హిందూత్వ కమ్యూనల్ ఫాసిజాన్ని కేవలం ఆధ్యాత్మిక మతకోణంలోనో లేక మతాతీత లౌకిక కోణంలోనో ఎదిరించి ఓడించడం కష్టం. దాని లోగుట్టు కులం కనుక మౌలిక, సామాజిక, ప్రజాస్వామిక విప్లవ ప్రత్యామ్నాయాలను చేపట్టక తప్పదు.
సనాతన బ్రాహ్మణ మతం నవీన కాలంలో హిందూ మతంగా రూపాంతరం చెందింది. ఆ తరువాత కూడా దానిలో రావాల్సినంతగా ఆధునిక ప్రజాస్వామిక మార్పులు రావటం లేదు. ఇకనైనా హిందూ మతం తన ఆధ్యాత్మిక ఫాసిస్టు లక్షణాన్ని సంస్కరించుకొని , ఆధ్యాత్మిక ప్రజాస్వామ్య లక్షణాన్ని సంతరించుకోవాలని, లేనిపక్షంలో సమీప భవిష్యత్తులో అది అంతరించిపోవడం ఖాయం అనేది ప్రొఫెసర్ కంచ ఐలయ్య అంచనా. ఇది సంచలనాత్మక వివాదంగా మారింది.
ఐలయ్య అంచనాని పరిశీలించే ముందు ఆయన్ని ఓ మౌలిక ప్రశ్న ను అడగాల్సివుంది. హిందూ మతంగా బ్రాహ్మణ మతం తీసుకొన్న మార్పు మతపరమైన ఆధ్యాత్మిక మార్పా? లేక మతాన్ని రాజకీయాల తో ముడిపెట్టే రాజకీయ పరమైన మతతత్వ మార్పా? రెండవదే అయినప్పుడు ఎవరి ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా ఆ మార్పును ఆ మా ర్పుగానే పరిగణనలోకి తీసుకొని దాని మంచి చెడ్డల గురించి సమగ్రం గా చర్చించాలి. అయితే ఐలయ్య అసలు సంగతి పక్కన బెట్టి తన పాక్షి క పరిమితుల్ని దానికి ఆపాదించారు. ఇది తగదు. అందువల్ల అసలు వి షయం పక్కదారి పట్టి కొసరు విషయానికే చర్చ పరిమితమవుతుంది.
సమగ్ర నిర్దిష్ట చారిత్రక దృష్టితో చూసినప్పుడు అధునాతనకాలంలోనే సనాతన ధర్మ మతం హిందూ మతంగా ఎందుకు పేరు మార్చుకొంది? ఈ మార్పు ఆధునికతకు అనుగుణంగా మతాన్ని రాజకీయాల నుంచి, రాజ్యాధికారం నుంచి వేరు చేసి వ్యక్తిగత విశ్వాసానికి పరిమితంచేసే లౌకిక ప్రజాస్వామ్యాన్ని స్వాగతించటం కోసం జరిగిన మార్పా? అందులో భాగంగా మధ్యయుగాలనాటి మతపరమైన మూఢాచారాలను సంస్కరించే, మత సమానత్వాన్ని లేదా ఐలయ్య పరిభాషలో ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యాన్ని ఆవిష్కరించటానికి జరిగిన మార్పా? లేక ఆధునికత విసిరిన సవాల్‌కి జవాబుగా ఆధునికతకు విరుద్ధంగా కుల రక్షణ కోసం మతాన్ని జాతిగా మభ్యపెట్టి మతాన్ని రాజకీయాలతో ముడిపెట్టి ఇండియన్ నేషనలిజాన్ని హిందూత్వ కమ్యూనల్ ఫాసిజంగా రూపాంతరం చెందించిన మతతత్వమా? ఈ విషయం గ్రహించకుండా హిందువానంతర స్పిరిట్యువలిజానికి ఆధునికాంతర కమ్యూనలిజాన్ని జోడించకుండా కంచ ఐలయ్య చేసిన పాక్షిక చర్చ నిరర్థకమే కాదు అనర్థకంగా మారుతోంది.
హిందువానంతర భారతావనిలో హిందూ మతం త్వరలో అంతరించిపోతుందనే కంచ ఐలయ్య అంచనాకి ఆయన చెప్పే ఆధారాలపై జరుగుతున్న చర్చను పరిశీలిద్దాం. ఇకనైనా హిందూ మతం తననితాను సంస్కరించుకోవాలి; లేదంటే అరబ్ దేశాల ఇస్లాం మతం, పశ్చి మ దేశాల క్రైస్తవ మతం లాంటి బ్రాహ్మణేతర, హిందూయేతర విదేశీ మతాల మత మార్పిడి దెబ్బకి హిందూ మతం దెబ్బ తిని, మైనారిటీ అగ్రవర్ణ మతంగా నామమాత్రంగా మారుతుంది; లేదూ ఆ మాత్రమైనా ఉనికిలో లేకుండా అంతరించి పోవటమో జరుగుతుందని ఐల య్య అన్నారు.
ఒకప్పుడు భారతదేశంలో భాగమైన పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లు ఇప్పుడు ఇస్లాం దేశాలుగా మారినట్లే సమీప భవిష్యత్తులో మిగతా భారతదేశం కూడా ఏదొక హిందుయేతర మత ప్రదేశంగా మారుతుందని ఆయన సంచలనం రేకెత్తించారు. అరబ్ దేశాల్లో ఇస్లాం కి, పశ్చిమ దేశాల్లో క్రైస్తవ మతానికి ఇలాంటి విపత్తు సంభవించే సమస్యలేదని, అవి ప్రవర్ధమానమై వర్ధిల్లుతాయని, భారతదేశం కూడా వా టి ప్రభావంలోకి వెళుతుందని మరింత అభ్రతా భావాన్ని కల్పించారు.
మధ్యలో అసందర్భంగా మార్క్స్ ప్రస్తావన తెచ్చి ఆధునిక పెట్టుబడిదారీ వ్యవస్థలో మతం అంతరించి పోతుందని మార్క్స్ చెప్పిన జోస్యం నిజం కాదని నిరూపించబడిందనీ, పెట్టుబడిదారీ ప్రపంచంలో క్రైస్తవం అద్భుతంగా విరాజిల్లటమే అందుకు నిదర్శనమని ఐలయ్య సొంత భాష్యం చెప్పారు. కానీ మార్క్స్ అలా చెప్పలేదు. ఆధునిక పెట్టుబడిదారీ యుగంలో మతం రాజకీయాల నుంచి వేరుపడి, వ్యక్తిగత విశ్వాసానికి పరిమితమయ్యే లౌకిక ప్రజాస్వామ్యం ఆవిర్భవిస్తుందని చెప్పాడు. ఐలయ్య లాగా మతమే సర్వస్వంగా సర్వ నామజపం చేయలేదు.
వ్యక్తిగత ఆస్తి పునాదిగా ఏర్పడిన కుటుంబం, మతం, రాజ్యం లాంటి వ్యవస్థలు వ్యక్తిగత ఆస్తి రద్దు అయ్యే దాకా రద్దుకావని మార్క్స్ చెప్పాడు. అంతే తప్ప ఐలయ్య లాగా అర్థాంతరంగా మతం అంతరించి పోతుందనే అభూత కల్పనలతో అశ్రాస్త్రీయ జోస్యాలు ఆయన ఎన్నడూ చెప్పలేదు. మార్క్స్ మాత్రమే కాదు, అంబేద్కర్ కూడా మార్క్స్ చెప్పినట్లు మత ధర్మ రక్షణ ముసుగులో మనుధర్మ కవచంగా మారిన హిందూ మతం కుల నిర్మూలన జరగకుండా అంతరించదని స్పష్టంచేశారు.
పరోక్షంగా పరదేశమతాల మతమార్పిడిలను ప్రోత్సహిస్తూ పరదేశ ప్రాపకం కోసం పాకులాడే ఐలయ్య లాంటి పరాయికర మేధావులు ఇలా మాట్లాడటమంటే విదేశీ జోక్యాన్ని కోరే దేశ ద్రోహానికి పాల్పడటమేనని కొందరు దేశ భక్తులు ఆయనపై ముద్ర వేసే ప్రయత్నం చేశారు. అసలు వైదికార్య బ్రాహ్మణులే విదేశీయులని, బ్రాహ్మణ మతమే విదేశీ మతమని ఐలయ్య అభిమానులు కొందరు ప్రత్యారోపణ చేస్తూ పనిలోపనిగా ఆర్య ఆత్మ గౌరవాన్ని చాటుకొన్న 'ఆర్యసమాజ్' ప్రవక్త దయానందుడిని అభినందించారు. ఈ అపోహల్ని తొలగించే ప్రయత్నంలో భాగంగా ఈ పరిణామం పరదేశ మతాల పరాపరాధం వల్ల జరగదని, హిందూ మత ఆధ్యాత్మిక ఫాసిజం స్వయం కృతాపరాధం వల్లనే అలా జరుగుతుందని ఐలయ్య స్పష్టం చేశారు.
స్వాతంత్య్రానంతర, హిందూ అనంతర కాలపు పరిణామాలు, అనుభవాలను చూద్దాం. బిసిల అభ్యున్నతికి రాజ్యాంగం ప్రసాదించిన మండల్ రిజర్వేషన్స్‌ని బ్రాహ్మణీయ శక్తులు అడ్డుకొన్నాయి. వాటి అగ్రకుల నిరంకుశత్వాన్ని ఎదిరించిన బిఎస్‌పి, దళిత- బిసిల సమైక్యతని నినదించింది. మండల్‌ని మందిర్‌గా మార్చి ముస్లిం మైనారిటీకి వ్యతిరేకంగా ఎక్కుపెట్టిన హిందూ మెజారిటీయన్ మతతత్వ ఫాసిజాన్ని ఎదిరించి దళిత-ముస్లిం సమైక్యతని బిఎస్‌పి నినదించింది. ఎస్సీ, ఎస్టీ, బిసి మైనారిటీల బహుజన శక్తితో హిందుత్వని ఓడించి జయించింది. హిందూత్వంపై ఈ విజయాన్ని సాధించే శక్తి లౌకిక సామాజిక ప్రజాస్వామ్యమే తప్ప ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం కాదని హిందువానంతర, ఆధునికానంతర చరిత్ర నిరూపించింది.
కనుక పూర్తి స్థాయిలో హిందుత్వను ఎదుర్కొనే ప్రత్యామ్నాయాన్ని పక్కదారి పట్టించి ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం పేరిట మతం చుట్టూ తిప్పే పై పై చర్యలతో హిందుత్వను ఎదిరించటం, సంస్కరించటం కల్ల. సామాజిక కోణానికి చెందిన అంబేద్కర్, ఫూలే విగ్రహాల విధ్వంసాన్ని కూడా మత కళ్ళద్దాలతో చూసి ఈ వివాదాన్ని మత పరమైన హింసాత్మక విధ్వంసంగా అభివర్ణించటం వాస్తవ విరుద్ధ స్వీయాత్మక కోణం తప్ప వేరుకాదు. హిందూత్వ కమ్యూనల్ ఫాసిజాన్ని కేవలం ఆధ్యాత్మిక మతకోణంలోనో లేక మతాతీత లౌకిక కోణంలోనో ఎదిరించి ఓడించడం కష్టం. దాని లోగుట్టు కులం. కనుక మౌలిక, సామాజిక, ప్రజాస్వామిక విప్లవ ప్రత్యామ్నాయాలను చేపట్టక తప్పదు. ఈ మనువాద మర్మం అర్థం కావాలంటే హిందుత్వ ఆవిర్భావ పూర్వాపరాలను పరిశీలించటం అవసరం.
పురాతన కాలంలో వైదికార్యులు మన దేశంలో స్థాపించిన సనాతన మనుధర్మ మతం లేదా వైదిక మతం పుట్టుక రీత్యా భారతదేశంలో పుట్టిన దేశీయ జాతీయ మతం అయితే కావచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లో మతం జాతి కాదు. అది హిందుత్వ జాతి ముసుగేసుకొన్న మతమే. వైదికమనుధర్మ మతాన్ని స్థాపించింది ఈ దేశంలోనే కావచ్చు. కానీ స్థాపించిన వారు మాత్రం ఈ దేశీయులు కాదు. ఈ దేశ మూల వాసులు కాదు. మూల వాసుల కోసమూ కాదు. పశ్చిమాసియా నుంచి ఈ దేశానికి వలస వచ్చిన పరదేశీయులే వైదిక మతాన్ని స్థాపించారు. కనుక వైదిక మతం పరదేశ మతం కాకపోవచుచ్చుగానీ పరదేశీయులు స్థాపించిన మతమే. ఈ దేశంలో జొరబడిన పరదేశీయుల పరిరక్షణ కోసం ఏర్పడిన మతమే. దానికి పరదేశీయ మూలాలు ఉండబట్టే ఈ దేశ మూల వాసులు నిర్మించిన సింధు నాగరికత నామాన్ని నిస్సిగ్గుగా అరువు తెచ్చుకొని వైదిక మతాన్ని హిందూ మతమని నామకరణం చేశారు. అందు వల్లనే వేదవేదాంగాల్లో, పురాణాల్లో హిందువు అనే పదాన్ని చూపించలేకపోతున్నారు.
అంతేకాదు, ఈ మోసపూరిత చర్య ఈ దేశ మూల వాసీ సింధుభూమికి సొంత అస్తిత్వం లేకుండా చేసి వేద భూమిగా వక్రీకరించి పరాయీకరించటం కాదా? అంతటితో ఆగకుండా ఈ దేశంలో ఈ దేశస్థులు స్థాపించిన జైప, బౌద్ధ, సిక్కు మతాలను సైతం దశావతారాల్లో, హిందూ మహాసముద్రంలో కలిపేసే హిందూ సామ్రాజ్యవాదంతో వాటికి సొంత అస్తిత్వం లేకుండా చేయలేదా? ఇతర మతాలకు సొంత అస్తిత్వం లేకుండా చేస్తే తప్ప వైదిక మత అస్తిత్వానికి భద్రత లేకపోవటానికి మూలకారణం వర్ణాశ్రమ మను ధర్మ వైదిక మతం పీడిత కులాల చెరసాల కావటమే. కనుక ఇది స్వయంకృతాపరాధం కాదా? ఈ అపరాధ పరంపరను కప్పిపుచ్చుకునే ఆధునిక అవతారమే హిందుత్వ కాదా?
Andhra Jyothi News Paper Date 25/02/2012
No comments:
Post a Comment