Friday, November 2, 2012

బాల్య వివాహాలతోనే భద్రతా..! ---- -డాక్టర్ సరస్వతి, ఐసీఎస్‌ఎస్‌ఆర్ న్యూ ఢిల్లీ మాజీ డైరెక్టర్మాటల్లో పరుగు నడకలో వెనకడుగు అంటే ఇదే నేమో. ఇరవై ఒకటో శతాబ్దంలోకి శరవేగంతో పరుగులు తీస్తున్నామని ఒకవైపు గొప్పలు చెప్పుకుంటూనే.. చేతల్లో మాత్రం మధ్యయుగాల్లోకి ప్రయాణించడం మనం చూస్తున్నాం. ముఖ్యంగా మహిళలపై నానాటికీ పెరుగుతున్న హింసా, దౌర్జన్యాల విషయంలో సమాజం వికృతమైన పరిష్కారాలను ఎంచుకుంటున్నది. స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలకు విరుగుడు బాల్య వివాహాలే మందు అని చెప్పుకొస్తున్నది. ఈ మధ్య హర్యానా రాష్ట్రంలోని రోహతక్ జిల్లాలో కుల పంచాయితీ (ఖాప్ పంచాయత్)లు స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలు తగ్గాలంటే బాలికలందరికీ 16-18 ఏళ్లలోపుగానే పెళ్లిళ్లు చేయాలని తీర్మానించారు. దీన్ని అందరూ పాటించాలని హుకుం జారీ చేశారు. దీంతో పురుషులు స్వభావరీత్యా, సహజంగా అఘాయిత్యంచేసే స్వభావంతో ఉంటారనీ, వారినుంచి రక్షించుకోవడానికి మహిళలు ముఖ్యంగా బాలికలు తమను తాము రక్షించుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కుల పెద్దలు చెప్పదలిచారు. దీన్నిఅందరూ ఖండించాలి. ఇలాంటి తీర్మానాలను, భావజాలాన్ని తీవ్రంగా పరిగణించాలి. కానీ దురదృష్టవశాత్తు దేశవ్యాప్తంగా దీనిపై రావలసినంత వ్యతిరేకత, జరగవలసినంత చర్చ జరగలేదు. ఖాప్ పంచాయితీల తీర్పును చూస్తే రోగం కంటే మందే ప్రమాదకరమైనదిగా కనిపిస్తున్నది. గ్రామపెద్దల ఆధిపత్యంలో జరుగుతున్న ఖాప్ పంచాయితీలన్నీ చట్టవ్యతిరేకమైనవి. వీటికి ఎలాంటి న్యాయబద్ధత లేదు. సంప్రదాయం పేరిట గ్రామ పెద్దలు కాలం చెల్లిన మధ్యయుగాల నాటి భావజాలంతో తమ ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు చేస్తున్న విధానాలే తప్ప మరేమీ కాదు. కుల మత వాదాలతో చేస్తున్న తీర్పులు అమానవీయమైనవి. దేశం శాస్త్ర,సాంకేతిక రంగాల్లో దూసుకుపోతుంటే.. గ్రామీణ భారత సమాజం మాత్రం మధ్యయుగాల్లోకి వెనక్కి వెళుతున్న దాఖలాకు ఇది నిదర్శనం. ఆశ్చర్యకరమైన విషయమేమంటే.. హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా కూడా ఖాప్ పంచాయితీలకు వంతపాడటం. ఇంకా ఆయన ఒక అడుగు ముందుకేసి బాలబాలికలకు 18 ఏళ్ల లోపే పెళ్లిళ్లు చేయాలని చెప్పుకొస్తున్నారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దౌర్జన్యాలు అనే సామాజిక సమస్యలను బాల్య వివాహాలతో పరిష్కరిస్తామనడం విడ్డూరం.

స్త్రీలపై అత్యాచారాల విషయంలో దేశంలోనే హర్యానా రాష్ట్రం అగ్రభాగాన ఉన్నది. అత్యాచారాలు, మూకుమ్మడి అత్యాచారాలు నిత్యకృత్యమయ్యాయి. అయితే వీటికి బలవుతున్నది ఎక్కువ శాతం దళితులే. అలాగే గ్యాంగ్‌రేప్ ఉదంతాలన్నీ ఎక్కువ శాతం గ్రామాల్లో ఏవో కక్షలు, భూమి తగాదాలే భూమికగా ఉంటున్నాయి. అంటే తమ ఆధిపత్యాన్ని నిరూపించుకునేందుకు ప్రత్యర్థి వర్గాల మహిళలపై అత్యాచారాలకు ఒడిగడుతున్నారు. ఈ క్రమంలో పండు ముసలి నుంచి పసి పిల్లల వరకూ అత్యాచారాలకు, గ్యాంగ్‌రేప్‌లకు గురవుతున్నారు. అయితే ఈ అత్యాచారాలకు పాల్పడుతున్న వారు కూడా ఏదో కన్ను మిన్ను గానకుండా ఉన్న రౌడీ మూకలేం కాదు. చదువుకుంటున్న విద్యార్థుల నుంచి నడివయస్కులు, వృద్ధులు కూడా అత్యాచారాలు చేస్తున్న వారిలో ఉంటున్నారు. అంటే.. ఈ అత్యాచార ఉదంతాల్లో లైంగికపరమైన అంశమే గాకుండా ఆర్థిక, సామాజిక పరమైన ఆధిపత్య అంశాలు కూడా ఇమిడి ఉన్నాయి. అలాంటప్పుడు ఖాప్ పంచాయితీలు చెబుతున్నట్లు 18 ఏళ్లకే పెళ్లిళ్లు చేసినంత మాత్రాన ఈ అత్యాచారాలకు పరిష్కారం దొరుకుతుందా?

చౌతాలా మరో అడుగు మందుకేసి పూర్వకాలంలోవిదేశీ శతృమూకల నుంచి తమ మహిళలను రక్షించుకునేందుకు బాల్యవివాహాలు చేసేవారని చెప్పుకొచ్చారు. బహుశా ఇప్పుడు కూడా అదే పరిష్కారమని ఆయన ఉద్దేశ్యం గా కనబడుతున్నది. కానీ చరిత్ర మరోలా చెబుతున్నది. విదేశీ శతృమూకలను ఎదిరించేందుకు తమ మాన ప్రాణాలను రక్షించుకునేందుకు చివరి వరకూ పోరాడిన చరిత్ర ఉన్నది. బలిదానాలు చేసిన చరిత్ర ఉన్నది. మహిళల రక్షణ వారి వివాహాలపైనే ఆధారపడి ఉండడమన్నది నాగరిక సమాజ లక్షణం కాదు. అలాగే..పశుత్వం నిండిన మగాళ్ల ఆకృత్యాలకు పెళ్లిళ్లే అడ్డుకట్ట వేస్తాయని చెప్పడమూ అశాస్త్రీయం. ఇప్పు డు ఆలోచించాల్సింది కూడా.. మహిళలకు అన్ని పరిస్థితుల్లో రక్షణ ఎప్పుడు? ఎలా? అన్నదాని గురించి ఆలోచించాలి. మహిళలపై అత్యాచారాలకు ఒడిగడుతున్న వారంతా.. రౌడీలు, సామాజిక, ఆర్థిక , రాజకీయ పలుకుబడి ఉన్న వారే ఉంటున్నారు. తమ ఆధిపత్యం కోసం చేస్తున్నవారే ఎక్కువగా ఉంటున్నారు. ఇలాంటి వారు కోర్టుముందు దోషులుగా నిలబడటం, శిక్షలు పడటం అనేది చాలా అరుదైన విషయం. ఈ పరిస్థితుల్లో బాల్యవివాహాలే అత్యాచారాలకు పరిష్కారమవుతాయనడం అసమంజసం. అలాగే.. చట్టం, న్యాయం, మానవీయత, శాస్త్రీయత అన్న అంశాలను చూడకుండా.. అంధయుగంనాటి చూపుతో మాట్లాడటం అవివేకం. నిజానికి అత్యాచారమనేది నేరాల్లో కెల్లా అత్యంత క్రూరమైనది. ఈ అత్యాచారాల నిరోధానికి ఎన్నో రకాల చట్టాలున్నాయి. కానీ రోజు రోజుకూ అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. దురదృష్టవశాత్తు ఈ విషయంపై సమాజంలో ఆశించినంత స్థాయిలో స్పందించడంలేదు. అలాగే చాలా సందర్భాల్లో అత్యాచారాలకు హేతువుగా.. స్త్రీ ధరించిన బట్టలనో, ఆమె నడతనో చూపడం పరిపాటయ్యింది. అంతేగాక అత్యాచారం జరగడానికి పరోక్షంగా ఆమెనే బాధ్యురాలుగా చేయడం జరుగుతున్నది. ఒక్కోసారి న్యాయస్థానాలు కూడా ఇలాంటి ప్రభావాలతోనే తీర్పులు ఇచ్చిన సంఘటలు న్నాయి. ఈ నేపథ్యంలో చాలా సందర్భాల్లో రేపిస్టులకు నామమావూతపు శిక్షలు పడుతున్నాయి. పితృస్వామిక, ఆధిపత్య భావజాల ప్రభావం వెలుగులోనే న్యాయస్థానాల తీర్పులు ఉండటం మన సమాజ మానవీయతకు మచ్చగానే చెప్పాలి. 

విషాదమేమంటే.. అక్టోబర్ 11ను అంతర్జాతీయ బాలికల దినంగా ప్రపంచ వ్యాప్తంగా జరుపుకున్నాం. మరోవైపు ఈ సమయంలోనే ఖాప్ పంచాయితీలు బాల్య వివాహాలే మహిళలకు రక్షణ అని ప్రకటించాయి. ఐక్యరాజ్య సమితి, యూనిసెఫ్,యూఎన్‌ఐఎఫ్‌పిఎ, ఐక్య రాజ్యసమితి సమాచారా విభాగం తేల్చిన గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మహిళలపై దాడులు పెరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న బాల్య వివాహాల్లో 40 శాతం ఒక్క భారత్‌లోనే జరుగుతున్నాయి. 2010-11లో 47 శాతం మందికి 20- 24 ఏళ్లలోపే పెళ్లిళ్లు జరిగాయి. ఇవి ఇంతకు ముందు 18 ఏళ్లలోపే జరిగేవి. 2007-08లో 43 శాతం మంది బాలికలకు మైనారిటీ తీరకముందే పెళ్ళిళ్లు జరిగాయి. ఈ బాల్య వివాహాలతో ఎన్నో సామాజిక సమస్యలు వస్తున్నాయి. ప్రధానంగా ఎక్కువ శాతం మంది మహిళల చదువులు అర్థాంతరంగా నిలిచిపోతున్నాయి. చిన్న వయస్సులో వివాహాల కారణంగా పుట్టిన బిడ్డల ఆరోగ్యం, పోషకాహారలోపం తదితర కారణాలతో శిశు మరణాలు పెరిగిపోతున్నాయి. అధిక శాతం మంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. ప్రసూతి మరణాల రేటు గణనీయంగా ఉన్నది. జాతీయ కుటుంబ ఆరోగ్య పరిశీలన ప్రకారం 15-19 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న బాలికల్లో 47 శాతం మంది రక్తహీనతతో పీడింపబడుతున్నారు. ఇలాంటి వారికి పుట్టిన బిడ్డలు సరైన ఎదుగుదల లేక అకాల మరణాలకు గురవుతున్నారు. బాల్య వివాహాలు సమాజాన్ని పీడిస్తున్న ప్రధాన సమస్యగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సమాజికాభివృద్ధి సూచికలో భారతదేశం చిట్టచివర ఉంటున్నది. 

ఈ మధ్యనే ఢిల్లీ హైకోర్టు ఓ తీర్పు ఇచ్చింది. 15 ఏళ్లలోపు అమ్మాయికి పెళ్లి అయినా, ఆమె అంగీకారంతో కాపురం చేస్తున్నా అది అత్యాచారం కిందికే వస్తుందని పేర్కొన్నది. ఈ నేపథ్యంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు బాల్య వివాహాలే పరిష్కారమంటున్న వారు దీన్ని గ్రహిస్తే మంచిది. ఈ తీర్పు ప్రకారం ఖాప్ పంచాయితీలు చేస్తున్న పెద్దమనుషులంతా నేరస్తులుగా మిగులుతారు. మొదటగా సమాజంలో స్త్రీని ఒక ఆస్తిగా చూసే చూపులో మార్పురావాలి. దీని ప్రాతిపదికగా పురుషుల ఆలోచనా విధానం మారాలి. దీనికి గ్రామస్థాయి నుంచి పెద్ద ఎత్తున చైతన్యం చేసే కార్యక్షికమాలు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు చేపట్టాలి. ఈ విధానాలతోనే సమాజంలో మానవీయతను పాదుకొల్పగలం. కానీ.. స్త్రీల మనుగడ అనేది.. మీరు గొడ్డలి వేటుకు చస్తారా? విషవూపయోగంతో చస్తారా తేల్చుకోండన్న రీతిలో ఉండకూడదు. ఈ పరిస్థితిలో కారుచీకటిలో కాంతి రేఖగా హర్యానా లోని సోనేపట్‌లో ఖాప్ పంచాయితీ.. బాల్య వివాహాలను తప్పు పడుతూ తీర్మానించింది. ఇదే స్ఫూర్తిగా గ్రామీణ భారతమంతా కదిలినప్పుడే బాల్య వివాహాలు అంతమవుతాయి. స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలకు సరియైన పరిష్కారాలు వెతుకుతాయి. ఈ దిశలో గ్రామీణ భారత సమాజం అడుగులు వేయాలి. కేవలం కోర్టులు, చట్టాలే మహిళలకు భద్రత కల్పించలేవు. మహిళలకు రక్షణ, భద్రత సమాజం నుంచే అందాలి. 

-డాక్టర్ సరస్వతి, ఐసీఎస్‌ఎస్‌ఆర్ న్యూ ఢిల్లీ మాజీ డైరెక్టర్
(ఇండియా న్యూస్ అండ్ ఫీచర్ అలయెన్స్

Namasete Telangana News Paper Dated : 03/11/2012 

No comments:

Post a Comment