Sunday, November 11, 2012

గురజాడను వలచి.. అంబేడ్కర్‌ను మరచి, - బొర్రా గోవర్థన్'కులం' పునాది ఎంత బలంగా ఉంటుందో 'గురజాడ - అంబేద్కర్'ల విషయాన్ని చూస్తేనే అర్ధమైపోతుంది. గురజాడ 150వ జయంతిని ఆంధ్ర దేశం ఎంతో ఘనంగా జరుపుకుంది. ముఖ్యంగా ఇంగ్లీషు వ్యామో హం వెర్రులెత్తిన ఈ రోజుల్లో గురజాడను గుర్తు చేసుకోల్సిన అవసరం ఎంతో ఉంది. తెలుగు భాషను బ్రతికించుకోడానికి ఈ తరానికి గురజాడను ఎక్కువగా పరిచయం చేయాల్సిన కర్తవ్యమూ ఉంది. దీన్ని ఎవ్వరూ కాదనలేం. ఇటు మాతృభాష విషయంలో, అటు వ్యవహారిక భాష విషయంలో, ఈ రెండింటికీ మించి సంస్కరణోద్యమ విషయంలో ఎవరన్నా కాదన్నా మన 'అడుగుజాడ' గురజాడే. ఈ చారిత్రక నేపథ్యాన్ని గుర్తించే తెలుగు నాట పత్రికలన్నీ గురజాడకు ఈ రోజున సముచిత గౌరవాన్నిచ్చాయి. సాహితీ పత్రికలైతే ఎకాఎకిని ప్రత్యేక సంచికల్నే ప్రకటించాయి. దిన పత్రికల్లో పుంకానుపుంకాలుగా వ్యాస పరంపరలు కొనసాగాయి. ఇందుకు అందర్నీ అభినందించాలి. 

భాష విషయంలో గురజాడే ఆద్యుడు కాడనీ... ఆయన కంటే ముందే ఇంకొన్ని అడుగుజాడలున్నాయనే వాదం కూడా అక్కడక్కడా చెదురుమదురుగా కనిపించింది. మరీ ముఖ్యంగా ఆయన ప్రాచుర్యాన్ని కల్గించిన 'ముత్యాలసరం' ఛందస్సు మీద కాస్త ఎక్కువగానే చర్చలు కొనసాగాయి. సాగుతున్నాయి. 

'గురజాడ దేశభక్త' గీతాన్ని ప్రపంచ మానవ గీతంగా శ్రీశ్రీ అభివర్ణించాడు. దేశభక్తికి, మానవశక్తికి ఒక మచ్చుతునకగా ఆ గీతం ఎన్ని తరాలైనా మిగిలిపోతుంది. ఇది కాదనలేని సత్యం కూడా. 

అయితే... చరిత్ర మన సొంతం కాదు. శ్రీశ్రీ అన్న ట్లు 'దాచేస్తే దాగని' సత్యాలు ఎన్నో ఉంటాయి. 'కవి' కాలానికి తగిన విధంగా జీవించాలి. రాయాలి. గురజాడ నూటికి నూరుశాతం కాలానికి అనుగుణంగా జీవించాడా? ఆలోచించాడా? అనేదే ఇక్కడి విషయం.

గురజాడ 1862లో పుట్టాడు. అప్పటికి కొద్ది ఏళ్లకు ముందే ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామం జరిగి, దారుణంగా అణచివేయబడింది. బ్రిటీషు పాలనకు వ్యతిరేకంగా జరిగిన తొలి తిరుగుబాటు అది. దేశంలో స్వేచ్ఛా స్వాతంత్య్రాలు మొలకెత్తిన తొలినాళ్లలోనే గురజాడ పుట్టాడు. గురజాడ కోడె మీసాలు దువ్వే పాతికేళ్ల వయస్సులో కాంగ్రెస్ సంస్థ కూడా పుట్టింది. బాల్య Äౌవ్వన దశలు దాటి అచ్చమైన వ్యక్తిత్వాలు పుట్టే 35-45 ఏళ్ల వయస్సులో ఈ దేశాన్ని గొప్పగా ప్రభావితం చేసిన వందేమాతర ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. ఒకవైపు పరదాస్యశృంఖలాల్ని త్రెంచుకోటానికి భారత ప్రజలు అనేక దారుల్లో బ్రిటీషు వారిపై పోరాటాలు ఎక్కుపెట్టారు. 'దేశభక్తి' గీతాన్ని ఆలపించిన గురజాడ స్వరంలో ఎక్కడా స్వాతంత్య్ర పోరాట దీపికలు ఛాయకైనా కన్పించలేదు. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం, ఆశ్చర్యపడాల్సిన సంగతి. 

స్వాతంత్య్ర పోరాట గీతాలు రాయక పోవటం అటుంచి 1912లో మన దేశానికి వచ్చిన జార్జి-5 ను ఆకాశానికెత్తి కీర్తించాడు. ఆ గీతాన్ని చూడండి: వెల్లువగ నారోగ్య సంపద
లుల్లమలరుచు నిచ్చుగావుత
తల్లి భరత మాత పంచుము
జార్జి కెల్లపుడున్
జార్జి సామ్రాట్చాస నంబుల
జాజి పూవుల దండ మాడ్కిని
రాజరాజుల శిరములందున
దాల్చి మనవలయున్
మర్మ మెరుగని ధర్మమనియెడి
నిర్మలంబగు నీతి పథమున
పేర్మి ప్రజలను మలచు నేర్పరి
జార్జి మనవలయున్
భరత ఖండం బెన్నడెరుగని
నిరత శాంతి నొసంగి విద్యల
నెరయ నించిన యాంగిలేయుల
రేడు మనవలయున్
కొల్లబోవగ జంపి శత్రుల
ఢిల్లి పట్టము గట్ట బలిమిని
తొల్లి నల్లని దేవుడొక్క
డజాత శత్రునకున్
నల్లవాడును తెల్లవాడును
నెల్ల శుభముల గూర్చు గావుత
తల్లి మేరీ మహారాజ్ఞికి
జార్జి నరపతికిన్! 

ఈ కవిత 'ముత్యాలసరము' పేరుతో గురజాడ రచనగా సెట్టి ఈశ్వరరావు సంపాదకత్వంలో విశాలాంధ్ర ప్రచురణగా గురజాడ రచనలు, కవితల సంపుటంలో 71వ పేజీలో ఉంది. పూర్వం రాజాస్థానాల్లో రాజుల్ని 'తెగపొగిడే' ఉద్యోగ వర్గం ఒకటుండేది. 'రాజాధిరాజా! రాజమార్తాండ!' ఇలాగ. ఈ కవిత చూస్తుంటే గురజాడ మాయాబజార్ సినిమాలో 'శాస్త్రి, శర్మ'ల పాత్ర పోషించిన వాడిలా అగుపిస్తాడు! 'జార్జి నరపతిని' ఇం తగా నెత్తిని పెట్టుకొన్న గురజాడ, దీనికంటే ముందు అంటే 1908లో స్వాతంత్య్రం కోసం పోరాడే కాంగ్రెస్ సంస్థ మీద వ్యంగ్యంగా ఓ గేయం కూడా రాశారు. 

1905-10 మధ్య కాంగ్రెస్‌లో మితవాదులు, అతివాదుల మధ్య తీవ్రంగా అభిప్రాయ భేదాలు వచ్చాయి. దాదాభాయి నౌరోజీ, గోపాలకృష్ణ గోఖలేల వర్గం మితవాదులుగా, లాలాలజపతిరాయ్, బాలగంగాధర తిలక్, బిపిన్ చంద్రపాల్‌లు అతివాద వర్గంగా కలహించుకునే కాలం. ఈ సందర్భంగా.. 1908లో మద్రాసులో కాంగ్రెస్ మహాసభ జరిగింది. ఆ సందర్భంగా గురజాడ ఇలా రాశారు. 

పాడవోయ్ కవీ! కాంగ్రెస్ ఒక
భజన సమాజం మాత్రమే అనీ ... ... ...
మితవాదులు నేర్చే గుణపాఠం
ఏయే ఎండల కాయా గొడుగులు!
కాదని బరిదిగి తిరగబడేవో
ద్వీపాంతరమే! లేదిక తిరుగుడు!
ఇందులో ఏ ఎండకు ఆ గొడుకు పట్టేవాళ్లు 'మితవాదు'లని హేళన ఉంది... కాదని బ్రిటీషు వారి మీదికి తిరగబడితే... ద్వీపాంతరం - అంటే అండమాన్ జైలుశిక్షే అనే బెదిరింపూ ఉంది. కాబట్టి దీనికి 'విరుగుడు'గా ఒక మార్గాన్ని కూడా గురజాడ చూపించాడు.

కావున జోరుగ కంఠశోషగా
ఉపన్యసిస్తూ నుంచుందాం
అస్తమానమూ లాభం చూడక
రాజభక్తితో పొంచుందాం! 

బ్రిటీషు వారి పట్ల చూపించాల్సిన ఈ రాజభక్తిని ఆ తర్వాత 2012లో జార్జి-5 వచ్చినప్పుడు చూపించాడు. పోనీ 'కాంగ్రెస్ మార్గంలో స్వాతంత్య్రం రాదు' అని అనుకుని, కాంగ్రెస్ పోరాట విధానాలు నచ్చక, మరో పోరాట మార్గాన్ని ఏదైనా గురజాడ చూపించాడా? అంటే అదీ లేదు. గురజాడకు భారత స్వాతంత్య్రం పట్లే యిష్టత లేదు. మార్గం పట్ల కాదు. అసలు స్వాతంత్య్రం పట్లే. ఇది వాస్తవం. 

నిజానికి ఇది ఆనాడు ఒక్క గురజాడకే కాదు. దాదాపు సంఘసంస్కర్తలందరికీ లేదు. కన్యాశుల్కం, బాల్య వివాహాలు, సతీసహగమనాలు, స్త్రీ అణచివేత, అంటరానితనం, అవిద్య ఇలాంటి దురాచారాలతో నిండుకు పోయిన హిందూ సంఘాన్ని సంస్కరించాలనుకునే సంస్కర్తలందరూ స్వాతంత్య్ర పోరాటాన్ని విమర్శించినవారే. వ్యతిరేకించినవారే. ఈ దురాచారాల్ని చట్టబద్ధంగా నిర్మూలించడానికి పూనుకున్న బ్రిటీషు వారి పాలన పోయి, స్వదేశీయుల పాలన వస్తే పోతున్నాయనుకుంటున్న దురాచారాలు ఎక్కడ తిరిగి వచ్చిపడతాయోనని భయపడినవారే. 

నిజానికి రంవీంద్రనాధ్ ఠాగూర్ కూడా ఈ కోవలోనివాడే. నేడు మన జాతీయ గీతంగా ఉన్న 'జనగణమన అధినాయక జయహే' అనేది జార్జి ఐదునో, జార్జి ఆరునో కీర్తిస్తూ రాసిన గీతమే! అనేది ఒక వాదం ఉంది. చరిత్రను విశ్లేషించుకునేప్పుడు పరిపూర్ణత ఏ దశలోనూ, ఏ వ్యక్తిలోనూ కనిపించదు. మనకు నచ్చినవో, నచ్చనివో ఏవో కొన్ని 'మూలాలు' ఉంటూనే ఉంటా యి. నిజానికి అలా ఉండడమే శాస్త్రీయం కూడా! అనేక అపరిపూర్ణతలే ఒక పరిపూర్ణత వైపుకు నడుస్తూ ఉంటాయి. నడిపిస్తూ ఉంటాయి. ఇది సత్యం. 

మరి, అలాంటప్పుడు గురజాడ తప్పేంటి? అనుకోవచ్చు. గురజాడను ఒక భాషావాదిగానో, ఒక సంఘ సంస్కర్తగానో చూస్తున్నాం. ఒక స్వాతంత్య్ర పోరాట యోధుడుగా చూడ్డం లేదు కదా! అని సరిపెట్టుకోవచ్చు. సరే, అలాగే సరిపెట్టుకుందాం. అయితే...

అన్ని సామాజిక సంస్థలతోపాటు కమ్యూనిస్టు సంస్థలూ, వారి పత్రికలూ గురజాడను ఆకాశానికెత్తేశాయి. ఇది తప్పు కూడా కాదు. కానీ, ఇక్కడ ఒక్కసారి అంబేద్కర్ గుర్తుకు వస్తాడు. గురజాడ కేవలం ఒక్క 'రంగం'లోనే ఆదర్శవాది. ఆయన రచనలు ఆనాటి 'కన్యాశుల్కాన్ని' తీవ్రంగా వ్యతిరేకించాయి. బాల్య వివాహాల్ని ఎదుర్కొన్నాయి. నిజం చెప్పాలంటే ఈ దురాచారం ఆనాటి అగ్రకుల బ్రాహ్మణుల్లోనే ఉండేది. క్షత్రియ వర్గాల్లో కూడా కొద్దిగా కన్పించేది. వైశ్య, శూద్ర, అంటరాని కులాల్లో ఉండేది కాదు. అంటే... జనాభాలో 0.01 శాతంలో కూడా లేని ఒక దురాచారం మీదే గురజాడ పోరాటం. 

కానీ విద్య, సాంఘిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ రంగాల్లో ఈ దేశంలో దాదాపు సగం మందికి అంబేద్కర్ దారి చూపాడు. స్త్రీల విషయాన్ని కూడా తీసుకుంటే 85 శాతం మందికి దిక్కు చూపిన చుక్కాని అయ్యాడు. కాదు, ఇంకా.. ఇంకా.. అంబేద్కర్ కృషిని తగ్గించి.. తగ్గించి.. చూసుకుంటే కనీసం ఈ దేశంలో అంటరానివారిగా బ్రతుకు లీడుస్తున్న 20 శాతం మందిని 'బ్రోచిన' మహనీయుడు. అంటరానివారిని అన్ని రంగాల్లో ముందుకు నడిపించడానికి ప్రణాలికా బద్దంగా కృషి చేసిన అంబేద్కర్‌ని మాత్రం 'కమ్యూనిష్టు పార్టీలు' ఎందుకు అంటరానివాడుగా చూస్తున్నాయో అర్థం కావటం లేదు. ఈ దేశంలో కమ్యూనిష్టు ఉద్యమాలు ప్రక్కదారి పట్టాయి కాబట్టి 'మార్క్సిజాన్ని' తప్పు పట్టాల్సిన పనిలేదు. 'వర్గ' దృక్పథంతో నిండిపోయిన వారి మనసుల్లో భారతదేశంలోని 'కులం' 'అంటరానితనం' కాస్త కూడా చోటు కల్పించుకోలేకపోయిందే అనే బాధే మిగిలిపోయింది. 

పుట్టుక సమయంలో 'మాల మాదిగల' పార్టీగా పేరు పొందిన కమ్యూనిష్టు పార్టీల్లో ఈనాడు ఏ ఒక్క పార్టీలో కూడా ఆ నిమ్న వర్గాలకి చెందిన వారు చేతివ్రేళ్ళకు మించి సభ్యులుగా లేరు. ఇక నాయకత్వం మాట సరేసరి. కార్ల్ మార్క్స్ అంటాడు- 'పాలక వర్గాలు, తమ పాలిత వర్గాల్లో ఉన్న మేధావుల్ని తమ వాళ్ళుగా ముద్ర వేయించుకొని, తమ మనుగడను సాగించుకొంటాయి' అని. ఆనాటి అట్టడుగు వర్గాల ఆశాజ్యోతి అయిన అంబేద్కర్‌ను 'బ్రిటీషు వలస పాలకుల ఏజెంటు'గా కమ్యూనిష్టు పార్టీలు ముద్ర వేశాయి. ఎందుకంటే.. మనం ఇంతకుముందు చెప్పుకొన్నట్లు సంఘ సంస్కర్తల మాదిరిగానే అంబేద్కర్ కూడా భయపడ్డాడు. మరలా హిందూ పాలకుల చేతికి రాజ్యం వస్తే 'అంటరానితనం' పెచ్చరిల్లిపోతుందని భయపడ్డాడు. అయినా, బ్రిటీషు వారి పాలన భారత గడ్డ మీద కొనసాగాలని ఆయన కోరుకోలేదు. స్వాతంత్య్రాన్ని ఆకాంక్షించాడు. అయితే వచ్చే స్వాతంత్య్రంలో 'తమ వాటా తమకే దక్కాలని' మాత్రం గట్టిగా నిలబడ్డాడు. 

వర్గ దృక్పథం వల్లో, వర్ణ దృక్పథం వల్లో భారత కమ్యూనిష్టు కురువృద్ధులే అంబేద్కర్‌ని దూరంగా పెట్టారు. కాలక్రమంలో అంబేద్కర్‌ని ప్రేమించే, తను నాయకునిగా ఆరాధించే అణగారిన వర్గాల నుండి తమకు తామే క్రమంగా దూరం అయిపోయారు. శూద్రవర్ణంలోని అగ్రకులాలకే పరిమితమైపోయారు. మార్క్స్ అన్నట్లు పాలక వర్గాలే అణగారిన వర్గాల ఓట్లను పొందడానికి ఇంకా అంబేద్కర్‌నే చూపిస్తూ బ్రతుకుతున్నాయి. ఈ దేశంలో ఏ ఒక్క కమ్యూనిష్టు పత్రిక - అంబేద్కర్ ప్రత్యేక సంచికల్ని ప్రకటించిన దాఖలాలు లేవు. బహుశా అంబేద్కర్ అగ్రవర్ణంలో పుట్టి అంటరానివారి కోసం పోరాడి ఉంటే అలాంటి ప్రయత్నం చేసేవారేమో! 

- బొర్రా గోవర్థన్
బౌద్ధ రచయిత

Andhra Jyothi News Paper Dated: 12/11/2012 

No comments:

Post a Comment