Wednesday, November 7, 2012

వికలాంగుల విద్యపై వివక్ష----బుద్ధారం రమేష్‘అందరు చదవాలి -అందరూ ఎదగాలి’ ఇది సర్వ శిక్ష అభియాన్ నినా దం. అందరికి విద్యనందిస్తామని సర్కార్ చేసిన శపథం. విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించాల్సిన కేంద్రం ఆరు దశాబ్దాల అనంతరం 2010 ఏప్రిల్ ఒకటి నుంచి విద్యాహక్కు చట్టాన్ని అమలులోకి తెచ్చింది. ‘దేశంలోని బాల బాలికలందరికీ (6-14 సంవత్సరాలు) కుల, మత, లింగ, జాతి భేదంలేకుండా, విజ్ఞానం, నైపుణ్యాలు, విలువలతో కూడిన సంపూర్ణ బాధ్యతాయుత పౌరుణ్ణి తయారు చేసే విద్యనందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నది’. ఇవి సాక్షాత్తు దేశ ప్రధాని మన్మోహన్‌సింగ్ విద్యా హక్కు చట్టం ప్రవేశపెట్టే ముందుచేసిన వ్యాఖ్యలు. అయితే ఈ విద్యాహక్కు చట్టం వికలాంగులను విస్మరించింది. దీనిపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు రావడంతో ఈ చట్టాన్ని సవరిస్తూ ‘అంగవైకల్యం గల పిల్లలు’ అనే పదాన్ని జోడించి సవరించి, 2012 జూన్ నుంచి అమల్లోకి తెచ్చారు. దీని ప్రకారం వికలాంగులైన(చెవిటి, మూగ, శారీరక అంగవైకల్యం, దృష్టిలోపం, బదిర, బాషణ)లోపం గల వారికి విద్యనందించాలి. 

వికలాంగులు విద్యనభ్యసించ డానికి అనేక అవస్థలు పడుతున్నారు. ఆడపిల్లల పరిస్థితి మరి దారుణంగా ఉన్నది. తరగతి గదిలో మిగతా పిల్లలతో సమానంగా వీరు ఇమడలేక సతమతమవుతున్నారు. వీరిపట్ల తోటి పిల్లల చులకన భావం వీరిని తీవ్ర మనస్తాపానికి గురి చేస్తున్నది. ఇది చదువుకుందామన్న బలమైన కోరికను నీరు కారుస్తున్నది. పిల్లల సంఖ్య ఎక్కువగా ఉన్న పాఠశాలల్లో ప్రతిసారి ఉపాధ్యాయుడు పర్యవేక్షించడం కష్టసాధ్యమైన పని. సామాజిక కార్యకర్తలు, మానసిక శాస్త్రజ్ఞుల చేత తరచుగా సమావేశాలు ఏర్పరిచి అందరు సమానమే అన్న భావనను విద్యార్థుల్లో కలిగించినట్లయితే ఈ సమస్యను అధిగమించవచ్చు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలున్నపుడు సాధారణ బోధనా పద్ధతులు ఏమాత్రం వారికి విద్యనందిచంచలేవు. ప్రత్యేకంగా మూగ, అంధ, చెవిటి వారికి సాధారణ బోధన ఏమాత్రం సరిపడదు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు 1:8 నిష్పత్తి ప్రకారం ఉపాధ్యాయలుండాలని రామూర్తి కమిటీ సూచించగా విద్యాహక్కు చట్టం 1:30 ఉపాధ్యాయ నిష్పత్తి సూచించింది. విద్యాహక్కు చట్టం దీన్ని ఏవిధంగా ఏ విధంగా అమలు చేస్తుంది అనేది పెద్ద సవాలు. ప్రత్యేక విద్యా బోధన పద్ధతులతో ఏ మాత్రం పరిచయంలేని ఉపాధ్యాయులు ఈ పిల్లలకు బోధించడం కత్తి మీద సామే! 

ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులు బి.ఎడ్/టి.టి.సి చేసినవాళ్లే కనుక వీరు ప్రత్యేక పిల్లలకు విద్యా బోధన అందించగలగడం అసాధ్యం. ఈ సమస్యను అధిగమించడానికి ప్రత్యేక విద్యలో బి.ఎడ్ చేసిన ఉపాధ్యాయులను నియమించి ఈ కొరతను తీర్చవచ్చు. ఇక ఈ చట్టం కింద పాఠశాలలల్లో కల్పించే వసతులు వికలాంగులకు అత్యవసరమైన ప్రత్యేక మరుగుదొడ్లు, మెట్ల వరస (రాంపు)లు దాదాపు లేవనే చెప్పవచ్చు. విద్యాహక్కు చట్టం కింద ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ట్రై సైకిళ్లు, సపొర్టింగ్ కర్రలు, హియరింగ్ పరికరాలు, ఫిజియోథెరపి, ఎస్కార్ట్ అల గ్రహణశస్త్ర చికిత్సలు మొదలగునవి మండల విద్యాధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిక్షకుడి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. అయితే ప్రజల్లో వీటి గురించి అవగాహన చాలా తక్కువ. దీనిపై గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల్లో అవగాహన కల్పించాలి. ప్రస్తుతం ఒక ప్రత్యేక శిక్షకుడు మండలంలోని అన్ని గ్రామాల్లో క్షేత్రపర్యటన, పాలనా వ్యవహారాలు చూసుకోవడం తలకు మించి న భారం అవుతున్నది. దీన్ని నివారించి తగిన సిబ్బందిని నియమించాలి. 

రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత 1960 వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగుల అభివృద్ధి, వారి సంక్షేమం కోసం చర్యలు చేపట్టకపోవ డం విడ్డూరం. 1960లో పోలియో బాధిత వికలాంగుల సంఖ్య పెరగడంతో సర్కార్ వారిపై దృష్టి సారించింది. 90వ దశకంలో వికలాంగుల విద్య కోసం అనేక కమిటీలు, విధానాలు రూపొందిచబడ్డాయి. కానీ వాటి ప్రభావం చాలా తక్కువే. ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి ప్రామాణిక నియమావళి 1994, రామ్మూర్తి కమిటీ1992, వికలాంగుల జాతీయ విద్యావిధానం 1986, ప్రోగ్రాం అఫ్ యాక్షన్ 1992 లాంటివి వికలాంగుల కోసం ఏర్పాటు చేసినా అవి ఆశించిన ఫలితాలు లేవు. ప్రత్యేకంగా రామ్మూర్తి కమిటీ అనేక విలువైన సిఫార్సులు చేసింది. కానీ ఆయన చేసిన సిఫార్సులకు ప్రాధాన్యం కల్పించలేదు. ఈ చట్టం కేవలం ప్రాథమిక విద్యకు భరోసా ఇచ్చి ఉన్నత విద్య అందిచే బాధ్యత నుంచి తప్పుకుందన్న వాదనలున్నాయి. కోఠారి కమిషన్ సూచించినట్లుగా ప్రత్యేక విద్య అనేది కేవలం మానవత్వపు పునాదుల మీదనే కాకుం డా, దాని ప్రయోజనం అధారంగా రూపొందిచినప్పుడే దానికి సార్థకత ఏర్పడుతుందని తెలిపింది. రాజ్యంగం కల్పించిన ఉచిత నిర్బంధ విద్య ప్రకరణం 21ని సాకారం చేస్తూ ఈ చట్టం చేయడం శుభ పరిణామమే. అయితే దీనిని సమర్థవంతంగా అమలు చేసినపుడే దాని లక్ష్యం నెరవేరుతుంది. 

-బుద్ధారం రమేష్ 
కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్‌మెంట్, హైదరాబా

Namasete Telangana News Paper Dated: 08/11/2012

No comments:

Post a Comment