Tuesday, July 17, 2012

పోరాటాల ‘మునుం’బట్టిన తెలంగాణ--డాక్టర్ కాసుల లింగాడ్డి

కాశెవోసి కొంగుబిగించి కొడవలి చేతవట్టి తెలంగాణ కోతల ‘మునుం’ పట్టింది. ఇది తెలంగాణను సమెక్యవాద ముసుగు లో దోచుకుంటున్న సీమాంధ్ర పెట్టుబడిదారుల, పాలకవర్గాల ఆధిపత్య అహంకారాలమీద, తెలంగాణ పాలకవర్గాల దళారీతనంమీద పట్టిన కోతల మునుం.ఈ మునుం మూడు భిన్న కథల్లో కొనసాగింది. పొలం చదును చేసి, బిగిసిపోయిన కొయ్యకాళ్ల నూడబెరికి వ్యవసాయ యోగ్యం చేయడానికి సాగిన కాలం ఒక కథ. కన్నీళ్ళు, వేదన, నిస్సహాయతల కాలం అది. మునుం పట్టి నాట్లువేసి, నీరుపోసి పంటను పెంచి న కాలం రెండవ కథ. ఈ కథ ప్రధానంగా తెలంగాణ పురావైభవాన్ని, చారివూతక, సాంస్కృతిక ఔన్నత్యాన్ని ఎత్తిపట్టిన కాలం. ఇక చివరి కథ పోరాటాల మునుం కాలం.
భూస్వామ్య ఆస్తి సంబంధాలను ధ్వంసంచేసి, శ్రమను విముక్తంచేసి మార్కెట్టును వ్యాప్తిచేస్తూ పెట్టుబడి శ్రమల మధ్యవున్న సంబంధాన్ని నిరంతరంగా వృద్ధిచేస్తూ వుండే రాజకీయార్థిక నిర్మాణాన్ని పెట్టుబడిదారీ విధానం అంటున్నం. పెట్టుబడిదారీ వర్గం పెరుగుతున్న క్రమంలో, పోటీకూడ పెరిగిన ఫలితంగా మార్కెట్టు మరింత వ్యాపించి భూస్వామ్య సంబంధాలను నిరంతరంగా ధ్వంసం చేయాలి. జాతిరాజ్యాలు బలంగా వుండడంవల్ల ఈ పరిణామం మొత్తం తన రక్షిత భౌగోళిక ప్రాంత పరిధిలోనే జరగాలి. ఇట్లా మార్కెట్టు కుంచితమైపోవడం ద్వారా లాభాలు తగ్గిపోవడం వల్ల పారిక్షిశామిక పెట్టుబడి వాణిజ్య పెట్టుబడిగా, ద్రవ్యపెట్టుబడిగా రూపాంతరం చెందింది. గుత్తాధిపత్య లక్షణాలు సమకూర్చుకున్న ద్రవ్యపెట్టుబడికి మరింత అదనపు విలువను పొందడానికి నూతనమ్కాట్ల వేట అవసరమైంది. పెట్టుబడి పూర్వవిధానాలు కలిగిన నూతన మార్కెట్లు పెట్టుబడి నిలదొక్కుకోవడానికి, బలపడడానికి కావాల్సిన అన్ని వసతులు సమకూర్చాయి. చౌక శ్రమ, అసాంఘిక నిర్మాణం లో వ్యాపారం, సరుకులు అమ్ముకోగలగడం ముడిసరుకుల వెలికితీత, ద్రవ్య స్పెక్యులేషన్, పెట్టుబడులుపెట్టే అవకాశం కల్పించాయి. పెట్టుబడిపూర్వ సమాజంలో ప్రవేశించే అంతర్జాతీయ పెట్టుబడి శ్రమశక్తి, ఉత్పత్తి సాధనాలలో మార్పుల ద్వారా కాకుండా, ఉత్పత్తి విధానంలోని మార్పులతో సంబంధంలేని కొత ్తసరుకులను ప్రవేశపెట్టింది. ఉత్పత్తుల ప్రక్రియ కంటె చెలామణి ద్వారా మిగులు పోగుచేసుకోవడానికి సిద్ధపడడం వల్ల అది స్థానిక పాలకవర్గంతో సహజీవనం చేయవలిసి వచ్చింది.
భూస్వామ్య వ్యవస్థను కూలదోయకుండా దానితో రాజీ కుదుర్చుకుంది. ఉత్పత్తిశక్తులు, ఉత్పత్తి సంబంధాలు ఈ రెండు వ్యవస్థల లక్షణాలు కలిగివుండి, భూస్వామ్య వ్యవస్థ ఉపరితలం బలోపేతమైంది. అంతర్జాతీయంగా మరింత విస్తరించింది. ఇదే మన దేశంలోనూ, రాష్ట్రంలోనూ కొనసాగుతున్న అర్ధవలస, అర్ధభూస్వామ్య వ్యవస్థ. తొంభయవ దశకం ఆరంభం నుంచి భారత వూపభుత్వం సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణలతో నయా ఉదారవాద ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టింది. మార్కెట్టు వృది ్ధకోసం, ఎగుమతుల వృద్ధి కోసం సామ్రాజ్యవాద దేశాలు మన దేశంమీద రుద్దిన ప్రక్రియ ఇది. భారతదేశంలో దోపిడీ కొనసాగించడానికి, యథాతథ స్థితిని కొనసాగించడానికి భూస్వామ్యానికి, సామ్రాజ్యవాదంతో వున్న మైత్రి వల్ల ఏ ఆటంకం లేకుండా ఈ ప్రక్రియ మనమీద రుద్దబడింది. పర్యవసానంగా బహుళజాతి సంస్థలతో కలిసి భూస్వాము లు, ధనిక రైతులు చిన్న, సన్నకారు రైతుల నుంచి భూముల్ని హస్తగతంచేసుకొని వాళ్ళను రైతుకూలీలుగా మార్చారు. వీళ్ళు ఆ భూముల్లో అధిక భాగాన్ని పడావు పెట్టడం వల్ల, వాణిజ్య పంటలకు వినియోగించడం వల్ల దేశంలో ఆహార కొరత ఏర్పడి ధరలు ఆకాశాన్ని అంటాయి. స్థూల జాతీయఉత్పత్తిలో వ్యవసాయోత్పత్తి 1980లో 39శాతం వుంటే, 2010 నాటికి అది 15 శాతానికి పడిపోయింది. ఆ రకంగా వ్యవసాయం మీద ఆధారపడిన గ్రామీణ చేతివృత్తులు మొత్తంగా ధ్వంసమైనవి. ఇట్లా లక్షలాది ప్రజలు తమ భూముల నుండి, వృత్తినుండి, నైపుణ్యం నుండి విడుదల చేయబడి నిరుద్యోగులుగా మిగిలారు. అట్లా ఒక అసంఖ్యాకమెన రిజర్వుడ్ పారిక్షిశామిక సైన్యం ఏర్పడింది. దేశీయంగా పెట్టుబడిదారీ వ్యవస్థ అభివృద్ధి చెందకపోవడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ కలగాపులగపు వ్యవస్థలో దానికవసరమైన నైపుణ్యంలేని కారణంగా జీవనోపాధి దొరకక ఈ ప్రజలు సమాజపు అట్టడుగు పొరల్లోకి ఇంకిపోయారు. దాని పర్యవసానమే మితిమీరిన పట్టణీకరణ. దాని పర్యవసానమే అసంఖ్యాకమెన రైతుల, రైతుకూలీల ఆత్మహత్యలు. ఇట్లాంటి సామాజిక భౌతిక పరిస్థితుల్లో తెలంగాణ అస్తిత్వ ఉద్య మం తలెత్తితే, దాన్ని ఒకాయనకు మంత్రి రాకపోవడం వల్లనో, మరొకాయనకు రెండవసారి వీసీ పదవి రాకపోవడంవల్లనో మొదలైన ఉద్యమంగా చూడడమంటే వ్యక్తివాద, భావవాద ధృక్పథమే.

రెండు అసమ సమాజాల్ని బలవంతం గా కలపడం వలన పాశ్చాత్య పెట్టుబడిదారుల పాలనలో వున్న సీమాంవూధులు అమాయక తెలంగాణ ప్రజలను అన్నివిధాల దోచుకోవడం మొదపూంది.‘ఢిల్లీపెత్తనానికి సీమాంధ్ర పెత్తందార్లకు పుట్టిన అక్రమ సంతానం ఆంధ్రవూపదేశ్’’ (ఉదయమిత్ర) పెద్దమనుషుల ఒప్పందాన్ని, తెలంగాణ రీజనల్ కమిటీని తుంగలో తొక్కి వేల ఎకరాల భూముల్ని కబ్జా చేసుకున్నరుపాజెక్టుల్లో భూములు కోల్పోయిన వాళ్ళు కూలీలుగా మారితే, నీటివూపవాహాలకు ఎదుక్కి వచ్చిన సీమాంవూధులు భూ యజమానులైనరు.1983లో టీడీపీ అధికారంలోకి వచ్చినంక బాహాటంగానే హైదరాబాదు చుట్టుపక్కల వేలఎకరాల్ని కబ్జా చేసుకున్నరు. ఒక్క తెలంగాణలోనే కాదు ఒరిస్సాలోని హీరాకుడ్ ప్రాజెక్టుకింద కూడ వీళ్ళ నిర్వాకం ఇదే. అక్కడెనా, ఇక్కడెనా అక్రమంగా సంపద పోగు చేసుకోవడం, స్థానికులను ద్వితీయక్షిశేణి పౌరులు గా దిగజార్చడం, వారి వేష,భాషల్ని, సంస్కృతుల్ని అవహేళన చేయ డం, తద్వారా అణచివేతను కొనసాగించడం సీమాంధ్ర పెట్టుబడిదారుల నైజం. ఇట్లా నయావలసవాదం, అంతర్గత వలసవాదం దాని పెంపు డు బిడ్డ అయిన సామ్రాజ్యవాద సంస్కృతి తెలంగాణను పరాయీకరణకు గురిచేసింది. అందుకనే తెలంగాణ కవులు ఈ పరాయీకరణ విషపు కోరల్లో నేనొక్కన్నేనా?అని తమను తాము ప్రశ్నించుకున్నరు. విధ్వంసాన్ని వేదనతో వ్యక్తీకరించిండ్రు.‘నెలలు నిండని శిశువుల కన్న ప్రపంచీకరణ’ సోయి తోటే చేసింవూడని చెప్పలేం కాని, పరిణామాలను అర్థం చేసుకున్నరు.‘ఇంతచేస్తే!/రాళ్ళు జీల్చినోళ్ళకు గూళ్ళు లేవు ఇటుకలు చేసినోళ్ళకు ఇండ్లు లేవు/గొర్రెలుగాసినోళ్ళకు గొంగళ్ళు లేవు’ (రామగిరి శివకుమార శర్మ) ‘వెలుగుపంట దిగుబడి పెంచేందుకు పెంటగా మారిన పల్లెల’ దుస్థితిని చిత్రీకరించినరు(సదాశివుడు).‘మంచీచెడు అర్సుకోలేని సిమెంటు మనుషుల’ పట్నం నుంచి తమ వూరెల్తున్న కల కంటనే వున్నరు’(బెల్లి యాదయ్య).వ్యవసాయరంగం కుదేలవ్వడానికి కారణం తలాపున పారుతున్న గోదావరి, తెలంగాణ కాళ్ళ కడాలె చుట్టుకున్న కృష్ణ నీళ్ళను సీమాంవూధులు కుట్ర పూరితంగా దోచుకోవడం వల్లనేననే సోయి తెలంగాణ కవులకొచ్చింది. ‘భూమి బ్లాంక్ చెక్, నీళ్ళు విలువను రాస్తయ్ నీళ్ళు లేక కాదు, నీతిలేక బ్లాంక్ చెక్ నా తెలంగాణ’ (సుంకిడ్డి నారాయణడ్డి)‘కె.ఎల్.రావుకు నీళ్ళొదులుదాం తిలోదకాలతో సహా అతనొక కుట్రదారు’(అల్లం నారాయణ) ‘తలాపున నదులున్నాపొలాల నవ్వులు నగుబాటైన వైనం (ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్)‘సమక్షిగతకింద సాగుకాని చెలక’గా మిగిలిపోయిన తెలంగాణకు’తిండిగింజలు దొరకకపోవడం ఈ శతాబ్దపుకువూటగా గుర్తించింవూడు (బియ్యాల జనార్దన్ రావు). సామ్రాజ్యవాద సాంస్కృతిక దాడికి, అంతర్గత వలసవాదుల దాడికి పరాయీకరించబడ్డ తెలంగాణ తన అస్తిత్వాన్ని పలవరించింది. ‘భాష ఒక ముట్టిచ్చిన దీపం, భాష ఆత్మల అనుసంధానం ఆరాట పోరాట విరాట్ స్వరూపాల అమ్మలగన్నయమ్మ భాష యాసేడిది....తెలంగాణ ఒక జీవద్భాష’ (అల్లం నారాయణ) మరి అట్లాంటి భాషమీద మాట్లాడడానికి కూడ భయపడేంత హీనత్వాన్ని ఎట్లా రుద్దిండ్రు?’బందిపోట్లయినా బాగుండేది, సర్వసంపదలను ఒలిచియిచ్చి సంస్కృతినెనా దక్కించుకునేవాళ్ళం’ అన్నంత దీనస్థితికి ఎట్లా నెట్టింవూడు(జయధీర్ తిరుమలరావు).‘ఏ పదబంధ ప్రబంధంలోనూ నా యాసలేదు బాసలేదు
వాక్యం నా పలుకు వల్లించదు, అక్షరాల్లో నా నుడికార శబ్దంలేదు నా భాషనే ఆంబుక్క పెట్టిన నీవు జీవశ్వాస ను బంధిస్తున్న దేవేందర్).

ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రపంచీకరణ పడ తన్ను తాను ఆంధ్రవూపదేశ్‌కు సీయీవోగా ప్రకటించుకున్న చంద్రబాబు విజన్2020 అంటూ అభివృద్ధి నమూనాను దిగుమతి చేసుకుండు. భారీవూపాజెక్టులు,అంతర్జాతీయ విమానాక్షిశయా లు, ఆరులేన్ల రోడ్లు, తృతీయ ఆర్థికరంగమైన సేవారంగపు అసమానవృద్ధి అభివృద్ధికి చిహ్నాలుగా చెప్పుకున్నడు. ఆర్థిక ప్రథమ రంగమైన వ్యవసాయం పనికిరాదని తూలనాడిండు. ఉత్పత్తితో ప్రత్యక్ష సంబంధం లేకుండా డబ్బు సంపాదించవచ్చనే భావజాలాన్ని పెంచిపోషించిండు (స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్‌లా గా). అభివృద్ధి అంటే ఒక సమాజంలోని ప్రజ లు ఎదుర్కొనే సమస్యలకు సమాధానం వెతికే క్రమం కాక, అభివృద్ధి చెందిన దేశాలలోని కార్యక్షికమాల అనుకరణే అభివృద్ధిగా చిత్రించిం డు. మార్క్సిస్టు శాస్త్రీయ అవగాహన ప్రకారం నిర్మాణం-విధ్వంసం అభివృద్ధికి విడదీయలేని రెండు పార్శ్వాలు. విధ్వంసంలో విస్థాపనకు గురైన ప్రజలు నిర్మాణంలో ఇమిడిపోయినప్పుడే అది అభివృద్ధి అవుతుంది. కాని తెలంగాణలో అట్లా జరుగలేదు. ప్రాజెక్టులకోసమో, సెజ్‌ల కోసమో భూముల్నుంచి బేదఖల్ చేయబడ్డవాళ్ళు రోజు కూలీలుగా మారిండ్రు. వృత్తుల నుంచి విస్థాపనకు గురైనవాళ్ళు పట్టణంలో అడ్డాకూలీలుగా, బిచ్చగాళ్ళుగా మారిండ్రు. కొండొకచో విప్లవీకరించబడ్డరు. కొన్నిచోట్ల సంఘ వివూదోహ శక్తులుగా మార్చబడ్డరు.ఈ క్రమాన్ని మన కవులు సరిగ్గానే ఒడిసి పట్టుకున్నరు.‘తెలంగాణ పల్లెకు సర్కారికి వొక బ్యారం కుదరని యాపారం’ నడుస్తుందనే విషయాన్ని గమనిస్తనే వున్నరు(వడ్డెబోయిన శ్రీనివాస్). ‘ప్రాంతేతరునికే నల్లబంగారం, గని సంపదను దోచుకెళ్ళడం, మోసుకెళ్ళడమే ఆధునిక రాజ్యంలో అసలైన అభివృద్ధి’గా చెలామణీ అవుతున్న వైనాన్ని గుర్తిస్తనే వున్నరు (పిట్టల రవీందర్).

కన్నీళ్ళు తుడుచుకొని, గోసి సరిచేసుకొని, గొంగడి భజాన వేసి అతా ర చేతవట్టింది తెలంగాణ. ‘భవూదకాళి చెరువు లో రుద్రమ దాచిన తల్వార్’ తడిమి చూసింది (జగన్‌డ్డి). హైదరాబాదును ఎకరాలు గా, గజాలుగా అమ్ముకుంటున్న నయా వలసపాలకులను తాలిబన్లుగా చిత్రిస్తూ ప్రేమవారధి పురావైభవాన్ని కవులు కీర్తిస్తున్నారు (లోకేశ్వర్). తనకు ‘సామాజిక ఉద్యమాల ఓనమాలు దిద్దించిందని’(ఎస్వీ సత్యనారాయణ),’ మొహంజాహి బంగారు పూలజడ’ (షాజహాన), ‘వేదనలు వైరుధ్యాలు ఎన్నివున్నా అనుబంధాల నగరమ’ని(లోచన్) హైదరాబాద్ వైభవాన్ని కీర్తిస్తనే వున్నరు.తెలంగాణలోని అనేక సాంస్కృతిక ప్రత్యేకతల్ని ఎత్తిపడుతున్నరు. ఏడుపాయల జాతరను(యం.డి.అహ్మద్),నిర్మల్ రంజన్‌లను (మునిమడుగుల రాజారావు),పాలమూర్‌లేబర్ ఓపికను(లింగాకారి మహేష్),ఆదిలాబాద్ అమాయకుల ఔన్నత్యాన్ని(అప్పాల చక్రధారి) గానం చేస్తున్నరు.‘బత్కుమీదికన్న మనిషిమీదికన్న మట్టిమీన్నే పావురం’ (సూటెంకి రవీంద్ర) అంటూ’ యుద్ధాన్ని నేర్పిన ఈ మట్టికి’(జూలూరు గౌరీశంకర్) ఘనమెన చరిత్ర వున్నదని చెప్తున్నరు.‘యుద్ధంలో రాలిపడిన బొడ్డుమల్లె లేత నవ్వులపై పూసిన సూర్యకిరణం నా తెలంగాణ’ (కాశీం) అని కీర్తిస్తున్నరు.పోరాటాల వారసత్వ ప్రతీకలైన సమ్మక్క, సారక్క, దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ, బందగీ, తుపూరేబాజ్‌ఖాన్, మగ్దూం,షోయబుల్లా ఖాన్, నల్లా ఆదిడ్డి, సంతోష్‌డ్డిలను గుర్తుచేసుకుంటున్నరు. తెలంగాణ సాంస్కృతిక ప్రతీకగా నిలిచిన బతుకమ్మ స్ఫూర్తిని గానం చేస్తున్నరు.

ఈ పుష్కర కవిత్వంలో తెలంగాణ గ్రామీణ భాషను, నుడికారాన్ని కవులు ప్రతిభావంతంగా వాడుకున్నరు. హైదరాబాద్‌లో స్థిరపడ్డవాళ్ళకంటె చిన్నపట్టణాలో ్లవున్న కవులే ఈ పని ఎక్కువగా చేసిండ్రు. సీమాం ధ్ర కవులు సంఘీభావంగా రాసిన కవిత్వమూ ఇందులో ఉంది. సీమాం ధ్ర దళిత కవులు, విరసం మిత్రులు తప్ప మిగిలినవారు మనస్ఫూర్తిగా తెలంగాణ ఉద్యమాన్ని సపోర్టు చేస్తున్నారా? చేస్తే ఉద్యమంలో భాగస్వాములు కావాలికదా!నోటితో పొగిడి నొసటితో వైఖరుల పట్ల తెలంగాణ అప్రమత్తంగా ఉండాలి. పోతే, కె.శ్రీనివాస్ ముందుమాటలో ‘ఆధునిక ప్రయోగశైలిలో, శిల్పంతో తెలంగాణవాద కవిత్వం రాయడం సాధ్యం కాదనిపిస్తుంది. అట్లా వచ్చిన కొన్నికవితలు సానుభూతిపరుపూన ప్రాంతేతరులు రాసిందే కావడం విశేషం’ అన్నాడు. ఈ వాక్యాలు ఒకదానికొకటి వైరుధ్యంగా వున్నయి. అతను చెప్పదలుచుకన్నదేమిటోబోధపడడంలేదు. అట్లే తెలంగాణలో మధ్యతరగతి ఒక శ్రేణి గా రూపుదిద్దుకోకపోవడం 1969లో అయితే కావచ్చుగాని, 2012లో ఆ పరిస్థితి ఉందనుకోను. మరింత చర్చ జరగాలి. ఇక సంపాదకుల ముందు మాటలో ‘1946 నుంచి ఎనిమిదేళ్ళుగా ప్రత్యేక రాష్ట్రంగా కొనసాగిన’ అని రాశారు. ఎంతగింజుకున్నా 1948 సెప్టెంబర్ 18నుంచి వెల్లోడి గవర్నర్‌గా కొనసాగిన కాలమనుకోవచ్చు కాని,1946 అయ్యే అవకాశం ఏ కోశాన లేదు. శిల్పరీత్యా పలుచనైన కవిత్వాన్ని ఇందులోంచి మినహాయిస్తేనే బాగుండేది. పుష్కరకాల కవిత్వాన్ని సంకలనం చేయడంలోని శ్రమని, పరిమితుల్ని గుర్తించి సంపాదకులను అభినందించాలె. తెలంగాణ ఉద్యమంలో ‘మునుం’ మైలురాయి.
-డాక్టర్ కాసుల లింగాడ్డి
సెల్: 9948900691

ఈ నేలమీది గొప్ప సాంస్కృతిక పోరాటం---పి. వరలక్ష్మి, విరసం కార్యదర్శి


ప్రముఖ చిలీ రచయిత ఏరియల్ డార్ఫ్‌మెన్ రాసిన ‘విడోస్’ నవలలో వెంటాడే మాటలు. 1942లో నాజీ దురాక్షికమణలో ఉన్న గ్రీసులోని ఒక గ్రామం నవలాస్థలం. ఆ గ్రామంలో ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నది తన ప్రవాహంతో తరచుగా మనుషుల శవాల్ని ఊళ్లోకి మోసుకొస్తుంది. గుర్తు పట్టడానికి ఆనవాలు చిక్కని ముఖాల తో ఉంటాయి ఆ నిర్జీవ దేహాలు. ‘గుర్తు తెలియని శవం’ ముద్ర పడే సి పోలీసులు వాటిని వదిలించుకుంటారు. వీరంతా తప్పకుండా ఎవరికో తండ్రులు, భర్తలు, సోదరులు, కొడుకులు అయ్యే ఉంటారు. కుటుంబసభ్యుల మధ్య సాదా సీదా జీవితం గడుపుతుండిన వారు. పొలాల్లో పనిచేస్తున్న వాళ్లు, భార్యాబిడ్డల కౌగిట్లో ఉన్న వాళ్లు హఠాత్తుగా మాయం చేయబడతారు. గుర్తు తెలియని శవంగా నదిలో కొట్టుకువస్తారు. అట్లా మాయమైన భర్తల కోసం, కొడుకుల కోసం ఆ ఊరి ఆడవాళ్లు నది ఒడ్డున ఎదురుచూసే బీభత్స విషాదం ‘విడోస్’. ఆ విషాదం నుంచే ఒకరోజు అలాంటి ఒక మృతదేహాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఆ ఊరి ఆడవాళ్లంతా పోలీస్‌స్టేషన్‌ను ముట్టడిస్తారు. పోలీసులు ఇతను ఎవరికి సంబంధించినవాడో గుర్తుపడితే వారికి మాత్ర మే అప్పగిస్తామంటారు. అప్పుడా మహిళలు పై మాటలంటారు. మరణించిన వారికి గౌరవంగా అంతిమక్షికియలు జరపాల్సిన బాధ్యత బతికున్నవాళ్ల మీద ఉంటుందని వాళ్లు భావిస్తారు. ఇందులో సాంస్కృతి క అంశంతో పాటు ఫాసిజాన్ని ధిక్కరించిన పోరాటం ఉంది. ఇది ఒకరకంగా మన కథే. నక్సలైట్లనో, వారి సానుభూతిపరులనో తెలంగాణలో మాయం చేయబడి బతికి ఉన్నారో లేరో తెలియని వాళ్ల ‘మిస్సిం గ్’ అనుభవాల నుంచే ఈ నవల తెలుగులో ‘మిస్సింగ్’ అనే పేరుతో వచ్చింది.

‘విడోస్’ ఒక గ్రీకు గ్రామాన్ని దృశ్యమానం చేసినా రచయిత చిలీలో అలెండీని చంపి అధికారంలోకి వచ్చిన అమెరికా కీలుబొమ్మ పినోచెట్ సాగించిన మారణకాండను గురించి రాయాలనుకున్నాడు. అప్పటికే ఆయనతో సహా ఆయన రచనలూ నిషేధించబడి ఉన్నాయి. కనుక దీన్ని ఒక యూనివర్సల్ ట్రూత్‌గా చెప్పాలనుకుని స్థలకాలాలను మార్చాడు. ఆయనే చెప్పినట్టు ఇది ఇప్పుడు చిలీ, ఎల్‌సాల్వడార్, ఫిలిప్పీన్స్, దక్షిణావూఫికాల్లో జరుగుతుండవచ్చు. నిన్న ఇంకోచోట జరిగి ఉండవచ్చు. రేపు మరోచోట జరగవచ్చు. క్రీస్తు పూర్వం నాలుగో శతాబ్దంలో సొఫోక్లస్ రాసిన ‘యాన్‌టిగని’ నాటకంలో తిరుగుబాటుదారుడిగా చనిపోయిన తన సోదరుడి మృతదేహాన్ని పూడ్చకుండా యుద్ధక్షేవూతంలోనే జంతువులకు వదిలేసి శిక్షించిన థీబ్స్ (పురాతన ఈజిప్టు) రాజు శాసనాన్ని ధిక్కరించి అంత్యక్షికియలు నిర్వహించిన యాన్‌టిగనీలు చరిత్ర పొడవునా ఉన్నారు.

అట్లా మన నేల మీద నడుస్తున్న గొప్ప సాంస్కృతిక ఉద్యమం ఎన్‌కౌంటర్ మృతదేహాల స్వాధీన పోరాటంతో మొదలై రాజ్యహింస వ్యతిరేక పోరాటంగా కూడా కొనసాగుతున్న అమరుల బంధుమివూతుల సంఘమైంది. నేడు దశాబ్ది మహాసభలు జరుపుకుంటున్నది. నాయకుల మృతదేహాలను కట్టెలపై నగ్నంగా పడేసి కాల్చుతుండగా అడ్డుకున్న గద్దర్‌తో పాటు వివిధ సంఘాలు వారికి గౌరవంగా అంత్యక్షికియలు జరిగేలా చేశాయి. అప్పటి నుంచి వరుసగా జరిగిన బూటకపు ఎన్‌కౌంటర్లలో మరణించిన వారి మృతదేహాలు స్వాధీనం చేసుకోవడానికి పోరాటం-ఒక రకంగా నిర్బంధపు నిప్పుల కొలిమిలో తెలంగాణలో అలుముకున్న శ్మశాన నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టింది. వివిధ ప్రజా సంఘాలతో, సాహిత్య సాంస్కృతిక కార్యకర్తలతో ఎన్‌కౌంటర్ మృతదేహాల స్వాధీన కమిటీ ఏర్పడింది. ‘గుర్తు తెలియని ఎన్‌కౌంటర్ మృతదేహమై తే నాకివ్వండి..’ అంటూ వీవీ అద్భుతమైన కవిత రాశారు. ఈ నేపథ్యంలోనే గద్దర్‌పై 1997లో హత్యా ప్రయత్నం జరిగింది. ఇది నేపథ్యం. సమాజమార్పు కోసం తమ సర్వస్వాన్ని త్యాగం చేసిన అమరవీరుల స్ఫూర్తిని వారి బంధుమివూతులు ఎత్తిపడుతుంటే మరోవైపు మృతదేహాల పట్ల కూడా అత్యంత అమానవీయంగా ప్రవర్తించి రాజ్యం ప్రజల ఛీత్కారాన్ని ఎదుర్కొంటోంది.

మృతుల ఆచార వ్యవహారాలకు భిన్నంగా వారి శరీరాలను కడతేర్చడం కూడా ఫాసిస్టు పాలకుల అణచివేత రూపాల్లో ఒకటి. జోన్ ఆఫ్ ఆర్క్ వలె ప్రొటెస్టెంట్లను నిట్టనిలువునా కాల్చేసి బూడిదను వెదజల్లిన అప్పటి మతపెద్దల దగ్గరి నుంచి నిన్న లాడెన్ శవాన్ని సమువూదంలో పడేసిన సామ్రాజ్యవాదుల దాకా పాలకపక్షాలకు ఇదొక అణచివేత నీతి. దీన్ని ధిక్కరించడానికి ప్రజలు అనేక రూపాల్లో సమీకృతులయ్యారు. వివిధ విముక్తి ఉద్యమాల్లో నిర్దాక్షిణ్యంగా హత్యగావించబడుతున్న (ఈ హత్యలకు ఎటువంటి జవాబుదారీతనం ఉండదు) విప్లవకారుల భార్యలు, తల్లులు, రక్త బంధువులు శ్రీలంక, కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల వంటి అనేకచోట్ల కమిటీలుగా ఏర్పడుతున్నారు. 2002లో ఆవిర్భవించిన అమరుల బంధుమివూతుల సంఘం, బాధితుల సంఘంగా కాక కన్నీళ్లను తుడుచుకుంటూనే అమరుల ఆశయసాధన కోసం పిడికిపూత్తి నిలబడిన పోరాట సంఘంగా నిలిచింది. దానికదే ఒక ప్రత్యేకత. తెలుగు నేల మీది విప్లవోద్యమ వారసత్వపు ప్రత్యేకత. నేడు 10వ మహాసభలు జరుపుకుంటున్న అమరుల బంధుమివూతుల సంఘానికి ‘విరసం’ సంఘీభావం తెలియజేస్తున్నది.
-పి. వరలక్ష్మి, విరసం కార్యదర్శి

దళిత నెత్తురు నేర్పుతున్న పాఠాలు - దుడ్డు ప్రభాకర్

ఈ నిచ్చెనమెట్ల కుల వ్యవస్థలో తరతరాలుగా వెలివాడల్లో పశువులకంటే హీనంగా బతుకుతున్న దళితులు మనిషిగా గుర్తింపు కోసం చేసే చిన్న ప్రయత్నాన్ని కూడా అగ్రకుల మనువాద భూస్వామ్య పాలకవర్గాలు సహించలేకపోతున్నాయి. కారంచేడు, నీరుకొండ, పదిరికుప్పం, తిమ్మసముద్రం, చుండూరు, చీమకుర్తి, వేంపెంట, ప్యాపిలి, కల్వకోలు, పొట్టిలంక, లక్షింపేట లాంటి మారణహోమాలు సృష్టిస్తున్నారు. సామ్రాజ్యవాదులు, హిందూ మతోన్మాదులు, భూస్వామ్య పెత్తందారీ శక్తులు, పాలకులు కలిసి రూపుదిద్దుకున్న అభినవ మనువులు తిరుగాడుతున్న ఈ నేలమీద అంటరాని కులాల ప్రజలు వేసే ప్రతి అడుగూ నెత్తురు మడుగవుతుంది.

ప్రతి కదలికా నిషిద్ధమౌతుంది. అయినప్పటికీ హరించి వేయబడుతున్న హక్కుల సాధన కోసం వెలివాడలు ఉద్యమిస్తూనే ఉన్నాయి. ఆ క్రమంలో అగ్రకుల దురహంకారుల కత్తుల వేటకు తెగిపడిన ప్రతివీరుని తల అంటరాని వారి జీవన్మరణ పోరాటాలకు చిరుదివ్వెలుగా నిలుస్తున్నాయి. అత్యాచారానికి బలవుతున్న ప్రతి తల్లి, చెల్లి చేస్తున్న హాహాకారాలు ఉద్యమ శంఖారావాలుగా మారుతున్నాయి. ఆ ఉప్పెనల్ని చల్లార్చడానికి పాలకులు అనేక ఎత్తుగడలు అవలంభిస్తున్నారు. సామ్రాజ్యవాద ప్రపంచీకరణ నేపథ్యంలో సామాజిక సంబంధాలు వ్యక్తిగత సంబంధాలుగా, మానవ సంబంధాలు మార్కెట్ సంబంధాలుగా మారుతున్న వేళ సామాజిక, ఆర్థిక, రాజకీయ సమీకరణలు, సమ్మేళనాలు అతివేగంగా మారుతున్నాయి.

కారంచేడు నుంచి లక్షింపేట వరకు జరిగిన నరమేధాలు దళితులు ఉమ్మడిగా ఉద్యమించాల్సిన అవసరాన్ని, మిగిలిన పీడిత కులాల్ని కలుపుకొని పోరాడాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తున్నాయి. అందుకు భిన్నంగా సామాజిక సమీకరణాలు జరుగుతున్నాయి. అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరచిన రిజర్వేషన్ల ద్వారా రాజకీయరంగంలో వాటా పొంది పాలకవర్గంలో చేరిన ఎస్‌సి, ఎస్‌టిలు (పిడికెడు మందే అయినప్పటికీ) ఆయా కులాల, జాతుల ప్రజల చితుకుతున్న బతుకుల గురించి ఆలోచించడం మానేశారు. పైగా పాలకుల అంబుల పొదిలో అస్త్రంగా మారి పీడిత ప్రజల బతుకుల్ని, బతుకుదెరువుని చిన్నాభిన్నం చేస్తున్నారు.

పేదల సమాధులపై పెద్దలు భవనాలు నిర్మించుకునే విధంగా చట్టాలు తయారవుతుంటే నోరు మెదపడం లేదు. అభివృద్ధి పేరుతో జరుగుతున్న విధ్వంసంలో ఎస్‌సి, ఎస్‌టి, బిసిలు విలవిల్లాడుతున్నారు. మైదాన ప్రాంతాలలో పీడిత కులాల పేదలు సాగుచేసుకొని బతుకుతున్న కుంట, సెంటు అసైన్డ్ భూములను ఎలాంటి నష్టపరిహారం చెల్లించకుండా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని బహుళజాతి కంపెనీలకు కోట్లాది రూపాయలకు అమ్ముకుంది. ఆర్థిక మండళ్ళ పేరుతో లక్షలాది ఎకరాలలో విస్తరించి వున్న కార్పొరేట్ కంపెనీలు నయాభూస్వామ్య వర్గంగా అవతరించాయి. ఆ కంపెనీలే వ్యవసాయం చేసే విధంగా మన పాలకులు 'కార్పొరేట్ వ్యవసాయ' మంత్రం జపిస్తున్నారు. దళితులు చస్తే బొందబెట్టను ఆరడుగులు నేలలేని పరిస్థితులు నేడు ప్రతి పల్లెలో దర్శనమిస్తున్నాయి.

దళితులు పోరాడి సాధించుకున్న ఎస్‌సి, ఎస్‌టి అత్యాచారాల నిరోధక చట్టాన్ని అగ్రకుల పెత్తందార్లు, పోలీసులు తూట్లు పొడుస్తుంటే, దళిత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు నిమ్మకు నీరెత్తినట్లుంటున్నారు. అత్యాచారానికి గురైన దళితులు పోలీసుస్టేషన్‌కు వెళితే పోలీసులు కేసు నమోదు చెయ్యడం లేదు. కొన్ని ఉద్యమ సంస్థల ఒత్తిడి మేరకు కేసు రిజిష్టర్ చేసినా దళితులపై కౌంటర్ కేసులు నమోదు చేసి స్టేషన్లలోనే రాజీలు చేస్తున్నారు. దళితులపై జరుగుతున్న అత్యాచారాలలో కేవలం 30 శాతం మాత్రమే రిజిష్టర్ అవుతున్నాయి. పోలీసు పక్షపాత వైఖరి వల్ల కోర్టుల్లో కేసులు వీగిపోతున్నాయి.

ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద నమోదైన కేసుల్లో 80 శాతం కేసులు పెండింగ్‌లో వున్నాయని కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ పార్లమెంట్ స్థాయీ సంఘం ప్రకటించక తప్పలేదు. దేశవ్యాపితంగా నమోదైన కేసుల్లో ఆంధ్రప్రదేశ్ మూడవ స్థానంలో ఉంది. (రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ఒకటి రెండు స్థానాల్లో నిలిచాయి). ఎస్‌సి, ఎస్‌టి అత్యాచారాల నిరోధక చట్టం రూల్స్ 1995 ప్రకారం ప్రతి ఆరునెలలకొకసారి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో విజిలెన్స్, పర్యవేక్షణ కమిటీ రాష్ట్రస్థాయి సమావేశం జరగాలి.

ప్రతి మూడు నెలలకొకసారి కలెక్టర్, ఎస్‌పి, జిల్లా జడ్జి పర్యవేక్షణలో జిల్లా స్థాయి సమీక్షా సమావేశం జరగాలి. అలాంటి సమావేశాలు జరుగుతున్న దాఖలాలు కనిపించడం లేదు. ఓట్ల సమయంలో దళితులపై ప్రేమ కురిపిస్తూ ఇలాంటి సమావేశాలు నిర్వహించినప్పటికీ వాటి పట్ల దళితులకు భ్రమల్లేవు. ఎస్‌సి, ఎస్‌టి అత్యాచారాల నిరోధక చట్టాన్ని అత్యాచారం చేసిన వాళ్లే సమీక్షిస్తే ఫలితాలు ఎలా వుంటాయో ఈ 23 ఏళ్ళలో దళితులు బాగానే అర్థం చేసుకున్నారు.

ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ నేపథ్యంలో కుల వృత్తులు ధ్వంసమై బిసిలు పొట్ట చేతపట్టుకొని పట్టణాలకు నగరాలకు వలస వెళుతున్నారు. నగరాలలోని ప్రభుత్వ సంస్థలు మూతబడి కార్మికులు అడ్డా కూలీలుగా మారుతున్నారు. నానాటికీ నిరుద్యోగం, పేదరికం పెరిగిపోతుంది. నగరాలు మురికివాడలుగా మారి కిక్కిరిసి పోతుంటే నగరశివారుల్లో ఆకాశాన్నంటే భవనాలు అధునాతన వసతులతో హైటెక్ సిటీలు వెలుస్తున్నాయి. కోస్టల్ కారిడార్ పేరుతో సముద్ర తీరాన్ని కూడా కార్పొరేట్ సంస్థలు ఆక్రమించాయి.

తీరం పొడవునా స్టీల్ ప్లాంట్‌లు, షిప్ యార్డులు, ఓడరేవులు, థర్మల్ పవర్ ప్లాంట్‌లు, విషవాయువుల్ని వెదజల్లే రసాయన పరిశ్రమలు వెలుస్తున్నాయి. అరకొర పునరావాసంతో మత్స్యకారుల గ్రామాలు సముద్రానికి దూరంగా విసిరి వేయబడుతున్నాయి. తమ సాంప్రదాయ వృత్తిని కోల్పోయిన మత్స్యకారులు ఆకలితో అలమటిస్తున్నారు. కార్పొరేట్ రంగం విస్తరించే క్రమంలో పీడిత కులాల్లోని పేదలు ఒక చోటు నుంచి మరో చోటుకి తరిమివేయబడుతున్నారు. అతి కొద్ది కాలంలోనే ఎక్కడా నిలవలేని పరిస్థితులు రాబోతున్నాయి.

అడవుల్లో వుండే ఆదివాసులే గాక మైదాన ప్రాంతాల్లో వుండే పేదలు కూడా జీవన్మరణ పోరాటాలకు సిద్ధపడుతున్నారు. బతకాలంటే పోరాడక తప్పని పరిస్థితి అనివార్యంగానే ప్రజల ముందుకొచ్చింది. ఈ పరిస్థితుల్ని ముందుగానే కనిపెట్టిన పాలకులు ప్రజా ఉద్యమాల్ని అణచివేయడానికి 'ఊపా' లాంటి క్రూరమైన చట్టాల్ని చేస్తున్నారు. మరోవైపు ఎస్‌సి, ఎస్‌టి, బిసి కులాలకు చెందిన రాజకీయ నాయకులను, ఉన్నతాధికారులను రంగంలోకి దింపి ఆయా కులాల ప్రజల్ని మభ్యపెడుతూ, కుల సంఘాల నాయకుల్ని ప్రలోభపెడుతూ, కులతత్వాన్ని పెంచిపోషిస్తున్నారు. అందుకు 'లక్షింపేట' మారణహోమం ప్రత్యక్ష సాక్ష్యంగా మనముందుంది.

'ఏ భూమి కోసమైతే ఐదుగురు దళితులు అసువులు బాశారో 20 మంది వికలాంగులయ్యారో ఆ భూమి నుంచి శాశ్వతంగా దళితుల్ని దూరం చేసే కుట్ర జరుగుతుంది'. అధికార పార్టీలో ఉన్న దళిత ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలతో పాటు వారి కనుసన్నల్లో, వారి సహాయసహకారాలతో ఉద్యమాలను నడిపిస్తున్న కొందరు దళిత నాయకులు కూడా ఆ కుట్రలో భాగస్వాములౌతున్నారు. హంతకులను కాపాడుతూ, వారికి నజరానాగా 250 ఎకరాల భూమిని ఇవ్వడానికి కాపు కులాధినాయకుడు బొత్స సత్యనారాయణ ప్రయత్నిస్తుంటే చట్టాన్ని అమలు చేయడానికి దళితులైన స్థానిక సిఐగాని డిఎస్‌పిగాని, మంత్రిగానీ, అధికార, ప్రతిపక్షాలలో ఉన్న ఏ దళిత రాజకీయ నాయకుడు గానీ, ప్రయత్నించలేదు.

ఇలాంటి సందర్భాలలో దళిత అధికారుల్ని, రాజకీయ నాయకుల్ని వెనకేసుకొచ్చే ఆయా కుల సంఘాల నాయకులందరూ నేరస్తులే. మరోవైపు కమ్యూనిస్టులుగా చెప్పుకుంటున్న పార్టీలన్నీ ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకొని నామమాత్రంగా స్పందిస్తున్నారు. ఇంకోవైపు మార్క్సిస్టు ముసుగు తొడుక్కున్న కొందరు అగ్రకుల మేధావులు కులాల్ని మరుగుపరచి, వర్గాన్ని వేదిక మీదకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

దాడి చేసిన వారి కుల ప్రస్థావన తెస్తే అగ్రకులాల్లోని పేదలు దూరమవుతారనే కుటిల వాదన చేస్తున్నారు. అయినప్పటికీ హంతకుల అరెస్టుకై దళితులు గొంతెత్తి అరుస్తున్నారు. ఈ సందర్భంగా 'దళితులపై బతికే' వాళ్ళను, 'దళితుల కోసం బతుకుతున్న' వాళ్ళను వేరు చూస్తూ విభజన రేఖ గీయాల్సివుంది. అట్టడుగు స్థాయి దళిత, పీడిత కులాలకు అండగా నిలిచి, వారి బతుక్కి, బతుకుదెరువుకి భరోసా ఇచ్చే బలమైన ఉద్యమ నిర్మాణం జరగాలి. అది మనందరి తక్షణ కర్తవ్యం కావాలి. అదే దళిత మృతవీరులకు మనమందించే నిజమైన నివాళి.

- దుడ్డు ప్రభాకర్
కులనిర్మూలనా పోరాటసమితి, రాష్ట్ర అధ్యక్షులు 
Andhra Jyothi News Paper Dated : 18/07/2012 

Saturday, July 14, 2012

కాలుష్యంపై కదంతొక్కిన మహిళలు



కరీంనగర్‌కు పోరాట వారసత్వం ఉంది, నాయకత్వ లక్షణాలు పుష్కలం. సాహిత్యం, కళలకు పుట్టినిల్లు. ఇది తెలంగాణ ప్రత్యేకత కాబట్టే ఇక్కడ ఇంకా తిరుగుబాటు నగారా మోగుతానే ఉంటది. కరీంనగర్ పోరాట చరివూతలో మరొక పేజీని సొంతం చేసుకుంది పర్లపల్లి హరిత బయోవూపొడక్ట్స్ కంపెనీపై తిరుగుబాటు. ఇది ముఖ్యంగా మహిళల విజయం. 70 మహిళా స్వయం సహాయక బృందాలు ఉన్న పర్లపల్లి గ్రామం, తిమ్మాపూర్ మండలం, కరీంనగర్ జిల్లాలో ఉన్న ది. పల్లెలు ఇంకా పచ్చని పట్టు బట్టలతోని కనపడతాయి. పర్లపప్లూకు పోతుంటే చుట్టూ అందమైన కొండలు. ఒక్కొక్క కొండకు ఒక్కొక్క చరిత్ర. గుట్టకు, పుట్టకు దేవుడుంటడు.అన్ని తెలంగాణ పల్లెల లెక్కనే ఇక్కడ పల్లెపప్లూకు దేవతలుంటారు. గ్రానైట్ రాళ్ళ కోసం, కంకర కోసం గుట్టలను పిప్పిచేసి పల్లె చిత్రాన్ని ఛిద్రం చేస్తున్నారు. మొన్నటి వరకు ప్రశాంతంగా బతికిన పర్లపల్లికి 2009 నుంచి వాళ్ల బతుకులు పోరుబాట పడతాయని ఊహించి ఉండకపోవచ్చు. జూన్ 2న వందలాది మంది మహిళలు, పురుషులు ఊరంతా దండులాగా కదిలి హరిత బయో ప్రొడక్ట్స్ కంపెనీ మీద తిరగబడ్డది.

కంపెనీ వాహనాలపై దాడి జరిపిన సంఘటన మామూలు ముచ్చట కాదు. ఏడాదికాలంగా వాళ్ళు అనుభవిస్తున్న బాధ, ఆక్రోశం ఆకాశాన్నంటింది. యాజమా న్యం, పోలీసులు, కంపెనీ సెక్యూరిటీ ఏమీ చేయలేకపోయారు. మాభూమి సినిమాలో గడి మీద దండు కదిలినట్టు కదిలిన దృశ్యం కళ్ళముందు కు వచ్చింది. ఇక్కడ ప్రజలే స్వ యంగా తమ సమస్యల మీద అవగాహనతో, ఒక్కతాటిపైకి వచ్చి కదిలిన సంద ర్భం. ఈ ప్రపంచీకరణ యుగంలో ‘నేను’, ‘నాదీ’లో పూర్తిగా మునిగి ఉన్న పట్టణ, మధ్యతరగతి మేధావులకు ఈ ’తిరుగుబాటు’ అర్థంకాని విషయం. ప్రజలు సామూహికంగా ఊరు బాగు కోసం, భూమి కోసం ప్రాణాలకు తెగించి పోరాడుతార నే అనుభవాలు ఇంకా ఈ గడ్డ మీద సజీవంగా మిగిలి ఉన్నా యనడానికి ఇదొక ఉదాహరణ.

హరిత బయోవూపొడక్ట్స్ 2009లో ఇథనాల్ తయారు చేసే కంపెనీగా పచ్చని పంట పొలాల్లోకి అడుగుపెట్టింది. ఎక్కడి నుంచో ఇక్కడికి ఒచ్చిన దొరలకు కరీంనగర్ మక్కలపై, మానేరుపై కన్నుపడ్డది. తెలంగాణలో ఆహార ధాన్యాల మీద ఆధారపడి తయారు చేసే మొట్టమొదటి కంపెనీ ఇది. నూకలు, మక్కలతోని ఇథనాల్ తయారు చేసి, ఆల్కహాల్, మందులకు దీనిని పంపిస్తామని యాజమాన్యం చెపుతున్నది. ఇక్కడ పశువులకు దానా కూడా తయారు చేస్తారట.2009 ఆగస్ట్ 18న పర్లపల్లి బడిలో కాలుష్య నియంవూతణ ఇంజనీర్, ప్రభుత్వాధికారులు, ప్రజావూపతినిధుల సమక్షంలో ప్రజాభివూపాయసేకరణ జరిగినట్టు, అంతకన్నా ఒక నెల ముందు, పత్రికా ప్రకటన ఇచ్చినట్లు యాజమాన్యం తరఫున శ్రీనివాసడ్డి అంటున్నారు.వాస్తవానికి ఊరు ఊరంతా కూడా ఒక్కటై అది బూటకమని మొత్తుకుంటున్నారు. అబద్ధాలు చెప్పి మమ్మల్ని మోసం చేసి, మా జీవితాలను నాశనం చేస్తున్నారని బోరుమంటున్నారు.

పర్లపల్లిలో ఏం జరిగింది? మొదటి నుంచి కూడా గ్రామ కార్యదర్శి, సర్పంచి ఇంకా కొంతమంది దళారులు కలిసి అది బిస్కెట్ కంపెనీ అని, ఇక్కడ బ్రెడ్ కూడా తయారవుతుందని, ఊరోల్లందరికి ఉద్యోగాలోస్తాయని నమ్మించారు. కంపెనీ పేరుమీద వివరాలు ఏమీ లేకుండా తీర్మానం చేశారు. గుట్టు చప్పుడు కాకుండా కంపెనీ ప్రారంభం కానిచ్చినరు. అట్ల మొదలైన కంపెనీ తమ జీవితాలలో కాలుష్యం నింపుతున్నదని గ్రామస్తులు పోరుబాట పట్టారు. పచ్చని పంట పొలాల మధ్య 30 ఎకరాలలో సర్వేనంబర్ 1130, 1131, (పి)1132, 1133, 1134 (పి) పర్లపల్లిలో రెక్టిఫైడ్ స్ప్రిరిట్,ఎథనాల్, ఫార్మ గ్రేడ్ ఆల్కహాల్, ఇండస్ట్రియల్ ఆల్కహాల్ తయారీకి కాలుష్య నియంవూతణమండలి అనుమతినిచ్చింది. దీనికి రెండు మెగావా ట్ల విద్యుత్తు, రోజుకు ఐదు లక్షల లీటర్ల నీరు, 4000 టన్నుల మక్కలు కూడా అవసరం. కంపెనీ కోసం 30 ఎకరాలకు అనుమతినిస్తే, ఈ కంపెనీ దాదాపు వంద ఎకరాలు రైతులనుంచి అక్రమంగా కొన్నది. మోసంతో మొదలైన కంపెనీ అసలు రూపం మొదలు పెట్టిన రోజునుంచే మొదలైంది. చుట్టు పక్కల భయంకరమైన దుర్గంధం వెదజల్లింది. ప్రజలు లొల్లిపెట్టడం, ఆ ఊరి పెద్దలు నచ్చ చెప్పడం... కొన్నిరోజులు గడిచాయి. ఆ తరువాత ఆరోగ్యాలు పాడు కావడం, పిల్లలకు కామెర్లు, స్త్రీలకు అబార్షన్లు, చర్మ వ్యాధులు ఎక్కువ కావడంతో ప్రజలకు నిద్ర లేకుండా అయింది. దీనిపై ప్రభుత్వాధికారులకు, ప్రజాప్రతినిధులకు తమ గోడును చెప్పుకున్నా ఎవరూ పట్టించుకున్న పాపానపోలేదు. రాజకీయపార్టీలు మొదటి నుంచీ ఏమి తెలియనట్టే ఉన్నాయి. కంపెనీ నడవడానికి లక్షలకొద్ది లీటర్ల నీరు లభించడం కోసం కంపెనీ చుట్టూ పక్కల ఉన్న బావులను, బోర్లను కిరాయికి తీసుకోవడం మొదలుపెట్టారు. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల బోరుబావులన్నీ ఎండిపోయాయి.కంపెనీ నుంచి వచ్చే భరించలేని వాసనకు నల్గొండ, పీచుపల్లి, ముల్కనూర్, సర్లపల్లి, మొగిలిపాలెం, మొలంగూర్ పల్లెలు తల్లడిల్లాయి. గ్రామాలన్నీ కాలుష్య కాసారంగా మారాయి. ఎవరి ఇంట్లో వారు ఉండలేని పరిస్థితి ఏర్పడింది.

అరవై కోట్ల కంపెనీకి కేవలం 150 మంది కార్మికులను చుట్టుపక్కన ఉన్న గ్రామాలనుంచి తీసుకున్నారు. కంపెనీ కాలుష్యంతో ఇక బతకడం కష్టమని జూన్ 27న ధర్నా చేద్దామని పల్లెజనం కంపెనీ బాట పట్టినరు. యూత్ గ్రూపులు, మహిళా సంఘాలు కంపెనీ యాజమాన్యం వైఖరికి నిరసనగా ఆందోళనకు దిగారు. ఆవేశం కట్టలు తెగి కంపెనీపై దాడికి దిగారు. దొరికింది దొరికినట్టే ధ్వంసంచేశారు. ఇది ధర్మాక్షిగహం కాదా? 38 మంది మీద కేసులు పెట్టి 13 మందిని జైలుకు పంపించారు. దీంతో ఊరంతా స్మశాన ప్రశాంతత నెలకొన్నది. పోలీసువాళ్లు మఫ్టీలో వచ్చి కోడి పిల్లలను ఎత్తుక పోయినట్టు ఎత్తుకుపోతున్నరని ప్రజలు బావురు మన్నరు. శ్రీనివాసచారి అనే ఒక పూజారికి దాడితో ఎటువంటి సంబంధమూ లేదు. తనకు వచ్చిన చర్మ వ్యాధి గురించి , డాక్టర్ చెప్పిన విషయాలను వివరిస్తున్నడు, అంతలోనే మఫ్టీ లో ఉన్న పోలీసులు వచ్చికొట్టుకుంటూ తీసుకుపోయినరు.

మరుసటి రోజు సాయంత్రం తిమ్మాపూర్ పోలీస్‌స్టేషన్‌లో తెలంగాణ భూమి రక్షణ సంఘం, పౌరహక్కుల సంఘం నిజనిర్ధారణ చేశాయి. బాధితుల తరఫున పోలీసుస్టేషన్‌కు పోయి ప్రజలపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని, కంపెనీ వెంటనే మూసి వేయాలని డిమాండ్ చేశాయి. ప్రజలు ’హింస’కు పాల్పడినరు కాబట్టి కేసు లు పెట్టినమని పోలీసులు అంటున్నారు. ఇదే మాట కలెక్టర్ కూడా చెప్పారు. రాజ్యానిది ఒకటే భాష, హింస ఒకటే నిర్వచనం. ప్రజల ను ఇన్ని రకాలుగా ఇబ్బందికి గురి చేస్తున్నా, వారిని ఏమి అనకూడదని అధికారులు సెలవిస్తున్నారు. ప్రజలు తమ బాగుకోసం, ఊరుకోసం, పర్యావరణం కోసం పోట్లాడితే వారు హింసా వాదులుగా పోలీసులకు కనిపిస్తున్నారు. మహిళలు వందల సంఖ్యలో రాత్రి అని చూడకుండా వచ్చి రాజీవ్ రహదారిని మూసివేసి, తమ వారిని విడిపించాలని రోడ్డుపై బైఠాయించి పోరాట పటిమను చాటారు.

తమ భర్తలు, పిల్లలను ఎంత హింసించినా పోరాటం ఆపేది లేదని మహిళలు ముందున్నారు. వారి ఆగ్రహం ముందు ప్రభుత్వం ఓడిపోయింది. ప్రజా ప్రతినిధులు నీళ్ళు నములుతున్నారు. కలెక్టర్ ఆదేశాలతో ప్రస్తుతం తాత్కాలికంగా కంపెనీని మూసివేశారు. ఇప్పటికే ఇథనాల్ తయారీకి వ్యతిరేకంగా ప్రజలు ఇతర ప్రాంతాలలో ఉద్యమిస్తున్నారు. ఈ కాలుష్య పరిక్షిశమలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడాలి. పంట పొలాలు, నీళ్ళు నష్టపోకుండా అన్ని ప్రజా సంఘాలు అడ్డుపడాలి.

ప్రజలు ప్రభుత్వాలపై నమ్మకాలను పోగొట్టుకున్నారు. రాత్రి అంతా తిమ్మాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో, జాతీయ రహదారి మీద కూర్చున్నారు. తమ పంతాన్ని నెగ్గించు కున్నారు. రాత్రి పదిగంటలకు కూడా ట్రాక్టర్‌లలో మహిళ లు దిగుతూనే ఉన్నారు. ఎక్కువ చదువు లేకున్నా, ముందూ వెనుకా గొప్ప సంఘాలు లేకున్నా, సో కాల్డ్ సిద్ధాంత రాద్ధాంతాలు లేకుండా న్యాయం కోసం ఉద్యమించిన పర్లపల్లి మహిళలు విజయం వైపు ప్రయాణం కొనసాగిస్తున్నారు. మాలాంటి వాళ్లకు, సంఘాలకు నిజంగా ఈ పర్లపల్లి మహిళల పోరాటం ఎన్నో పాఠాలు నేర్పుతున్నది. మొదటి రోజు దాడి తర్వాత, రెండో రోజు ఒక మహిళా బృందం కలెక్టర్‌ను కలిసింది. ఆవేశంలో కంపెనీపై దాడికి దిగినట్టు కలెక్టర్ ముందు ఒప్పుకున్నారు. కాని కేసులకు భయపడలేదు. వెనక్కిపోలేదు.ఇది మహిళల విజయం. వీరి పోరాటం సహజ వనరుల కోసం. అంతరిస్తున్న భూగర్భ జలాల కోసం. తమ స్వచ్ఛమైన పల్లె పరిసరాల కోసం గ్రామస్థులు ప్రాణాలకు తెగించి ఉద్యమిస్తున్నారు. కంపెనీల పేరుతో పల్లె జీవితాలకు కాలుష్యాన్ని పంచు తున్న కంపెనీలకు గోరీ కడుతున్నారు. ఈ చైతన్యం అందరికీ ఆదర్శం కావాలి. వీరికి మద్దతు పలుకుదాం.

Namasete Telangana News Paper Dated : 15/07/2012
-సుజాత సూరేప

Friday, July 13, 2012

హాస్టళ్ల దుస్థితి మారేదెన్నడు?----కె. బాలరాజ్


రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల సంక్షేమ హాస్టళ్లలో సకల సదుపాయాలు కల్పిస్తామని ప్రభుత్వం వాగ్దానం చేసింది. దీనికోసం మంత్రులు, ఎమ్మెల్యేలు నెలకోసారి హాస్టళ్లలోనే బసచేయాలని ఆదేశించింది. పదిమంది విద్యార్థులకో స్నానాల గది, ఒక్కో విద్యార్థికి నాలుగు జతల బట్టలు, పౌష్ఠికాహారం అందిస్తామని ప్రభుత్వం చెప్పుకొచ్చింది. వీటి లో ఏదీ అమలు కాలేదు. కాకుంటే.. తమ ప్రచారానికి పనికొస్తుందని కొందరు ఎమ్మెల్యేలు హాస్టళ్లలో రాత్రిపూట పడుకుని పేపర్లలో ఫోటో వేయించుకుని సంబరపడ్డారు. కానీ విద్యార్థులకు ఒరిగింది ఏమీ లేదు. సమస్యలేవీ పరిష్కరించబడలేదు. కొన్నేళ్లుగా విద్యార్థుల సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. గతంలో కన్నా ఇప్పుడు మరింత తీవ్రమయ్యాయి.

రాష్ట్రంలో దాదాపు ఐదువేలకుపైగా హాస్టళ్లలో లక్షలాదిమంది విద్యార్థులు చదువుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాలనుంచి వచ్చిన విద్యార్థులు హాస్టళ్లలో ఉంటున్నారు. వీరికి కనీస వసతులు కూడా లేక అనేక అవస్థలు పడుతున్నారు. రాష్ట్రంలో సగానికి పైగా హాస్టళ్లకు స్వంత భవనాలు లేవు. అద్దె భవనాలలో ఉన్న హాస్టళ్లలో కనీస వసతులు లేక విద్యార్థులు నానా తిప్పలు పడుతున్నారు. మరుగుదొడ్లు, స్నానపు గదులు, విద్యుత్తు లాంటి సౌకర్యాలు లేక విద్యార్థులు సతమతమవుతున్నారు. వీటికితోడు వార్డెన్ల నిర్లక్ష్యం తోడై విద్యార్థులకు సంబంధించిన ఏ సమస్యా పరిష్కారం కాకుండా ఉంటున్నాయి. హాస్టళ్లలో పరిశువూభత గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. దీంతో చాలామంది వర్షాకాలం వచ్చిందంటే సీజనల్ వ్యాధులకు గురవుతున్నారు. విద్యార్థుల బాగోగులు చూడాల్సిన వార్డెన్ పట్టించుకున్న పాపాన పోవడంలేదు. దీంతో.. సంక్షేమ హాస్టళ్లం నరకకూపాలకు నకళ్లుగా తయారయ్యాయి.

ఇంటర్‌మీడియేట్ ఆ పైస్థాయి విద్యార్థులకు కనీసం 2600 కేలరీల శక్తిని ఇవ్వగల ఆహారం అందించాలి. కానీ మన ప్రభుత్వం 1100 కేలరీల ఆహారం మాత్రమే అందిస్తున్నది. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో మూడు నుంచి ఏడో తరగతి చదివే విద్యార్థులకు మూడు పూటల భోజనానికి గాను విద్యార్థులకు కేవలం రూ.15.50 పైసలు ఇస్తున్నది. ఇంటర్ చదువుతున్న వారికి రూ.17.54 పైసలు ఇస్తున్నది.

నిత్యావసర వస్తువులు, సరకుల ధర లు చుక్కలనంటిన నేపథ్యంలో ప్రభుత్వం మంజూరు చేస్తున్న డబ్బులతో మూడు పూటలా భోజనం ఎలా పెడతారో వారికే తెలియాలి. ప్రభుత్వం ఇస్తున్న ఈ చాలీచాలని డబ్బులతోనే విద్యార్థులకు నీళ్లలాంటి చారు, పురుగుల అన్నం పెడుతున్నారు. ఇలాంటి కలుషిత ఆహారం, పోషక విలువలు మచ్చుకైనా లేని ఆహారంతో విద్యార్థులు అనేక రోగాల పాలవుతున్నారు.
విద్యార్థులకు పౌష్ఠికాహారం అందిస్తున్నామని, ‘మెనూ’ ప్రకారం హాస్టళ్లలో భోజనం ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నది. కానీ.. ప్రభుత్వం ఇస్తు న్న అరకొర నిధులతో ఏరకమైన మెనూ అమలుచేస్తారో చెప్పకనే చెబుతున్నది. ఇప్పటికైనా ప్రభుత్వం పెరిగిన ధరలకు అనుగుణంగా విద్యార్థులకు మెస్ చార్జీలు పెంచి ఇచ్చినప్పుడే విద్యార్థులు చదువుకో గలుగుతారు. ఇక సంక్షేమ హాస్టళ్ల బాగోగుల గురించి హాస్టళ్లవారిగా కమిటీలు వేయాలని వారి పర్యవేక్షణలో హాస్టళ్లు పనిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. చాలా వరకు హాస్టళ్లలో కమిటీలే వేయలేదు. వేసినవి కూడా కాగితాలకే పరిమిత మై ఏ ఉపయోగం లేకుండాపోయాయి. హాస్టల్ కమిటీ కర్తవ్యాలు, బాధ్యతల గురించి ఎంతో గొప్పగా చెప్పినా.. అవేవీ ఆచరణలో అమలు కావడం లేదు.

రాష్టంలోని సగానికిపైగా హాస్టళ్లు వార్డెన్లు లేకుండానే నడుస్తున్నాయి. ఇన్‌చార్జీలతో హాస్టళ్లు నడిపిస్తున్నారు. దీనితో విద్యార్థుల సమస్యలు ఏవీ తీరడం లేదు. కాబట్టి ప్రభుత్వం ఇకనైనా.. హాస్టళ్లన్నింటికీ వార్డెన్లను నియమించి వారు సమర్థవంతంగా పని చేసేలా చూడాలి. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్‌చార్జీలను, ఉపకార వేతనాలను పెంచాలి. ప్రతి విద్యాసంవత్సరం ఆరోగ్య ఖర్చులకు గాను వెయ్యి రూపాయలు ఇవ్వాలి. హాస్టల్ విద్యార్థులకు సంబంధిత వార్డెన్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇలాంటి చర్యలు తీసుకున్నప్పుడే.. సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టగలుగుతారు.
-కె. బాలరాజ్
ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు
Namasete Telanagana News Paper Dated :14/07/2012 

క్రూరత్వం గర్జించిన రాత్రి - బొజ్జా తారకం

కొత్తగూడ దగ్గర మావోయిస్టులు సమావేశమవుతున్నారనే సమాచారం పోలీసుల వద్ద ఉంటే ఎంత మంది వస్తారని అంచానా వేశారో! వందలాది పోలీసులను అత్యాధునిక ఆయుధాలతో హెలికాప్టర్ల మీద తరలించారు. ఆ ఆయుధాలకు దొరికిన 17 మందిలో మైనారిటీ కూడా తీరని వారు ఏడుగురున్నారు... సిద్ధంగా లేని ఆదివాసీలపై యుద్ధం ఇది! రాజ్యాంగం మీద దాడి ఇది, ప్రజాస్వామ్య వ్యవస్థ మీద దాడి ఇది!

అది వెన్నెల రాత్రి. చుట్టూ పెద్ద పెద్ద చెట్లమధ్య ఓ పచ్చని స్థలం. పాల వెన్నెలను పలకరించుకుంటూ ఓ అరవై మంది ఆదివాసీలు అక్కడ సమావేశమయ్యారు. ప్రతి ఏటా జరుపుకొనే విత్తనాల పండగ గురి ంచి, గ్రామాలను విడిచి వెళ్లిపోయిన వారి భూమి పంపకం గురించి మాట్లాడుకుందామని మూడు గ్రామాల పెద్దలు అక్కడ చేరారు. పెద్దలతో పాటు పిల్లలూ, మగవాళ్లతో పాటు ఆడవాళ్లూ.. అది మామూలే. అడవిలో మైళ్ల కొద్దీ అమ్మానాన్నలతో కలిసి పిల్లలు నడుస్తూనే ఉంటారు. మగవాళ్లతో పాటు ఆడవాళ్లూ అరక దున్నుతారు. అక్కడ ఆడమగా తేడాలేదు.

అందరూ సమానమే, సమానంగా పనిచేసుకుంటారు. కూర్చుని మాట్లాడుకుంటున్నారు. అంతే.. హఠాత్తుగా నాలుగు పక్కల నుంచి మేఘాలు కమ్ముకొచ్చినట్టు ఓ ఎనిమిది, తొమ్మిది వందల మంది పోలీసులు ఆదివాసీల గుంపును చుట్టుముట్టి కాల్పులు సాగించారు. తుపాకీ గుళ్ల వర్షం కురిపించారు. అక్కడికక్కడ ముగ్గురు కుప్పకూలిపోయారు. పరిగెత్తుకుపోతున్నవారిని తరుముకుంటూ తుపాకీ పేల్చారు. మరికొంతమంది నేలకొరిగా రు. పాల వెన్నెలలో ఎర్రని చారలు. పచ్చటి మైదానంలో రక్తపు మరకలు.

పండగ గురించి మాట్లాడుకుంటున్న ఓ అరవైమంది ఆదివాసీలు హఠాత్తుగా మావోయిస్టులై పోయారు. వారిని చంపటానికి (పట్టుకోవటానికి కాదు!) ఓ తొమ్మిది వందల సాయుధ పోలీసులు! వీరిని చంపటానికి బలగాలను హెలికాప్టర్ల మీద ఆ ముందురోజు దించారు. సిఆర్‌పిఎఫ్, కోబ్రా, రాష్ట్ర పోలీసుకు చెందిన మూడు రకాల దళాలు మూడు గ్రామాల మీదికి దాడికి వచ్చాయి. కొత్తగూడ మధ్యలో ఉంటుంది. ఒక పక్క సర్కెగూడ, మరో పక్క రాజ్ పెంట. మధ్యలో ఉన్నది కాబట్టి కొత్తగూడలో సమావేశమయ్యారు. పైగా చెట్ల మధ్య విశాలమైన ఖాళీ స్థలం ఉన్నది. అక్కడే సమావేశాలు, పండగలూ అవుతాయేమో, ఎందుకంటే ఆ స్థలం మధ్య ఎత్తుగా ఒక స్తంభం పాతి ఉన్నది. ఆ స్తంభానికి చివర ఓ సన్నని కర్ర ఆకాశం కేసి చూస్తూ..

అక్కడ గుమిగూడిన వాళ్లు ఆదివాసీలా మావోయిస్టులా పోలీసులకు అవసరం లేదు. వాళ్లకు చంపటానికి మనుషులు కావాలి. ఎక్కువ మంది కూడా ప్రస్తుతం అవసరం లేదు. ఓ ముప్పై ఆరు మంది కావాలి. ఎందుకంటే సరిగ్గా రెండేళ్ల క్రితం జూన్ 28న బైలదిల్లలో మావోయిస్టులు 36 మంది సిఆర్‌పిఎఫ్ జవాన్లను కాల్చి చంపారట. ఇప్పుడు దానికి బదులు తీర్చుకోవాలి. పోయిన ఏడాది సరిగ్గా ఇదే రోజున ఓ ఏడుగురు ఆదివాసీలు దొరికారు, వారిని కాల్చిచంపారు. ఇప్పుడు మిగిలినవాళ్లు సరిపోతారనుకుని చుట్టుముట్టి కాల్పులు సాగిస్తే 17 మంది ఆదివాసీలతో పాటు ఎదురు బొదురుగా ఉన్న పోలీసులకు పోలీసు తుపాకుల నుంచే తూటాలు తగిలాయి. దానితో బిత్తరపోయి ఆపేశారు. ఆ పాటికే 17 మంది ఆదివాసీలు నేలకొరిగారు. ఆ సమావేశంలో మావోయిస్టులు అస్సలు లేరని అక్కడి ప్రజలు చెబుతున్నారు. ఆదివాసీల దగ్గర, సహజంగా ఉండే బాణాలు కూడా వారు ఆ రాత్రి తెచ్చుకోలేదు. వారు వచ్చినది పండగ గురించి మాట్లాడుకోవటానికి. అయితే పోలీసులు వచ్చింది మాత్రం జనాన్ని చంపటానికి, అందుకే ఆయుధాలతో వచ్చారు, హెలికాప్టర్లలో దిగారు.

చంపేసి పోలీసులు వెళ్లిపోలేదు. అంతరాత్రి పూట కూడా శవాలను బంధువులకు దక్కనీయకుండా ఎత్తుకుపోయారు. మళ్లీ తెల్లవారు జామునే వచ్చి అక్కడ, సమావేశం జరిగిన చోట రక్తంతో తడిసిన మట్టిని తవ్వుకుపోయారు. విప్పకాయలు ఏరుకున్నట్టు చెట్ల మధ్య పడిన తుపాకీ గుండ్లను ఏరుకుపోయారు. చిన్న తుప్పల మధ్య పడి ఉన్న గుండ్లు కనపడలేదు, అవి అక్కడే ఉన్నాయి. విచ్చల విడిగా, విచక్షణారహితంగా తుపాకులు పేల్చారేమో, చెట్లకు, చెట్లపై కొమ్మలకు గుండ్లు తగిలాయి. ఆ ఆనవాళ్లు ఇంకా ఉన్నాయి. ఎక్కడా ఆనవాళ్లు కనపడకుండా చేద్దామనుకుంటున్న పోలీసులకు ఒక వ్యక్తి తలుపు తీసుకొని బయటకు రావటం చూసి అతన్నీ కాల్చారు. తుపాకీ దెబ్బతిని లోపలకు పరుగెత్తిన వ్యక్తి ఇంట్లో జొరబడి అతను ఇంకా బ్రతికి ఉండటం చూసి, బయటకు ఈడ్చి ఓ బండరాయి తీసుకొని నెత్తిమీద కొట్టి చంపేశారు. గాయపడిన వ్యక్తి సాక్ష్యం చాలా బలంగా ఉంటుందని పోలీసులకు తెలుసు. చెట్లు చెపుతాయనే అనుమానం వస్తే వాటిని కూడా నరుక్కుపోతారు.

చూడటానికి గ్రామాలే కాని, ఒక్కో గూడెంలోను ఇరవై, ముప్పై ఇళ్లు మాత్రమే, అవయినా చిన్న చిన్నవి ఉంటాయి. జనాభా కూడా పెద్దగా ఉండదు. కొత్తగూడ దగ్గర మావోయిస్టులు సమావేశమవుతున్నారనే సమాచారం పోలీసుల వద్ద ఉంటే ఎంత మంది వస్తారని అంచానా వేశారో! పదులా, వందలా, వేలా? అడవిలో మావోయిస్టులు వేల సంఖ్యలో ఉంటారా? లేకపోతే సాయుధ బలగాలను, అత్యాధునికమైన ఆయుధాలతో హెలికాప్టర్ల మీద దించుతారా? అయితే ఈ ఆధునికమైన ఆయుధాలకు దొరికిన 17 మందిలో మైనారిటీ కూడా తీరని వారు ఏడుగురున్నారు. అందులో పదవ తరగతి చదువుతున్నవారు ఇద్దరు; 5, 8 తరగతి వరకూ చదివి ఆపేసిన వారు మరో ఇద్దరు.

మిగిలిన వాళ్లంతా వ్యవసాయం చేస్తున్నవారు, పిల్లలు గల వాళ్లు. 17 మందిలో ఉన్న కాకా సరస్వతికి పన్నెండేళ్లే! వీరంతా మావోయిస్టులే, వీరంతా భారత ప్రభుత్వంపై యుద్ధం చేస్తున్నవారే, కేంద్ర హోంమంత్రి చిదంబరం దృష్టిలో. అందుకే వారిని కాల్చిచంపినందుకు సిఆర్‌పిఎఫ్ దళాలకు మంచి కితాబు ఇచ్చాడు. వారి సాహసాన్ని కొనియాడాడు. విదేశీ సైన్యంపై దాడిచేసి వారిని చంపి దేశాన్ని కాపాడిన దేశభక్తులుగా వారిని మెచ్చుకున్నారు. సిఆర్‌పిఎఫ్ అధినేత కూడా అదే పాట పాడాడు. కొత్తగూడ చర్యను సమర్థించాడు. 'ఒక వేళ ఈ దాడిలో అమాయక ఆదివాసుల ప్రాణాలుపోతే విచారిస్తున్నాను' అన్నాడు చిదంబరం.

ఆయన కళ్లకు ఆదివాసీలు మావోయిస్టులుగానే కనబడుతున్నారు. సిఆర్‌పిఎఫ్ అధినేత మాట వరుసకు కూడా విచారం వెలిబుచ్చటం లేదు. ఆడవాళ్లను, పిల్లల్ని ఆదివాసీలను ఎందుకు చంపావయ్యా అంటే 'ఆ గుంపులో ఆదివాసీలెవరో, మావోయిస్టులెవరో ఎలా తెలుస్తుంది, బుల్లెట్‌కి కళ్లు ఉండవు గదా' అంటున్నాడు. బుల్లెట్‌కి కళ్లు ఉండవు, నిజమే, కాని తుపాకీ పేల్చేవాడికి కూడా కళ్లు ఉండవా? కళ్లు ఉన్నా మూసుకొని కాల్చారేమో వాళ్లను వాళ్లే కాల్చుకున్నారు. వారి తుపాకీ దెబ్బ వారికే తగిలింది. చిన్న పిల్లల్ని కూడా కాల్చిచంపారు.

తుపాకీ కాల్చి, చంపి, శవాల్ని ఎత్తుకుపోయారు. బంధువుల్ని కూడా శవాల్ని చూడనివ్వలేదు. భర్త శవం భార్యను చూడనివ్వలేదు; కొడుకు శవం తండ్రిని చూడనివ్వలేదు; అన్న శవం తమ్ముడిని చూడనివ్వలేదు; కూతురి శవం తల్లిని చూడనివ్వలేదు. ఎంత బ్రతిమాలినా శవాల దగ్గరకు వారిని రానివ్వలేదు. చివరకు కొందరు రాజకీయనాయకుల జోక్యంతో శవాలను బంధువులకు అప్పగించారు. 17 శవాలను మోసుకొచ్చిన గ్రామస్థులకు వాటిని కాల్చటానికి కట్టెలు దొరకలేదు. హత్యాకాండకు సాక్ష్యంగా నిలిచిన చెట్ల మధ్యనే అక్కడక్కడా పెట్టి నిప్పంటించారు. గాయపడిన కొందరిని ఆస్పత్రిలో ఉంచారు. వారిని కూడా చూడనివ్వటం లేదు.

బలగాలు హెలికాప్టర్లలో దిగాయి. ఎక్కడ? ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం, బీజాపూర్ జిల్లా బాసెగూడ పోలీస్ ష్టేషన్ పరిధిలో ఉన్న కొత్తగూడ గ్రామం. అది ఆదివాసీల గూడెం. అది చైనా సరిహద్దు కాదు. పాకిస్థాన్ సరిహద్దూ కాదు. పోనీ అది లడఖూ కాదు, కార్గిల్ కూడా కాదు. అది మామాలు ఆదివాసీల ఆవాసం. అక్కడికి హెలికాప్టర్ల మీద సాయుధ బలగాలు దిగాయి. ఎవరి మీద దాడి? 'ఆదివాసీల మీద' ! 'ఎందుకు?' 'వారి మధ్య మావోయిస్టులున్నారు'! 'ఉంటే కాల్చేస్తారా?' 'మావోయిస్టు పక్కనున్న వాడు మావోయిస్టే!' 'మావోయిస్టులయితే కనపడగానే కాల్చేస్తారా?' 'అవును కాల్చేస్తాం' 'అటువంటి అధికారం పోలీసు బలగాలకు గానీ మిలటరీ దళాలకు గాని ఉన్నదా?' 'లేదు'.

'మరి ఎలా చంపుతారు?' 'అధికారం ఉన్నది కదా, ఇది ప్రజాస్వామ్యం గదా! జీవించే హక్కు ఎవరికైనా ఉన్నది గదా, మరి దానిని ఎలా కాలరాచి వేస్తారు?' 'మమ్మల్నెవరడుగుతారు, దేశరక్షణ అంటాం, శాంతి భద్రతలు అంటాం, మావోయిస్టుల వల్ల దేశానికి ప్రమాదం ఉందని అంటాం, అభివృద్ధిని అడ్డుకుంటున్నారని అంటాం, కోర్టులు ఒప్పుకుంటాయి' అంటున్నారు. 'మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్‌లో ప్రవేశించి పదేళ్లు అయి ఉంటుందేమో, మరి అంతకు ముందు మీరు ఏమి అభిృవద్ధి చేశారు? చేస్తే ఆదివాసీల బ్రతుకులు ఎందుకంత బాధాకరంగా ఉన్నాయి' అని అడిగితే 'అపుడయిందేదో అయింది ఇప్పుడు అభివృద్ది చేస్తామంటే వాళ్లు అడ్డుకుంటున్నారు' అని అంటున్నారు.

వాళ్లు అభివృద్ధిని అడ్డుకోవటం లేదు, ఛత్తీస్‌గఢ్ అడవిలో ఉన్న ఖనిజాలను ఇతర సంపదను బహుళజాతి కార్పొరేట్ కంపెనీలకు ఇవ్వటానికి మీరు ఆదివాసీలను అడవినుంచి ఖాళీ చేయించాలని చూస్తున్నారు, దానిని ఆదివాసీలు ఒప్పుకోవటం లేదు. పోరాటం చేస్తున్నారు, దానికి మేము అండగా ఉన్నాం అని మావోయిస్టులు అంటున్నారు. అడవినుంచి ఆదివాసీలను ఖాళీ చేయించాలంటే ఆదివాసీలను చంపాలి, వాళ్లను చంపాలంటే మావోయిస్టులను చంపాలి. మావోయిస్టులను చంపాలంటే అడవిపై దాడి చెయ్యాలి. అడవిపై యుద్ధం చెయ్యాలి. అందుకే సాయుధ బలగాలు, హెలికాప్టర్లు, చీకటిలో కాల్పులు సాగించే యుద్ధ పరికరాలు, మానవ రహిత విమానాలు, ఆ విమానాల నిండా బాంబులు.

అడవిపై బాంబుల వర్షం. అడవిపై తుపాకీ దాడులు. 'ఆదివాసీలు పోయినా ఫరవాలేదు, చెట్లు కాలిపోయినా ఫరవాలేదు, నేల రక్తసిక్తమైనా ఫరావాలేదు. మాకు కావలసింది ఆదివాసీలు కాదు. చెట్లు కాదు, నేల కాదు, నేలకింద ఉన్న అపార సంపద.. చెట్లకింద ఉన్న ఖనిజాలు. ఇవి దొరికితే చాలు. ఆదివాసీలు లేకపోయినా, అడవి లేకపోయినా, జీవించే హక్కు భంగపడిపోయినా, చట్టాలు లేకపోయినా, రాజ్యాంగం లేకపోయిన ఫరావాలేదు. బహుళజాతి వ్యాపార సంస్థలకు అడవిలో ఉన్న సంపద అందించాలి. ఆ పనిచేయాలంటే యుద్ధం తప్పదు'. తప్పేట్టులేదు. అందుకనే కొత్తగూడల లాంటివి ఇంకా చాలా జరుగుతాయని సిఆర్‌పిఎఫ్ అధినేత అంటున్నాడు. సిద్ధంగా లేని ఆదివాసీలపై యుద్ధం ఇది! నిరాయుధులైన ఆదివాసీలపై అత్యాధునికమైన ఆయుధాల, యంత్రాల దాడి ఇది! ప్రజల మీద దాడి ఇది, రాజ్యాంగం మీద దాడి ఇది, ప్రజాస్వామ్య వ్యవస్థ మీద దాడి ఇది!
- బొజ్జా తారకం
Andhra Jyothi News Paper Dated : 14/07/2012