Monday, October 3, 2011

ఈ ఆరోపణలు అనైతికం - ఉ.సా Andhra Jyothi 04/10/2011


ఈ ఆరోపణలు అనైతికం

- ఉ.సా

దొర గడీలను కాచే వారెవరైనా, దొరలచేత ఉసిగొల్పబడే దొర జీతగాళ్లెవరైనా వారిని తప్పకుండా తప్పుపట్టాల్సిందే. వారి నిజస్వరూపాన్ని బైటపెట్టి జనం ముందు దోషులుగా నిలబెట్టాల్సిందే. జనం వారిని తిరస్కరించి పక్కన బెట్టాల్సిందే. కానీ అలా తప్పుపట్టే నైతిక అర్హత ఆ తప్పు ఎన్నడూ చేయని నిర్దోషులకే వుంటుందిగాని దోషులకు ఉండదు. పీడిత ప్రజల పక్షాన నిలబడి అగ్రకుల పాలకులపై రాజీలేని పోరాటం చేయటానికి బదులు ఏదో ఒక సాకుతో ఎల్లప్పుడూ ఏదో ఒక అగ్రకుల దొరల పంచన జేరి వంచనకు పాల్పడే అసాంఘిక శక్తులకు అసలే ఉండదు.

అనునిత్యం దొర గడీలను కాచే అలాంటి అసాంఘిక శక్తులతో అంట కాగుతున్న గుడిపల్లి రవి లాంటి వారు 'దొర గడీలను కాచే వారితో జాగ్రత్త' (సెప్టెంబర్ 28, ఆంధ్రజ్యోతి) అని మాపై నిందారోపణకు పాల్పడ్డారు. ఇది 'దొంగే దొంగ దొంగ' అని బుకాయించటం తప్ప వేరు కాదు. వీరు తమ తెలంగాణ వ్యతిరేక, అసాంఘిక పాత్రను కప్పిపుచ్చుకోవటం కోసం, అదేమని ప్రశ్నించిన ప్రతివారినీ దళిత వ్యతిరేకులుగా, దొర గడీలను కాచే అగ్రకుల తొత్తులుగా ముద్రవేసి బ్లాక్ మెయిల్ చేసి వారి నోరు మూయించటం ఓ తంతుగా మారింది. అలాంటి వారికి వంత పాడటం ఇప్పుడు గుడిపల్లి వారి వంతుగా మారింది.

న్యాయమైన సామాజిక న్యాయాన్ని తెలంగాణకి అన్యాయం చేసే సాధనంగా, క్రమబద్ధీకరణకు మారుపేరైన వర్గీకరణను తెలంగాణకి అడ్డుపుల్లగా మారుస్తున్న వారి అక్రమాల నిజస్వరూపాన్ని బైటపెట్టినందుకు మాపై గుడిపల్లి బృందం కత్తికట్టింది. తమ దిగజారుడుతనాన్ని మాకు కూడా అంటగడుతూ మమ్మల్ని అప్రదిష్టపాలు చేస్తూ మా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే వ్యక్తిగత నిందారోపణలకు పాల్పడ్డారు.

మహనీయుల మార్గదర్శకత్వంలో గులాంగిరీకి తావులేని మా స్వతంత్ర ప్రత్యామ్నాయ సుదీర్ఘ ప్రజా ఉద్యమ జీవితంలో ఏనాడైనా ఏ సాకుతోనైనా ఏ అగ్రకుల దొరల పార్టీకైనా, జీతగాళ్లుగా మారి దొర గడీలను కాచిన సందర్భం ఒక్కటంటే ఒక్కటైనా ఏ ఒక్కడైనా చూపించగలడా? అని బహిరంగంగా సవాల్ చేస్తున్నాం. అసత్యాలతో అర్ధ సత్యాలతో, అసందర్భమైన అభూతకల్పనలతో గుడిపల్లి వారు మా పై ఎన్ని నీలాపనిందలు మోపినా వారు సైతం మా విషయంలో అలాంటి సందర్భం చూపించలేకపోయారు.

భౌగోళిక తెలంగాణ వాదాన్ని విమర్శనాత్మక దృష్టితో సమర్థిస్తూ తెలంగాణకి జైకొట్టే సామాజిక తెలంగాణ వాదం సైతం దొర గడీలను కాచే వాదమే అని వారు చేసిన అవగాహనా రాహిత్య ఆరోపణ సిద్ధాంత పరమైందే గాని వ్యక్తిగతమైంది కాదు. అందులోఎవరు ఏ గడీలను కాస్తున్నారో, సూడో సామాజిక న్యాయ ముసుగులో ఆ గూడుపుఠాణీ ఎలా దాస్తున్నారో ఈ 'అసాంఘిక శక్తుల' 'సామాజిక సమైక్యాంధ్ర వాదాన్ని' బైటపెడుతూ సైద్ధాంతికంగానే నిగ్గు తేల్చుకొంటాం. అంతకంటే ముందు గుడిపల్లి లాంటి అనైతిక అర్భకులు మాపై చేసిన నిరాధార నిందారోపణల అసందర్భ అసత్యారోపణలను వివరాల్లోకి వెళ్లి పరిశీలిద్దాం.

మొట్ట మొదటగా గుడిపల్లి అన్నట్లు 'సామాజిక న్యాయం గురించి, సామాజిక తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు' నిజంగా మాకే వుంది. 'రాయితీలు మాకు రాజ్యాధికారం మీకు' అనే పరస్పర సహకార 'రహస్య' ఒప్పందాలతో అగ్రకుల పాలక వర్గ పార్టీల దొర గడీలను కాస్తూ స్వార్థపర సంకుచిత ప్రయోజనాల కోసం బహుజన ప్రజా ప్రయోజనాలను అనునిత్యం తాకట్టు పెట్టే దొర జీతగాళ్లకు లేదు. 'సాంఘిక ఆర్థిక రాజకీయ పరమైన సకల సామాజిక రంగాల్లో సమ భావ, సమ భాగ, సమతుల్య, సామాజిక ' పరివర్తక' సాధనమైన సామాజిక న్యాయాన్ని 'వర్తక' సాధనంగా తాకట్టు పెట్టే వాళ్లకు అసలే లేదు. ఉ.సా. సుదీర్ఘ ఉద్యమ జీవితంలో సగ జీవితం లేని గుడిపల్లి లాంటి వారితో సామాజిక న్యాయం గురించి గుణపాఠాలు చెప్పించుకునే దుస్థితి మాకు పట్టలేదు.

ఇక భౌగోళిక-సామాజిక తెలంగాణ వివాదంతో ఎలాంటి సంబంధం లేని మరో ముఖ్యమైన అంశంగా కుల-వర్గ-జమిలి సిద్ధాంతాన్ని అసందర్భంగా చర్చలకు తెచ్చాడు గుడిపల్లి. 'కుల -వర్గ దృక్పథం నుంచి తెలంగాణ సమస్యను విశ్లేషించి ఉ.సా. కొత్తగా భౌగోళిక-సామాజిక తెలంగాణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. కానీ ఉ.సా.కి తన సిద్ధాంతం పట్ల తనకే నమ్మకం, విశ్వాసం లేదని' గుడిపల్లి మరో ఆరోపణ చేశాడు. ఈ భౌగోళిక-సామాజిక తెలంగాణ సిద్ధాంతం ఇప్పుడు కొత్తగా ఉ.సా. ప్రతిపాదించింది కాదు.

1997లోనే ఉ.సా., వీరన్న ఇరువురూ కలిసి సంయుక్తంగా రూపొందించిన ఆనాటి 'తెలంగాణ మహాసభ' సిద్ధాంతం ఇది. 'చిన్న రాష్ట్రాల ఏర్పాటు చిన్న కులాలకు తోడ్పాటు'నిస్తుందనే అంబేద్కర్ ఆలోచనా విధానం స్ఫూర్తితో 'ప్రత్యేక తెలంగాణ! తెలంగాణలో దళిత బహుజన ప్రజారాజ్యం' ఆనాడు రూపొందించిన మేనిఫెస్టో 'తెలంగాణ మహాసభ' పత్రికలో ప్రచురితమయింది. ఈ విషయాన్ని ఆ పత్రికా సంపాదకుడే ఇటీవల టీ.వీ.ఛానెల్ చర్చలో స్వయంగా ప్రస్తావించాడు. ప్రజాయుద్ధ సాయుధ పోరాట పంథాలో ఆనాడు 1998లో వీరన్న స్థాపించిన సిపిఎస్‌యుఐ పార్టీని పార్లమెంటరీ పంథాలో పనిచేసే పార్టీగా దిగజార్చి, దాని ఆవిర్భావ సభకి దొర గడీలను కాచే వారిని ముఖ్య అతిథులుగా ఆహ్వానించిన గుడిపల్లి మాటలకి ఏ విశ్వసనీయతా లేదు.

అలాగే ఒకప్పుడు మారోజు వీరన్నతో కుల వర్గ జమిలి పోరాటమే సరైనదని, ఒంటరి వర్గ పోరాటం ఒట్టి పోరాటమని చెప్పిన ఉ.సా. అందుకు విరుద్ధంగా ఒంటరి వర్గపోరాటమైనా, కుల పోరాటమైనా విజయవంతమవుతాయని బెంగాల్, యుపి అనుభవాలను ఉదాహరణగా చెప్పినట్లు అర్ధ సత్యాలతో, అసత్యాలతో గుడిపల్లి మరో కట్టు కథ చెప్పాడు. బెంగాల్ సిపిఎం అనుభవంలో అగ్రకులాధిపత్య స్వభావం, యుపిలో బిఎస్‌పి, ఎస్‌పి అనుభవంలో పెట్టుబడిదారీ సంపన్నవర్గ స్వభావం సంతరించుకోవటంతో అవి రెండు కులవర్గ అసమానతలను తొలగించలేని అసమగ్ర అనుభవాలేనని ఉ.సా. తేల్చి చెప్పారు. ఆయన ఎప్పుడూ తాను చెప్పిన మాట తప్పలేదు. పార్లమెంటరీ పంథా పార్టీ ఆవిర్భావ సభకి దొర గడీలను కాచే దొర జీతగాళ్లను ముఖ్య అతిథులుగా ఆహ్వానించారు తప్ప ఉ.సా.ని ఆహ్వానించలేకపోయారంటే ఎవరు దొర గడీలను కాచేవారో, ఎవరు దొర గడీలను కూల్చేవారో వేరే చెప్పక్కర్లేదు.

- ఉ.సా
కొంకల వెంకట నారాయణ
పావని నాగరాజు
సి.హెచ్.లక్ష్మణ్

No comments:

Post a Comment