Thursday, December 6, 2012

వృత్తిదారులకు ప్రత్యేక సబ్‌ప్లాన్‌ పి జమలయ్య


 (రచయిత ఎపి చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌   Wed, 5 Dec 2012, IST  

తలసరి దినసరి ఆదాయపు రాష్ట్ర సగటు రూ.27.47. తలసరి దినసరి పేదరికపు హద్దు రూ.20లు. ఈ హద్దుకు దిగువన అంటే రూ.20 కంటే తక్కువ తలసరి దినసరి ఆదాయం పొందేవారు 50 శాతం మంది ఉన్నారు. మిగిలిన 50 శాతం మందికి కూడా రూ.27కు మించి లేదు. ఈ నేపథ్యంలో చేతివృత్తులకు రక్షణ, వృత్తిదారుల సంక్షేమానికి, సామాజిక భద్రత కోసం ప్రత్యేక సబ్‌ప్లాన్‌ రూపొందించాలి.


వృత్తులకు రక్షణ కల్పించటానికి, ఉపాధి కోల్పోయి వీధిన పడుతున్న వారికి ప్రత్యామ్నాయ ఉపాధిని చూపించటానికి, వృత్తుల్లో ఉపాధి దెబ్బతినకుండానే ఆధునీకరించటానికి ఇప్పుడున్న దానికన్నా మెరుగైన జీవనం గడిపే విధంగా వృత్తిదారుల సబ్‌ప్లాన్‌ ఏర్పాటు చేయవలసిన అవసరం ఉన్నది. వృత్తిదారుల జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించి వారి అభివృద్ధికి ఖర్చు చేయాలి. ఈరోజు ప్రపంచీకరణ నేపథ్యంలో చేతి వృత్తులు దెబ్బతింటున్నాయి. కొన్ని వృత్తులు కనుమరుగౌతున్నాయి. వృత్తిదారులు ఉపాధి కోల్పోయి వీధిన పడుతున్నారు. చేనేత, స్వర్ణకారుల్లో ఆకలిచావులు, ఆత్మహత్యలకు గురౌతున్నారు. కల్లుగీత గతం కంటే మరింతగా దెబ్బతిన్నది. క్షౌర, రజక లాంటి సేవా వృత్తులు యాంత్రీకరణ వల్ల ఆదాయం కోల్పోతున్నాయి. పెత్తందారుల నుంచి కుల వివక్ష, అవమానాలు, బహిష్కరణలు, దాడులు, దౌర్జన్యాలకు గురౌతున్నారు. కోస్టల్‌ కారిడార్‌ ప్రాంతాల్లో మత్స్యకారులు బలవంతంగా వృత్తి నుంచి గెంటివేయబడి నిర్వాసితులు అవుతున్నారు. మైదాన ప్రాంతాల్లో కాంట్రాక్టు వ్యవస్థ వల్ల కూడా వృత్తి దెబ్బతింటోంది. గొర్రెలు, మేకల పెంపకం వృత్తిలోకి పెట్టుబడిదారులు ప్రవేశిస్తున్నారు. పేదవారికి రుణాలు ఇవ్వకుండా అనేక ఆటంకాలు పెడుతున్నారు.


మన రాష్ట్రంలో చేతివృత్తుల వారు ప్రధానంగా వెనుకబడిన తరగతులవారే. 1986లో బిసి వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌ జరిపిన సర్వే ప్రకారం దాదాపు 7.64 కోట్ల మంది రాష్ట్ర ప్రజానీకం ఉంటే, వెనుకబడిన తరగతులవారు సుమారు 2.80 కోట్ల మంది ఉన్నారు. వారిలో 1.80 కోట్ల మంది 63 రకాల వృత్తి పనులను చేస్తున్నట్టు ప్రభుత్వ సమాచారం చెబుతోంది. వీరే కాక ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, ఇతర గ్రామీణ పేదలకు చెందిన ఇతర వృత్తులవారు లక్షలాది మంది ఉన్నారు. (ఉదాహరణకు చర్మకారులు, అద్దకం వంటివి) వీరందరితో కలిపి 2 కోట్ల మంది ఉంటారు. అంటే సుమారు 4వ వంతు. 2011 జనాభా లెక్కల ప్రకారం చూసినా రాష్ట్ర జనాభాలో 4వ వంతు మంది వివిధ వృత్తులపై ఆధారపడి జీవిస్తున్నట్లు తెలుస్తోంది.


చేనేత, కల్లుగీత, చేపల వేట, పశుపోషణ, పాల వ్యాపారం, కంబళ్ళ తయారీ, గొర్రెల, మేకల పెంపకం, మట్టి పని, బంగారం పని, ఇనుప పని, ఇత్తడి, శిల్పాలు చెక్కటం, వడ్రంగం, బట్టలుతకటం (లాండ్రీ), దూది వడకడం, కుండలు చేయడం, క్షౌర, మేళం, నూనె గానుగ, మాంసం అమ్మకం, బుట్టల తయారీ, చిన్న వ్యాపారాలు, (పూసలు, సూదులు), దర్జీ పని, రంగులు వేయటం, ఒగ్గు, తప్పెట గుళ్ళు, గొరవయ్యలు, మంద హెచ్చుల, పడపోత్ర, గంగిరెద్దుల మొదలగు కళాకారులున్నారు. ఒకే వృత్తిలో వివిధ కులాల వారు ఉన్నారు. ఒకే కులం వారు వివిధ వృత్తులను కూడా నిర్వహిస్తున్నారు.


విస్తరిస్తున్న పెట్టుబడిదారీ వ్యవస్థ ఒకవైపు, మరోవైపు కొనసా గుతున్న ఫ్యూడల్‌ వ్యవస్థల ఫలితంగా మనదేశంలో చేతివృత్తిదారుల బ్రతుకులు నానాటికీ కునారిల్లి పోతున్నాయి. పెట్టుబడిదారీ విధానంలో లాభాలే ప్రధానం. ఏది లాభసాటిగా ఉంటే దాన్నే చేపడతారు. ఫలితంగా చేతి వృత్తులకు ఏవిధంగానూ రక్షణ లేకుండా పోయింది. పేదలకు జీవనాధారంగా ఉన్న చేతి వృత్తుల రంగాలలోకి దేశీయ, విదేశీ పెట్టుబడిదారులు ప్రవే శిస్తున్నారు. చేతివృత్తులపై ఆధార పడి జీవిస్తున్న లక్షలాది కుటుం బాలు తమ ఉపాధి కోల్పోయి వీధుల్లోకి నెట్టబడు తున్నారు. ఈ వృత్తిదారుల రక్షణ బాధ్యత లేదన్నట్లుగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. మరోవైపు గ్రామాల్లో భూస్వామ్య విధానం నాశనం కాకపోవటంతో కుల వివక్షకు, అవమానాలకు, దాడులకు, దౌర్జన్యాలకు చేతివృత్తుల వారు గురవుతున్నారు. వారు భూస్వాముల చెప్పుచేతల్లో బ్రతకవలసి వస్తోంది. సామాజిక న్యాయ సాధన కోసం అంటూ ఏర్పాటు చేసిన రిజర్వేషన్లు నూతన ఆర్థిక విధానాల అమలుతో గాలిలో పేల పిండిలా కొట్టుకుపోయాయి. ప్రభుత్వ శాఖల, ప్రభుత్వ రంగ సంస్థలలో నియామకాలపై విధించిన నిషేధం ఈ వర్గాల నుంచి వచ్చిన యువతీయువకులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తల్లిదండ్రులకు భారమై నిరాశా నిస్పృహల మధ్య అసహనంతో వారు జీవిస్తున్నారు.


ప్రభుత్వ దోపిడీ విధానాల వల్ల ఇప్పటికే కేవలం వృత్తినే నమ్ముకొని జీవించేవారు అనేక మంది ఆ వృత్తిలోనే కూలీలుగా మారుతున్నారు. ఈ వృత్తుల ఉత్పత్తుల ద్వారా మార్కెట్‌లోకి ప్రవేశించి యజమానులుగా మారడం లేదా ఈ వృత్తులతో సంబంధం లేకపోయినా పెట్టుబడిపెట్టి, పరికరాలు అద్దెకిచ్చి పని చేయించేవారు పుట్టుకొచ్చారు. కాంట్రాక్టు పద్ధతి, పీస్‌ పద్ధతి రంగంలోకి వచ్చింది. ఏడాది పొడుగునా పని లేకపోవడం, చాలీచాలని వేతనాలు, ధరల పెరుగుదల, వీటిన్నింటితో పస్తులు నిత్యకృత్య మయ్యాయి. పనులు కోల్పోయి రోడ్డున పడి వేరే వృత్తులకు పోదామన్నా అక్కడ కూడా ఉపాధి అవకాశాలు మృగ్యమౌతున్నాయి.


తలసరి దినసరి ఆదాయపు రాష్ట్ర సగటు రూ.27.47. తలసరి దినసరి పేదరికపు హద్దు రూ.20లు. ఈ హద్దుకు దిగువన అంటే రూ.20 కంటే తక్కువ తలసరి దినసరి ఆదాయం పొందేవారు 50 శాతం మంది ఉన్నారు. మిగిలిన 50 శాతం మందికి కూడా రూ.27కు మించి లేదు. ఈ నేపథ్యంలో చేతివృత్తులకు రక్షణ, వృత్తిదారుల సంక్షేమానికి, సామాజిక భద్రత కోసం ప్రత్యేక సబ్‌ప్లాన్‌ రూపొందించాలి.


వృత్తిదారుల జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించి, సబ్‌ప్లాన్‌ ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం కొనసాగుతున్న వృత్తులకు దేశీయ, విదేశీ పరిశ్రమల ఉత్పత్తుల నుంచి రక్షణ కల్పించాల్సిన బాధ్యతను ప్రభుత్వం విస్మరిస్తోంది. ప్రభుత్వ విధానాల వలన ఉపాధి కోల్పోయినవారికి ప్రత్యేక శిక్షణనిచ్చి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తామని గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం వాగ్దానాలు చేసినప్పటికీ అమలుకు నోచుకోలేదు. ఉపాధి దెబ్బతినకుండా సాంకేతిక పరిజ్ఞానం అందించి ఉపాధిని నిలబెట్టి ఆదుకోవాలి. వృత్తుల నిర్వహణకు అవసరమైన ముడిసరుకులు, పరపతి, భూమి, నీరు, రోడ్లు మొదలగు మౌలిక సదుపాయాలు కల్పించాలి. వృత్తుల ఉత్పత్తులకు మార్కెట్‌ సౌకర్యం, గిట్టుబాటు ధర, సేవా వృత్తులకు చేసిన శ్రమకు తగిన ప్రతిఫలం అందించాలి. సహకార రంగాన్ని సమర్థవంతంగా నడపాలి. వారందరినీ సహకార రంగంలోకి తెచ్చి ఉపాధి భద్రత కల్పించాలి. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అత్యవసర సహాయాన్ని అందించి, శాశ్వత నివారణా చర్యలు చేపట్టాలి. వృత్తిదారులందరికీ ఆర్థిక సహకారం అందించడానికి చేతివృత్తిదారుల బ్యాంకును ఏర్పాటు చేయాలి. వారికి ఫించన్లు, ఎక్స్‌గ్రేషియో, బీమా, వికలాంగుల సహాయం మొదలగు వాటికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. వృత్తిదారులపై జరుగుతున్న కుల వివక్ష, దాడులు, దౌర్జన్యాలను అరికట్టడానికి ప్రత్యేక సామాజిక రక్షణ చట్టం రావాలి. బాధితులను ఆదుకోవడానికి స్పెషల్‌ కాంపోనెట్‌ను ఏర్పాటు చేయాలి. బాలబాలికలందరికీ ప్రత్యేక ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటు చేసి నర్సరీ నుంచి పిజి వరకూ ఉచిత విద్యను అందించాలి. ప్రతి కుటుంబానికీ ఇంటి స్థలం ఇచ్చి, ఇళ్ళు నిర్మించి ఇవ్వాలి. అవసరమైన దగ్గర హౌస్‌ కమ్‌ వర్క్‌ షెడ్‌ ఏర్పాటు చేయాలి. వృత్తిదారుల పేటలు, పల్లెల అభివృద్ధికి డ్రైనేజీ, రోడ్లు, మంచినీటి సౌకర్యం, విద్యుత్‌, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలి. వృత్తిదారులు నివసిస్తున్న ప్రాంతాల్లో కమ్యూనిటీ హాలు, ప్రాథమిక వైద్యశాలలు, పాఠశాలలు, గ్రంథాలయాలు ఏర్పాటుచేయాలి. కోనేరు రంగారావు కమిటీ సిఫార్సు ప్రకారం ప్రతి కుటుంబానికీ మూడెకరాల భూమి ఇవ్వాలి. వృత్తిదారుల మహిళలకు ఆరోగ్య భీమా, ప్రసూతి వైద్య ఖర్చులు, ప్రసూతి సమయాల్లో ఉపాధి భృతి, తల్లితో పాటు పిల్లలకు పౌష్ఠికాహారం అందించే కేంద్రాలను స్థాపించాలి. వృత్తి కళాకారులకు సాంస్కృతిక సంక్షేమ బోర్డును ఏర్పాటుచేసి కళల పరిరక్షణ, ఉపాధి గ్యారంటీ, గుర్తింపు కార్డులు, ప్రోత్సాహక అవార్డులు, ప్రదర్శనలకు అవసరమైన శిక్షణ, దుస్తులు, పరికరాలు ఇవ్వాలి. ఉచిత రైలు, బస్సు సౌకర్యం కల్పించాలి.


పి జమలయ్య
(రచయిత ఎపి చేతి వృత్తిదారుల సమన్వయ
కమిటీ రాష్ట్ర కన్వీనర్‌) 
-పి జమలయ్య (రచయిత ఎపి చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌

Prajashakti Telugu News Paper Dated: 5/12/2012

No comments:

Post a Comment