Sunday, January 29, 2012

నిలదీస్తేనే నిలువగలం...!అనాది నుంచీ ఆదివాసుల జీవితాలు ‘పెనం మీదినుంచి పొయ్యిలో పడ్డ’ చందంగా తయారవుతున్నాయి. ఫలితంగా తరతరాలుగా పేదరికం లో మగ్గిపోతున్నారు. దీనికి పాలకులు, వారు అవలంబిస్తున్న విధానాలే కారణం. పాలకవర్గాలు ఆదివాసీ ప్రాంతాల్లో నిక్షిప్తమై ఉన్న ఖనిజ సంపదను, అటవీ సంపదను, నీళ్లను, భూమిని టాటా, జిందాల్, వేదాంత, పోస్కో, మిట్టల్ తదితర బహుళజాతి కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. సంపన్న వర్గాలకు వనరులను ధారాదత్తం చేసి ఆదివాసులను నిర్వాసితులను చేస్తున్నాయి.ఉత్తర తెలంగాణలో ఖమ్మం నుంచి ఆదిలాబాద్ వరకు ఉన్న ప్రాం తంలో అటవీ, ఖనిజ సంపద పుష్కలంగా ఉంది. డోలమైట్, బాక్సైట్ తదితర ఖనిజాలు, భారీనీటి ప్రాజెక్టుల కోసం కావలసిన గోదావరి, మునేరు, ప్రాణహిత, కిన్నెరసాని లాంటి నదులున్నాయి.

వీటిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళారీ పెట్టుబడిదారులకు, బహుళజాతి కార్పొరేట్ సంస్థలకు దోచిపెడుతున్నాయి. వీటిని నమ్ముకొని తరతరాలు గా ఆదివాసులు, పీడిత ప్రజలు జీవనం సాగిస్తున్నా రు. పాలకుల విధానాలతో ఆదివాసులు నిర్వాసితులవుతున్నారు.ఆదివాసీ చట్టాల్లో ‘పెసా’ చట్టం, 1/70 చట్టం ప్రకారం గ్రామ సభలకే సర్వాధికారం ఉంది. స్వయం పాల న, రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూలు, రాజ్యాంగ అధికరణ 244 కింద ఉదహరించబడిన ఆదివాసుల పరిరక్షణ నియమాల వంటి చట్టాలు, ఆదివాసుల పరిరక్షణ కోసం చేసిన చట్టాలను ఉల్లంఘిస్తూ పాలకులు వారిని బలిచేస్తున్నారు. ఆదివాసులను వారి నివాస ప్రాంతాల నుంచి తరిమేసి, వారి సంస్కృతిని నాశనం చేసి వారికి నిలువ నీడ లేకుండా చేస్తున్నారు. పాలకుల విధానాలను ప్రశ్నిస్తున్న, నిలదీస్తున్న ఆదివాసులను రూపుమాపేందుకు ఏకంగా గ్రీన్‌హంట్ పేరిట ఆదివాసులపై యుద్ధం ప్రకటించారు. గిరిజనులను తుదముట్టిస్తున్నారు.

పోలవరం ప్రాజెక్టు వల్ల ఖమ్మం, ఉభయగోదావరి జిల్లాల్లో వందలాది గ్రామాలు ముంపుకు గురవుతున్నాయి. పోలవరం నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేకున్నా ప్రాజెక్టు నిర్మాణం చేస్తున్నారు. ఆదివాసులను సమాధి చేసేందుకు టీడీపీ, కాంగ్రెస్ కుట్రలు పన్నుతున్నాయి. మరోవైపు జాతీయ అవసరాల పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బొగ్గు నిక్షేపాలను వెలికి తీసే కార్యక్షికమాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నాయి. బొగ్గును వెలికి తీసే పనిని ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తూ.., ఓపెన్ కాస్ట్ విధానంతో విధ్వంసం సృష్టిస్తున్నారు. సింగరేణి గనుల్లో చేపడుతున్న ఓపెన్ కాస్ట్ విధానంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. దీంతో.. వ్యవసాయమంతా మూలనపడిపోయింది. పంట భూములు కానరాకుండాపోయాయి.

ఖమ్మం జిల్లాలోని మణుగూరు, ఇల్లెందు, గుండాల-1, సీతంపేట, ఆదిలాబాద్‌లో కైరిగూడెం, అబ్బాపూర్, ఎన్‌కేపూర్, కైరిమాదారంలో కొత్తగా ఓపెన్ కాస్ట్‌లు రానున్నాయి. కరీంనగర్ జిల్లాలో తాడిచర్ల, వరంగల్‌లో పెద్దాపూర్ తదితర ప్రాంతాల్లో ఓపెన్ కాస్టులు రాబోతున్నాయి. దీని ఫలితంగా వేలాది ఎకరాల పంట భూములు నాశనమై రైతులు బికారులు కాబోతున్నారు. కొత్తగూడెం-2 ఓపెన్‌కాస్టుతో ఆ ప్రాంతంలో రెండువేల ఎకరాల పంటభూములు నాశనం అవుతున్నాయి. ఇల్లెందు జెకె-3 ఓపెన్ కాస్టుతో ఇల్లెందు సికాయపల్లికి చెందిన వెయ్యి కుటుంబాలు జీవనోపాధిని కోల్పోతున్నాయి. మణుగూరు ఓపెన్ కాస్ట్ కింద 30 గ్రామాలు, మంగిలిగూడెంతోపాటు మరో మూడు గ్రామాల ప్రజలు తమ జీవనోపాధిని కోల్పోతున్నారు.
వరంగల్ జిల్లా కొడిశెలకుంట, బుచ్చిడ్డిపల్లి, యెల్లంపల్లి, రంగయ్యపల్లి ప్రాం తాల్లో డోలమైట్, బాక్సైట్, ఇనుప ఖనిజాలు ఉండటంతో మైనింగ్ మాఫియా కన్నుపడింది.

దీంతో ఆ ప్రాంతంలో మూఢ నమ్మకాలను ప్రచారం చేసి అక్కడి ప్రజలు ఆ ప్రాంతంలోని భూములను వదిలివేసే విధంగా విష ప్రచారం చేస్తున్నా రుపజలను భయవూభాంతులను గురిచేసే ప్రచారం చేయడంతో కొందరు గ్రామాలను వదిలి వెళ్లిపోతున్నారు.గుట్ట నీడ (బొవూడాయి) ఈ గ్రామాలపై పడి మనుషులకు కీడు వస్తుందని ప్రచారం చేసి ఊళ్లకు ఊళ్లు ఖాళీ చేసే విధంగా మైనింగ్ మాఫియా ప్రచారం చేసింది. ప్రజలు ఊళ్లు విడిచివెళ్లిన తర్వాత ఆ ప్రాంతంలో తవ్వకాలు చేస్తున్నారు. అనేక రకాలుగా ఆదివాసులను నిర్వాసితులను చేస్తున్న ప్రభుత్వం, ఆదిలాబాద్ జిల్లాలో అభయారణ్యం పేరుతో ఆదివాసులను నిర్వాసితులను చేయడానికి పూనుకున్నది. కవ్వాల్ అడవుల్లో, ఖమ్మం జిల్లా వీఆర్‌పురం, చింతూరు అడవులలో, వరంగల్ జిల్లాలో తాడ్వాయి, ఏటూరు నాగారం అడవులను ‘టైగర్ జోన్’లుగా ప్రభుత్వం ప్రకటించింది.ఆదివాసులను ఈ ప్రాంతాల నుంచి తరిమేసి యథేచ్ఛగా ఖనిజ సంపదను, అటవీ సంపదను కొల్లగొట్టడానికి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నది. టైగర్‌జోన్ కారణంగా 40 గ్రామాల ప్రజలు రోడ్డునపడుతున్నారు. చింతూర్, వీఆర్‌పురం అడవుల్లో టైగర్‌జోన్ వల్ల 100 గ్రామాల గిరిజనులు నిర్వాసితులు అవుతున్నారు.

వరంగల్ జిల్లా చెల్పూర్ దగ్గర ఒక విద్యుత్ ప్లాంట్ నిర్మాణం పూర్తయింది. మరొకటి నిర్మాణంలో ఉన్నది. వీటిలో స్థానికులకే ఉద్యోగాలు ఇస్తామన్నారు కానీ ఒక్క ఉద్యోగం కూడా స్థానికులకు ఇవ్వలేదు. ఈ విద్యుత్ ప్లాంటు వెదజల్లుతున్న బూడిద వల్ల వేలాది ఎకరాల పంట పొలాలు నాశనమవుతున్నాయి. గిరిజనులు వేసుకున్న పంటలన్నీ బూడిదపాలవుతున్నాయి. ఇలా ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం వరకు గిరిజన ప్రాంతాల్లో టైగర్‌జోన్‌లు, ప్రాజెక్టులు, ఖనిజ తవ్వకాల పేరు తో లక్షలాది మంది ఆదివాసులను నిర్వాసితులను చేస్తున్నారు.

రకరకాల ప్రాజెక్టులు, అభివృద్ధి పథకాలు, టైగర్‌జోన్‌ల పేరుతో రాష్ట్రంలోనే కాదు, దేశ వ్యాప్తంగా పాలకులు గిరిజనులపై కత్తిగట్టారు. ‘కాకులను కొట్టి గద్దలకేసినట్లు’ గా.. దేశమూలవాసులైన ఆదివాసులను కొట్టి బడా పెట్టుబడిదారులకు, బహుళజాతి కంపెనీలకు దోచిపెడుతున్నారు. దీనిని దేశవ్యాప్తంగా ఆదివాసులు వ్యతిరేకిస్తున్నారు. తమకు తోచిన పద్ధతిలో నిరసిస్తున్నారు. సంఘటితంగా పోరాడుతున్నారు. సరిగ్గా ఇక్కడే మావోయిస్టు పార్టీ ఆదివాసులకు అండగా నిలిచి వారి పోరాటాలకు నాయకత్వం వహిస్తున్నది. ఆదివాసీ ప్రాంతాలపై జరుగుతున్న అన్ని రకాల దోపిడీని వ్యతిరేకిస్తున్నది.ఈక్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బహుళజాతి కంపెనీలకు అండగా నిలిచి ఆదివాసులపై అణచివేతకు దిగుతున్నాయి. గిరిజనులపై ‘గ్రీన్‌హంట్’ పేరుతో యుద్ధా న్ని ప్రకటించాయి. మావోయిస్టులకు మద్దతునిస్తున్నారన్న నెపంతో ఆదివాసులపై పారా మిలిటరీ, పోలీసు బలగాలు దమనకాండను సాగిస్తున్నాయి.

ఊళ్లకు ఊళ్లను తగలబెడుతున్నాయి. ఆదివాసీ మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నాయి. పండు ముసలి నుంచి పసి పిల్లల వరకు దొరికిన వారిని దొరికినట్లు కాల్చి చంపుతున్నాయి. సాయుధ పోలీసు, భద్రతా బలగాలకు తోడుగా సల్వాజుడుం లాంటి ప్రైవేటు గూండా సైన్యాన్ని పెంచి పోషించి ఆదివాసులపై అమానుష దాడులకు పాల్పడుతున్నాయి. ఇదం తా మావోయిస్టుల ఏరివేత పేరుతో పాలకులు సాగిస్తున్న దమనకాండ. ఇంత కూ మావోయిస్టులు చేసిన, చేస్తున్న నేరం ఏమిటో దేశ ప్రజల ముందు పాలకులు వెల్లడించకుండానే ఇదంతా చేస్తున్నారు. ఈ దేశ సహజ వనరులపై కన్నేసిన బహుళ జాతి కంపెనీల దోపిడీని ఎదిరించడమే మావోయిస్టులు చేసిన నేర మా? అందరూ ఆలోచించాలి. ఈ మట్టిపై, ఈ ప్రజలపై ప్రేమ ఉన్న వారెవరై నా బహుళజాతి కంపెనీల దోపిడీని వ్యతిరేకించాలి. అభివృద్ధి పేరుతో దేశ వనరులను విదేశీ కంపెనీలకు, కార్పొరేట్ సంస్థలకు దోచిపెడుతున్న పాలకులను నిలదీయాలి.దేశాన్ని తాకట్టు పెట్టే పాలకుల విధానాలను వ్యతిరేకించాలి.

దేశ సార్వభౌమాధికారం కోసం ప్రజలంతా దీర్ఘకాలిక మిలిటెంట్ పోరాటాలకు సిద్ధమవ్వాలి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరుగుతున్న పోరాటంలో భాగంగా సమస్త ప్రజల అభివృద్ధి కోసం, ఆదివాసీ ప్రజల విముక్తి కోసం పోరాడాలి. కొమురం భీం మార్గంలో జల్, జంగల్, జమీన్ కోసం పోరాడాలి. సామ్రాజ్యవాద, దళారీ, నిరంకుశ పెట్టుబడిదారీ, భూస్వామ్య వర్గాలకు వ్యతిరేకంగా పోరాడుతూ.., మూలవాసులపై తలపెట్టిన గ్రీన్‌హంట్‌కు వ్యతిరేకంగా పోరాడాలి. తద్వారానే దేశ సార్వభౌమాధికారాన్ని, స్వావలంబనను నిలుపుకోగలం. ఈ రాజీలేని పోరాటం ద్వారా నే సమసమాజ నవ భారతాన్ని నిర్మించుకోవాలి.
-జగన్
మావోయిస్టుపార్టీ ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి 
Namasete Telangana News Paper Dated 30/1/2012 

No comments:

Post a Comment