Friday, July 5, 2013

అక్షరానికి అరవయ్యేళ్ళు ( ఆచార్య కొలకలూరి ఇనాక్) రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి


July 01, 2013
భయం ప్రాతిపదిక మీద బతుకుతున్న
ఈ ఊరు, ఈ దేశం ఎంతకాలం జీవిస్తాయి?
ప్రేమ ప్రాతిపదిక మీద బతికే
సమాజం, వ్యవస్థ ఏ రోజు పుడతాయి?


(ఊరబావి: 1969)
వ్యక్తిగా డెబ్భై అయిదో పడిలో అడుగిడుతున్న (01.07.1939) ఆచార్య కొలకలూరి ఇనాక్ రచయితగా అరవయ్యవ ఏడాదిలోకి పరుగిడుతున్నారు (1954-2013). రెండవ ప్రపంచ యుద్ధం మొదలవుతుండగా పుట్టిన కొలకలూరి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం విరమింపబడి ఎన్నికల రాజకీయాలు దేశ భవిష్యత్తును నిర్ణయించడం మొదలవుతున్న దశలో రచనను చేపట్టారు. 1954లో 'ఉత్తరం' కథ, సీసపద్యం వంటివి రాయడంతో ఆయన రచనా జీవితం మొదలైంది.


అతిచిన్న వయసులోనే రచనను ప్రారంభించి అరవయ్యేళ్ళుగా రచయితగానే జీవిస్తున్నారు కొలకలూరి. ఆయన స్వాతంత్య్రానంతర తొలితరం తెలుగు రచయిత. మధురాంతకం రాజారాం, కాళోజీ, గూడూ రి సీతారాం, సురమౌళి, నవీన్, ఇల్లిందల సరస్వతీదేవి, ముదిగంటి సుజాతారెడ్డి, రంగనాయకమ్మ, వాసిరెడ్డి సీతాదేవి, పెద్దిభొట్ల సుబ్బరామయ్య, రావిశాస్త్రి, కాళీపట్నం రామారావు, కేతు విశ్వనాథరెడ్డి, కె.సభా, ముంగర శంకరరాజు, వల్లంపాటి వెంకటసుబ్బయ్య వంటివాళ్ళు కొలకలూరికి కొంచెం ముందు, కొంచెం వెనకలుగా సమకాలిక రచయితలు. ఇవాళ దళిత రచయితలుగా మనం కీర్తిస్తున్న గుర్రం జాషువా, కుసుమ ధర్మన్న, బోయి భీమన్నల తరువాత పేర్కొనదగిన ప్రసిద్ధ దళిత రచయిత కొలకలూరి. వాళ్లలోని అభ్యుదయాంశను తనదైన ఆధునిక మార్గంలో కొనసాగిస్తున్న రచయిత కొలకలూరి.


కొలకలూరి కవి, కథకులు, నవలా నాటక రచయిత, విమర్శకులు, పరిశోధకులు, సమీక్షకులు. తెలుగు సాహిత్య చరిత్రలో స్తబ్ధతా యుగమని కొందరు భావిస్తున్న యుగంలో కొలకలూరి రచనలు ప్రారంభించారు. కొలకలూరి రచనల పట్టిక కన్నా ఆయన రచనాతత్వాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం. కొలకలూరి అభ్యుదయ సాహిత్యం మలి దశలో రచన ప్రారంభించి విప్లవ, స్త్రీ, దళిత బహుజన, మైనారిటీ, ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమాల ద్వారా రచయితగా నడుచుకుంటూ వస్తున్నారు. ఆయనది ఒక సుదీర్ఘ ప్రయాణం. ఏ సంస్థలోనూ చేరకుండా ఆ సంస్థల భావజాలాలలోని అనుకూలాంశాలను స్వీకరించి సమకాలీన సామాజిక వాస్తవికతను వస్తువుగా చేసుకొని రచనలు చేస్తున్నారు కొలకలూరి.
ఆచార్య కొలకలూరికి ఒక సామాజిక స్వప్నముంది.


పైసా లేనివాడు - పైగా హరిజనుడు
ప్రధానమంత్రి కాగలిగి - అయిదేళ్ళు పదవిలో ఉండి
ఆపైన పదవి వదిలి -పైసా లేకుండా
పాత మనిషిగా - బ్రతగ్గలిగిన్నాడు

భారతదేశం - బాగుపడ్డట్టు (అభ్యుదయం)
1970ల నాటికే స్వాతంత్య్రం మీద తెలుగు రచయితలకు నమ్మకం సన్నగిల్లింది. ఆ అపనమ్మకాన్ని వ్యక్తం చేయడానికి ఆరుద్ర, కాళోజీ, జాషువాల నుండి నేటిదాకా ప్రజా రచయితలు వెనకాడలేదు. కొలకలూరి ఆ కోవలోనివారే. దళితులకు రాజ్యాధికారం దక్కడం ఒక పార్శ్వమైతే, ఆ దళితులు అవినీతికి పాల్పడకుండా పాలించడం కొలకలూరి రాజకీయ స్వప్నంలో మరో అంశం. పళ్ళు రాలగొట్టుకోవడానికి ఏ రాయి అయితేనేమి అన్నట్లు తయారైన ప్రస్తుత సందర్భంలో కొలకలూరి 'అభ్యుదయం' కవితకు గొప్ప ప్రాముఖ్యముంది. గత నలభయ్యేళ్ల మన దేశ రాజకీయ పరిణామాలను చూసి, ఈ కవిత చదివి ఈ దేశం ఏమౌతుందోనన్న దిగులు కలగకమానదు.


మనిషిని నమ్మడం, మనిషిని ప్రేమించడం కన్నా వ్యక్తిత్వ వికాసమింకేముంటుంది. ఈ రెండూ లోపించడం వల్లనే మన దేశం అనేక అసమానతలలోకి, వివక్షలలోకి నెట్టివేయబడింది. కొలకలూరి గొప్ప మానవ ప్రేమికుడు. మన దేశంలోని సాంఘిక వివక్షల కారణంగా ఆయన వంశీకులు మతాలు మార్చుకున్నా కొలకలూరి అచ్చమైన మనిషి విశ్వాసిగా నిలిచారు.

లేకుంటే మనిషి నా గీత, నా బైబిల్ నా ఖురాన్..
మనిషి నా ఊపిరి, ప్రాణం, రక్తం
మనిషి నా చైతన్యం నా జీవితం నా వ్యక్తిత్వం
అని అనలేరు. భారతదేశ ప్రజలంతా కలిసి మనిషికి మాత్రమే విలువనిస్తే, మనిషిని మాత్రమే ప్రేమిస్తే ఎంత సామాజిక శాంతి చేకూరుతుంది! మన దేశం ఎంత నాగరికమౌతుంది!
దేశభక్తి అనే మాట ఇవాళ అర్థం కోల్పోయిన పదమైపోయింది- దేశభక్తి అంటే రొమ్ములు గుద్దుకోవడం, జబ్బలు చరుచుకోవడం, తొడలు గొట్టడంగా మారిపోయింది. అది దేశభక్తి కాదు. ఒక దేశంలోని ఒక వ్యవస్థలో బాగుపడ్డవాళ్ళు మా దేశం గొప్పది అంటారు. మా దేశాన్ని మేము ప్రేమిస్తున్నామంటారు. ఆ వ్యవస్థలో నష్టపోయిన వాళ్లు ఈ మాటలనలేరు. కొలకలూరి భారతదేశంలో అవమానాల పాలైన, అణచివేయబడ్డ వర్గాలకు చెందిన కవి. ఆయన ఎలాగో పైకి వచ్చి ఉండవచ్చు. కాని దళితులకు ఈ దేశంలో జరిగిన అవమానాలు, చూసి కూడా
భూషించినా దూషించినా
స్వాగతం పలికినా వీడ్కోలు చెప్పినా
సన్మానించినా అవమానించినా/నా యీ దేశాన్ని ప్రేమిస్తున్నాను
అని ప్రకటించారు. దేశం మీద నిజమైన గౌరవం ఉంటే తప్ప ఇలా అనడం సాధ్యం కాదు. ఈ దృష్టితో చూచినప్పుడు వ్యాపారులు సంపన్నులు ఆధిపత్యవాదులు ప్రదర్శించే దేశభక్తి కృతకమైందని, అణచివేతకు గురైనవారు ప్రదర్శించే దేశభక్తి సహజమైందని చెప్పవచ్చు.


నిన్న తలవంచిన వీళ్లు/నేడు ప్రతిఘటించారు
రేపు విజయులౌతారు....
ప్రతిఘటించే పంచముడు/పంచభూతాలకు ప్రాణదాత
జాషువ ఏ కావ్యం రాసినా అందులో దళిత స్పృహ, దళిత వేదన అంతస్సూత్రంగా కనిపిస్తూ ఉంటుంది. అది కొలకలూరి సాహిత్యంలోను ఉంది. ఆయన సాహిత్యంలోని కీలకాంశం ఇదే. సమత (దళిత విద్యార్థి జీవితం) అనాధ (దళిత స్త్రీ జీవితం) ఇరులలో విరులు (కుల ప్రసక్తి లేని మానవ సంబంధాలు) సర్కారు గడ్డి (కష్టకాలంలోను దళితులను పెద్దవాళ్లు దోచుకోవడం) దిక్కులేనోరు (అబద్ధపు నేరం మోపి దళితుని చంపడం) దర్శనం (ఆలయ ప్రవేశం) కూలి (దళితుల శ్రమఫలితం) ఊరబావి (నీళ్లకోసం దళిత స్త్రీ తిరుగుబాటు) పశ్చాద్భూమి (కక్కసు ఉద్యోగుల జీవనం) ఆకలి (తిండికోసం దళిత అమ్మాయి సాహసం) అస్పృశ్యగంగ (పట్టణంలోనూ అస్పృశ్యత) సూర్యుడు తలెత్తాడు (చదువుకొని పైకి వచ్చిన దళితుడు) కాకి (మాదిగల ఇండ్ల దగ్గర మాత్రమే అడుక్కునే దళితుడు) విఘ్ననాయకుడు (ప్యాపిలి సంఘటన) -ఇలా కొలకలూరి సర్వ ప్రక్రియలలోనూ దళిత జీవితం పరచుకొని కనిపిస్తుంది. 'ఊరబావి' కథానిక దళిత జీవిత ప్రతిఫలనంలో గత శతాబ్ది ఆధునిక సాహిత్యంలోనే ఒక ఇతిహాసం. 1913లో మంగిపూడి వెంకటశర్మ 'నిరుద్ధ భారతం' రాసి భారతదేశ చరిత్రలో దళితుల శ్రమను కీర్తించారు. 21వ శతాబ్దం ప్రారంభంలో కొలకలూరి 'ఆదిఆం«ద్రుడు' అనీ పద్యకావ్యంలో భుజంగరాయుడనే దళితసేనానిని ప్రదర్శించారు. 'నా కన్నీళ్ళే నా సాహిత్యం' అన్నారు కొలకలూరి ఒక సభలో. అవి పీడిత జనం కన్నీళ్లు. దళితులు బహుజనులు స్త్రీలు మైనారిటీలు- ఇదీ కొలకలూరి పక్షం.


భారతదేశాన్ని మోసే అర్ధాకలి బోయీలకు
భారతభవనం గోడలుగా స్థిరంగా నిలబడ్డ
దళితులకు గిరిజనులకు/ముస్లిములకు వెనుకబడినవారికి
అణగారిన వర్గాలకు నమస్కారం

కులం, మతం, ధనం- ఈ మూడు భారతీయ సమాజ నిర్మాణంలో ప్రధాన పాత్ర వహించాయని కొలకలూరికి తెలుసు. అవి అల్ప సంఖ్యాకులకు మేలు చేసి, అధిక సంఖ్యాకులకు చెడు చేశాయని కూడా ఆయనకు తెలుసు. ఆర్థిక సాంఘిక రుగ్మతలకు మూలాలైన ఈ మూడింటిని నిర్మూలించి, వీటి ప్రమేయం లేని భారతదేశం పుట్టాలని ఆయన ఆకాంక్ష. ఆయన సాహిత్య మంతా విస్తరించిన అంశం ఇది. భారతదేశం నాగరికమూ, శాస్త్రీయమూ కావాలని, స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వాలతో పరిమళించాలని కొలకలూరి తపన. భారతదేశం ఐక్యంగా ఉండాలన్నది కొలకలూరి కోరిక. అయితే అది వైరుధ్యాలను కప్పి పెట్టే వ్యాపారులు కోరుకునే ఐక్యత కాదు. వైరుధ్యాలు, వివక్షలు లేని ఐక్యత, మానవీయ ఐక్యత.


దేశం బాగుపడాలనీ, పాడు కారాదనీ
కులం బాధా, ధనం హింసా తొలగాలనీ
భూమి మిగతా భూతాల్లా అందరిదనీ
పీడన ఏ రూపంలోనూ ఉండరాదనీ....
వ్యవస్థ వ్యక్తిగా, సమిష్టి వ్యక్తిగా
లోకం నేనుగా రోదించింది
ఇదీ కొలకలూరి రోదన. ఇది ప్రజాపక్షం వహించే రచయితల ప్రజాస్వామిక ఆకాంక్ష. కొలకలూరి ఈ ప్రజాస్వామిక ఉద్యమంలో భాగస్వామి.
లోకమంతా ప్రేమై/హృదయమంతా దయై
ఉంటే తప్ప/ఈ జీవితాలకు మోక్షం లేదు
అన్నది కొలకలూరి తీర్పు.


సాహిత్య శిల్పిగా కొలకలూరి సరళవాది. ఆయన సాహిత్యంలో పాఠకులను దూరం చేసుకునే ప్రయోగాలు కనిపించవు. వస్తువులోను శిల్పంలోను కొలకలూరి ప్రజాపక్షమే. పాఠకులను బోల్తా కొట్టించే మలుపులు ఆయన కథలలోను, నవలలోనూ ఉండవు, కొన్నిచోట్ల కథలలో ముగింపు పట్ల ఆయన ప్రత్యేక శ్రద్ధ కనబరచినట్లు కనిపిస్తుంది. ఆయన ఎవరి జీవితాన్ని గురించి రాస్తున్నారో, ఆ జీవితాన్ని అనుభవిస్తున్నవాళ్లు చదివి, విని, అందులో తమ ముఖాలు చూచుకోగలిగేట్టుగా ఉంటుంది కొలకలూరి సాహిత్య శిల్పం. ఆయన వచన కవిత్వం కుందుర్తి చెప్పినట్లు, తిలక్ చెప్పినట్లు పాఠకులకు చాలా దగ్గరగా ఉంటుంది. వ్యంగ్యం, అధిక్షేపం కొలకలూరి కవిత్వ శిల్పాయుధాలు. చిన్న చిన్న వాక్యాలు ఆయన రచనలకు పట్టాలు. అసలైన తెలుగు వాక్యాలు ఆయన సొంతం. జీవిత శకలాలలో నిండిన వస్తువు లోపల సుడులు తిరుగుతున్నా, శిల్పం ఉద్రేకపడదు. తిరుగుబాట్లు, ప్రతిఘటనలు ఉన్నా అవి తిట్లు బూతులు జుగుప్సలు కాకపోవడం కొలకలూరి విశిష్టత. కొలకలూరి సాహిత్యశిల్పంలో క్రమ పరిణామం.

పాఠకులకు దగ్గర కావడం కనిపిస్తాయి. రచన తనకోసం కాదు, పాఠకులకోసం అనే స్పృహ ఆయనకు మొదటినుంచీ ఉంది. కొలకలూరి పాపులర్ మార్గంకాదు, ప్రజా మార్గం. తన ప్రాంతం నుండి నలభయ్యేళ్ల క్రితం రాయలసీమకు వచ్చేసినా, ఆ భాష మాత్రం ఆయన సాహిత్యంలో ఇంకా స్వచ్ఛంగా నిలిచి ఉండడం ఆశ్చర్యం. ఏ భాషలో రాసినా, ఆయన రాయలసీమలో బతికినందుకు, ఆ ప్రాంతం జీవితాన్ని కూడా తన సాహిత్యంలో ప్రదర్శించారు. సాహిత్య విమర్శకుడుగా, పరిశోధకుడుగా కొలకలూరిది కొత్త చూపు. సాహిత్య వ్యాసాలు (1974) మొదలుకొని జానపదుల సాహిత్య విమర్శ (2009) దాకా విశ్వవిద్యాలయ పరిశోధకులు సాధారణంగా స్పృశించని 'తెలుగు వ్యాస పరిణామం' మీద పరిశోధించడమే ఆయన మౌలిక శ్రమకు నిదర్శనం. గత పదేళ్లలో కొలకలూరి మూడు పరిశోధనాత్మక విమర్శా గ్రంథాలను ప్రచురించారు.

అవి 1.ఆధునిక సాహిత్య విమర్శ సూత్రం 2.శూద్రకవి శుభమూర్తి వసుచరిత్ర వైశిష్ట్యం 3.జానపదుల సాహిత్య విమర్శ. ఇవి మూడూ పునర్మూల్యాంకన విమర్శ గ్రంథాలు. అలాగే నరహరిగోపాలకృష్ణమశెట్టి నవల 'శ్రీరంగరాజచరిత్ర'ను దళిత సాహిత్యోద్యమ నేపథ్యంలో పునర్ముద్రిస్తూ, కొలకలూరి రాసిన పరిశోధనాత్మక ముందుమాట కూడా ఇందులో భాగం. విరసం ఏర్పడిన తర్వాత తెలుగు సాహిత్యంలో చర్చకు వచ్చిన నిబద్ధత, నిమగ్నతలకు కొలకలూరి నిబిడత (స్వీయానుభవంతో రాయడం) అనే మూడవ సూత్రాన్ని జోడించి ఆధునిక తెలుగు సాహిత్యాన్ని ఈ మూడు సూత్రాలు ప్రాతిపదికగా విశ్లేషించారు. ఇది కొత్తచూపుతో కూడిన కృషి. రామరాజభూషణుడు శూద్ర కవి. ఆయన అసలు పేరు శుభమూర్తి. వసుచరిత్ర శూద్ర కావ్యమంటూ కొలకలూరి చేసిన పరిశోధన ఆ కావ్యం మీద అంతకు ముందు వచ్చిన విమర్శలన్నిటికీ భిన్నమైనది, విశిష్టమైనది. 'తెలుగు జానపదుల సాహిత్య విమర్శ వయస్సు వెయ్యేళ్ళు' అంటూ తెలుగు చాటువులలో, సంప్రదాయ సాహిత్య చరిత్రలలో గల కథనాలను కొలకలూరి జానపదుల సాహిత్య విమర్శగా గుర్తించడం విశేషం. దళిత స్వర్శ ఉన్న కారణంగా, ఎన్ని లోపాలున్నా శ్రీరంగరాజ చరిత్ర తొలి తెలుగు నవల అనే ప్రతిపాదనను అనేక ఉపపత్తులతో చేశారు కొలకలూరి.


ఆచార్య కొలకలూరి ఇనాక్ ఇప్పటిదాకా 70 రచనలు చేశారు. బైబిల్‌ను వ్యవహారిక భాషలోకి అనువదించారు. ధనికులు పేదలు ఉన్న సమాజంలో కొలకలూరి పేదల పక్షం. పై కులాలు, కింది కులాలు ఉన్న సమజంలో ఆయన కింది కులాల పక్షం. మెజారిటీ మైనారిటీలు ఉన్న సమాజంలో ఆయన మైనారిటీ పక్షం. పురుషులు, స్త్రీలు ఉన్న సమాజంలో ఆయన స్త్రీల పక్షం. ప్రేమ, ద్వేషం ఉన్న సమాజంలో కొలకలూరి ప్రేమ పక్షం. విభజిత సమాజంలో తానొక పక్షం వహించినా ఆయన కోరుకునేది సమష్టి సమాజాన్నే.


మనమంతా కలిసి ఆనందించిందాకా
నాకు సుఖం లేదు, శాంతి లేదు (కులం-ధనం)
డెబ్భై అయిదవ పడిలో అడుగిడుతూ, రచనా జీవితంలో షష్ట్యబ్దిలోకి పరుగిడుతున్న కొలకలూరి ఇనాక్ గారికి శుభాకాంక్షలు.
- రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి
94402 22117
(నేడు తిరుపతిలో ఆచార్య కొలకలూరి ఇనాక్ అమృతోత్సవం-
సాహితీ వజ్రోత్సవం జరుగుతున్న సందర్భంగా)
 
Andhra Jyothi Telugu News Paper Dated : 1/07/2013 

No comments:

Post a Comment