'దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్' అన్నారు గురజాడ. దేశం అభివృద్ధి చెందాలంటే, దేశ ప్రజలు సుఖంగా, సంతోషంగా ఉండాలంటే ప్రజలందరూ విద్యావంతులు కావాలి. ఆరోగ్యంగా ఉండాలి. భవిష్యత్తులో దేశ ప్రజలందరూ బాగుండాలంటే నేటి బాలలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం.
ప్రపంచంలోనే అత్యంత బాలకార్మికులున్న దేశం మన దేశం. మన దేశంలో ప్రస్తుతం 6 కోట్ల మంది బాలకార్మికులు ఉన్నారు. 5 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వయస్సులోపు బాలకార్మికుల సంఖ్యే సుమారు 58 లక్షల మంది అని 2004-05 11వ పంచవర్ష ప్రణాళికలో ప్లానింగ్ కమిషన్ పేర్కొనడం జరిగింది. 2001 నాటికీ 5 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వయస్సు లోపు పిల్లలు 8.7కోట్ల మంది స్కూలుకు హాజరు కావడం లేదని లెక్కలు తేల్చారు. ఇంకో 7.5 కోట్ల మంది పిల్లలు స్కూలుకు వెళ్లడం లేదని, వారేం చేస్తున్నారో తెలియదని లెక్కలు తేల్చారు. 36 లక్షల మంది పిల్లలు వ్యవసాయేతర పనులలో పనిచేస్తున్నారు. 12 లక్షల మంది పిల్లలు కఠినమైన/హానికరమైన (ఏ్చ్డ్చటఛీౌఠట) వృత్తులలో నిమగ్నమై ఉన్నారు.
రాజ్యాంగ చట్టంలోని ఆర్టికల్ 24 ప్రకారం 14 సంవత్సరాలలోపు పిల్లలను ఫ్యాక్టరీలలో గానీ, గనులలో గానీ, ఇతర కఠినతరమైన/హానికరమైన పనులలో గానీ నియమించకూడదని ఆదేశిస్తున్నది. ఆర్టికల్ 21-ఎ ప్రకారం 14 సంవత్సరాలలోపు పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్య ఇవ్వాలని ఆదేశిస్తున్నాయి. 1986 లోనే బాల కార్మిక నిరోధక చట్టం వచ్చింది. 2004-05 కేంద్ర బడ్జెట్‌లో కేవలం 2.96 శాతం మాత్రమే పిల్లల సంక్షేమానికి కేటాయించబడింది. 6 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లల్లో 25.7 శాతం మంది, 11 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వయస్సు మధ్య పిల్లలో 48.8 శాతం మంది, 14 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల వయస్సు మధ్య పిల్లలో 61.6 శాతం మంది చదువును అర్థాంతరంగా వదిలివేస్తున్నారు. జాతీయ బాల కార్మికుల పథకం (ూఇ ఔ్క) ప్రకారం కేవలం 3.74 లక్షల మంది పిల్లల్ని వారు చేస్తున్న పనుల నుంచి విరమింపజేసి పాఠశాలలో చేర్చారని 2006-07 కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ లెక్కలు తెలియజేస్తున్నాయి.
గర్భంలో ఉన్నది ఆడపిల్ల అని తెలియగానే ప్రతీ సంవత్సరం 5 లక్షల మంది ఆడపిల్లలు హత్యగావించబడుతున్నారు. ఒక సంవత్సరం దాటకుండానే పదిలక్షల మంది ఆడపిల్లలు చనిపోతున్నారు. 15 సంవత్సరాల వయస్సు దాటకముందే 25 శాతం ఆడపిల్లలు వివిధ కారణాల వల్ల చనిపోతున్నారు. వేశ్యా వృత్తిలోకి నెట్టబడ్డ వారిలో 40 శాతం మంది 18 సంవత్సరాలు దాటకముందే ఆ వృత్తిలోకి బలవంతాన నెట్టబడ్డవారు. బాలల హక్కుల జాతీయ కమిషన్ రిపోర్టు ప్రకారం 7.5 శాతం ఆడపిల్లలు చదువుకు దూరంగా ఉన్నారు. అయితే 1951లో 54 లక్షల మంది ఆడపిల్లలు చదువుకోగా, 2008 నాటికి ఆ సంఖ్య 6.1 కోట్లకు చేరింది.
ఇప్పటికి 30 శాతం ప్రభుత్వ పాఠశాలల్లో హరిజన, గిరిజన విద్యార్థులను వేరుగా కూర్చోబెట్టి మధ్యాహ్న భోజనం ఇస్తున్నారు. 19 శాతం ముస్లిం పిల్లలు స్కూలుకు వెళ్లడం లేదు. 76 శాతం ముస్లిం పిల్లలు పాఠశాలల్లో చేరితే 56 శాతం మందే హైస్కూలుకు వెళుతున్నారు. పోలీసు కేసుల్లో ఉన్న పిల్లల్లో 90 శాతం పేదరికం నుంచి వచ్చిన వారే. ఆ పిల్లల్లో 78 శాతం భార్యాభర్తల కలహాలున్న కుటుంబాల నుంచి వచ్చినవారే. అంతర్జాతీయ బాలల హక్కుల ఒడంబడికని 1989, నవంబర్ 20న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సభ ఆమోదించింది. ఆ ఒడంబడికని ఇంతవరకూ ఐక్యరాజ్యసమితిలో సభ్యదేశాలైన 194 దేశాలు ఆమోదించి, దానిపై సంతకాలు చేశాయి. ఇంచుమించుగా అన్ని సభ్యదేశాలు ఆమోదించిన ఒకే ఒక్క అంతర్జాతీయ ఒడంబడికగా ఈ బాలల హక్కుల ఒడంబడిక గుర్తింపు పొందింది.
ఈ ఒడంబడికలోని ప్రధాన అంశాలు : (1) ఒడంబడికలోని అంశాలనన్నింటినీ ఆర్టికల్-2 ప్రకారం ప్రపంచ దేశాలలోని బాలలందరికీ - ఏవిధమైన మినహాయింపులు వివక్షలు లేకుండా - వర్తింపచెయ్యాలి. (2) ఆర్టికల్-6 ప్రకారం బాలలందరికీ జీవించే హక్కు, అభివృద్ధి చెందే హక్కులని కలుగజెయ్యాలి. (3) ఆర్టికల్-13,14 ప్రకారం తమ ఉనికికీ, అభివృద్ధికీ సంబంధించిన తమ ఆలోచనలనీ, అభిప్రాయాలనీ వెలువరించే హక్కుని బాలలందరికీ కలుగజెయ్యాలి. (4) ఆర్టికల్-19 ప్రకారం తమ పట్ల జరిగే అన్ని రకాల హింస నుంచీ రక్షణని పొందే హక్కుని బాలలందరికీ కలుగజెయ్యాలి. (5) ఆర్టికల్-24 ప్రకారం నాణ్యతతో కూడిన వైద్య సేవలని పొందుతూ, ఆరోగ్యంగా జీవించే హక్కుని కలుగజెయ్యాలి. (6) ఆర్టికల్-28 ప్రకారం కనీసం ప్రాథమిక విద్యనైనా ఉచితంగా పొందేందుకు హక్కు కలుగజెయ్యాలి. (7) ఆర్టికల్-32 ప్రకారం ఆర్థిక దోపిడీకి గురికాకుండా రక్షణ పొందే హక్కుని కలుగజెయ్యాలి. (8) ఆర్టికల్-34 ప్రకారం లైంగిక వేధింపులు, హింసలకి గురికాకుండా రక్షణ పొందే హక్కుని కలుగజెయ్యాలి.
మన దేశం ఐక్యరాజ్యసమితి సర్యసభ్య సభలో పాల్గొని పై తీర్మానాలను ఆమోదించింది. అంతేగాక, 1992లో పిల్లల హక్కులపై (ఇఖఇ) జరిగిన అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్నది. అందులో భాగంగానే పిల్లల సంక్షేమానికి జాతీయ సూత్రాలను 2003లో ఆమోదించడం జరిగింది. వీటికనుగుణంగానే, ఇౌఝఝజీటటజీౌn జౌట ్కట్ట్ఛౌఛ్టిజీౌn ౌజ ఛిజిజీజూఛీ ఖజీజజ్టి అఛ్టి 2005 చట్టాన్ని తీసుకురావడం జరిగింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాలల సంక్షేమానికి తగినన్ని నిధులు కేటాయించాలి. అన్నిటికంటే ఈ అంశానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. అంగన్‌వాడీ కేంద్రాలను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అంగన్‌వాడీ కేంద్రాలలో అర్హులైన గర్భిణీ స్త్రీలకు రోజుకు 95 గ్రాముల బియ్యం, 100 గ్రాముల రవ్వ, 15 గ్రాముల నూనె, 30 గ్రాముల పప్పు, వారానికి 2 గుడ్లు ఇవ్వాలి. పిల్లలకు 65 గ్రాముల బియ్యం, 15 గ్రాముల పప్పు, 10 గ్రాముల నూనె ఇవ్వాలి. 2009 విద్యా హక్కు చట్టాన్ని ఖచ్చితంగా అమలుచేయాలి. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలు అన్నిచర్యలు తీసుకోవాలి. బాలల విషయమై ఉన్నత న్యాయస్థానాలు ఇచ్చిన ఆదేశాలను అమలుచేయాలి.
పిల్లలూ, దేవుడూ చల్లని వారే, కల్లకపటమెరుగని కరుణామయులే అన్నారు ఒక కవి. బాల్యం ఎంతో మధురమైనది. నేటి బాలలే రేపటి పౌరులు. కాబట్టి నేటి బాలల గురించి మనం ఎంత శద్ధ్ర వహిస్తామో దేశ భవిష్యత్తు అంత బాగుంటుంది. గర్భిణీ స్త్రీల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపవలసిన అవసరముంది. గర్భిణీ స్త్రీల మానసిక, శారీరక ఆరోగ్యం పుట్టబోయే బిడ్డ మీద ఉంటుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలకు పౌష్టిక ఆహారం ఇవ్వాలి. పేద గర్భిణీ స్త్రీలకు పౌష్టిక ఆహారం అందేటట్లు సరైన పథకాలు ఏర్పరచాలి.
వారికి ఉచిత వైద్య సౌకర్యాలు కల్పించాలి. స్త్రీలను, కట్న కానుకల కొరకు గానీ, మరో కారణం చేత గానీ వేధించేవారు, ఆ స్త్రీ పడే శారీరక, మానసిక బాధ పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందనే సత్యాన్ని గమనించాలి. అందుచేత గర్భిణీ స్త్రీలను ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచే విధంగా కుటుంబ సభ్యులందరూ శ్రద్ధ వహించాలి. ప్రసవ సమయంలో తగు జాగ్రత్తలు తీసుకుని సరైన వైద్య సదుపాయాలు కల్పించాలి. పుట్టిన ప్రతి బిడ్డకు తగిన సమయాల్లో తగు టీకాలు ఇప్పించాలి.
తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా పెంచాలో - వారికి ఎటువంటి ఆహారం ఇవ్వాలో తెలుసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యం తల్లిదండ్రులు బిడ్డలకు సమయం కేటాయించాలి. పిల్లలతో కలిసి ఉండాలి. వారిని శ్రద్ధగా గమనించాలి. వారి అవసరాలను తెలుసుకోవాలి. పిల్లల్లో సహజంగా ఉండే ప్రశ్నించే తత్వాన్ని ప్రోత్సహించాలి. ప్రతీ ప్రశ్నకు సరైన శాస్త్రీయమైన సమాధానాన్ని చెప్పాలి. పిల్లల ఆసక్తిని, అంతర్గత శక్తులను గమనించాలి. వారి సహజ శక్తులను గుర్తించి ప్రోత్సహించాలి. పెద్దల ఇష్టాఇష్టాల ప్రకా రం కాకుండా పిల్లల అభిరుచి మేరకు, ఆసక్తి మేరకు, సహజ నైపుణ్యం మేరకు వారిని ఎదగనివ్వాలి.
పిల్లలకు కలిగే భయాలను పోగొట్టాలి. మూఢ నమ్మకాలకు దూరంగా ఉంచి ప్రతీ విషయాన్ని తార్కికంగా ఆలోచించే తత్వాన్ని, వాస్తవాన్ని తెలుసుకొనేటట్లు, సత్యానికి కట్టుబడి ఉండేటట్లు ప్రోత్సహించాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, వార్డెన్స్ చూపే ప్రేమ, శ్రద్ధ వల్లనే పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. పిల్లల కోసం సమయాన్ని కేటాయించలేని తల్లిదండ్రులకు పిల్లలను కనే హక్కు లేదంటాడు చలం.
పిల్లలు ఏ మంచి పనిచేసినా ప్రోత్సహించండి. ఒక్క సబ్జెక్టులో తక్కువ మార్కులు వస్తే తిట్టడం మంచిది కాదు. పిల్లల్ని తిట్టడం, కొట్టడం వల్ల మంచి ఫలితాలు సాధించలేము. పిల్లల దృష్టికి వచ్చే విషయాలే వారి మనస్సులో ముద్రలు కలిగిస్తాయి. కాబట్టి మనస్సులపై ఎటువంటి ముద్రలు కలుగుతున్నాయో గమనించాలి. అందుచేత టివిలో, కంప్యూటర్‌లలో, ఇంటర్‌నెట్‌లో, సినిమాల్లో, పత్రికల్లో, పుస్తకాల్లో ఎటువంటి విషయాలను పిల్లలకు అందుబాటులో ఉంచుతున్నాము, అవి పిల్లలపై ఎటువంటి ప్రభావాన్ని చూపుతున్నాయో గమనించాలి.
అందరికీ పూర్తి ఉచిత విద్య, వైద్య సౌకర్యాలు కల్పించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కల్పించాలి. అనేక ఉన్నత పాఠశాలల్లో ప్రత్యేక మరుగుదొడ్లు, టాయిలెట్ సౌకర్యం లేక ఆడపిల్లలు చదువుని అర్థాంతరంగా ఆపివేస్తున్నారని సర్వే నివేదికలు తెలుపుతున్నాయి. విద్యాహక్కు చట్టం 2009 ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం పేద విద్యార్థులకు విద్యనందించాలి. అయితే పేద పిల్లలు, ఇతర పిల్లల మాదిరిగా బట్టలు, బూట్లు, బ్యాగ్‌లు, ట్యాబ్‌లెట్స్, బ్లూటూత్‌లు, ఖరీదైన సెల్‌ఫోన్లు, తిను పదార్థాలు కొనుక్కోలేరు.
కాబట్టి పిల్లల మధ్య ఈ ఆర్థిక తారతమ్యాలను ఎలా రూపుమాపాలో ప్రభుత్వం ఆలోచించాలి. పేదరికం వల్ల అనేక మంది పిల్లలు చదువుకోలేకపోతున్నారు. బాల కార్మిక వ్యవస్థను రాజ్యాంగం నిషేధిస్తున్నా పిల్లల క్షేమం కోసం ఎన్నో చట్టాలు చేసినా, అంతర్జాతీయంగా ఐక్యరాజ్యసమితి తీర్మానాల్లో మనదేశం భాగస్వామిక దేశమైనా, ఉన్నత న్యాయస్థానాలు ఎన్నో మార్గదర్శక ఆదేశాలిచ్చినా, ఆచరణలో వెనుకబడి ఉన్నామనేది వాస్తవం. బాలల దినోత్సవం రోజైనా ఆత్మపరిశీలన చేసి, సత్యాన్ని అంగీకరించి తగిన కార్యాచరణకు పూనుకోవాలి. దేశభక్తి, సామాజిక బాధ్యత, విశాల భావాలు గల యువతరాన్ని తయారుచేయాల్సిన బాధ్యత అందరిపై ఉంది.
- జస్టిస్ బి. చంద్రకుమార్
Andhra Jyothi News Paper Dated : 15/11/2012
No comments:
Post a Comment