Friday, April 27, 2012

ఆహారమూ అస్తిత్వ చిహ్నమే - డాక్టర్ ఆర్.అఖిలేశ్వరి



ఇతరులపై పెత్తనం చేయడం అధికారాన్ని చెలాయించే పద్ధతులలో ఒకటి. నియంత్రించడం, పెత్తనం చేసే విధానాల్లో ఒకటి. మంచి-చెడుల విచక్షణకు సంబంధించిన పరాయి సంస్కృతీ విలువలను రుద్దడం నియంత్రించే మార్గాలలో ఒకటి. మీ విలువలు సరైనవి కావని, అవి సంస్కారయుతమైనవి కావని చెప్పడం ఇతరులు తమ విలువలను మీపై రుద్దే విధానాలలో ఒకటి. మీరు నిండుగా విశ్వసించే విలువలను పదే పదే కించపరిచినప్పుడు మీ ప్రతిస్పందన ఎలా ఉంటుంది? నిజమే సుమా! 

మన విలువలు అంత సమున్నతమైనవి కావు, మనం తక్కువ స్థాయి వాళ్ళమే అన్న ఆత్మన్యూనతా భావానికి లోనుకావడం పరిపాటి. ఇటువంటి మానసిక బానిసత్వానికి చరిత్రలో చాలా ఉదాహరణలు ఉన్నాయి. మానవాళి చరిత్రలో మొదటి బానిస మహిళే. శ్వేత జాతీయులు నల్లవారిని బానిసలను చేసుకున్నారు. పాశ్చాత్య దేశాలు ప్రాచ్య దేశాలను తమ వలసలుగా చేసుకున్నా యి. ఉత్తర అమెరికాలో మూలవాసులను శ్వేతజాతి అమెరికన్లు తమ బానిసలను చేసుకున్నారు. యూరోపియన్లు ఆఫ్రికా ప్రజలను తమ పాలితులను చేసుకున్నారు. బ్రాహ్మణులు శూద్ర వర్గాలపై పూర్తి పెత్తనం చేశారు; ఈ బ్రాహ్మణ ఆధిపత్యానికి సంపూర్ణ బాధితులు దళితులు. 

ప్రకృతిని, మర్త్యులైన మానవులకు ప్రకృతి ప్రసాదించిన కానుకలను చాలా పవిత్రమైనవిగా హిందూ సంప్రదాయం భావిస్తుంది. అయితే మన మనుగడకు అవి చాలా అవసరం. కనుక వాటిని మనం నిజమైన హిందూ లేదా ప్రాచ్య ప్రపంచ పద్ధతులలో ఉపయోగించుకుంటాం. అంటే ప్రకృతి వనరులను అతిగా వినియోగించుకోవడంగానీ, దుర్వినియోగం చేయడం గానీ చేయ ము. చెట్లు పవిత్రమైనవే. అయితే మన అవసరాలకు వాటిని నరికి వేస్తాం; పర్వతాలు పవిత్రమైనవే. గ్రానైట్‌కు, రాళ్ళకు వాటిని పగులగొడతాం. 

నదులు పవిత్రమైనవే. మనకు అవసరంలేని వాటిని పారవేయడానికి వాటి ని ఉపయోగించుకుంటాం. సర్పాలను పూజిస్తాం, మన ప్రాణాలకు ముప్పుగా పరిణమించినప్పుడు వాటిని చం పడానికి వెనుకాడం. మనిషి అనేక జంతువులను మచ్చిక చేసుకొని పనికి, ప్రయాణానికి, రక్షణకు, ఆహారానికి ఉపయోగించుకొంటున్నాడు. మరో విధంగా చూస్తే హిందూ సమాజం నిస్సంకోచంగా నయవంచనకు పాల్పడుతుం ది; ద్వంద్వ ప్రమాణాలను అనుసరిస్తుంది. స్త్రీ దేవతలు ఎందరో! భక్తి ప్రపత్తులతో వారిని నిత్యం ఆరాధిస్తారు. అయితే మహిళలను చీమలు, నల్లులుగా చంపేస్తారు! 

మన పూర్వీకుల ఆహార సంస్కృతిలో ఎద్దు మాంసం ప్రధాన భాగంగా ఉండేదనడానికి చాలా రుజువులు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వివిధ నాగరికతల్లో ఎద్దు మాంసాన్ని ఎలా తినేవారో మన ప్రాచీనులూ ఎద్దు మాంసాన్ని అలానే తినేవారు. ఎద్దు మాంసం తినడమనేది గతంలోనూ ఉందని, అదేమీ కొత్త విషయం కాదని మనమేమీ వాదించనక్కర్లేదు. ఆ మాంసాహారం ఆమోదయోగ్యం కాదనే విషయాన్ని కూడా మనం ప్రస్తావించనక్కర్లేదు. భారతదేశంలో పేదలు, అణగారిన వర్గాల వారికి ఎద్దు మాంసం ప్రధాన మాంసాహారమని, అదే వారికి పుష్టినిచ్చే ప్రధాన ఆహారమనడానికి సహేతుకమైన కారణాలు ఉన్నాయి. 

అయితే తమకు పౌష్టికాహారంగా ఉన్న ఎద్దు మాంసాన్ని తింటున్నందుకు ఆ వర్గాల వారిని సమాజంలోని స్వల్ప సంఖ్యాకులైన ఆధిపత్య వర్గాలవారు చాలా చిన్న చూపు చూశారు. మరింత స్పష్టంగా చెప్పాలంటే నీచ మానవులుగా పరిగణించారు. గోవును బతికి ఉన్నప్పుడు పవిత్ర జంతువుగా పరిగణించి, అది చనిపోతే పూర్తిగా అవాంఛనీయమైనదిగా భావించడం ఒక విచిత్ర విషయం. చనిపోయిన గోవు చర్మాన్ని ఒలిచి పాదరక్షలుగా చేయడం మొదలైన కార్యకలాపాలను 'అపవిత్రమైనవి'గా భావించి అటువంటి పనులు చేసే వారిని 'అంటరానివారు'గా హిందూ సమాజం పరిగణించింది. 

శతాబ్దాలుగా ఒక అల్ప సంఖ్యాక వర్గం వారు మాంసం ముఖ్యంగా ఎద్దు మాంసాన్ని తినే వారిపై తమ విలువలను రుద్దారు. తమ సొంత ఆధిక్యత, దళితుల న్యూనత గురించి కట్టుకథలు సృష్టించి ప్రచారం చేయడంతో పాటు బ్రాహ్మణులు, ఇతర ఉన్నత కులాలలోని వారి మద్దతుదారులు ఆహారాన్ని ముఖ్యంగా ఎద్దు మాంసాన్ని ఒక అణచివేత సాధనంగా ఉపయోగించుకున్నారు. దళితులు తినే ఆహారంపై 'మురికి లేదా మలిన' ఆహారంగా ముద్ర వేసి, దాన్ని తినేవారిని అంటరానివారుగా పరిగణించారు. ప్రపంచంలో ఏ అణగారిన వర్గ ప్రజల చరిత్రలోనూ ఇటువంటి అమానుషం కనపడదు. 

ప్రపంచంలోనే అతిపెద్ద, చాలా శక్తిమంతమైన ప్రజాస్వామ్య వ్యవస్థలలో ఒకటిగా చెప్పుకొంటున్న మన దేశం లో ఈ సాంస్కృతిక వలసవాదం ఇంకెంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. మన సంస్కృతి స్వరూప స్వభావాలను వ్యక్తం చేసే వాటిలో ఆహారం చాలా ముఖ్యమైనదే గాక అది చాలా వైయక్తికమైన, సున్నితమైన అంశ మూ కూడా. అది ఒక అస్తిత్వ చిహ్నం. దానిని అగౌరవపరచడానికి వీలులేదు. ఒక సామాజిక వర్గం ప్రజల ఆహార సంస్కృతిని కించపరుస్తూ వారిపై మీ ఆహార అలవాట్లను రుద్దడం ముమ్మాటికీ వలసవాదమే. సంప్రదాయకంగా ఎద్దు మాంసాన్ని తినే సామాజిక వర్గాలకు, ఆ ఆహారాన్ని స్వేచ్ఛగా, బహిరంగంగా తినే హక్కును నిరాకరించడం పూర్తిగా సహించరాని విషయం. మనం గొప్ప గా చెప్పుకొనే సాంస్కృతిక వైవిధ్యం, బహుళ సంస్కృతు ల విలువలకు ఈ ఆహార అసహనం పూర్తిగా వ్యతిరేకం. 

కనుకనే ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని దళిత, బహుజన విద్యార్థులు తమ సంప్రదాయ ఆహారాన్ని తినడంలో తమకు గల హక్కును బహిరంగంగా ప్రకటించారు. గతంలో హైదరాబాద్‌లోని వివిధ విశ్వవిద్యాలయాలలో దళిత విద్యార్థులు తమ ఆహార హక్కులను చాటడానికి చేసిన ప్రయత్నాలను ఛాందసవాదులు ప్రతిఘటించారు. గత ఏడాది 'ఇంగ్లీషు, విదేశీ భాషల విశ్వవిద్యాలయం'లో జరిగిన ప్రయత్నాలను విఫలం చేశారు. కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని విద్యార్థులు గత కొద్ది సంవత్సరాలుగా పెద్దకూర పండుగను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఉస్మానియా విశ్వవిద్యాలయం దళిత విద్యార్థులూ అదే బాటలో పయనిస్తున్నారు. దళితులు తమ ఆహార హక్కును తిరిగి సాధించుకోవడానికి జరిపే సుదీర్ఘ పోరాటంలో ఇది మొదటి అడుగు మాత్రమే. 

ఎట్టకేలకు విద్యావంతులైన యువ దళితులు సాంస్కృతిక గుత్తాధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడగలుగుతున్నారు. తమను తమ సంస్కృతి నుంచి దూరం చేసే ప్రయత్నాలను అడ్డుకుంటున్నారు. ఎద్దుకూరను బహిరంగంగా తినడం ద్వారా తమ అస్తిత్వాన్ని సగర్వంగా చాటుకున్నారు. తమ ఆహార హక్కు గురించి వారు చేస్తున్న డిమాండ్ న్యాయబద్ధమైనది. దానిని అందరూ గౌరవించాలి. దేశవ్యాప్తంగా విద్యార్థి వసతి గృహాలన్నిటిలోనూ దళిత విద్యార్థుల ఆహార అలవాట్లను గౌరవించి, వాటికి సముచిత ప్రాధాన్యమివ్వాలి. 

- డాక్టర్ ఆర్.అఖిలేశ్వరి
జర్నలిస్ట్, విద్యా వేత్త
Andhra Jyothi News Paper Dated : 28/04/2012 

No comments:

Post a Comment