Wednesday, January 18, 2012

న్యాయం కావాలి - లతీఫ్ మహ్మద్ ఖాన్



ప్రభుత్వం ముస్లింల పట్ల కపట ప్రేమను ప్రదర్శిస్తుందనే ఆరోపణకు మరో రుజువు ఇది. ముస్లింల మీద పోలీసు యంత్రాంగం అకారణ ద్వేషం ప్రదర్శిస్తుందనీ, అది పూర్తిగా మెజార్టీ మతతత్వంతో వ్యవహరిస్తుందని ప్రజాస్వామికవాదులు, లౌకికవాదులు చేస్తున్న వాదనలకు సాక్ష్యం దొరికింది. మక్కా మసీదు బాంబు పేలుళ్ల కేసులో అమాయక ముస్లిం యువకులను చిత్రవధ చేసి హింసించినందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు నష్టపరిహారం ఇస్తూ జీ.వో ఆర్టీ నెం. 4268 విడుదల చేసింది. 

పదహారు మంది యువకులకు ఒక్కొక్కరికి మూడు లక్షలు, యాభై మందికి ఒక్కొక్కరికీ ఇరవై వేల రూపాయలు నష్టపరిహారం గత శుక్రవారం నాడు ప్రభుత్వం అందజేసింది. మక్కా మసీదు బాంబు పేలుళ్ల కేసులో అక్రమంగా ఇరికించబడిన, హింసించబడిన ఆ యువకులకు నష్టపరిహారం ఒక్కటే సరిపోదు. వారి మీద జరిగిన దుర్మార్గమైన హింసకు అది పరిష్కారమూ కాదు. వివక్షకు బాధితులైన ఆ ముస్లిం యువకులకు న్యాయం లభించాలి. 

మక్కా మసీదు కేసుకు అత్యంత ప్రాముఖ్యం ఉంది. 2007లో జరిగిన ఈ సంఘటన అనేక అంశాలను చర్చకు పెట్టింది. ఈ కేసును విచారించే బాధ్యతను సిబిఐకి అప్పగించడం వల్ల నిజమైన నేరస్తులెవరో వెల్లడైంది. దేశంలో ఎక్కడ బాంబు పేలుళ్లు జరిగినా ముస్లింలను అనుమానించే వైఖరిని పోలీసు యంత్రాంగం అనుసరిస్తోంది. ప్రభుత్వ సహకారంతో పోలీసులు ముస్లింలను నేరస్తులుగా, తీవ్రవాదులుగా చిత్రిస్తూ వచ్చారు. మాలేగావ్ బాంబు పేలుడు, అజ్మీర్ దర్గా కేసులను యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఆధ్వర్యంలో విచారించారు. 

కర్కరే ఈ విచారణకు నాయకత్వం వహించారు. మాలేగావ్ కేసుతో పాటు దేశంలో ఇతర ప్రాంతాల్లో జరిగిన పేలుళ్లకు హిందూత్వ తీవ్రవాద సంస్థలే కారణమనీ, మాజీ సైనికాధికారులు, ప్రజ్ఞా ఠాకూర్ వంటి హిందూత్వవాదులు చేసిన పేలుళ్లని గుర్తించి అరెస్టు చేసిన సందర్భంలోనే మక్కా మసీదులో పేలుళ్లు సంభవించాయి. పేలుళ్లలో ఐదుగురు మరణించారు. పేలుళ్లు చోటుచేసుకున్న వెంటనే పోలీసులు 'ఆత్మరక్షణ' కోసం జరిపిన కాల్పుల్లో తొమ్మిది మంది ముస్లింలు మరణించారు. ముస్లింలు పోలీసుల మీద దాడులు చేసేందుకు ప్రయత్నించారనీ, ఆత్మరక్షణ కోసం, శాంతి భద్రతల పరిరక్షణ కోసం కాల్పులు జరపాల్సి వచ్చిందని ఆనాటి ప్రభుత్వం బుకాయించింది. 

పేలుళ్లలో మరణించిన వారికంటే పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన వారు, గాయపడిన వారే ఎక్కువ. ఆ తర్వాత ఈ పేలుళ్లకు ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలే కారణమని ఎలాంటి ప్రాథమిక విచారణ జరపకుండానే పోలీసులు ప్రకటించారు. మక్కామసీదు పేలుళ్ల పట్ల సివిల్ లిబర్టీస్ మానిటరింగ్ కమిటీ ఆధ్వర్యంలో ఒక ప్రతినిధి బృందం అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డిని కలిసింది. కానీ, ఆయన మా అభ్యర్థనను కనీసం పరిగణించలేదు. పోలీసులే అంతా చూసుకుంటారని అన్నారు. దీంతో పోలీసు అధికారులు ఈ కేసును తప్పుదోవ పట్టించారు. అమాయక ముస్లిం యువకులను పేలుళ్లకు బాధ్యులను చేశారు. హరీష్ కుమార్ గుప్త, కె. రామ్‌చంద్ర అనే పోలీసు అధికారుల నేతృత్వంలో ఈ కేసు విచారణ జరిగింది. ఈ అధికారులకు ప్రభుత్వం అవార్డులు, రివార్డులు ఇచ్చి పదోన్నతులు కూడా కల్పించింది. 

ఈ కేసును సిబిఐ విచారణకు స్వీకరించిన తర్వాతే నిజాలు వెలుగు చూడడం మొదలైంది. మాలేగావ్, అజ్మీర్ దర్గా పేలుళ్లకు ఉపయోగించిన పేలుడు పదార్థాలే మక్కా మసీదు విస్ఫోటనంలో ఉపయోగించారనే క్లూ ఆధారంగా విచారణ సాగింది. దీంతో హిందూత్వ తీవ్రవాద సంస్థలే ఆ పేలుళ్లకు పాల్పడ్డాయని తేలింది. అయితే సిబిఐ విచారణకు ముందు హరీష్ కుమార్ గుప్త, కె. రామ్‌చంద్రలు చేసిన విచారణ అనేక అనుమానాలకు తావిస్తుంది. ఉద్దేశపూర్వకంగా ఈ పోలీసు అధికారులు కేసు విచారణను తప్పుదోవ పట్టించారని తేలింది. 

వందలాది ముస్లిం యువకుల మీద తీవ్రవాదులనే ముద్ర వేశారు. దారుణమైన మానసిక, శారీరక హింసకు గురిచేశారు. మఫ్టీ పోలీసులు యువకులను అపహరిస్తుంటే, పోలీసు స్టేషన్‌కు వెళ్లి అడిగిన కారణానికి 28 మంది ముస్లిం మహిళలను అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకు పంపారు. ఎనిమిది రోజుల పాటు ఆ మహిళలకు రిమాండ్ విధిస్తే కనీసం వారికి బెయిల్ దొరకలేదు. ప్రజలే ఆరు లక్షలు జమానాతు కట్టి విడిపించుకున్నారు. ఇంత నిర్దయగా పోలీసులు వ్యవహరించడానికి కారణమేమిటి? హిందూత్వ తీవ్రవాద సంస్థలను కాపాడేందుకు ఈ అధికారులు ఎందుకు ప్రయత్నించారు? 

విచారణను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించి చట్ట ఉల్లంఘనకు పాల్పడిన అధికారులను సిబిఐ నేరస్తులుగా గుర్తించకపోవటం వెనుక వున్న కారణాలేమిటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ప్రభుత్వమే చెప్పాలి. అక్రమ నిర్బంధం, చట్ట వ్యతిరేక హింస ఈ కేసులో ఏవిధంగా జరిగిందో విచారించేందుకు స్టేట్ మైనార్టీ కమిషన్ ఒక విచారణ సంఘాన్ని నియమించింది. అడ్వకేట్ జనరల్ రవిచంద్ర నేతృత్వంలో ఆ విచారణ జరిగింది. జరిగిన అనేక సంఘటనలను విచారించి బాధితులను కలిసి ఈ కమిషన్ ఒక మధ్యంతర నివేదికను సమర్పించింది. జరిగిన ఘోరాలను కళ్లకు కట్టినట్టు ఆ నివేదికలో చిత్రించింది. 

కాని, అంతిమ నివేదికను కమిషన్ సమర్పించినప్పటికీ దాన్ని ప్రభుత్వం పౌరసమాజంలోనూ, చట్టసభలోనూ చర్చకు పెట్టడం లేదు. నివేదికను చర్చకు పెట్టకుండానే బాధితులకు క్షమాపణ చెప్పకుండానే, చట్ట ఉల్లంఘనకు పాల్పడిన పోలీసు అధికారుల మీద క్రిమినల్ చర్యలు చేపట్టకుండానే నామమాత్రపు నష్టపరిహారం ఇచ్చేందుకు సిద్ధపడింది. మక్కా మసీదు బాంబు పేలుళ్ల కేసును ప్రభుత్వం ఉపసంహరించుకోలేదనే సంగతిని గమనించాలి. అనేక మంది మీద అక్రమంగా పెట్టిన కేసులు కొనసాగుతూనే ఉన్నాయి. అనేక మందిని అబ్‌స్కాండింగ్ కింద ప్రభుత్వం చూపిస్తుంది. ఈ కేసుకు బాధ్యులైన హిందూత్వవాదులను ప్రభుత్వం నేటికీ అరెస్టు చేయలేదు. ఈ కేసును తప్పుదోవ పట్టించిన అధికారులను అరెస్టు చేయలేదు. కానీ, నష్టపరిహారం చెల్లించి చేతులు దులుపుకోవాలని చూస్తుంది. 

మాలేగావ్ కేసు బాధితులు ప్రదర్శించిన చైతన్యం మక్కా మసీదు కేసు బాధితులు చూపించ లేదనే బాధ పీడిస్తుంది. మాలేగావ్ కేసులో హత్యకు గురైన రక్తసంబంధీకులు, హింసించబడిన బాధితులు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన చెక్కులను తిరస్కరించారు. వాటిని చించి పారేశారు. నీ భర్త మరణించినప్పుడు ఎంత తీసుకున్నావని సోనియాగాంధీని ప్రశ్నించారు. అలాంటి చైతన్యం రావడానికి అక్కడ పనిచేసిన ఉద్యమ సంస్థలు, ముస్లిం రాజకీయ ప్రతినిధులు కారణం. కానీ, హైదరాబాద్ ముస్లిం యువకులను, వారి కుటుంబాలను నష్టపరిహారం స్వీకరించేలా సంసిద్ధం చేసేందుకు కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు కృషి చేశాయి. 

ఇది హైదరాబాద్ ముస్లింల ఆత్మగౌరవం మీద దాడి. అది నష్ట పరిహారం కాదు. బాధితులకు భిక్ష వేసి సర్దుకోమంటున్నారు. హైదరాబాదీలకు ఇది అవమానం. మక్కా మసీదు కేసులో బాధితులకు న్యాయం జరగాలి. తీవ్రవాదం అంతర్జాతీయ సమస్య కాబట్టి ఈ కేసును అతర్జాతీయ నేర చట్టాలు, న్యాయ సూత్రాల ప్రకారం విచారించాలి. ముస్లింల మీద చట్టబద్ధంగానూ, చట్ట వ్యతిరేకంగానూ జరుగుతున్న హింసను నివారించే చర్యలు చేపట్టకుండా బాధితులను మభ్యపెట్టే ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తే రాజ్యాంగం హామీ ఇచ్చిన న్యాయం దక్కేనా?! 

- లతీఫ్ మహ్మద్ ఖాన్
ప్రధాన కార్యదర్శి, సివిల్ లిబర్టీస్ మానిటరింగ్ కమిటీ, ఇండియా
Andhra Jyothi News Paper date:  11/1/2012

No comments:

Post a Comment