July 17, 2013
సమానత్వం రాజ్యాంగ హక్కు
రిజర్వేషన్లలో బిసిలకు అన్యాయం
వాటా అడ్డంకొట్టేందుకు అగ్రకుల కుట్రలు
ప్రాథమిక హక్కులకోసం పోరాటమే మార్గం
ప్రమోషన్లలో కోటా అనివార్యం
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 16 ప్రాథమిక హక్కుల్లో భాగం. ఆర్టికల్ 14 సమానత్వాన్ని, ఆర్టికల్ 15 వెనుకబడిన, ఇతర వెనుక బడిన తరగతులకు విద్యారంగంలో రిజర్వేషన్లు, ఆర్టిక ల్ 16 ఉద్యోగరంగంలో పదోన్నతుల్లో రిజర్వేషన్లను ప్రసాదించాయి. ఈ రాజ్యాంగ ప్రకరణలు ప్రాథమిక హక్కులు అవటాన వీటిని కుదించే లేదా తొలగించే అధికారం ఇటు పార్లమెంటుకు గాని, అటు ఏకోర్టుకూ గానీ లేదని భారత రా జ్యాంగం నిర్దిష్ఠంగా పేర్కొన్నది. కోర్టులు- పార్లమెంటు ద్వారా చేసిన శాసనాలు రాజ్యాంగబద్దమైనవా, కావా అని నిర్ధారిస్తాయి. ప్రాథమిక హక్కుల విషయంలో జోక్యం చేసుకునే అధికారం వీటికి లేదని రాజ్యాంగం చెప్పినా అడపా దడపా ఈ ఆర్టికల్స్ కోర్టుల జోక్యానికి గురవు తున్నాయి. ఆర్టికల్ 14 సమానత్వాన్ని ప్రదిపాదిస్తే మరి రిజర్వేషన్లు ఏమిటి అని అగ్ర వర్ణాలు ఒక వాదనను వినిపిస్తున్నాయి. అందరు సమానమైనప్పుడు కొందరికే రిజర్వేషన్లు ఏమిటనే అవగాహనా రహితమైన వాదనను ముందుకు తెస్తున్నాయి.
ఆర్టికల్ 14 ప్రకారం సమానత్వం అంటే అసమానత్వాన్ని రూపు మాపి ఏ వర్గాలు అసమానత్వానికి గురయ్యాయో ఆ వర్గాలను ప్రధాన స్రవంతితో సమం చేయడమే నని అదే ఆర్టికల్‌లో పొందుపరచిన విషయాన్ని ఈ వర్గాలు పక్కదారి పట్టిస్తున్నా యి. ఒక వ్యక్తికి యాభై కేలరీల శక్తి కావాల్సినప్పుడు అప్పటికే శక్తిమంతుడైనవానికి యాభై, శక్తిహీనుడికి 60 కేలరీలు ఇస్తే వారిద్దరు సమానమవుతారు. ఇది సమాన త్వం సూత్రంలో దాగి ఉన్న మర్మం. అందుకే సామాజిక, విద్య, ఉద్యోగ, రాజకీయ పరంగా అన్ని రంగాల్లో వెనుకబడిన తరగతులకు, మరింత వెనుకబడిన తరగతు లకు రిజర్వేషన్ల కల్పన అనివార్యమయింది. దీన్నే రాజ్యాంగం ఆర్టికల్ 14 అంటేనే అసమానతల నిర్మూలన అనే నర్మగర్భమైన అర్థాన్ని వ్యాఖ్యానించింది. ఆర్టికల్ 15(4) ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు విద్యారంగంలో రిజర్వేషన్లు అందాయి. దీన్ని వివాదాస్పదం చేయడానికి అగ్రకుల పాలకులు- ఈ రిజర్వేషన్లు పొందేవారు విద్యాపరం గానే కాక, సామాజికంగానూ వెనుబడి ఉండాలని మెలికపెట్టారు.
ఈ కారణం చేతనే ఓబిసీలు 2008వరకు విద్యారంగంలో రిజర్వేషన్లకు నోచుకోలేదు. 2008లో ఓబిసీలకు విద్యారంగంలో రిజర్వేషన్లు కల్పించేక్రమంలో అగ్రవర్గాలు చేసిన రాద్ధాంతం బీసీ నాయకులెవ్వరికీ స్పర్శ కలిగించలేదు. ఇప్పటికే కేంద్రస్థాయి విద్యాసంస్థల్లో రిజర్వేషన్ల సౌకర్యాన్ని తొలగించడం జరిగింది. నవరత్నాల వంటి ప్రభుత్వరంగ సంస్థల్లో బీసీలకే కాదు ఎస్సీలకు కూడా దిక్కు లేదు. ఆర్టికల్ 16(4)ను పొందుపరచడంద్వారా వెనుకబడిన కులాలకు ఉద్యోగ రంగంలో రిజర్వేషన్లు లభించాయి.అంతేకాక ప్రమోషన్లలో రిజర్వేషన్లనుకూడా ఇదే ఆర్టికల్ అందిస్తుంది. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న వెనుకబడిన కులాలు ఎవరు అనే ప్రశ్న లేవనెత్తారు. ఎస్సీ,ఎస్టీలు వెనుకబడినారనే కారణంచేతనేకదా వాళ్లకు రిజర్వే షన్ల సౌకర్యం కల్పించింది, వారే వెనుకబడిన కులాలైనప్పుడు, ఇతర వెనుకబడిన కులాలు ఏమిటంటూ వితండవాదానికి దిగుతున్నారు.
డా బి.ఆర్.అంబేడ్కర్- ‘షెడ్యూల్డు కులాలు అంటే సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడినవని ప్రకటించడం (షెడ్యూలు)అని, షెడ్యూల్డు కులాలేకాక మరికొన్ని కులాలు (ఓబిసి) వెనుకబడి ఉన్నాయి’ అని నిర్వచించాడు. అర్థమయ్యేదేమంటే శూద్రకులాలను ఓబిసీలుగా, అతిశూద్ర కులాలను ఎస్సీలుగా పరిగణించాలనే భావనను డా అంబేడ్కర్ భారత రాజ్యాంగంలోనే పొందుపరిచే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో వచ్చినదే ఆర్టికల్ 340. ఈ ఆర్టికల్‌ద్వారా ఓబిసిలు ఏయే కులాలో నిర్వచించి, గుర్తించడానికి ఒక కమిషన్ ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది. మాన్యశ్రీ కాన్సీరాం 50 రోజుల నిరాహారదీక్ష చేసి ఆనాటి అగ్రకుల ప్రభుత్వాన్ని నిలదీసిన ఫలితంగా1979లో వచ్చిన మండల్ కమిషన్ ‘ఓబిసీలు అనగా ఎస్సీ, ఎస్టీలు కాక ఇంకా మిగిలి ఉన్న సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, రాజకీయంగా వెనుకబడిన కులాల ప్రజలు’ అంటూ నిర్వచించింది.
ఈ స్పష్టత వచ్చి ఓబిసీలకు ఉద్యోగరంగంలో రిజర్వేషన్లు కల్పించడానికి 42 సంవత్సరాలు పట్టింది. ఇందులో భాగంగానే 1992-93లో ఓబిసీలకు ఉద్యోగరంగంలో కేంద్రస్థాయిలో 27 శాతం, రాష్ర్ట స్థాయిలో 34 శాతం రిజర్వేషన్లు కల్పించారు. ఇది జీర్ణించుకోలేని అగ్రకులాలవారు ఆర్టికల్ 16ను సవాల్ చేస్తూ కోర్టుకెక్కారు. ఆర్టికల్ 16(4) ప్రకారమే 1955 నుండి ఎస్సీ ఎస్టీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు అమలవుతున్నాయి. బీసీలకు ఉద్యోగరంగంలో రిజర్వేషన్లు కల్పించడంతో ప్రమోషన్లలోకూడా రిజర్వేషన్లు కల్పించాల్సి వస్తుందనే భయంతో ఈ కుట్ర చేశారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు- ఆర్టికల్ 16 ఉద్యోగ నియామక సందర్భంలోనే రిజర్వేషన్లను అనుమ తిస్తుందని, ప్రమోషన్ల విషయంలో వర్తించనేరదని- 1997లో తీర్పునిచ్చింది. ప్రాథమిక హక్కులను వ్యాఖ్యానించే లేదా జోక్యంచేసుకునే హక్కు తమకుందనికూడా సుప్రీంకోర్టు వెలువరించింది.
1997లో ఓటుబ్యాంకు రాజకీయాల్లో భాగంగా వాజ్‌పేయ్ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం 77వ రాజ్యాంగ సవరణ ద్వారా 16వ ఆర్టికల్‌కు 4ఎ ను చేరుస్తూ ఎస్సీ, ఎస్టీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లను పరిమితంచేసింది.ఈ దరిమిలా ఓబిసిలు ప్రమోషన్లలో రిజర్వేషన్లను కోల్పోయేటట్లు చేయడంలో అగ్రకుల శక్తులు విజయవంతమయ్యాయి. అంబేడ్కర్ బిసి కమిషన్ కోసం రాజీనామా చేయడం, ప్రముఖ బిసి నాయకుడు ఆర్.ఎల్. చందాపురి నాయకత్వంలో ఉద్యమం చేపట్టడంతో అనివార్యమైన పరిస్థితుల్లో నాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ బిసి కులాలను గుర్తించడం కోసం 1962లో కాకా కలేల్కర్ కమిషన్‌ను నియమించి బిసి కులాలకు రిజర్వేషన్ల ఆవశ్యకతను ఆ కమిషన్ నొక్కివక్కాణించడంతో తిరిగి కలేల్కర్ ద్వారానే ఆ నివేదికను నిర్వీర్యం చేశాడు.
ఇది బిసి రిజర్వేషన్లపై మొదటి అధికారిక కుట్ర. మండల్ కమిషన్ సిఫారసులను అమలు చేస్తారేమోననే భయంతో పశ్చిమ భారతంలో మత కల్లోలాలు సృష్టించి మరోసారి ఈ సమస్యను మరగుపరచేలా చేశారు. అగ్రకులవర్గాలు తమ అక్కసును వెళ్లగక్కుతూ రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమాన్ని నడిపించడం జగమెరిగిన సత్యమే. ఇప్పటికే ఎస్సీ ఎస్టీలకు 22 శాతం రిజర్వేషన్లున్నాయి. ఒకవేళ ఓబిసిలకు కూడా రిజర్వేషన్లు కల్పిస్తే, సుమారు 34 శాతం మంది ప్రతినిధులు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో ప్రవేశిస్తారు. అప్పుడు 56 శాతం ప్రతినిధులు బహుజనవర్గాల నుండి ప్రాతినిధ్యం వహించడంద్వారా ఆ జాతి ప్రయోజనాలు నెరవేరి రాజ్యాధికారంలోకి వస్తారు.
ఆధిపత్య అగ్రకులాలు చట్టాన్ని, కోర్టులను ఉపయోగించుకుంటూ బహుజనవర్గాల హక్కులను కాలరా స్తుంటాయి. కొందరు ఓబిసి మేధావులే- చట్టసభల్లోనే రిజర్వేషన్లు లేవంటే ప్రమోషన్లకు రిజర్వేషన్లు ఏమిటని వెటకారాలాడుతున్నారు. ఎస్సీ ఎస్టీలకైనా, బీసీలకైనా చట్టసభలలో రిజర్వేషన్లు పార్లమెంటు చట్టంద్వారా లభించవలసిందే కానీ, విద్య ఉద్యోగరంగాల్లో రిజర్వేషన్ల కల్పన ఎవరి దయాదాక్షిణ్యాల మీద రాలేదని, అది భారత రాజ్యాంగంద్వారా సంక్రమించిన ప్రాథమిక హక్కు అని గ్రహించాలి. ఈఅధునాత కంప్యూటర్ యుగంలో 54 శాతానికి పైగా ఉన్న మెజార్టీ జనాభాకు అన్యాయం జరుగుతుంటే కోర్టుల చెవికెక్కడం లేదు, ఇటు స్వజాతి నాయకులకు, మేధావులకు చీమకుట్టనట్లు కూడా లేకపోవడం దుఖఃకరం. అణగారినవర్గాలు తమకు రావాల్సిన హక్కుల కోసం కోర్టుకెక్కితే రాని స్పందన, వారి హక్కుల్ని కాలరాయడానికి మాత్రం చెప్పుకోదగ్గ రీతిలో వస్తుంది. కారణం, న్యాయరంగంలోనూ బ్రాహ్మణీయ వర్గాల ఆధిపత్యం తిరుగులేని విధంగా ఉండడమే.
కాన్షీరాం ‘కోర్టులుకూడా బ్రాహ్మణ అగ్రహారాలుగా మారిపోయాయి’ అని అనడంలో అతిశయోక్తి లేదు. ఒక వైపు ఎంబిసీలు- సోదర కులాలద్వారా నష్టపోతున్నామని గగ్గోలు పెడుతున్నారు. రిజర్వేషన్లను వినియోగించుకోవడం ద్వారా అభివృద్ధి చెందిన ఎస్సీ బీసీ కులాలు స్వార్థ ప్రయోజనాలకులోనై రిజర్వేషన్ల స్ఫూర్తిని దెబ్బతీస్తూ మిక్కిలి అణగారిన కులాలను అణచివేసు ్తన్నాయి. అగ్రకులాల కంటే తమ సహకులాలతోనే ఎక్కువ నష్టపోతున్నామని ఎంబీసీ, ఎంఎస్‌సీ (మోస్ట్ షెడ్యూల్డుకులాలు, మాదిగలు) కులాలు తమ నిరసనస్వరాన్ని పెంచుతున్నాయి. మరోవైపు ఇన్ని సంవత్సరాల రిజర్వేషన్లలో పేరుకు 27 శాతం అయినా అమలు జరిగింది మాత్రం 6 శాతమే. ఈ 6 శాతం ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు లభించకుండా కుతంత్రం గత కొంతకాలంగా జరుగుతూ వస్తోంది. ఆర్టికల్ 16(4) ప్రకారం ఓబిసిలు ఉద్యోగ కల్పనలోనూ, ప్రమోషన్లలోనూ రిజర్వేషన్లు పొందడమనేది ప్రాథమిక హక్కుగా సంక్రమించ వలసిఉంది.
ఓబిసిలు చట్టసభల్లో రిజర్వేషన్లు పొందకుండా కాంగ్రెస్ ప్రభుత్వాలు అన్యాయం చేస్తే, ప్రమోషన్లలో రిజర్వేషన్లను పూర్తిగా నీరుగార్చిన ఘనత బిజెపి హిందుత్వ పాలకులకు దక్కింది. ఈ నేపథ్యంలో ఓబిసి వర్గాలనుండి ఆనాడే తీవ్ర ప్రతిఘటన వచ్చిఉంటే ఇంత అన్యాయం జరిగి ఉండేది కాదు. ఓబిసి రాజకీయ ప్రతినిధులు అగ్రకుల పాలకపక్షాల చేతుల్లో కీలుబొమ్మలుగా మారి ఈ దుస్థితిని ప్రశ్నించే ప్రయత్నం కూడా చేయలేదు. ఇప్పటికే ఇంటికుంపటితో నలిగిపోతున్న ఓబిసిలకు పాలకపక్షాల నిర్ణయాలు మూలిగేనక్కమీద తాటిపండు పడ్డ చందంగా మారాయి. ప్రమోషన్లలో రిజర్వేషన్లు నిరాకరించడం మూలంగా 1,26,000 ఉద్యోగాలు కోల్పోతే, రూ. 1,10,000 కోట్ల ఆదాయాన్ని ఓబిసీలు కేంద్ర సర్వీసు ల్లో కోల్పోవలసి వచ్చింది. ఈ 1,26,000 ఉద్యోగాలు అగ్రకులాలు అప్పనంగా కాజేశాయి.
దీనికంతటికీ కారణం బిజెపి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేసిన 77వ రాజ్యాంగ సవరణ.ఇది క్లాస్ 1 ఉద్యోగులకు సంబంధించిన సమాచారం మాత్రమే. క్లాస్ 4,3,2 ఉద్యోగాల్లో ఓబిసిలకు జరిగిన అన్యాయం పూడ్చలేని విధం గా ఉన్నది. ఇక రాష్ర్ట ప్రభుత్వ సర్వీసుల్లో ఇంతకంటే ఘోరంగా నష్టపోవడం జరిగింది. ఇప్పటికీ క్లాస్ 3 ఉద్యోగులు లేని కులాలు కోకొల్లలుగా ఉన్నాయి. యూనివర్శిటీ గడపతొక్కని కులాలు ఇటు ఎస్సీల్లో, అటు బీసీల్లోనూ లెక్కలు మిక్కిలిగానున్నాయి. పరిస్థితిఇలా ఉంటే సుప్రీంకోర్టు గత 2012 ఏప్రిల్ 27న ఎస్సీఎస్టీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు ఇవ్వడాన్ని నిరాకరిస్తూ ఒక తీర్పు వెలువరించింది.
ఎస్సీ ఎస్టీలు ఈ తీర్పు ద్వారా కోల్పోయిన ప్రమోషన్లలో రిజర్వేషన్లను తిరిగి కల్పించడానికి ఇప్పుడున్న యుపిఏ ప్రభుత్వం 117వ రాజ్యాంగ సవరణ బిల్లును ఇటీవల రాజ్యసభలో ప్రవేశపెట్టింది.
ఈ బిల్లులో పూర్వమున్న ‘సరియైన ప్రాతినిధ్యం’ అనే క్లాజ్‌కు బదులుగా ‘రిజర్వేషన్ల శాతం ప్రకారం’ అనే క్లాజును చేర్చి సవరణ చేయడం ద్వారా ఆర్టికల్ 16ను సవరించనుంది. దీంతో ఎస్సీ ఎస్టీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు సిద్ధించే అవకాశం ఉంది. సమస్యల్లా ఓబీసీలదే. ఓబీసీలు బ్రాహ్మణీయ శక్తులను తమ భుజాలపై మోసినంతకాలం వారి హక్కుల్ని కాలరాస్తూనే ఉంటారు. ప్రత్యామ్నాయ శక్తులుగా ఎదగకుండా, రాజకీయ ప్రాతిని ధ్యాన్ని పెంచుకోకుండా వీరి సమస్యకు పరిష్కారం లభించదు. మహాత్మాగాంధీని నమ్ముకోవడంతో లండన్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశాల్లో బీసీలు తమ ప్రాతినిధ్యాన్ని కోల్పోయారు. స్వాతంత్య్రం తరువాత రాజ్యాంగ పరిషత్తులో ఒక్క బిసి కులాల ప్రతినిధి కూడా లేకుండానే రాజ్యాంగనిర్మాణం జరిగింది.
ఆ సందర్భంగా బీసిల రిజర్వేషన్లసమస్యను అంబేద్కర్ మాత్రమే చర్చకుతీసుకురా గలిగాడు. అయినా అగ్రకులాల ఆధిపత్యంలో గొంతులు నొక్కివేశారు. రాతియు గానికి ప్రతినిధులైన వడ్డెరలు, మట్టియుగానికి ప్రతినిధులైన కుమ్మరులు, రజకులు, లోహయుగానికి మూలకారకులైన మంగలివంటి వెనుకబడిన కులాల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. రాజ్యాంగంద్వారా సంక్రమించిన ప్రాథమిక హక్కులను తిరిగిపొందినప్పుడే సామాజికన్యాయం. బిసివర్గాలుఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా పొందవలసిన వసతులను పొందగలుగుతారు.
Surya Telugu News Paper Dated : 17/06/2013
No comments:
Post a Comment