కులాన్ని సాంఘికార్థిక అంశంగా, ఇండియా సమాజాన్ని కుల-వర్గ సమాజంగా విశ్లేషించిన అంబేద్కర్ ఆలోచన విధానం కావాలి. ఒక్కమాటలో చెప్పాలంటే'మార్క్స్ చాలడు, అంబేద్కర్ కావాలి'.
ఎర్రాఎర్రటి నరుడో భాస్కరుడు, నల్లానల్లటి దళిత సూరీడు శివసాగరుడు (కెజి సత్యమూర్తి) ఇటీవల అమరుడైన సందర్భంగా 'సామాజిక విప్లవమూర్తి'గా ఆయన్ని స్మరించుకొంటూ అనేక మంది పలు వ్యాసాలు రాశారు. ఆ వ్యాసాల్లో సత్యమూర్తిని సామాజిక విప్లవ మూర్తిగా అభివర్ణించడాన్ని రంగనాయకమ్మ సహించలేకపోయారు. అలాగే మన దేశ కులవ్యవస్థను, కులాధీన వర్గ వ్యవస్థను జమిలిగా మార్చటానికి అంబేద్కర్ కావాలి, మార్క్స్ కావాలని నొక్కి చెప్పిన సత్యమూర్తి విశ్లేషణని గొప్ప దేశీయ మార్క్సిస్టు-అంబేద్కరిస్టు తాత్విక విశ్లేషణగా కొనియాడటాన్ని కూడా ఆమె సహించలేకపోయారు.
రంగనాయకమ్మ దృష్టిలో అంబేద్కర్ సాంఘిక సంస్కర ణవాద సంఘసంస్కర్త మాత్రమే. కనుక ఆయన్ని బలపర్చే వారెవరైనా అలాంటి సంఘ సంస్కర్తలే అవుతారు. గతంలో సత్యమూర్తి విప్లవ కమ్యూనిస్టు అయినా ఒకసారి అంబేద్కర్‌ని బలపర్చినాక ఆయన్ని కూడా సంస్కరణ వాదిగానే చూడాలి తప్ప సామాజిక విప్లవ యోధుడిగా చూడటానికి వీల్లేదు... అలా చూస్తే ఆమె సహించలేదు. కులపరమైన సాంఘిక వివక్షకి పరాకాష్ఠ అయిన అంటరాని దళిత సమస్య కుల వ్యవస్థతో సంబంధంలేని సాంఘిక దురాచార సమస్యగా గాంధీ చిత్రీకరించారు. ఆ వ్యవస్థకు ఎలాంటి విఘాతం కలిగించని హరిజనోద్యమం ద్వారా ఆ సాంఘిక దురాచారాన్ని ఆయన పోగొడతానన్నాడు.
కానీ అంబేద్కర్ కుల వ్యవస్థతో ముడిపడి ఉన్న దళిత సమస్య కుల వ్యవస్థలో సమూలమైన మార్పు తేకుండా పరిష్కారం కాదని కుల నిర్మూలనా దృక్పథాన్ని ప్రతిపాదించారు. చారిత్రక దృష్టితో కులాల మూలాల్లోకి వెళ్ళి'అస్పృశ్యతకు మూలం కుల వ్యవస్థలో ఉంది. కుల వ్యవస్థకు మూలం వర్ణాశ్రమ వ్యవస్థలో ఉంది. వర్ణాశ్రమ ధర్మం మత పరిరక్షణలో ఉంది. దాని మూలం అగ్రవర్ణ నిరంకుశాధికార రాజ్యాధికారంలో ఉంది' అన్నాడు. కుల నిర్మూలనా విధానంతో రాజ్యాధికారం అనే మాస్టర్ కీ చేజిక్కించుకోవాలన్నాడు. తద్వారా సాంఘిక ఆర్థిక రాజకీయ సామాజిక న్యాయంతో కుల వ్యవస్థను సమూలంగా మార్చాలని, కులాంతర వివాహాల ద్వారా కులాలను రద్దుచేయాలని అప్పుడే దళిత సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని చెప్పారు.
అంబేద్కర్‌ను స్వీయాత్మక దృష్టితో చూడటం కారణాన అంబేద్కర్‌ను సాంఘిక సంస్కరణవాదిగా రంగనాయకమ్మ చిత్రీకరించారు. అంబేద్కర్ సాంఘిక, ఆర్థిక, రాజకీయ సామాజిక, న్యాయ సామాజిక విప్లవ కుల నిర్మూలనా పోరాటాన్ని కేవలం సాంఘిక పోరాటంగా కుదించి చూస్తున్నారు. కులాలను రద్దు చేసే కులాంతర వివాహాల సాంఘిక కార్యక్రమానికి ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలని ఆమె అంటున్నారు. కానీ అట్టడుగు కులాల వారందరి ఆర్థిక పరిస్థితులు మారకుండా, కులాంతర వివాహాలు నిరభ్యంతరంగా జరిగే వాతావరణం ఏర్పడకుండా కులాల రద్దు అసాధ్యం అని ఆమె అన్నారు. శ్రామిక వర్గ సంబంధాల్లో మార్పు కోసం జరిగే వర్గ విప్లవ పోరాటం ద్వారానే అది సాధ్యమని అంటున్నారు.
దళిత సమస్యను కేవలం ఉపరితల సమస్యగా, సాంఘిక సమస్యగా మాత్రమే రంగనాయకమ్మ చూస్తున్నారనడానికి 'దళిత సమస్య పరిష్కారానికి అంబేద్కర్ చాలడు, మార్క్స్ కావాలి' అనే రంగనాయకమ్మ పుస్తకమే నిదర్శనం. మార్కిజాన్ని ఆర్థిక నిర్ణాయక పెడధోరణిగా మార్చిన ఈ అగ్రకుల మూస మార్క్సిస్టులు ఇండియాలో వర్గాన్ని ఆర్థికంగా, కులాన్ని సాంఘికంగా విశ్లేషించిన అవాస్తవిక విశ్లేషణని అంబేద్కర్ ఖండించి తిరస్కరించారు. ఆర్థిక నిర్ణాయకవాద మూస మార్క్సిస్టు అయిన రంగనాయకమ్మ అంబేద్కర్‌పై బురద జల్లుతున్నారు.
శ్రమనేగాక శ్రామిక వర్గ సంబంధాల్ని శ్రామిక కుల సంబంధాలుగా మార్చిన కులవ్యవస్థ కేవలం ఉపరితల సాంఘిక వ్యవస్థ కాదని అంబేద్కర్ చెప్పారు. ఈ దేశంలో కుల అంతస్తుల వారీగా ఏర్పడిన 'కుల-వర్గ ఆస్తులు-అంతస్తులే' అందుకు తిరుగులేని నిదర్శనం. కనుక కులం ఉపరితల సాంఘిక వ్యవస్థ అని ఫ్యూడల్ కుల వృత్తులు చెదిరిపోతే కులాలు అంతరించిపోతాయని, కులాల్లో వర్గాలేర్పడితే కులం వర్గంగా రూపాంతరం చెందుతుందని అంచనా వేసిన మూస మార్క్సిస్టుల అంచనాలు అభూత కల్పనలుగా మారి కాలదోషం పట్టి కాలగర్భంలో కలిసిపోయే సమయం ఆసన్నమైంది తప్ప అంబేద్కర్ అంచనాలు విఫలం కాలేదు.
కులాన్ని సాంఘికాంశంగా పరిగణించే రంగనాయకమ్మలాంటి మూస మార్క్సిస్టుల అంచనాలు తప్పని ఇప్పటికే చరిత్ర నిరూపించింది. మన దేశ సామాజిక వ్యవస్థని కుల వర్గ వ్యవస్థగా చూడాలని, కుల-వర్గ సామాజిక విప్లవ పోరాటంతో మార్చాలని చెప్పిన ఏకైక సామాజిక శాస్త్రవేత్త, సిద్ధాంతవేత్త అప్పటికీ ఇప్పటికీ అంబేద్కర్ ఒక్కడే. 'ఈ సందర్భంగా కుల వ్యవస్థకు సంబంధించి ఒక ముఖ్య లక్షణం గురించి నొక్కి చెప్పాలి.
అదేమిటంటే కులమూ వర్గమూ ఒకే రకమైనవి కాకపోయినా కుల వ్యవస్థ వర్గ వ్యవస్థను గుర్తిస్తుందని స్పష్టంగా చెప్పగలం. బ్రాహ్మణీయ హిందూ సమాజం అనేక కులాలుగా విభజింపబడినట్లే కులాలు అనేక వర్గాలుగా విభజింపబడ్డాయి. అందుకే ఈ కులవర్గ సమాజంలో కుల చైతన్యంతో పాటు వర్గ చైతన్యం కూడా ఉంది.. దీనికి రుజువులు కావాలనేవారు మద్రాసు బొంబాయి రాష్ట్రాల్లో జరిగిన బ్రాహ్మణేతర ఉద్యమాన్ని పరిశీలించవచ్చు' అని స్పష్టం చేశారు. (హిందూయిజం తాత్విక భూమిక-కులం, వర్గం-అంబేద్కర్). బ్రాహ్మణేతర బహుజనోద్యమం వర్గాన్ని విస్మరించినందువల్ల శూద్ర వ్యవసాయ కులాలకి చెందిన వారు భూస్వాములై, అగ్రకుల పాలక వర్గాలుగా, నూతన సంపన్న వర్గాలుగా పరిణమించటాన్ని నివారించలేకపోయిందని అందులోని లోపాన్ని గుణపాఠం తీసి చెప్పారు.
'ప్రపంచ కార్మికులారా ఏకంకండి' అని కార్మికవర్గ అంతర్జాతీయ దృక్పథంతో మార్క్స్ ఇచ్చిన పిలుపును మూస మార్క్సిస్టులు భ్రష్టు పట్టించారు. ఏ కులం వారైనా, ఏ దేశం వారైనా పేదలంతా ఒక్కటే.. బాధలన్నీ ఒక్కటే అని ప్రపంచ పేదల్లారా, ఏకంకండి అని ఆ నినాదాన్ని వక్రీకరించి వివిధ దేశాల, జాతుల, ప్రత్యేక కుల సమాజాలకు అతీతంగా ఒకే మూసలో (వర్గ మూసలో) పోసే వాదాన్ని అంబేద్కర్ తిరస్కరించారు. 'మానవుల సమూహమే సమాజం అనే సామాజిక దృక్పథం మోసపూరితమైనది. ఏ దేశ సమాజంలోనైనా వర్గాలు ఏర్పడుతాయి.
ప్రపంచమంతటా ప్రతి దేశంలో ప్రతి వ్యక్తి ఏదో ఒక వర్గానికి చెంది ఉంటాడని మార్క్స్ చెప్పిన సార్వజనీన వర్గ దృక్పథమే సరైంది. విలక్షణ ప్రత్యేక కుల వ్యవస్థ ఉనికిలో ఉన్న ఇండియా సైతం అందుకు మినహాయింపు కాదు. కాకుంటే ఇండియాలో వర్గంతోపాటు కులం కూడా ఉందన్న కుల వర్గ సామాజిక వాస్తవికతను ఇండియన్ అగ్రవర్ణ మార్క్సిస్టులే సరిగా గుర్తించటం లేదు. ఇండియాలో వర్గం కుల నియంత్రణకి గురవుతోందని, శ్రమ విభజనను శ్రామికుల విభజనగా మార్చి విభజించి పాలించే బ్రాహ్మణిజాన్ని దేశీయ సామాజిక ప్రత్యేక శత్రువుగా గుర్తించాలి' అని అంబేద్కర్ హెచ్చరించారు.
కనుక వర్గాన్ని నియంత్రించి వర్గపోరాటానికి అడ్డంకులు కల్పించే కుల నియంత్రణని అరికట్టే కుల నిర్మూలనా పోరాటం చేపట్టకుండా, యథాతథ 'కులం పునాదుల మీద (వర్గ ఉద్యమాన్ని గాని, జాతీయోద్యమాన్ని గాని) ఒక జాతిని గానీ, నీతిని గానీ నిర్మించలేదు' నిర్మించినా కుల నియంత్రణకి గురికాకుండా నివారించలేదు. అందుకే 'ప్రపంచ కార్మికులారా ఏకంకండి' అని కార్మిక వర్గ అంతర్జాతీయ దృష్టితో మార్క్స్ ఇచ్చిన పిలుపు ఇండియాలో యథాతథంగా అమలుకాదని అంబేద్కర్ తమ 'కుల నిర్మూలన'లో స్పష్టం చేశారు. ఆ కారణంగా ఇండియాలో కమ్యూనిస్టులు ఫ్యూడల్ వ్యతిరేక వ్యవసాయ విప్లవ వర్గపోరాటంపై కుల ప్రభావాన్ని నివారించలేకపోయారు.
దాంతో 'దున్నే వానికే భూమి' అని వారు ఇచ్చిన నినాదం వ్యవసాయ కులాలకి చెందిన కమ్మ, రెడ్డి, కాపు, వెలమ 'కౌలుదారులకే భూమి'గా పరిణమించింది. పర్యవసానంగా వ్యవసాయేతర శూద్ర అతిశూద్ర కులాలవారికి చారిత్రక అన్యాయం జరిగింది. అలా అంబేద్కర్ చెప్పిందే నిజమైంది. కనుక ఈ వాస్తవాల్ని తారుమారు చేసి, తలకిందులుగా చూపుతున్న రంగనాయకమ్మ వాదాన్ని సరిదిద్ది తలపైకి కాళ్ళు కిందికి పెట్టి చూద్దాం. కులాన్ని సాంఘికార్థిక అంశంగా, ఇండియా సమాజాన్ని కుల-వర్గ సమాజంగా విశ్లేషించిన అంబేద్కర్ ఆలోచన విధానం కావాలి. ఒక్కమాటలో ఈ మూస మార్క్సిస్టు 'మార్క్స్ చాలడు. అంబేద్కర్ కావాలి'.
ఉద్యమాల ఉపాధ్యాయుడు
Andhra Jyothi News Paper Dated : 16/06/2012
No comments:
Post a Comment