Tuesday, July 17, 2012

దళిత నెత్తురు నేర్పుతున్న పాఠాలు - దుడ్డు ప్రభాకర్

ఈ నిచ్చెనమెట్ల కుల వ్యవస్థలో తరతరాలుగా వెలివాడల్లో పశువులకంటే హీనంగా బతుకుతున్న దళితులు మనిషిగా గుర్తింపు కోసం చేసే చిన్న ప్రయత్నాన్ని కూడా అగ్రకుల మనువాద భూస్వామ్య పాలకవర్గాలు సహించలేకపోతున్నాయి. కారంచేడు, నీరుకొండ, పదిరికుప్పం, తిమ్మసముద్రం, చుండూరు, చీమకుర్తి, వేంపెంట, ప్యాపిలి, కల్వకోలు, పొట్టిలంక, లక్షింపేట లాంటి మారణహోమాలు సృష్టిస్తున్నారు. సామ్రాజ్యవాదులు, హిందూ మతోన్మాదులు, భూస్వామ్య పెత్తందారీ శక్తులు, పాలకులు కలిసి రూపుదిద్దుకున్న అభినవ మనువులు తిరుగాడుతున్న ఈ నేలమీద అంటరాని కులాల ప్రజలు వేసే ప్రతి అడుగూ నెత్తురు మడుగవుతుంది.

ప్రతి కదలికా నిషిద్ధమౌతుంది. అయినప్పటికీ హరించి వేయబడుతున్న హక్కుల సాధన కోసం వెలివాడలు ఉద్యమిస్తూనే ఉన్నాయి. ఆ క్రమంలో అగ్రకుల దురహంకారుల కత్తుల వేటకు తెగిపడిన ప్రతివీరుని తల అంటరాని వారి జీవన్మరణ పోరాటాలకు చిరుదివ్వెలుగా నిలుస్తున్నాయి. అత్యాచారానికి బలవుతున్న ప్రతి తల్లి, చెల్లి చేస్తున్న హాహాకారాలు ఉద్యమ శంఖారావాలుగా మారుతున్నాయి. ఆ ఉప్పెనల్ని చల్లార్చడానికి పాలకులు అనేక ఎత్తుగడలు అవలంభిస్తున్నారు. సామ్రాజ్యవాద ప్రపంచీకరణ నేపథ్యంలో సామాజిక సంబంధాలు వ్యక్తిగత సంబంధాలుగా, మానవ సంబంధాలు మార్కెట్ సంబంధాలుగా మారుతున్న వేళ సామాజిక, ఆర్థిక, రాజకీయ సమీకరణలు, సమ్మేళనాలు అతివేగంగా మారుతున్నాయి.

కారంచేడు నుంచి లక్షింపేట వరకు జరిగిన నరమేధాలు దళితులు ఉమ్మడిగా ఉద్యమించాల్సిన అవసరాన్ని, మిగిలిన పీడిత కులాల్ని కలుపుకొని పోరాడాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తున్నాయి. అందుకు భిన్నంగా సామాజిక సమీకరణాలు జరుగుతున్నాయి. అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరచిన రిజర్వేషన్ల ద్వారా రాజకీయరంగంలో వాటా పొంది పాలకవర్గంలో చేరిన ఎస్‌సి, ఎస్‌టిలు (పిడికెడు మందే అయినప్పటికీ) ఆయా కులాల, జాతుల ప్రజల చితుకుతున్న బతుకుల గురించి ఆలోచించడం మానేశారు. పైగా పాలకుల అంబుల పొదిలో అస్త్రంగా మారి పీడిత ప్రజల బతుకుల్ని, బతుకుదెరువుని చిన్నాభిన్నం చేస్తున్నారు.

పేదల సమాధులపై పెద్దలు భవనాలు నిర్మించుకునే విధంగా చట్టాలు తయారవుతుంటే నోరు మెదపడం లేదు. అభివృద్ధి పేరుతో జరుగుతున్న విధ్వంసంలో ఎస్‌సి, ఎస్‌టి, బిసిలు విలవిల్లాడుతున్నారు. మైదాన ప్రాంతాలలో పీడిత కులాల పేదలు సాగుచేసుకొని బతుకుతున్న కుంట, సెంటు అసైన్డ్ భూములను ఎలాంటి నష్టపరిహారం చెల్లించకుండా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని బహుళజాతి కంపెనీలకు కోట్లాది రూపాయలకు అమ్ముకుంది. ఆర్థిక మండళ్ళ పేరుతో లక్షలాది ఎకరాలలో విస్తరించి వున్న కార్పొరేట్ కంపెనీలు నయాభూస్వామ్య వర్గంగా అవతరించాయి. ఆ కంపెనీలే వ్యవసాయం చేసే విధంగా మన పాలకులు 'కార్పొరేట్ వ్యవసాయ' మంత్రం జపిస్తున్నారు. దళితులు చస్తే బొందబెట్టను ఆరడుగులు నేలలేని పరిస్థితులు నేడు ప్రతి పల్లెలో దర్శనమిస్తున్నాయి.

దళితులు పోరాడి సాధించుకున్న ఎస్‌సి, ఎస్‌టి అత్యాచారాల నిరోధక చట్టాన్ని అగ్రకుల పెత్తందార్లు, పోలీసులు తూట్లు పొడుస్తుంటే, దళిత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు నిమ్మకు నీరెత్తినట్లుంటున్నారు. అత్యాచారానికి గురైన దళితులు పోలీసుస్టేషన్‌కు వెళితే పోలీసులు కేసు నమోదు చెయ్యడం లేదు. కొన్ని ఉద్యమ సంస్థల ఒత్తిడి మేరకు కేసు రిజిష్టర్ చేసినా దళితులపై కౌంటర్ కేసులు నమోదు చేసి స్టేషన్లలోనే రాజీలు చేస్తున్నారు. దళితులపై జరుగుతున్న అత్యాచారాలలో కేవలం 30 శాతం మాత్రమే రిజిష్టర్ అవుతున్నాయి. పోలీసు పక్షపాత వైఖరి వల్ల కోర్టుల్లో కేసులు వీగిపోతున్నాయి.

ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద నమోదైన కేసుల్లో 80 శాతం కేసులు పెండింగ్‌లో వున్నాయని కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ పార్లమెంట్ స్థాయీ సంఘం ప్రకటించక తప్పలేదు. దేశవ్యాపితంగా నమోదైన కేసుల్లో ఆంధ్రప్రదేశ్ మూడవ స్థానంలో ఉంది. (రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ఒకటి రెండు స్థానాల్లో నిలిచాయి). ఎస్‌సి, ఎస్‌టి అత్యాచారాల నిరోధక చట్టం రూల్స్ 1995 ప్రకారం ప్రతి ఆరునెలలకొకసారి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో విజిలెన్స్, పర్యవేక్షణ కమిటీ రాష్ట్రస్థాయి సమావేశం జరగాలి.

ప్రతి మూడు నెలలకొకసారి కలెక్టర్, ఎస్‌పి, జిల్లా జడ్జి పర్యవేక్షణలో జిల్లా స్థాయి సమీక్షా సమావేశం జరగాలి. అలాంటి సమావేశాలు జరుగుతున్న దాఖలాలు కనిపించడం లేదు. ఓట్ల సమయంలో దళితులపై ప్రేమ కురిపిస్తూ ఇలాంటి సమావేశాలు నిర్వహించినప్పటికీ వాటి పట్ల దళితులకు భ్రమల్లేవు. ఎస్‌సి, ఎస్‌టి అత్యాచారాల నిరోధక చట్టాన్ని అత్యాచారం చేసిన వాళ్లే సమీక్షిస్తే ఫలితాలు ఎలా వుంటాయో ఈ 23 ఏళ్ళలో దళితులు బాగానే అర్థం చేసుకున్నారు.

ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ నేపథ్యంలో కుల వృత్తులు ధ్వంసమై బిసిలు పొట్ట చేతపట్టుకొని పట్టణాలకు నగరాలకు వలస వెళుతున్నారు. నగరాలలోని ప్రభుత్వ సంస్థలు మూతబడి కార్మికులు అడ్డా కూలీలుగా మారుతున్నారు. నానాటికీ నిరుద్యోగం, పేదరికం పెరిగిపోతుంది. నగరాలు మురికివాడలుగా మారి కిక్కిరిసి పోతుంటే నగరశివారుల్లో ఆకాశాన్నంటే భవనాలు అధునాతన వసతులతో హైటెక్ సిటీలు వెలుస్తున్నాయి. కోస్టల్ కారిడార్ పేరుతో సముద్ర తీరాన్ని కూడా కార్పొరేట్ సంస్థలు ఆక్రమించాయి.

తీరం పొడవునా స్టీల్ ప్లాంట్‌లు, షిప్ యార్డులు, ఓడరేవులు, థర్మల్ పవర్ ప్లాంట్‌లు, విషవాయువుల్ని వెదజల్లే రసాయన పరిశ్రమలు వెలుస్తున్నాయి. అరకొర పునరావాసంతో మత్స్యకారుల గ్రామాలు సముద్రానికి దూరంగా విసిరి వేయబడుతున్నాయి. తమ సాంప్రదాయ వృత్తిని కోల్పోయిన మత్స్యకారులు ఆకలితో అలమటిస్తున్నారు. కార్పొరేట్ రంగం విస్తరించే క్రమంలో పీడిత కులాల్లోని పేదలు ఒక చోటు నుంచి మరో చోటుకి తరిమివేయబడుతున్నారు. అతి కొద్ది కాలంలోనే ఎక్కడా నిలవలేని పరిస్థితులు రాబోతున్నాయి.

అడవుల్లో వుండే ఆదివాసులే గాక మైదాన ప్రాంతాల్లో వుండే పేదలు కూడా జీవన్మరణ పోరాటాలకు సిద్ధపడుతున్నారు. బతకాలంటే పోరాడక తప్పని పరిస్థితి అనివార్యంగానే ప్రజల ముందుకొచ్చింది. ఈ పరిస్థితుల్ని ముందుగానే కనిపెట్టిన పాలకులు ప్రజా ఉద్యమాల్ని అణచివేయడానికి 'ఊపా' లాంటి క్రూరమైన చట్టాల్ని చేస్తున్నారు. మరోవైపు ఎస్‌సి, ఎస్‌టి, బిసి కులాలకు చెందిన రాజకీయ నాయకులను, ఉన్నతాధికారులను రంగంలోకి దింపి ఆయా కులాల ప్రజల్ని మభ్యపెడుతూ, కుల సంఘాల నాయకుల్ని ప్రలోభపెడుతూ, కులతత్వాన్ని పెంచిపోషిస్తున్నారు. అందుకు 'లక్షింపేట' మారణహోమం ప్రత్యక్ష సాక్ష్యంగా మనముందుంది.

'ఏ భూమి కోసమైతే ఐదుగురు దళితులు అసువులు బాశారో 20 మంది వికలాంగులయ్యారో ఆ భూమి నుంచి శాశ్వతంగా దళితుల్ని దూరం చేసే కుట్ర జరుగుతుంది'. అధికార పార్టీలో ఉన్న దళిత ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలతో పాటు వారి కనుసన్నల్లో, వారి సహాయసహకారాలతో ఉద్యమాలను నడిపిస్తున్న కొందరు దళిత నాయకులు కూడా ఆ కుట్రలో భాగస్వాములౌతున్నారు. హంతకులను కాపాడుతూ, వారికి నజరానాగా 250 ఎకరాల భూమిని ఇవ్వడానికి కాపు కులాధినాయకుడు బొత్స సత్యనారాయణ ప్రయత్నిస్తుంటే చట్టాన్ని అమలు చేయడానికి దళితులైన స్థానిక సిఐగాని డిఎస్‌పిగాని, మంత్రిగానీ, అధికార, ప్రతిపక్షాలలో ఉన్న ఏ దళిత రాజకీయ నాయకుడు గానీ, ప్రయత్నించలేదు.

ఇలాంటి సందర్భాలలో దళిత అధికారుల్ని, రాజకీయ నాయకుల్ని వెనకేసుకొచ్చే ఆయా కుల సంఘాల నాయకులందరూ నేరస్తులే. మరోవైపు కమ్యూనిస్టులుగా చెప్పుకుంటున్న పార్టీలన్నీ ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకొని నామమాత్రంగా స్పందిస్తున్నారు. ఇంకోవైపు మార్క్సిస్టు ముసుగు తొడుక్కున్న కొందరు అగ్రకుల మేధావులు కులాల్ని మరుగుపరచి, వర్గాన్ని వేదిక మీదకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

దాడి చేసిన వారి కుల ప్రస్థావన తెస్తే అగ్రకులాల్లోని పేదలు దూరమవుతారనే కుటిల వాదన చేస్తున్నారు. అయినప్పటికీ హంతకుల అరెస్టుకై దళితులు గొంతెత్తి అరుస్తున్నారు. ఈ సందర్భంగా 'దళితులపై బతికే' వాళ్ళను, 'దళితుల కోసం బతుకుతున్న' వాళ్ళను వేరు చూస్తూ విభజన రేఖ గీయాల్సివుంది. అట్టడుగు స్థాయి దళిత, పీడిత కులాలకు అండగా నిలిచి, వారి బతుక్కి, బతుకుదెరువుకి భరోసా ఇచ్చే బలమైన ఉద్యమ నిర్మాణం జరగాలి. అది మనందరి తక్షణ కర్తవ్యం కావాలి. అదే దళిత మృతవీరులకు మనమందించే నిజమైన నివాళి.

- దుడ్డు ప్రభాకర్
కులనిర్మూలనా పోరాటసమితి, రాష్ట్ర అధ్యక్షులు 
Andhra Jyothi News Paper Dated : 18/07/2012 

No comments:

Post a Comment