Thursday, April 26, 2012

కవిత్వం లాంటి జీవితం - కార్తీక్ నవయాన్



సత్యమూర్తిని నిజాయితీగా అర్థం చేసుకోగలిగితే అతను కవులకు మహాకవిగా అర్థం అవుతాడు; విప్లవకారులకు గొప్ప విప్లవ నాయకుడుగా అర్థం అవుతాడు. పేదలకు అతనొక మహా పేదవాడుగా అర్థం అవుతాడు. తత్వవేత్తలకు అతనొక గొప్ప తాత్వికుడు. ఒక రచయితను అర్థం చేసుకోవాలంటే అతని రచనలను అర్థం చేసుకుంటే సరిపోతుంది. సత్యమూర్తిని అర్థం చేసుకోవాలంటే అతని రచనలతో పాటు అతని బ్రతుకును కూడా అర్థం చేసుకోవాలి. 

సాంప్రదాయ అగ్రకుల మధ్యతరగతి విప్లవ నాయకులకు, విప్లవ కవులకు ఉన్నటువంటి అనేకానేక సౌకర్యాలకు సత్యమూర్తి దూరంగా ఉన్నాడు. అతను వాటిని పొందలేక కాదు, కల్పించుకోలేక కాదు. అతను దేనికోసం రాసాడో దానికోసమే బ్రతికాడు. సత్యమూర్తి కవిత్వానికి బ్రతుకుకు మధ్య Contradiction లేదు. విప్లకారుడిగా మారిన తర్వాత అతని జీవిత కాలంలో కేవలం గత మూడు సంవత్సరాలే అంటే తన చివరి రోజులు, తను వదిలి వెళ్ళిన పిల్లల దగ్గర గడిపాడు. 

2009 వరకు ఏదో ఒక కార్యక్రమంలో ఎవరో ఒకరితో తిరుగుతూనే ఉన్నాడు. ప్రధానంగా తెలంగాణ ప్రాంతంలో ఇప్పటికీ ఉన్న తన అభిమానుల వెంటనే ఉండేందుకు ఆసక్తి చూపించేవాడు. ఇక్కడికి వచ్చిన సమయంలో ఆరోగ్య సంబంధమైన సమస్యలు వచ్చి తన కూతురుతో తిట్లు తింటూ కూడా ఇక్కడే గడిపిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అతనిది కవిలాంటి జీవితం కాదు కవిత్వం లాంటి జీవితం. అతని కవిత్వాన్ని జీవితాన్ని వేరువేరుగా చూడలేము. అతను ఏ సిద్ధాంతాలు, ఏ రాజకీయాలు నమ్ముకున్నాడో వాటితోనే కాదు అతను ఏ ప్రజలను నమ్ముకున్నాడో జీవితాంతం అదే ప్రజల మధ్య, అదే పేదల మధ్య బ్రతికాడు. అదే ఇతర కవులకు, సత్యమూర్తికి ఉన్న తేడా. 

సత్యమూర్తితో కలిసి గడిపిన వారు ఎవరైనా ఆ జ్ఞాపకాలను మరిచిపోలేరు. అతని మాటలు, మనం సమస్యలనుకునే వాటిని అతను చూసే దృష్టి చాలా భిన్నంగా ప్రత్యేకంగా ఉండేవి. మనం చిన్న చిన్న విషయాలు అనుకునే విషయాల పట్ల కూడా సత్యమూర్తికి చాలా స్పష్టమైన ఖచ్చితమైన అభిప్రాయాలూ ఉండేవి. ఎంత గంభీరమైన వ్యక్తో అంత హాస్యంగా కూడా ఉండేవాడు. సత్యమూర్తి హైదరాబాద్‌లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు నా రూమ్‌లో ఉండేవాడు. ఒకసారి నాకు కావాల్సిన భార్య మా కోసం సీతాఫల పండ్లు తీసుకొచ్చింది. సత్యమూర్తి ఏంటి బాబు అవి అని అడిగాడు, సీతాఫల పండ్లు అని చెప్పాను. ఎవరు తీసుకొచ్చారు అని అడిగాడు. విజయ తీసుకొచ్చిందని చెప్పాను. విజయ తీసుకొస్తే సీతా ఫలములు అంటావేమిటి బాబు అవి విజయ ఫలాలు అన్నాడు. 

సత్యమూర్తి తన 75 సంవత్సరాల వయస్సులో కూడా అజ్ఞాత జీవితం గడిపాడు. అజ్ఞాత జీవితం అంటే హైదరాబాద్‌లోనో బెంగుళూరులోనో కాదు. ఖమ్మం, వరంగల్ జిల్లా అడవుల్లో 2000-2002 సంవత్సరాల మధ్య దాదాపు ఆరు నెలల కాలం అడవిలోనే గడిపాడు. చాలా మంది యువకులకు స్ఫూర్తినిచ్చాడు. అసలు ఆ వయసులో అడవిలోనికి వెళ్ళాలనే ఆలోచనే ఎవరి ఆలోచనలకు అందనిది. అది కేవలం సత్యమూర్తికే సాధ్యం. 

ఒకసారి ఖమ్మం అడవి నుంచి సత్యమూర్తితో కలిసి వస్తుండగా ఒక ప్రశ్న అడగాలనిపించి అడిగాను. అప్పుడు నా దగ్గర పదివేల రూపాయలు సత్యమూర్తి దగ్గర ఇరవై వేల రూపాయలు ఉన్నాయి. నేను ఇలా అడిగాను. 'సర్ ఒక వేళ పోలీసులు మనల్ని పట్టుకుంటే నేను స్టూడెంట్ నని చెపుతాను నా దగ్గర గుర్తింపు కార్డు ఉంది, వారు నా దగ్గరి డబ్బుల గురించి అడిగితే నేను స్టూడెంట్ కాబట్టి ఫీజులు అవి ఖర్చులు ఉంటాయని తీసుకెళ్తున్నానని చెబుతాను. మరి మీరేమి చెపుతారు?'. అపుడు సత్యమూర్తి 'ఒకవేళ పోలీసులు నా దగ్గరి డబ్బుల గురించి అడిగితే ఈ డబ్బులు నావే మీకు కావాలా అని అడుగుతాను' వారికి కావాలంటే యిచ్చేస్తానని అన్నాడు. 

సత్యమూర్తిని లెక్క కట్టేసారు, అతను శ్రీశ్రీ తర్వాత అని లెక్కేసారు. దానికి కొలమానము ఏమిటో? నిజానికి సత్యమూర్తికి ఎవరితో పోలిక సరికాదు. అతను ఎవరి తరువాత కాదు. అతనికి అతనే సాటి. యిక్కడి విప్లవ కవులు అందరూ సత్యమూర్తి ద్వారా స్ఫూర్తి పొందినవారే. సత్యమూర్తి కేవలం కవి మాత్రమే కాదు అతను పూర్తి కాలం సామాజిక విప్లవ నాయకుడు. 

అతను కవిత్వం మాత్రమే రాయలేదు. కవిత్వం సత్యమూర్తికి తన విప్లవ ఆచరణలో భాగమే ఆ విధంగా చూసినపుడు సత్యమూర్తిని ఏ మాత్రం ఆచరణ లేని ఇతర కవులతో పోల్చడం అన్యాయం. కేవలం కవిత్వం మాత్రమే కాదు సత్యమూర్తి బ్రతుకుని గురించి మాట్లాడండి. ఇతర కవుల బ్రతుకులు ఏమిటో ఎలా బ్రతుకుతున్నారో చూడండి. అందుకని పోలికలు వద్దు. సత్యమూర్తి విప్లవ కవిత్వమైనా, దళిత కవిత్వమైనా, విప్లవోద్యమమైనా, దళితోద్యమమైనా అగ్రశ్రేణిలో ఉంటాడు. అది సైద్ధాంతికమైనా ఆచరణ రీత్యానైనా సత్యమూర్తి సత్యమూర్తే.

దళిత శ్రేణులు కూడా విప్లవ శ్రేణుల లాగా సత్యమూర్తిని నిర్లక్ష్యం చేసాయి. విప్లవోద్యమానికి దళితోద్యమానికి సత్యమూర్తి చేసిన సేవలు కొలమానం లేనివి, సత్యమూర్తి దళిత ఉద్యమానికి చేసిన... ప్రస్తుత దళిత నాయకులకు అర్థమైనా సరే మౌనంగానే ఉన్నారు. ఈ పరిధుల నుంచి విప్లవోద్యమం, దళితోద్యమం బయటపడాల్సిన అవసరం ఉంది. విప్లవోద్యమానికి తర్వాత దళితోద్యమానికి సత్యమూర్తి తన జీవితాన్ని అంకితం చేశాడు. పేదలు, దళితులు, పీడితులు, అణచబడిన జన గణాలు సత్యమూర్తి ఆలియాస్ శివసాగర్‌ని అనునిత్యం తలచుకుంటారు.

- కార్తీక్ నవయాన్
Andhra Jyothi News Paper Dated : 27/04/2012 

No comments:

Post a Comment