Friday, December 21, 2012

అంబేడ్కర్‌వాద ఫలమే ‘ఉపప్రణాళిక’---Donda Badraiah



విప్లవాన్ని వ్యాఖ్యానించడం కాదు, దాన్ని ఆచరించడమే ముఖ్యమని లెనిన్‌ చెప్పాడు. దళిత గిరిజన ఉప ప్రణాళిక బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందిన వారం రోజులకే ఉపప్రణాళికకు చెందిన రూ.8 కోట్లను భారత ఎన్నికలసంఘం నిర్వహించాల్సిన ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను భద్రపరచే గోదాములకోసం మళ్ళించడాన్ని బట్టి, ఈ వర్గాల అభివృద్ధిపట్ల ప్రభుత్వాల చిత్తశుద్ధిని గమనంలోకి తీసుకోవలసిఉంది. దేశంలోని దళిత, ఆదివాసి వర్గాల ప్రజల అభివృద్థికి ప్రభుత్వాలు కొన్ని పథకాలు, చట్టాలు రూపొందిస్తున్నాయి. వాటిలో భాగంగా 1974లో ఎస్‌టి ఉప ప్రణాళిక, 1979లో ఎస్‌సి ఉపప్రణాళిక ప్రకటించారు. ఆ తరువాత 20 సూత్రాల పథకం వచ్చింది. 

వీటిని అమలు చేయడంలో ఇవే ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరితో వ్యవహరించడంవల్ల దళిత ప్రజలు ఇప్పటికీ ఆశించిన అభివృద్ధిని సాధించలేక పోయారు. ఆ పథకాలను సక్రమంగా అమలుచేసి ఉంటే, నేడు ఎస్‌సి ఉపప్రణాళిక, ఎస్‌టి ఉపప్రణాళిక చట్టబద్ధత బిల్లు అవసరం ఉండేదికాదు. ఎస్‌సి, ఎస్‌టి ఉపప్రణాళిక చట్టబద్ధత బిల్లును శాసనసభ, శాసనమండలి ఆమోదించడం ఆహ్వానించదగింది. అయితే ప్రభుత్వం ఈ వర్గాల ప్రజలను అన్నిరంగాల్లో అభివృద్ధిలోకి తేవాలనే ఈ బిల్లును తీసుకువచ్చిందా అనేది ఆలోచించాలి. ఈ బిల్లును ఆమోదించినంత మాత్రాన ఆ వర్గాల ప్రజలు లక్షాధికారులు కాలేరు. ఈ బిల్లులో అనేక లోపాలున్నాయి. 

ఆ ఫలితమే బిల్లు ఆవమోదించిన వారం రోజులకే రూ. 8 కోట్లను మళ్లించడమే కాక, ప్రభుత్వం కనీసం దీనిపై సంజాయిషీకూడా ఇవ్వకపోవడం సిగ్గుపడాల్సిన విషయం. ఈ బిల్లును ఆమోదించేందుకు జరిగిన సమావేశాల్లో చిన్న, పెద్ద తేడాలేకుండా అన్ని పార్టీలు తామంటే తాము ఎస్‌సి, ఎస్‌టిల అభివృద్ధికి కృషిచేశామని, ఇక ముందుకూడా వీరి సర్వతోముఖాభి వృద్ధికి కట్టుబడిఉంటామని పోటీపడి చెప్పుకున్నారు. ఒక అంశం ఆకాంక్షగా రూపాంతరం చెందాలంటే దాని వెనుక ఎంతో సాహిత్య, సాంస్కృతిక బావజాలంతోపాటు స్థానిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు కూడా కారణమౌతాయి. దానికోసం ఎంతోమంది తమ విలువైన కాలాన్ని, మేధస్సును, శ్రమను ధారపోయాల్సి ఉంటుంది. అదే విధంగా సామాజిక న్యాయం అంశం ఈ రాష్ర్టంలో 80వ దశకంనుండి ఉనికిలోకి వచ్చింది. 

అదేకాలంలో జరిగిన కారంచేడు సంఘటన- ఈ దేశంలోనే సామాజిక సంక్షోభానికి సంకేతంగా రాజకీయ కుల పైశాచికత్వానికి ప్రతీకగా జరిగింది. ఈ ఘటన తర్వాత చుండూరు ఘటనతో బాధితుల ఉద్యమం సామాజిక న్యాయ అంశంతో రూపుదిద్దుకుంది. అప్పుడు దళిత ఉద్యమ వేడి ఢిల్లీని తాకింది. పర్యవసానంగా అనేక సామాజిక పరిణామాలు ఈ రాష్ర్టంలో చోటుచేసుకున్నాయి. ఆ తర్వాత బహుజన సమాజ్‌ పార్టీ సామాజిక న్యాయం కోణంలో ‘ఓట్లు మావే, సీట్లూ మావే’ అంటూ రాజకీయ పిలుపు నిచ్చినప్పటికి సరియైన వ్యూహం లేక, నాయకుల మధ్య ఐక్యత లేక ఆ పార్టీ చతికిలపడిపోయింది. ఆ ఉద్యమాలన్నిటికి సైద్ధాంతిక భూమిక బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ ఆలోచనా విధానం. 

ఈ ఆలోచనకు తోడుగా మహాత్మాజ్యోతి రావు ఫూలే సామాజిక ఉద్యమ స్ఫూర్తి కూడా ఎస్‌సి, ఎస్‌టిలకు తోడుగా బలహీన వర్గాలను కలుపుకు పోయేందుకు దోహదపడింది. ఈ విధంగా రాష్ర్టంలో దళిత గిరిజన బలహీన మైనారిటీ వర్గాలలో- సామాజికన్యాయ కోణంలో ఆర్థిక, రాజకీయ న్యాయం జరగాలనే ఆకాంక్ష క్రమంగా బలపడింది. ఎస్‌సి, ఎస్‌టిలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు, అవమానాలపై ఉద్యమాలు చేయడం అవసరం. దళిత, బలహీన వర్గాలకు భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ చొరవతో రాజ్యాంగంలో పొందు పరచిన రక్షణలు ఒక వైపు ఉన్నప్పటికీ, ఆ హక్కులు, రక్షణలు రాజ్యాంగానికి పరిమితమైతేనే సరిపోదు. వాటిని సాధించుకోవడానికి నిరంతరం పోరాటాలు చేయాలి.

ఎందుకంటే ఈ పాలక ప్రభుత్వాలు రాజ్యాంగంలో ఉన్న రక్షణలను కల్పించవు. అవి ఈ దేశ సామాజిక వ్యవస్థను, కుల కట్టుబాట్లను ఎదిరించేవిగా ఉన్నాయి. అంతే కాకుండా ఈ సమాజంలోని ప్రజలు కులాలుగా చీలిపోయి ఉన్నారు. రాజ్యాంగం అందరూ సమానమే అని చెబుతుంది. అయినా, అందరూ సమానమే అనే ప్రగతిశీల భావాన్ని దేశపాలకులు వెంటనే ఒప్పుకోరు. వారు పాలకులుగా ఉండేందుకు రాజ్యాంగం మీద ప్రమాణంచేసి పదవుల్లోకి వస్తారు. కాబట్టి రాజ్యాంగాన్ని గౌరవిస్తామని చెప్పుకుంటూనే, ఆ రాజ్యాంగంలో ఉన్న హక్కులను అమలు చేసేందుకు ఇష్టపడరు. అందుకే దళిత, బలహీన వర్గాలు నిరంతరం ఉద్యమాలు చేస్తూ ఆ హక్కులను ప్రభుత్వాలచేత అమలు చేయించుకుంటూ ఉపయోగించుకోవాలని అంబేడ్కర్‌ ఆనాడే చెప్పారు. 

ఈ భావజాలాన్ని గౌరవించిన అనేక మంది సామాజిక ఉద్యమకారులు ఆ హక్కుల కోసం ఉద్యమాలు చేస్తూ, వాటి ఆధారంగా ఈ వర్గాలను అభివృద్ధిలోకి తీసుకురావడానికి ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ దేశంలో అంబేడ్కర్‌ భావజాలాన్ని, సైద్ధాంతిక విధాలను వేలాదిమంది అంకిత భావంతో అనునిత్యం తమ రచనల ద్వారా, పోరాటాల ద్వారా సమావేశాల ద్వారా ఈ వర్గాల ప్రజలకు తెలియజేయడంలో నిమగ్నమవుతున్నారు. ఆ ప్రభావం ప్రభుత్వాలు తీసుకునే విధానాలపై పడుతుంది. ప్రభుత్వాలు తమ విధానాల్లో ఈ వర్గాల ఆకాంక్షలను జోడింప చేస్తున్నాయి. ఆవిధంగా జోడించిన విధానమే ఎస్‌సి, ఎస్‌టి ఉపప్రణాళికలకు చట్టబద్ధతను కల్పించే బిల్లును ఆమోదించడం. 

అయితే ఇంతకు ముందు కూడా ప్రభుత్వాలు ఈ వర్గాల కోసం పలు కార్యక్రమాలు చేపట్టాయి. అందుకు ఆ వర్గాల ప్రజలు డిమాండ్‌ చేసి, పోరాటాలు చేస్తే గాని ప్రభుత్వాలు స్పందించలేదు. ఈ ప్రభుత్వాల పనితీరును అంబడ్కర్‌ స్వయంగా చూశారు కాబట్టి, ఈ దేశ సామాజిక వ్యవస్థ- ఆర్థిక, రాజకీయ వ్యవస్థలపై బలమైన ప్రభావాన్ని చూపించడాన్ని ఆయన అనుభవ పూర్వకంగా తెలుసుకున్నారు కాబట్టి, ఈ వర్గాల ప్రజలు రాజ్యాంగంలోని హక్కులు, రక్షణలను పరిరక్షించుకోవాలంటే నిరంతరం ఉద్యమాలు చేయాలని పిలుపు నిచ్చారు. ఆ పిలుపు ఈ దేశంలోని దళిత, ఆదివాసి, బలహీన వర్గాలను నడిపిస్తోంది. డా బి.ఆర్‌. అంబేడ్కర్‌ తన జీవిత చరమాంకంలో దళిత గిరిజన వర్గాలకు చెందిన రాజకీయ నాయకులు, అధికారుల గురించి చాలా వేదనకు లోనయ్యారు. 

ఈ వర్గాల రాజకీయ నాయకులు, అధికారులు వారి వ్యక్తిగత జీవితాల, కుటుంబాల ఉన్నతికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, వాఉ ఈ వర్గాల ప్రజలకు మేలు జరిగేందుకు ఉపయోగపడాలని వాంఛించారు. అందుకే ఈ వర్గాలకు చెందిన ప్రజలు విద్యపై దృష్టి పెట్టి విద్యాధికులై ఈ దేశ సామాజిక వ్యవస్థను అర్థం చేసుకొని, చైతన్యవంతులై రాజ్యాంగంలోని రక్షణల అమలుకు పోరాటాలు చేయాలని స్పష్టంచేశారు. ఆయన చెప్పిన మాటలు నేటికి కూడా అక్షర సత్యాలుగా మనముందు సాక్షాత్కరిస్తున్నాయి. ఈ దేశపాలకులు, ప్రభుత్వాలకు దళిత గిరిజన వర్గాలను మిగతా వారితో సమాన స్థాయికి తీసుకురావాలనే చిత్తశుద్ధి ఉంటే ఈ 65సంవత్సరాల కాలం పడుతుందా? ఈరోజు ఈ ఉపప్రణాళిక అవసరం ఉంటుందా? రాష్ర్టంలో, 

దేశంలో నెలకొన్న దళిత ఆదివాసీల ఉద్యమ చైతన్యం వల్ల, ఆ వర్గాల ఉద్యమ నాయకుల త్యాగాల వల్ల, తద్వారా ఈ దేశంలో వ్యాప్తి చెందిన అంబేడ్కర్‌ భావజాలం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలు ఇటువంటి కార్యక్రమాలు చేపట్టవలసి వస్తోందని ఏ రాజకీయ నాయకుడు గుర్తించడం లేదు. ఇదేదో తాము సాధించిన ఘనతగా, లేదా తమ పార్టీ దాచుకున్నదంతా ఈ వర్గాల ప్రజలకు ఊరికే ఇస్తున్నంత ఘనంగా ఎందుకు మాట్లాడుతున్నారు? అసెంబ్లీలో నాయకులు తమ తమ పార్టీల గొప్పతనాల గూర్చి ఉపన్యాసాలు ఇచ్చారు కానీ, ఈ 65 సంవత్సరాలుగా ఈ దుస్థితికి ఈ ప్రభుత్వాలే కారణమని ఎవరైనా చెప్పారా? తమ పార్టీ ఈ వర్గాలకు దాచిపెట్టిందని ఒకరు, ఈ వర్గాలకోసమే పుట్టిందని ఇంకొకరు, 

dontha
మా పార్టీలేకపోతే ఈ వర్గాలు అగ్రకులాల చెప్పులక్రింద ఉండేవారని మరొకరు పోటీపడి ఉపన్యాసాలు ఇచ్చారు. దళిత గిరిజన వర్గాల ప్రజలు ఈ సామాజిక వ్యవస్థ మూలాలను అర్థంచేసుకొని తద్వారా ఆర్థిక, రాజకీయ వ్యవస్థలను అందుకోవడంతోనే అభివృద్థి జరుగుతుందని, హక్కులను ఈ ప్రభుత్వాలు అమలు చేయవు కాబట్టి వాటికోసం ఉద్యమాలే శరణ్య మని, హక్కులు భిక్షమెత్తుకుంటే రావు, పోరాడి సాధించు కోవాలని అంబేడ్కర్‌ ఉపదేశించాడు. ఈ ఆలోచనా విధానంతో ఉద్యమాలు చేస్తూ, అంబేడ్కర్‌ చెప్పిన భావజాలాన్ని సాహిత్యపరంగా, కళల ద్వారా, పోరాటాల ద్వారా ఎవరైతే వ్యాప్తి చేస్తున్నారో వారి విజయంగా ఈ ఉపప్రణాళికా బిల్లును భావించాలి.

Surya News Paper Dated : 21/12/2012

No comments:

Post a Comment