Tuesday, October 8, 2013

ప్రజాస్వామిక విలువగా రిజర్వేషన్లు By ‘రిజర్వేషన్లు ప్రజాస్వామిక దృక్పథం’ పుస్తకానికి వి.యస్. ప్రసాద్ రాసిన ముందుమాట నుంచి కొన్ని భాగాలు
బాలగోపాల్ ఆలోచనలు, రచనలు, ఆచరణ అన్నీ కూడా ప్రజా స్వామిక విలువల ఆధారమయినవి. 1980 నుంచి 2009లో చనిపో యే వరకు ఆయన చేసిన రచనలను, ఆచరణను పరిశీలించి నట్లయితే ఈ విషయం స్పష్టమవుతుంది. డి.డి.కోశాంబి రచనలతో ప్రేరేపితుడై మార్క్సిస్టు అవగాహనతో, ప్రజాస్వామిక దృక్పథంతో బాలగోపాల్ సమాజాన్ని విశ్లేషించాడు. అసమానతలు, అణచివేతలేని సమాజం కోసం నిరంతరం కృషి చేశాడు. ఏ దృష్టితో రచనలు చేశామనే దానిపైన అవి ఎవరికి ఉపయోగపడతాయనేది ఆధారపడి ఉంటుంది. బాల గోపాల్ రచనలన్నీ భారతీయ సమాజంలో మెజారిటీగా ఉన్న వెనుక బడినవర్గాల దృష్టినుంచి, అంటే వారి న్యాయమైన ప్రజాస్వామిక ఆకాంక్షల నుంచి చేయబడ్డవే. ఆయన మార్క్సిస్టు విశ్లేషణ సాధికార తను పరిశీలించినా; రాజ్యం-సంక్షేమం గురించి, దళితుల సమస్యల గురించి చేసినా, నక్సలైట్ ఉద్యమం గురించి ఆయన రాసిన రచనలను పరిశీలించినా; పౌరహక్కుల గురించి చేసిన విశ్లేషణలోనైనా; ప్రాంతీయ ఉద్యమాల గురించి చేసిన వాఖ్యల్లో అయినా; నీటి పంపిణీ సమస్యకు పరిష్కారాలు సూచించినా; జెండర్ సమస్యను పరిశీలించినా; దేశ అభివృద్ధి నమూనాలను ప్రశ్నించినా; సాహిత్య విమర్శ చేసినా- అన్నీ సామాన్య ప్రజల ప్రజాస్వామ్యయుత మైన ప్రయోజనాల ఆధారంగానే చేశాడు. అందుకే బాలగోపాల్ రచనలన్నీ భారతదేశంలో ప్రజాస్వా మ్యం కోసం నిరంతరంగా సాగుతున్న పోరాటాలకు ఉపయోగ పడ తాయని పర్‌స్పెక్టివ్స్ భావిస్తోంది. అందుకనే బాలగోపాల్ రచనలను సాధ్యమైన మేరకు ప్రచురిస్తున్నది.భారతదేశంలో విద్యా, ఉద్యోగరంగాల్లో రిజర్వేషన్లకు వంద సంవ త్సరాలకు పైనే చరిత్ర ఉంది. తీవ్రంగా సాగిన అనుకూల, వ్యతిరేక ఉద్యమాల అనుభవం ఉంది. స్వాతంత్య్రానికి పూర్వమే బ్రిటిష్ పాల నలోని కొన్ని ప్రాంతాలలో, కొన్ని స్వదేశీ సంస్థానాలలో రిజర్వేషన్లు ఉండేవి. అయితే భారత రాజ్యాంగానికి మొట్టమొదటి సవరణ రిజ ర్వేషన్లకు రాజ్యాంగబద్ధత కల్పించడం కోసమే చేయబడిందనేది గమ నించదగ్గ విషయం. స్వాతంత్య్రానికి పూర్వం నుంచి కూడా అసమాన సమాజంలో సమానత్వం కోసం తీసుకొనే చర్యలలో రిజర్వేషన్లను ఒక చర్యగా భావించడం జరిగింది. స్వాతంత్య్రం వచ్చిన వెంటనే నూతన రాజ్యాంగంలోని సమానత్వ సూత్రాలకు (Art-15[1]) కుల ప్రాతిపదికపైన రిజర్వేషన్లు ఇవ్వడం వ్యతిరేకమని కొందరు కోర్టుకు వెళ్లారు. రిజర్వేషన్లు రాజ్యాంగంలోని సమానత్వ సూత్రాలకు (Art-15[1]) వ్యతిరేకమని సుప్రీంకోర్టు కూడా తీర్పు చెప్పింది. అప్పుడు పార్లమెంటు మొట్టమొదటి రాజ్యాంగ సవరణ చేపట్టి 1951 లో రాజ్యాంగంలో ఆర్టికల్15కు క్లాజు-4ను చేర్చింది. ప్రభుత్వం సామాజికంగానూ, విద్యపరంగాను వెనుకబడిన వర్గాల కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించవచ్చని ఆ క్లాజ్‌లో పేర్కొన్నారు. దీనితో రాజ్యాంగబద్ధత విషయంలో కొంత స్పష్టత వచ్చినప్పటికి, నాటి నుం చి నేటి వరకు రిజర్వేషన్లకు సంబంధించిన అనేక విషయాల గురించి న వివాదాలు, ఉద్యమాలు, శాసనాలు, న్యాయస్థానాల తీర్పులు కొన సాగుతూనే ఉన్నాయి. ఇవన్నీ ఈ సమస్య జటిలతను, ప్రాధాన్యతను తెలియజేస్తున్నాయి.‘కుల వ్యవస్థ పోవాలంటూ కులం పేరుమీద రిజర్వేషన్లు ఎంత వరకు సమంజసం’ అనే అగ్రవర్ణాల వాదనను బాలగోపాల్ తిప్పి కొట్టాడు. కులాధిక్యతను ఉపయోగించుకొని ఇంతవరకు ప్రయోజ నాలు పొందినవారికి, కుల వివక్షకు గురి అయినవారు కులం పేరుతో పొందే ప్రయోజనాలను ప్రశ్నించే నైతిక హక్కు లేదని చెప్పాడు. మండల్ కమిషన్ వ్యతిరేక ఆందోళనల్లో జడలు విప్పిన కులతత్వాన్ని ఎండగట్టాడు. ఆర్థిక ప్రాతిపదిక ఆచరణలో అగ్రవర్ణాల వారికే ప్రయో జనకరంగా ఉంటుందని బాలగోపాల్ వాదించాడు. రిజర్వేషన్ల వల్ల వెనుకబడిన వర్గాలలోని సంపన్నులకే ప్రయోజనాలు కలుగుతాయనే వాదన సమంజసం కాదంటాడు బాలగోపాల్. అభివృద్ధి క్రమంలో-ముఖ్యంగా పెట్టుబడిదారీ అభివృద్ధి క్రమంలో ఏ రంగంలోనయినా అప్పటికే అభివృద్ధి చెందినవారే మొట్టమొదట ప్రయోజనాలను పొం దుతారు. అదేవిధంగా రిజర్వేషన్ల విషయంలో కూడా వెనుకబడ్డ వర్గా లలో కొంత అభివృద్ధి చెందినవారే ముందుగా లాభపడవచ్చు. ఆ విధంగా లాభపడ్డవారికి తమ వర్గాలకు చెందిన ఇతరులకు సహాయం చేయడానికి, వారి రాజకీయ వ్యక్తీకరణకు రిజర్వేషన్లు ఒక అవకాశంగా చూడాలనేది బాలగోపాల్ అభిప్రాయం. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ గురించి వివరమైన చర్చ ఈ రచనల్లో ఉంది. ‘సంపద సామాజికం’ అనే ప్రాతిపదికపైన బాలగోపాల్ ఈ చర్చ చేశాడు. సొంతపెట్టుబడి కూర్చుకున్న పద్ధతుల గురించి అవగాహన ఉంటేనే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల ఆవశ్యకతను అర్థం చేసుకోవడం సాధ్యమవుతుంది. ముఖ్యంగా విద్యారంగం ప్రైవేటీకరణ చెందుతున్న ఈ దశలో, ఈ రంగంలో రిజర్వేషన్లు ప్రాధాన్యతను సంతరించుకు న్నాయి. సామాజిక న్యాయానికి విరుద్ధమైన అనేక ధోరణులు ప్రైవేట్ రంగంలో చోటు చేసుకుంటున్నాయి. అన్ని రంగాలలో అందరికీ అవ కాశాలుంటాయనే భావన ప్రజాస్వామ్యంలో అన్ని వ్యవస్థల ఉనికికి ఆధారంగా ఉండాలి. అది లేకపోవడం మొత్తం సమాజ ఉనికికే ప్రమా దం. అందుకే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లను బాలగోపాల్ గట్టిగా సమర్థించాడు.రిజర్వేషన్ల ఆచరణను గురించి కూడా బాలగోపాల్ వివరమైన చర్చ చేశాడు. ఈ విషయంలో నాకు కూడా కొంత ప్రత్యేకమైన ఆసక్తి ఉంది. నా వృత్తిరీత్యా విద్యా, ఉద్యోగరంగాలలో రిజర్వేషన్ల అమలును కొంత దగ్గరగా పరిశీలించే అవకాశం కలిగింది. నా అనుభవం నుంచి, పరిశీ లన నుంచి నేను గమనించిన కొన్ని సమస్యలను ప్రస్తావిస్తాను. మొద టగా ఉద్యోగాల విషయంలో చట్టంలో పేర్కొన్న శాతం రిజర్వేషన్లు ఆచరణలో నిజంగానే లేవు. ఉన్నత పదవుల్లో ఎస్,సి, ఎస్.టి ఉద్యో గుల శాతం చాలా తక్కువ. విశ్వవిద్యాలయాల్లో కూడా, ముఖ్యంగా పేరుగాంచిన కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఎస్.సి, ఎస్.టి కేట గిరీలకు చెందిన అధ్యాపకుల శాతం ఉండాల్సిన దానికంటే చాలా తక్కువ ఉంది. అందుకే బాలగోపాల్ ఈ విశ్వవిద్యాలయాలను ‘బ్రా హ్మణ అగ్రహారాలని’ పరిహసించాడు. ఈ పరిస్థితులకు అనేక కారణా లు చెబుతారు. సరిఅయిన అభ్యర్థులు దొరకటం లేదని చెబుతుం టారు. దాని అర్థం వెనుకబడిన వర్గాలకు విద్యావకాశాలు పూర్తిగా అందట్లేదనే కదా. రిజర్వేషన్లు ఇంకా ఎంతకాలం ఉండాలనే దానికి ఈ పరిస్థితి సమాధానం కాదా? రిజర్వేషన్ల ఉద్యోగాలు పూర్తిగా నింప కపోవడానికి ఇదొక్కటే కారణం కాదనే విషయాన్ని కూడా గుర్తించాలి. సాధారణంగా ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యతలలో అగ్రవర్ణాలకు చెం దినవారే ఎక్కువగా ఉంటారు. వారికి వెనుకబడిన వర్గాలను రిక్రూట్ చేసుకోవాలనే సంకల్పం చాలా తక్కువ. మన దేశంలో చట్టాలు ఒక మేరకు ప్రగతిశీలమైనవే. దానికి కొంతవరకు ప్రజా ఉద్యమాలు కార ణం. ప్రజలను భ్రమలలో ఉంచాలనే పాలకుల ప్రయత్నం కూడా ఈ ప్రగతిశీల చట్టాలకు కారణం. అయినా వాటి అమలులో పాలకుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఇబ్బందులు సృష్టిస్తున్నారు. రిజర్వేషన్ల చట్టాల విషయంలో కూడా ఇదే జరుగుతున్నది. అందుకే రిజర్వేషన్ల అమలు కోసం ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంది. పాలకుల దయతో కాకుండా, ఉద్యమాల వల్లనే తమకు రిజర్వేషను ప్రయోజనాలు కలిగాయనే విషయాన్ని ఆ ప్రయోజనాలు పొందు తున్నవారు గ్రహించాల్సిన అవసరం ఉంది.
-వి.యస్. ప్రసాద్
పర్‌స్పెక్టివ్స్
(‘రిజర్వేషన్లు ప్రజాస్వామిక దృక్పథం’ పుస్తకానికి
వి.యస్. ప్రసాద్ రాసిన ముందుమాట నుంచి కొన్ని భాగాలు)

Namasete Telangana News Paper Dated: 09/10/2013 

No comments:

Post a Comment