Sunday, July 14, 2013

విప్లవవాదుల్లోనూ మనుధర్మం ! - డా. జిలుకర శ్రీనివాస్


July 15, 2013
'మార్క్సిస్టు జ్ఞాన సిద్ధాంతం పనికి రాదు' (ఏప్రిల్ 1) అనే నా వ్యాసంపై నెల్లుట్ల నర్సింహారావు, పి.వరలక్ష్మి, ఎస్వీ సత్యనారాయణ వారి అవగాహనను ప్రకటించారు. త్రిపురనేని, రాంభట్ల విశ్లేషణలను ప్రస్తావించాను. ఒక్కరూ వాళ్లను సమర్ధిస్తూ రాయలేదు. పాపం.. త్రిపురనేని, రాంభట్ల!
అంబేద్కర్‌వాదులు ఆచరణలో లేరని నర్సింహారావు ఆరోపణ. కానీ ఆచరణ లేకుండా అంబేద్కరిజం వుండదు. అంబేద్కర్ జీవితమంతా పోరాటమే! ఆచరణే! సరే, ఇప్పటి కాలమే తీసుకుందాం. కాంగ్రెస్, బిజెపీలను ఉత్తరప్రదేశ్‌లో కమ్యూనిస్టులు ఏమీ చేయలేకపోయారు. కానీ మహాపురుషుడు కాన్షీరాం ఆ రెండు పార్టీ ధ్వంసం చేశాడు. కాన్షీరాం ఆచరణను మించిన తార్కాణం ఏముంటుంది? ఆయన స్ఫూర్తితో ఇక్కడ జీవితాలను అంకితం చేసిన బహుజనుల ఆచరణను గుర్తించకపోవటం ఒక కుట్ర. పైగా దళితులను కమ్యూనిస్టులకు దూరం చేసే కుట్ర అని నా మీద ఫిర్యాదు. నిజమే! కమ్యూనిస్టులకు దూరం చేసి అంబేద్కర్‌కు, కాన్షీరాంకు దగ్గర చేయటమే మా లక్ష్యం. జేమ్స్ ఫ్రెడ్రిక్‌సన్ చెప్పినట్టు ప్రతి రచనా ఒక రాజకీయ కార్యాచరణే!
మార్క్సిజం అజేయమనీ, చలనశీలమైందనీ ఎస్వీ ఏవేవో విశేషణాలుపయోగించారు.

మార్క్సిజం చలనశీలమైంది అంటేమిటి? చలనం దేనిలోనైనా వుండొచ్చు. అది ఎటువైపైనా వుండొచ్చు. కానీ లక్ష్యం వైపే వుంటుందని చెప్పలేం. కాబట్టి చలనం అన్న ప్రాథమిక అంశం దగ్గరే మార్క్సిస్టులు ఆగిపోయారు. అంబేద్కర్ చలనం కన్న గమనం, గమ్యం ముఖ్యమని భావించాడు. 'ఈ సమాజంలో కులం వుంది. వర్గం వుంది' కాబట్టి ఈ రెంటికీ వ్యతిరేకంగా పోరాటం జరగాలని ఎస్వీ అంటున్నారు. ఇది కుల-వర్గ సమాజమని ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న అభ్యుదయ రచయితల సంఘం తీర్మానించిందా? ఆయన అభిప్రాయంతో సిపిఐ ఏకీభవిస్తుందా? కులం గురించి చర్చ జరిగిన ప్రతిసారీ ఈ అభ్యుదయ, విప్లవ సంస్థల నాయకులు 'కుల-వర్గ సమాజం' అనే వాదన ముందుకు తెస్తారు. కుల రహిత పెట్టుబడిదారీ సమాజాన్ని అంబేద్కర్‌వాదులు కోరుతున్నారని ఆయన నిందారోపణ చేశారు.

దేనిమీదైనా మాట్లాడేస్తామనే అహంకారం కమ్యూనిస్టులకు ఎక్కువ. అంబేద్కర్ రచనలేవీ చదవకుండానే ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం కేవలం వీళ్లకే చెల్లింది. అంబేద్కరిజం పెట్టుబడిదారీ వ్యవస్థ గురించి ఏమి చెప్తుందో ఎస్వీకి తెల్సినట్టు లేదు. 'స్టేట్స్ అండ్ మైనార్టీస్'లోనూ, ఇతర రచనల్లోనూ ఆయన ప్రతిపాదించిన 'స్టేట్ సోషలిజం' గురించి ఈయనకేమీ తెలీదు. వ్యక్తిగత ఆస్తిని విప్లవం ద్వారా రద్దు చేయగలవు కానీ కుల వ్యవస్థను నిర్మూలించలేవు. అంటే కమ్యూనిస్టులు వర్గం లేని కుల సమాజాన్ని నిర్మించాలనుకుంటున్నారా? అందుకే, అంబేద్కరిజమే కుల సంబంధాలను, ఆస్తి సంబంధాలనూ నిర్మూలించగలదు. ప్రపంచీకరణ బూచి చూపి బ్రాహ్మణిజాన్ని సమర్ధిస్తారా? ప్రపంచీకరణను నిలువరించే శక్తి కాన్షీరామ్ ఉద్యమానికి మాత్రమే ఉంది.
వ్యక్తికి జ్ఞానం ఎలా వస్తుంది? ఎక్కణ్నించి వస్తుంది? వ్యక్తి చైతన్యాన్ని నిర్ణయిస్తున్న జ్ఞానం ఎలాంటి స్వభావాన్ని కల్గి వుంది? సాహిత్యం సమాజానికి దర్పణం అయితే ఇక్కడి రచయితలు ఆ సమాజ వాస్తివికతను ఎందుకు చిత్రించలేదు.

లెనిన్ చెప్పిన పరావర్తన సిద్ధాంతం ప్రకారం రచయిత సమాజంలోని పరిస్థితులను చైతన్యంతో తిరిగి రచనల్లో ప్రతిఫలింప చేస్తాడు కదా! మరి ఇక్కడి రచయితలు ఈ సమాజంలో వున్న కుల వ్యవస్థను రచనల్లో ప్రతిఫలించలేదేమి? నిత్యం కులంలో జీవిస్తూ, దాని నియమాల ప్రకారం నడకను, నడతను కొనసాగించే బ్రాహ్మణవాద రచయితలు పూర్తి ఎరుకతో దాని గురించి రాయకపోవటంలో వున్న కుట్ర ఏమిటి? వీటి సమాహారమే నా వ్యాసం. జ్ఞాన సిద్ధాంతంలో సమాజ పరిణామ క్రమాన్ని పరిశీలించే పద్ధతి అంతర్భాగంగా వుంటుంది. అంటే మార్క్సిస్టు సిద్ధాంతం ప్రకారం చారిత్రక భౌతికవాదమనే పద్ధతిలో ఈ సమాజ పరిణామ క్రమాన్ని విశ్లేషిస్తారు. కానీ అది కులం పుట్టుక, పరిణామాన్ని విశ్లేషించలేకపోయింది. కుల వ్యవస్థ ఆవిర్భావాన్ని వివరించే ఆ పద్ధతి పూర్తిగా తప్పుడు ఫలితాలనిస్తుందని నేనేంటే పి.వరలక్ష్మీ అంగీకరించటం లేదు.


వరలక్ష్మిది ప్రత్యేక-పరిమితవాదం. సంఘ సంస్కర్తలకూ, భావ కవులకూ, ఆ మాటకొస్తే విప్లవ రచయితలకూ ప్రత్యేకతలున్నాయని ఆమె వాదన. వాళ్ల సామాజిక నేపథ్యం వల్ల వాళ్ల రచనలకు పరిమితులు తప్పక వుంటాయని ఆమె అంటున్నారు. ఆ పరిమితులను గమనించి వాళ్లను అర్థం చేసుకోవాలని సూచన. ఈ ప్రత్యేకవాదాన్ని ముందు పెట్టే చాలా కాలం అనేక సాహిత్య సమస్యలను చర్చకు రాకుండా చేశారు. సంస్కరణవాద చరిత్రతో పాటు కాల్పనికవాద చరిత్రను కూడా తీసిపారేయాలని నేను ఆరాటపడినట్టు ఆమె ఆరోపణ. గోపాల కృష్ణమశెట్టి, కందుకూరి, గురజాడ వంటి వాళ్లకు మార్క్సిజంతో సంబంధం లేదనీ, అలాంటి వాళ్లకు మార్క్సిస్టు జ్ఞానసిద్ధాంతంతో పనేమిటని ఆమె అంటున్నారు, నేనేదో వాళ్లంతా మార్క్సిస్టులు అన్నట్టు. నిజమే, వాళ్లు మార్క్సిస్టులు కాదు. టాల్‌స్టాయ్ కూడా మార్క్సిస్టు కాదు.

బోల్షివిక్కు కమ్యూనిస్టు పార్టీ సభ్యుడు కూడా కాదు. కానీ ఆ పార్టీ సభ్యుడైన మాక్సిం గోర్కీ కన్న గొప్పగా, వాస్తవికంగా టాల్‌స్టాయ్ రచనలు చేశాడని లెనిన్ కొనియాడాడు కదా! అంటే వాస్తవికతను చిత్రించే నిజాయితీ వుండాలి. అలాంటి నిజాయితీని ఈ దేశంలోని బ్రాహ్మణవాద రచయితలు చూపలేదని లెనిన్ కన్న ముందే మహాత్మ జ్యోతిరావ్ ఫూలే విమర్శించారు. సంస్కరణవాద, కాల్పనికవాద సాహిత్యం ఎందుకొచ్చాయి? గోపాలకృష్ణమ శెట్టి, కందుకూరి, గురజాడ వంటి రచయితలు రచనలు చేస్తూన్న కాలం కన్న ముందునుంచే దేశవ్యాప్తంగా బ్రాహ్మణాధిక్యత నుంచి విముక్తి కోసం కింది కులాలు పోరాడుతున్నాయి. ముఖ్యంగా బెంగాల్‌లో హరిచంద్ ఠాకూర్, గిరిచంద్ ఠాకూర్‌ల నాయకత్వంలో మత్వా ఉద్యమం, మహాత్మ జ్యోతిరావ్ ఫూలే నాయకత్వంలో బ్రాహ్మణేతర సత్యశోధక ఉద్యమం ఉధృతంగా సాగుతున్న రోజులవి.

కులం, వర్ణం పుట్టుక, సామాజిక అసమానతలు, మూలవాసుల విముక్తి, బ్రిటీషు పాలకుల ద్వంద్వ వైఖరి మీద సైద్ధాంతిక చర్చలే కాదు, భౌతిక ఉద్యమాలు కూడా జరుగుతున్న రోజులవి. మరి, వాటి పట్ల ఈ రచయితలు స్పందించలేదేం? వీరి రచనల్లో అసలు కింది కుల జీవితం, పాత్రలు కన్పించక పోవటానికి కారణమేంటి? సరే, వాళ్లకు తెల్సిన బ్రాహ్మణ జీవితమే రాశారనుకుందాం. ఆ బ్రాహ్మణ వాస్తవికవాదాన్ని ఆ తర్వాతి తరం ఎందుకు కొనసాగించలేదో వరలక్ష్మి చెప్తే బాగుండేది. సంస్కరణవాదం మరింత వాస్తవికతను అందిపుచ్చుకొని నిర్దిష్టత వైపు పయనించాలి కదా! మరి భావకవిత్వం పేరుతో కాల్పనికవాదం తలెత్తిందేమిటి? మానవ కర్తృత్వం వల్లే విప్లవం వస్తుందని నమ్మే వరలక్ష్మి కాల్పనికవాదం కూడా ఒక కులం కర్తృత్వం వల్లే తలెత్తిందని ఒప్పుకోదేమి!


మూలవాసీ మహాపురుషులు ప్రారంభించిన కుల వ్యతిరేకోద్యమం 1910 తర్వాత విప్లవాత్మక రూపం తీసుకుంది. అది ఈ తెలుగు సాంస్కృతిక చరిత్రలో నమోదు కాకుండా, అక్షరాస్యులైన వారి మెదళ్లు ఆ ఉద్యమం వైపు వెళ్లకుండా కాల్పనికవాదం అవసరమైంది. భావకవిత్వం అందులో ఒక పాయని అందుకే అన్నాను. అంటే కుల వాస్తవికతను గుర్తించకుండా భావకవిత్వం వచ్చింది. భావ కవిత్వంలోని ప్రియుడు మనువాది, ప్రియురాలూ మనువాదే! నండూరి 'ఎంకి' ఏ కులజురాలో మార్క్సిస్టు సిద్ధాంతం చెప్పగలదా? ఇంకా, అభ్యుదయ, విప్లవవాద రచయితలు తక్కువ తిన్నారా? వాళ్లు కూడా కాల్పనికవాదులు చేసిన దాన్నే 'వర్గం' పేరుతో చేశారు. అలా చేయటంలో వాళ్ల లక్ష్యం అంబేద్కర్ ఉద్యమాన్ని దెబ్బతీయటం కాదా? 1930-32 మధ్యకాలంలో అంబేద్కర్ కింది కులాలకు చట్టసభల్లో ప్రవేశించే ఓటు హక్కు, ప్రత్యేక నియోజకవర్గాల గురించి పోరాడుతూంటే ప్రజలంతా ఆయన వెంట వున్నారు.

1932లో కమ్యూనల్ అవార్డునను శ్రీశ్రీ వ్యతిరేకించాడా? సమర్ధించాడా? ఈ దేశంలోని బహుజనులకు రాజకీయ, పౌరహక్కులు తిరస్కరించిన గాంధీ చనిపోతే ఎలిజీలు రాసిన శ్రీశ్రీ అంబేద్కర్ అమరుడైతే ఒక్క కవితా రాయలేదే!? 'యజ్ఞోపవీతాన్నీ వైప్లవ్య గీతాన్నీ' అని ఆయనే చెప్పుకున్నాడు. దానర్థం బ్రాహ్మణవాదినీ విప్లవవాదినీ అనే కదా! యజ్ఞోపవీతాన్ని కీర్తించినవాడు విప్లవవాదెలా అవుతాడు. వర్ణ ధర్మాన్ని సమర్ధిస్తూ రాసిన విశ్వనాథ సత్యనారాయణ మనువాదయితే, వర్గం పేరుతో కులం గురించి ఒక్క మాటా మాట్లాడక పోగా, అది ఉనికిలో లేనట్టు రచనలు చేసిన శ్రీశ్రీ కూడా మనువాదే. బ్రాహ్మణవాద రచయితలు కులం గురించి ఎందుకు రాస్తారు అంటున్నారు వరలక్ష్మి. విప్లవ రచయితలు కులవ్యవస్థకు వ్యతిరేకంగా రాయలేదేం? అంతేకాదు, వాళ్ల రచనల నిండా పర్చుకొన్న బ్రాహ్మణవాద ప్రతీకలు, కవి సమయాలు ఏ భావజాలానికి సంకేతాలు? విప్లవవాదుల చైతన్యాన్ని కూడా మనుధర్మమే నిర్ణయిస్తుంది.


జ్ఞాన సిద్ధాంతంలో పాదార్థిక విషయాలు (భౌతిక అంశాలు), భావజాల (ధర్మం) విషయాలు వుంటాయని ఆమె అంగీకరించారు. కానీ ఇక్కడ పాదార్థిక విషయాలు వ్యక్తి చైతన్యాన్ని రూపొందిస్తాయా? లేక భావజాలం రూపొందిస్తుందా? మనుధర్మం మనిషి స్థాయినీ, విలువనీ నిర్ణయిస్తుంది కాబట్టి కుల సమాజంలో వ్యక్తి విలువ కులాన్ని బట్టి ఉంటుంది. అందువల్ల ఏ కులస్తుడితో ఎలా వ్యవహరించాలన్నది ఆ ధర్మమే నిర్దేశిస్తుంది. ఒక వ్యక్తికి ఆస్తి వుండాలా వద్దా అన్నది అతడు పుట్టిన కులం వల్ల నిర్ణయించబడుతుంది. ఎలా ఆలోచించాలో ఎలా జీవించాలో ఎలా ప్రవర్తించాలో కులమే నిర్ణయిస్తుంది. అంటే, ఒక వ్యక్తి జ్ఞానం పాదార్థిక విషయాల ఆధారంగా కాకుండా మనుధర్మం (భావజాలం) కారణంగా నిర్ణయం అవుతుంది. ఆ భావజాలాన్ని అతడి రచన ప్రతిఫలించాలి. దాన్ని నిజాయితీగా చిత్రించాలి. అలా చేయని రచయిత ఎంత గొప్పవాడైనా అతడు బ్రాహ్మణవాదే అవుతాడు. మార్క్సిస్టు సిద్ధాంత ప్రవచకులు ఎన్ని రకాలుగా వాదించినా ఇదే అంతిమ సత్యం.

- డా. జిలుకర శ్రీనివాస్
(చర్చ ముగిసింది)

Andhra Jyothi Telugu News Paper Dated : 15/07/2013 

2 comments: