Saturday, October 26, 2013

సీమాంధ్ర అగ్రకుల కురుక్షేత్రం By ఉ.సా,


విభజన ప్రక్రియ వేగవంతం
ఇంకా పరిరిస్తామంటున్న నేతలు 
ఓటు బ్యాంకు కోసమే సమైక్యవాదం 
అభద్రతాభావం అగ్రకుల పాలక వర్గాలకే! 
బడుగు వర్గాలను అణచివేసే ఎత్తుగడ 
స్వయం కృషితోనే బడుగులకు అధికారం 

ఓ పెద్ద భాషా రాష్ట్రంగా 1956లో అవతరించిన ఆంధ్ర ప్రదేశ్‌ 56 ఏళ్ల తర్వాత తెలంగాణ, ఆంధ్ర అనే రెండు చిన్నరాష్ట్రాలుగా విభజితం కాబోతోంది. విభజన ప్రక్రియని నిరోధించి సమైక్యాంధ్రను పరిరక్షించి తీరుతాం అంటూ సమైక్యాంధ్ర పరిరక్షకభటులు అశోక్‌బాబు, కిరణ్‌బాబు, జగన్‌బాబు, చంద్రబాబులు పునరుద్ఘాటిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ తీర్మానం, యుపిఎ క్యాబినెట్‌ నోట్‌, మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు, విభజన విధి విధానాలపై మంత్రిత్వ శాఖల కార్యదర్శుల కసరత్తు, విభజన బిల్లు రూపకల్పన వంటి చర్యలతో విభజన ప్రక్రియ వేగవంతమవుతూనే ఉంది. కనుక సమైక్యాంధ్ర రక్షకభటుల మేకపోతు గాంభీర్యం ఎలాఉన్నా, ఆచరణలో వారు విభజన పరిణామాన్ని నివారించలేకపోతున్నారన్నది నిజం. ఈ సంగతి సామా న్యాంధ్రుల కంటే ఈ సోకాల్డ్‌ సమైక్యాంధ్రవాదులకే బాగాతెలుసు. ప్రత్యేకతెలంగాణ రాష్ట్రఏర్పాటు అనివార్యమని తెలిసే, తెలంగాణపోతే పోయిందని సీమాం ధ్రపై రాజకీయ ఆధిపత్యం కోసం వారు పడుతున్న పాట్లని, పన్నుతున్న ఎత్తుగడల్ని పరిశీలించి చూస్తే అసలు సంగతి బయటపడుతుంది. అయినా ఇంకా సమైక్యాంధ్రని పరిరక్షిస్తామని సీమాంధ్ర సామాన్యాంధ్రుల్ని మభ్యప్టెటంలో మరుగు పడిన మర్మం ఏమిటన్నదే పసిగట్టాల్సిన ముఖ్యాంశం. రాష్ట్ర విభజన అనివార్యమైతే జరిగే పరిణామం ఏమిటో పరిశీలిస్తే ఈ మర్మాన్ని పసిగట్టేందుకు ఆధారం దొరుకుతుంది. ప్రత్యేక తెలంగాణరాష్ట్రం ఏర్పడితే వెంటనే ఆంధ్రప్రదేశ్‌లోని మిగతా రాయలసీమాంధ్రప్రాంతం దానంతటదే మరో రాష్ట్రంగా ఏర్పడుతుంది. అంటే సీమాంధ్ర ప్రాంతానికి తెలంగాణ ప్రాంతంతో ఉన్న భౌగోళిక ప్రాదేశిక సంబంధం తెగిపోయి తెలంగాణ ప్రాంతం తెలంగాణ వారి స్వపరిపాలనాధికారం క్రిందికి పోతుంది. 

విశాలాంధ్రలో వలసాంధ్ర పెట్టుబడిదారీ, పెత్తందారీ పాలనకి తెరపడిపోతుంది. ఆ రకంగా తమ అక్రమఆస్తులకు, వలసాధిపత్యానికి భత్రలేని అభద్రతా భావాన్నే సామాన్యాంధ్రుల అభద్రతా భావంగా చిత్రిస్తున్నారు. తమ స్వప్రయోజనాలకోసం తెలంగాణని అడ్డుకోవడాన్నే సామాన్యాంధ్ర ప్రజల ప్రయోజనాల పరిరక్షణగా చిత్రిస్తున్నారు. పాలకవర్గాల భావననే ప్రజల సమైక్య భావనగా చలామణి చేస్తున్నారు. భౌగోళిక ప్రాదేశిక సంబంధంతో పాటు సీమాంధ్ర కమ్మ, రెడ్డి అగ్రకులాధిపత్య శక్తులకు- తెలంగాణలోని వెలమ, రెడ్డి అగ్రకులాధిపత్య శక్తులకు అగ్రకుల సామాజిక సంబంధం కూడా తెగిపోయి, అగ్రకులాధిపత్య సంఘటితశక్తి అసంఘటితశక్తిగా మారి శక్తిహీనమవుతుంది. నిజానికి ఈ పరిణామంలో ఇమిడి ఉన్న భాషా ప్రయుక్త, ప్రాదేశిక అంశాలకంటే అగ్రకులాధిక్య సామాజికాంశమే వారికి కీలకాంశం. ఈ అంశమే సమైక్యాంధ్ర పరిరక్షణలో మరుగుపరచిన అసలుమర్మం. కానీ ఇప్పుడు జరుగుతున్న చర్చనంతా భాషా ప్రయుక్త, ప్రాదేశిక అంశాలకే పరిమితం చేస్తున్నారు. అలా చేయటంలో కూడా వారి పన్నాగం ఉంది.
‘ఒకే జాతి, ఒకే భాష, ఒకే రాష్ట్రం’ అంటూ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వారు ఎక్కుపెట్టిన సమైక్యాంధ్ర నినాదానికి డబుల్‌ ఎఫెక్ట్‌ ఉంది. 

ఒకవైపు అది విభజన పరిణామాన్ని నివారించే ఎత్తుగడగా పనిచేస్తుంది. మరోవైపు రాష్ట్ర విభజన నివారించలేని అనివార్య పరిణామం అని తెలిసినా, ఆ నిజాన్ని కప్పి పుచ్చి తమ స్వప్రయోజనాల కోసం విభజన వ్యతిరేక సెంటిమెంట్‌తో కూడిన సమైక్యాంధ్ర భావోద్వేగాన్ని రగిలిస్తుంది. ఆ భావోద్వేగాన్ని కాంగ్రెస్‌ వ్యతిరేక, సోనియా వ్యతిరేక రాజకీయ ఎత్తుగడగా మలచుకుంటారు. విభజనకి కారణమైన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రఏర్పాటును వ్యతిరేకించే నెపంతో, తెలంగాణ ప్రాంతానికి వ్యతిరేకంగా సీమాంధ్ర ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టి సీమాంధ్రప్రాంతాన్ని ఓట్‌బ్యాంక్‌జోన్‌గా మార్చుకునే ఎత్తుగడగా ఉపయోగపడుతుంది. ఈ సీమాంధ్ర ప్రాంతీయతత్వం ముసుగులో రాయలసీమ రెడ్డి సామాజిక వర్గానికి- కోస్తాంధ్ర కమ్మ సామాజిక వర్గానికి మధ్య రగులుతున్న అగ్రకులాధిపత్య పోటీని మరుగుపరచే అవకాశం లభిస్తుంది. 

ఇరువర్గాలు కలిసి ఎస్‌.సి, ఎస్‌.టి, బిసి మైనార్టీ బడుగువర్గాలను అణచివేసే అగ్రకుల యత్నాన్ని కప్పిపుచ్చటానికి తోడ్పడుతుంది. ఆంధ్రప్రదేశ్‌ పెద్ద రాష్ట్రం, తెలంగాణ- ఆంధ్ర చిన్నరాష్ట్రాలుగా విడిపోవడంవలన తెలంగాణ ఆంధ్ర అగ్రకుల సామాజికశక్తులకు మధ్యఉన్న అగ్రకులాధిపత్య సంఘటిత సామాజిక సంబంధం అసంఘటితంగా మారిన సామాజిక పరిణామాన్ని బడుగువర్గ చిన్నకులాల సాధికారతకి ఉపయోగపడకుండా పక్కదారి పట్టించే పన్నాగానికి తోడ్పడుతుంది. ఈ పన్నాగమే సమైక్య సీమాంధ్ర ప్రాంతీయతత్వ సామాజిక మర్మం.అందుకే తెలంగాణ ఉద్యమం ‘తొలికోడి కూత’ లాంటిదని, తెలంగాణ వ్యతిరేక, సీమాంధ్ర సమైక్యాంధ్ర ఉద్యమం కీ ఇస్తే మోగే ‘అలారం మోత’ లాంటిదని అంబేడ్కరిస్టు కవి మిత్రుడు కోయి కోటేశ్వరరావు వ్యాఖ్యానించాల్సి వచ్చింది. అప్పుడు 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌, తెలుగుదేశం, కమ్మ, రెడ్డి అగ్రకుల సామాజిక వర్గాలు తెలంగాణ సెంటిమెంట్‌ని ఓట్‌బ్యాంక్‌ ఎత్తుగడగా వాడుకొని ఏరుదాటి తెప్పతగలేసి పరవంచనకి పాల్పడిప్పుడు వారికి ఈ సమైక్యాంధ్ర సెంటిమెంట్‌ గుర్తుకురాలేదు. ఇప్పుడు సమైక్యాంధ్ర సెంటిమెంట్‌తో సీమాంధ్ర ప్రాంతీయ తత్వాన్ని ఓట్‌బ్యాంక్‌ ఎత్తుగడగా మలుచుకొని ఆత్మవంచనకి పాల్పడుతున్నప్పుడు తెలంగాణ సెంటిమెంట్‌ గుర్తుకు రావడంలేదు. 

ఎక్కడైనా ఎప్పుడైనా ఈ అగ్రకులాధిపత్య పాలవకర్గ శక్తులకు అధికారమే పరమావధి తప్ప, ప్రత్యేక తెలంగాణ సెంటిమెంట్‌ పట్ల గాని, సీమాంధ్ర సమైక్యాంధ్ర సెంటిమెంట్‌ పట్ల గాని వారికి ఎలాంటి కమిట్‌మెంట్‌ లేదు.
అందుకే తాము తెలంగాణ సెంటిమెంట్‌ని గౌరవిస్తామని, తాము తెలంగాణ ఇచ్చేవాళ్లం కాదు, ఇస్తే అడ్డుకొనే వాళ్లం కాదని ఆనాడు చిలకపలుకులు పలికిన వైఎస్‌ఆర్‌సిపి అధినేత జగన్‌మోహన్‌ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన రాగానే ప్లేటు ఫిరాయించారు. ఇరు ప్రాంతాల సమన్యాయం అంటూ సన్నాయి నొక్కులు నొక్కి చివరికి సీమాంధ్రలో సమైక్యాంధ్ర సమరశంఖం పూరించి, సీమాంధ్రకి తానే ఏకైక పొలిటికల్‌ హీరోగా మారాలని చూస్తున్నాడు. ఆముసుగులో రెడ్డి సామాజికవర్గాన్ని సమీకరిస్తూ అగ్రకులాధిపత్యాన్ని నెలకొల్పుకుంటు న్నాడు. అదే సమయంలో తన ప్రత్యర్ధి అయిన కమ్మ సామాజికవర్గ ఆధిపత్యాన్ని, ఆ వర్గానికి కొమ్ముగాసే తెలుగుదేశాన్ని దెబ్బతీయాలని చూస్తున్నాడు. తెలంగాణరాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా తెలుగుదేశం లేఖ ఇవ్వడం వల్లే రాష్ట్ర విభజన జరుగుతోందని దుమ్మెత్తిపోస్తూ ఆత్మస్తుతి పరనిందలకి పాల్పడుతున్నాడు. మరోవైపు ఈఅగ్రకులాధిపత్య సీమాంధ్ర రాజకీయకురుక్షేత్రంలో తానెక్కడ వెనుకబడి పోతానో అని బెంబేలెత్తుతున్న టిడిపి అధినేత చంద్రబాబు పోటీ దీక్షలతో, పోటీయాత్రలతో జగన్‌తో పోటీపడుతున్నాడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటువల్ల సీమాంధ్ర ప్రాంత ప్రజలకు ఎదురయ్యే సమస్యల్ని పట్టించుకోకుండా, సమన్యాయం పాటించకుండా రాజకీయ లబ్ధి కోసం ఏకపక్ష నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్‌ అధిష్ఠానం తెలుగుజాతి ప్రజల మధ్య చిచ్చుపెడుతోందని సీమాంధ్రప్రజల్లో తెలంగాణ వ్యతిరేకతను, కాంగ్రెస్‌ వ్యతిరేకతను రెచ్చగొడుతున్నారు. 

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా ఉన్న తెలుగుదేశాన్ని సర్వనాశనం చేయడం కోసమే కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ ఈ ఘాతుకానికి పాల్పడిందనిచెప్పి ‘సోనియా క్విట్‌ ఇండియా’ అంటూ నినదించారు సీమాంధ్ర ప్రజల్లో పెల్లుబుకుతున్న కాంగ్రెస్‌ వ్యతిరేకతను వైసిపి సొమ్ము చేసుకోకుండా అడ్డుకట్ట వేయడంకోసం కాంగ్రెస్‌కి- వైసిపికి మధ్య మ్యాచ్‌ఫిక్సింగ్‌ జరిగిందని ఎండగడుతున్నారు. సీమాంధ్రలో కాంగ్రెస్‌ తన సొంత పార్టీని సైతం ఫణంగా పెట్టి దత్తపుత్రుడైన జగన్‌ని దరి జేర్చుకుందని చాటింపు వేస్తున్నాడు. 
తెలంగాణ ఏర్పాటు నిర్ణయంపట్ల సీమాంధ్రలో పెల్లుబుకుతున్న కాంగ్రెస్‌ వ్యతిరేకత కాంగ్రెస్‌కి రాజకీయంగా నష్టంచేసే పరిస్థితి తలెత్తిన నేపథ్యంలో కాంగ్రెస్‌ పునరాలోచనలో పడేది. గతంలో లాగా రాష్ట్ర విభజన ప్రక్రియ ఆగిపోయేది. కానీ తెలంగాణ అనుకూల ఓటుతో తెరాసని, తెలంగాణ వ్యతిరేక ఓటుతో వైసిపిని దరి జేర్చుకునే ఎత్తుగడలతో కాంగ్రెస్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌కి పాల్పడింది గనుకనే ఆ భరోసాతో రాష్ట్ర విభజన ప్రక్రియను వేగవంతం చేస్తోందని వారి గుట్టును రట్టు చేస్తున్నాడు. రాష్ట్ర విభజన వేగవంతం చేయటానికి కాంగ్రెస్‌కి సహకరించి, సిబిఐ కేసునుండి బయటపడటానికి కాంగ్రెస్‌ సహకారం తీసుకొనే పరస్పర సహకార ఒప్పందం కుదుర్చుకున్న వైసిపి అవకాశవాదం, సమైక్యావాదం ముసుగులో విభజన వాదమేనని ఎండగడుతున్నాడు. 

ఆ రకంగా పరోక్షంగా సమైక్యాంధ్ర పరిరక్షణలో తనకు తానే సాటి తప్ప జగన్‌లాంటి వాళ్లు తనకు పోటీ రాలేరని చాటి చెపుతున్నాడు. అయినా ఎందుకైనా మంచిదని రెడ్డి సామాజికవర్గం ఆధిపత్యాన్ని తట్టుకోవడంకోసం, రెడ్డి సామాజికవర్గం సమీకరణను అడ్డుకోవడంకోసం కాంగ్రెస్‌లోని కాపు సామాజికవర్గాన్ని తమవైపు తిప్పుకోవటం ద్వారా పై చేయి సాధించే ఎదురు ఎత్తుగడ వేశాడు. కాపు సామాజికవర్గానికి చెందిన చిరంజీవి సోదరులు నాగబాబు, పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ తెలుగుదేశం తీర్థం పుచ్చుకోబోతున్నారని తమ మీడియాద్వారా పుకార్లు పుట్టించారు. తమని సంప్రదించకుండా ఊహాగానాలతో తమపై ఇలాంటి తప్పుడు కథనాలు ప్రసారాలు చేయడం అనైతికంఅని వారు బహిరంగంగా ఖండించాల్సి వచ్చింది. కానీ చాపక్రింద నీరు లాగా ఆ ప్రయత్నం కొనసాగుతూనే ఉంది. అందుకు కారణం లేకపోలేదు. సీమాంధ్ర ప్రాంతంలోని కాంగ్రెస్‌ పార్టీకి చెందిన రెడ్డి సామాజికవర్గం వారంతా, కాంగ్రెస్‌ అధిష్ఠాన దత్తపుత్రుడైన జగన్‌మోహన్‌ రెడ్డి పార్టీలోకి ప్లేటు పిరాయిస్తున్నారు. అనంతపురంలో అనంత వెంకటరామిరెడ్డి, కడపలో అదినారా యణరెడ్డి వంటివారు ఇప్పటికే వైసిపిలోకి ఫిరాయించారు. 

ఇంకా అనేకమంది అదే బాట పట్టేట్టున్నారు. అలాగే కాంగ్రెస్‌లోని కమ్మ సామాజికవర్గం ప్రతినిధి రాయ పాటి సాంబశివరావు వంటివారు కాంగ్రెస్‌ను వీడి తెలుగుదేశంలో చేరడానికి లేదా మరో పార్టీ పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అదే వర్గానికి చెందిన లగడపాటి వంటివారు జగన్‌తో కాంగ్రెస్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ సంగతి బాహాటంగా బయట పెడుతూ కాంగ్రెస్‌ ఆ దత్తపుత్రుడిపై ఆధారపడితే తమ భవిష్యత్తేమిటి అని నిలదీస్తున్నారు. ఆ రకంగా సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్‌ పార్టీలోని కమ్మ, రెడ్డి సామాజికవర్గాలు వైసిపిలోకో, తెలుగుదేశంలోకో ఫిరాయిస్తే ఇక కాంగ్రెస్‌లో మిగిలేది కోనసీమ కళింగ సీమలకు చెందిన కాపు- తూర్పు కాపు సామాజిక వర్గాలే. సీమాంధ్రలో కాంగ్రెస్‌ పట్ల పెల్లుబికుతున్న వ్యతిరేకత వల్ల నష్టపోయేది కూడా ఆ సామాజికవర్గాలే. కనుక ఆ వర్గాన్ని తెలుగుదేశం వైపు తిప్పుకుంటే కమ్మ- కాపు సామాజికవర్గాల కలయిక వల్ల పల్నాటి సీమ, కోనసీమ, కళింగసీమ ప్రాంతాల్లో కోస్తాంధ్ర అంతటా తెలుగుదేశం తిరుగులేని శక్తిగా మారుతుంది. జగన్‌వర్గం, రెడ్డివర్గం వైసిపిని కేవలం రాయలసీమకు పరిమితంచేసి ఏకాకినిచేస్తే సీమాంధ్రలో అధికారం తెలుగుదేశం కైవసమవుతుంది.

ఇలా కమ్మ రెడ్డి, కురు పాండవుల మధ్య ఓ వైపు అంతర్గత అగ్రకులాధిపత్య కుల కురుక్షేత్ర సంగ్రామం జరుగుతుండగా మరోవైపు కురు పాండవులేకమై నూరు+ అయిదు= నూట అయిదై, బడుగువర్గ కులాల ప్రతినిధులపై మూకుమ్మడి దాడులకు పాల్పడుతున్నారు. ఉత్తరాంధ్ర కళింగ సీమలో పిసిసి అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణ విద్యాసంస్థలపై, ఆస్తులపై విధ్వంసక దారులకు పాల్పడ్డారు. ఆ ప్రాంతంలో బొత్సను రాజకీయంగా అప్రతిష్ఠపాలు చేయడం కోసం శాంతిభద్రతల సమస్యను సృష్టించి కర్ఫ్యూ విధించే పరిస్థితి కల్పించారు. అందుకు వారిపై ఆగ్రహించిన బొత్స సత్యనారాయణ 4, 8 శాతం కంటే మించిలేని కమ్మ రెడ్డి సామాజికవర్గాలే ఎల్లకాలం రాజ్యమేలాలా, చిన్న రాష్ట్రాల్లో అయినా బడుగువర్గ చిన్న కులాలు సాధికారత సాధించటాన్ని వారు సహించలేరా అని బహిరంగంగానే తన అక్కసు వెళ్లగక్కారు. కోనసీమలో దళిత సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్‌ ఎంపి హర్షకుమార్‌ విద్యాసంస్థలపై, ఆస్తులపై విధ్వంసక దాడులకు పాల్పడ్డారు. పల్నాటిసీమలో మరో దళిత సామాజికవర్గ ప్రతినిధి రాష్ట్ర మంత్రి డొక్కా మాణిక్య రావుపై, ఆయన ఇంటిపై భౌతికదాడలుకు దిగారు. అదే కాంగ్రెస్‌ పార్టీకి చెందిన రెడ్డి సామాజికవర్గానికి చెందిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నివాసంలో జరిగిన సమావేశంలో అధిష్ఠాన ఆదేశానికి కట్టుబడి ఉంటామని నిర్ణయం జరిగినా ఆయనపై ఎక్కడా ఈగ వాలలేదు. అలాగే కమ్మ సామాజికవర్గానికి చెందిన పురంధేశ్వరి విజయవాడ నడిబొడ్డున అధిష్ఠాన నిర్ణయాన్ని సమర్ధిస్తూ సమావేశం జరిపినా సమైక్యవాదు లెవరూ ఆమెని పల్లెత్తుమాట అనలేదు. 

నన్నపనేని రాజకుమారి తెలుగుదేశం అయినా, పురంధరేశ్వరి కాంగ్రెస్‌ అయినా- పార్టీలకతీతంగా వారిరువురూ లగడపాటి కమ్మ సామాజికవర్గానికి చెందినవారు కనుక బెజవాడలో వారికి బ్రహ్మరథం పట్టారు. ఇదంతా గమనిస్తే చిన్న రాష్ట్రాల ఏర్పాటు చిన్న కులాల సాధికారతకి తోడ్పడుతుందని డా బి.ఆర్‌. అంబేడ్కర్‌ చెప్పిన జోస్యాన్ని బడుగువర్గాల వారు గ్రహించనీయకుండా చేయడం కోసమే ఈ అగ్రకుల సామాజికాంశాన్ని చర్చకు రానీయకుండా జాగ్రపడుతున్నారు. సమైక్యాంధ్ర పేరిట సీమాంధ్ర ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టి ఆ ముసుగులో సాగుతున్న అగ్రకుల కురుక్షేత్ర సంగ్రామాన్ని కప్పిపుచ్చాలని చూస్తున్నారు. ఇంతజరుగుతున్నా బడుగువర్గ అంబేడ్కరిస్టులు ఈ పన్నాగాన్ని పసిగట్టి ఎండగట్టడంలో విఫలమైనారు. ఎలాంటి స్వయంకృషి లేకుండా, ఈ సావకాశాన్ని సకాలంలో సద్వినియోగంచేసుకొనే క్రియాశీలకపాత్ర లేకుండా- చిన్నరాష్ట్రాల ఏర్పాటు దానికదే చిన్నకులాలను అందలమెక్కించదు. కాకపోతే అగ్రకులాధిపత్య శక్తుల దయాదాక్షిణ్యాలపై పూర్తిగా ఆధారపడి ఉండే ఆశ్రీతవాద దుస్థితిలో కొంతమార్పు తెచ్చి, స్వయంశక్తితో స్వతంత్రశక్తిగా మారి సాధికారత సాధించే సావకాశం లభిస్తుంది.

ఈ నేపథ్యంనుంచి చూసినప్పుడు విశాలాంధ్రలో అయినా, విభజనాంధ్రలో అయినా, తెలంగాణ- ఆంధ్ర విలీనంలో అయినా, అలీనంలో అయినా భౌగోళిక ప్రాదేశిక అంశంతో సామాజికఅంశం కూడా ముడిపడి ఉంటుందని ఆనాడే చాటిచెప్పిన అంబేడ్కర్‌ సమగ్ర దృక్పథాన్ని ఆకళింపు చేసుకోకపోతే ఈ చారిత్రక సదావకాశాన్నికూడా సద్వినియోగం చేసుకోలేం. పైగా చిన్నరాష్ట్రాల్లోకూడా పెద్ద కులాలే పాగా వేసే పరిస్థితి పునరావృతమవుతుంది. ఆశ్రీతవాద అవకాశవాద కుహనా సామాజిక న్యాయ దళారీ శక్తులే దండుగట్టి అగ్రకుల శక్తులకు అండదండలందిస్తాయి. ఇదే ఇప్పుడు నడుస్తున్న వర్తమాన చరిత్ర. ఈ చరిత్రను తిరగరాయకుండా, మరో చరిత్రను సృష్టించలేమని ఎంత తొందరగా గ్రహిస్తే అంత మంచిది.

Suryaa Telugu News Paper Dated: 27/10/2013 

No comments:

Post a Comment