Thursday, April 26, 2012

పదకొండేళ్ల ప్రస్థానం--అల్లం నారాయణ,



తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించిన నాటి నుంచి రాష్ట్ర సాధనోద్యమంలో కీలకపాత్ర పోషిస్తూ 12వ ఏడులోకి అడుగుపెట్టింది. ఈ స్వల్ప కాలంలోనే టీఆర్‌ఎస్ అనేక సవాళ్ళను ఎదుర్కొన్నది. తెలంగాణరాష్ట్ర సాధన లక్ష్యం ఇంకా మిగిలే ఉన్నప్పటికీ, సాధించిన విజయా లూ ఉన్నాయి. తెలంగాణ ఆకాంక్షల సాఫల్యం కోసం, ఒక రాజకీయ పార్టీ ఏర్పడి, నిరంత రాయంగా కొనసాగి, వెన్ను చూపకుండా పదకొండేళ్ల అలుపెరుగని పోరాటం చెయ్యడం, పోరాటాన్ని గమ్యాన్ని ముద్దాడే దాకా కొనసాగించడం ఒక టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమైంది. అందుకే తెలంగాణకు మకుటం లేని మహారాజు వంటి పార్టీగా టీఆర్‌ఎస్ నిలిచి ఉన్నది. అది తెలంగాణకు ఏకైక ప్రతినిధిగా రూపొంది తెలంగాణ ప్రజల్లో తిరుగులేని శక్తిని సాధిం చుకున్నది. 

టీఆర్‌ఎస్‌ను దెబ్బకొట్టడానికి ఆంధ్ర వలస వాదులు అనేక కుట్రలు పన్నారు. పత్రికలు, టీవీ చానెళ్లు ఆంధ్ర పెత్తందారుల చేతుల్లో ఉండడం వల్ల పార్టీకి వ్యతిరేకంగా విష ప్రచారం జోరుగా సాగింది. ఎన్నికలు సమీపించినప్పుడల్లా టీఆర్‌ఎస్‌లో గందరగోళం ఉన్నట్టు, టికెట్లు అమ్ము కుంటున్నట్టు రకరకాల కథనాలను ప్రచారంలో పెడతారు. ఆంధ్ర పార్టీలకు ఉండే అవ లక్షణాలను లేదా రాజకీయ వ్యవస్థలో ఉండే రుగ్మతలను టీఆర్‌ఎస్‌కు ఆపాదించి విమర్శలు సాగిస్తారు. వై.ఎస్. ఉన్నప్పుడు టీఆర్‌ఎస్‌ను నిలువునా చీల్చాడు. ఒక ఉద్యమ పార్టీలోని కొందరు ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి చీల్చడాన్ని పత్రికలు ఖండించాలె. కానీ అమ్ముడు పోయిన నాయకులను తప్పు పట్టడానికి బదులు, పార్టీ నాయకత్వాన్ని అవహే ళన చేయడం ఆంధ్ర మీడియాకే చెల్లింది. ఆంధ్ర పెట్టుబడి దారుల మానస పుత్రిక అయిన టీడీపీ మాదిరిగా కాకుండా, తెలంగాణ ఉద్యమ పార్టీ అయిన టీఆర్‌ఎస్ నిధుల కొరతను ఎదుర్కోవడంలో ఆశ్చర్యం లేదు. అయినా టీఆర్‌ఎస్ మాత్రమే నిధుల వేటలో పడినట్టు వక్రీకరించి ఆంధ్ర మీడియా ప్రచారం చేసింది. వాస్తవానికి భారీగా నిధులున్న కాంగ్రెస్, టీడీపీలను టీఆర్‌ఎస్ ఢీకొనలేనందు వల్ల ఉద్యమకారులు అండగా నిలిచారు. మిగతా పార్టీలు డబ్బు కుమ్మరిం చినా ఓటర్లు టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించడం ప్రజానీకం సాధించిన పరిణతికి నిదర్శనం. 

ఎన్ని కుట్రలు ఎదురైనా ఉద్యమానికి మూలస్తంభంగా నిలవడమే టీఆర్‌ఎస్ సాధించిన గొప్ప విజయం. ఉద్యమకారులతో కలిసి తెలంగాణ వాదాన్ని గ్రామ స్థాయిలో ప్రచారం చేయడంలో టీఆర్‌ఎస్ సఫలమైంది.తెలంగాణ సాధిస్తామనే ఆత్మవిశ్వాసాన్ని ప్రజలకు కలిగించడం సాధారణ విషయం కాదు. జయశంకర్ వంటి పెద్ద మనుషులతో చర్చించి సరైన ఉద్యమ పంథాను ఎంచుకోవడంలోనే సగం విజయం ఆధారపడి ఉన్నది. ఉద్యమం పదేళ్లు దాటి ముందుకు సాగినప్పటికీ, పక్కదోవ పట్టకుండా జాగ్రత్త పడడం కూడా ప్రశంసనీయమే.ఉద్యమాన్ని హింసాయుతంగా మార్చడానికి పాలకులు ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలను నిబ్బరంగా ముందుకు నడిపించ గలుగుతున్నది. అయితే ఆంధ్ర మీడియా కుటిల ప్రచారం వల్ల కొందరు తెలంగాణ బిడ్డలు ఆత్మ విశ్వాసం సడలి బలిదానాలకు పాల్పడడం విచారకరం. ఆంధ్ర మీడియా ప్రచారాన్ని తిప్పి కొడుతూ, యువతలో స్థైర్యం నింపడానికి టీఆర్‌ఎస్, ఉద్యమ సంస్థలు మరింత కృషి సాగించాలె. 

తెలంగాణ రాష్ట్రం ఇంకా ఏర్పడకముందే, ఆ లక్ష్యం కోసం పుట్టిన టీఆర్‌ఎస్ ఆ తరువాత కాలంలో కాంగ్రెస్‌లో విలీనం అవుతుందని ప్రచారం చేయడం మరో పెద్ద కుట్ర. టీఆర్‌ఎస్ క్షేత్రస్థాయిలో వేళ్లూనుకోకుండా చేయడానికే ఈ కుతంత్రం. ఉద్యమాన్ని బలహీనపరచ డానికి ఇదొక ఎత్తుగడ. కాంగ్రెస్, టీడీపీలు తెలంగాణలో నిశ్శేషమై టీఆర్‌ఎస్ మాత్రమే మిగులుతుందనే భయం వలసవాదులను పీడిస్తున్న నేపథ్యంలో ఈ ప్రచారం సాగుతు న్నది. వలస వాదులకు ఇంకో భయం కూడా ఉన్నది. తెలంగాణ ఏర్పడిన తరువాత కూడా-ఆంధ్ర వలసవాద శక్తులకు, భూమి పుత్రులకు పోరాటం అనేక రంగాలలో ప్రత్యక్షంగా, పరోక్షంగా భిన్న రూపాలలో సాగుతూనే ఉంటుంది. అధికారం ఎవరి చేతుల్లో ఉంటుందనేది కీలకమై నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా తాము తెర వెనుక ఉండి, తమ ఏజెంట్ల ద్వారా పరిపాలన సాగించాలనేది ఆంధ్ర పెత్తందారుల కుట్ర. ఉమ్మడి రాష్ట్రం ఏర్పడడానికి ముందు తెలంగాణలో వెన్నెముక గల నాయకులు ఉండేవారు. కె.వి.రంగారెడ్డి, ఈశ్వరీ బాయి, సదాలక్ష్మి, జె.వి.నర్సింగరావు వంటి నాయకులు ఆంధ్ర పాలకులను సవాలు చేసే వారు. కానీ ఇప్పుడు ప్రజల నుంచి ఒత్తిడి వచ్చినా సరే, ఆంధ్ర పెత్తందార్లకు ఊడిగం చేసే నాయకులే అన్ని పార్టీలలో ఉన్నారు. రేపు తెలంగాణ ఏర్పడిన తరువాత కూడాఇదే పరిస్థితి కొనసాగించాలని ఆంధ్ర పాలకులు ప్రయత్నిస్తారు. అందువల్ల తెలంగాణకు ప్రాతినిధ్యం వహించే పార్టీ అంటూ ఉండకూడదని వారు కోరుకోవడంలో ఆశ్చర్యం లేదు. తెలంగాణ ప్రకటించే క్రమంలో కాంగ్రెస్ నాయకత్వం నుంచి అటువంటి ప్రతిపాదన వచ్చే విధంగా కుట్ర జరిపే అవకాశం కూడా ఉన్నది. అందువల్ల తెలంగాణ ఏర్పడిన తరువాత భూమి పుత్రుల చేతిలోనే అధికారం ఉండే విధంగా తెలంగాణ వాదులు వ్యూహాలు రచించాలె. 

ఆంధ్ర వలసవాద శక్తుల కుట్రలను తట్టుకుని ఒక తెలంగాణ పార్టీ ఆవిర్భవించడమే కాకుండా, తట్టుకుని నిలబడడం అద్భుతమే. పార్టీని ఈ స్థాయిలో నిలబెట్టిన ఘనత పార్టీ నాయకత్వానికి దక్కుతుంది.అయితే తెలంగాణ రాష్ట్రం సాధించే క్రమంలో టీఆర్‌ఎస్ బాధ్యతలు విస్తృతమవుతుంటాయి. ఈ బాధ్యతల నిర్వహణకు టీఆర్‌ఎస్ సమాయత్తం కావాలె. పార్టీ నిర్మాణాన్ని మరింత పటిష్ట పరచుకోవాలె. తెలంగాణ ఉద్యమం ఎంత విస్తృతమైందో కళ్ళెదుట కనిపిస్తూనే ఉన్నది. టీఆర్‌ఎస్ ఒక రాజకీయ పక్షంగా ఆ విస్తృతిని సంతరించుకోవడానికి కృషి చేయాలె. ఈ మధ్య కాలంలో సమాజంలోని అట్టడుగు వర్గాలు టీఆర్‌ఎస్‌ను సొంతం చేసుకోవడం మొదలు పెట్టాయి. పార్టీ అన్ని అంచెలలో బడుగుల నాయకత్వాన్ని ప్రోత్సహించాలె. దళితులు, ఆదివాసులు, వెనుకబడిన తరగతుల నుంచి ఆశించిన మేర నాయకత్వం ఎదగడానికి తగిన వ్యూహాలు రూపొందించాలె. తెలంగాణ పునర్నిర్మాణం కోసం టీఆర్‌ఎస్ అనుసరించదలుచుకున్న సామాజిక విధానాన్ని, ఆర్థిక విధానాన్ని గ్రామ స్థాయిలో ప్రచారం చేస్తేనే, ప్రజలు తదనుగుణంగా సమాయత్తమవుతారు. ఇవన్నీ ఒక్క రోజులో సాధ్యపడక పోవచ్చు. కానీ భావి తెలంగాణకు పునాదులు ఉద్యమ దశలోనే పడతాయనే స్పృహ కలిగి ఉండాలె.


Namasete Telangana News Paper Dated: 27/04/2012 


No comments:

Post a Comment