Tuesday, December 4, 2012

సంపాదకీయం 'ఉప' విజయం



దళిత, ఆదివాసీ ప్రజల అభివృద్ధికి ఉద్దేశించిన ఉప ప్రణాళిక (సబ్ ప్లాన్) బిల్లుకు రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఉప ప్రణాళిక, ఎస్టీ ఉప ప్రణాళిక బిల్లు-2012'కు రాజకీయ పక్షాలన్నీ మద్దతు ఇచ్చాయి. అత్యంత నాటకీయ పరిణామాల మధ్య బిల్లుకు ఆమోదం లభించినప్పటికీ మొత్తం మీద ఆహ్వానించదగిన చట్టం ఇది. ఉప ప్రణాళికకు చట్టబద్ధత కల్పించేందుకు ప్రత్యేకంగా మూడు రోజులు సమావేశమైన శాసనసభ ఉత్కంఠభరితంగా ముగిసింది. సబ్ ప్లాన్‌లో 'ఏబీసీడీ' వర్గీకరణకు అనుగుణంగా నిధులు కేటాయించాలంటూ బిల్లుకు తెలుగుదేశం సవరణను ప్రతిపాదించింది. ఈ సవరణ ప్రతిపాదనను కాంగ్రెసేతర ప్రతిపక్షాలన్నీ సమర్థించడంతో ఓటింగ్‌కు దారితీసింది. చివరికి ఓటింగ్‌లో 22 మంది సభ్యుల మెజారిటీతో ఎస్సీ వర్గీకరణను ప్రభుత్వం తిరస్కరించింది. రాష్ట్ర సర్కారు ఈ ఉప ప్రణాళిక చట్టాన్ని చారిత్రాత్మకమైనదిగా అభివర్ణిస్తున్నప్పటికీ ప్రతిపక్షాలు, వివిధ ప్రజాసంఘాలు సర్కారు వైఖరిని తప్పుబట్టాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు అసమగ్రమైనదిగా విపక్షాలు విమర్శిస్తూ దాదాపు 42 సవరణ ప్రతిపాదనలు చేశాయి. అయితే ప్రతిపక్షాల సవరణలన్నీ మూజువాణి పద్ధతిలో తిరస్కారానికి గురయ్యాయి.

బిల్లులోని కొన్ని క్లాజులపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేశాయి. సబ్ ప్లాన్‌పై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం చేసిన అనేక సిఫార్సులు బిల్లులో చోటుచేసుకోకపోవడాన్ని తప్పు పట్టాయి. సబ్ ప్లాన్ నిధులను ఎస్సీ, ఎస్టీల్లోని వెనుకబడిన వర్గాలను గుర్తించి వారికి ప్రాధాన్యమిచ్చేలా ప్రణాళికలు రూపొందించాలని సూచిస్తున్న బిల్లులోని రెండవ అధ్యాయంలోని ఆరవ క్లాజును ఎస్సీ వర్గీకరణ ప్రాతిపదికగా సవరించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. తెలుగుదేశం పార్టీ తాను వర్గీకరణకు అనుకూలమన్న సంకేతాలిచ్చేందుకు ఈ సందర్భం ఉపయోగపడింది. వైఎస్ఆర్‌సీపీ ఈ అంశంపై తెలుగుదేశాన్ని సమర్థించడంతో ఆ పార్టీని ఇరకాటంలో పడేసింది. సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత కల్పిస్తున్న సభ గతంలో ఎస్సీ వర్గీకరణపై తీర్మానం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉపాధి, విద్యావకాశాల్లో వర్గీకరణను కోరుతూ మరోసారి తీర్మానిస్తూ, సబ్‌ప్లాన్‌కు కూడా దాన్ని వర్తించే విధంగా రాజ్యాంగ బద్ధమైన చర్యలు తీసుకోవాలని అసెంబ్లీని కోరి ఉంటే బావుండేది.

'జనాభా నిష్పత్తికి తగ్గకుండా నిధులు కేటాయించా'లన్న ఉప సంఘం సిఫార్సులను విస్మరించి ఎస్సీ జనాభా ప్రాతిపదిక ప్రకారం నిధులు కేటాయించాలని 12వ క్లాజులో ప్రభుత్వం పొందుపరచడం వివాదాస్పదమైంది. దీనివల్ల ఖర్చు చేయకుండా మురిగిపోయిన నిధులను ఆ తర్వాతి సంవత్సరం బడ్జెట్‌లో కలపాలంటే జనాభా పరిమితి అడ్డంకిగా నిలుస్తుంది. దాంతో ఇప్పటివరకు దారి మళ్ళిన దాదాపు 25 వేల కోట్ల రూపాయల నిధులు అందని ద్రాక్షగా మారే పరిస్థితి ఏర్పడుతుంది. దానికి తోడు బిల్లులో సబ్ ప్లాన్ నిధులను ఖర్చు చేయని అధికారులపై చట్టపరమైన చర్యల ప్రస్తావన లేదు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలులోకి రానున్న సబ్ ప్లాన్ చట్టం వివిధ ప్రజాసంఘాలు, రాజకీయ పక్షాల పోరాట స్ఫూర్తిని ప్రతిఫలించలేదు.

మూడు దశాబ్దాల క్రితమే ఎస్సీ కాంపోనెంట్ ప్లాన్, ట్రైబల్ సబ్‌ప్లాన్‌ల రూపకల్పనకు కేంద్రం నిర్ణయించింది. బడ్జెట్ ద్వారా బడుగుల సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన అభివృద్ధి కోసం, వారి పని పరిస్థితులు, జీవన ప్రమాణాల మెరుగుదల కోసం 1979లో సబ్‌ప్లాన్ వ్యూహాన్ని రూపొందించింది. జనాభా దామాషాను బట్టి షెడ్యూల్డ్ కులాలకు 16.2 శాతం, షెడ్యూల్డ్ తెగలకు 6.6 శాతం నిధుల్ని ప్రణాళిక బడ్జెట్‌లో కేటాయించవలసి ఉన్నది. బడ్జెట్‌లో ఎస్‌సి, ఎస్‌టిలకు 23 శాతం ఖర్చు చేయాల్సి ఉన్నప్పటికీ వ్యయం ఎన్నడూ 8 శాతానికి మించనే లేదు. మన రాష్ట్రంలో 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నోడల్ ఏజెన్సీలను నియమించి నిధులు కేటాయించినా నామమాత్రంగా కూడా ఖర్చు చేయలేదు. పులివెందుల అభివృద్ధికి, జలయజ్ఞం, ఔటర్ రింగ్ రోడ్డు, హుస్సేన్‌సాగర్ ఆ«ధునికీకరణకు ఆ నిధులను మళ్ళించారు. సబ్ ప్లాన్ కేటాయింపులు లేకపోవడమో, ఖర్చు చేయకపోడమో మాత్రమే కాదు సార్వజనీన కార్యక్రమాలకు చేసిన వ్యయంలో కొంత భాగాన్ని సబ్‌ప్లాన్ ఖర్చుగా చూపిస్తున్నారు. రహదారులు, ఇరిగేషన్ ప్రాజెక్టులు వంటి వాటి ఖర్చు కూడా సబ్‌ప్లాన్‌లో చూపిస్తున్నారు. సబ్ ప్లాన్ నిధులను ఇతరత్రా అవసరాలకు మళ్ళించకుండా కనీసం వైద్యం కోసమైనా ఖర్చు చేసి ఉంటే వందలాది ఆదివాసులు బతికి ఉండేవారు.

గడచిన ఐదేళ్ళలో మన రాష్ట్రంలో సబ్ ప్లాన్ నిధులు 65 శాతం మాత్రమే వినియోగంలోకి వచ్చాయి. అదే మహారాష్ట్రలో 105 శాతం, గుజరాత్‌లో నూరు శాతం, తమిళనాడులో 90 శాతం పైగా సబ్ ప్లాన్ నిధులను ఖర్చు చేశారు. రాష్ట్ర పాలకుల్లో రాజకీయ దృష్టి, ప్రజా ఉద్యమాల తనిఖీలేని కారణంగా ఈ పరిస్థితి తలెత్తింది. అంబేద్కర్ చెప్పినట్టుగా సామాజిక నియోజకవర్గాలను ఏర్పాటు చేసి ఉంటే భిన్నమైన పరిస్థితికి అవకాశం ఉండేది. పదేళ్ళ కాలపరిమితి, అంబుడ్స్‌మెన్ వ్యవస్థ లేకపోవడం, నామమాత్రమైన నోడల్ ఏజెన్సీల ఏర్పాటు వంటి లొసుగులు ఎన్ని ఉన్నప్పటికీ సబ్ ప్లాన్ చట్టం సాధించడం అన్నది నిస్సందేహంగా ఒక ముందడుగే. దళితులు, ఆదివాసీ హక్కుల చట్టాలకు పట్టిన గతే ఈ చట్టానికి కూడా పట్టకుండా ఉండేలా అప్రమత్తంగా ఉండాలి.

Andhra Jyothi News Paper Dated: 4/12/2o12

No comments:

Post a Comment