Saturday, July 27, 2013

Exclusive Story on Dalit Maha Sabha Leader (Dr. Kathi Padma Rao ) ఎదిరించి ఎదగటం నేర్పింది


July 28, 2013
'మాది మాలపల్లే కావచ్చు. కానీ అది మామూలు పల్లె కాదు. సమాజంలో తేడాలు తెలిసిందక్కడే, ఆత్మవిశ్వాసం మారాకు తొడిగిందక్కడే' అంటున్నారు దళిత ఉద్యమకారుడు, అధ్యయనశీలి కత్తి పద్మారావు. సంస్కృత సాహిత్యాన్ని, ఆత్మగౌరవ పోరాటాన్నీ నేర్పింది తన ఊరు ఈతేరే అంటున్న ఆయన చెబుతున్న విశేషాలే ఈవారం 'మాఊరు'.
మా ఊరు ఈతేరు గుంటూరు జిల్లా బాపట్ల మండలంలోని పల్లెటూరు. ఎక్కడైనా ఊరు పెద్దగా వాడ చిన్నగా ఉంటుంది. కానీ మా ఊళ్లో మాది మూడొందల గడప మాల పల్లె. 40 కుటుంబాలు కమ్మవారు, రెండు మూడు కుటుంబాల వడ్డెరలు, బ్రాహ్మణులు ఓ ఐదు కుటుంబాలు ఉండేవి. నేను 1953 జులై 27న పుట్టాను. మా అమ్మ మాణిక్యమ్మ, మా నాన్న సుబ్బయ్య. ఇద్దరూ వ్యవసాయ కార్మికులే. నేను పుట్టేనాటికి వారికి సొంతంగా భూమి అంటూ ఏమీ లేదు. మా నాన్న కమ్మలు, బ్రాహ్మల దగ్గర జీతానికి ఉండేవాడు. విచిత్రమైన విషయం ఏమంటే మేం ఈతేరులో ఉండేది ఏడాదిలో ఆరు నెలలు మాత్రమే. అదీ వ్యవసాయ పనులు ముమ్మరంగా ఉండే జూలై నుంచి డిసెంబరు వరకూ. మిగిలిన ఆర్నెల్లూ నా తల్లిదండ్రులు చీరాలలోని ఇండియన్ లీఫ్ టొబాకో డిపో (ఐఎల్‌టీడీ)లో కార్మికులుగా పనిచేసేవారు. అందువల్లే నా బాల్యమంతా ఇక్కడ ఆర్నెల్లు - అక్కడ ఆర్నెల్లుగా గడి చింది.

తేడాలు తెలిశాయి
ఇలాంటి జీవనశైలి వల్ల నాకు ఊహ తెలుస్తున్న కొద్దీ మా ఊరిని వేరే ఊళ్లతో పోల్చి చూసుకోగలిగే వెసులుబాటు దక్కింది. మొట్టమొదట నేను గమనించిన విషయం ఏమంటే - చీరాలలో మేం ఉండేది కూడా ఒక దళిత వాడలోనే. కానీ అది పద్దెనిమిది పేటల సముదాయం. అంతమందిలో ఉండటం వల్ల, పట్టణ పద్ధతుల వల్లా అక్కడ మాకు అంటరానితనమంటే ఏమిటో తెలియదు. అదే ఈతేరుకు వచ్చేసరికి అంటరానితనం ముల్లులా గుచ్చుకునేది. జనాభా ఎక్కువమంది మాలలే అయినప్పటికీ, ఊళ్లో 80శాతం భూమి అగ్రవర్ణాల అధీనంలోనే ఉండటంతో మాపై వారి ఆధిక్యం కొనసాగేది. అది నాకు కొట్టొచ్చినట్టు కనిపించిన మొట్టమొదటి తేడా. ఉదాహరణకు ఈతేరులో మా నాన్నను జీతానికి ఉంచుకున్నవారే కాకుండా, ఇతరులు కూడా ఏరా, రారా, పోరా అని సంబోధిస్తూ మాట్లాడేవారు. అదే చీరాలలో ఆయనను ఎవరూ అలా పిలిచేవారు కాదు. పేరుతోనో, ఏదైనా వరసతోనో పిలిచేవారు. ఇది నాకు విచిత్రంగా ఉండేది. 'అదేమిటి' అని నేను అడిగితే 'పెద్దవాళ్లు అలానే పిలుస్తారు' అనేవారే తప్ప, మా వాడవాళ్లెవరూ దాన్ని తప్పని కూడా అనుకునేవారు కాదు. కానీ మా అమ్మ మాత్రం ఈ తరహా సంబోధనలను సహించేది కాదు. ఎందుకంటే ఆమె పెద్ద మేస్త్రి బిడ్డగా పుట్టింది, పెరిగింది. చీరాల ఐఎల్‌టీడీలో మా తాత కట్టా రాఘవులంటే పెద్ద పేరు. 4000 మంది ఉద్యోగులకు ఆయన మేస్త్రి. ఇప్పటికీ నన్ను అక్కడ అందరూ కట్టా రాఘవులు మనవడిగానే గుర్తుపెట్టుకుంటారు. మొత్తానికి అందువల్ల మా అమ్మ ఈతేరులో తనను ఎవరైనా 'ఏమే, ఒసే, ఒయే' అని పిలిస్తే ఊరుకునేది కాదు. పేరుతోనే పిలవమని గట్టిగా చెప్పేది. నాలో ఆత్మగౌరవమనే విత్తనాలను నాటింది మా అమ్మే. నన్ను ఉద్యమకారుడిగా భావిస్తారు అందరూగానీ, నాకన్నా ఉద్యమకారిణి మా అమ్మ.

నీటి కోసం నడక
ఈతేరులో చెరువు, బావి అన్నీ ఉన్నా సరే, మాలపల్లెకు మంచినీళ్లు కావాలంటే రెండు కిలోమీటర్ల దూరం నడిచి గుడిపూడి గ్రామానికో, లేదంటే మరిపూడికో వెళ్లాల్సిందే. గుడిపూడిలో బ్రాహ్మలు, మరిపూడిలో క్షత్రియుల సంఖ్యాబలం ఎక్కువ. ఇంతదూరం బిందె పట్టుకుని నడిచివెళ్లినా సరే, అక్కడ బావిలోంచి నేరుగా నీటిని తోడుకోకూడదు మేం. వాళ్లెవరైనా తోడి పోసేవరకూ వేచి ఉండాల్సిందే. వాళ్లు మురికి చేతులతో పోసినా కిమ్మనకుండా తెచ్చుకోవాలి. ఆ రోజుల్లో మా వాడలోని ఆడవాళ్లందరికీ ఇదో పెద్ద పరీక్ష. ఊరి చెరువులో ముంచి తెచ్చుకోవాలంటే కూడా పద్ధతులున్నాయి. అగ్రవర్ణాల వారికి ఒక రేవు, మాకు వేరేగా ఒక రేవు. అయితే వాళ్ల పశువులను తీసుకొచ్చి మా రేవులో నీళ్లు తాగించేవాళ్లు. అదేమని అడగడానికి వీల్లేదు. చుండూరు మారణకాండకు దారి తీసిన అంశం సరిగ్గా ఇదే. అక్కడి దళితుల రేవులో ఒక కమ్మాయన పశువులకు నీళ్లు పట్టడమే కాకుండా, కుడితిని అందులో పారబోశాడు. అదేమని ప్రశ్నించిన పాపానికి దళితుల మీద హత్యాకాండ కొనసాగింది. అస్పృశ్యతను నేర్పించింది బ్రాహ్మలే అయినా, దాన్ని గట్టిగా ఆచరణలో పెట్టి అడ్వాంటేజ్ తీసుకున్నవారు కమ్మ, వెలమ, రెడ్డి వంటి కులాలవారే అని గట్టిగా చెప్పగలను.

ఆత్మవిశ్వాసానికి పుట్టినిల్లు
అయితే మా ఊళ్లో పరిస్థితి మరీ అంత ఘోరంగా ఉండేది కాదు. ఎందుకంటే 60ల నాటికే మా వాడలో అవగాహన ఎక్కువగా ఉండేది. నేను ఎనిమిదో తరగతికి వచ్చేసరికి మా నాన్న కూడబెట్టిన సొమ్ముతో ఈతేరులో నాలుగు ఎకరాలు భూమి కొన్నారు. దాన్ని ఊళ్లోని కమ్మోరు కుళ్లుకున్నారు, కళ్లలో నిప్పులు పోసుకున్నారు. ఎలాగైనా ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో ఒకాయన మా పొలానికి నీళ్లు రాకుండా చేశాడు. దాంతో మా నాన్న పార పెట్టి నరికాడు. ఆయన ముక్కు తెగిపోయి ప్రాణాపాయంలో పడ్డాడు, మా నాన్న కేసుకు భయపడి తన మేనమావల ఊరికి పారిపోయాడు. కొన్నాళ్లకు మళ్లీ తిరిగొచ్చాడు. ఇలాంటి చెదురుమదురు సంఘటనలు కొన్ని జరుగుతూనే ఉండే వి. అందువల్ల మాలపల్లెలో దాదాపు అందరిళ్లలోనూ పదునుపెట్టిన పారలు, బల్లేలు, పలుగుల వంటివి తప్పనిసరిగా ఉండేవి. 67లోనే మేం డాబా ఇల్లు కట్టుకున్నాం. ఆ రోజుల్లో మా ఊళ్లో అగ్రకులాలకు సైతం డాబా ఇల్లు లేదంటే నమ్మండి! ఇంట్లో మాకు ఐదు పాడి గేదెలు ఉండేవి. అందువల్ల మేం దేనికీ ఇబ్బంది పడిన రోజులేవీ లేవు. 'మేం ఎవరికన్నా తక్కువ కాదు' అన్న ఆత్మవిశ్వాసాన్ని, ఎసర్షన్ (ఎదిరించి నిలబడ టం) నేర్పింది మా ఊరే.

సాంస్కృతిక ధనవంతులం
దళితులు డబ్బుకు పేదవారేమోగానీ, సంస్కృతి అనే ధనం వాళ్ల దగ్గర పుష్కలంగా ఉంటుంది. కళలు, సంస్కృతికి మా మాలపల్లె ఆటపట్టు అని చెప్పడానికి నేనేమీ సందేహించను. ఇక్కడి స్త్రీలు పని అంతా పాటతోనే చేసేవారు. 'కలహంస నడకల... కలహంస నడకల... కదలిరావే...' అంటూ ఏ నలుగుపాటనో మా అమ్మ, పెద్దమ్మ, చిన్నమ్మ వంటివాళ్లంతా కలిసి గొంతెత్తి పాడారంటే అది ఊరుఊరంతటికీ వినిపించేది. ఆ పాటల్లోంచే నేను శృతి నేర్చుకున్నా. ఆరున్నర శృతిలో గొంతెత్తి పాడగలనంటే, ఉపన్యాసాల్లో మాట్లాడగలనంటే దానికి పునాది ఆ వాడ వేసినదే. మా వాడలో ఎవరైనా పాలితాలికలు, అరిసెలు వంటి తినుబండారాలు చేసుకుంటే వాడలోని గర్భిణులకు పెట్టిగాని తాము తినేవారు కాదు. అదే అగ్రవర్ణాలవారు కడుపుతో ఉన్నదని కూడా చూడకుండా స్త్రీలతో పని చేయిస్తారు. జాలి లేని కులాలేవంటే అగ్రకులాలే. వాళ్లు సంస్కృతిపరంగా బలహీనులని నాకు చిన్నప్పుడే అర్థమయింది. ఎందుకంటే వాళ్లలో ఎవరైనా చనిపోతే పట్టుమని పదిమంది రావడానికి వెనకాడతారు. అలాగే ఆడవాళ్లు వెంటరారు. అదే దళితుల్లో ఎవరు చనిపోయినా వందల్లో చుట్టపక్కాలు వస్తారు. స్త్రీలు సైతం శ్మశానానికి వస్తారు. పుట్టుక, పెళ్లి, చావు - ఈ మూడూ మనిషి ప్రయాణంలో మైలురాళ్లు. అక్కడ మనతో ఎంతమంది తోడున్నారో అనేదే మన సంస్కృతి కింద లెక్క.

మాదొక సువార్త దళం
ఈతేరులో మాకు విడిగా బడి ఉండేది. నేను ఇక్కడుండే ఆరునెల్లూ ఈ స్కూలుకే వెళ్లేవాణ్ని. స్కూల్లో డ్రిల్లు మాస్టారు మాకు మంచి తర్ఫీదునిచ్చేవారు. ఆరోజుల్లోనే మా ఊరి నుంచి జాతీయస్థాయి ఆటగాళ్లుండేవారు. మాతో బోలెడన్ని ఆటలు ఆడించి శారీరక సామర్థ్యం పెరిగేలా, స్పోర్టివ్ స్పిరిట్ అలవడేలా చేసింది మా డిల్లు మాస్టారే. స్కూలయిపోయిన తర్వాత మా పేటలోనే ఉండే చ ర్చికి పరుగులు తీసేవాళ్లం. ప్రతి ఆదివారం అక్కడ 'సండే స్కూల్' అని నడిపేవారు. పిల్లలంతా వె ళితే అక్కడ ఎన్నో విషయాలు నేర్పేవారు. శుచిశుభ్రత, మంచి నడవడిక, నైతిక విలువల గురించి చిన్న కథలు, పాటలుగా చెబుతూ ఆకట్టుకునేవారు. బైబిల్ చదవడం, ప్రార్థన గీతాలు నేర్పించారు. ఆ ప్రభావంతో నేను 'సువార్త దళం' అనే బృందాన్ని ఒకటి ఏర్పాటు చేసి చిన్నచిన్న సేవాకార్యక్రమాలను చేపట్టేవాణ్ని. పాటలు పాడటం, సంగీత వాయిద్యాలను పలికించడం అక్కడే నేర్పించారు. నేను ఐదారు వాయిద్యాలను పలికించేవాణ్ని. అందువల్లే పాటలకు సొంతంగా బాణీలు కట్టుకోవడం అలవాటయింది. బైబిల్ చదవడం వల్ల నాకు పదసంపద పెరిగింది. నేను మాట్లాడే మాటల్లో పాడే పాటల్లో ప్రాస వచ్చి చేరేది. బోలెడన్ని సంస్కృత పదాలు నా ఒంటబట్టాయి. మరోవైపు పొగతాగడం, మద్యం సేవించడం, పేకాట వంటివాటి జోలికి పోకూడదనే నా నియమం కూడా చర్చి బోధనల ప్రభావమే. క్రిస్మస్, ఈస్టర్ వస్తోందంటే చాలు - చర్చిని అలంకరించడం, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చెయ్యడం వీటలో తలమునకలయిపోయేవాళ్లం. కొత్తబట్టలు వేసుకోవడం అంటే గొప్ప సంబరంగా ఉండేది.

చీరాల ప్రభావం
చీరాలలో ఉన్నప్పుడు పేరాలలోని శ్రీదుగ్గిరాల గోపాలకృష్ణ హైస్కూలుకు వెళ్లేవాణ్ని. హైస్కూలు స్థాయిలోనే నేను వక్తగా మంచి పేరు తెచ్చుకున్నాను. రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ గె లిచాను. వక్తృత్వంతో పాటు కవిత్వం, నాటకం, బుర్రకథ - ఇలా అన్ని సాంస్కృతిక అంశాల్లోనూ చురుగ్గా పాల్గొనేవాణ్ని. నేనే స్వయంగా రాయడం, పాడటం, అభినయించడం వంటివన్నీ చేసేవాణ్ని. దీనికి తోడు ఎన్‌సీసీలో కమాండర్‌గా కూడా ఉండేవాణ్ని. దాంతో నాయకత్వ లక్షణాలు నాలో బలపడ్డాయి. ఒకసారి ఏమైందంటే చీరాల ఐఎల్‌టీడీ చుట్టుపక్కల ఉండే పేటలన్నీ ఒక్కసారిగా అగ్నిప్రమాదంలో దగ్థం అయిపోయాయి. దాదాపు 800 గుడిసెలు కాలిపోయాయి. అక్కడివాళ్లెవరికీ కట్టుబట్టలు తప్ప మరేమీ మిగల్లేదు. అది చూసి నా మనస్సు వికలం అయిపోయింది. అది నా మొదటి సామాజిక దుఃఖం. దాంతోనే 'వినరండయా చింత గానం... కనలేమయా ఇంత ఘోరం...' అన్న పాట రాశాను. మరికొందరు పిల్లలను పోగుచేసి ఆ పాట పాడుతూ జోలె పట్టి విరాళాలు పోగు చేసి బాధితులకు అందించాను. పదో తరగతిలోనే అంబేద్కర్ జీవిత చరిత్ర నన్ను బాగా ప్రభావితం చేసింది. రోజూ ఉదయాన్నే దినపత్రికలు చదవాలి - ప్రతిరోజూ అధ్యయనం చెయ్యాలి - ప్రతిరోజూ కొంతైనా రాయాలి - ఆలోచనలు, అనుభవాల గురించి మాట్లాడాలి - అన్యాయం ఎక్కడ జరిగినా ఎదిరించాలి - మాటల్లో చెబుతున్నదాన్నే ఆచరించాలి - ఈ లక్షణాలను నేను అంబేద్కర్ జీవిత చరిత్ర నుంచే అలవరచుకున్నాను. చీరాల పౌర గ్రంధాలయం, పొన్నూరు కాలేజీలోని లైబ్రరీ నా ఎదుగుదలలో ప్రధాన పాత్ర పోషించాయి. నేను గొప్ప వాళ్లందరి జీవిత చరిత్రలూ అక్కడే చదివాను.

ఐదేళ్ల కోర్సు ఐదు ఊళ్లు
తెలుగులో నా అభినివేశం అంతా బైబిల్ చదవడం నుంచి వచ్చిందేనని నిస్సందేహంగా చెప్పగలను. నా స్కూలు మాస్టార్లు జానకిరామయ్య, తిరువేంగళాచార్యులు, అవ్వారు సుబ్బారావు వంటి వారంతా కలిసొచ్చి పదో తరగతి తర్వాత నన్ను పొన్నూరులోని 'శ్రీభావనారాయణస్వామి సంస్కృత కళాశాల'లో చేర్పించారు. లక్ష్మీపార్వతి, ఐ. వెంకట్రావు, కె. కృష్ణకుమారి వీళ్లంతా పొన్నూరు కాలేజీలో 'భాషాప్రవీణ' కోర్సులో నా సహాధ్యాయులు. అక్కడ, ఆ కోర్సులో చేరిన మొదటి దళితుణ్ని నేనే. దాంతో వివక్ష తప్పదని అనుకున్నాను. నేను ఆగస్టు పదిన చేరితే, పదిహేనున స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఉపన్యాసం ఇవ్వమన్నారు. ఆరోజు నేను మాట్లాడినదానికి కాలేజీలో అందరూ ముగ్థులయ్యారు. దాంతో వివక్ష విశ్వరూపం చూపించలేదు. కొండవీటి వెంకటకవిగారు అప్పటికి మా కాలేజీలో లెక్చరర్‌గా పనిచేసేవారు. ఆయన వల్ల నాకు త్రిపురనేని రామస్వామి బోధనలు తెలిశాయి. అప్పటివరకూ నాలో పేరుకుపోయిన క్రైస్తవం కరిగిపోయి హేతువాదం రుచి తెలిసింది. కాలేజీలో వెంకటకవిగారు మాత్రమే నా భుజం మీద చెయ్యి వేసి నడిచేవారు. వివక్ష మూలంగా నేను జిల్లెళ్లమూడి కాలేజీకి మారాను. ఆ తర్వాత తాడికొండ, పత్తేపురంలో చదివి ఐదో ఏడు మళ్లీ పొన్నూరు కాలేజీకే వచ్చి చేరాను. అన్నిచోట్లా కులం వల్ల అవమానాలే. కొద్దిమంది లెక్చరర్లు, ప్రిన్సిపాళ్లు మాత్రం నాకు సహాయంగా ఉండేవారు. తెలుగు సంస్కృత వ్యాకరణాలు, కౌముది, కాదంబరి, దశకుమారచరిత్ర, అలంకారశాస్త్రం వంటివన్నీ నేను సొంతంగా చదువుకుని అర్థం చేసుకునేవాణ్ని. ఉదయం నాలుగ్గంటల వరకూ చదివేవాణ్ని. నాతోటి విద్యార్థులకు ఏవైనా అనుమానాలుంటే నివృత్తి చేసేవాణ్ని. నేను చదువుకున్న పొన్నూరు కాలేజీలో, మా గురువుగారు వెంకటకవి స్థానంలోకే లెక్చరర్‌గా వచ్చానంటే నేను సాగించిన కృషి ఎటువంటిదో అర్థమవుతుంది. ఒకరకంగా సంస్కృతం చదువుకోవడానికి యుద్ధం చేశానని చెప్పవచ్చు.

ఎప్పుడూ ఏదీ అడక్కు
మా నాన్న సుబ్బయ్యది ఏదైనా సొంతంగా కష్టపడి సాధించుకోవాలనే తత్వం. దానికి అత్యుత్తమ ఉదాహరణ ఏదంటే - ఈతేరులో మేం ఇల్లు కట్టుకోవడానికి అవసరమైన ఇటుకలను ఆయనే స్వయంగా తయారుచేసి ఇటుక ఆవం కాల్చి వాటినే ఉపయోగించాడు. కలపకు అవసరమైన దుంగలను మా అమ్మానాన్నలే స్వయంగా కొట్టుకున్నారు. నేను లెక్చరర్ అయ్యాక ఒకసారి తోటి ఉద్యోగిని ఒక పుస్తకం అడగడాన్ని గమనించాడు మా నాన్న. 'ఇవాళ్టి నుంచీ నీ జీతంలో సగమే ఇంటికివ్వు. మిగిలింది నువ్వు పుస్తకాలు కొనుక్కో. ఎప్పుడూ ఎవరినీ ఏదీ అడగకు' అని చెప్పాడు. ఆయన చెప్పిన ఆ మాటల వల్లే నా సొంతంగా ఇంత అత్యుత్తమ లైబ్రరీని ఏర్పరచుకోగలిగాను. అలాగే 'ఎప్పుడూ ఎవరి దగ్గర నుంచీ ఏమీ ఆశించకు' అన్న మాటలను పాటించడం వల్లనే నేను దళితుల కోసం 14కాలనీలు కట్టించినా ఎక్కడా ఒక్క ఇల్లయినా తీసుకోలేదు, ఎన్నో జాగాలను ఇప్పించినా ఎక్కడా సెంటు భూమయినా నా పేరున తీసుకోలేదు. ప్రస్తుతం ఈతేరుకు ప్రెసిడెంటు మా వదినే. ప్రస్తుతానికి ఈతేరులోని మా వాడనుంచి ముప్ఫై మంది ఇంజినీర్లు, పదిహేనుమంది డాక్టర్లు ఉన్నారు.

దుఃఖసముద్రం
బాల్యంలో ఏమాత్రం ఖాళీ దొరికినా చీరాల సముద్రపు ఒడ్డుకు పిక్నిక్కు వెళ్లేవాళ్లం. దాదాపు ప్రతి వారం వెళ్లేవాళ్లం. ఒకసారి అలా వెళ్లినప్పుడు మా స్నేహితుడు పులి నాగేశ్వర్రావు కొట్టుకుపోయాడు. అది నాకు చాలా దుఃఖాన్ని కలిగించిన సంఘటన. అందువల్లే నా కవిత్వంలో సముద్రం ఒక ప్రతీకగా చాలాసార్లు కనిపిస్తుంది.
ఎద్దునొదిలారు
ఈతేరు చెరువు గట్టున ఒక వీధి లైటు ఉండేది. దాని దగ్గరే కూర్చుని నేను బిగ్గరగా చదివేవాణ్ని. నా చదువు అగ్రకులాలకు కంటగింపుగా ఉందన్న సంగతి తెలిసి, ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చన్న అనుమానంతో మా నాన్న నాకు సాయంగా కూర్చునేవాడు. ఊహించినట్టే ఒకసారి ఒకాయన నామీదకు ఎద్దును ఉసిగొలిపాడు. అది పరుగులు పెడుతూ నావైపే రావడం చూసిన మా నాన్న చేతిలో ఉన్న పెద్ద కర్రసాయంతో దాన్ని కొమ్ములు విరిగేలా కొట్టాడు!
- నవ్య డెస్క్
ఫోటోలు : బాషా, పొన్నూరు

Andhra Jyothi Telugu News Paper Dated : 28/07/2013

No comments:

Post a Comment