Monday, July 15, 2013

ఎక్కడి ఎస్సీలు అక్కడే ---Bollimunta Hanmanth Rao


రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి గురించి చేశామంటూ చెప్పే మాటల డొల్లతనాన్ని గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ(సెర్ప్‌) నిర్వహించిన సర్వే బట్టబయలు చేసింది. రాష్ట్రం మొత్తంలో 2,10,22,588 కుటుంబాలు ఉండగా, వాటిలో 38,71,634 (15 శాతం) ఎస్సీ, 15,60,035 (6.6 శాతం) ఎస్టీ కుటుంబాలు న్నాయి. సెర్స్‌ 22 జిల్లాల్లోని 619 మండలాల్లో, 5989 గ్రామాల్లో 9.8 లక్షల ఎస్సీ, ఎస్టీ ఇండ్లను పరిశీలించి నివేదిక తయారుచేసింది. ఈ నివేదికలో 4,45,954 (65శాతం) ఎస్సీ, 1,77,263(55శాతం) ఎస్టీ కుటుంబాలకు సెంటు భూమిలేదని పేర్కొంది. ప్రభుత్వ ప్రచారం ప్రకారం 50 లక్షల ఎకరాల పంపిణీ జరిగి ఉంటే, భూమిలేని ఎస్సీ, ఎస్టీలు ఇంత సంఖ్యలో ఉండేవారు కాదు. భూపంపకం ద్వారా పంచామని చెపకొంటున్న భూముల్లో 80శాతం పేదలు సాగుచేసుకొంటున్న భూములే. పేదలకు యిచ్చామని చెప్పుకొంటున్న 25 లక్షల అసైన్డ్‌ భూములు భూస్వాముల, సంపన్నవర్గాల చేతుల్లోకి వెళ్లాయని కోనేరు రంగారావు భూ కమిషన్‌ తెలియచేసింది. 


ఈ భూములపై భూస్వాములకు చట్టబద్ధహక్కు కల్పించేందుకు ప్రభుత్వం 9/77 అసైన్డ్‌ చట్టాన్ని చేసిందంటే, ప్రభుత్వం ఎవరి ప్రయోజనాలను కాపాడుతుందో అర్థమౌతుంది. కోనేరు రంగారావు భూకమిషన్‌ వివిధ రూపాల్లో పంపిణీయోగ్యమైన 60 లక్షల ఎకరాల భూములను దళితులకు, ఇతర పేదలకు పంపిణీ చేయాలని సిఫార్సు చేసింది. ప్రభుత్వం అందుకు ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. ఎస్సీల్లో 1,35,978(21శాతం) ఎస్టీల్లో 91,247 (28.3శాతం) కుటుంబాలు గుడిసెల్లో నివసిస్తున్నాయని, ఇందిరమ్మ పథకంక్రింద అర్హతఉండికూడా ఎస్సీల్లో 2,98,774 (45శాతం) ఎస్టీల్లో 1,44,843 (45శాతం) కుటుంబాలకు ఇళ్ళు మంజూరు కాలేదని నివేదిక వెల్లడించింది. ఎస్సీ, ఎస్టీల ఇండ్లనిర్మాణానికి రూ. 72 వేలు ప్రభుత్వం ప్రకటించింది. లబ్ధిదారులు పునాదులు నిర్మించినప్పుడే విడతల వారీగా బ్యాంక్‌నుండి డబ్బు, సిమెంట్‌ తీసుకోవాలి. స్లాబ్‌వేసిన ఇంటికే ఈ కేటాయింపు కాగా, రేకుల ఇళ్ళు వేసుకోవటానికి ఒప్పుకోరు. ఒక్కగది ఇంటికి స్లాబ్‌ పోయాలన్నా కనీసం రెండు లక్షలకు పైగా అవుతుంది. అందుకే లక్షలాది ఇళ్ళ నిర్మాణాలు సగంలో ఆగిపోతున్నాయి. అప్పులు మాత్రం వారికి మిగులుతున్నాయి. చివరికి అవి ఇతరుల పరమౌతున్నాయి. 



నివేదికలోని మరో ముఖ్యమైన అంశం గ్రామీణ ఉపాధి హామీ పథకం. వందరోజులు పని దొరికిన కుటుంబాలు వందల సంఖ్యలోనే ఉన్నాయి. సగటున 28 రోజులకు మించి ఉపాధి పనులను కల్పించలేక పోయారు. అర్హులైన లక్షలాదిమంది పేదలకు జాబ్‌ కార్డులే ఇవ్వలేదు. వారికి లభించే కూలి కూడా చాలా తక్కువగా వుంది. ఈ వాస్తవాన్ని ఈ నివేదిక కూడా పేర్కొంది. నివేదికలో పేర్కొన్న ప్రకారం రాష్ట్రంలో 2,57,539 (39శాతం) ఎస్సీ, 1,23,993 (38శాతం) ఎస్టీ కుటుంబాల వారికి గ్రామీణ ఉపాధి హామీ పథకంక్రింద జాబ్‌ కార్డులు రాలేదు. దారిద్య్ర రేఖకు దిగువన జీవిస్తున్న పేదలందరికీ రేషన్‌కార్డులు ఇచ్చి కిలో రూపాయికే బియ్యం, చౌకగా ఇతర వస్తువులు ఇస్తున్నామని రాష్ట్రప్రభుత్వం చెబుతున్నది. ఇప్పటికీ అర్హులైన లక్షలాది మంది పేదలు రేషన్‌ కార్డులు లేక ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ అంశాన్ని కూడా నివేదిక పొందుపరచింది. 



ఎస్సీల్లో 97,782 (15 శాతం), ఎస్టీల్లో 63,232 కుటుంబాలకు రాష్ట్రంలో రేషన్‌కార్డులు లభించలేదు. పల్లెల్లో పేదలు రోజుకి రూ. 17, పట్టణాల్లో రూ. 23 మాత్రమే ఖర్చుచేస్తున్నారని ఈ సర్వే తెలిపింది. ఎస్సీల్లో 3 శాతం, ఎస్టీల్లో 2 శాతం మంది మహిళలకు మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలు జరుగుతున్నాయని ప్రైవేటు ఆసుపత్రులలో ఈ సంఖ్య ఇంకా తక్కువని, సిజేరియన్‌ ఆపరేషన్లు 2 శాతంలోపే చేయించుకొంటున్నారని సర్వే నివేదిక వెల్లడించింది. రాష్ట్రంలో విద్యుత్‌ సౌకర్యంలేని ఎస్సీ కుటుంబాలు 49,562, ఎస్టీ కుటుంబాలు 23,191 ఉన్నాయని; 10శాతం ఎస్సీ, 18 శాతం ఎస్టీ కుటుంబాలు కిరోసిన్‌ దీపంతోనే రాష్ట్రంలో గడుపుతున్నాయని నివేదిక వెల్లడించింది. వీరి పిల్లలకు స్కాలర్‌షిప్‌లు అందటంలేదని, నాలుగు శాతం ఎస్సీలు, ఐదు శాతం ఎస్టీ కుటుంబాలకు చెందిన విద్యార్థులు మధ్యలోనే చదువు మానివేస్తున్నారని, బడికి వెళ్లని పిల్లల సంఖ్య కూడా ఎక్కువగా వుందని, ఎస్సీల్లో 20 శాతం, ఎస్టీల్లో 12శాతం కుటుంబాలే వంటగ్యాస్‌ని ఉపయోగిస్తున్నాయని 79 శాతం ఎస్సీలకు, 85శాతం ఎస్టీల కుటుంబాలకు మరుగు దొడ్ల సౌకర్యం లేదని నివేదిక వెల్లడించింది.
Surya  Telugu News Paper Dated : 16/07/2013 

No comments:

Post a Comment