భౌగోళిక, సామాజిక తెలంగాణ
- ఉ.సా
తెలంగాణకి జైకొట్టే నిజమైన సామాజిక తెలంగాణ వాదులకు, మోసపూరిత ఎత్తుగడలతో తెలంగాణను దెబ్బకొట్టే సూడో సామాజిక న్యాయవాదులకు మధ్య తేడా చూడకుండా విచక్షణా రహితంగా ఇరువుర్ని ఒకేగాటకట్టి తప్పుపట్టటం తప్పు. ఈ అనుచిత వైఖరి సూడో సామాజిక తెలంగాణ వాదాన్ని ఎండగట్టలేని నిరర్థక వైఖరిగానే గాక నిజమైన సామాజిక తెలంగాణ వాదాన్ని దెబ్బతీసే అనర్థదాయక వైఖరిగా పరిణమిస్తుంది. తెలంగాణ ఉద్యమ "తొలిలక్ష్యం భౌగోళికమే'' అని ఆగస్టు 16న ఆంధ్రజ్యోతిలో చిక్కుడు ప్రభాకర్ రాసిన వ్యాసం పర్యవసానం ఇదే.
ప్రభాకర్ ఒకవైపు తమది కేవలం భౌగోళిక తెలంగాణవాదం కాదని దానికి ప్రజాస్వామ్య తెలంగాణవాదాన్ని కూడా జోడించామని చెప్పుకుంటారు. మరోవైపు అందుకు విరుద్ధంగా సామాజిక తెలంగాణ వాదాన్ని తప్పుపట్టే ద్వంద్వవైఖరి అనుసరిస్తున్నారు. అంటే పరోక్షంగా ప్రజాస్వామ్య తెలంగాణవాదానికి కూడా విరుద్ధమైన ఆత్మహత్యా సదృశ్యానికి పాల్పడటమే. పరోక్షంగానేకాదు "సీమాంధ్ర భూస్వామ్య పెట్టుబడిదారుల కబంధహస్తాల నుంచి భౌగోళిక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాతే సామాజిక లేదా ప్రజాస్వామిక తెలంగాణ'' అని ప్రత్యక్షంగానే చాటిచెపుతున్నాడు.
సామాజిక తెలంగాణవాదాన్ని దెబ్బకొట్టటానికి ప్రజాస్వామ్య తెలంగాణ వాదాన్ని వదులుకోవటానికి కూడా సిద్ధపడుతున్నాడు. "తెలంగాణ ఉద్యమ నిర్మాణంలో తెలంగాణ పునర్నిర్మాణంలో సామాజికన్యాయాన్ని ఓ ముఖ్యమైన సామాజికాంశంగా పరిగణిస్తాం'' అని వాగ్దానం చేసిన "తెలంగాణ ప్రజాఫ్రంట్''కి కార్యదర్శిగా చలామణి అవుతున్న ప్రభాకర్ ఆ ఫ్రంట్ విధాన ప్రకటనకే విరుద్ధంగా వ్యవహరించటమేమిటి? ఇలాంటి అనుచితమైన ఆత్మహత్యాసదశ్యవైఖరితో ఆత్మవంచనకి ప్రభాకర్ ఎందుకు పాల్పడుతున్నాడో పరిశీలించేముందు ఒక విషయం స్పష్టం చేయాలి.
ఆనాడు "విశాలాంధ్రలో ప్రజారాజ్యం'' అన్నట్లు నేడు "ప్రత్యేక తెలంగాణలో ప్రజారాజ్యం'' అని తక్షణ దీర్ఘకాలిక ఉమ్మడి లక్ష్యాలను ఏకకాలంలో కలిగిఉండే వర్గవాదుల్లాగా మేము వర్గకుల వాదంతో "ప్రత్యేక తెలంగాణలో సామాజిక ప్రజారాజ్యం'' అంటున్నాం. ఇలాంటి ఉమ్మడి లక్ష్యాలతో 1997లోనే అమరుడు మారోజు వీరన్న సహచరులుగా, ఆయన అడుగుజాడల్లో మేము అనుసరిస్తున్న భౌగోళిక - సామాజిక తెలంగాణవాదం తెలంగాణకి జైకొట్టే వాదమేకాని - దెబ్బకొట్టే వాదం కాదు, దెబ్బకొట్టనిచ్చేవాదం కూడా కాదు.
ఈ నేపథ్యంలో సమయానుకూలంగా మాటమార్చే ప్రభాకర్ సమయానుకూలవాదం సంగతేమిటో పరిశీలిద్దాం. "తెలంగాణ ఐక్యకార్యాచరణ కమిటీ'' అధినేత అయిన ప్రభాకర్‌తో కలిసి ఆ మధ్య ఓ టి.వి. ఛానల్‌వారు నిర్వహించిన భేటీలో నేను స్వయంగా పాల్గొన్నాను. ఆ సందర్భంలో ప్రజాస్వామ్య తెలంగాణవాదాన్ని తప్ప భౌగోళిక తెలంగాణ వాదాన్ని ససేమిరా బలపర్చేదిలేదని ప్రభాకర్ చేసిన వితండవాదానికి నేనేకాదు ఆనాడు ఆ కార్యక్రమాన్ని వీక్షించిన ప్రేక్షకులంతా సాక్షులే. సీమాంధ్ర ప్రాంతీయ అగ్రకుల సంపన్నవర్గాల వలస పెత్తందారీ తనానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రాంతం వారు చేసే భౌగోళిక తెలంగాణ పోరాటం దానికదే ప్రాంతీయ ప్రజాస్వామిక పోరాటం అవుతుంది.
కనుక ప్రజాస్వామ్య వాదులంతా దాన్ని బేషరతుగా బలపర్చాలని నేను వాదించాను. ప్రభాకర్ బలపర్చనన్నాడు. పౌరహక్కుల సంఘంలోనూ కొంతమంది ఇలాగే వాదించారని, అయినా తాను ఒప్పుకోలేదని చెప్పాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడివడి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే సీమాంధ్ర భూస్వామ్య పెట్టుబడిదారుల ఆధిపత్యం పోయి తెలంగాణ భూస్వామ్య పెట్టుబడిదారుల ఆధిపత్యం ఏర్పడుతుంది తప్ప,
ఈ అధికారమార్పిడి వలన తెలంగాణ పేదప్రజలకు ఒరిగేదేం లేదని, తెలంగాణలో విప్లవకారులు చేసిన భూస్వామ్య వ్యతిరేక పోరాటానికి తాళలేక ఆనాడు పట్నాలు పారిపోయిన దొరలే ఈనాడు ప్రత్యేక తెలంగాణవాదం ముసుగులో మళ్లీ గ్రామాలకి తరలివస్తున్నారని, అందుకే ఈ బూటకపు భౌగోళిక తెలంగాణ వాదానికి భిన్నంగా నూతన ప్రజాస్వామ్య విప్లవం ద్వారా ఏర్పడే ప్రజాస్వామ్య తెలంగాణ లక్ష్యాన్ని ఎంచుకొన్నామని చెప్పాడు.
ఇప్పుడేమో ఈ వాదాన్ని తలక్రిందులు చేస్తూ భౌగోళిక తెలంగాణ ఏర్పాటు సామాజిక లేదా ప్రజాస్వామిక తెలంగాణకు... ముందు షరతుగా భావించి ముందు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలంటున్నాడు. 'ఈ మహత్తర అవకాశాన్ని వదిలి వాస్తవానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే చరిత్రలో తప్పుచేసిన వారిగా మిగిలిపోతాం' అంటున్నాడు. ప్రభాకర్ సమయానుకూల వాదంలో ఎంత సమయస్ఫూర్తి వున్నా సామాజిక ప్రజాస్వామిక స్ఫూర్తిలేని ఆయన వితండవాదానికి చివరికి ఆయనే చిక్కాడు.
గతంలో ప్రజాస్వామిక తెలంగాణ వాదాన్ని తప్ప భౌగోళిక తెలంగాణ వాదాన్ని బలపర్చేదిలేదని వితండవాదం చేసిన ప్రభాకర్ లాంటివారు ఇప్పుడు భౌగోళిక తెలంగాణ వితండవాదాన్ని ఆశ్రయించటానికి బహుశా ఆయనే అన్నట్లు భౌగోళిక తెలంగాణవాదం ముసుగులో దాగుతున్న తెలంగాణ దొరల సారధ్యంలో ఏర్పడిన తెలంగాణ పొలిటికల్ జెఎసిలో ఆర్నెల్లు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన సావాస దోషమే కారణమేమో! ఆర్నెల్లు సావాసం చేస్తే వీరువారవుతారన్నట్లు ప్రజాస్వామ్య తెలంగాణ వాదం భౌగోళిక తెలంగాణవాదంగా రూపాంతరం చెందిందన్నమాట.
ఈ వైఖరి కేవలం చిక్కుడు ప్రభాకర్‌కే పరిమితమైందికాదు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న "తెలంగాణ ఐక్యకార్యాచరణ కమిటీ''లాగే ఇతరుల సారథ్యంలో పనిచేసే "తెలంగాణ జనసభ'', "తెలంగాణ ఐక్యవేదిక'' "న్యూడెమోక్రసీ'' లాంటి ప్రజాస్వామిక తెలంగాణవాద వేదికలన్నీ కట్టగట్టుకొని, భౌగోళిక తెలంగాణే ఏకైక లక్ష్యంగా గల తెరాస జేఏసీలో భాగస్వాములై తమ స్వతంత్ర అస్తిత్వాన్ని కోల్పోయి, చివరకు వారి మనుగడే దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది.
ఈ నష్టాన్ని గ్రహించిన కొన్ని సంస్థలు తెరాస జేఏసీ నుంచి వైదొలగి తెలంగాణ ప్రజాఫ్రంట్, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ లాంటి ప్రజా ఉద్యమ సంస్థల్ని ఏర్పరచి, తమ స్వతంత్రతను నెలకొల్పుకొన్నా స్వతంత్ర ప్రత్యామ్నాయ రాజకీయశక్తిగా ఎదగటంలో విఫలమై తెరాసతోపాటు కాంగ్రెస్, తెలుగుదేశం లాంటి అగ్రకుల పాలకవర్గ పార్టీల విశాలకూటమిని ఏర్పరచి అందులో ఒదిగిపోవాలని చూస్తున్నాయి. అందుకోసం ఎన్ని మెట్లయినా దిగుతామంటున్నాయి. 1997 డిసెంబర్ 28, 29 తేదీలలో "ప్రత్యేక తెలంగాణ - ప్రజాస్వామిక ఆకాంక్షలు'' అన్న అంశంపై వరంగల్‌లో జరిగిన సదస్సు సందర్భంగా "అఖిలభారత ప్రజాప్రతిఘటనావేదిక'' (ఎఐపిఆర్ఎఫ్) ప్రచురించిన కరపత్రంలో ఏం చెప్పారో చూద్దాం.
"ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగుతున్న (భౌగోళిక) తెలంగాణ పోరాటం దానికదే తమపై దోపిడీని పూర్తిగా తొలగించలేదని... కోస్తాంధ్ర, పాలకవర్గాల నగ్నదోపిడీకి వ్యతిరేకంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడుతూనే తెలంగాణలోని భూస్వామ్య వర్గాలను, వారి ఏజెంట్లను, దేశవ్యాప్త బడాబూర్జువా భూస్వామ్య శక్తులను కూడా ఓడించి ప్రజాస్వామిక శక్తుల విజయానికి తోడ్పడనిదే దోపిడీని పూర్తిగా రూపుమాపుకోలేమని గ్రహించిన చైతన్యవంతమైన తెలంగాణ ప్రజలు నేడు (భౌగోళిక తెలంగాణతోపాటు) ప్రజాస్వామిక తెలంగాణ కోసం కూడా పోరాడుతున్నారు''... "కనుక ఈ పోరాటం కోస్తాంధ్ర పాలకవర్గ కూటమికి మాత్రమే వ్యతిరేకమైందికాదు... తెలంగాణలోని భూస్వామ్య వర్గాలకు కూడా వ్యతిరేకమైందన్న విషయం సుస్పష్టం''గా తేల్చిచెప్పారు.
తక్షణ, దీర్ఘకాలిక ఉమ్మడి లక్ష్యంతో, ఏర్పరిచిన ఆ సంస్థలు భౌగోళిక తెలంగాణ దృక్పథంతో పాటు, వర్గపరమైన ప్రజాస్వామిక దృక్పథాన్ని కూడా జోడిస్తే, సామాజిక తెలంగాణ వాదులు కులపరమైన సామాజిక ప్రజాస్వామ్య దృక్పథాన్ని కూడా జోడించి, "తెలంగాణలో సామాజిక ప్రజారాజ్యం - సామాజిక ప్రజాస్వామ్య రాజ్యం'' అనే నినాదాలను రూపొందించి మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని చరిత్రాత్మకమైన మలుపు తిప్పారు. భౌగోళిక తెలంగాణ పోరాటం ప్రధాన స్రవంతి పోరాటంగా వున్నా సామాజిక ప్రజాస్వామిక పోరాటం సైతం ఈ దశలోనే ద్వితీయాంశంగానైనా ఏకకాలంలో ఉనికిలో ఉండాలి.
ఇటువంటి భౌగోళిక సామాజిక ఉమ్మడిలక్ష్యంతో స్వతంత్రంగా పనిచేయాల్సిన ప్రజాస్వామిక తెలంగాణ వాదులు ఆ బాధ్యతను విస్మరించటం క్షంతవ్యంకాదు. సామాజిక ప్రజాస్వామిక తెలంగాణ లక్ష్యాన్ని మలిదశకు వాయిదావేసి, "తొలిలక్ష్యం భౌగోళికమే''నని ముందు భౌగోళిక తెలంగాణ తర్వాత ప్రజాస్వామిక తెలంగాణ అని రెండు దశల సిద్ధాంతం మాట్లాడమంటే తమ వైఖరికి తామే కట్టుబడకుండా వైదొలగటమే అవుతుంది. ఇలాంటి ఉమ్మడి లక్ష్యంలేని తెలంగాణ అగ్రకుల పాలకవర్గ పార్టీల రాజకీయ కూటమి పంచన చేరటమంటే, మళ్లీ తమ స్వతంత్ర అస్తిత్వాన్ని కోల్పోయి వారి తోక పట్టుకు పోవటమే అవుతుంది.
తాము సారథ్యం వహించాల్సిన దళిత బహుజన శ్రామికవర్గ-కుల పీడిత ప్రజలను వారితో కొట్టుకుపోనివ్వటమే అవుతుంది. తెలంగాణకి జైకొట్టే సామాజిక తెలంగాణ వాదం భౌగోళిక తెలంగాణ వాదానికి బాసటగా నిలిచి సహకరించే సైదోడు సానుకూలవాదమేగాని, దానికి ఎదురు నిలిపి పోటీపెట్టి (ఇౌఠn్ట్ఛట ఞౌటజీnజ) దెబ్బకొట్టే ప్రతీఘాతుక ప్రతికూల వాదం కాదు. ఎవరైనా అలాంటి తప్పుడు పనికి పాల్పడితే ఆ తప్పు సూడో సామాజిక న్యాయ అవకాశవాదులదే అవుతుంది గాని దాన్ని నిజమైన సామాజిక తెలంగాణవాదులకు అంటగట్టరాదు.
నిజానికి ముందు భౌగోళిక తెలంగాణ తర్వాతే సామాజిక తెలంగాణ అని సోకాల్డ్ ప్రజాస్వామ్య తెలంగాణ వాదులు, తెలంగాణ అగ్రకుల దొరలు చేసే ఈ వితండ వాదాన్నే సూడో సామాజిక న్యాయవాదులు కూడా అనుకరిస్తున్నారు. "ముందు వర్గీకరణ బిల్లు తర్వాతే తెలంగాణ బిల్లు'' "ముందు మన్యసీమ రాష్ట్రం తర్వాతే తెలంగాణరాష్ట్రం'' అంటూ తెలంగాణేతర అంశాల్ని తెలంగాణకి ఎదురుపెట్టి, పోటీపెట్టి తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బకొట్టాలని చూస్తున్నారు.
ప్రాంతీయ వెనుకబాటు తనమే ప్రాతిపదిక అయితే తెలంగాణ ప్రాంతం కంటే అత్యధికంగా వెనుకబడి వున్న మన్యం ప్రాంతాన్ని ముందుగా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పరచటం న్యాయమనే ఈ వాదన మన్యం రాష్ట్రం కోసం చేసేవాదన కాదు. తెలంగాణ రాష్ట్రాన్ని మోసపూరితంగా అడ్డుకోవటానికి చేసేవాదన. ఈ వాదన ప్రకారం వెనుకబాటుతనం ప్రాతిపదికపై మన్యం రాష్ట్రం ఏర్పర్చాల్సిన పనిలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పర్చాల్సిన పనికూడా లేదు. రెండు ప్రాంతాలకి గూర్ఖాహిల్ కౌన్సిల్ లాగా అటానమస్ అభివృద్ధి మండలాలు ఏర్పరిస్తే చాలు అంటూ ముగుస్తుంది.
కనుక తెలంగాణేతర అంశాల్ని తెలంగాణకి ఎదురుపెట్టి, పోటీపెట్టి, దెబ్బకొట్టాలని చూస్తున్న ఇలాంటి కొందరు అవకాశవాదులు చిరంజీవిలాంటి సూడో సామాజిక న్యాయవాదులే తప్ప నిజమైన సామాజిక న్యాయవాదులు కాదు. తెలంగాణ వాదాన్ని కాదని తెలంగాణలో ఏ రాజకీయపార్టీ కాలూనలేని స్థితిని గ్రహించి, ఆ గండం గట్టెక్కించుకొని తెలంగాణతో సహా మొత్తం ఆంధ్రప్రదేశ్‌ని స్వీప్‌చేసి ఎన్టీఆర్‌లాగా ముఖ్యమంత్రి అయిపోవాలని సినిమా కలలుగన్న చిరంజీవి కూడా 2009 ఎన్నికల సందర్భంలో తెలంగాణ ప్రాంతంలో రథయాత్ర చేసినపుడు ఇలాగే దొరల తెలంగాణ కాదు సామాజిక తెలంగాణ అని డైలాగులు దంచాడు.
మరి ఆంధ్రలో కూడా సమైక్యాంధ్ర కాదు, సామాజిక ప్రత్యేకాంధ్ర కావాలని ఎందుకు రథయాత్ర చేయలేదు అని తెలంగాణ వాదులు నిలదీస్తే తెల్లమొహం వేశాడు. ఆ దెబ్బకు తన కుటిల ఎత్తుగడలు పారకపోవటంతో ఆ తర్వాత సమైక్యాంధ్ర అవతారమెత్తిన చిరంజీవి నిజస్వరూపమేమిటో ఆనాడే బట్టబయలైంది. మిగతా సూడో సామాజిక తెలంగాణ వాదులు సైతం ఇందుకు మినహాయింపు కాదు.
- ఉ.సా
చైర్మన్ - సామాజిక ఆంధ్ర - తెలంగాణ సమన్వయ కమిటీ
No comments:
Post a Comment