Friday, July 13, 2012

క్రూరత్వం గర్జించిన రాత్రి - బొజ్జా తారకం

కొత్తగూడ దగ్గర మావోయిస్టులు సమావేశమవుతున్నారనే సమాచారం పోలీసుల వద్ద ఉంటే ఎంత మంది వస్తారని అంచానా వేశారో! వందలాది పోలీసులను అత్యాధునిక ఆయుధాలతో హెలికాప్టర్ల మీద తరలించారు. ఆ ఆయుధాలకు దొరికిన 17 మందిలో మైనారిటీ కూడా తీరని వారు ఏడుగురున్నారు... సిద్ధంగా లేని ఆదివాసీలపై యుద్ధం ఇది! రాజ్యాంగం మీద దాడి ఇది, ప్రజాస్వామ్య వ్యవస్థ మీద దాడి ఇది!

అది వెన్నెల రాత్రి. చుట్టూ పెద్ద పెద్ద చెట్లమధ్య ఓ పచ్చని స్థలం. పాల వెన్నెలను పలకరించుకుంటూ ఓ అరవై మంది ఆదివాసీలు అక్కడ సమావేశమయ్యారు. ప్రతి ఏటా జరుపుకొనే విత్తనాల పండగ గురి ంచి, గ్రామాలను విడిచి వెళ్లిపోయిన వారి భూమి పంపకం గురించి మాట్లాడుకుందామని మూడు గ్రామాల పెద్దలు అక్కడ చేరారు. పెద్దలతో పాటు పిల్లలూ, మగవాళ్లతో పాటు ఆడవాళ్లూ.. అది మామూలే. అడవిలో మైళ్ల కొద్దీ అమ్మానాన్నలతో కలిసి పిల్లలు నడుస్తూనే ఉంటారు. మగవాళ్లతో పాటు ఆడవాళ్లూ అరక దున్నుతారు. అక్కడ ఆడమగా తేడాలేదు.

అందరూ సమానమే, సమానంగా పనిచేసుకుంటారు. కూర్చుని మాట్లాడుకుంటున్నారు. అంతే.. హఠాత్తుగా నాలుగు పక్కల నుంచి మేఘాలు కమ్ముకొచ్చినట్టు ఓ ఎనిమిది, తొమ్మిది వందల మంది పోలీసులు ఆదివాసీల గుంపును చుట్టుముట్టి కాల్పులు సాగించారు. తుపాకీ గుళ్ల వర్షం కురిపించారు. అక్కడికక్కడ ముగ్గురు కుప్పకూలిపోయారు. పరిగెత్తుకుపోతున్నవారిని తరుముకుంటూ తుపాకీ పేల్చారు. మరికొంతమంది నేలకొరిగా రు. పాల వెన్నెలలో ఎర్రని చారలు. పచ్చటి మైదానంలో రక్తపు మరకలు.

పండగ గురించి మాట్లాడుకుంటున్న ఓ అరవైమంది ఆదివాసీలు హఠాత్తుగా మావోయిస్టులై పోయారు. వారిని చంపటానికి (పట్టుకోవటానికి కాదు!) ఓ తొమ్మిది వందల సాయుధ పోలీసులు! వీరిని చంపటానికి బలగాలను హెలికాప్టర్ల మీద ఆ ముందురోజు దించారు. సిఆర్‌పిఎఫ్, కోబ్రా, రాష్ట్ర పోలీసుకు చెందిన మూడు రకాల దళాలు మూడు గ్రామాల మీదికి దాడికి వచ్చాయి. కొత్తగూడ మధ్యలో ఉంటుంది. ఒక పక్క సర్కెగూడ, మరో పక్క రాజ్ పెంట. మధ్యలో ఉన్నది కాబట్టి కొత్తగూడలో సమావేశమయ్యారు. పైగా చెట్ల మధ్య విశాలమైన ఖాళీ స్థలం ఉన్నది. అక్కడే సమావేశాలు, పండగలూ అవుతాయేమో, ఎందుకంటే ఆ స్థలం మధ్య ఎత్తుగా ఒక స్తంభం పాతి ఉన్నది. ఆ స్తంభానికి చివర ఓ సన్నని కర్ర ఆకాశం కేసి చూస్తూ..

అక్కడ గుమిగూడిన వాళ్లు ఆదివాసీలా మావోయిస్టులా పోలీసులకు అవసరం లేదు. వాళ్లకు చంపటానికి మనుషులు కావాలి. ఎక్కువ మంది కూడా ప్రస్తుతం అవసరం లేదు. ఓ ముప్పై ఆరు మంది కావాలి. ఎందుకంటే సరిగ్గా రెండేళ్ల క్రితం జూన్ 28న బైలదిల్లలో మావోయిస్టులు 36 మంది సిఆర్‌పిఎఫ్ జవాన్లను కాల్చి చంపారట. ఇప్పుడు దానికి బదులు తీర్చుకోవాలి. పోయిన ఏడాది సరిగ్గా ఇదే రోజున ఓ ఏడుగురు ఆదివాసీలు దొరికారు, వారిని కాల్చిచంపారు. ఇప్పుడు మిగిలినవాళ్లు సరిపోతారనుకుని చుట్టుముట్టి కాల్పులు సాగిస్తే 17 మంది ఆదివాసీలతో పాటు ఎదురు బొదురుగా ఉన్న పోలీసులకు పోలీసు తుపాకుల నుంచే తూటాలు తగిలాయి. దానితో బిత్తరపోయి ఆపేశారు. ఆ పాటికే 17 మంది ఆదివాసీలు నేలకొరిగారు. ఆ సమావేశంలో మావోయిస్టులు అస్సలు లేరని అక్కడి ప్రజలు చెబుతున్నారు. ఆదివాసీల దగ్గర, సహజంగా ఉండే బాణాలు కూడా వారు ఆ రాత్రి తెచ్చుకోలేదు. వారు వచ్చినది పండగ గురించి మాట్లాడుకోవటానికి. అయితే పోలీసులు వచ్చింది మాత్రం జనాన్ని చంపటానికి, అందుకే ఆయుధాలతో వచ్చారు, హెలికాప్టర్లలో దిగారు.

చంపేసి పోలీసులు వెళ్లిపోలేదు. అంతరాత్రి పూట కూడా శవాలను బంధువులకు దక్కనీయకుండా ఎత్తుకుపోయారు. మళ్లీ తెల్లవారు జామునే వచ్చి అక్కడ, సమావేశం జరిగిన చోట రక్తంతో తడిసిన మట్టిని తవ్వుకుపోయారు. విప్పకాయలు ఏరుకున్నట్టు చెట్ల మధ్య పడిన తుపాకీ గుండ్లను ఏరుకుపోయారు. చిన్న తుప్పల మధ్య పడి ఉన్న గుండ్లు కనపడలేదు, అవి అక్కడే ఉన్నాయి. విచ్చల విడిగా, విచక్షణారహితంగా తుపాకులు పేల్చారేమో, చెట్లకు, చెట్లపై కొమ్మలకు గుండ్లు తగిలాయి. ఆ ఆనవాళ్లు ఇంకా ఉన్నాయి. ఎక్కడా ఆనవాళ్లు కనపడకుండా చేద్దామనుకుంటున్న పోలీసులకు ఒక వ్యక్తి తలుపు తీసుకొని బయటకు రావటం చూసి అతన్నీ కాల్చారు. తుపాకీ దెబ్బతిని లోపలకు పరుగెత్తిన వ్యక్తి ఇంట్లో జొరబడి అతను ఇంకా బ్రతికి ఉండటం చూసి, బయటకు ఈడ్చి ఓ బండరాయి తీసుకొని నెత్తిమీద కొట్టి చంపేశారు. గాయపడిన వ్యక్తి సాక్ష్యం చాలా బలంగా ఉంటుందని పోలీసులకు తెలుసు. చెట్లు చెపుతాయనే అనుమానం వస్తే వాటిని కూడా నరుక్కుపోతారు.

చూడటానికి గ్రామాలే కాని, ఒక్కో గూడెంలోను ఇరవై, ముప్పై ఇళ్లు మాత్రమే, అవయినా చిన్న చిన్నవి ఉంటాయి. జనాభా కూడా పెద్దగా ఉండదు. కొత్తగూడ దగ్గర మావోయిస్టులు సమావేశమవుతున్నారనే సమాచారం పోలీసుల వద్ద ఉంటే ఎంత మంది వస్తారని అంచానా వేశారో! పదులా, వందలా, వేలా? అడవిలో మావోయిస్టులు వేల సంఖ్యలో ఉంటారా? లేకపోతే సాయుధ బలగాలను, అత్యాధునికమైన ఆయుధాలతో హెలికాప్టర్ల మీద దించుతారా? అయితే ఈ ఆధునికమైన ఆయుధాలకు దొరికిన 17 మందిలో మైనారిటీ కూడా తీరని వారు ఏడుగురున్నారు. అందులో పదవ తరగతి చదువుతున్నవారు ఇద్దరు; 5, 8 తరగతి వరకూ చదివి ఆపేసిన వారు మరో ఇద్దరు.

మిగిలిన వాళ్లంతా వ్యవసాయం చేస్తున్నవారు, పిల్లలు గల వాళ్లు. 17 మందిలో ఉన్న కాకా సరస్వతికి పన్నెండేళ్లే! వీరంతా మావోయిస్టులే, వీరంతా భారత ప్రభుత్వంపై యుద్ధం చేస్తున్నవారే, కేంద్ర హోంమంత్రి చిదంబరం దృష్టిలో. అందుకే వారిని కాల్చిచంపినందుకు సిఆర్‌పిఎఫ్ దళాలకు మంచి కితాబు ఇచ్చాడు. వారి సాహసాన్ని కొనియాడాడు. విదేశీ సైన్యంపై దాడిచేసి వారిని చంపి దేశాన్ని కాపాడిన దేశభక్తులుగా వారిని మెచ్చుకున్నారు. సిఆర్‌పిఎఫ్ అధినేత కూడా అదే పాట పాడాడు. కొత్తగూడ చర్యను సమర్థించాడు. 'ఒక వేళ ఈ దాడిలో అమాయక ఆదివాసుల ప్రాణాలుపోతే విచారిస్తున్నాను' అన్నాడు చిదంబరం.

ఆయన కళ్లకు ఆదివాసీలు మావోయిస్టులుగానే కనబడుతున్నారు. సిఆర్‌పిఎఫ్ అధినేత మాట వరుసకు కూడా విచారం వెలిబుచ్చటం లేదు. ఆడవాళ్లను, పిల్లల్ని ఆదివాసీలను ఎందుకు చంపావయ్యా అంటే 'ఆ గుంపులో ఆదివాసీలెవరో, మావోయిస్టులెవరో ఎలా తెలుస్తుంది, బుల్లెట్‌కి కళ్లు ఉండవు గదా' అంటున్నాడు. బుల్లెట్‌కి కళ్లు ఉండవు, నిజమే, కాని తుపాకీ పేల్చేవాడికి కూడా కళ్లు ఉండవా? కళ్లు ఉన్నా మూసుకొని కాల్చారేమో వాళ్లను వాళ్లే కాల్చుకున్నారు. వారి తుపాకీ దెబ్బ వారికే తగిలింది. చిన్న పిల్లల్ని కూడా కాల్చిచంపారు.

తుపాకీ కాల్చి, చంపి, శవాల్ని ఎత్తుకుపోయారు. బంధువుల్ని కూడా శవాల్ని చూడనివ్వలేదు. భర్త శవం భార్యను చూడనివ్వలేదు; కొడుకు శవం తండ్రిని చూడనివ్వలేదు; అన్న శవం తమ్ముడిని చూడనివ్వలేదు; కూతురి శవం తల్లిని చూడనివ్వలేదు. ఎంత బ్రతిమాలినా శవాల దగ్గరకు వారిని రానివ్వలేదు. చివరకు కొందరు రాజకీయనాయకుల జోక్యంతో శవాలను బంధువులకు అప్పగించారు. 17 శవాలను మోసుకొచ్చిన గ్రామస్థులకు వాటిని కాల్చటానికి కట్టెలు దొరకలేదు. హత్యాకాండకు సాక్ష్యంగా నిలిచిన చెట్ల మధ్యనే అక్కడక్కడా పెట్టి నిప్పంటించారు. గాయపడిన కొందరిని ఆస్పత్రిలో ఉంచారు. వారిని కూడా చూడనివ్వటం లేదు.

బలగాలు హెలికాప్టర్లలో దిగాయి. ఎక్కడ? ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం, బీజాపూర్ జిల్లా బాసెగూడ పోలీస్ ష్టేషన్ పరిధిలో ఉన్న కొత్తగూడ గ్రామం. అది ఆదివాసీల గూడెం. అది చైనా సరిహద్దు కాదు. పాకిస్థాన్ సరిహద్దూ కాదు. పోనీ అది లడఖూ కాదు, కార్గిల్ కూడా కాదు. అది మామాలు ఆదివాసీల ఆవాసం. అక్కడికి హెలికాప్టర్ల మీద సాయుధ బలగాలు దిగాయి. ఎవరి మీద దాడి? 'ఆదివాసీల మీద' ! 'ఎందుకు?' 'వారి మధ్య మావోయిస్టులున్నారు'! 'ఉంటే కాల్చేస్తారా?' 'మావోయిస్టు పక్కనున్న వాడు మావోయిస్టే!' 'మావోయిస్టులయితే కనపడగానే కాల్చేస్తారా?' 'అవును కాల్చేస్తాం' 'అటువంటి అధికారం పోలీసు బలగాలకు గానీ మిలటరీ దళాలకు గాని ఉన్నదా?' 'లేదు'.

'మరి ఎలా చంపుతారు?' 'అధికారం ఉన్నది కదా, ఇది ప్రజాస్వామ్యం గదా! జీవించే హక్కు ఎవరికైనా ఉన్నది గదా, మరి దానిని ఎలా కాలరాచి వేస్తారు?' 'మమ్మల్నెవరడుగుతారు, దేశరక్షణ అంటాం, శాంతి భద్రతలు అంటాం, మావోయిస్టుల వల్ల దేశానికి ప్రమాదం ఉందని అంటాం, అభివృద్ధిని అడ్డుకుంటున్నారని అంటాం, కోర్టులు ఒప్పుకుంటాయి' అంటున్నారు. 'మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్‌లో ప్రవేశించి పదేళ్లు అయి ఉంటుందేమో, మరి అంతకు ముందు మీరు ఏమి అభిృవద్ధి చేశారు? చేస్తే ఆదివాసీల బ్రతుకులు ఎందుకంత బాధాకరంగా ఉన్నాయి' అని అడిగితే 'అపుడయిందేదో అయింది ఇప్పుడు అభివృద్ది చేస్తామంటే వాళ్లు అడ్డుకుంటున్నారు' అని అంటున్నారు.

వాళ్లు అభివృద్ధిని అడ్డుకోవటం లేదు, ఛత్తీస్‌గఢ్ అడవిలో ఉన్న ఖనిజాలను ఇతర సంపదను బహుళజాతి కార్పొరేట్ కంపెనీలకు ఇవ్వటానికి మీరు ఆదివాసీలను అడవినుంచి ఖాళీ చేయించాలని చూస్తున్నారు, దానిని ఆదివాసీలు ఒప్పుకోవటం లేదు. పోరాటం చేస్తున్నారు, దానికి మేము అండగా ఉన్నాం అని మావోయిస్టులు అంటున్నారు. అడవినుంచి ఆదివాసీలను ఖాళీ చేయించాలంటే ఆదివాసీలను చంపాలి, వాళ్లను చంపాలంటే మావోయిస్టులను చంపాలి. మావోయిస్టులను చంపాలంటే అడవిపై దాడి చెయ్యాలి. అడవిపై యుద్ధం చెయ్యాలి. అందుకే సాయుధ బలగాలు, హెలికాప్టర్లు, చీకటిలో కాల్పులు సాగించే యుద్ధ పరికరాలు, మానవ రహిత విమానాలు, ఆ విమానాల నిండా బాంబులు.

అడవిపై బాంబుల వర్షం. అడవిపై తుపాకీ దాడులు. 'ఆదివాసీలు పోయినా ఫరవాలేదు, చెట్లు కాలిపోయినా ఫరవాలేదు, నేల రక్తసిక్తమైనా ఫరావాలేదు. మాకు కావలసింది ఆదివాసీలు కాదు. చెట్లు కాదు, నేల కాదు, నేలకింద ఉన్న అపార సంపద.. చెట్లకింద ఉన్న ఖనిజాలు. ఇవి దొరికితే చాలు. ఆదివాసీలు లేకపోయినా, అడవి లేకపోయినా, జీవించే హక్కు భంగపడిపోయినా, చట్టాలు లేకపోయినా, రాజ్యాంగం లేకపోయిన ఫరావాలేదు. బహుళజాతి వ్యాపార సంస్థలకు అడవిలో ఉన్న సంపద అందించాలి. ఆ పనిచేయాలంటే యుద్ధం తప్పదు'. తప్పేట్టులేదు. అందుకనే కొత్తగూడల లాంటివి ఇంకా చాలా జరుగుతాయని సిఆర్‌పిఎఫ్ అధినేత అంటున్నాడు. సిద్ధంగా లేని ఆదివాసీలపై యుద్ధం ఇది! నిరాయుధులైన ఆదివాసీలపై అత్యాధునికమైన ఆయుధాల, యంత్రాల దాడి ఇది! ప్రజల మీద దాడి ఇది, రాజ్యాంగం మీద దాడి ఇది, ప్రజాస్వామ్య వ్యవస్థ మీద దాడి ఇది!
- బొజ్జా తారకం
Andhra Jyothi News Paper Dated : 14/07/2012 

No comments:

Post a Comment