనోపాధి సమస్య, అనీల్‌కుమార్‌ని లాగా కాల్చివేస్తారనే బ్రతుకు సమస్య నడుమ ప్రత్యక్ష, పరోక్ష సాక్షులు 70 మంది ఎంతో సాహసం చేసి తమ సాక్ష్యాలను రికార్డు చేయడం జరిగింది. అయితే ఆ సాక్షులను, వారి సాక్ష్యాలను సక్రమంగా ఉపయోగించుకోవడంలో ప్రాసిక్యూషన్‌ నిర్లిప్తత కనిపిస్తుంది. కేసును నీరుగార్చిన పద్ధతి స్పష్టంగా తెలుస్తుంది.
            మరోవైపు ప్రభుత్వం సైతం ఈ కేసు విచారణ పట్ల దుర్మార్గమైన నిరాసక్తతనూ, నిర్లక్ష్యాన్ని ప్రదర్శించి దోషుల ప్రయత్నాలకు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ సహకరించింది. ప్రత్యేక కోర్టుకు జడ్జిగా నియమించబడ్డ జస్టిస్‌ డాక్టర్‌ ప్రభాకరరావును ముద్దాయిల ఫిర్యాదు మేరకు ప్రభుత్వం ఒంగోలుకు బదిలీ చేసింది. ఇంతకూ ముద్దాయిల ఫిర్యాదు ఏమిటంటే 'హతుల సామాజిక వర్గానికి చెందిన జడ్జి ఆ సామాజిక వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తాడు', కాబట్టి ఆయనను బదిలీ చేయాలనేది వారి ఫిర్యాదు. హంతకులు ఊహించి మాత్రమే చేసిన ఆరోపణ ఆధారంగా అటు ప్రభుత్వం, ఇటు హైకోర్టు వారికి వంతపాడాయి. ఏ సామాజిక వర్గానికి చెందిన జడ్జి ఆ సామాజిక వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తాడు అన్న ఫిర్యాదు న్యాయబద్ధమైందిగా తోచిన ప్రభుత్వానికి హైకోర్టులో ఆ న్యాయసూత్రం ఎందుకు వర్తింపజేయలేదు? ఏ సామాజిక వర్గానికి చెందిన వారైతే హంతకులుగా, ప్రత్యేకకోర్టు దోషులుగా శిక్ష విధించిందో అదే సామాజిక వర్గానికి చెందిన జడ్జితో కూడిన ఇద్దరి ధర్మాసనంకు పై న్యాయ సూత్రం వర్తించదా? అగ్రకుల పెత్తందారీ దురహంకారాన్ని విచారించడానికి అగ్రకుల న్యాయ మూర్తుల నియామకం ఎంతవరకు న్యాయబద్దమో హైకోర్టు చెప్పాలి. ఒకవైపు కోర్టులూ, న్యాయమూర్తులూ అవినీతి, ఆశ్రిత పక్షపాతంతో నిండా మునిగి, కులం కంపు కొడుతున్నాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తులే ప్రకటిస్తుంటే, మారణకాండకు తెగబడ్డ సామాజిక వర్గానికి చెందిన వారే హైకోర్టు ధర్మాసనం అధిష్టించినప్పుడు ఇంతకు మించిన తీర్పును ఆశించడం దుర్లభమే అవుతుంది. ప్రత్యేకకోర్టు మొత్తం 70కి పైగా సాక్ష్యాలను విచారించి 219 మందికి గాను 56 మందిని మాత్రమే దోషులుగా తేల్చింది. అయితే హైకోర్టు అందులో ఒకటి, రెండు సాక్ష్యాలను సాకుగా చూపడంలో శిక్షను అనుభవిస్తున్న వారిని రక్షించాలనే యావతప్ప బాధితులకు, వారి సామాజిక వర్గానికి న్యాయం చేయాలనేది ధర్మాసనానికి లేకపోవడం న్యాయ వ్యవస్థకే సిగ్గుచేటు.
1991 ఆగస్టు 6న చుండూరు పల్లెకు అయిన గాయం కంటే నేడు హైకోర్టు తీర్పుతో ఏర్పడిన గాయం మరింత వేదనాభరితం. ఎందుకంటే ఈ వ్యవస్థ పట్ల, న్యాయస్థానాల పట్ల ఇప్పటి వరకు దళితులకున్న దింపుడు కల్లం ఆశను కూడా వమ్ముచేసింది ఈ తీర్పు. విశ్వాస ఘాతుకానికి పాల్పడింది. ఈ తీర్పు వెలువడి నాలుగు రోజులు కావస్తున్నా ప్రధాన రాజకీయ పార్టీలు స్పందించకపోవడం అత్యంత విచారకరం. ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వమే వెంటనే అప్పీలు చేయాలనే కనీస ప్రకటన చేయకపోవడం దళితుల పట్ల వారికున్న నిబద్ధతను తెలియజేస్తుంది. దళితుల ఓట్లపై ఉన్న శ్రద్ధ వారికి న్యాయాన్ని, రక్షణను కల్పించడంలో లేశమాత్రంగా కూడా లేకపోవడాన్ని ఇది తెలియజేస్తుంది. అందుకే రేపు జరగబోయే ఎన్నికలలో 'నోటా' బటన్‌కి పని చెప్పాలి, విశ్వాసఘాతుకానికి తగిన బుద్ధి చెప్పాలి.
(వ్యాసకర్త కావలి జెబి కళాశాల లెక్చరర్‌)
- డాక్టర్‌ శ్రీనివాసరావు చొప్పర

Prajashakti Telugu News Paper Dated : 01/05/2014 

హంతకులను నిర్దోషులంటే ఎలా? By జాన్‌వెస్లి


Posted on: Thu 01 May 05:36:54.618275 2014

          న్యాయమూర్తులు చివరకు బాధితులు అనుమానించినట్లుగానే చుండూరు ప్రత్యేక కోర్టు విధించిన శిక్షలను రద్దుచేస్తూ తీర్పునిచ్చింది. వెంటనే వారిని విడుదల చేయాలని ఆదేశించింది. గతంలో కొందరు న్యాయమూర్తులు డబ్బులు తీసుకుని అక్రమంగా బెయిల్‌ ఇచ్చిన కేసులను పరిశీలిస్తే ఈ తీర్పులో కూడా అలాంటివి జరిగాయేమోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డబ్బు, కులం, మతం ప్రభావాలకు న్యాయమూర్తులు అతీతం కాదని పలు తీర్పులు వ్యక్తం చేస్తున్నాయి. సామాజిక దృక్పథం కల్గిన వారినే న్యాయమూర్తులుగా నియమించాలన్న నిబంధనలు లేకపోవడం ఇలాంటి పరిస్థితులకు ప్రధాన కారణం. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ తీర్పుపై సుప్రీం కోర్టులో స్టే తీసుకుని అప్పీలుకు వెళ్లాలి. అన్ని రాజకీయపార్టీలు సైతం చుండూరు దళితులకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. 
            అగ్రకుల ఉన్మాదంతో వందల మంది వేటకొడవళ్లు, గొడ్డళ్లు, కత్తులు, బరిసెలతో చుండూరు దళితులను వేటాడి పోలీసుల సమక్షంలోనే ఎనిమిది మందిని దారుణంగా నరికి చంపి గోనెసంచుల్లో కుక్కి కాలువలో పడేసిన ఘోరమైన హత్యాకాండకు లోకమంతా సాక్ష్యమే. అయినా నేరస్తులంతా నిర్దోషులేనని హైకోర్టు తీర్పునివ్వడం హంతకులను సైతం విస్మయానికి గురిచేసింది. హత్యలు జరిగిన వెంటనే బంధువులు ఫిర్యాదు చేయలేదని, ఏ వ్యక్తిని ఏ క్షణాన చంపారో నిక్కచ్చిగా సాక్షులు సమయం చెప్పలేదని, వికలాంగుడు కూడా వెంటాడి ఎలా హత్య చేస్తాడని, ఈత రానివాడు కాలువ ఎలా దూకుతాడని 'కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు' వితండ వాదనలు చేసి కేసును కొట్టివేసింది. క్రింది కోర్టు ఈ కారణాలను పరిగణనలోకి తీసుకోకుండానే శిక్షలు విధించడం తప్పని భావించింది. నిందితులందరినీ వెంటనే విడుదల చేయాలని, జరిమాన వసూలుచేసి ఉంటే తిరిగి చెల్లించాలని జస్టిస్‌ యల్‌ నర్సింహారెడ్డి, జస్టిస్‌ యంకె జైశ్వాల్‌ ధర్మాసనం తీర్పు నిచ్చింది. మరి హంతకులెవరో నిర్థారించాల్సిన బాధ్యత కోర్టుకు లేదా? కనీసం నేరస్తులను శిక్షించడానికి తగిన ఆధారాలు చూపలేని పోలీసులు, అధికారులు, పాలకులపై అయినా శిక్షలెందుకు వేయలేదు? ఈ తీర్పు అన్యాయం అని చెప్పడానికి న్యాయశాస్త్ర కోవిదులేమీ అక్కరలేదు. రచ్చబండ పంచాయితీలు చేసే వారైనా చెప్పేస్తారు. గంటల తరబడి మారణకాండ జరిగిన ఘటనపై సంవత్సరాల తరబడి జాప్యం చేసి హత్య చేసిన సమయం నిక్కచ్చిగా చెప్పడం అమాయకులైన దళితులకు సాధ్యమేనా? పోలీసుల ముందే హత్యలు జరుగుతుంటే వెంటనే పిటిషన్‌ ఇవ్వలేదని న్యాయమూర్తి ప్రశ్నించడం భావ్యమేనా? ఈ తీర్పు అగ్రకులోన్మాదులకు, హంతకులకు మరింత ఊతమివ్వగా దళితులు, పేదలకు న్యాయస్థానాలపై ఉన్న కొద్దిపాటి నమ్మకం కూడా కోల్పోయేదిగా ఉంది. ప్రభుత్వం, పోలీసులు, పాలకులు చివరకు న్యాయస్థానాలు సైతం ధనికులు, పేదల మధ్య సమస్యలు వస్తే అవి ధనికుల వైపే ఉంటాయని, అగ్రకులాలకు, దళితులకు మధ్య వైరుధ్యం వస్తే అవి అగ్రకులాల వైపే ఉంటాయని మరోసారి నగంగా రుజువైంది. దళితుల మాన, ప్రాణాల రక్షణకై కలిసొచ్చే శక్తులను కలుపుకొని ప్రతిఘటించి పోరాడేందుకు సన్నద్ధం కావలసిన పరిస్థితులకు నెట్టబడుతున్నాయి.
   తరతరాలుగా అణచివేతకు గురవుతున్న దళితుల్లో ఫూలే, అంబేద్కర్‌ ఆలోచనలు, అభ్యుదయవాదుల కృషి వల్ల సామాజిక చైతన్యం పెరుగుతోంది. గుంటూరు జిల్లా చుండూరు దళితులు సైతం అగ్రకులాల దౌర్జన్యాలను ప్రశ్నించడం, ఎదిరించడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య చిన్న చిన్న ఘటనలు జరిగాయి. పోలీసులకు ముందే తెలియజేసినా తగిన చర్యలు తీసుకోలేదు. కాలు కింద చెప్పులా ఉండాల్సిన దళితులు తమనే ఎదిరించే స్థాయికి వస్తారా అంటూ చుండూరు, మున్నంగివారి పాలెం, మోదుకూరు, వలమనేరు గ్రామలకు చెందిన రెడ్లు, కాపులు ఏకమై దళితులపై దాడికి పథకం వేశారు. 1991 ఆగస్టు 6 ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో మారణాయుధాలతో పోగయ్యారు. ఇది గమనించిన దళితులు వెంటనే పోలీసులకు తెలియజేసినా తగిన బలగాలను సమీకరించుకోలేదు. పైగా దళితులు ఐక్యంగా ఉండి దాడులను ప్రతిఘటించకుండా దళితవాడ నుంచి పురుషులనంతా పోలీసులే తరిమేశారు. చెదిరిపోయిన వారిని వెంటాడి దారుణంగా హత్యచేశారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ మారణహోమం జరగడంతో దళితవాడ శ్మశానంగా మారింది. ఇందుకు పోలీసులే ప్రత్యక్ష సాక్షులు. మూడురోజుల తరువాత గాని శవాలు నదిలో ఎక్కడ ఉన్నాయో వెతుక్కోలేని పరిస్థితులు ఉన్నాయంటే ఎంతటి భయానక పరిస్థితి నెలకొన్నదో స్పష్టమవుతుంది. హంతకులు పోలీసుల ముందే మారణాయుధాలతో తిరుగుతున్నా వాటిని స్వాధీనం చేసుకోలేదు. కనీసం అరెస్టులు కూడా చేయలేదు. హత్యలు చేస్తున్నా అడ్డుకోలేదు. ఈ మారణకాండ వారి సమక్షంలోనే జరిగినా సాక్షులుగా ఎఫ్‌ఐఆర్‌లో కూడా నమోదు చేయలేదు. పోలీసు స్టేషన్‌లోకి వచ్చి పోలీసులను హత్యచేస్తే ఫిర్యాదు వేరేవాళ్లు ఇవ్వాలని ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకుండా ఉంటారా! మరి ఇక్కడ ఎందుకు చేయలేదు? బాధితులు, సాక్షులు చెప్పిన వివరాలను సైతం సరిగా నమోదు చేసుకోలేదు. కానీ న్యాయం కోసం దళితవాడలో నిరహారదీక్షలు చేస్తున్న దళితులపై కాల్పులు జరిపి దళిత నాయకుడు, ఘటనకు ప్రత్యక్ష సాక్షి అనిల్‌కుమార్‌ను పోలీసులే కాల్చిచంపారు. హంతకులపై మాత్రం పోలీసుల తుఫాకులు పని చేయలేదు. రాష్ట్రవ్యాప్త ఆందోళన ఫలితంగా చివరకు డిసెంబర్‌ 1 నుంచి చుండూరు ప్రత్యేక కోర్టులో విచారణ ప్రారంభమైంది. 179 మంది నిందితులపై విచారణ జరిపి 70 మంది సాక్ష్యాలను తీసుకుంది. చివరికి 2007 జులై 31న చుండూరు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అనీల్‌ తీర్పును వెల్లడించారు. నిందితుల్లో 21 మందికి జీవిత ఖైదు, రూ.5 వేలు జరిమాన, 35 మందికి ఒక సంవత్సరం జైలు, రూ.2 వేలు జరిమాన విధిస్తూ మిగతా వారందరినీ సరైన ఆధారాలు లేవనే పేరుతో విడిచిపెడుతూ తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ ఇరు వర్గాలూ హైకోర్టుకు వెళ్లగా 2007లో న్యాయమూర్తులు యల్‌ నర్సింహారెడ్డి, యంకె జైశ్వాల్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున న్యాయవాదులుగా సీనియర్‌ న్యాయవాది బొజ్జా తారకం, రఘునాథ్‌లను నియమించింది. విచారణ ప్రారంభం నుంచీ న్యాయమూర్తులు బాధితులకు, న్యాయవాదులకు సహకరించలేదని విమర్శలు వచ్చాయి. విచారణకు ఒక వారం సమయం ఇవ్వాలని బాధితుల తరపు న్యాయవాది కోరినా ఇవ్వలేదని, సాక్ష్యాలు వినేందుకు కూడా అయిష్టత వ్యక్తం చేశారని బాధితులు ఆరోపించారు. ఈ న్యాయమూర్తుల వల్ల తమకు న్యాయం జరగదని అవిశ్వాసం వ్యక్తం చేస్తూ బాధితులు, బాధితుల తరపు న్యాయవాదులు పిటిషన్‌ వేయగా వారిపై కోర్టుధిక్కారం కేసు వేసేందుకు న్యాయమూర్తులు పూనుకుని తరువాత విరమించుకోవడం గమనార్హం. న్యాయమూర్తులు చివరకు బాధితులు అనుమానించినట్లుగానే చుండూరు ప్రత్యేక కోర్టు విధించిన శిక్షలను రద్దుచేస్తూ తీర్పునిచ్చింది. వెంటనే వారిని విడుదల చేయాలని ఆదేశించింది. గతంలో కొందరు న్యాయమూర్తులు డబ్బులు తీసుకుని అక్రమంగా బెయిల్‌ ఇచ్చిన కేసులను పరిశీలిస్తే ఈ తీర్పులో కూడా అలాంటివి జరిగాయేమోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డబ్బు, కులం, మతం ప్రభావాలకు న్యాయమూర్తులు అతీతం కాదని పలు తీర్పులు వ్యక్తం చేస్తున్నాయి. సామాజిక దృక్పథం కల్గిన వారినే న్యాయమూర్తులుగా నియమించాలన్న నిబంధనలు లేకపోవడం ఇలాంటి పరిస్థితులకు ప్రధాన కారణం. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ తీర్పుపై సుప్రీం కోర్టులో స్టే తీసుకుని అప్పీలుకు వెళ్లాలి. అన్ని రాజకీయపార్టీలు సైతం చుండూరు దళితులకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. దళిత, ప్రజాసంఘాలు ఐక్యంగా తీర్పులో ఉన్న లోపాలను, ప్రభుత్వ వైపల్యాలను ప్రజలందరికీ తెలియజేసే కార్యక్రమాలు నిర్వహించాలి. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలి. ఇందుకు కలిసొచ్చే వారందరి సహకారం తీసుకుని ఐక్యంగా పోరాడాలి. బాధితులకు అండగా సుప్రీంకోర్టులో ప్రైవేటు అప్పీలుకు వెళ్లాలి.
-  జాన్‌వెస్లి
(వ్యాసకర్త కెవిపిఎస్‌ రాష్ట్ర ప్రధానకార్యదర్శి) 

Prajashakti Telugu News Paper Dated: 1/05/2014