Friday, April 27, 2012

ఆహారమూ అస్తిత్వ చిహ్నమే - డాక్టర్ ఆర్.అఖిలేశ్వరి



ఇతరులపై పెత్తనం చేయడం అధికారాన్ని చెలాయించే పద్ధతులలో ఒకటి. నియంత్రించడం, పెత్తనం చేసే విధానాల్లో ఒకటి. మంచి-చెడుల విచక్షణకు సంబంధించిన పరాయి సంస్కృతీ విలువలను రుద్దడం నియంత్రించే మార్గాలలో ఒకటి. మీ విలువలు సరైనవి కావని, అవి సంస్కారయుతమైనవి కావని చెప్పడం ఇతరులు తమ విలువలను మీపై రుద్దే విధానాలలో ఒకటి. మీరు నిండుగా విశ్వసించే విలువలను పదే పదే కించపరిచినప్పుడు మీ ప్రతిస్పందన ఎలా ఉంటుంది? నిజమే సుమా! 

మన విలువలు అంత సమున్నతమైనవి కావు, మనం తక్కువ స్థాయి వాళ్ళమే అన్న ఆత్మన్యూనతా భావానికి లోనుకావడం పరిపాటి. ఇటువంటి మానసిక బానిసత్వానికి చరిత్రలో చాలా ఉదాహరణలు ఉన్నాయి. మానవాళి చరిత్రలో మొదటి బానిస మహిళే. శ్వేత జాతీయులు నల్లవారిని బానిసలను చేసుకున్నారు. పాశ్చాత్య దేశాలు ప్రాచ్య దేశాలను తమ వలసలుగా చేసుకున్నా యి. ఉత్తర అమెరికాలో మూలవాసులను శ్వేతజాతి అమెరికన్లు తమ బానిసలను చేసుకున్నారు. యూరోపియన్లు ఆఫ్రికా ప్రజలను తమ పాలితులను చేసుకున్నారు. బ్రాహ్మణులు శూద్ర వర్గాలపై పూర్తి పెత్తనం చేశారు; ఈ బ్రాహ్మణ ఆధిపత్యానికి సంపూర్ణ బాధితులు దళితులు. 

ప్రకృతిని, మర్త్యులైన మానవులకు ప్రకృతి ప్రసాదించిన కానుకలను చాలా పవిత్రమైనవిగా హిందూ సంప్రదాయం భావిస్తుంది. అయితే మన మనుగడకు అవి చాలా అవసరం. కనుక వాటిని మనం నిజమైన హిందూ లేదా ప్రాచ్య ప్రపంచ పద్ధతులలో ఉపయోగించుకుంటాం. అంటే ప్రకృతి వనరులను అతిగా వినియోగించుకోవడంగానీ, దుర్వినియోగం చేయడం గానీ చేయ ము. చెట్లు పవిత్రమైనవే. అయితే మన అవసరాలకు వాటిని నరికి వేస్తాం; పర్వతాలు పవిత్రమైనవే. గ్రానైట్‌కు, రాళ్ళకు వాటిని పగులగొడతాం. 

నదులు పవిత్రమైనవే. మనకు అవసరంలేని వాటిని పారవేయడానికి వాటి ని ఉపయోగించుకుంటాం. సర్పాలను పూజిస్తాం, మన ప్రాణాలకు ముప్పుగా పరిణమించినప్పుడు వాటిని చం పడానికి వెనుకాడం. మనిషి అనేక జంతువులను మచ్చిక చేసుకొని పనికి, ప్రయాణానికి, రక్షణకు, ఆహారానికి ఉపయోగించుకొంటున్నాడు. మరో విధంగా చూస్తే హిందూ సమాజం నిస్సంకోచంగా నయవంచనకు పాల్పడుతుం ది; ద్వంద్వ ప్రమాణాలను అనుసరిస్తుంది. స్త్రీ దేవతలు ఎందరో! భక్తి ప్రపత్తులతో వారిని నిత్యం ఆరాధిస్తారు. అయితే మహిళలను చీమలు, నల్లులుగా చంపేస్తారు! 

మన పూర్వీకుల ఆహార సంస్కృతిలో ఎద్దు మాంసం ప్రధాన భాగంగా ఉండేదనడానికి చాలా రుజువులు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వివిధ నాగరికతల్లో ఎద్దు మాంసాన్ని ఎలా తినేవారో మన ప్రాచీనులూ ఎద్దు మాంసాన్ని అలానే తినేవారు. ఎద్దు మాంసం తినడమనేది గతంలోనూ ఉందని, అదేమీ కొత్త విషయం కాదని మనమేమీ వాదించనక్కర్లేదు. ఆ మాంసాహారం ఆమోదయోగ్యం కాదనే విషయాన్ని కూడా మనం ప్రస్తావించనక్కర్లేదు. భారతదేశంలో పేదలు, అణగారిన వర్గాల వారికి ఎద్దు మాంసం ప్రధాన మాంసాహారమని, అదే వారికి పుష్టినిచ్చే ప్రధాన ఆహారమనడానికి సహేతుకమైన కారణాలు ఉన్నాయి. 

అయితే తమకు పౌష్టికాహారంగా ఉన్న ఎద్దు మాంసాన్ని తింటున్నందుకు ఆ వర్గాల వారిని సమాజంలోని స్వల్ప సంఖ్యాకులైన ఆధిపత్య వర్గాలవారు చాలా చిన్న చూపు చూశారు. మరింత స్పష్టంగా చెప్పాలంటే నీచ మానవులుగా పరిగణించారు. గోవును బతికి ఉన్నప్పుడు పవిత్ర జంతువుగా పరిగణించి, అది చనిపోతే పూర్తిగా అవాంఛనీయమైనదిగా భావించడం ఒక విచిత్ర విషయం. చనిపోయిన గోవు చర్మాన్ని ఒలిచి పాదరక్షలుగా చేయడం మొదలైన కార్యకలాపాలను 'అపవిత్రమైనవి'గా భావించి అటువంటి పనులు చేసే వారిని 'అంటరానివారు'గా హిందూ సమాజం పరిగణించింది. 

శతాబ్దాలుగా ఒక అల్ప సంఖ్యాక వర్గం వారు మాంసం ముఖ్యంగా ఎద్దు మాంసాన్ని తినే వారిపై తమ విలువలను రుద్దారు. తమ సొంత ఆధిక్యత, దళితుల న్యూనత గురించి కట్టుకథలు సృష్టించి ప్రచారం చేయడంతో పాటు బ్రాహ్మణులు, ఇతర ఉన్నత కులాలలోని వారి మద్దతుదారులు ఆహారాన్ని ముఖ్యంగా ఎద్దు మాంసాన్ని ఒక అణచివేత సాధనంగా ఉపయోగించుకున్నారు. దళితులు తినే ఆహారంపై 'మురికి లేదా మలిన' ఆహారంగా ముద్ర వేసి, దాన్ని తినేవారిని అంటరానివారుగా పరిగణించారు. ప్రపంచంలో ఏ అణగారిన వర్గ ప్రజల చరిత్రలోనూ ఇటువంటి అమానుషం కనపడదు. 

ప్రపంచంలోనే అతిపెద్ద, చాలా శక్తిమంతమైన ప్రజాస్వామ్య వ్యవస్థలలో ఒకటిగా చెప్పుకొంటున్న మన దేశం లో ఈ సాంస్కృతిక వలసవాదం ఇంకెంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. మన సంస్కృతి స్వరూప స్వభావాలను వ్యక్తం చేసే వాటిలో ఆహారం చాలా ముఖ్యమైనదే గాక అది చాలా వైయక్తికమైన, సున్నితమైన అంశ మూ కూడా. అది ఒక అస్తిత్వ చిహ్నం. దానిని అగౌరవపరచడానికి వీలులేదు. ఒక సామాజిక వర్గం ప్రజల ఆహార సంస్కృతిని కించపరుస్తూ వారిపై మీ ఆహార అలవాట్లను రుద్దడం ముమ్మాటికీ వలసవాదమే. సంప్రదాయకంగా ఎద్దు మాంసాన్ని తినే సామాజిక వర్గాలకు, ఆ ఆహారాన్ని స్వేచ్ఛగా, బహిరంగంగా తినే హక్కును నిరాకరించడం పూర్తిగా సహించరాని విషయం. మనం గొప్ప గా చెప్పుకొనే సాంస్కృతిక వైవిధ్యం, బహుళ సంస్కృతు ల విలువలకు ఈ ఆహార అసహనం పూర్తిగా వ్యతిరేకం. 

కనుకనే ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని దళిత, బహుజన విద్యార్థులు తమ సంప్రదాయ ఆహారాన్ని తినడంలో తమకు గల హక్కును బహిరంగంగా ప్రకటించారు. గతంలో హైదరాబాద్‌లోని వివిధ విశ్వవిద్యాలయాలలో దళిత విద్యార్థులు తమ ఆహార హక్కులను చాటడానికి చేసిన ప్రయత్నాలను ఛాందసవాదులు ప్రతిఘటించారు. గత ఏడాది 'ఇంగ్లీషు, విదేశీ భాషల విశ్వవిద్యాలయం'లో జరిగిన ప్రయత్నాలను విఫలం చేశారు. కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని విద్యార్థులు గత కొద్ది సంవత్సరాలుగా పెద్దకూర పండుగను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఉస్మానియా విశ్వవిద్యాలయం దళిత విద్యార్థులూ అదే బాటలో పయనిస్తున్నారు. దళితులు తమ ఆహార హక్కును తిరిగి సాధించుకోవడానికి జరిపే సుదీర్ఘ పోరాటంలో ఇది మొదటి అడుగు మాత్రమే. 

ఎట్టకేలకు విద్యావంతులైన యువ దళితులు సాంస్కృతిక గుత్తాధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడగలుగుతున్నారు. తమను తమ సంస్కృతి నుంచి దూరం చేసే ప్రయత్నాలను అడ్డుకుంటున్నారు. ఎద్దుకూరను బహిరంగంగా తినడం ద్వారా తమ అస్తిత్వాన్ని సగర్వంగా చాటుకున్నారు. తమ ఆహార హక్కు గురించి వారు చేస్తున్న డిమాండ్ న్యాయబద్ధమైనది. దానిని అందరూ గౌరవించాలి. దేశవ్యాప్తంగా విద్యార్థి వసతి గృహాలన్నిటిలోనూ దళిత విద్యార్థుల ఆహార అలవాట్లను గౌరవించి, వాటికి సముచిత ప్రాధాన్యమివ్వాలి. 

- డాక్టర్ ఆర్.అఖిలేశ్వరి
జర్నలిస్ట్, విద్యా వేత్త
Andhra Jyothi News Paper Dated : 28/04/2012 

Thursday, April 26, 2012

పదకొండేళ్ల ప్రస్థానం--అల్లం నారాయణ,



తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించిన నాటి నుంచి రాష్ట్ర సాధనోద్యమంలో కీలకపాత్ర పోషిస్తూ 12వ ఏడులోకి అడుగుపెట్టింది. ఈ స్వల్ప కాలంలోనే టీఆర్‌ఎస్ అనేక సవాళ్ళను ఎదుర్కొన్నది. తెలంగాణరాష్ట్ర సాధన లక్ష్యం ఇంకా మిగిలే ఉన్నప్పటికీ, సాధించిన విజయా లూ ఉన్నాయి. తెలంగాణ ఆకాంక్షల సాఫల్యం కోసం, ఒక రాజకీయ పార్టీ ఏర్పడి, నిరంత రాయంగా కొనసాగి, వెన్ను చూపకుండా పదకొండేళ్ల అలుపెరుగని పోరాటం చెయ్యడం, పోరాటాన్ని గమ్యాన్ని ముద్దాడే దాకా కొనసాగించడం ఒక టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమైంది. అందుకే తెలంగాణకు మకుటం లేని మహారాజు వంటి పార్టీగా టీఆర్‌ఎస్ నిలిచి ఉన్నది. అది తెలంగాణకు ఏకైక ప్రతినిధిగా రూపొంది తెలంగాణ ప్రజల్లో తిరుగులేని శక్తిని సాధిం చుకున్నది. 

టీఆర్‌ఎస్‌ను దెబ్బకొట్టడానికి ఆంధ్ర వలస వాదులు అనేక కుట్రలు పన్నారు. పత్రికలు, టీవీ చానెళ్లు ఆంధ్ర పెత్తందారుల చేతుల్లో ఉండడం వల్ల పార్టీకి వ్యతిరేకంగా విష ప్రచారం జోరుగా సాగింది. ఎన్నికలు సమీపించినప్పుడల్లా టీఆర్‌ఎస్‌లో గందరగోళం ఉన్నట్టు, టికెట్లు అమ్ము కుంటున్నట్టు రకరకాల కథనాలను ప్రచారంలో పెడతారు. ఆంధ్ర పార్టీలకు ఉండే అవ లక్షణాలను లేదా రాజకీయ వ్యవస్థలో ఉండే రుగ్మతలను టీఆర్‌ఎస్‌కు ఆపాదించి విమర్శలు సాగిస్తారు. వై.ఎస్. ఉన్నప్పుడు టీఆర్‌ఎస్‌ను నిలువునా చీల్చాడు. ఒక ఉద్యమ పార్టీలోని కొందరు ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి చీల్చడాన్ని పత్రికలు ఖండించాలె. కానీ అమ్ముడు పోయిన నాయకులను తప్పు పట్టడానికి బదులు, పార్టీ నాయకత్వాన్ని అవహే ళన చేయడం ఆంధ్ర మీడియాకే చెల్లింది. ఆంధ్ర పెట్టుబడి దారుల మానస పుత్రిక అయిన టీడీపీ మాదిరిగా కాకుండా, తెలంగాణ ఉద్యమ పార్టీ అయిన టీఆర్‌ఎస్ నిధుల కొరతను ఎదుర్కోవడంలో ఆశ్చర్యం లేదు. అయినా టీఆర్‌ఎస్ మాత్రమే నిధుల వేటలో పడినట్టు వక్రీకరించి ఆంధ్ర మీడియా ప్రచారం చేసింది. వాస్తవానికి భారీగా నిధులున్న కాంగ్రెస్, టీడీపీలను టీఆర్‌ఎస్ ఢీకొనలేనందు వల్ల ఉద్యమకారులు అండగా నిలిచారు. మిగతా పార్టీలు డబ్బు కుమ్మరిం చినా ఓటర్లు టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించడం ప్రజానీకం సాధించిన పరిణతికి నిదర్శనం. 

ఎన్ని కుట్రలు ఎదురైనా ఉద్యమానికి మూలస్తంభంగా నిలవడమే టీఆర్‌ఎస్ సాధించిన గొప్ప విజయం. ఉద్యమకారులతో కలిసి తెలంగాణ వాదాన్ని గ్రామ స్థాయిలో ప్రచారం చేయడంలో టీఆర్‌ఎస్ సఫలమైంది.తెలంగాణ సాధిస్తామనే ఆత్మవిశ్వాసాన్ని ప్రజలకు కలిగించడం సాధారణ విషయం కాదు. జయశంకర్ వంటి పెద్ద మనుషులతో చర్చించి సరైన ఉద్యమ పంథాను ఎంచుకోవడంలోనే సగం విజయం ఆధారపడి ఉన్నది. ఉద్యమం పదేళ్లు దాటి ముందుకు సాగినప్పటికీ, పక్కదోవ పట్టకుండా జాగ్రత్త పడడం కూడా ప్రశంసనీయమే.ఉద్యమాన్ని హింసాయుతంగా మార్చడానికి పాలకులు ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలను నిబ్బరంగా ముందుకు నడిపించ గలుగుతున్నది. అయితే ఆంధ్ర మీడియా కుటిల ప్రచారం వల్ల కొందరు తెలంగాణ బిడ్డలు ఆత్మ విశ్వాసం సడలి బలిదానాలకు పాల్పడడం విచారకరం. ఆంధ్ర మీడియా ప్రచారాన్ని తిప్పి కొడుతూ, యువతలో స్థైర్యం నింపడానికి టీఆర్‌ఎస్, ఉద్యమ సంస్థలు మరింత కృషి సాగించాలె. 

తెలంగాణ రాష్ట్రం ఇంకా ఏర్పడకముందే, ఆ లక్ష్యం కోసం పుట్టిన టీఆర్‌ఎస్ ఆ తరువాత కాలంలో కాంగ్రెస్‌లో విలీనం అవుతుందని ప్రచారం చేయడం మరో పెద్ద కుట్ర. టీఆర్‌ఎస్ క్షేత్రస్థాయిలో వేళ్లూనుకోకుండా చేయడానికే ఈ కుతంత్రం. ఉద్యమాన్ని బలహీనపరచ డానికి ఇదొక ఎత్తుగడ. కాంగ్రెస్, టీడీపీలు తెలంగాణలో నిశ్శేషమై టీఆర్‌ఎస్ మాత్రమే మిగులుతుందనే భయం వలసవాదులను పీడిస్తున్న నేపథ్యంలో ఈ ప్రచారం సాగుతు న్నది. వలస వాదులకు ఇంకో భయం కూడా ఉన్నది. తెలంగాణ ఏర్పడిన తరువాత కూడా-ఆంధ్ర వలసవాద శక్తులకు, భూమి పుత్రులకు పోరాటం అనేక రంగాలలో ప్రత్యక్షంగా, పరోక్షంగా భిన్న రూపాలలో సాగుతూనే ఉంటుంది. అధికారం ఎవరి చేతుల్లో ఉంటుందనేది కీలకమై నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా తాము తెర వెనుక ఉండి, తమ ఏజెంట్ల ద్వారా పరిపాలన సాగించాలనేది ఆంధ్ర పెత్తందారుల కుట్ర. ఉమ్మడి రాష్ట్రం ఏర్పడడానికి ముందు తెలంగాణలో వెన్నెముక గల నాయకులు ఉండేవారు. కె.వి.రంగారెడ్డి, ఈశ్వరీ బాయి, సదాలక్ష్మి, జె.వి.నర్సింగరావు వంటి నాయకులు ఆంధ్ర పాలకులను సవాలు చేసే వారు. కానీ ఇప్పుడు ప్రజల నుంచి ఒత్తిడి వచ్చినా సరే, ఆంధ్ర పెత్తందార్లకు ఊడిగం చేసే నాయకులే అన్ని పార్టీలలో ఉన్నారు. రేపు తెలంగాణ ఏర్పడిన తరువాత కూడాఇదే పరిస్థితి కొనసాగించాలని ఆంధ్ర పాలకులు ప్రయత్నిస్తారు. అందువల్ల తెలంగాణకు ప్రాతినిధ్యం వహించే పార్టీ అంటూ ఉండకూడదని వారు కోరుకోవడంలో ఆశ్చర్యం లేదు. తెలంగాణ ప్రకటించే క్రమంలో కాంగ్రెస్ నాయకత్వం నుంచి అటువంటి ప్రతిపాదన వచ్చే విధంగా కుట్ర జరిపే అవకాశం కూడా ఉన్నది. అందువల్ల తెలంగాణ ఏర్పడిన తరువాత భూమి పుత్రుల చేతిలోనే అధికారం ఉండే విధంగా తెలంగాణ వాదులు వ్యూహాలు రచించాలె. 

ఆంధ్ర వలసవాద శక్తుల కుట్రలను తట్టుకుని ఒక తెలంగాణ పార్టీ ఆవిర్భవించడమే కాకుండా, తట్టుకుని నిలబడడం అద్భుతమే. పార్టీని ఈ స్థాయిలో నిలబెట్టిన ఘనత పార్టీ నాయకత్వానికి దక్కుతుంది.అయితే తెలంగాణ రాష్ట్రం సాధించే క్రమంలో టీఆర్‌ఎస్ బాధ్యతలు విస్తృతమవుతుంటాయి. ఈ బాధ్యతల నిర్వహణకు టీఆర్‌ఎస్ సమాయత్తం కావాలె. పార్టీ నిర్మాణాన్ని మరింత పటిష్ట పరచుకోవాలె. తెలంగాణ ఉద్యమం ఎంత విస్తృతమైందో కళ్ళెదుట కనిపిస్తూనే ఉన్నది. టీఆర్‌ఎస్ ఒక రాజకీయ పక్షంగా ఆ విస్తృతిని సంతరించుకోవడానికి కృషి చేయాలె. ఈ మధ్య కాలంలో సమాజంలోని అట్టడుగు వర్గాలు టీఆర్‌ఎస్‌ను సొంతం చేసుకోవడం మొదలు పెట్టాయి. పార్టీ అన్ని అంచెలలో బడుగుల నాయకత్వాన్ని ప్రోత్సహించాలె. దళితులు, ఆదివాసులు, వెనుకబడిన తరగతుల నుంచి ఆశించిన మేర నాయకత్వం ఎదగడానికి తగిన వ్యూహాలు రూపొందించాలె. తెలంగాణ పునర్నిర్మాణం కోసం టీఆర్‌ఎస్ అనుసరించదలుచుకున్న సామాజిక విధానాన్ని, ఆర్థిక విధానాన్ని గ్రామ స్థాయిలో ప్రచారం చేస్తేనే, ప్రజలు తదనుగుణంగా సమాయత్తమవుతారు. ఇవన్నీ ఒక్క రోజులో సాధ్యపడక పోవచ్చు. కానీ భావి తెలంగాణకు పునాదులు ఉద్యమ దశలోనే పడతాయనే స్పృహ కలిగి ఉండాలె.


Namasete Telangana News Paper Dated: 27/04/2012 


గాంధీ, అంబేద్కర్, రాజ్యాంగవ్యవస్థ---పొఫెసర్ ఘంటా చక్రపాణి



ఉద్యమాలు చాలా విషయాల పట్ల మన అవగాహనను పదునెక్కిస్తా యి. అదే ఇప్పుడు తెలంగాణలో జరుగుతోంది. తెలంగాణ ప్రజలు ఉన్నట్టుండి తమ పెద్దలందరినీ పేరుపేరునా తలుచుకుంటున్నారు. ఒక అలిశెట్టి ప్రభాకర్‌ను, ఒక సాహూను వారి మిత్రులు స్మరించుకున్నట్టే కొమురం భీమ్ జయంతిని ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఘనంగా జరుపుకున్నారు. నాలుగు దశాబ్దాల తరువాత నాటి తెలంగాణ యువతరం కథానాయకుడు జార్జిడ్డిని మళ్ళీ జనంలోకి తెచ్చి యువతరానికి వీరులంటే ఎలావుంటారో పరిచయం చేశారు. అదేవిధంగా ఈ సారి డాక్టర్ అంబేద్కర్‌ను కూడా స్మరించుకున్నారు. రెండేళ్ళ నిరంతర పోరాటం అంబేద్కర్ గురించిన అవగాహనను పెంచింది. ఈసారి హైదరాబాద్‌లో అంబేద్కర్ జయంతి జాతరను తలపించింది. దానికి తెలంగాణవాదం కూడా కారణం. అంబేద్కర్ అంటే కేవలం దళితుల నాయకుడు మాత్రమే అన్న ప్రచారం, ఆయన బతికున్న కాలంలోనే మొదలై ఇంకా కొనసాగుతోంది. ఇప్పుడిప్పుడే ఆయనను చదువుతున్నవాళ్ళు ఆ ఆలోచనలనుంచి బయటపడుతున్నారు. అందులో తెలంగాణ ప్రజానీకం కూడా ఉండ డం మంచి పరిణామం. తెలంగాణ ఉద్యమం వల్ల ప్రజలకు కొద్దో గొప్పో రాజ్యాంగ పరిజ్ఞానం అబ్బింది. ఇప్పుడు మన ఊళ్ళల్లో మూడో తరగతి చదివే పిల్లలకు కూడా రాజ్యాంగంలోని మూడవ ఆర్టికల్‌లో ఏముందో తెలిసిపోయింది. అంబేద్కర్ చిన్న రాష్ట్రాల గురించి ఏమన్నాడో వాళ్ళు చెప్పేస్తున్నారు. ఈ అవగాహన వల్లే ప్రజలు ఇంకా రాజ్యాంగం మీద చట్టసభల మీద నమ్మకంతో ప్రత్యేక రాష్ట్రం కోసం అలసటలేని పోరాటం చేస్తున్నారు. అంబేద్కర్ ఆచరణలో చూపిన మార్గాన్నే ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అనుసరిస్తోంది. బహుశా అదే శాసన సభ ఆవరణలో అంబేద్కర్ విగ్ర హం ప్రతిష్టించాలనే డిమాండ్‌కు కారణమైంది. 

ఈ డిమాండ్‌ను తెలంగాణవాదులు తెరమీదికి తేవడానికి ఆయన పట్ల ఈ ప్రాంత ప్రజలకు ఏర్పడ్డ గురి కూడా కారణం కావొచ్చు. విగ్రహాలతో సమాజంలో మహనీయుల పట్ల గౌరవం పెరుగుతుందన్న భ్రమలు నాకేమీ లేకపోయినా తెలంగాణ ఉద్య మం విగ్రహాలను ఆత్మగౌరవ ప్రతీకలుగా మార్చివేసిన సందర్భంలో అంబేద్కర్ విగ్రహం కోసం డిమాండ్ చేయడం న్యాయమైనదని నమ్ముతున్నాను. అయితే రాజకీయ నాయకులు చెబుతున్నట్టుగా అంబేద్కర్ కేవలం దళిత వర్గాలకే నాయకుడని నేననుకోను. ఆయన తరతరాలుగా దాస్యంలో మగ్గిన భారతీయ మహిళలకు విముక్తిని ప్రసాదించిన దార్శనికుడు. ఈ దేశం లో పుట్టిన ప్రతి శిశువుకూ నిర్బంధ ఉచిత విద్య ఉండాలని వాదించిన మేధావి. కార్మికులకు కనీస హక్కులుండాలని, వాటి సాధనకోసం సంఘటితమయ్యే అవకాశాలు ఉండాలని చట్టాన్ని రూపొందించిన శ్రామిక వర్గ పక్షపాతి. భారతదేశంలో సమానత్వం రావాలంటే భూములను జాతీయం చేసి వ్యవసాయాన్ని పరిక్షిశమగా గుర్తించాలని ప్రతిపాదించిన ధీశాలి. భారత దేశంలో బుద్ధుడు ప్రవచించిన సమానత్వం, సౌభ్రాతృత్వం, శాంతి సౌభాగ్యాలతో సమసమాజంగా విలసిల్లాలని కలలుగన్న స్వాప్నికుడు. ఆ కలలను నిజం చేసేందుకు తన అనుభవాన్ని, అధ్యయనాన్ని కలబోసి సమక్షిగమైన రాజ్యాంగాన్ని అందించిన శాసనకర్త! ఈ దేశంకోసం, దేశంలోని ప్రజలకోసం, భవిష్యతు కోసం అంబేద్కర్ అంతగా శ్రమించి, రాజ్యాంగ శాసన వ్యవస్థలను ప్రభావితం చేసిన నాయకుడు ఇంకొకరు పుట్టలేదు. తన నల భై ఏళ్ళ రాజకీయ జీవితంలో ఇరవై ఏళ్ళు గతాన్ని సవరించడానికి మరో ఇరవై ఏళ్ళు భవిష్యత్తును నిర్మించడానికి ఆయన వెచ్చించారు. అంబేద్కర్ ఈ దేశపు రాజ్యాంగ నిర్మాత కాబట్టి ఆ రాజ్యాంగ వ్యవస్థకు ప్రతిరూపమైన చట్టసభల ముందు అంబేద్కర్ విగ్రహం కచ్చితంగా ఉండి తీరాలి.

ఇప్పుడున్న చట్ట సభలైన పార్లమెంటు, శాసన సభల రూపురేఖలు, విధివిధానాలు రూపొందించింది ఆయనే. అసలైతే ఒక్క అంబేద్కర్ విగ్రహమే ఉండాలి!
కానీ హైదరాబాద్ నగరపు నడిబొడ్డున ఉన్న ఆంధ్రవూపదేశ్ శాసనసభ ముందు గంభీర మౌనమువూదలో కూర్చున్న గాంధీ విగ్రహమే కనిపిస్తుంది. ఇరవైండు అడుగుల ఎత్తున్న ఈ విగ్రహాన్ని టీడీపీ ప్రభుత్వం 1988లో ఏర్పాటు చేసింది. ఆ విగ్రహాన్ని చూసినప్పుడల్లా గాంధీకి శాసనసభకు ఉన్న సంబంధం ఏమిటన్న అనుమానం కలుగుతుంది. రాజ్యాంగానికి, శాసన వ్యవస్థకు, చట్టబద్ధ పరిపాలనకు రూపశిల్పి అయిన అంబేద్కర్ విగ్రహాన్ని శాసనసభ ఆవరణలో పెట్టడానికి ఆంధ్రవూపదేశ్ ప్రభుత్వం అవలంబిస్తోన్న వ్యతిరేకత చూసిన తరువాత ఈ ప్రశ్న లేవనెత్తక తప్పడం లేదు. హైదరాబాద్‌తో పరిచయంగానీ, ఈ ప్రాంతంతో సంబంధంగానీ లేని అనేకమంది విగ్రహాలు టాంక్‌బండ్ మీద ఉన్నట్టే చట్టసభలతో పరిచయం గానీ, వాటిల్లో ప్రవేశానుభవంగానీ కనీసం చట్టాల పట్ల గౌరవంగానీ లేని గాంధీ విగ్రహం అసెంబ్లీ ఆవరణలో ఉండడంలో ఔచిత్యం అర్థం కాదు. గాంధీజీ గొప్ప నాయకుడే. స్వాతంత్య్ర పోరాటానికి నాయకత్వం వహించిన వారిలో ఆయన ముఖ్యులు. దేశమంతా పర్యటించి జాతీయభావాన్ని విస్తరించడంలో గాంధీజీ పాత్ర విస్మరించలేనిది. ఆయన పేరుమీద దేశంలో అనేక వాడలు, రహదారులు మొదలు మహానగరాలే వెలిశాయి. ఆయన విగ్రహాలు వీధివీధినా కనిపిస్తాయి. కానీ గాంధీకి శాసనవ్యవస్థకు ఎలాంటి సంబంధ మూ లేదు. అసలు ఆయనకు ఇప్పుడున్నరాజ్యాంగ వ్యవస్థ పట్ల గౌరవం కూడా లేదు. గాంధీ ఇప్పటి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కంటే ధర్మకర్తల్లాంటి పాలకులుండే ఆదర్శవాద గ్రామ స్వరాజ్య నమూనాను కలగన్నాడు. గాంధీ గ్రామీణ వ్యవస్థలో పెత్తందారీ కర్రపెత్తనం ఉండాలనుకున్నాడు కానీ సార్వవూతిక ఓటింగును సమర్థించలేదు. 

ఆయన పరోక్ష ప్రజాస్వామ్యాన్ని ఇష్టపడ్డాడు. ప్రజాస్వామ్యం గ్రామంలో పెద్దమనుషులను ఎన్నుకుంటే, ఆ పెద్దమనుషులు పై స్థాయి పాలకులను ఎన్నుకోవాలని కోరుకున్నాడు. కానీ ఆ పెత్తందారీ వ్యవస్థను తుత్తునియలు చేసే సాధనంగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని మలిచాడు. రాజ్యాంగం అమాలౌతున్నదా? లేదా అన్నది వేరే చర్చ కానీ ఇప్పటికీ ప్రభుత్వాలకు దిశా నిర్దేశం చేసి నడిపించేది రాజ్యాంగమే! రాజ్యాంగ రచన కోసం అంబేద్కర్ దాదాపు మూడేళ్ల తన విలువైన జీవిత కాలాన్ని వెచ్చించాడు. రాజ్యాంగ రచనా సంఘ సారథిగా ఆయన రాత్రింబవళ్ళు కృషి చేశారు. కానీ గాంధీ నాయకత్వం వహించిన కాంగ్రెస్ పార్టీ వారసులమని చెప్పుకునే వారు ఇప్పుడు దాన్నొక చిత్తుకాగితంగా మార్చేశారు. అంబేద్కర్ శాసనం ఏ రూపంలో ఉన్నా దాన్ని ప్రజలకు అనుకూలంగా మలచాలని ప్రయత్నించాడు. పెత్తందారీ ధర్మకర్తలకంటే చట్టం, న్యాయం మాత్రమే ధర్మాన్ని నిలబెడుతుందని నమ్మాడు.

ముఖ్యంగా అప్పటి బ్రిటీష్ పాలకుల మీద తన ఒత్తిడిని పెంచి పాలనా వ్యవస్థను ప్రజాస్వామీకరించే ప్రయత్నం చేశాడు. బ్రిటీష్ పాలనాకాలంలో అప్పటి పాలకులకు ఈ దేశం గురించి, దేశంలోని ప్రజల సమస్యల గురించి, ప్రాథమిక అవసరాల గురించి, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యల గురించి, చేయాల్సిన చట్టాల గురించి మొట్టమొదటిసారిగా సమక్షిగంగా నివేదించిన వారిలో అంబేద్కర్ ఆద్యుడు. అప్పట్లో భారతీయ పరిపాలనా వ్యవస్థను మానవీకరించాలని గానీ, రాజకీయ వ్యవస్థను ప్రజాస్వామీకరించాలని గానీ ఏ ఒక్కరూ ఆలోచించలేదు. ఆ మాటకొస్తే గాంధీ లండన్‌లో చదువు పూర్తిచేసుకుని తిరిగిరాగానే దేశం గురించి ఆలోచించలేదు. రాజ్‌కోట్ కోర్టులో ప్రాక్టీసు మొదలుపెట్టాడు. అది సరిగా నడవకపోయేసరికి దక్షిణావూఫికాలో గుజరాతీ షావుకార్ల తరఫున వాదించడానికి డర్బన్ వెళ్లి అక్కడే దాదాపు ఇరవై ఏళ్ళకు పైగా ప్రాక్టీసు చేస్తూ స్థిరపడ్డాడు. అంబేద్కర్ అలా చేయలేదు. దేశీయ పాలకుల సహాయంతో విదేశాలకు వెళ్లి చదువు పూర్తికాగానే తిరిగి వచ్చిన వెంటనే సామాజిక వ్యవస్థ ప్రక్షాళనకు నడుం కట్టాడు. అందుకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకున్నాడు. దాదాపు ఇరవయ్యేళ్ళ పాటు న్యాయవాదిగా, పాత్రికేయుడిగా, ప్రొఫెసర్‌గా ఉంటూ అనేక ఉద్యమాలను నిర్మించాడు. సమాజంలో పేరుకుపోయిన దురాచారాలను చట్టాలద్వారా రూపుమాపగలమని నమ్మాడు. అందుకోసం బలమైన ప్రజా ఉద్యమాలు నిర్మించి బ్రిటీష్ పాలకులను ఆలోచించే విధంగా చేశాడు. 

1919లో బ్రిటీష్ ప్రభుత్వం పాలనా సంస్కరణల కోసం ఏర్పాటు చేసిన మాంట్-ఫోర్డ్ కమిటీ అంబేద్కర్‌ను సంప్రదించింది. కమిటీ ముందు ఆయన ప్రత్యేక నియోజకవర్గాలు, సార్వవూతిక ఓటింగ్ గురించే కాక భారతీయ సమాజంలో ఉన్న అసమానతలు, విద్యావకాశాల ఆవశ్యకత, సాంఘి క సంస్కరణలు, తేవాల్సిన శాసనాల గురించి సమక్షిగమైన నివేదిక అందించారు. భారత దేశానికి చట్టాలు చేసేముందు సమాజాన్ని అర్థం చేసుకోవాలన్న ప్రతిపాదన చేశారు. ఆ తరువాత 1925లో భారత దేశ ద్రవ్య వినిమయ విధానంలోని సమస్యలను అధ్యయనం చేయడానికి వచ్చిన రాయల్ కమిషన్ ముందు హాజరై తన ఆలోచనలు పంచుకున్నాడు. అప్పుడే ఆయ న ఉమ్మడి వ్యవసాయం, భూమిశిస్తు విధానం, భూసంస్కరణల గురించి ప్రతిపాదనలు చేశారు. అదే కాలంలో ఆయన బొంబాయిలో చట్టసభలో క్రియాశీల పాత్ర పోషించాడు. ఆ తరువాత చట్టబద్ధ పరిపాలనను అందించే రాజ్యాంగ నిర్మాణం కోసం 1928లో వచ్చిన సైమన్ కమిషన్‌ను బహిష్కరించాలని గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పిలుపునిచ్చింది.అప్పటికి కాంగెస్ స్వాతంత్య్రం కోసం తీర్మానం చేయలేదు. అయినప్పటికీ కమిషన్‌లో భారతీయులకు ప్రాతినిధ్యం లేదని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళన లేవదీసింది. అంబేద్కర్ మాత్రం పూణెలో కమిషన్ ముందు హాజరై భారత దేశంలో రాజ్యాంగ వ్యవస్థ ఎలా ఉండాలో నివేదిక అందించారు. అందులో సార్వవూతిక ఓటు హక్కుతో పాటు, అస్పృశ్యులకు ప్రత్యేక ప్రాదేశిక నియోజక వర్గాల ప్రస్తావన ఒకటి. కమిషన్ అంబేద్కర్ సూచనలేవీ పరిగణలోకి తీసుకోకపోవడంతో ఆయన లండన్‌లో నిర్వహించిన రెండు రౌండ్ సమావేశాలకు హాజరై తన వాదనలు వినిపించాడు.దాదాపు ఐదేళ్ళు పోరాడి అంబేద్కర్ కొద్దో గొప్పో అణగారిన వర్గాలను ప్రజాస్వామ్య శాసన నిర్మాణ వ్యవస్థలో భాగస్వాములను చేయాలని ప్రయత్నిస్తే గాంధీ దాన్ని అడ్డుకోవడానికి ఎరవాడ జైలులో నిరాహార దీక్షకు దిగి చివరకు ఆ అవకాశాలు అందకుండా చేశాడు. గాంధీజీకి తన మీద, తన నాయకత్వం, ఆలోచనల మీద ఉన్న నమ్మకం చట్టాల మీద ఎన్నడూ లేదు. అనేక సార్లు ఆయన శాసన బద్ధ పాలనను వ్యతిరేకించాడు. స్వయంగా శాసనాలను ఉల్లంఘించాడు. 

శాసనోల్లంఘనకు పిలుపునిచ్చాడు. 1922-42 మధ్యకాలంలో గాంధీ అనేక సార్లు చట్టాలను ఉల్లంఘించి జైలుకు వెళ్ళాడు. ఇదంతా స్వాతంత్య్రం కోసమే అని మనం సరిపెట్టుకోవచ్చు. కానీ చట్టం ముందర ఆయన మాత్రం దోషిగానే నిలబడ్డారు. ఇదే కాలంలో సమాజాన్నిమానవీకరించే ప్రయత్నం చేస్తూనే అంబేద్కర్ దేశంలో రాజ్యాంగబద్ధ పాలనకోసం, శాసన వ్యవస్థకోసం కృషి చేసారు. బ్రిటీష్ ప్రభుత్వం భారత దేశంలో రాజ్యాంగ సంస్కరణల కోసం ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ సభ్యుడిగా 1932-34 మధ్య కాలంలో విశేషమైన సేవలు అందించి, భారత దేశంలో ప్రజాస్వామిక పాలనకు బీజాలు వేశారు. అదే 1935లో భారత ప్రభుత్వ చట్టం పేరుతో భారత ప్రభుత్వ పాలనా వ్యవస్థకు స్వయంవూపతిపత్తి కల్పించి స్వతంత్ర అధికారాలను ఇచ్చింది. దేశంలో చట్టబద్ధ పాలనకు ఆస్కారం కలిగించింది. 1941 లో బ్రిటిష్ ప్రభుత్వంలో రక్షణ సలహా మండలి సభ్యుడిగా, వైస్రాయ్ కౌన్సిల్ లో లేబర్ మెంబర్‌గా ఆయన అనేక చట్టాలకు రూపకల్పన చేసారు. 

అంబేద్కర్ జీవితంలో ఎప్పుడూ విగ్రహాలను నమ్మలేదు. విగ్రహారాధననే వద్దనుకున్నాడు. కానీ తన విగ్రహాలే భవిష్యత్తులో చైతన్య ప్రతీకలుగా నిలబడతాయని, కోట్లాది మందిని ఆత్మగౌరవంతో నిలబెడతాయని ఊహిం చి ఉండడు. అంబేద్కర్ జీవితం, పోరాటం, ఆదర్శాలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. అంబేద్కర్‌ను గుండెల్లో నిలుపుకోవడానికి, ఆయన ఆశయాలను చిరస్థాయిగా, సజీవంగా నిలబెట్టడానికి ఇప్పుడు దేశంలో కోట్లాది మంది సిద్ధంగా ఉన్నారు. అందులో తెలంగాణ ప్రజలు కూడా కులమతాలకు అతీతంగా ఆ జాబితాలో చేరిపోయారు. ఆయన విగ్రహాలు పార్లమెంటు మొదలు గ్రామ సచివాలయం దాకా అన్ని రాజ్యాంగ వ్యవస్థల ముందు ఉండాలని కోరుకోవడం న్యాయమయిందే.కానీ ఆ చట్టసభలే రాజ్యాంగ లక్ష్యాలకు విరుద్ధంగా పాలన సాగిస్తున్నాయి. చట్టవ్యతిరేక శక్తులకు, అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రాలయిపోతున్నాయి. వాటిముందు వేలెత్తి నిలదీసే అంబేద్కర్ లాంటి ఆదర్శ మూర్తి కంటే మౌనమువూదలో కూర్చుండే ఉత్సవ విగ్రహాలు ఉండడమే మంచిదేమో! 

పొఫెసర్ ఘంటా చక్రపాణి 
సమాజశాస్త్ర ఆచార్యులు, రాజకీయ విశ్లేషకులు 
ఈ మెయిల్ : ghantapatham@gmail.com

Namasete Telangana News Paper Dated : 27/04/2012 

కవిత్వం లాంటి జీవితం - కార్తీక్ నవయాన్



సత్యమూర్తిని నిజాయితీగా అర్థం చేసుకోగలిగితే అతను కవులకు మహాకవిగా అర్థం అవుతాడు; విప్లవకారులకు గొప్ప విప్లవ నాయకుడుగా అర్థం అవుతాడు. పేదలకు అతనొక మహా పేదవాడుగా అర్థం అవుతాడు. తత్వవేత్తలకు అతనొక గొప్ప తాత్వికుడు. ఒక రచయితను అర్థం చేసుకోవాలంటే అతని రచనలను అర్థం చేసుకుంటే సరిపోతుంది. సత్యమూర్తిని అర్థం చేసుకోవాలంటే అతని రచనలతో పాటు అతని బ్రతుకును కూడా అర్థం చేసుకోవాలి. 

సాంప్రదాయ అగ్రకుల మధ్యతరగతి విప్లవ నాయకులకు, విప్లవ కవులకు ఉన్నటువంటి అనేకానేక సౌకర్యాలకు సత్యమూర్తి దూరంగా ఉన్నాడు. అతను వాటిని పొందలేక కాదు, కల్పించుకోలేక కాదు. అతను దేనికోసం రాసాడో దానికోసమే బ్రతికాడు. సత్యమూర్తి కవిత్వానికి బ్రతుకుకు మధ్య Contradiction లేదు. విప్లకారుడిగా మారిన తర్వాత అతని జీవిత కాలంలో కేవలం గత మూడు సంవత్సరాలే అంటే తన చివరి రోజులు, తను వదిలి వెళ్ళిన పిల్లల దగ్గర గడిపాడు. 

2009 వరకు ఏదో ఒక కార్యక్రమంలో ఎవరో ఒకరితో తిరుగుతూనే ఉన్నాడు. ప్రధానంగా తెలంగాణ ప్రాంతంలో ఇప్పటికీ ఉన్న తన అభిమానుల వెంటనే ఉండేందుకు ఆసక్తి చూపించేవాడు. ఇక్కడికి వచ్చిన సమయంలో ఆరోగ్య సంబంధమైన సమస్యలు వచ్చి తన కూతురుతో తిట్లు తింటూ కూడా ఇక్కడే గడిపిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అతనిది కవిలాంటి జీవితం కాదు కవిత్వం లాంటి జీవితం. అతని కవిత్వాన్ని జీవితాన్ని వేరువేరుగా చూడలేము. అతను ఏ సిద్ధాంతాలు, ఏ రాజకీయాలు నమ్ముకున్నాడో వాటితోనే కాదు అతను ఏ ప్రజలను నమ్ముకున్నాడో జీవితాంతం అదే ప్రజల మధ్య, అదే పేదల మధ్య బ్రతికాడు. అదే ఇతర కవులకు, సత్యమూర్తికి ఉన్న తేడా. 

సత్యమూర్తితో కలిసి గడిపిన వారు ఎవరైనా ఆ జ్ఞాపకాలను మరిచిపోలేరు. అతని మాటలు, మనం సమస్యలనుకునే వాటిని అతను చూసే దృష్టి చాలా భిన్నంగా ప్రత్యేకంగా ఉండేవి. మనం చిన్న చిన్న విషయాలు అనుకునే విషయాల పట్ల కూడా సత్యమూర్తికి చాలా స్పష్టమైన ఖచ్చితమైన అభిప్రాయాలూ ఉండేవి. ఎంత గంభీరమైన వ్యక్తో అంత హాస్యంగా కూడా ఉండేవాడు. సత్యమూర్తి హైదరాబాద్‌లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు నా రూమ్‌లో ఉండేవాడు. ఒకసారి నాకు కావాల్సిన భార్య మా కోసం సీతాఫల పండ్లు తీసుకొచ్చింది. సత్యమూర్తి ఏంటి బాబు అవి అని అడిగాడు, సీతాఫల పండ్లు అని చెప్పాను. ఎవరు తీసుకొచ్చారు అని అడిగాడు. విజయ తీసుకొచ్చిందని చెప్పాను. విజయ తీసుకొస్తే సీతా ఫలములు అంటావేమిటి బాబు అవి విజయ ఫలాలు అన్నాడు. 

సత్యమూర్తి తన 75 సంవత్సరాల వయస్సులో కూడా అజ్ఞాత జీవితం గడిపాడు. అజ్ఞాత జీవితం అంటే హైదరాబాద్‌లోనో బెంగుళూరులోనో కాదు. ఖమ్మం, వరంగల్ జిల్లా అడవుల్లో 2000-2002 సంవత్సరాల మధ్య దాదాపు ఆరు నెలల కాలం అడవిలోనే గడిపాడు. చాలా మంది యువకులకు స్ఫూర్తినిచ్చాడు. అసలు ఆ వయసులో అడవిలోనికి వెళ్ళాలనే ఆలోచనే ఎవరి ఆలోచనలకు అందనిది. అది కేవలం సత్యమూర్తికే సాధ్యం. 

ఒకసారి ఖమ్మం అడవి నుంచి సత్యమూర్తితో కలిసి వస్తుండగా ఒక ప్రశ్న అడగాలనిపించి అడిగాను. అప్పుడు నా దగ్గర పదివేల రూపాయలు సత్యమూర్తి దగ్గర ఇరవై వేల రూపాయలు ఉన్నాయి. నేను ఇలా అడిగాను. 'సర్ ఒక వేళ పోలీసులు మనల్ని పట్టుకుంటే నేను స్టూడెంట్ నని చెపుతాను నా దగ్గర గుర్తింపు కార్డు ఉంది, వారు నా దగ్గరి డబ్బుల గురించి అడిగితే నేను స్టూడెంట్ కాబట్టి ఫీజులు అవి ఖర్చులు ఉంటాయని తీసుకెళ్తున్నానని చెబుతాను. మరి మీరేమి చెపుతారు?'. అపుడు సత్యమూర్తి 'ఒకవేళ పోలీసులు నా దగ్గరి డబ్బుల గురించి అడిగితే ఈ డబ్బులు నావే మీకు కావాలా అని అడుగుతాను' వారికి కావాలంటే యిచ్చేస్తానని అన్నాడు. 

సత్యమూర్తిని లెక్క కట్టేసారు, అతను శ్రీశ్రీ తర్వాత అని లెక్కేసారు. దానికి కొలమానము ఏమిటో? నిజానికి సత్యమూర్తికి ఎవరితో పోలిక సరికాదు. అతను ఎవరి తరువాత కాదు. అతనికి అతనే సాటి. యిక్కడి విప్లవ కవులు అందరూ సత్యమూర్తి ద్వారా స్ఫూర్తి పొందినవారే. సత్యమూర్తి కేవలం కవి మాత్రమే కాదు అతను పూర్తి కాలం సామాజిక విప్లవ నాయకుడు. 

అతను కవిత్వం మాత్రమే రాయలేదు. కవిత్వం సత్యమూర్తికి తన విప్లవ ఆచరణలో భాగమే ఆ విధంగా చూసినపుడు సత్యమూర్తిని ఏ మాత్రం ఆచరణ లేని ఇతర కవులతో పోల్చడం అన్యాయం. కేవలం కవిత్వం మాత్రమే కాదు సత్యమూర్తి బ్రతుకుని గురించి మాట్లాడండి. ఇతర కవుల బ్రతుకులు ఏమిటో ఎలా బ్రతుకుతున్నారో చూడండి. అందుకని పోలికలు వద్దు. సత్యమూర్తి విప్లవ కవిత్వమైనా, దళిత కవిత్వమైనా, విప్లవోద్యమమైనా, దళితోద్యమమైనా అగ్రశ్రేణిలో ఉంటాడు. అది సైద్ధాంతికమైనా ఆచరణ రీత్యానైనా సత్యమూర్తి సత్యమూర్తే.

దళిత శ్రేణులు కూడా విప్లవ శ్రేణుల లాగా సత్యమూర్తిని నిర్లక్ష్యం చేసాయి. విప్లవోద్యమానికి దళితోద్యమానికి సత్యమూర్తి చేసిన సేవలు కొలమానం లేనివి, సత్యమూర్తి దళిత ఉద్యమానికి చేసిన... ప్రస్తుత దళిత నాయకులకు అర్థమైనా సరే మౌనంగానే ఉన్నారు. ఈ పరిధుల నుంచి విప్లవోద్యమం, దళితోద్యమం బయటపడాల్సిన అవసరం ఉంది. విప్లవోద్యమానికి తర్వాత దళితోద్యమానికి సత్యమూర్తి తన జీవితాన్ని అంకితం చేశాడు. పేదలు, దళితులు, పీడితులు, అణచబడిన జన గణాలు సత్యమూర్తి ఆలియాస్ శివసాగర్‌ని అనునిత్యం తలచుకుంటారు.

- కార్తీక్ నవయాన్
Andhra Jyothi News Paper Dated : 27/04/2012 

Wednesday, April 25, 2012

Girijana Rakshna Kavachalaku Chillulu -Ganji Varapu Srinivas

Eenadu News Paper Dated : 26/04/2012 

బ్రాహ్మణిజంపై బహుజన పోరాటం - డా. గాలి వినోద్ కుమార్



ప్రజాస్వామ్య సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో ఎన్.ఆర్.ఎస్ హాస్టల్ ముందు ఉస్మానియా విద్యార్ధులు ఇటీవల నిర్వహించిన బీఫ్ ఫెస్టివల్ ప్రజాస్వామ్య బద్ధంగా, హిందూమత 'అంటరానితనానికి' వ్యతిరేకంగా జరిగిన సాంఘిక విప్లవ సమావేశం. హిందూత్వ భావజాలం ఉన్న విద్యార్థులు దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నట్లు? నిర్వాహకులు బహుజన విద్యార్థులే, వ్యతిరేకిస్తున్న వారూ ఈ వర్గాల వారే. బీఫ్ పెస్టివల్‌ను అడ్డుకున్నది, కత్తిపోట్ల కట్టు కథలు అల్లింది కూడా ప్రధానంగా బిసి, ఎస్టీ విద్యార్థులే. వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆహార సంస్కృతిలో భాగంగా, దళిత, మైనార్టీలు ఎద్దు మాంసాన్ని తమ హాస్టల్ ముందు భుజిస్తే వారికి వచ్చే నష్టం ఏమిటి? ఎందుకంత వ్యతిరేకత? 

అన్ని జంతువుల్లాగే ఆవు ఒక జంతువని, అన్ని జంతువులకు ఔషధ గుణాలున్నట్లే ఆవుకు కూడా ఉన్నాయని, దానికంటూ ఏ మాత్రం పవిత్రత లేదని ప్రపంచంలోని ప్రముఖ శాస్త్రవేత్తలందరూ చెబుతున్నారు. అయినా ఈ దేశంలో భారతీయ సంస్కృతి పేరుతో ఆవుకు లేని పవిత్రత, ప్రాధాన్యతను 'మతం' ముసుగులో ఇస్తున్నారు; తోటి భారతీయులైన దళితులను అంటరాని వారిగా, వారి ఆహార సాంప్రదాయాలను అంటరాని సాంప్రదాయాలుగా, వారి వృత్తులు అంటరాని వృత్తులుగా పరిగణించే సంస్కృతి వేదకాలం నుంచి ఉందా? మధ్యలో ప్రారంభమైందా అనే విషయాన్ని ఈ విద్యార్థులు తెలుసుకోవలసిన అవసరం ఉంది. 

వేదకాలంలో చాలా మంది రుషులు ఎద్దు, ఆవు, గుర్రం మాంసాలను ఎంతో ఇష్టపడి తినేవారని ప్రముఖ చరిత్రకారుడు డి.డి.రోశాంబి పరిశోధనలు వెల్లడించాయి. రుగ్వేదం ప్రకారం ఇంద్రునికి ఆవు, దూడ, గుర్రం, ఎద్దు మాంసం అంటే ఎంతో ఇష్టమని రాసి ఉంది. మాంసాలను తమ దేవతలను సంతృప్తి చేయడానికి గోమేధ, అశ్వమేధ, యాగాల్లో వందల సంఖ్యల్లో జంతువులను బలి ఇచ్చేవారని బ్రాహ్మణుల సలహా మేరకు రాజులు ఈ యాగాలను నిర్వహించే వారని రుగ్వేదం చెబుతున్నది. రామాయణంలోనూ ఎద్దు మాంసం ప్రస్తావన ఉంది. 

భవభూతి ఉత్తర రామ చరితలో వాల్మీకి, వశిష్ట మునిని విందుకు ఆహ్వానించి ఆయనను ఆనందపరచడానికి వందల సంఖ్యల్లో ఆవు, దూడలను వధించి విందు ఇచ్చాడని వర్ణించాడు. హిందూ ధర్మ ప్రధాన సూత్రకర్త మనువు తన మను స్మృతిలో మాంసాహారం తినడం నేరం కాదని రాశాడు. ఒక పురుషుడు సాంప్రదాయాలను సరైన పద్ధతిలో ఆచరించడానికి మాంసాహారాన్ని తినాలని లేకపోతే వచ్చే ఇరవై ఒక్క పునర్జన్మల్లో పవిత్ర జంతువుగా పుడతాడని రాశాడు. అదే విధంగా మనువు రాజులకు విందు ఇచ్చే సమయంలో మధుపారక అనే మద్యంతో పాటు ఎద్దు మాంసాన్ని కూడా ఇవ్వాలని సూచించాడు. 

కౌటిల్య అర్ధశాస్త్రంలోనూ ఎద్దు మాంసం ప్రస్తావన ఉంది. ఇంట్లో ఎద్దు మాంసం తినొచ్చు, పాలు ఇచ్చే ఆవులను, దూడలను బలి ఇవ్వొచ్చు కాని కటిక వానికి అమ్మకూడదు అని రాసి ఉంది. వేదకాల హిందూ ఆచార సాంప్రదాయాల ప్రకారం ఒక మనిషి ఎద్దు మాంసం తినకపోతే మంచి హిందువు కాలేడు అని స్వామి వివేకానంద అన్నారు. వేదకాలం నుంచి హిందూ మత చరిత్ర ఎద్దు మాంసం తినడానికి అనుకూలంగా ఉంది. 

ముస్లింల పరిపాలన నుంచి ఆవు మాంసం తినడం ప్రారంభమైందని హిందువులు చేస్తున్న ప్రచారం అబద్ధమని వేదాలు రుజువు చేస్తున్నాయి. హిందూ మతానికి పునాది వేదాలు, పురాణాలు వాటిల్లోనే ఎద్దు, ఆవు, దూడ, గుర్రం మాంసాలను తినొచ్చు తప్పు కాదు అని బోధిస్తుంటే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో హిందూత్వ విద్యార్థులు ఎందుకు వ్యతిరేకిస్తున్నట్లు? ఎప్పటి నుంచి ఈ వ్యతిరేకత హిందూ మతంలో మొదలయింది అనేది కూడా ఇక్కడ చర్చించుకోవలసిన అవసరం ఉంది. 

ఎద్దు మాంసం ఎప్పటి నుంచి నిషేధించబడినది? ఎందుకు నిషేధించబడింది? అంబేద్కర్ మాటల్లో చెప్పాలంటే బ్రాహ్మణులు బుద్ధిజాన్ని ఓడించి బ్రాహ్మణిజాన్ని పరిరక్షించడానికి చేసిన కుట్ర ఫలితమే అకస్మాత్తుగా బ్రాహ్మణులు శాఖాహారులుగా మారి ఎద్దు, ఆవు ఇతర మాంసాలపై నిషేధాన్ని విధించడం. ఆవు పవిత్రమైన గోవు, దాన్ని చంపడం మహాపాపమని బ్రాహ్మణులు ప్రచారం మొదలుపెట్టారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఎద్దు మాంసాహారులైన బౌద్ధులను ఈ దేశం నుంచి వెళ్ళగొట్టడానికి, బుద్ధిజాన్ని కూకటి వేళ్ళతో పెకిలించడానికి, బ్రాహ్మణులు పన్నిన పన్నాగమే అంటరానితనం. ఎద్దు మాంసం తింటున్న బౌద్ధులను బ్రాహ్మణులు వెలివేశారు. 

అప్పటి నుంచి ప్రారంభమైందే ఈ అంటరానితనం అంటారు. బుద్దిస్ట్‌లైన మౌర్య సామ్రాజ్యాన్ని కుట్రతో బ్రాహ్మణులు అంతంచేసి హైందవులైన గుప్తుల కాలం నుంచే అంటే 400 ఎ.డి. నుంచి ఆవును చంపడాన్ని, తినడాన్ని నిషేధించారు. తిన్నవారిని అంటరాని వారిగా, వారి వృత్తులను అంటరాని వృత్తులుగా పరిగణిస్తూ బుద్ధిజంపై బ్రాహ్మణిజం ఆధిపత్యం కోసం బలవంతంగా రుద్దబడిందే ఈ వెలివేత. 

ఆనాటి నుంచి నేటి వరకు బ్రాహ్మణిజాన్ని ఎదుర్కొంటున్నది ఎద్దు మాంసాహారులైన దళిత, మైనార్టీలు. అందులో మాదిగలది ప్రథమ స్థానం. ఆ సాంప్రదాయాన్ని ఓ.యు. విద్యార్థులు ఏప్రిల్ 15న కొనసాగించారు. దళితుల్లో పది మంది కూడా ఎద్దు మాంసాన్ని తినరు అని హిందూత్వవాదులు చేస్తున్న ప్రచారం అబ ద్ధం. మాదిగల్లో 99 శాతం, మాలల్లో 50 శాతం ఆదివాసుల్లో 80 శాతం మైనార్టీల్లో 100 శాతం, బీసీల్లో 10 శా తం నేటికీ ఎద్దు మాంసాన్ని ఈ దేశంలో భుజిస్తున్నారు. 

ప్రతి అంశాన్ని చర్చకు పెట్టే విశ్వ విద్యాలయాల్లో బ్రాహ్మణిజం యొక్క కుట్రను బయటపెట్టే అంశాలను చర్చకు పెడితే తప్పేమిటి? అయినా వేల సంవత్సరాలుగా వస్తున్న ఎద్దు మాంసం భుజించే సాంప్రదాయాన్ని దళిత, ఆదివాసీలు, మైనార్టీ విద్యార్థులు, ఒక పండుగలాగా నిర్వహిస్తే ఇతర విద్యార్థులకు వచ్చే నష్టం ఏమిటి? 

ఈ దేశంలో కుల వ్యవస్థను ఏర్పాటు చేసింది బ్రిటీష్ వారు కాదు, ముస్లిములు అంతకన్నా కాదు. తోటి మానవున్ని, నీచునిగా అంటరానివానిగా, వారి ఆహారాన్ని సాంప్రదాయాలను వృత్తులను అంటరానివిగా పరిగణించే సంస్కృతి భారతీయ సంస్కృతి ఎలా అవుతుంది? బీఫ్ ఫెస్టివల్‌ను భారతీయ సంస్కృతి పరరిక్షణ పేరుతో అడ్డుకున్న బిసి, ఎస్సీ, ఎస్టీలు గమనించాల్సింది ఏమిటంటే శాఖాహార సంస్కృతి బ్రాహ్మణులది. మాంసాహార సంస్కృతి బహుజనులది. మీరు బ్రాహ్మణులవైపా? బహుజనులవైపా తేల్చుకోవలసింది మీరే. ఓ.యు.లో బ్రాహ్మణవాదంపై బహుజన వాదం పోరాటమే బీఫ్ ఫెస్టివల్ నిర్వహణ. దేశ వ్యాప్తంగా దాన్ని కొనసాగించాలి. 

- డా. గాలి వినోద్ కుమార్

Andhra Jyothi News Paper Dated : 26/04/2012 

వేదికలపై అస్తిత్వాలు వెనక తిరస్కారాలు--- జ్వలిత



'ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక' ఏర్పాటు, రంగనాయకమ్మ ప్రసంగ పాఠం చదివిన తరువాత పాత సందేహాలతోపాటు స్పందించవలసిన కొత్త సందర్భం ఏర్పడింది. 10.1.2009న జరిగిన 'మనలో మనం' సమావేశంలో మేమెక్కడ? అన్న ప్రశ్నకు సమాధానం దొరకలేదు అనే కంటే సమాధా నం చెప్పవలసిన అవసరం లేదు అన్నట్టుగా దాటవేయడం జరిగింది. మిగిలిన వేదికలలాగే కొందరు మాత్రమే కొందరికి మాత్రమే ప్రాధాన్యతను ప్రదర్శించారు. దళిత, బిసి, మైనారిటీ రచయిత్రుల ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఒక రకంగా అవమాన పరిచారు.

మీలో 'మేం' లేము కాబట్టి ఎస్సి, ఎస్‌టి, బిసి, మైనారిటి రచయిత్రులతో 23.3.2009న హైదరాబాద్‌లో 'మట్టిపూలు' వేదిక ఏర్పాటు అయ్యింది. దాదాపు 18 నెలలు గడిచిన తరువాత కూడా అతి తక్కువ సంఖ్యలో దళిత, ఆదివాసి, బిసి, మైనారిటీ రచయిత్రులను కలుపుకొని పలుచోట్ల సమావేశాలు జరిపి విశ్వవిద్యాలయాలు కూడా మాకే సహకరిస్తున్నాయన్నట్లు వ్యవహరించారు. ఉన్నట్టుండి 'ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక' అని పేరు పెట్టారు కాబట్టి ప్రజాస్వామ్యం ఎంతమేరకు? అనే ప్రశ్న తలెత్తుతుంది. 'నేతి బీరకాయలో నేతి చందమేనా!'

రంగనాయకమ్మ అస్తిత్వాలు లేని సమసమాజం కోసం ప్రయత్నం జరగాలన్నారు. కొన్ని దశాబ్దాలుగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఫలితాలు మాత్రం శూన్యమని అందరికీ తెలిసిందే. 

ఒక వ్యక్తి అనేక అస్తిత్వాలు కలిగివున్నపుడు ఏది మౌలికం అనే విషయం గుర్తుచేశారు. ఆధిపత్యేతర వర్గవ్యక్తులు ఎవరైనా ఆయా సందర్భాలలో ఆయా సమయాలలో ఏది ముఖ్యమయినదో దానితో పోరాటం జరుపుతారు. సమానత్వం లభించనపుడు అణిచివేతలకు గురవుతున్నపుడు అస్తిత్వాలను కాపాడుకోవలసిన అవసరం ముఖ్యమయినది.

శ్రామిక అస్తిత్వం దోపిడి అస్తిత్వం రెండే అస్తిత్వాలు అని చెప్తూ శ్రమదోపిడీ నశించాలి సమానత్వం రావాలి అన్నారు కాని మన భారతదేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో శ్రమదోపిడీ మాయమవ్వడం అంత తొందరగా జరగదు. జరిగినా ఇద్దరిదీ ఒకే అస్తిత్వం కాదు. సోషలిస్టు దేశాల్లో అస్తిత్వ పోరాటాలు, హింస, దోపిడి లేకుండా ప్రశాంతంగా సౌఖ్యంగా సఖ్యంగా ఉంటున్నారా? శ్రమ సౌందర్యం/డిగ్నిటీ ఆఫ్ లేబర్ భావన ఆధిపత్య వర్గాలకు దోపిడీ సమూహాలకు ఎప్పుడూ అర్థం కాని విషయమే.

రచయిత్రుల వేదిక స్త్రీల అస్తిత్వం కాపాడే ఉద్దేశంతో ఏర్పడిందే అయితే అందరు స్త్రీలు సమానమేనా. ఆధిపత్య వర్గాల రచయిత్రులు దళిత, బహుజన, ఆదివాసీ, మైనారిటీ రచయిత్రులతో మాట్లాడటానికి, వారి పక్కన కూర్చోటానికే చిన్నతనంగా భావించినపుడు, ఎవరో ఒక్కరిద్దరిని మీ పేర్ల పక్కన చేర్చుకొని ప్రజాస్వామికం అంటే అది సూడో ఐక్యతే అవుతుంది.

భాష గురించి, యాస గురించి, తిండి గురించి, రంగు గురించి, అలవాట్ల గురించి వెక్కిరిస్తూ చిత్తశుద్ధి లేకుండా చేసే ఏ కార్యక్రమమయినా, ఏ వేదికయినా కొందరి స్వార్థం కొందరి విశాలత్వం చాటుకోవడానికే కాని, వారన్న చిన్న కులాల రచయిత్రులకు కొత్తగా ఒరిగేది ఏమి ఉండదు. విద్యావంతురాలైన స్త్రీ తన వివిధ అస్తిత్వాలను కాపాడుకునేందుకు ఎంత శ్రమ పడుతుందో విద్య లేని శ్రామిక వర్గం స్త్రీలు అంతకంటే ఎక్కువ సమస్యలను ఎదుర్కొంటున్నారు.

రంగనాయకమ్మ ఒక విషయం చక్కగా చెప్పారు- రచయిత్రుల వేదిక లక్ష్యాలను ప్రస్తావిస్తూ దామాషా పద్ధతిలో వివిధ అస్తిత్వాలకు ప్రాధాన్యత నివ్వడం వల న కొత్తగా జరిగే ఉద్ధరణ ఏమి ఉండదు. పైగా అంద రూ సమానమే అయితే బలహీనంగా కొందరెందుకు ఉన్నారు. అటువంటివారికే కదా ఎక్కువ ప్రాధాన్యత, ప్రోత్సాహం అవసరం. సమానత్వం అడుగుతుంటే దామాషా అనడమే ఒక ద్రోహపూరిత వ్యూహం.

అస్తిత్వం, అస్తిత్వ స్పృహ వంటి పదాలతో ఏదో ఉద్యమం చేస్తున్నట్టు భ్రమల్లో మునుగుతున్నారని రంగనాయకమ్మ ఉద్యమాలను భ్రమల వలయాల్లోకి నెట్టారు. చట్టాలు చేయని పనులను ఉద్యమాలు చేయిస్తాయని చట్టాలను మార్చి చట్టసభలను కదిలించే శక్తి ఉద్యమాల కుందని తెలియని దెవరికి? 

ఇప్పుడిప్పుడే సమీకరించబడి ఉద్యమిస్తున్నవారిని విడదీసే ప్రయ త్నం, ఉద్యమాలను నీరుకార్చే వ్యూహం, ఉద్యమాలపై నమ్మకం పోగొట్టి గందరగోళం సృష్టించే ద్రోహ పూరిత యత్నం ఇది. ఒక సమస్యను గురించి ఉద్యమిస్తున్నపుడు సమాధానం చెప్పక, స్పందించకుండా ఉండటం ఒక కుట్రయితే, మరో కొత్త సమస్యను సృష్టించి దృష్టి మరలించి, విభజించి, బలహీన పరిచే దిక్కుమాలిన రాజకీయ కుత్సితం ఇది.

ప్రకటనలు ప్రచారాలు కాకుండా కార్యాచరణ కావా లి. సాధ్యాసాధ్యాల చర్చ కావాలి. 'మట్టిపూలు' అవస రం గుర్తించాలి. అస్తిత్వ ఉద్యమాలను పక్కతోవ పట్టిం చే ప్రయత్నాలు చేయకండి. 'కొలుప్పెట్టి ప్రశంసించి, తలుప్పెట్టి హింసించే' తెలివిడి మాటలు, పనులు ఆపండి. 

సవాలక్ష 'ఇగో'లను కప్పుకొని, శతకోటి 'ఇజా'లు అలంకరించుకొని 'సహానుభూతి' లేని ప్రజాస్వామికత హాస్యాస్పదమే అవుతుంది. 

దళిత, బహుజన, ఆదివాసి, మైనారిటీ రచయిత్రులారా..! ఐక్యమవ్వాల్సిన అవసరం, అస్తిత్వాలను కాపాడుకోవలసిన అవసరం, ఆధిపత్య వర్గాల వ్యూహాలను తిప్పికొట్టవలసిన అవసరం, కుట్రలను గుర్తెరిగి మసలుకోవలసిన అవసరం ఉంది. పారా హుషార్!

Andhra Jyothi News Paper Dated : 19/07/2010